వాద్య బృంద సంగీత రచనలు – సంగీత విషయాలను గురించిన ప్రసంగాలు

[ఈ వ్యాసం పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు చేసిన ప్రసారతరంగిణి – రేడియో కార్యక్రమాలపై వ్యాస సంకలనం (పిఠాపురం, సామాన్య ప్రచురణలు, 1986) లోనిది. రజనీకాంతరావుగారి విస్తారమైన సంగీత సృష్టిలోని రెండు ముఖ్యమైన అంశాలపైన భట్టుగారు రజనిగారిని అడిగి మరీ రాయించుకున్నవి. రజనిగారి తొలి సంగీత నాటకాలని విశ్వవీణ(1964) అన్న సంకలనంలోను మరి కొన్నింటిని పైడిమర్రి వెంకటరమణగారి శోభనాచల బ్లాగులో రజని అన్న శీర్షిక క్రింద చూడవచ్చు. అలాగే ఆయన చేసిన ఆంధ్రీ కల్యాణి, దేవసాళగం రచనలు యూట్యూబ్ ఛానల్ లోను, కొండనుంచి కడలి దాకా, మేఘసందేశం రూపకాలని ఈమాట సంచికలలో వినవచ్చు. – పరుచూరి శ్రీనివాస్]


మన దేశంలో ‘వాద్య బృందాలు’ లేదా ‘వాద్య గోష్టులు’ క్రీస్తుకు కొన్ని శతాబ్దాల పూర్వపుదయిన భరతముని నాట్యశాస్త్రం నాటికే ఉండేవనీ, వాటిని ‘కుతుపం’ అనేవారనీ మన నాట్యశాస్త్రం చెపుతోంది. ఈ కుతపకారులు నాట్య మంటపం ముందుభాగంలో అటకపైకాని, కొన్ని కట్టడాలలో వెనకభాగపు వేదికపై కాని సమావేశమయి ఉండేవారని ఆయా వర్ణనల ద్వారా మనకు తెలుస్తుంది.

పాటలోని మాటలకు కూర్చిన రాగ స్వరాలను కాక వాటికి ఉపోద్ఘాత పూర్వకంగానో లేదా పల్లవికో ప్రతి చరణానికో, కాకపోతే, పాట ముగింపు సమయానికో ముక్తాయింపుగా (తీర్మానంగా) చేర్చుకొనే నాదాత్మక రాగబంధాలూ, లయాత్మక మృదంగాది విన్యాసాలూ వినిపించడమే ఈ వాద్య బృందాల పని. వీటికి రాగాలప్తి (రాగాలాపన), రూపకాలప్తి (పాటలో చరణాల భావాన్ని రాగ స్వర విన్యాసంలో నెరవలు చేయడం) ఉండేది- ఆ చర్యలు ఈనాటికీ సంగీత విద్వాంసుల కచేరీలలో మనకు వినిపిస్తుంటాయి. గాయకుడు గాత్రంతోకాక, వాద్యకారులు ఆ చర్యలను వాద్యాలపై ప్రదర్శించేవారన్నమాట. ఇదంతా ఎందుకంటే మాటా పాటా ఆధారభూతమైతేనే వాద్యబృంద సంగీతం దైవసేవకు, శ్రవణానికీ యోగ్యం అవుతుందనే భావం ఆనాటి సామవేద జనిత సంగీత భావుకుల నిశ్చితాభిప్రాయం అనటానికి కారణం- మాటా పాటా తోడులేని వాద్యబృందగానం రాక్షసగానం అని నాట్యశాస్త్రంలో నిర్వచించారు.

ఆర్యజాతుల సంగీతం సామవేదంతోబాటు జన్మించి వేదఋక్కులను విన్యసించడానికి వినియోగించడంచేత యజ్ఞవల్క్యుడివంటి ఋషులు యజ్ఞాలలో వేదగానానికి సహాయభూతంగా వేణువీణామృదంగాదులను విన్యసించే సంప్రదాయానికి చెందినవారు. వారి దృష్టిలో గంధర్వాప్సరసలు కూడా వేద సంగీతానికి అనుబద్ధమైన సంప్రదాయానికి చెందినవవారే.

