గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2

(డిన్నరును ముగించిన పిమ్మట ప్రమదామణియైన సతీదేవి ‘వేద వాఙ్మయంలో ఏ మాత్రమున కనిపించని గణేశుడు పురాణకాలం నాటికి దేవ గణంబుల నాయకుడిగా ప్రఖ్యాతి పొందిన తెఱంగు తేటపడ వినం గుతూహలంబై యున్నది, వినిపింపు’మని యడిగిన సుఖాసీనుడైన సురేశ్వరుండు, గజముఖుడైన వినాయకుండు విఘ్ననాయకుండై దేవగణంబున జేరి గణాధిపతియైన కథాక్రమంబును ఈ ప్రకారంబుగా చెప్పదొడంగెను!)

వేదసాహిత్యంలో గణపతి

వేదసాహిత్యం అంటే నాలుగు వేదాలే కాదు, ఈ నాలుగు వేదాలలోని శ్లోకాల అర్థాన్ని వివరించడానికి తరువాతి కాలంలో వివిధ వేదపాఠశాలల్లో చెప్పుకున్న వ్యాఖ్యానాలను కూడా వేదవాఙ్మయంలో భాగంగానే పరిగణిస్తారు. బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు ఇవి వేదాలకు అనుబంధాలుగా వచ్చిచేరాయి.

వేదపాఠానికి తొలినాళ్ళలో రాసిన వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారు. ప్రతి వేదశాఖకు (పాఠశాలకు) సొంత బ్రాహ్మణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఋగ్వేద సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా చెబుతారు కాని, మనకు ఆరు బ్రాహ్మణాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఇందులో ఐతరేయ బ్రాహ్మణం అతి ప్రసిద్ధమైనది. అలాగే యజుర్వేద సంహితకు సంబంధించిన 12 బ్రాహ్మణాలు ఉన్నాయని చెబుతారు. ఇందులో కృష్ణ యజుర్వేదశాఖకు చెందిన తైత్తిరీయ బ్రాహ్మణం దక్షిణ భారతంలో అతి ప్రసిద్ధి చెందింది.

వివిధ కర్మ, యజ్ఞ కార్యాల అంతరార్థాలను ఇంకా విపులంగా వివరించేవి ఆరణ్యకాలు. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు మాత్రమే కాక పరబ్రహ్మ స్వరూపాన్ని లోతుగా చర్చించే ఉపనిషత్తులు తరువాతి కాలానికి చెందినవైనా వాటిని కూడా వేదసాహిత్యంలో భాగంగానే పరిగణిస్తారు. ఉపనిషత్తులు జ్ఞాన ప్రధానం. ఉపనిషత్తులు వేదానికి చివరివి కాబట్టి వాటిని వేదాంతం అని కూడా అంటారు.

వేదాలలో మరికొన్ని గణపతి స్తుతులు

క్రితం చెప్పినట్టు వేదాలలో అతి ప్రాచీనమైన ఋగ్వేదంలోని రెండవ మండలంలో కనిపించే ‘గణానాం త్వా గణపతిగ్ం’ (2.23.1) అన్న శ్లోకం బ్రహ్మణస్పతి సూక్తంలోనిది. ఈ శ్లోకంపై వ్యాఖ్యానం చేసిన బ్రాహ్మణాలన్నింటిలోనూ ఇది బ్రహ్మణస్పతి అయిన బృహస్పతి గురించిన శ్లోకం అనే వివరించారు. ఋగ్వేదంలోని ఇదే శ్లోకం యథాతథంగా కృష్ణయజుర్వేదానికి చెందిన తైత్తిరీయ సంహితలోనూ (2.3.14.3) కాఠక సంహితలోనూ (10.12.44) కనిపిస్తుంది. అయితే, శుక్లయజుర్వేద శాఖకు సంబంధించిన వాజసనేయి సంహితలో, కృష్ణయజుర్వేదానికి చెందిన మైత్రాయణీ సంహితలో (3.12.20) కొంత భేదంతో ఈ శ్లోకం కనిపిస్తుంది:

గణానాం త్వా గణపతిం హవామహే
ప్రియానాం త్వా ప్రియపతిం హవామహే
నిధినాం త్వా నిధిపతిం హవామహే వసో మమ
అహమజానీ గర్భధమా త్వమజాసి గర్భధం॥

గణములలో గణపతివి, ప్రియులలో ప్రియపతివి; నిధులకు నిధిపతివి; నాకు యజమానివి; హిరణ్య గర్భానివి; నాకు ఈ సృష్టి గర్భాన్ని అందజేయుము.

ఈ శ్లోకం అశ్వమేధయాగ సమయంలో ఉపయోగించే శ్లోకంగా మైత్రాయణీ సంహిత పేర్కొన్నది. స్పష్టంగా ఇది హిరణ్యగర్భుడిని (ప్రజాపతిని) ప్రార్థించే శ్లోకం, గజముఖుడైన గణపతి గురించి కాదు.

కృష్ణ యజుర్వేద సంహితాల్లో హస్తిముఖుని ప్రస్తావన

ఇదివరకు చెప్పినట్టుగా, ప్రధాన వేద మంత్రపాఠాలలో ఎక్కడా గజముఖుడైన గణపతి ప్రస్తావన కనిపించదు. అయితే, దీనికి ఒకే ఒక్క మినహాయింపుగా కృష్ణయజుర్వేద శాఖకు చెందిన మైత్రాయణీయ సంహితలో ఈ గాయత్రి శ్లోకం కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం:

తత్ కరాటాయ విద్మహే
హస్తిముఖాయ ధీమహి।
తన్నో దంతీ ప్రచోదయాత్॥ (మైత్రాయణీయ-సంహిత)

ఇది కచ్చితంగా గజముఖుడైన గణేశుని వర్ణించే శ్లోకమే అని చెప్పక తప్పదు. కరటి అంటే ఏనుగు లేదా ఏనుగు చెక్కిళ్ళు అన్న అర్థాలున్నాయి కదా. హస్తిముఖం అంటే మళ్ళీ ఏనుగు ముఖమనే అర్థం. దంతీ అంటే దంతము కలది అన్నది ఏనుగుకున్న పర్యాయపదాల్లో ఒకటి. హస్తి, దంతీ సంస్కృత పదాలైతే, కరాటి/కరటి అన్న పదం దేశ భాషలనుండి సంస్కృత భాషలోకి వచ్చి చేరిన పదమని కొంతమంది భాషావేత్తల అభిప్రాయం.

నిజానికి ఋగ్వేద సంహితలోని సూక్తాలు, మంత్రాలు ప్రాచీన దేవతలైన అగ్ని, ఇంద్ర, మిత్ర, వరుణ, సవితృ, ప్రజాపతి, బృహస్పతి, విష్ణు, ఆర్యమన్, వివస్వంత మొదలైన వారిని స్తుతించేవి. ఋగ్వేదంలో కనిపించే ఒకే ఒక్క గాయత్రి మంత్రం సవితృ దేవతను స్తుతించేది.

