ఒక నిరంతర మథన చెందుతూ ఉంటుంది మనసు. దేని కోసం అంటే బొమ్మ కోసం. మధ్యలో, ‘పడోసి కి చూలే సే ఆగ్ లయ్‌లే’ అని యమా బూతుగా నల్లని బిపాసా బసు. (బిపాసనా? సంపూరణ్ సింగ్ కల్రానా?) ఇరవైనాలుగు గంటల జీవితంలో కొన్ని సెకండ్లు లుభాయించినా నిప్పు నిరంతరం రగిలేది మాత్రం బొమ్మ కోసమే కదా! పిచ్చా ఏవయినా? ఆఫ్ట్రాల్ బొమ్మ అంటే ఏవిటి? కంచంలోని మూడు పూటల ఎర్రని, పచ్చని, తెల్లని అన్నం ముద్దే కదా! బొమ్మంటే గుడ్డ తాను కాదా? నెత్తి పై కప్పు నెల అద్దె కాదా? లీటరు పాలు కాదా? బండిలో గీచి గీచి నింపుకున్న ఏభై రూపాయల పెట్రోల్ కాదా? బ్రతుకు బండి నడిచే దారి కాదా బొమ్మ? భుక్తి మాత్రమే కదా బొమ్మ! అంటే, అంతేనా? దాని వెనుక ఒక అగాధమయిన ముక్తి లేని అగాధం కదా అసలు బొమ్మ అంటే. బ్రతికి ఉండగానే మహాముక్తి పొందగలగడం కూడా కాదా బొమ్మ అంటే!
మంచీ చెడూ మాత్రం ఏవీ అంటని బొమ్మల జీవితంలో బొమ్మని మించి అంత ఆశగా కోరుకున్నది ఇంకేమయినా వున్నదా? పదే పదే బొమ్మ తప్ప. నాదైన గీత నాదైన ఒక ముద్ర, నాదైన విసురు, నాదైన ఒక తేలిక రంగు. ఏ ఒక్కదాన్నీ నేను ఈ జీవితంలో కనుగొనలేకపోవచ్చు. నా బొమ్మ ఎన్నటికీ చరిత్రలో నిలబడకపోవచ్చు. ఎంత మూర్ఖత్వం కాకపోతే, ఏ చరిత్రలో గట్టిగా పట్టి ఉన్న పీఠం ఎక్కుదామని, బొమ్మలు గీయడం జీవితంగా పొందుతామని, బొమ్మనే జీవితంగా చేసుకుని మార్కండేయునికన్నా గట్టిగా సరస్వతి అమ్మవారిని పట్టు పట్టుకుంది? (నిజంగా పట్టుకున్నానా? నిజం చెప్పు?)
గెలుపు అనే విన్నింగ్ పాయింట్ లేని పరుగులో నన్ను ఒక్క క్షణం కూడా నిలబడనీయక పరిగెత్తించేది బొమ్మ కాక మరేమిటని. బొమ్మ తప్ప మనల్ని నడిపించగలిగేది, పరిగెత్తించగలిగేది మరేదైనా ఉందా? బొమ్మని మించిన అత్యాశని మించిన సంపద ఏదైనా కనుగొనగలిగేనా? ఎంత ఆశ ఉన్నా అందదని తెలిసినా, బొమ్మ కోసమేగా ఈ జీవితాన్ని కోరి చేరుకుంది. మూడు పూట్ల తిండి లేని రోజున కూడా బొమ్మ గీస్తూనే ఉన్నా. కప్పుకోడానికి వంటిపై చొక్కా తప్ప మరే ఆచ్ఛాదన లేని రాత్రిళ్ళు కూడా బొమ్మనే కోరుకుని బొమ్మని కలగన్నా. నడక నడుస్తూనే ఉంది. ఇంతవరకు నడిచిన ఈ జీవితంలో బొమ్మ కాక, బొమ్మ గీసే పెన్సిల్ కాక, ఒక్క కారు తనను కొనమని నన్ను ఆపగలిగిందా? రెండు బీ.హెచ్.కే. లేదా మూడు బీ.హెచ్.కే.ల కోసం ఈ నడక మొదలయిందా? పరమ సత్యం ఇదని ఏ మహా గురువు ఏ జన్మలో చెవిలో చెప్పిన మంత్రమో ఇది. ఈ బయట కనపడే ప్రపంచంలో నేను చిత్రకారుడినని, నా తపన ఒక బొమ్మ అని గుర్తింపు రాకపోవచ్చు. కానీ నా లోపలితనంలో అంతా నేను చిత్రకారుడిగా గీయని, గీయాలనుకునే బొమ్మలన్నీ, సెకనుకు ఒకటి చిత్రిస్తూనే ఉన్నా కదా. నా కంటి చూపు తప్పించుకుని ఏ ప్రపంచం నా బొమ్మగా మారకుండా నన్ను దాటుకునిపోయింది?