ఈ సంప్రదాయానికి చెందని ఆర్యావర్త దక్షిణాపథాల ఆంతర్గత ఆదిమజాతులు కొందరు, హిమాలయాలకు అవతలి హద్దుల ఉండే త్రైవిష్టప (టిబెట్) భూటానజాతులు వారు కొందరు మాటాపాటా తోడులేని విలక్షణ వాద్యములతో పలికించే భయానక నాదరచనలూ, బీభత్సలయ వాద్యఘోషలూ మున్నగువాటిని రాక్షసగానంగా ఆనాడు గణించేవారని చెప్పాలి. అంటే కొండల లోయలలోను, అరణ్యగర్భాలలోను ఉండే కొన్ని ఆదిమజాతులు దైవశక్తికి వారారోపించుకునే భయానక బీభత్స రౌద్ర లక్షణాలకు అనుగుణంగా ఆ సంగీతం ఉండేదన్నమాట. ఇంతకు మించి, క్రీస్తుకు పూర్వమూ తరువాతా సహస్రాబ్దాలలో చైనీయ చక్రవర్తుల ఆస్థాన చరిత్రకారుల కైఫీయతుల ద్వారా 200 మందికి తక్కువ కాకుండా భారతీయ వాద్యకారుల బృందం ఆ చక్రవర్తుల ఆస్థానంలో ఉండేదనీ, వారిని కచ్చి విద్వాంసులనీ, వారి సంగీతాన్ని కచ్చి సంగీతమనీ అనేవారని తెలుస్తుంది. ‘కచ్చి’ నేటి గుజరాత్ రాష్ట్రంలోనిది. అక్కడ ద్వారకకు పైని బరుచ్ అని ఈనాడు పిలువబడే భరుకచ్ఛం పట్టణం ద్వారా ఓడలపైనో లేదా సింధునదీ లోయలూ, హిమాలయ కందకాలూ దాటి నాటుదారినో వారు చైనా చేరేవారు. పాటామాటా లేకుండా వారు భారతీయ రాగాలను లయలను వినిపించేవారట. భారతీయ భాషలలో గేయాలు వారు గానం చేయలేదని అనుకోకూడదు. క్లుప్తంగా ఇది ప్రాచీన భారతీయ వాద్యబృంద చరిత్ర.

సంగీత రత్నాకరకారుడైన శార్‌ఙ్గదేవుడూ, పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడూ ముప్ఫయి నలభైకి పైగా బ్రహ్మవీణ, రుద్రవీణ ఇత్యాది తంత్రీ వాద్యాలను గురించీ, వాయు వాద్యాలను గురించీ, లయ వాద్యాలను గురించీ చెప్పారు. ముందు పేరాలలో సూచించిన రాగాలప్తి రూపకాలప్తి వహనీ ఇత్యాది కొన్ని ‘మాటల తోడు’ లేని వాద్యసంగీత రచనలను గురించి సూచించారేగాని, వాటి వివరాలు తెలియవు. అంతేకాక ఆ విన్యాసాలన్నీ అప్పటికప్పుడు మనోధర్మము ననుసరించి ఆశువుగా వాయించేవేకాని, వాద్యబృందంపై ప్రదర్శించడం కోసం ముందుగా కూర్చిన సంగీత రచనలు కావు.

