నేనూ నా రచనలు

(ఈ వ్యాసానికి ఆధారం నవీన్ గారు ఆటా 2006 లో చేసిన ప్రసంగం.  అస్తిత్వ వాద (Existentialism) ప్రభావంతో రచనలు చేసిన బుచ్చిబాబు, నవీన్, ఆర్. ఎస్. సుదర్శనం, వడ్డెర చండీదాస్ గార్ల నవలను విశ్లేషిస్తూ అంపశయ్య నవీన్ గారు అట్లాంటాలో చేసిన ప్రసంగం ఈమాట సెప్టెంబర్ 2006 సంచికలో వినగలరు.)

అంపశయ్య నవీన్బుద్ధి తెలిసినప్పటినుంచీ కథలూ, నవలలూ రాయాలన్న తపన నాలో ఉండేది. ఎవరైనా కథలు చెబుతున్నారంటే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో – అంటే యాభైలలో -అనేక చోట్ల బుర్రకథలు చెప్తూండే వాళ్ళు, హరికథలు చెబుతుండే వాళ్ళు, వీధి బాగోతాలు ఆడుతుండే వాళ్ళు, తోలుబొమ్మలాటలు చూపించేవాళ్ళు. వీటన్నిటిని మీద నాకు ఎంతో ఆసక్తి ఉన్నట్టు నాకు గుర్తు. ఇవే కథల్ని నేనైతే ఎలా చెప్పేవాడిని అని ఆలోచించే వాడిని.

చిన్నప్పటి నుంచి నాకు చాలా సహజంగా అలవడిన గుణమేమిటంటే నన్ను నేను అనుక్షణం మరో వ్యక్తి విశ్లేషించినట్టుగా విశ్లేషించుకోవడం. నాలో కలిగే అనేక భావాలను, స్పందనలను, ఆలోచనలను పరిశీలించుకునే వాడిని. ఇవి నాలో ఎందుకు ఎందుకు కలుగుతున్నాయనీ, వాటి వెనుక ఉన్న శక్తులేమిటని ప్రశ్నించుకునే వాడిని. ఇలాంటి ఆలోచనలే అందరికీ వస్తాయా? నాకొక్కడికే వస్తాయా? అని ఆలోచించినప్పుడు చాలామందిలో ఇలాంటి భావాలే జనిస్తాయని అర్థమయ్యేది. కానీ చాలామందికి తమలోకి తాము ఆలోచించే ప్రవృత్తి ఉండదని నాకు తెలిసేది.

నాలో అనుక్షణం ప్రవాహంలా ఉత్పన్నమౌతున్న ఈ ఆలోచనలను, స్పందనలను నా చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవాలన్న ఓ ప్రగాఢమైన కోరిక నాలో కల్గుతుండేది. స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు నా చుట్టూ చాలామంది నా క్లాస్‌మేట్స్ చేరి “యేదన్నా కథ చెప్ప” మని అడుగుతుండేవాళ్ళు. నేను ఇదివరకు విన్న కథలే కొంచెం మార్చి నా కల్పనను కొంత జోడించి చెప్పేవాడిని. వీధి నాటకాలు, చూడటం ద్వారా హరికథలు, బుర్రకథలు వినడం ద్వారా నాకు ఎన్నో పిట్ట కథలు తెలిసేవి. వాటినే కొంచెం మార్చి ఎట్లా చెబితే అవి వినడానికి బాగుంటాయో ఆలోచించి నా క్లాస్‌మేట్స్ కు చెప్పేవాడిని. చాలా త్వరలోనే “ఈయన కథలు చాలా బాగా చెబుతాడు” అన్న పేరు వచ్చింది.

కానీ కథలు చెప్పడంతోటే తృప్తి పడుతున్న నాకు వీటిని రాస్తే ఇంకా బావుంటుంది అన్న ఐడియా రావడంతో కథలు రాయడం మొదలు పెట్టాను. యేడో తరగతి చదువుతున్నప్పుడే ఓ కథ రాసి “చందమామ” పత్రికకు పంపించాను. ఆ ఉత్సాహంతో, యే నాటికైనా నేనో పెద్ద రచయితను కావాలని కలలు గనడం మొదలు పెట్టాను. ఎక్కడ కథల పుస్తకం కనబడితే అక్కడ ఆగిపోయి ఆ పుస్తకాన్ని చదివేవాడిని. కథలు చెప్పడం, కథలు చదవడం, కథలు రాయడం – ఇదే నా ప్రపంచంగా మారిపోయింది.

