సిలబస్: 4. సమ్మర్ క్లాస్

మొదటి ప్రశ్న ఇది ఎదురవుతుంది: మీరు ఏం చేస్తారు? మై ఫలానా హూ! అని గతి లేక ఒప్పుకున్నప్పుడు– గొప్ప సంగీత దర్శకుడు నౌషాద్‌గారి పెళ్ళి కథ మీరు వినే వుంటారు. సినిమాలకు సంగీతం అందిస్తాడు అంటే పిల్లనివ్వడానికి ఎవరూ ఒప్పుకోలాట. పిలగాడు ముదిరి బెండకాయ అయిపోతున్నాడని తల్లిదండ్రి బెంగించి ‘మా వాడా ఛీ! ఛీ! మ్యూజిక్కు కాదు పాడు కాదు, దిబ్బ పక్కని కుళ్ళు కాలువ ఎదురుగా వున్న టైలరింగ్ బంక్ వోనర్!’ అనగానే అప్పుడు పిల్లదాని తండ్రి పెళ్ళి చేయడానికి ముందుకు వచ్చాట్ట.

వచ్చే మొదటి ప్రశ్న: అవునా, మీరు ఆర్టిస్టా? వావ్! నా బొమ్మ వేస్తారా? మరే! జాతికి అలా అంకితం కావడానికి తప్ప మరేం పనిలేదు చిత్రకారులకు పాపం. కనీసం, మీరు దొంగా? ఆసమ్! మా ఇంటికి కన్నం వేయరా ప్లీజ్! ప్లీజ్! అని క్రియేటివ్‌గా ఎవరూ అడగరెందుకో? ఏమిది అన్యాయము! చిత్రకారులు దొంగల పాటికూడా చేయరా స్వామీ?

సరే! ఇది రెండో ప్రశ్న: మా పిల్లదీ/పిల్లాడు బొమ్మలు అంటే అబ్బో! చాలా ఇంట్రస్ట్. చూసింది చూసినట్లు డ్రా చేస్తాడు. మీ దగ్గరికి తీసుకువస్తా, కాస్త బొమ్మలు నేర్పిస్తారా?

మొదటి ప్రశ్నకు జవాబు: ష్యూర్! వెల్కమ్! కర్సవుద్ది.

రెండవ క్వచ్చన్‌కు ఆన్సర్: నో! నెవర్! యు ఆర్ నాట్ వెల్కమ్. గెటవుట్ నౌ!

గెటవుట్‌కి ముందు ఒక మాట, వినండి. అయితే కన్విన్స్ కండి, కాకపోండి, ఫరక్ కుచ్ భీ నహీ పడేగా. జరగాల్సింది ముందుగా వ్రాసిపెట్టినట్లుగానే జరుగుతుంది. కాదనడానికి మై కౌన్ హుఁ? ఇదంతా నా థియరీ అనబడు ఒక సత్య శోధన, స్ట్రయిట్‌గా సూటిగా తార్కికంగా మీ పిల్లల సృజనాత్మకతని మీ తెలీనితనంతో హత్య చేయనీయకుండా ఆపే ప్రయత్నం.