మొత్తం మీద మనదేశపు సంగీత చరిత్రలో వాగ్గేయ రచనలూ, సంగీత నాటక రచనలూ కూర్చడానికి తీసుకున్న శ్రద్ధాసక్తులుకాని అటువంటి దృక్పథంగాని కేవలం వాద్యబృంద సంగీత రచనల పట్ల ఇటీవలి అయిదు దశాబ్దాల క్రితం వరకూ అసలు లేనేలేవని చెప్పాలి. పాశ్చాత్య సంగీతంలో మాత్రం వారి శాస్త్రీయ సంగీతంలో గేయాత్మక సంగీత రచనలకంటే కూడా వాద్యబృంద రచనలలో ఎక్కువగా శ్రద్ధాసక్తులు కనబరచారు. టోన్‌పోయమ్స్ అనబడే కేవల స్వరాత్మక రచనలు, రెండుమూడు వాద్యాలు కలిపి వాయించే సొనాటాలూ, ఎనిమిది వాద్యాలు ప్రయోగించే ఓపస్‌లూ, ఇవికాక 50, 80, 100, 150 వాద్యాలు. ఒక్కొక్క వాద్యానికో ఒక్కొక్క జాతికి చెందిన తంత్రీ వాద్యాలలో ధనుర్వాద్యాలు, మీటువాద్యాలు, వాయువాద్యాలలో దారునిర్మితాలు, కాంస్యనిర్మితాలు, శిలామూలకాలు, ద్యాకిలైటు వంటి తేలిక మూలకాలతో నిర్మించినవీ, పియానో, ఆర్గన్, హార్మోనియం, అకార్డియన్ వంటి స్వరఫలకాలతో కూర్చినవీ, వివిధ చర్మవాద్యాలూ, డ్రమ్స్, రండోళ్ళు, వాయు వాయిద్యాలలో క్లేరినెట్, సాక్సోఫోన్, ట్రంపెట్, ట్రాంబోన్, ఒబో (షహనాయివంటిది), వంశీవేణువులు (వెదురు), లోహ మురళులు ఇలా ఇన్ని విధముల వాద్యాలతో అత్యనుమంద్రం, అనుమంద్రం, మంద్రం, మధ్యం, తారం, అతి తారం, అతితమతారం, ఇన్ని స్థాయిలలో స్వరాలను ప్రయోగించగల వాద్యబృందంపైని గొప్ప గొప్ప సింఫొనీలు అనే రచనలను పాశ్చాత్య సంగీత విద్వాంసులు కూర్చారు. యూరప్, అమెరికా, జపాన్, చైనా, రష్యా మొదలయిన ప్రపంచ దేశాలలో పాశ్చాత్య సంగీతంలో ఈ రచనలను వినిపించడం శతాబ్దాలుగా కొనసాగుతోంది.

బ్రిటిషువారు ఈస్టిండియా కంపెనీద్వారా ఇండియాలో సామ్రాజ్యం స్థాపించుకున్నాక ఆయారాష్ట్రాల గవర్నరులకు రాజలాంఛనంగా దిగుమతియైన గవర్నర్స్ బ్యాండ్ వాద్య బృందాలు పాశ్చాత్య యుద్ధ గేయాలను అప్పుడప్పుడు రొమాంటిక్ గేయాలను వాయించటం మాత్రం ఉండేది. మద్రాసు, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల సామ్రాజ్యపాలన ఉన్నతోద్యోగులలోను, వారి తాబేదారులైన ఆంగ్ల సంప్రదాయావలంబులైన భారతీయ ఉన్నతోద్యోగ వర్గాలలోను, ఆంగ్లో ఇండియన్ వర్గాల్లో పాశ్చాత్య సంగీతాభిమానం క్రమంగా పెరిగి, ఆయా వాద్యాలను ఇండియాకు తెప్పించి కొన్ని వాద్యబృందాలను ఏర్పాటుచేసి పాశ్చాత్య రచనలను వాయించి ఇక్కడి ఉన్నత వర్గాలలో కొంత మనోరంజన కలిగించేవారు ఆయా సంస్థానాధీశ్వరులు, జమీందారులు. మైసూర్ ప్యాలెస్ బ్యాండ్, తంజావూరు ప్యాలెస్ బ్యాండు వంటివి అటు పాశ్చాత్య సంగీత అంశములనేకాక ఇటు మన కీర్తనలను కూడా వాయించి ప్రదర్శనలిచ్చేవారు. అప్పటి మద్రాసులో నాదముని బ్యాండు, ఆంధ్రలో జగ్గయ్యపేట కాశింసాహెబు బ్యాండు, నలభై ఏళ్ళ క్రితం దక్షిణభారతంలో భజంత్రీ సంఘాల ఉత్సాహంతో ఏర్పడినవి. ఇవన్నీ కీర్తనలు పాటలు వాయించే వాద్యబృందాలేకాని, వాద్యబృంద సంగీత రచన అనేది మన దేశంలో గ్రామొఫోన్ కంపెనీ స్టూడియో వాద్యబృందాలు, ఆకాశవాణి వాద్యగోష్టులు, న్యూథియేటర్స్, ప్రభాత్, జెమిని వంటి చలనచిత్ర వాద్య బృందాలు తలయెత్తేవరకు జరగనేలేదు.