1958 లో- అంటే నా పదహారవ యేట నేను హైస్కూలు విద్య ముగించి కాలేజీలో చేరాను. కాలేజీలో ఉండే వాతావరణం నాకు బాగా నచ్చింది. లైబ్రరీలో బోల్డు నవలలుండేవి. లెక్చరర్లు కూడా మాతో ఫలానా నవల బాగుందనీ మీరు చదవండనీ చెప్పేవాళ్ళు. వెంటనే ఆ నవలను లైబ్రరీనుండి తెచ్చుకొని చదివేవాడిని. అలా నేను చలం, విశ్వనాథ, బుచ్చిబాబు, గోపీచంద్, కొకు, రావిశాస్త్రి లాంటి రచయితలు రచించిన ఎన్నో నవలల్ని కథల్ని చదివేశాను. వీళ్ళను చదవడం వళ్ళ మంచి కథలెలా రాయాలో నాకు తెలిసిందనిపించింది. కథానిక శిల్పం కొంత నా స్వంతమైందనిపించింది.

కాలేజీలో చేరిన కొత్తలోనే నేను “చితికిన జీవితం” అనే కథను రచించి కాలేజీలో జరిగే కథానికా పోటీకిచ్చాను. ఆ కథకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దాన్ని కాలేజీ మాగజైన్ లో ప్రచురించారు. విద్యార్థులందరూ చదివి చాలా బాగుందన్నారు. ఇది కల్పితకథలా లేదు, నిజంగా జరిగినట్టే ఉందన్నారు. అలా అనిపించడమే మంచికథల లక్షణమని నేననుకున్నాను. ఈ కథకు లభించిన ఆదరణ చూశాక నేను మంచి కథలు రాయగలనన్న నమ్మకం నాకు కల్గింది. అంతే, అప్పటినుండీ కథలు రాయడం నా దైనందిక చర్యలో భాగంగా మారిపోయింది.

చిన్న కథలే కాదు, నవలలు కూడా రాయాలన్న కోరిక నేను యూనివర్శిటీలో ఏం.ఏ. చదువుతుండగా కలిగింది. ఏం.ఏ. చదువుతున్న రోజుల్లో నాలో ఒక విపరీతమైన మానసిక అశాంతి ప్రారంభమైంది. ఒక రకమైన అభద్రతా, ఒక అపరాధ భావం నన్ను వశపరుచుకునేవి. బుర్రలో ఎప్పుడూ ఎన్నో పరస్పర విరుద్ధమైన భావాలు చెలరేగడం, ఎప్పుడూ నాలో యేదో సంఘర్షణ, యేదో చెయ్యాలన్న ఆరాటం, ప్రపంచాన్ని మరమ్మత్తు చెయ్యాలన్న తపన, నా చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనకు విశ్లేషించి వాళ్ళను అర్థం చేసుకోవాలన్న తాపత్రయం, వాళ్ళందరిని పాత్రలుగా మార్చి ఓ నవల రాయాలన్న పట్టుదల నాలో యేర్పడ్డాయి. వీటితో బాటు ఆ రోజుల్లో నాలో విపరీతమైన లైంగిక అశాంతి, ఆపోజిట్ సెక్స్ పట్ల బలమైన ఆకర్షణ ఉత్పన్నమయ్యాయి. ఎందుకిలా జరుగుతున్నదని అనుక్షణం నాలోకి నేను చూసుకొని, నన్ను నేను విశ్లేషించుకోవడం ప్రారంభమయ్యింది.

సరిగ్గా ఈ రోజుల్లోనే సిగ్మండ్ ఫ్రాయిడ్ ను చదవడం జరిగింది. ఆయన రాసిందంతా నా గురించే రాశాడేమోననిపించింది. వీటన్నీటి ప్రభావమే నేను 1965-68 మధ్యకాలంలో రచించిన “అంపశయ్య” అన్న నవల.