ప్రముఖ శ్రీ గురువుగారు నెల నెల ఆదాయం ప్రణాళికలోప్పెట్టిన కళా క్రియేటివ్ ఇనిస్టిట్యూట్ లోకి మీరు, మీ భావి బాల ఆర్టిస్ట్ అడుగు పెడతారు. మీ కళ్ళు దురాశతో మిరుమిట్లుగొలిపేలా ఆల్రెడీ అక్కడ ఉన్న పిల్లలు ఎంచక్కగా డ్రాయింగ్ బోర్డ్‌ల ముందో లేక డాంకీ ఈజీల్ పైనో కూచుని పరమ మామూలుగా మళ్ళీ మళ్ళీ అదే ఎక్స్‌ప్రెషన్‌లెస్ మోనాలిసానో, లేక గాళ్ విత్ ఎ పర్ల్ ఇయర్ రింగ్ తాలూకు చర్మపు యూరోపియన్ మెత్తదనపు టింట్ రంగును అలికే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొంతమంది పిల్లలు చాలా జాగ్రత్తగా చార్‌కోల్ని ఊపిరి బిగపట్టి సుతారంగా భయంగా అర్థంచేసుకునే కష్టం పడుతూ ఉంటారు. ఇక కొబ్బరి చెట్లు, కాలువ గట్లు, పెంకుల ఇళ్ళు, పచ్చని పొలాలు, ఉదయించే సూర్యుడు, కొలనులో కమలాలు… లెక్కే లేదు. మీరు సంబరంగా ఇలా అంటారు: ‘సీ నానా? యు షుడ్ డ్రా లైక్ ది అదర్ కిడ్స్, సర్ ఈస్ వెరీ గ్గ్రేట్ ఆర్టిస్ట్, హీ విల్ టీచ్ యు ఎవిరీథింగ్. ఆల్ యూ నీడ్ సమ్ కాన్సంట్రేషన్.’ ఓకే! వాడికి బాగా తెలుస్తుంది- మనం అచ్చు తప్పు అని, ఇది నిజానికి నాజీ కాన్సంట్రేషన్ కాంప్ అని.

ఇప్పుడు వాడు ముప్ఫై రోజుల్లో ముప్ఫైఅయిదు మెట్లు ఎక్కడం కోర్స్ బాలుడు. ఇకపై మీ మనసులు పాల కుండలా తెలుపుతో నిండేలా మీ అబ్బాయి, అందరు చిత్రకారులకు మల్లే ఉన్నది ఉన్నట్టు దించేస్తున్నాడు. అసలది ఫోటోనా బొమ్మనా అనే అనుమానానికి ఆస్కారం కలిగేలా అతని కుంచె పదును తీరినది. వాడికి ఏ గురువూ సోకక మునుపు ఈతడికి బోలెడు అనుమానాలు ఉండేవి. దానినే ప్రశ్నలు లేదా సృజనాత్మకత అని నేను పిలుస్తాను. మీరు చిన్నప్పుడు వాడు వేసిన ఒక బొమ్మ చూసి షాక్ చెందారు. ఒక స్తంభం దగ్గర నిలబడి ఒక పక్షి ఒక కాలు ఎత్తి ఉచ్చ పోస్తోంది లేదా– మర్యాదగ మనోభావాలు దెబ్బతీయకుండా– పాస్ పోసుకొంటోంది. మీకెప్పుడయినా అనుమానం కలిగిందా? అసలు గొరువంక పిట్టో, బారుకాళ్ళ కొంగో ఉచ్చ ఎలా పోసుకుంటుందో? మీవాడు అనగనగా ఓసారి ఒక కుక్క యూరినల్ ఇలా పాస్ చెయ్యడం చూశాడు. వాడిలోని క్రియేవిటినో, చిలిపితనమో రెక్కలు విప్పుకుని అలా ఆ బొమ్మ గీసుకున్నాడు. డోంట్ వర్రీ! ఇప్పుడు వాడు మర్యాదస్తుడయ్యడు. వాడికి ఒక గురువు దొరికాడు. వాడికి ఇక ఏ జీవి ఎలా ఉచ్చ పోసుకుంటుందనే బెంగలేదు. సార్ కోచింగ్‌లో పొద్దస్తమానం వాడు అదే పోస్తున్నాడు. వాడి జీవితంలో వంకాయలు నిండిన గంప, పూల గుత్తి, గాజుగ్లాసు-అందులో నీరు, బొమ్మల్ని అవీ ఇవీ అనేవే స్టడీ చెయ్యడానికే ఉన్న టైమ్ సరిపోవట్లేదు మరి.