టాకీ చలనచిత్రాలకంటే ముందుగా ఒక దశాబ్దంపాటు 20, 30లలో మూకీ చలనచిత్రాలు వచ్చేవి. తెరముందు హార్మనిష్టు, తబలావాదకుడు, కథాఖ్యాతా కూర్చుని ఆఖ్యాత, కథా సంవాదాలు చెప్పుకుపోతుంటే తెరపై కనబడే దృశ్యానికీ సంఘటనకీ అనుగుణంగా అందులోని రసాన్ని పోషించే సంగీత ధ్వనులను హార్మనీ తబలాలపై ప్రదర్శించేవారు. ఈ హార్మనిష్టులు సాధారణంగా మన దేశంలో అంతకు మునుపటి యుగంలోని రంగస్థల నాటక సంగీత దర్శకులు. వారే టాకీ చలనచిత్రాలు రాగానే తొలివిడతలో చిత్రాలకు సంగీత దర్శకులయ్యారు. హార్మనీ తబలాలకు మించి దేశంలోని సంగీత సంప్రదాయాలలో వ్యాప్తమై తరతరాలుగా పరిచితమైన వీణ, వేణు, మృదంగాలు; వయొలిన్, సారంగి, దిల్‌రుబాలు, పియానో, క్లారినెట్, ట్రంపెట్లు ఇత్యాదిగా వాద్యబృందాలను పెంచి వారందరిచేత గుంపుగా వాయించడానికి అనువైన రచనలు చేసి ఆ సంగీతాన్ని చిత్రానికి ముందూ మధ్యమధ్య, ఆయా ఘటనలకు సూచకంగానో, నేపథ్య సాహాయ్యంగానో వాయించే రచనలు చలనచిత్ర రక్తికి తోడ్పడతాయని తోచి, ప్రతి టాకీ కంపెనీ వాద్యబృందాలను నియమించినది. గ్రామొఫోన్ కంపెనీ, రేడియో కేంద్రాలు కూడా 30వ దశకంలోనే తలలెత్తి కార్యక్రమాలను తమతమ మాధ్యమాలకు అనువుగా రూపుదిద్దుకోనారంభించాయి. వాటికీ వాద్యబృందాలు ఏర్పడ్డాయి.

కలకత్తాలో న్యూథియేటర్స్ సినీమా కంపెనీవారి ప్రసిద్ధ సంగీత దర్శకులు ఆర్.సి. బరాల్, తిమిర్ బరన్, పంకజ్ మల్లిక్, బొంబాయిలో ప్రభాత్ కంపెనీ సంగీత దర్శకులు మాస్టర్ కృష్ణారావు, వసంతదేశాయి, మద్రాసులో తెలుగు చిత్ర దర్శకులలో భీమవరపు నరసింహారావు, సాలూరు రాజేశ్వరరావు, వారి తర్వాత తమిళ తెలుగు చిత్రాలకు గ్రామొఫోన్ కంపెనీకి సంగీత దర్శకులయిన కొప్పరపు సుబ్బారావు, సుబ్బరామన్, విశ్వనాథన్, రామమూర్తులు అటు గేయాలకే కాక, గేయం లేని కేవల వాద్య బృంద సంగీత రచనలకు కూడా సంగీతం కూర్చినవారు. జెమినీ కంపెనీవారు ఉదయశంకర్ (నాట్యాచార్యుడు) గొప్ప కల్పనాత్మకమైన ‘కల్పన’ అనే చిత్రాన్ని తీయడానికని వివిధ రాష్ట్ర సంగీత జంత్రవాదకులతో(150 మందికి పైగా) దేశంలోకంతటికీ పెద్ద (జెమిని) ఆర్కెస్ట్రాను ఏర్పరచారు. రాజేశ్వరరావు, ఈమని శంకరశాస్తి, బాలచందర్ వంటి సంగీత దర్శకులు, చంద్రలేఖ వంటి సినిమాలలో గొప్ప నేపథ్య సంగీతాన్ని సృష్టించారు.

ఆకాశవాణి ఒక్కొక్క కేంద్రంలోను మొదటి దశాబ్దులలో వాద్య బృందాల, వాటిపై కార్యక్రమాల ప్రమాణాలకు కొంత దోహదం జరిగినా, కాలక్రమేణా ఏభైలు వచ్చేసరికి ఢిల్లీలోను, మద్రాసులోను మాత్రం కేంద్రీకృతంగా వాద్యబృందాలు ఏర్పడ్డాయి. జెమినీ వాద్యబృందం ఏర్పడినపుడు విష్ణుదాస్ షిరాలి, రవిశంకర్ సంగీత రచయితలుగా దర్శకులుగా ఉండేవారు. ఆ వాద్యబృందంలోని ఘటికులైన వాద్యకారులు, దర్శకులు క్రమంగా ఢిల్లీ ఆకాశవాణి వాద్యబృందం ఏర్పడటంతో ఢిల్లీ చేరుకున్నారు.