ఓం భూర్భువస్వః
తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి।
ధియోయోనః ప్రచోదయాత్॥

ఈ ప్రసిద్ధ గాయత్రి మంత్రాన్ని ఆధారం చేసుకొని తరువాత వచ్చిన వేదాలలో వివిధ దేవతలను స్తుతించే గాయత్రి మంత్రాలు సృష్టించబడ్డాయి. అనేక దేవతలను స్తుతిస్తూ ఈ గాయత్రి మంత్రాలలో విద్మహే, ధీమహి, ప్రచోదయాత్ అనే పదాలు ప్రతి మంత్రంలో వాడబడ్డాయి. ఉదాహరణకు విష్ణుగాయత్రి మంత్రం ఇలా సాగుతుంది:

ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణుః ప్రచోదయాత్

యజుర్వేద గాయత్రి మంత్రాల్లో బ్రహ్మ, విష్ణు, రుద్రులతో పాటు ఋగ్వేదంలో లేని దేవతలైన కాత్యాయని (దుర్గ), స్కంద, గౌరి, నారాయణ, భాస్కర మొదలైన కొత్త దేవతలను స్తుతించే గాయత్రి మంత్రాలు కూడా మనకు కనిపిస్తాయి.

మైత్రాయణీయ సంహిత మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరి వేదపాఠశాలకు సంబంధించిన కృష్ణ యజుర్వేదశాఖ. దీని సంహిత తొలిరూపం దాదాపు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటిదని ఒక అంచనా. ప్రస్తుతం లభ్యమౌతున్న కృష్ణయజుర్వేద సంహితాలలో దీన్ని ప్రాచీనమైనదిగా పరిగణిస్తారు.

అయితే, కృష్ణయజుర్వేద శాఖకే చెందిన ఇతర యజుర్వేద సంహితాల్లోను, శుక్ల యజుర్వేద సంహితాల్లోనూ ఈ హస్తిముఖ గాయత్రి శ్లోకం కనిపించదు. కాబట్టి చాలామంది పండితులు ఈ శ్లోకాన్ని ప్రక్షిప్తంగానే పరిగణిస్తారు. ఉదాహరణకు ఆంధ్రదేశంలో దొరికిన తైత్తిరీయ సంహితలో ఈ శ్లోకం లేదు. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆంధ్రదేశపు తైత్తిరీయ సంహితలోని గ్రాయత్రీ శ్లోకాల్లో మైత్రాయణీయ సంహితలో కనిపించని నరసింహ స్తుతి కనిపిస్తుంది. నరసింహుడిని స్తుతించే గాయత్రి మంత్రం ఇలా సాగుతుంది:

వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి।
తన్నో నృసింహః ప్రచోదయాత్॥ (తైత్తిరీయ సంహిత-ఆంధ్ర)

అంటే ఈ యజుర్వేద శాఖలు తమ స్తోత్రపాఠాలలో స్థానికంగా ఉన్న గ్రామదేవతలకు చోటు కల్పించే ప్రయత్నం ఆ రోజుల్లో జరిగిందని మనం ఊహించవచ్చు. గజముఖుడైన దేవునికి మహారాష్ట్రంలో ప్రాతినిధ్యం ఉంటే, ఆంధ్రదేశంలో సింహముఖుడైన నరసింహుడిని కొలిచేవారేమోనని ఊహించడం సత్యదూరం కాదేమో. స్కాంద పురాణంలో కనిపించే గుర్రం తలతో ఉన్న హయగ్రీవుడు, జంతువుల తలతో ఉన్న దైవరూపాలకు మరో ఉదాహరణ.

అయితే తైత్తిరీయ సంహిత మరో ప్రతి పూణె లోని ఆనందాశ్రమంలో దొరికింది. ఇందులో హస్తిముఖ గాయత్రి శ్లోకం లేదు కానీ, ఆంధ్ర తైత్తిరీయ సంహితలో నందీ గాయత్రి స్థానంలో వక్రతుండుడిని స్తుతించే శ్లోకం ఉంది:

తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి।
తన్నో దంతీ ప్రచోదయాత్॥ (తైత్తిరీయ సంహిత-ఆనందాశ్రమ)

అయితే వ్యాఖ్యానంతో సహా 19200 పద్య, గద్యాలున్న ఈ కృష్ణయజుర్వేద సంహితంలో ఒకే ఒక్క గాయత్రి శ్లోకం మాత్రమే గజముఖుడైన గణపతి గురించి ప్రస్తావిస్తుంది. అంతేకాక, యజుర్వేదంలోని శాంతి మంత్రాల్లో బ్రహ్మ, విష్ణు, రుద్రులతో పాటు మిగిలిన దేవతలకు సంబంధించిన శాంతి మంత్రాలు కనిపిస్తాయి కాని, గణేశుడిని శాంతింపజేసే శాంతి మంత్రం ఏ సంహిత పాఠాల్లోనూ కనిపించదు. ఈ కారణాలవల్ల మైత్రాయణీయ సంహితంలోనూ, తైత్తిరీయ సంహిత (ఆనందాశ్రమ)లోనూ కనిపించే ‘గణేశ’ స్తోత్రాలు ప్రక్షిప్తమని చెప్పకోవచ్చు.

యజుర్వేదం తరువాతి కాలం నాటిదయిన అథర్వవేదంలో కూడా ఎక్కడా గజముఖుడైన గణేశుని ప్రస్తావన కనిపిచకపోవడం వల్ల కూడా గణేశుడు వేదకాలంలో వైదిక దేవతల్లో ఒకడుగా పరిగణింపలేదని చెప్పడానికి వీలు కల్పిస్తుంది.

వేర్వేరు యజుర్వేద గాయత్రి మంత్ర పాఠాల్లో భేదాలుండడం, ఒక్క గాయత్రి మంత్రభాగంలో తప్ప మిగిలిన యజుర్వేద సంహితలో మరెక్కడా గణేశుడు కనిపించకపోవడం, శాంతిమంత్రాల్లో గణేశున్ని శాంతింపజేసే మంత్రం లేకపోవడం; అథర్వవేదంలో గణేశుని ప్రస్తావన లేకపోవడం వంటి ఆధారాలను బట్టి గణేశుడు యజుర్వేదకాలం నాటికి కూడా వేద సాహిత్యంలో భాగం కాదని, ‘హస్తిముఖ’, ‘వక్రతుండ’ గాయత్రి మంత్రం తరువాతి కాలంలో ప్రక్షిప్తంగా జతచేయబడిందని పండితుల వాదన.