మునుపు మీ వాడు ‘మీట్ మై ఫ్రెండ్స్’ అని బొమ్మలు వేసిన గ్రూప్‌లో ఉన్న నలుగురు పిల్లలు నాలుగు రకాలు, రంగులుగా ఉండినారు. ఒకడు చామనచాయ. మరొకడు తెలుపు. ఇంకొకడు కాసింత ఎరుపు. ఆ చివరివాడు నలుపు. అందర్లోకి ఉన్న కామన్ విషయం వారి చెవులు పింక్. వంటి రంగులు అలా ఉండి చెవులు మాత్రం పింక్‌లో ఎందుకు ఉంటాయి? వీడికి రంగులు పూయడం చేతకాకపోతే! అసలు కథ ఏవిటంటే చెవులలా ఎందుకంటే వీళ్ళు కాస్త చిలిపి కుర్రాళ్ళు. అస్తమానూ క్లాస్ టీచర్ వీళ్ళ చెవులు పిండేది, అవి ఎర్రగా కందిపోయేవి. అందుకని ఇతగాళ్ళని వెక్కిరించుకుంటూ వీడు ఎప్పుడు ఈ గ్యాంగ్‌ని వేసినా చెవులు పింకులయ్యేవి. ఇప్పుడా సమస్యే లేదు శ్రీమాన్ గురువుగారి ఆధ్వర్యంలో వీడు ప్రతి మనిషికి యూరోపియన్ స్కిన్ మెత్తగా పులమడం నేర్చుకున్నాడు. అన్ని చర్మాలకు ఒకే ఒక కలర్ యూనిఫాం నేర్పబడినది.

హనుమంతులవారు తెలుసా? హనుమాన్ చాలీసాలో ఈ విధంగా చెప్పబడినది: అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం. నాకు మాత్రం బంగారు కొండ వంటి మిలమిలలాడే దేహం వేసుకుని ఆకాశయానం చేసే ఆంజనేయ స్వామికన్నా ఆకుపచ్చ రంగు శరీరం ధరించి, మూతి ఎర్రగా వేసుకుని, నీలంరంగు కౌపీనము ధరించి అసలు కలర్ స్కీమ్‌ని కంగాళీ చేసి పైన చెప్పిన దండకం గ్రామర్ని బద్దలు చేసి — ఇలా స్వామిని గీసినవాడు ఖచ్చితంగా ఏ గురువు దగ్గర ఈ బొమ్మల విద్య నేర్వని వాడే అయివుంటాడు. లేకపోతే హనుమంతునికి ఆకుపచ్చ రంగు పూయాలని ఆ ఆలోచన అంత అద్భుతమైనది ఎలా వస్తుంది? ఇప్పుడు నేను అలాగే పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి చిన్న కుర్రాడినయ్యి వాడికిలాగా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి కాస్త తార్కికంగా ఆలోచించి సూర్యుడి వంటి ప్రళయప్రచండతేజోమూర్తిని మింగబోయినవాడి మూతి మాత్రమే ఎందుకు కాలుతుంది? వళ్ళు మాత్రం మాడి మసికి తిరిగి మనిషి మొత్తం నల్లగా కుంటాకింటే ముత్తాత రూపం ధరించాలి కదా అనుకుంటున్నా! ఇకెప్పుడయినా ఆంజనేయులవారి బొమ్మ గీసినపుడు నేను ఎరుపు ప్రమేయం లేకుండా కేవలం నలుపులోనే గీసి చూస్తా.

కోచింగ్ గ్రామర్ తెలీనప్పుడు పిల్లలు ఇలా ఆలోచించే వాళ్ళు: చెరువు ఒడ్డుని చెట్ల ప్రతిబింబాన్ని కాపీ కొట్టిన చెరువు నీళ్ళు ఆకుపచ్చ రంగులోకి మారగా లేనిది మహారణ్యం పైన తేలే ఆకాశం ఎందుకని ఆ మేరకు ఎమరాల్డ్ గ్రీన్ ప్రతిబింబించరాదు? ఇక ఆరోజు నుంచి వాడు ఆకాశాన్ని జయించడం మొదలుపెట్టాడు. వాడి చేతిలో ఆకాశం జీనత్ అమన్ లాగా సిలుకు చీర తొడిగి ఆదివారం నలుపు, సోమవారం ఎరుపు, మంగళవారం పసుపు… ఇలా రంగురంగుల చీరలు తొడిగేది. గురువుగారి చేతిలో దీవింపబడ్డాక వాడికి తెలిపిన జ్ఞానము అంతా ఆకాశం నీలి రంగులో వుండును, మేఘావృతమైనపుడు బూడిదరంగుకు మళ్ళును, అనే. చేపలకు రెక్కలు వుండరాదు, పావురాలు ప్రెగ్నెంట్స్ కారాదు, ఆకులు ఆకుపచ్చలోనే వుండవలయును ఆకాశం రిఫ్లెక్షన్ కొట్టి నీలం రంగులొకి మళ్ళరాదు… ఇత్యాది ఇదీ అదీ. వీటికి భిన్నంగా ఏమి గీసినా పిల్లవాడి బర్లు కుళ్ళును. కళామతల్లి కంట వాటర్ కలర్ ఒలుకును.

