గడి నుడి – 11 సమాధానాలు, వివరణ.

అడ్డం

  1. ముక్కు ఎక్కడుందంటే…
    ద్రావిడ ప్రాణాయామం – ఇది ప్రసిద్ధమైన జాతీయం. ద్రావిడులు ప్రాణాయామం చేసేటప్పుడు, చేతులు తల చుట్టూ తిప్పి ముక్కును పట్టుకొనే ఆచారం నుంచి వచ్చిన జాతీయం. ఏ విషయమైనా సూటిగా చెప్పకపోతే దీన్ని వాడతారు.
  2. అట్నుంచి నరుక్కురమ్మన్నాడు, అనడం కాదు చేసాడు!
    దిచ్ఛేఉ. ఉచ్ఛేది అంటే నరికేవాడు అని అర్థం. అట్నుంచి కాబట్టి తిరగబడింది.
  3. గురుద్వారాలో పాడే ఎఱ్ఱనివాడు
    రాగి – రాగము అంటే ఎఱ్ఱదనం. రాగి అంటే ఎఱ్ఱని వాడు. సిక్కుల గురుద్వారాలలో పాడే అతన్ని రాగి అంటారు (రకరకాలలో పాడతాడు కాబట్టి)
  4. 26తో కలిసి రెండు
    ద్వం – 26తో కలిసి ద్వంద్వం, అంటే రెండు కదా.
  5. దేవదత్తం వినడానికి యిలాటి శంఖమట
    భీషణ – ‘నినద భీషణ శంఖము దేవదత్తమే’ అనే పాదంతో అంతమయ్యే కొన్ని చాటు పద్యాలు ఉన్నాయి. కన్యాశుల్కంలో గిరీశం నోట ఈ మాట ప్రసిధ్ధమయింది.
  6. చీరలకు గుచ్చుకున్న కీలను జాగ్రత్తగా బయటకు తియ్యి
    చీల – అంటే మేకు, “చీరలకు” అనే పదంలో ఉంది. కీల అన్నా మేకు అన్న అర్థం ఉంది.
  7. పార్వతితో కలిసి శివదేవుడు చేసే పానం
    సోమ – సోమపానం ప్రసిద్ధమే. స + ఉమ = సోమ – అంటే ఉమతో కలిసిన అని అర్థం.
  8. సర్వాలంకారం శాస్తాము బుల్‌బుల్
    ముస్తాబు
  9. జైల్లో పడ్డ రాయి కవిత్వం చెప్పకేంచేస్తుంది
    చెరబండ – చెర-బండ. చెరబండ రాజు దిగంబర కవులలో ఒకరు.
  10. జడను జడతో ముడివేస్తే అది జడకందమే!
    కొప్పునకొప్పు – కొప్పున – కొప్పు అని విడదీస్తే, జడతో జడ అని. కొప్పునకు + ఒప్పు అని విడదీస్తే, జడకు అందము అని అర్థం.
  11. కాలేజీని బతికించిన రాజు
    పాలగుమ్మి – ‘బతికిన కాలేజీ’ పాలగుమ్మి పద్మరాజుగారి ప్రసిద్ధ రచన.
  12. పురుగుల పలకరింపులు కలవరింపులు
    లుకలుక – అంటే పురుగులు చేసే చప్పుళ్ళు. “పలకరింపులు కలవరింపులు”లో ఆ పదం దాగి ఉంది.
  13. హాజరుపట్టీ దగ్గర ఎప్పుడూ తగువే!
    జట్టీ – అంటే తగువు. “హాజరుపట్టీ”లో పదం దాగి ఉంది.
  14. మంచమ్మాయి
    లక్ష్మి – మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి.
  15. నాలుగు నెలలుంటే రసపట్టులో పడినట్టే
    కందాయం – కందాయం అంటే మూడో వంతు, నాలుగు నెలలు అని అర్థం. రసకందాయంలో పడడం అనేది తెలుగు నానుడి.
  16. ఇదీ 8 ఒకటే, రెండు కాదు
    ద్వం – రెండు అక్షరాలూ కలిస్తే రెండు అనే అర్థం వస్తుంది కానీ రెండు అక్షరాలూ ఒకటే కదా!
  17. నీళ్ళు తోడేందుకు ఆజ్ఞాపించు
    పంపు – పంపు అంటే ఆజ్ఞాపించు అనే అర్థం ఉంది. ఇంగ్లీషు పంపు నీళ్ళు తోడేందుకు ఉపయోగిస్తాం కదా.
  18. చేరువలో చెల్లాచెదురయ్యింది
    ధిసన్ని – సన్నిధి అంటే చేరువ. అది చెల్లాచెదురయింది.
  19. అరె ముట్టుకుంటే ముడుచుకుంటావ్ అంత సిగ్గా…
    సోకుడు ముడుగు – అంటే touch-me-not