ఇతిహాసాల్లో గణపతి

రామాయణంలో లేని గణేశుడు

ఆది కావ్యంగా కీర్తించబడ్డ వాల్మీకి రామాయణంలో ఎక్కడా గజముఖుడైన గణేశుని ప్రస్తావన కనిపించదు. అయితే, ప్రస్తుతం మనం వినాయకుని సోదరునిగా పరిగణించే కుమారస్వామి ప్రస్తావన మాత్రం బాలకాండలో కనిపిస్తుంది. అయితే, ఇక్కడ స్కందుడైన కుమారస్వామిని అగ్నికి కుమారునిగా వర్ణించడం విశేషం:

అనుయాతౌ శ్రియా దీప్తౌ శోభయేతామ్ అనిన్దితౌ।
స్థాణుమ్ దేవమ్ ఇవ అచిన్త్యమ్ కుమారౌ ఇవ పావకీ॥ (బాల 1-22-8)

విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు నడచి వెళ్తూవుంటే వారిద్దరూ అగ్ని కుమారులైన స్కందుడు, విశాఖుడు స్థాణువు (శివుడు) వెంట నడిచి వెళ్తున్నట్టు అనిపిస్తున్నది.

అంటే రామాయణ కాలం నాటికి స్కందుడు వినాయకుని సోదరుడన్న ఊహ లేదు. అంతేకాక స్కందుడు శివుని కుమారుడిగా కాక అగ్నిపుత్రునిగా ఇక్కడ వర్ణింపబడటం గమనార్హం. ఇతిహాస పురాణ కథల ఆధారంగా చూస్తే స్కందుడు గణేశుని కంటే ప్రాచీనమైన దేవుడు. స్కందుని పుట్టుపూర్వోత్తరాల గురించి రాయాలంటే మరో పెద్ద వ్యాసమే అవుతుంది కానీ, వాల్మీకి రామాయణంలో మాత్రం గజముఖుడైన వినాయకుని ప్రస్తావన లేదని కచ్చితంగా చెప్పవచ్చు.

మహాభారతంలో గణపతి

మహాభారత రచన అనగానే చాలామందికి వ్యాసుడు మౌఖికంగా చెబుతూ ఉంటే గణపతి లేఖకుడిగా రాసే దృశ్యం తలపుకు వస్తుంది. మనకు తెలిసిన కథ ప్రకారం, వ్యాసుడు భారతం రాయాలనుకున్నాడు. లేఖకుడిగా ఉండమంటూ వినాయకుడి సాయం కోరతాడు. ఓ మానవ ఋషి చెప్పేది రాయడమేంటి అని మొదట ఆలోచిస్తాడు వినాయకుడు. చివరకు ‘నా ఘంటం ఆగిపోని వేగంతో చెబితేనే రాస్తాను’ అంటూ చిన్న షరతు పెడతాడు. వ్యాసుడు కూడా ‘నేను చెప్పేది సంపూర్ణంగా అర్థం చేసుకుని మాత్రమే రాయాలి’ అంటాడు. అలా వ్యాసుడు భారతం చెప్పడం మొదలుపెడితే వినాయకుడు తన దంతాన్ని పెకిలించి ఘంటంగా మార్చుకుని రాయడం మొదలుపెడతాడు. ఫలితంగా ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాల మేళవింపుతో మహాభారతం రూపుదిద్దుకుంది.

అయితే, గణపతి లేఖకుడిగా ఉండే కథ అన్ని మహాభారత ప్రతుల్లో కనిపించదు. నిజానికి మన భారతదేశంలో సంస్కృత మహాభారతానికి వేలకొలది ప్రతులు దేశమంతటా దొరుకుతాయి. అయితే, ఉత్తరభారతంలో నాగరి లిపిలో దొరికే మహాభారత ప్రతికీ దక్షిణభారతంలో దొరికే భారతప్రతికీ శ్లోకాల సంఖ్యలోనూ అమరికలోనూ విభేదాలు కనిపిస్తాయి. అలాగే శారదా, నేపాలీ, మైథిలి, బెంగాలీ అంటూ దేశమంతటా దొరికే ప్రతులను ఒకదానితో ఒకటి పోలిస్తే ఎన్నో విభేదాలు, ప్రక్షిప్తాలు కనిపిస్తాయి. విష్ణు సీతారామ్ సుక్తాన్కర్ అనే సంస్కృత పండితుని నాయకత్వంలో భండార్కర్ ప్రాచ్య పరిశోధనా సంస్థ (The Bhandarkar Oriental Research Institute) ఆధ్వర్యంలో భారతదేశంలో పలుచోట్ల లభించే మహాభారత ప్రతులను సేకరించి, ఒక్కో శ్లోకాన్ని అనేక ప్రతులలో తులనాత్మకంగా విశ్లేషించి, వాటి ద్వారా శుద్ధి చేయబడిన ఒక మహాభారత ‘మార్జిత’ ప్రతిని (critical edition) తయారుచేశారు. అయిదు దశాబ్దాల దాకా సాగిన ఈ మహాయజ్ఞంలో ఎంతోమంది సంస్కృత పండితులు పాల్గొని దాదాపు 1300 దాకా ప్రతులను విశ్లేషించారు.

అలా ఆ భండార్కర్ సంస్థ వారు ప్రచురించిన ‘మార్జిత’ ప్రతిలోని ఆదిపర్వంలో వ్యాసుడు గణపతిని లేఖకుడిగా ఉండమని అర్థించే కథ లేదు. ఎందుకంటే నాగరి లిపిలో ఉండే ఒక భారత ప్రతిలో కావ్యస్య లేఖనార్థాయ గణేశః స్మర్యతాం మునే (1-1-109) అంటూ మొదలుపెట్టి ఎనిమిది శ్లోకాలుగా సాగే కథ ఇతర ప్రతుల్లో కనిపించదు. ఉదాహరణకు ఆంధ్రదేశంలో తెలుగు లిపిలో దొరికిన మహాభారత ప్రతులలో ఈ కథ లేదు. (నన్నయ్య రాసిన తెలుగు భారతంలో కూడా ఆదిపర్వంలో లేఖకుడైన గణపతి కథ కనిపించదు.) అంతేకాక, ఉత్తరభారతంలోనే దొరికిన సంస్కృత మహాభారత ప్రతులలో ముఖ్యమైన శారదా, నేపాలీ, మైథిలి, బెంగాలీ ప్రతులలో ఎక్కడా ఈ వ్యాస గణేశుల కథ కనిపించదు. అయితే, తమిళనాడులోని కుంభకోణంలో దొరికిన మహాభారత ప్రతుల్లో ఈ కథ ఉంది. ఎక్కువ ప్రతుల్లో ఈ కథ లేకపోవడం వల్ల ఈ కథ తరువాతి కాలంలో జతచేసిన ప్రక్షిప్తమేనని ఈ పండితులు నిర్ణయించారు.