ఈ నవల రాయడం నా జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన. గొప్ప సాహసం కూడా. “అంపశయ్య”కు పాఠకుల నుండీ, విమర్శకుల నుండీ అద్భుతమైన ఆదరణ లభించింది. ఇలాంటి నవల తెలుగులో ఇంతవరకూ రాలేదన్నారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. చైతన్య స్రవంతి శిల్పంతో వెలువడిన మొట్టమొదటి నవల ఇదే అన్నారు. చాలా త్వరలోనే “అంపశయ్య” ద్వితీయ ముద్రణ వెలువడింది. అట్లా అంపశయ్య ఇప్పటి వరకూ ఏడు ముద్రణలను పొందింది. 1969 లో వెలువడిన ఈ నవలను ఆనాటి పాఠకులెలా ఆదరించారో, ఈనాటి పాఠకులు కూడా అలాగే ఆదరిస్తున్నారు. వేల వేల మంది పాఠకులు అంపశయ్య లోని రవి పాత్రతో తాదాత్మ్యం పొందారు. ఎంతోమంది పాఠకులు ఈ నవల చదువుతోంటే తమ ఆత్మకథను చదువుతున్నట్టుగా అనిపించిందన్నారు.

“అంపశయ్య” తర్వాత నవీన్ యేం రాశాడు? “Is he a single novel celebrity?” అని అడిగే వాళ్ళు కొందరున్నారు. అంపశయ్య తర్వాత మీరు 27 నవలలు రాసినా అంపశయ్య నవలకు వచ్చినంత పేరు మరే నవలకు రాలేదెందుకు? అని నన్ను అడుగుతుంటారు. ఎన్ని రాసినా ఒక రచయిత పేరు ఒకే ఒక రచనతో ముడిపడిపోవడం విశ్వసాహిత్యంలో చాలా మంది రచయితలకు జరిగిందే.

అంపశయ్య తరువాత నేను విచలిత అనే నవల రాశాను. సెక్స్ విషయంలో మన సమాజం స్త్రీ పట్ల ఒక నీతిని, పురుషుల పట్ల ఒక నీతిని ప్రదర్శంచడమేమిటని ప్రశ్నించిన నవలది. స్త్రీవాదమనేది ఒక బలమైన ఉద్యమంగా మారకముందు నేనా నవలను రచించాను. ఈ నవల 1975 లో వెలువడింది.

అంపశయ్యకు సీక్వెల్ గా “ముళ్ళ పొదలు” అన్న నవలను రచించాను. అంపశయ్య లో విద్యార్థుల సమస్యల్ని చిత్రిస్తే, ముళ్ళపొదలు లో నిరుద్యోగ సమస్యకు చిత్రించాను. ఆ తర్వాత అంతస్స్రవంతి అనే నవల వెలువడింది. ఈ నవలలో ఉద్యోగ జీవితాన్ని చిత్రించాను. ఈ మూడు నవలల్ని కలిపి “రవిత్రయ నవలలు (Ravi Trilogy)” అంటున్నారు. చైతన్య స్రవంతి శిల్పంలో రచించిన ఈ మూడు నవలలు యువకుల జీవితాల్లోని మూడు ముఖ్య దశల్ని – విద్యార్థి దశ (అంపశయ్య), నిరుద్యోగ దశ (ముళ్ళపొదలు), ఉద్యోగ దశ (అంతస్స్రవంతి) – చిత్రించాయి. ఇంకో విశేషమేమిటంటే ఈ మూడు నవలల్లో కథాకాలం ఒక్కొక్క రోజు మాత్రమే.

1975లో భారత దేశంలో ప్రవేశ పెట్టిన అత్యవసర పరిస్థితి (Emergency) ని చిత్రిస్తూ నేను చీకటి రోజులు అన్న నవల రచించాను. ఈ నవలను డైరీ రూపంలో రచించాను. మొత్తం భారతదేశంలోనే అత్యవసర పరిస్థితిని విధించిన తరువాత అప్పటి ప్రభుత్వం జరిపిన దురాగతాల్ని చిత్రిస్తూ రచించబడిన మొదటి నవల ఇదేనని పలువురు పరిశీలకులు అన్నప్పుడు నాకు గొప్ప ఆనందం కలిగింది.