ప్రపంచం అంతా బజ్జోని వుంటుంది. రోజులాగే నా ఏడ్పుగొట్టు మొహం బొమ్మ ఎదురుగా ధరించి, కుదరని బొమ్మల వంక చూస్తూ లోకమంతా నిండి నాకు మాత్రం కనబడని చిత్రకలతో మళ్ళీ మళ్ళీ వేడుకుంటూ వుంటావు. ‘ఐ లవ్ యూ! యూ కంప్లీట్ మీ!’ బొమ్మ చెవిటిది, దానికి వినపడదు. బొమ్మ సంపూర్ణ శీలవతి, ఎవడినీ దగ్గరకు తీసుకోనిది. స్వల్పుణ్ణి, నన్ను మాత్రం ఎందుకు దరి చేరనిస్తుంది చెప్పు? అయినా పదే పదే ప్రతీక్షణం ‘ఐ లవ్ యూ! యూ కంప్లీట్ మీ! ప్లీజ్ ప్లీజ్ ప్లీజని…’ ఈ మంత్రం మరవని రోజు మాత్రం ఉందా? అటువంటి రాత్రిని మాత్రం నిదురపోనిచ్చానా?
ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది, ఆకుల వెలుగు నీడలు నిండా బట్టలు ధరించి కూడా యాతనగా కవ్విస్తోంది. ఎందుకని అది నన్ను గీయమంటుంది? మూడవ అంతస్తు పైనుంచి, రోడ్డు ఊడిచే మనిషి వెన్నెముక అరసున్నా మాదిరి మొత్తం ఆర్కయిపోయి రోడ్డు మీద పాకుతోంటుంది. స్కెచ్ బుక్ ఎక్కడా? ఎక్కడా సమయానికి ఒక్క కలమూ దొరికి చావదే! రోడ్డు తను శుభ్రం అయ్యి ముసలిదాన్ని ఎరేజ్ చేసి పడేసేలోగా చరిత్రలో ఈ క్షణాల్ని రికార్డ్ చేసేదేలా? అసలు ఈ రికార్డ్ చెయ్యడం, బొమ్మ గీయడం, ఈ తపన, ఈ బొమ్మ ఎందుకు? ఎందుకు గీయబుద్ది అవుతుంది బొమ్మని? తల వేయి వ్రక్కలయితే అవని, కానీ పోనీ, కానీ దీనికి సమాధానం తెలిసేదెలా? చుట్టూ చూస్తానా నాకు తెలిసిన ఈ ప్రపంచంలో ఈ నాలా రంపపు కోతకు గురవుతున్న మరో దేహము దొరుకుతుందా అని, జీరబోయిన కుంచెతో గాత్రము చేసే వేదన వినపడుతుందా అని? అస్సలు లేదే, అందరూ అచీవర్సే. నవ్వుతూనో, కనుబొమలు పైకెత్తో, ఎగతాళిగానో, వేళాకోళంగానో చూస్తారు. ‘బొమ్మ ఎందుకు?’ అనే ప్రశ్న ఏవిటీ మూర్ఖత్వం కాకపోతే! బొమ్మ పేరు, బొమ్మ ప్రఖ్యాతి, బొమ్మ డాలర్ బిళ్ళ, బొమ్మ అవార్డ్, బొమ్మ నా నెత్తిపై కొమ్ము, బొమ్మ మై బాక్ చివర తోక, బొమ్మ నే కనుక్కున్న ఉంపుడుగత్తె, బొమ్మ అరసికుడి కళ్ళముందు లైకులకై పరచిన నా గీతల నా రంగుల విసర్జన. బొమ్మవల్ల నేను కాను. నా వల్ల బొమ్మ … అంతా ఇదే. అందరూ ఇలానే! ఏ కరుణామూర్తి కనబడ్డానికి వస్తాడు జీవితంలోకి? బొమ్మ అంటే జన్మ జన్మల దుఃఖం పోయేవాణ్ణి నేను ఎక్కడ కనుగోను? వాడు కనపడగానే రోజులు గంటలు యుగాలు ఆ కళ్ళల్లోకి నిశ్శబ్దంగా చూస్తూ నన్ను, నా వేదనని వాడి కళ్ళల్లో ఎప్పుడు వెతుక్కోను? ఆ నిర్గుణ్ భక్తి రక్తి ముక్తి ఎప్పుడు తెలుసుకోను? చూడు, నందిని శ్రీకర్ మళ్ళీ అదే పాడుతుంది. అదే పాట ఇదే వేదన… కిసే పూఛూ? హైఁ ఐసా క్యోన్? బేజుబాసా యే జహాఁ హై!