ఈ కథను వదిలేస్తే, మహాభారతంలో గణపతిగా, గణేశునిగా చాలా చోట్ల శివుడిని వర్ణించే శ్లోకాలు కనిపిస్తాయి. అంతేకాక మహాభారతంలో దక్షప్రోక్తశివ-సహస్రనామ స్తవంలో శివునికి ఉన్న సహస్రనామాలలో గణాధిప, గణేశ్వర, గణాధ్యక్ష, గణకార, గణకర్తృ, గణపతి మొదలైన పేర్లన్ని కనిపిస్తాయి. ఒకే ఒక్క చోట మాత్రం విష్ణువును గణేశ్వర అని స్తుతించడం కనిపిస్తుంది (13.135.79).

కొన్ని ప్రతుల్లో వినాయక అన్న పదం బహువచనంలో (వినాయకులు) అన్న అర్థంలో వాడడం కనిపిస్తుంది. మచ్చుకు శాంతిపర్వంలోని ఈ శ్లోకం చూద్దాం:

అనేనైవ తు దేహేన గణానాం సమతామ్ వ్రజేత్
తేజసా యశసా చైవ యుక్తో భవతి నిర్మలః
నా రాక్షసాః పిశాచాః వా న భూతాః న వినాయకాః
విఘ్నం కుర్యుగృహే తస్య యాత్రాయమ్ పఠ్యతే స్తవః

ఇక్కడ వినాయకులను రాక్షసులు, పిశాచాలు, భూతాలతో పాటు పేర్కొంటూ ఈ భూత, పిశాచ, వినాయక, రాక్షస గణాలు సృష్టించే విఘ్నాలను ఈ స్తవం పఠించడం ద్వారా నివారించవచ్చు అని ఈ శ్లోకం చెబుతుంది.

వినాయకులు అని బహువచన రూపంలో కనిపించే ఇంకో శ్లోకం అనుశాసనపర్వంలోనిది:

నందీశ్వరో మహాకాయో గ్రామిణీ వృషభధ్వజః
ఈశ్వరాః సర్వలోకానాం గణేశ్వర వినాయకాః

సర్వలోకాలకు ఈశ్వరుడు అయిన శివుడు నంది, మహాకాయ, గ్రామిణీ, వృషభధ్వజుడు, వినాయకులు మొదలైన గణాలకు అధిపతి.

అంటే ఇక్కడ గణేశ్వరుడు శివుడు. వినాయకులు అనేవారు ఆయన అనుచరులైన పెక్కుమంది గణాలలో కొంతమంది. (భవస్య అనుచరః అని తరువాతి శ్లోకంలో ఉంది.) అయితే, ఈ రెండు శ్లోకాలను కూడా ప్రక్షిప్తాలుగానే పరిగణించి మహాభారత శుద్ధప్రతిలో చేర్చలేదు.

మహాభారత శుద్ధప్రతిలో గజముఖుడైన గణేశుడు కానీ వినాయకుడు కానీ కనిపించరు. ప్రక్షిప్త శ్లోకాలలో కూడా వినాయకులు అనే వారు శివుడిని అనుసరించి ఉండే పెక్కు గణాలలో కొందరు అని మాత్రమే మనకు తెలుస్తుంది. మరోచోట వినాయకులను రాక్షస, పిశాచ, భూత గణాలతో పాటు పేర్కోవడం గమనార్హం. ఏది ఏమైనా మహాభారత రచనాకాలం నాటికి గజముఖుడైన వినాయకుడు దేవుడిగా, శివుని పెద్దకొడుకుగా స్థానం సంపాదించుకోలేదనే చెప్పాలి.

వినాయకుడు: విఘ్నకర్తా? విఘ్నహర్తా?

పైన చెప్పిన భారతంలోని ప్రక్షిప్తాల కాలం మనకు తెలియదు కానీ, వినాయకుల గురించిన వర్ణనలు మనకు మానవగృహ్య సూత్రాల్లోనూ (క్రీ.పూ. 5శ.) ఆ తరువాత యాజ్ఞవల్క్య స్మృతి (క్రీ.శ. 3శ.) లోనూ కనిపిస్తాయి. అయితే, ఈ వర్ణనల్లో వినాయకులు(బహువచనం) విఘ్నాలను తొలగించే నాయకులుగా కాక ప్రతినాయకులుగా, విధ్వంసకులుగా, విఘ్నకారకులుగా వర్ణింపబడటం విశేషం.

మానవగృహ్య సూత్రాల్లో వినాయక ఖండం

గృహ్య సూత్రాలలో ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళకు, ఉపనయనాలకు, ఇతర గృహ సంబంధమైన షోడశ కర్మలకు అవసరమైన మంత్రాలు, సూచనలు ఉంటాయి. అయితే, మానవగృహ్య సూత్రంలో మనకు నలుగురు వినాయకుల గురించి వివరించడానికి ఒక పూర్తి ఖండమే కనిపిస్తుంది (2.14). ద్వితీయ అధ్యాయంలోని చతుర్దశ ఖండంలో ఉన్న 38వచనాలు ఈ వాక్యాలతో ప్రారంభమౌతాయి:

అథాతో వినాయకాన్ వ్యాఖ్యాస్యామః
శాలకటంకటశ్చ కూష్మాండరాజపుత్రశ్చోస్మితశ్చ దేవయజనశ్చేతి
ఏతైరధిగతానామిమాని రూపాణి భవంతి

ఈ ఖండం ప్రకారం నలుగురు వినాయకుల పేర్లు: శాలకటంకటడు, కూష్మాండరాజపుత్రుడు, ఉస్మితుడు, దేవయజనుడు. ఈ ఖండం వారి భయంకరమైన ఆకారాల గురించి, వారు పెట్టే బాధలను వర్ణించి, ఆ బాధలను నివారించడానికి ఏ విధంగా ఈ వినాయకులను శమింపజేయాలో వివరిస్తుంది. అయితే ఇందులో ఈ వినాయకులకు గణేశునితో సంబంధం కనిపించదు. శివపార్వతుల ప్రసక్తి కూడా ఏమాత్రం ఉండదు.

యాజ్ఞవల్క్య స్మృతిలో వినాయకుని ప్రస్తావన

సంస్కృత వాఙ్మయచరిత్రలో శ్రుతిసాహిత్యంగా పరిగణించబడే వేదసాహిత్యం తరువాత వెలువడిన సాహిత్యాన్ని స్మృతి సాహిత్యం అని పిలుస్తారు. శ్రవణం అంటే వినడం, కావున శ్రుతి అంటే వినబడినది అని అర్థం. స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవడం, కాబట్టి స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోబడినది అని అర్థం. శ్రుతుల్లో చెప్పిన విషయాల స్ఫూర్తితోనే సమాజానికి మార్గనిర్దేశం చేయడం, ఆచారవ్యవహారాల గురించి, ధర్మాధర్మాల గురించి చెప్పిన పుస్తకాలు స్మృతులు. యాజ్ఞవల్క్య స్మృతి, నారదస్మృతి, మనుస్మృతి మొదలైనవి స్మృతిసాహిత్యానికి కొన్ని ఉదాహరణలు.

యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పిన వినాయకులు ఆరుగురు. మానవగృహ్య సూత్రాల్లో చెప్పబడిన నలుగురు పేర్లలో శాలకటంకటడు పేరును శాలుడు, కంటకుడు అని రెండు పేర్లుగా, కూష్మాండరాజపుత్రుడు అన్న పేరును కూష్మాండుడు, రాజపుత్రుడు అని మరో రెండు పేర్లుగా విడదీసి మొత్తం ఆరుగురి పేర్లు యాజ్ఞవల్క్య స్మృతిలో కనిపిస్తాయి.

అయితే, ఈ ఆరు పేర్లు ఆర్వాచీనంగా అనిపిస్తాయి. ఇతర భాష్యాల్లోను, పురాణాల్లోనూ మానవగృహ్య సూత్రాల్లో చెప్పబడిన నాలుగు వినాయకుల పేర్లే కనిపిస్తాయి. విష్ణుధర్మోత్తర పురాణంలో కూడా ఈ నలుగురు వినాయకుల పేర్లు ఉండడమే కాకుండా, ఈ నలుగురి తల్లి అంబిక అన్న వివరణ కూడా కనిపిస్తుంది. అయితే, వాజసనేయ సంహితలో అంబిక రుద్రునికి చెల్లెలు. పురాణ కాలం వచ్చేసరికి అంబిక పార్వతికి మరో పేరుగా, శివునికి భార్యగా మారిపోతుంది. అయితే, స్కాంద పురాణంలో విఘ్ననాశకులైన వినాయకులు ఆరుగురని పేర్కొవడం మరో ఆసక్తికరమైన విషయం.

యాజ్ఞవల్క్య స్మృతిలో ఈ వినాయకుల దుశ్చర్యలను ఇంకా విపులంగా వివరిస్తారు. ఈ వినాయకులు యజ్ఞకర్మలు చేయకుండా అడ్డుకుంటారని, శిష్యులను అధ్యయనం చేయకుండా అల్లరి చేస్తారని ఈ శ్లోకాలు వివరిస్తాయి. వారికి కోపం వస్తే మనుష్యులపై పూని వారిని హింసిస్తారని ఈ రెండు స్మృతులు స్పష్టంచేస్తాయి.

ఈ రెండు రచనల్లోనూ వినాయకులను శాంతింపజేయడానికి బలి తప్పనిసరి అని సూచిస్తారు. జంతుమాంసంతో పాటు సుర (కల్లు) కూడా అందజేయాలని, ఆపై తమ తప్పులకు ప్రాయశ్చిత్త పడుతున్నట్టుగా చూపిస్తే వినాయకులు శాంతించి కరుణిస్తారని ఈ స్మృతులలో వివరణ ఉంటుంది.

కొన్ని మనుస్మృతి ప్రతులలో “శూద్రానాంచ గణనాయకః” అంటూ శూద్రులకు దేవుడు గణనాయకుడని చెప్పే ఒక శ్లోకం కనిపిస్తుంది. అయితే, పండితులు దీన్ని ప్రక్షిప్తంగానే పరిగణిస్తారు కాబట్టి, మనుస్మృతి శుద్ధప్రతి (critical edition)లో ఈ శ్లోకం భాగం కాదు.

పురాణాల్లో గణేశుడు

పురాణము అంటే పురాతనమైనది. పురా- అంటే పాత, అంతకుముందు- అన్న అర్థాలున్నాయి. పురాణదంపతులు అంటే ఆదిదంపతులు. పురాణపురుషుడు అంటే ప్రాచీన పురుషుడు. ప్రాచీనమైన పాత కథలను తిరిగి గుర్తుతెచ్చుకొనే కథలు కాబట్టి పురాణాలు కూడా స్మృతి సాహిత్యం కిందికే వస్తాయి.

మహాపురాణాలుగా పేరుపొందిన అష్టాదశ పురాణాల రచన గుప్త యుగంలో (క్రీ.శ.300-550) ఆరంభం అయినట్టుగా పండితుల ఊహ. మనం ఇప్పుడు హిందూమతంలో భాగంగా భావిస్తున్న దేవతలు, వారి మధ్య సంబంధాలు, వారి లీలలను వర్ణించే ఎన్నో ఆసక్తికరమైన కథలు చాలావరకూ మనకు ఈ 18 పురాణాల ద్వారానే స్థిరత్వాన్ని పొందాయి. అయితే, విజ్ఞానసర్వస్వాలుగా మారిన ఈ పురాణాలు దాదాపు క్రీ.శ. 1400 సంవత్సరాల దాకా ఎన్నో మార్పులు, చేర్పులతో, ప్రక్షిప్తాలతో వృద్ధిచెందుతూనే వచ్చాయి. కొన్ని పురాణాలకు, ఉపపురాణాలకు 17వ శతాబ్ది దాకా కూడా మార్పులు, చేర్పులు జరుగుతున్నట్టు మనం నిరూపించగలము.

పురాణయుగం కన్నా ముందు మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు అన్న భావన కనిపించదు. అలాగే, పురాణాల కన్నా ముందు మనకు విష్ణువు దశాతారాల వర్ణన కనిపించదు. ఉదాహరణకు భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడా తాను విష్ణువు అవతారమని చెప్పుకోలేదు. భగవద్గీతలో విష్ణువు ప్రస్తావన ఒకే ఒక్క సారి వస్తుంది: ఆదిత్యానామ్ అహం విష్ణుః (10.21). మృగములలో సింహమును నేను; దేవతలలో ఇంద్రుడను నేనే; రుద్రులలో శంకరుడును నేనే; అని చెప్పిన శ్లోకాలలోనే ఆదిత్యులలో విష్ణువును నేనే అని అంటాడు తప్ప, తాను విష్ణువు అవతారమని గీతలో ప్రత్యేకంగా ఎక్కడా చెప్పలేదు.

రుద్రుడు, శివుడు, శంకరుడు ఒకే దేవుడుగా కలిసిపోవడం; స్కందుడు, విశాఖుడు, కుమారస్వామి, సుబ్రహ్మణస్వామి ఒకే దేవుని రూపాలుగా మారిపోవడం; రాముడు, కృష్ణుడు, పరశురాముడు మొదలైన వ్యక్తులు విష్ణువు అవతారాలుగా గుర్తింపు పొందడం- ఇవన్నీ మనకు ఈ పురాణ కథల ద్వారానే సిద్ధించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా గుర్తింపు పొందడం; ఈ త్రిమూర్తుల సరసన సరస్వతి, లక్ష్మి, పార్వతి భార్యలుగా మారటం అంతా పురాణ యుగంలోనే జరిగింది. వైదిక సాహిత్యంలో ప్రముఖ దేవతలైన వరుణ, మిత్ర, ఆర్యమస్, సవితృ, ప్రజాపతి, ఆర్యమన్, అంశ, వివస్వంత, సోమ మొదలైన వారంతా ఈ పురాణాల్లో దాదాపు కనుమరుగైపోయారు. ఋగ్వేదంలో దేవతలకు అధిపతిగా, దేవతలందరిలోనూ అతిముఖ్యుడిగా కనిపించే ఇంద్రుడు పురాణకాలానికి తన ప్రాముఖ్యాన్ని పూర్తిగా కోల్పోవడం విశేషం.