ఢిల్లీ వాద్యబృందం గేయంలేని వాద్యబృంద రచనలే అనేక విధాలుగా రచయింపజేసి వాటిని రేడియో కేంద్రాలలోనూ, కొన్ని మహానగరాల పెద్దపెద్ద హోటళ్ళలో ప్రదర్శనలివ్వడంతో బొంబాయి, ఢిల్లీ వంటి చోట్ల అశోకా హోటల్ ఆర్కెస్ట్రా ఏర్పాటుకి అవకాశం కల్గింది.

ఢిల్లీ ఆకాశవాణి వాద్యబృంద రచయితలలో గొప్పగా చెప్పుకొనతగ్గవారు రవిశంకర్, పన్నాలాల్ ఘోష్, టి.కె. జయరామయ్యర్, ఈమని శంకరశాస్త్రి, ఎస్. గోపాలకృష్ణన్. వీరు కాక ఈ వ్యాస రచయిత (రజని) కూడా ఢిల్లీ ఆకాశవాణి, మద్రాసు ఆకాశవాణి వాద్యబృందాలు రెండింటిని కలిపి ‘ఆంధ్రీ కళ్యాణి’ అనే పరిశోధనాత్మక రచనను, మద్రాసు వాద్యబృందంపైన ఋతుచక్రము అనే కల్పిత సంగీత రచనా, దేవసాళగం అనే అపురూప రాగరచనా ప్రదర్శించినవాడు.

అయితే వాద్యబృంద రచనలు చేసేటప్పుడు సంప్రదాయక రచనలలోని రాగస్వరూపం స్వరశిల్పిని(కంపోజర్‌ని) ఎప్పుడూ బాధిస్తూ ఉంటుంది. అంటే ‘ఈ రచన యిలా ఉంటేనే రాగస్వరూపాన్ని చాటుతుంది, ఆ రాగస్వరూపంలోనే నీ క్రియాత్మకమైన ఫలిత ప్రదర్శన సమర్థంగా జరగాలి’ అంటుంది.

ఆ విధంగా వాద్యబృందాన్ని వినియోగించుకొనగలిగితే రచయిత చాకచక్యం కల్గినవాడే అవుతాడు. అది విశేషము. ఆ చాతుర్యం లేనప్పుడు కొంచెం స్వేచ్ఛ తీసుకొని స్వరశిల్పి అన్యస్వరాల సాంకర్యాన్ని శరణుజొచ్చుతాడు.

ఈ వాద్యబృంద రచనలలో రాగాత్మక రచనలు కొన్ని వుంటాయి. రాగాత్మకమైనవి కాకుండా మెలడీ నిర్మాణాలుంటాయి. అంటే అవి నిర్ణీత లక్షణాలను అనుసరించిన ఒకే రాగానికి చెందినవి కాకుండా ఈస్థటిక్ ఎరేంజిమెంట్ ఆఫ్ సౌండ్స్. అలా రసపూరిత శబ్దాల అమరిక చేసుకోవాలి.

కొన్నిచోట్ల లయాత్మకమైన రచనలుంటాయి. నదిపొంగు తరంగాలు తరంగాలుగా ఎలా వుంటుందో చెప్పదలుచుకుంటే వాద్యబృందంచేత పలికించవచ్చు. ప్రత్యేకంగా ఫలానా రాగం వల్లనే నది పొంగులా వినబడుతుందనుకోనక్కర్లేదు. తరంగిణి లాంటి రాగాలను కూడా వాడుకోవచ్చు. అదొక చాకచక్యం.

వాద్యబృందం రచనల్లో వాద్య గోష్టిలో వున్న వాద్యాల తరగతులు వాయువాద్యాలు, ధనుర్వాద్యాలు, మీటువాద్యాలు, స్వరం తెంచేవీ, స్వరసాంతత్యాన్ని పెంచేవీ వుంటాయి. మంద్ర, అనుమంద్ర స్థాయిలలో (బేసు స్థాయిలలో) పలికే వాటి ఎఫెక్ట్సు వుంటాయి. తారాస్థాయిలో కొన్ని ఎఫెక్ట్సు బాగుంటాయి. ఏ స్థాయి, ఏ పద్ధతి, ఎప్పుడు బాగుంటుందో వాద్యబృంద రచనలుజేసే స్వరశిల్పికి తెలుసుండాలి.

