నమస్కారం.
ఈ సంచికనుండి కథ నచ్చిన కారణం అనే పేరుతో ఒక కొత్త శీర్షిక ప్రవేశపెడుతున్నాం. ఈ శీర్షిక విషయం ఏమిటో పేరు చూడగానే మీకు అర్థమయే వుంటుంది, ప్రత్యేకించి చెప్పనవసరం లేకుండానే.
ఒక కథ నచ్చడానికీ నచ్చకపోడానికీ మనకు ఎన్నో కారణాలుంటాయి. నచ్చనివాటిని కాసేపు పక్కన పెట్టి, ఏదైనా కథ మీకెందుకు నచ్చిందో ఆ కారణాల గురించి ముచ్చటించుకోడం ఈ శీర్షిక ఉద్దేశ్యం. ఈ కారణాలేవైనా కావచ్చు – కథలో వర్ణించిన ఆచార వ్యవహారాలు కావచ్చు, కథా స్థలం వర్ణన కావచ్చు, కథలో పాత్రల మధ్య సంభాషణలలో చతురతో, తాత్వికతో కావచ్చు, కథనంలో విభిన్నతో, నిగూఢతో కూడా కావచ్చు. లేదూ, ఒక కథ చదువుతూండగా సాక్షాత్కరించే ప్రపంచం మన చుట్టూ ఉన్న సమాజంలోదో, ఒక కొత్త ప్రపంచమో కావచ్చు. మనకు తెలీని మన ప్రపంచం గురించి కూడా కొత్తగా ఒక కథ మనకు చెప్పవచ్చు.
మీరు చదివిన ఒక కథ మీకెందుకు నచ్చిందో వివరించే రచనలని మీనుంచి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నిబంధనలంటూ పెద్దగా ఏమీ లేవు కానీ, కొన్ని సూచనలు మాత్రం చేయదలచుకున్నాం. రచయితలు వాటి ఆధారంగా తమ వ్యాసాలు పంపమని మా విన్నపం.
కథా కాలం – కథ ఎప్పటిదీ అనేదానిమీద నిబంధన అంటూ లేకపోయినా పాతకథలైతే బాగుంటుందని మా ఉద్దేశ్యం. ముఖ్యంగా 1960, 70 ల కాలం నాటివీ లేదా అంతకు ముందువీ ఐతే మరీ మంచిది. పాత కథలకు ప్రాధాన్యం ఇవ్వడంలో ఆంతర్యం మీకు అర్థమయే వున్నా క్లుప్తంగా మా ఆలోచన ఇది: పాత కథల్లో ఆనాటి ప్రపంచం కనిపిస్తుంది. అది ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచానికంటే భిన్నమైంది. ఇప్పుడు ఆ కథల్ని తిరిగి ఒకసారి పరామర్శించుకోడం ద్వారా ఆ ప్రపంచం గురించి కొత్తగా తెలుసుకోగలం, లేదూ ఒక పాత జ్ఞాపకం మళ్ళీ గుర్తుకు తెచ్చుకోగలం. ఇది ఒక రకంగా సాహిత్య పునర్మూల్యాంకనం లాంటిదే (మరీ అంత గంభీరమైన లక్ష్యం ఈ శీర్షికది కాదనుకోండి, అయినా).
మనకున్న ఎంతో మంది గొప్ప రచయితలు కాలక్రమేణా మరుగున పడుతున్నారు. వారిని పునఃస్మరించుకోవడం ఈ శీర్షికకున్న ఇంకో ఉద్దేశ్యం. ఉదాహరణకి, చింతా దీక్షితులు, మునిమాణిక్యం, చలం, పాలగుమ్మి పద్మరాజు, బుచ్చిబాబు, చాసో, చిలుకూరి నారాయణరావు, టేకుమళ్ళ కామేశ్వరరావు, వేలూరి శివరామ శాస్త్రి, సురవరం ప్రతాప రెడ్డి, కొడవటిగంటి కుటుంబరావు, విశ్వనాథ, మల్లాది రామకృష్ణ శాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, మాధవపెద్ది గోఖలే, భమిడిపాటి కామేశ్వరరావు, కళ్యాణసుందరీ జగన్నాథ్, తెన్నేటి హేమలత, వాసిరెడ్డి సీతాదేవి – ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకున్నంతమంది గొప్ప రచయితలు. వీరి గొప్పతనం మరొక్కసారి గుర్తు చేసుకోడమే ఈ శీర్షిక ఆంతర్యం.
మీకు నచ్చిన కథ గురించి మీరు చెప్పే కారణాల కథే కాబట్టీ, రివ్యూ మిగతా రచనలకున్నంత నిర్దుష్టంగా ఉండదు. వచ్చిన వాటిలో ప్రచురణకు అర్హమైన వాటిని ఎన్నుకోడం మినహా సంపాదకుల సమీక్ష /పరిష్కరణ మితంగానే ఉంటుంది.
మీరు వయసులో చిన్నవారై, 1960ల ముందు కాలం నాటీ కథలేమీ మీకు తెలియకపోయినా పర్వాలేదు. మీ చిన్నతనంలో చదివిన కథ, కనీసం రెండుతరాల ముందు కథ (తరం అంటే 10-15 ఏళ్ళనుకోండి), గురించి రాయండి. ఆ కథ ఇప్పటికీ మీకు మంచి కథే అని ఎందుకనిపిస్తుందో రాయండి. వీలైనంత వివరంగా రాయండి.
కథ ఎందుకు నచ్చిందో మీ వ్యాసంతో పాటు, పూర్తి కథ పంపడం మాత్రం మరిచిపోవద్దు. మీ వ్యాసాన్నీ, కథనీ యూనికోడ్లో టైపు చేసి పంపండి. కథ మరీ పెద్దదై టైపింగు వీలు కుదరని పక్షంలో ప్రింటు నుంచి తీసిన పీడీఎఫ్ అయినా పర్వాలేదు కానీ ముందు మమ్మల్నోసారి సంప్రదించండి. కథ జతపరచని వ్యాసాలు పరిశీలిస్తాం కానీ కథ లేకుండా మాత్రం ప్రచురించలేము.
ఇదిగో, ఈ సంచికలో వేలూరి వేంకటేశ్వర రావు రెండు బంట్లు పోయాయి కథ తనకు నచ్చిన కారణాలని మనతో పంచుకుంటూ ఈ శీర్షికకు నాంది పలుకుతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన కథ గురించి మీరూ చెప్పండి.
– సంపాదకులు