కథ: రెండు బంట్లు పోయాయి
రచన: పూసపాటి కృష్ణంరాజు
రచనా కాలం: 1960-61 ప్రాంతం
ఇది కథా విమర్శ కాదు. ఈ కథ నాకు నచ్చిన కారణం చెప్పడానికి చేసే ప్రయత్నం.
ఏ కథైనా నామటుకు నాకు నచ్చడానికి కావలసిన అంశాలు చెప్పుకుంటాను. కథ పేరు నన్ను ఆకర్షించి, నాకు ఆ కథ పట్ల కుతూహలం కలిగించాలి. పేరు చూడంగానే కథావిశేషం తెలిసిపోకూడదు. కథ చదవడం పూర్తి కాగానే నా మనస్సులో ఒక గాఢమైన అభిప్రాయం కలగాలి. ఆ అభిప్రాయం కలగడానికి కథకుడు తీసుకున్నవస్తువు – ఒక సంఘటనే అనుకోండి – ఆ సంఘటన నన్ను ఒక కుదుపు కుదిపి కదిలించేది కావాలి. కథకుడు ఆ సంఘటనని చెప్పడంలో అమరిక అందంగా ఉండాలి. అంటే, చదువుతూవుంటే ఆవలింతలు రాకూడదు అని!
ఇక రెండు బంట్లు పోయాయి కథ గురించి:
ఈ కథలో కొన్ని సంప్రదాయాలు, పాత ఆచారాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఈ రోజుల్లో ఆ ఆచారాలు అన్నీ కనుపించవు. అందువల్ల నష్టం ఉన్నదని కాదు; వాటిగురించి తెలుసుకోవడం చరిత్ర. కొన్ని ఆచారాలు కేవలం క్షత్రియ కుటుంబాల్లోనే కనిపిస్తాయి.
కథలో చదరంగం ఆడుతున్న తాతగారు ఒక ముఖ్య పాత్ర. చదరంగం ఎత్తులు, పైఎత్తులూ కథ నడకకి పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. కథలో తాతగారికి అన్నీ తెలుసు. సుభద్రం, శంకరం మండుటెండలో ఎందుకొచ్చారో ఆయనకి తెలుసు. అయినా “ఏమిటి విశేషం తాతా,” అని ఆయన సుభద్రాన్ని పలకరిస్తారు. పిల్లవాడిని తాతా అని పలకరించడం కొన్ని కుటుంబాలలో ఇప్పటికీ ఉన్న ఆచారం. పిల్లలు తాతయ్యని “తాత గారు” అని సంబోధిస్తారు.
పెళ్ళిళ్ళకి చుట్టపక్కాలని పేరు పేరునా పిలిచి ఆహ్వానించడం అన్ని కులాల్లోనూ ఉన్న పాత సంప్రదాయం. ఇప్పటికీ, కొన్ని పల్లెల్లో, పిలిచి ఆహ్వానించకపోతే, కొద్దిమంది పెద్దలు పెళ్ళికి వెళ్ళరు. సవారీ బళ్ళకి రంగులు వేసి మైసూరెడ్లు కట్టుకొని శుభకార్యానికి తరలి వెళ్ళడం హోదాకి చిహ్నం. ఇప్పుడు, సవారి బళ్ళు, కచ్చడం బళ్ళూ మరుగున పడిపోతున్నాయి.
రాజుల సాంప్రదాయిక వివాహాల్లో ఆడవారందరూ వేరే గదిలో ఉండి పెళ్ళి తతంగం చూస్తారు. పెళ్ళి పందిరిలోకి వచ్చి మొగవారి సరసన కూర్చోవడం నిషిద్ధం. ఈ కథలో చెయ్యలేదు గాని, కొన్ని క్షత్రియ వివాహాల్లో కత్తికి భాషికం కట్టడం ఆచారం.