నిలువు

  1. హాయిగా అంగూర్ తీసుకో, మాణిక్యంలాంటి అమ్మ కరుణ దొరుకుతుంది
    ద్రాక్షారామం – అంగూర్ – ద్రాక్ష. హాయి – ఆరామ్. ద్రాక్షారామంలో ఉండే అమ్మవారి పేరు మాణిక్యాంబ.
  2. అసంపూర్ణంగా నలిగింది
    డగు – డంగు అంటే నలగడం అనే అర్థం ఉంది. అసంపూర్ణం అంటే సున్నా (పూర్ణం) లేకుండా అని.
  3. అనాదిగా చిరకాలంగా నివాసస్థానం
    ణాచి – కాణాచి అంటే చిరకాలంగా ఉన్న నివాసస్థానం. అనాదిగా – మొదటి అక్షరం లేకుండా.
  4. అంగదేశపు కళా పేటిక
    మంజూష – మంజూష అంటే పెట్టి (పేటిక). బీహార్ లో ఒక ప్రసిద్ధమైన చిత్రకళ పేరు మంజూష.
  5. …పోత, …పడు, …పెట్టు, …నాడు
    దిగ – దిగిపోత, దిగపడు, దిగపెట్టు, దిగనాడు – ఇవన్నీ దిగతో వచ్చే పదాలు.
  6. ఉక్కులాటి వాడయ్యా ఈ సమరయోధుడు!
    ఉయ్యాలవాడ – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు. ‘ఉక్కులాటి వాడయ్యా’లో ఉయ్యాలవాడ దాగుంది.
  7. యక్షగానం ఏమిటా? మీకీమాట కిందటేడు సెప్టెంబరులోనే చెప్పలేదూ?
    భీమసేన విజయం – ఇదొక యక్షగానం. దీని గురించి కిందటేడు సెప్టెంబర్ ఈమాట సంచికలో చూడవచ్చు.
  8. అన్నవరంలో ప్రేమ రాయబారం నడిపింది
    చెంబు – శంకరాభరణం సినిమా చూసిన వాళ్ళకు తెలుస్తుంది.
  9. మహీధరములో చిక్కిన చీమను పట్టుకో, లక్ష్మీకటాక్షం కలుగుతుంది
    హీర – ఈ పదానికి చీమ, లక్ష్మి అన్న అర్థాలున్నాయి. ఈ పదం ‘మహీధరము’లో దాగుంది.
  10. జోడు పడవలకు ఒకడే ఓడంగి – ఏమిటో చెప్పుకోండి!
    చెప్పులు – ఇది ఒక పొడుపు కథ. ‘చెప్పుకోండి’లో కూడా ఇంకొక క్లూ దాగుంది.
  11. కొమ్మ చివర ఇమ్ముగా వంచితే ఒక చెట్టవుతుంది
    కొమ్మి – ఒక చెట్టు పేరు.
  12. వేదన నెపంతో ఏడ్చిన సుందరి
    పాటలగంధి – మనుచరిత్రలో ‘పాటున కింతులోర్తురె కృపా రహితాత్మక…’ అనే పద్యంలో ‘పాటలగంధి వేదన నెపంబిడి యేడ్చె కలస్వనంబునన్’ అని వరూధిని ఏడుపుని వర్ణిస్తాడు పెద్దన.
  13. వాడకు ముందు, వరదకు తర్వాత
    గుడి – గుడివాడ, వరదగుడి.
  14. ఆకలి తుదముట్టడానికి నీళ్ళయినా చాలు
    కలి – బియ్యం నానబెట్టిన నీళ్ళను కలి అంటారు. ఆ’కలి’ పదం తుదిన ఉన్నది.
  15. కలువపువ్వులగుత్తిలో అటుయిటుగా పక్షి జంట
    కవపులుగు – అంటే జంట-పక్షి (పక్షి-జంట అటు ఇటుగా). ‘కలువపువ్వులగుత్తి’ అనే పదంలో దాగుంది. చక్రవాక పక్షికి మరో పేరిది.
  16. దగ్గరకు రాడానికి భయమెందుకు?
    దాపు – అంటే దగ్గర, భయం అని రెండర్థాలు.
  17. తమిళ కావేరి బంగారంలాంటి బియ్యాన్ని పండిస్తుంది
    పొన్ని – తమిళంలో కావేరీ నదిని పొన్ని అంటారు. బంగారం అని కూడా అర్థం. ఇదొక రకం బియ్యం కూడా.
  18. ఇటీవల ఈమాటపై అందరూ ఫిదా అయ్యారెందుకు?
    కైకు – అంటే ఎందుకు అని అర్థం. ఫిదా సినిమాలో ఎక్కువగా వచ్చే మాట.
  19. కథలన్నీ కంచికి, రస్తాలన్నీ…
    రోము – కథలన్నీ కంచికి చేరడం తెలుగు నానుడి నుంచి వచ్చింది. దారులన్నీ రోము చేరడం ఇంగ్లీషు నానుడి.