‘కామదహనం’ అనే నా వాద్య రచనలో గొప్ప విశేషం లేకపోయినా నేను ఆ వాద్య రచనలో కొన్ని సంకేతాలు నిర్దేశించుకుని ఒక్కొక్క వాద్యాన్ని ఒక్కొక్క పాత్రగా నిరూపించాను. ఒకేవ్యక్తి వాగ్గేయకారుడు వాద్యబృంద రచయిత కావటం చాలా అరుదు.

నేను విన్న వాద్య రచనలు చాలావరకు స్వరాత్మకంగా వుండి కల్పనకు ఆధారాలు అందివ్వనట్టుగా నాకు కనబడుతూ వుంటాయి. వీటిలో కల్పనచేసి, దృశ్యాన్నో, ఒక మానసిక అనుభవాన్నో కల్గించడంలో కొందరు కృతకృత్యులు అయివుండవచ్చు. కాని ఇతరులు చాలావరకూ రాగాత్మకంగానో స్వరసంపుటుల విన్యాసమాత్రంగానో రచనలు చేస్తూ వచ్చారు. ఏ మేఘరంజని రాగాన్నో ప్రస్తరించి మేఘరంజని స్వరాల విన్యాసాన్నో చూపించారు కాని కల్పనా ఆలోచనాదృష్టే వున్నట్లు కనపడదు.

వాద్యబృంద రచనలు చేసేవారు దృశ్య నిరూపణం, రసభావ నిరూపణము- ఈ రెంటినీ దృష్టిలో పెట్టుకోవాలి. స్వరాలు ఎలా ఉపయోగిస్తాయో వాద్యాలు కూడా అలాంటి ఉపకరణాలే. ప్రయోజనాత్మకంగా వాటిని వుపయోగించినపుడే వాటికి రాణింపు.

నామటుకు నేను ఋతుచక్రమనే వాద్య రచనలో కొంత కల్పన చేయగలిగాను. ఋతువుల్లో జనజీవనంలో కలిగే ఘటనా సంకులాన్ని సంగీతం ద్వారా దృశ్యీకరించే ప్రయత్నం చేశాను. సంక్రాంతి హేమంతంలోను, దసరా శరదృతువులోనూ వస్తుంది కదా, దేవీపూజ నృత్యం యొక్క ప్రభావాన్ని సరస్వతిరాగంలో తీసుకువచ్చే ప్రయత్నం చేశాను. హేమంతంలో పంట ప్రారంభించేసరికి పొలాలలోని సంరంభాన్ని వేణువు ద్వారా చూపించి, జానపద గేయం గుంపువచ్చి పాడుతున్నట్లుగా నృత్యాన్ని వాద్యాల ద్వారా సూచించాను. ఆకురాలు కాలంలో మ్రోడులుగా కనిపించే మొక్కల్ని ద్యోతకం చేయడానికి కనకాంగి రాగం తీసుకొని హృదయ నిర్భేదకమైన స్వరసంపుటులతో బీభత్స దృశ్యాన్ని రచించాను. వసంతోత్సాహం వసంతరాగ ప్రయోగం క్లయిమాక్సుగా తీసుకువచ్చాను.

ప్రకృతిలో సహజ మధురంగా వినిపించే పశుపక్ష్యాదుల కలకూజితాలూ, మలయపవనాలూ, ఝంఝామారుతాలూ, నదీ ప్రవాహ, సాగర తరంగ, జలపాతాదుల కదలికలూ, సూర్యకుటుంబంలోని గ్రహగోళాల భ్రమణాలూ, ఆధునిక అంతరిక్ష నౌకల కాంతివేగ గమనాలనూ కూడా వాద్యబృంద రచనలలో నిరూపించవచ్చు. వీటిలో రాగ స్వరూపం కంటే శ్రావ్యంగా ధ్వనిగతులను అనుకరించే స్వరవిన్యాసాలను ప్రయోగించాలి.