పెళ్ళి కూతురు గౌరీ పూజ చేసుకోవటం హిందూ సంప్రదాయం. సన్నికల్లు పొత్రానికి పసుపు, కుంకుమ పెట్టటం, కలశంలో కొబ్బరికాయని అలంకరించి పూజ చేయటం వగైరా ఆధునిక హిందూ వివాహాల్లో కూడా చూస్తాం. ఆ సామగ్రిని, పెళ్ళికొడుకు తరఫువారు ఎత్తుకొని పోవడానికి ప్రయత్నించడం బహుశా రాజుల ఇళ్ళల్లో ఆచారం కావచ్చు. పూర్వకాలంలో, రాజులు గాంధర్వ వివాహం చేసుకోవడం మనం చదువుకున్నాం. రాజు పెళ్ళికూతుర్ని ఎత్తుకొనిపోవడం కూడ జరిగేది. ఈ గౌరిదేవిని ఎత్తుకోపోవడం బహుశా అలనాటి గాంధర్వ వివాహాలకి ప్రతిరూపమేమో అని నాకనిపించింది. (రాజుల్లో నాకు పరిచయం ఉన్న పెద్దవాళ్ళని ఈ ఆచారం గురించి అడిగాను, కాని సబబైన సమాధానం వినలేదు.)
పెళ్ళికొడుకు మేనమామ, సూరపరాజుగారు పెళ్ళికొడుకు చెవిలో రహస్యంగా మాట్లాడటం, “చిందులు” తొక్కడంతో, కథ కొత్త మలుపు తిరుగుతుంది.
పెళ్ళి కొడుకు కట్నం పూర్తిగా ఇస్తేనే కానీ పెళ్ళి చేసుకోనని, పెళ్ళిపీటలమీంచి లేచి పోవడం గందరగోళానికి దారితీస్తుంది. పెళ్ళికొడుకుతో వచ్చిన ముసలిరాజుగారు “తొందరపడవద్దని,” పెళ్ళికొడుకుకి సర్ది చెప్పటం, ఆయన్ని “నోరుమూసుకోండి” అని మేనమామ విరుచుకపడటం ఒక అసాధారణమైన సన్నివేశం. ఆ పెద్దమనిషి వెనక్కి తిరక్కుండా పెళ్ళిమండపం వదిలి స్టేషను వైపుకి వెళ్ళి పోతాడు.
రాజుల్లో సాధారణంగా కట్నాల ప్రసక్తి రాదు. వీలయినంతవరకూ, రాజుల పెళ్ళిళ్ళు మేనరికాలో, దగ్గిర బంధువుల్లోనో జరుగుతాయి. ఆస్తి పంపకాలు, స్త్రీ ధనం మామూలు. ఈ కథలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి దూరపు బంధువు కూడా కాడు. కట్నం ప్రసక్తి రాగానే కథలో తాతగారితో చదరంగం ఆడుతూ కూర్చున్న పెళ్ళికూతురి తాతగారు “కట్నం యిస్తున్నామన్నట్టు మావెధవ నాతో చెప్పనే లేదండీ,” అంటూ ఆశ్చర్యం ప్రకటించి చదరంగం వదిలి వెళ్ళిపోతారు. “వీడు రాచపుటకేనా పుట్టిందీ” అని తాతగారు పెళ్ళికుమారుడి గురించి అనుకుంటారు.
బలవంతంగా పెళ్ళికూతురు పినతండ్రి పెళ్ళికొడుకుని పెళ్ళిపీటలమీద కూర్చోబెట్టటం, అంతవరకూ తలవంచుకొని కూర్చున్న పెళ్ళికూతురికి ఏ మాత్రం నచ్చలేదు. పెళ్ళికూతురు లేచి, తెరపట్టిన శాలువా పెళ్ళి కొడుకు ముఖాన పడేసి అరివేడి గదిలోకి దూసుకొపోతుంది. ఈ ఘట్టం నన్ను ఒక కుదుపు కుదిపి కదిలించింది. శహబాశ్ అని అనుకోకండా ఉండ లేకపోయాను.