అలాగే అంతకు ముందు సాహిత్యంలో విఘ్నకారకులుగా, దుష్టులైన భూతగణాలతోపాటు వర్ణించబడ్డ వినాయకులు చివరకు ఒకే వినాయకుడి రూపు దాల్చడం, ఆ వినాయకుడు గజముఖుడైన గణేశునితో విలీనం చెందడం, గణేశుడు పార్వతి పుత్రుడిగా, స్కందుని సోదరుడిగా శివపార్వతుల కుటుంబంలో చేరిపోవడం– ఈ కథనాలన్నీ పురాణాల్లోనే కనిపిస్తాయి.

గణేశుడైన గణపతి ప్రస్తావన శైవ పురాణాలైన లింగ, స్కాంద, అగ్ని పురాణాల్లో కనిపిస్తే, వైష్ణవ పురాణాలైన విష్ణుపురాణంలోనూ భాగవతంలోనూ గణేశుని ప్రసక్తి ససేమిరా కనిపించదు. అయితే, పద్మ పురాణంలో గాణపత్య తెగల గురించిన చర్చ కనిపిస్తుంది. బ్రహ్మ, భవిష్య, బ్రహ్మాండ, వామన పురాణాల్లో కూడా గణేశుని ప్రస్తావన పృథక్కుగా కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణంలో 42 అధ్యాయాలతో సాగే గణపతిఖండం పూర్తిగా గణేశుని గురించిన వివిధ కథలను విపులంగా వివరిస్తుంది.

ఇవి కాక అనేక ఉపపురాణాల్లో గణేశుని ప్రస్తావన కనిపిస్తుంది. ఇందులో రెండు ఉపపురాణాలు పూర్తిగా గణేశుని నిమిత్తం రాసినవి. గణేశుడే సర్వజగత్తుకు మూలాధారమని కీర్తించే గణేశ పురాణం రెండు ప్రధాన ఖండాలుగా విభజింపబడి ఉంది: 92 అధ్యాయాలతో ఉపాసనఖండం మొదటి ఖండం, 155 అధ్యాయాలతో క్రీడాఖండం రెండవ ఖండం. భగవద్గీత లాగా, 11 అధ్యాయాల గణేశ గీత గణేశ పురాణంలోని రెండవ ఖండంలో 138వ అధ్యాయం నుండి 148వ అధ్యాయం దాకా ఉంటుంది. వినాయకుడే పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించే ముద్గల పురాణంలో గణేశునికి 8 అవతారాలుగా పేర్కొంటూ, ఒక్కో అవతారానికి సంబంధించిన కథలను విపులంగా వివరించడంతో ఇది తొమ్మిది ఖండాలతో 428 అధ్యాయాలతో గణేశ పురాణం కంటే చాలా పెద్దదిగా తయారయ్యింది.

అయితే, ఈ పురాణాల్లోని గణేశుని కథల్లో బోలెడంత వైవిధ్యం, వైరుధ్యం కనిపిస్తుంది. ఈ పురాణాల్లో గణేశునికి సంబంధించిన కొన్ని ప్రధానమైన ఘట్టాలకు సంబంధించిన కథల్లో కనిపించే వైరుధ్యాలను వివరంగా విశ్లేషిద్దాం!

గణేశుని జననం

పురాణ సాహిత్యంలో మనకు గణేశుని జననం గురించి ఎన్నో రకాల కథలు కనిపిస్తాయి. కొన్ని కథల్లో గణేశుడిని శివుడు సృష్టిస్తాడు. మరి కొన్ని కథల్లో పార్వతీదేవి వినాయకుణ్ణి తయారుచేస్తుంది. కొన్ని కథల్లో మాత్రమే గణేశుడు శివపార్వతులకు పుట్టిన పుత్రుడు. మరి కొన్ని పురాణాల్లో గణేశుడు స్వయంభువు.

లింగపురాణంలో దేవతల కోర్కె మేరకు దైత్యులకు విఘ్నాలు కలిగించడానికి (విఘ్నార్థన్ విఘ్నాయ) ఇభాననుడైన (గజముఖుడైన) గణేశ్వరుడిని శివుడు సృష్టిస్తాడు. వరాహపురాణంలో (23.4) కూడా పార్వతి ప్రమేయం లేకుండా రుద్రుడు తన నవ్వు (హసితం) ద్వారా గణేశ్వరున్ని సృష్టిస్తాడు. వరాహపురాణంలో రుద్రుడు సృష్టించిన వినాయకుడు ప్రచండ రూపం కలవాడని, క్రూరదృక్కులు కల ఆ బాలకుడు విఘ్నకారకుడని, ఆ వినాయకుడు కలిగించే విఘ్నాలు తొలగాలంటే ‘ఆవిఘ్నవ్రత’ మాచరించి వినాయకుడిని శాంతింపజేయాలని ఉంటుంది (23.28-29, 59.1-4).

వామన పురాణంలో శివుడు, పార్వతి మహామోహంతో గడుపుతున్నప్పుడు వారికి పుత్రుడు జన్మిస్తే అతడు మహాశక్తిమంతుడు అవుతాడని దేవతలు భయపడతారు. ఇంద్రుడు తన ఇంద్రపదవికి ముప్పు వాటిల్లుతుందని శివుని రేతస్సును అగ్ని హరించేటట్టుగా చేస్తారు. పుత్రుడు కలగలేదని బాధపడుతున్న పార్వతి (నిషిదస్తు పుత్రోత్పత్తిమ్ తవ ఉదరాత్) తన శరీరంపైనుండి తీసిన నలుగుపిండితో గజముఖుడైన ‘మలపురుషు’డిని తయారు చేస్తుంది. ఆ బాలకుడు నాయకుని (భర్త) ప్రమేయం లేకుండా పుట్టాడు కాబట్టి, “నాయకేన వినా దేవీ త్వభూతోపి పుత్రకః (28.71)” అతని పేరు వినాయకుడని శివుడు తన కొడుకుగా స్వీకరిస్తాడు.

శివ పురాణంలో కూడా పురుషుని ప్రమేయం (పురుషం నిర్మమౌ) లేకుండా పార్వతి తన శరీరపు మైల నుండి (మల సంభవం) గణపతిని సృష్టించింది అని కనిపిస్తుంది. బ్రహ్మాండ పురాణంలోని లలితా మాహాత్మ్యంలో దుర్గారూపిణి అయిన లలిత రాక్షసులతో యుద్ధం చేయడానికి తన నోటిద్వారా గజాననుని సృష్టిస్తుంది.