నిజానికి వర్షం కురుస్తున్న భావం కావాలంటే చిన్న చిన్న చినుకుల జలతరంగిణి కిణికిణులకు తోడు ధారాపాతపు పొడుగాటి చినుకుల జల్లును సూచించే ఐదారు వయొలినుల ధనుర్వాదనం కావాలి. మేఘాలు గర్జిస్తున్నాయన్న భావం కావాలంటే అనుమంద్ర స్వరంలో మృదంగ స్వరతరంగిణి కావాలి. ఎన్ని వయొలిన్ వాద్యాలున్నా ప్రయోజనాత్మక ప్రయోగం లేకపోతే లాభంలేదు. వాద్యగోష్టిలో మంచి వాద్య బృంద రచయిత కోర్కెలు పూర్తిగా తీర్చగలిగిన వాద్యగోష్టి ఇంకా మనదేశంలో లేదు. అంతేకాదు! దేశీయమైన ప్రతివాద్య సహజ ధ్వని విన్యాసాలను సార్థక స్థానంలో నాదాత్మకములైన ప్రకృతి సహజ ధ్వనులను కళాత్మకంగా బలవంతంగా వినియోగించుకోడం కూడా అభ్యాసం కావాలి.

ఇక సంగీత పత్రికా కార్యక్రమాలలో సోదాహరణ ప్రసంగాలు వింటూవుంటాం. సంగీత ప్రసంగాలు చేసేటప్పుడు, వాగ్గేయకారుల విశిష్టత చెప్పేటప్పుడు, కాలానుక్రమం పాటించాలి. ఏ వాగ్గేయకారుడు ముందు జన్మించాడో, ఏ వాగ్గేయకారుడు తర్వాతో గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి చెప్తాను:

క్రీ.శ. 1502లో చనిపోయిన అన్నమాచార్యులు 32 వేల కీర్తనలు రాశాడు. 1564లో మరణించిన పురందరదాసు లక్ష కీర్తనలు రాశాడు. పురందరదాసు రాసిన సూశాదులు, ఉగాభోగాలు, కృష్ణునిమీద రాసిన కీర్తనలు, పురందర విఠలునికి అంకితమిచ్చిన కీర్తనలు, మానసభోగ కీర్తనలు, దేవునికి విన్నపాలు చేసే కీర్తనలు, సాంఘిక విమర్శ చేసే కీర్తనలు- ఇలా వున్నాయి. పురందరదాసు పదాలు నూరు, నూటయాభయి రాగాలలో వున్నాయి. అన్నమాచార్యుల కీర్తనలలోనూ నూరూ నూటయాభయి రాగాలు కనబడుతున్నాయి. పురందరదాసుని మనం కర్నాటక సంగీత పితామహులు అంటున్నాం. అన్నమాచార్యుని కర్నాటక సంగీత ప్రపితామహుడని అనితీరవలసినదే కదా — అని ప్రసంగంలో చెప్పాలి.

ఇక సంగీత ప్రక్రియలలో, గేయ రీతులలో కీర్తన, పదము, జావళి, తిల్లానా అని వుంటాయి. ఇవి, ఎప్పుడు ఎలా పుట్టాయో చెప్పాలి. కోవెలలోనా? రాజు కొలువులోనా? ఏది ఎక్కడ పుట్టింది? ఎక్కడ వర్ధిల్లింది? ఈ విషయాలు చెప్పేటప్పుడు చారిత్రక క్రమ పరిణామం, సామాజిక ప్రజావర్గ జీవితంలో మనోరంజనావసరాలు దృష్టిలో వుంచుకొని సోదాహరణ ప్రసంగాలు చేస్తే శ్రోతలకి కుతూహలం కలుగుతుంది.

మరొక ఉదాహరణ చెప్తాను. మునిపల్లె సుబ్రహ్మణ్యకవి ఆధ్యాత్మ రామాయణం కీర్తనలలో రామాయణ కథాకథనంతోబాటు నృత్యాత్మకత కూడా ఉంది. వాటిలో రాగస్వరూపం ఒక్కొక్క చరణంలో నిబద్ధమై ఉండటమే కాకుండా, పార్వతితో శివుడు ప్రేమ సంభాషణ చేస్తున్నట్లు పల్లవి వుండి, చరణాలు రాముని కథను చెప్పుతూ వుంటాయి. కథాకథనంలో సుబ్రహ్మణ్యకవి చేసిన అపూర్వ పద్ధతి ఇది. ప్రాసలు, అనుప్రాసలు, అంత్యప్రాసలు, ద్వితీయాక్షర ప్రాసలతో తాళం చక్కగా సాగిపోతూ; చరణం చివరిభాగం రెండో కాలంలో సాగి, పదాల కూర్పులోనే సంఘటనలు ధ్వనిస్తూ ఆనందం కలిగిస్తూ వుంటాయి. వక్త ఇటువంటి రహస్యాలు గ్రహించి ప్రసంగించాలి.