ముహూర్తం దాటిపోతూందని కంగారు పడుతున్న సిద్ధాంతిగారికి, దాసీ చిట్టెమ్మ జబర్దస్తీగా చెప్పిన మాటలు కథకి క్లైమేక్స్. ” … నోగిట్లో సిన్నమ్మి గారు పెళ్ళికుమారుణ్ణి సేసుకోడాని కొప్పుకోడం నేదని అమ్మగారు సెప్పి రమ్మని నన్నంపినారు. పంతులుగోరూ! ఈ ముహూర్తానికే సిన్నమ్మి గోర్ని శంకరం బాబుకిచ్చి కళ్యాణం సెయ్యండి,” అని.
అసలు, ఈ పెళ్ళికూతుర్ని మొదట్లో శంకరంకిచ్చే ‘మేనరికం’ పెళ్ళిచేద్దామనుకున్నారని నరసరాజు గారి మాటల్లో మనకి కథా ప్రారంభంలో సూచనగా తెలుస్తుంది. ఆ పెళ్ళి ఇప్పుడు చేయించండని చిట్టెమ్మ చేత చెప్పించడం కథకి కొసమెరుపు అందం ఇచ్చింది. రచయిత చెప్పినదానికంటే, అంతరార్ధంగా చెప్పనిదే ఎక్కువగా ఉండి మన ఊహలకు పదును పెడుతుంది.
ఈ కథ ఎన్నిసార్లు చదివినా, కొన్ని సందర్భాల్లో సంభాషణలు, కళ్ళకు కట్టి అందంగా అమరినై. కొన్ని పదాలకి అర్థాలు ఇప్పటికీ అంతుపట్టలేదు. విడిది “హస్తబల్ లో”, “అవిరేడు దించేరు” అన్న మాటలకీ అర్థం ఎవరన్నా విజయనగరం పెద్దలు చెప్పాలి, మరి!
ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోతూ, “బలగంలో రెండు బంట్లు ఎక్కడో జారిపోయాయని తాతగారు దారిపొడుగునా నొచ్చుకుంటూనే వున్నార” ట!
జారిపోయిన రెండు బంట్లూ ఎవరో? ఇప్పటికీ నాకు అనుమానమే!!
పూసపాటి కృష్ణంరాజు (20 ఆగస్ట్ 1928 – 18 నవంబర్ 1994) మొత్తం మీద పదిహేను కథలు రాసి ఉండవచ్చును. 1964 లో “సీతాలు జడుపడ్డది” అన్న పేరుతో సుమారు పది కథల సంకలనం వచ్చింది. ఆయన రాసిన మొట్టమొదటి కథ దివాణం సేరీ వేట. రెండు బంట్లు పోయాయి, 1961లో అచ్చయిందనుకుంటాను.
“ఎందుకోసం రాసినా తనకు తెలిసిన జీవితం గురించి మాత్రమే రాయాలని, రాసింది సుబోధకంగా, కళాత్మకంగా ఉండాలనీ భావించిన వారిలో ఆయన ఒకరు,” అని కె.యస్. వై. పతంజలి అన్నారు. రాజుల జీవితాల గురించి, వాళ్ళ సంప్రదాయాలు, ఆచారాల గురించి కృష్ణంరాజుగారికి తెలియనిది లేదని ఆయన కథలు చదివిన వాళ్ళెవరైనా ఒప్పుకుంటారు.
“మనుషులు బాగుపడాలి అనే రాశాను. దేశం బాగుపడాలి అనే కోరుకుంటున్నాను. కానైతే దేశం బాగుపడటానికి ధర్మసూత్రాలు, నీతి పద్యాలు రాయలేక పోయాను. … ప్రజల జీవితాలను పరిశీలనగా చూసి, చూసినది చూసినట్టు చతురతతో రాసి, అట్టి జీవితసత్యాలను రచనలలో చట్రం కట్టినప్పుడు అద్దంలో చూసుకొన్నట్టు వారివారి ప్రతిబింబాలను నా రచనల్లో చూసుకొని వారి రూపాలను వారే చక్కదిద్దుకునేందుకు అవి ఉపయోగపడేలా రాసేందుకు ప్రయత్నం చేసాను…” అని, ‘నేనెందుకు రాసేనూ?’ అన్న మకుటంతో, నేనెందుకు వ్రాస్తున్నాను? (1980), అనే సంకలనంలో రాశారు.