పద్మ పురాణంలోని సృష్టిఖండంలో హాస్యానికి (హాస్యాత్) ఒంటిమీద మైలతో బొమ్మను తయారుచేసి, తాను గంగానదిలో స్నానం చేస్తుండగా పవిత్రమైన గంగాజలం తాకి ఆ బొమ్మకు ప్రాణం వస్తుంది. అతడిని పార్వతి పుత్రుడిగా స్వీకరించింది. గంగ తాకడం వల్ల ప్రాణం పోసుకొన్నాడు కాబట్టి దేవతలు అతన్ని గాంగేయుడని స్తుతిస్తారు.

బ్రహ్మవైవర్త పురాణంలో గణేశుడిని కృష్ణుని అవతారంగా వర్ణించడం కనిపిస్తుంది. కృష్ణుని రూపం చూసి ఇష్టపడ్డ పార్వతి తనకూ అలాంటి పుత్రుడు కావాలని కోరుకొంటుంది. ఆ కోర్కెతో ఆమె పుణ్యకవ్రత మాచరించినప్పుడు కృష్ణుడు శివుని రేతస్సు రూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి గణేశుడిగా ఉద్భవిస్తాడు.

స్కాంద పురాణంలో దాదాపు ఇప్పుడు మనకు ప్రాచుర్యంలో ఉన్న కథ కనిపిస్తుంది. వినోదార్థం తన శరీరపు లేపనాలతో బొమ్మను తయారుచేసి పార్వతి తన శక్తితో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. గణేశ పురాణంలో మాత్రం శివపార్వతుల సంయోగం వల్ల శివుడు కరుణిస్తే పార్వతి గర్భం దాల్చి గణేశునికి జన్మనిస్తుంది.

ఇక ముద్గల పురాణంలో గణపతికి శివపార్వతులతో ఏ సంబంధం లేదు. ఈ పురాణంలో వినాయకుడు స్వయంభువు, పరబ్రహ్మ స్వరూపం. ఇంతకుముందు చెప్పినట్టు ఈ పురాణంలో గణేశుని ఎనిమిది అవతారాలను వర్ణించడం ప్రధానమైన విషయం.

గణేశుని జననంపై వివిధ పురాణాల్లో వైరుధ్యం ఉన్నా, పార్వతి తయారుచేసిన బొమ్మే గణేశుడిగా ఉద్భవించాడన్నది పలు పురాణాల్లో కనిపించే సామాన్య అంశం. పురాణాల కంటే ముందు యాజ్ఞవల్క్య స్మృతిలో గణేశుని జనని అంబిక అని తల్లిపేరు మాత్రమే ప్రస్తావించడం విశేషం.

వినాయకుడు గజముఖుడు ఎలా అయ్యాడు?

వినాయకునికి ఏనుగు తల ఎలా వచ్చింది అన్న అంశంపై కూడా వివిధ పురాణాల్లో పరస్పర విరుద్ధమైన కథనాలు కనిపిస్తాయి. వామన పురాణంలో గణేశుడు పుట్టడమే ఏనుగు తలతో పుట్టాడు– మలాచ్చక్రే గజాననమ్ (28.58). బ్రహ్మవైవర్త పురాణంలో శని క్రూరదృక్కుల వలన అప్పుడే పుట్టిన బాలుని తల తెగిపడిపోయింది. విష్ణువు వెంటనే గరుడ వాహనమెక్కి ఉత్తరదిశకు వెళ్ళి అప్పుడే శృంగార కేళిలో పాల్గొని అలసిపోయిన గజరాజు తల ఖండించి దాన్ని గణేశునకు అతికిస్తాడు.

స్కాంద పురాణంలో గణేశుడు పరాశక్తికి ఉద్భవించినవాడు. గజారూఢుడై శివునితో యుద్ధం చేసి ఓడిపోతాడు. శివుడు అతని తలను, అతని వాహనమైన సిందూర అనే ఏనుగు తలను ఖండిస్తాడు. అప్పుడు పరాశక్తి శివుణ్ణి వేనోళ్ళ స్తుతించి, తన పుత్రుడ్ని తిరిగి బ్రతికించమని వేడుకోగా, ఆయన ఆ ఏనుగు తలను అతికించి గణేశుని పునర్జీవుని గావిస్తాడు.

వరాహ పురాణంలో శివుడు తన దరహాసం నుండి గణపతిని సృష్టించాడని చెప్పుకున్నాం కదా. ఈ కథలో ఆ పుట్టిన బాలుని సౌందర్యం చూసి శివుడే అసూయ పడతాడు. దేవతాస్త్రీలంతా ఇతడిని మోహిస్తారని తలచి అతని తలను ఏనుగుతలగా, పొట్టను పెద్దదిగా చేసి లంబోదరుడిగా, పామును యజ్ఞోపవీతంగా చేసి అతన్ని అనాకర్షణీయంగా చేస్తాడు.

శివ పురాణంలో మనకు ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ కనిపిస్తుంది. పార్వతి నలుగుపిండితో చేసిన బొమ్మకు జీవం పోసి, అతన్ని ద్వారపాలకుడిగా నియమించి స్నానానికి వెళ్తుంది. శివుడు కొద్ది నిమిషాల తర్వాత పార్వతిని కలుసుకోవడానికి వస్తాడు. బాలగణేశుడు శివుణ్ణి లోనికి ప్రవేశించడానికి నిరాకరిస్తాడు. శివుడు అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ కారణంగానే, ఈ బాల గణేశుడు తన శక్తికి మించి శివుడితో పోరాడినా శివశక్తిని మించలేకపోతాడు. అప్పుడు ఆ యుద్ధంలో శివుడు గణేశుని తల ఖండించివేస్తాడు. బయటకు వచ్చి జరిగిన ఘోరం చూసిన పార్వతి దుఃఖిస్తుంది. ఆమెను శాంతింపజేయడానికి శివుడు తన దూతలను ఉత్తరం దిశగా వెళ్ళి కనిపించిన మొట్టమొదటి ప్రాణి తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. శివదూతలకు ఏకదంతుడైన గజరాజు కనిపిస్తే అతని తలను ఖండించి తీసుకువస్తారు. ఆ తలను బాలుని శరీరంపై అతికించి పార్వతీదేవిని సంతోషపరుస్తాడు శివుడు.

ఏకదంతుడిగా గణేశుడు

గణేశుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు అన్న విషయంలో కూడా ఈ పురాణాల్లో ఏకాభిప్రాయం లేదు. బ్రహ్మవైవర్త పురాణంలో పరుశరాముడు కార్తవీర్యుని సంహరించిన తరువాత కైలాసంలో శివుని దర్శనం కోసం వెళ్తే శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు కాబట్టి, లోనికి వెళ్ళకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. అప్పుడు కోపంతో పరుశరాముడు తన ఆయుధమైన పరుశువును విసరగా వినాయకుడు తన ఎడమ దంతం కోల్పోతాడు.