కాబట్టి, ఓ నా ప్రియమైన తలిదండ్రులారా! మీరు పిల్లలకోసం, వాడి చిత్రకళ పరిమళించే ప్రావీణ్యం కోసం బెంగపడవలదు, మీరు కానీ మీరు వెతికి పట్టిన గురువులు కానీ ఇద్దరూ కలిసి బొమ్మలు వేయడం అనే వాడికి ఇష్టమైన ఆటని పాడుచేయవద్దు. మీకు మరీ అంత ఇదిగా ఉంటే మీరు చేయవలసినది అంతా వాడికి కళ్ళు నిండేలా అనేక రకాల ఆర్ట్ మెటీరియల్ కొనివ్వండి, రకరకాల కాగితాలతో వాడి ప్రపంచం నింపండి. చాలా ఈజీగా పరమ సులభంగా గీసిన చిత్రకారుల బొమ్మలు పుస్తకాలు కొనివ్వండి. అన్నిటి కన్నా ముఖ్యంగా వాడికి ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ కథలు చెప్పండి- ఎగిరే ఎలుకలు, పాడే పువ్వులు, పేద్ద మర్రిచెట్టు మీద మూడు సముద్రాలు, రాజుగారి మూడో భార్య నల్ల కుక్క మీద పెంచుకున్న పగ, చిన్న రాయి ఎత్తితే చిన్న తేలు కుట్టడం, పెద్దరాయి ఎత్తితే మండ్రగబ్బ కుట్టడం, మాంత్రికుడి ప్రాణాలు వున్న చిలుక జానపద రాకుమారుడి పెంపుడు పావురాయిని ప్రేమించడం…

ఇలా ఈ కథలు వినీ వినీ వాడు బొమ్మలు వేస్తూ వేస్తూ పెరిగి పెద్దయ్యి ఇరవై ఏళ్ళవాడయ్యాకా వాడికి ఒక గురువు అవసరమవుతాడు. అది కూడా ఎందుకంటే ఇక ఇది క్రాఫ్ట్ పెంచుకోవాల్సిన సమయం, అనాటమీ, బ్యాలెన్స్, కాంపోజిషన్, కన్‌ఫ్యూజన్ వీటితో తేల్చుకోవాల్సిన సమయం. టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ కూడా. బ్రతుకానందం జీవనోపాధిగా మారే సమయం, ఆడుతూ పాడుతూ వేస్తున్న బొమ్మల్ని కాస్త కుదురు నిలిపి గంటల తరబడి సాధన చేయవలసిన సమయం కూడా. బొమ్మ అనే దారి కూడలి పదులు ఇరవైలుగా రహదారులు చీలిన చోట నిలబడిన సమయం కూడా. వాడికి ఆ సమయంలో ఒక అవసర విషయజ్ఞానం పోందాల్సిన సమయంలో ఎలా? ఎవరూ? అని నిజంగా ఆలోచించవలసిన అవసరం ఏర్పడినపుడు బయట తలుపు చప్పుడు అవుతుంది. ప్రశాంతంగా ఆలోచించనివ్వకుండా ఎవర్రా అని విసుగుతో తలుపు తీస్తారా! అవతల ఒక మనిషి ఉంటాడు. ఎవరు కావాలి అని అడగండి. శిష్యుడి కోసం వచ్చా, నేను గురువును అంటాడు.

సశేషం…

ఇలా ఇరవయేళ్ళ కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో వాడిని ఏం చెయ్యాలో అది మళ్ళీ నెలల్లో మాట్లాడుకుందాం, ఉంటా. బయట ఎవరో తలుపు కొడుతున్నారు, గురువో! శిష్యుడో! చూస్తా.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...