కీర్తనల గురించి చెప్పేటప్పుడు ప్రతి కీర్తనలోని సాహిత్యం క్షుణ్ణంగా తెలిసి, కొత్త ఆలోచనల్ని అందివ్వగలగాలి. ఉదాహరణకి ఒక పంచరత్న కీర్తనలో ‘గగనాధిపసత్కులజ రాజరాజేశ్వర’ అని వుంది. ‘సత్కులజ’ అని ఎంచుకున్నారు త్యాగయ్యగారు! గగనాధిపసత్కులమంటే సూర్యవంశం. ఆ సూర్యవంశంలో పుట్టిన రాజరాజేశ్వరా అని చెప్పుతున్నాడు. ఇందులో నాకు స్ఫురించినదీ, ఇతర విద్వాంసుల దృష్టికి రానిదీ, చిన్న విషయముంది.

సంగీత గ్రంథం రాసిన తులజరాజు, శాహాజీకి అన్నదమ్ములలోనివాడు, ఆ కాలపు రాజైన శరభోజికి పినతండ్రి. శరభోజీ త్యాగరాజు సమకాలికుడు. శరభోజీ దగ్గిర త్యాగరాజు శిష్యులువెళ్ళి పంచరత్నాలు పాడారు. త్యాగరాజుని పాడమంటే వెళ్ళనన్నాడు. ఆయన రాజు పేరు కూడా స్మరించలేదు. కాని శరభోజీ తాతమీద తనకి గౌరవం వుంది కనుక అది స్ఫురించేలా అక్కడ త్యాగరాజు ఆయన పేరు ధ్వనించేటట్టు రాశాడు అని నేను భావించాను. తులజాజీ పేరు స్పష్టంగా ఉపయోగించడం త్యాగరాజుకిష్టంలేదు. అందుకు తులజ బదులు సత్కులజ అని రాశాడు అని నేను అనుకుంటున్నాను. ఇలాంటివి కొన్ని పాటలలో తడతాయి. ఈ మాటల్ని వాగ్గేయకారుడు ఈ విధంగా ఎందుకు వాడాడు? అని ఆలోచించాలి.

రేడియోలో సంగీత ప్రసంగాలు చేసేవారు సంగీతపు రహస్యాల్ని సాధికారంగా చెప్పి సాంకేతికమైన క్లిష్టతల జోలికి పోకుండా సామాన్య శ్రోతల్ని ఆకట్టుకోవాలి. కీర్తనల వెనుక నుండే కథలు, ఐతిహ్యాలు తెలుసుకొని చెప్పాలి.

సంగీత విషయాల గురించీ, రచనలను గురించిగాని, ప్రదర్శనలోని సులువులూ బరువులూ మెలుకువలను గురించి గాని, సంగీతజ్ఞులూ విద్వాంసులూ తమలో తాము కూడా సాధారణంగా స్వేచ్ఛగా మాటాడుకోరు. వారివారి వ్యక్తిగతమైనవో, లేదా (ఘరానా) గురు పరంపరాగత సంప్రదాయకమైనవో ‘స్వార్థభావాలు’ అడ్డువస్తాయి. ఇంక రసికులు విని తలలూపడం తప్పించి, ఎందుకు ఊపుతున్నారో, ఔననో, కాదనో చెప్పడానికి మొహమాటాలుండడం చేత లోపలి భావాలు లోపలే ఉండిపోతాయి. అందుచేత వ్యక్తిగతంగా గాని, గురు పరంపరాగత సంప్రదాయక పక్షపాతాలేమీ లేని మనస్సుతో మన సంగీత విషయాలను సంగీతం తెలిసినవారూ, రసికులూ, నలుగురూ కలసి చర్చించుకోవడానికి అనువైన సులభ పారిభాషికాలు, సర్వ సాధారణంగా అందుబాటయే అనుభవాలూ కలబోసుకొనడానికి వీలుందని చూపించడమే ఈ వ్యాసం లక్ష్యం.