నేను పుట్టిపెరిగిన తెలంగాణా ప్రాంతపు సాంఘిక చరిత్రను చిత్రిస్తూ ఒక నవల రాయాలని నాకు చాలా కాలంగా ఒక కోరికుండేది. 50 సంవత్సరాల ఈ ప్రాంతపు చరిత్రను చిత్రిస్తూ చాలా విశాలమైన కాన్వాసును తీసుకొని ఈ నవలను రచించాలనుకున్నాను. ఐదారు సంవత్సరాలు నిరంతరంగా శ్రమిస్తే తప్ప నేనీ నవలను రాయలేనని నాకు తెలుసు. అందుకే నేను చేస్తున్న కాలేజీ అధ్యాపక వృత్తి నుండి విశ్రాంతి పొందాక ఈ నవలను రాయాలనుకున్నాను. 1996 లో నేను పదవీవిరమణ చేశాక నేనీ నవలను రాయడం మొదలు పెట్టాను. అదృష్టవశాత్తు నాకీ నవల రాయడానికి భారతదేశ కేంద్ర ప్రభుత్వం నుండి రెండు సంవత్సరాలకు ఫెల్లోషిప్ కూడా లభించింది.

50 సంవత్సరాల చరిత్రను చిత్రిస్తూ నేను రాయాలనుకున్న నవలను ఒకే నవలగా రాస్తే ఆ నవల సైజు విపరీతంగా పెరిగిపోతుందనీ (1500 ప్రింటెడ్ పేజీలు అవుతుందని) అర్థమవడంతో ఈ నవలను మూడు వేర్వేరు నవలలుగా రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ మూడు నవలలే “కాలరేఖలు” “చెదిరిన స్వప్నాలు”, “బాంధవ్యాలు”. ఈ మూడు నవలలు కలిసి మరో Trilogy అయ్యింది. “కాలరేఖలు” నవలలో 1944 నుండి 1956 వరకు తెలంగాణాలో జరిగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం లాంటి కొన్ని చారిత్రక సంఘటనల నేపథ్యాన్ని తీసుకున్నాను. “చెదిరిన స్వప్నాలు” లో 1957 నుండి 1970 మధ్య కాలంలో జరిగిన పాకిస్తాన్ తో యుద్ధం, చైనా దురాక్రమణ లాంటి సంఘటనల్ని తీసుకున్నాను. నెహ్రు భారతదేశాన్ని పాలిస్తున్న కాలంలో ఎంతో మంది భారతీయులు కన్న కలలు ఎలా చెదిరి పోయాయో ఈ నవలలో చిత్రించాను. 1970 నుండి 1995 వరకు జరిగిన ఇందిరాగాంధి హత్య, రాజీవ్ గాంధీ హత్య, ఆర్థిక సంస్కరణలు లాంటి సంఘటనల్ని “బాంధవ్యాలు” నవలలో చిత్రించాను. ఐదారు కుటుంబాల్ని ఈ నవలలో చిత్రిస్తూ ఈ 50 సంవత్సరాల కాలంలో భారతదేశపు కౌటుంబిక జీవితాల్లో ఉత్పన్నమైన ఎన్నో పరిణామాల్ని ఈ మూడు నవలల్లో చిత్రించాను. ఈ మూడు నవలల్లో ఒకటైన “కాల రేఖలు” నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం రచయిత గా నేను సాధించిన విజయంగా భావిస్తాను. అంపశయ్య తరువాత నాకు చాలా పేరు తెచ్చిన నవల “కాలరేఖలు”. ఈ నవల త్వరలోనే భారతీయ భాషలన్నిటిలోకి అనువాదం కాబోతుంది.

ఇవీ నేను రచించిన కొన్ని ముఖ్య రచనలు.


అంపశయ్య నవీన్

రచయిత అంపశయ్య నవీన్ గురించి: నవీన్ 1969 లో రాసిన అంపశయ్య ఒక క్లాసిక్. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత అయిన అంపశయ్య నవీన్ కథలు, విమర్శలు కూడ వ్రాసారు. ...