ఇక గణపతి లేఖకుడిగా కనిపించే ఉత్తరదేశంలోని మహాభారత కథనాల్లో గణపతి మహాభారత రచన కోసమే తన ఎడమ దంతాన్ని విరిచేసి ఆగకుండా ఆ శ్లోకాలను రచించాడని మనం ఇదివరకే చర్చించుకొన్నాం కదా!

పద్మ పురాణంలో గణేశుడు, బలరాముడైన సంకర్షణుడు పరస్పర యుద్ధంలో బలరాముడు రోకలి విసరగా గణేశుడు దంతాన్ని కోల్పోతాడు.

గణేశ పురాణంలో గణేశుడు దేవాంతకుడు అనే రాక్షసునితో యుద్ధం చేస్తున్నప్పుడు తన దంతం కోల్పోయాడని చెబుతుంది. ముద్గల పురాణంలో నరాంతకుడనే రాక్షసుడు తన దంతాన్ని విరిచేస్తే, గణేశుడు ఆ దంతంతోనే అతన్ని సంహరించడం జరుగుతుంది.

అలా గణేశుని జననం, అతని గజముఖం, ఏకదంతం మొదలైన అంశాలపై పురాణాల్లో ఎన్ని వైరుధ్యాలున్నా, మధ్యయుగం నాటికి వినాయకుడు శివుని కుటుంబసభ్యునిగా, అతని పరివారంలో ఒకడుగా స్థిరపడిపోయాడు.

అయితే, ఇన్ని పురాణాల్లో గణేశుని ప్రస్తావన వచ్చినా ఏ మహాపురాణాల్లోనూ గణపతి ప్రధాన దేవుడు కాదు. అంటే గణేశుని ప్రస్తావన ఉన్న శ్లోకాలు తొలగించినా ఆయా పురాణాలలోని ప్రధాన కథకు అంతరాయం కలగదు. అష్టాదశపురాణాల్లో శివుడు, బ్రహ్మ, విష్ణువు, శక్తి, దేవి, స్కందుడు మొదలైనవారు ముఖ్య దేవతలు. స్కాంద పురాణంలోని ఈ శ్లోకం గణపతిని తక్కువస్థాయి దేవునిగా చూపిస్తుంది:

అధమా మర్త్యలోకేత్ర రమంతే విషయాత్మకాః
విషకీటకావత్తత్ర రతిం కృత్వా గరీయసీం
స్వర్గ మోక్షౌ పరిత్యజ్య తత్కస్మాన్ మర్త్య ఈష్యతే
యేనాసౌ ప్రాథ్యేతే మర్త్యైర్ మర్త్యదో గణనాయకః (6.142.6-7)

మర్త్యలోకంలో అధములు స్వర్గ, మోక్షాలను పరిత్యజించి, జీవితంలో రతిసుఖాల కోసం, విషకీటకాదుల నుండి రక్షించడం కోసం ప్రార్థనలు చేస్తారు. అట్టివారి దేవుడు గణనాయకుడు.

ఇంతకు ముందు మనుస్మృతిలో ప్రక్షిప్త శ్లోకంగా చెప్పుకొన్న శ్లోకం కూడా గణపతి తక్కువజాతి ప్రజల దేవుడు అని సూచించడానికి చారిత్రక కారణాలు ఉండవచ్చు.

(“ఇంత విన్నా వినాయకుడు నాకు అంతు చిక్కని దేవుడిగానే మిగిలిపోయాడు. ఒకప్పుడు పిశాచ, భూతగణాలతో పాటుగా దుష్టుడుగా, విఘ్నకారకుడుగా వర్ణించబడ్డ వినాయకుడు, పురాణసాహిత్యంలోకి వచ్చేసరికి సాత్విక దేవునిగా శివుని కుటుంబంలో ఒకడుగా మారిపోయాడు కదా! ఈ రకమైన పరిణామానికి కారణాలు ఏమిటి? ఈ మార్పును వివరించడానికి ఇతర ఆధారాలేమైనా ఉన్నాయా?” అంటూ ఆవులిస్తూ అడిగింది మా ఆవిడ.

“పౌరాణిక సాహిత్యం మాత్రమే పరికిస్తే ఆ మార్పులకు కారణాలు వివరించడం కష్టం. అయితే, గజముఖుడైన గణపతి భారతదేశంలోనే అభివృద్ధి చెందిన బుద్ధ, జైన మతాల్లో కూడా దేవుడే. అంతేకాక ఆగ్నేయాసియాలోని పలు దేశాల్లోనూ, చైనా, జపాన్ దేశాల్లోనూ గణేశుని పోలిన దేవతలు కనిపిస్తారు. అలాగే, భారతీయ భాషల్లోని కావ్యసాహిత్యం, ఇతర లౌకిక సాహిత్యం ద్వారా కూడా మరికొన్ని ఆధారాలు రాబట్టవచ్చు. అలాగే, దేవాలయాల్లోని శిల్పసంపద, చిత్రకళల ద్వారా కూడా గణపతి దేవుని పరిణామాన్ని గమనించవచ్చు. అంతేకాక ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను విశ్లేషించాలి. ఈ ఆధారాల గురించి మళ్ళీ తీరుబడిగా ఇంకోరోజు చర్చించుకొందాం, సరేనా?” అంటూ నేను కూడా తన ఆవులింతల రాగానికి శ్రుతి కలిపాను.)

(సశేషం)


ఉపయుక్త గ్రంథాలు

  1. Interpolations In The Mahābhārata – M. A. Mehendale, Annals of the Bhandarkar Oriental Research Institute, Vol. 82, No. 1/4 (2001), pp. 193-212.
  2. The Hindu Trinity J. Gonda, Anthropos, Bd. 63/64, H. 1./2. (1968/1969), pp. 212-226
  3. Evolution of Gaṇeśa, Y. Krishan, East and West Vol. 44, No. 2/4 (December 1994), pp. 293-314
  4. Gaṇeśa — unravelling an Enigma, Yuvraj Krishnan, Motilal Banarasidass Publishers, 1999 (Delhi)
  5. Ganesh — studies of an Asian God, Robert L. Brown (ed), SUNY Press, 1991
  6. Gaṇeśa Lord of Obstacles and Lord of Beginnings, Paul B. Courtright, Oxford University Press, 1985
  7. Mahābhārata: Critical Edition. 24 vols. with Harivaṃśa, Sukthankar, V. S. et al. eds., Poona: Bhandarkar Oriental Research Institute, 1933–70.
  8. Literary and Historical Studies in Indology, Vasudev Vishnu Mirashi, Motilal Banarsidass Publ., 1975, India