మంచు

కురుస్తూంది మోహనంగా
మెరుస్తూంది తెల్లని వెలుగుల్లో
నిద్దరోతూంది నిబ్బరంగా నీడల్లో.

మట్టిరంగు ఆకుపచ్చ అంచు
పాలరంగు పట్టుచీర తెల్లటి తలంబ్రాలు
పెళ్ళికూతురు ప్రకృతి.

మంచు తివాచీ నేల
మైమరపు జగం
మోహరించిన మౌనం.

అడుగుపక్క అడుగు, జింకల జంట
రెక్కకింద రెక్క, గువ్వల గూడు
చలిలో వెచ్చదనం, జోగాడు కనులు
అలుపుకోరే విరతి.

చురుగ్గా కదలిక, పట్టుగా చిట్టిపాదాలు
గాలివాటం జారుడుబల్ల
రివ్వున దూకిన లేతప్రాణం, సుఖం
గూడుదాటిన తొలిపయనం.

కొత్త కొత్త ఆశలు, ఆకాశం హద్దు
అక్షింతల్లా మంచు కురుస్తూంది మోహనంగా
మెరుస్తూంది తెల్లని వెలుగుల్లో
నిద్దరోతూంది నిబ్బరంగా నీడల్లో.