గడినుడి 10కి ఈసారి చాలా ఆలస్యంగా ఇద్దరు మాత్రమే తప్పుల్లేని పరిష్కారాలు పంపగలిగారు. అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ ఇద్దరు విజేతలకు అభినందనలు:
- రవిచంద్ర ఇనగంటి
- శ్రీవల్లీ రాధిక (టి. ఎస్. రాధిక)
అడ్డం
- కడపా? కాదు, ఒడంబడిక పత్రం
సమాధానం: కదపా. వాడుకలో నుంచి తప్పుకున్న(తప్పుకుంటున్న) ఉర్దూ పదం. దగ్గరి అర్థం lease. - మన దేశం ఎవరిది?
సమాధానం: మనదే. ఆధారంలోనే సమాధానం ఉంది. - పార్వతి
సమాధానం: అగజ. పార్వతి పేర్లలో ఒకటి. - కావిరంగులో కలిగే మార్పు
సమాధానం: వికారం. ఏనగ్రామ్ - కలప తిరగబడి చదరంగా మారింది
సమాధానం: పలక. ఏనగ్రామ్ - ఆదమరచి ఆటలాడు దక్షుని ఎదుట రుద్రుడు ప్రత్యక్షం
సమాధానం: నిటలాక్షుడు. ఏనగ్రామ్ - గృహం మొదట మాతకేననిపిస్తే సందేహం తీరదు
సమాధానం: నికేతనం అంటే గృహం. అది కాస్తా సందేహంలో పడి నికేతనమా అయింది. ఇంకో ఏనగ్రామ్ - తలలేని మకుటము తబ్బిబ్బై వేయించిన చాటింపు
సమాధానం: టముకు. ఏనగ్రామ్. - అక్క సుగుణాలరాశే, కానీ ప్రథమకోపం
సమాధానం: ఆధారం మొదట్లో ఉన్నదే – అక్కసు. - ఉండుండి వినిపించే డప్పుచప్పుడు
సమాధానం: ఉండుండి అంటే అప్పుడప్పుడు. డప్పుచప్పుడు – homophone. - కారడవిలో కోకలిడి విలుప్తంగా తిరిగే పక్షి
సమాధానం: దశాబ్దాలుగా ఎవరికంటా పడకుండా ఉన్న అరుదైన అటవీపక్షి కలివికోడి. ఏనగ్రామ్ - వన్నాళి రాగపు పేరు సరిచెయ్యాలి
సమాధానం: పున్నాగ వరాళి అనేదొక రాగం పేరు. ఏనగ్రామ్ - పాలికాపుకా వామాచార పిలుపు వర్తించదు.
సమాధానం: వామాచార శివభక్తుల్లో ఒక తెగ కాపాలికులు. వాళ్ళకు వర్తించే పిలుపు కాపాలికా. - షర్బతు కోసం నారిని పిలవబోతే నోరు తడబడుతుందా?
సమాధానం: నన్నారి. షర్బతులో వాడేది నన్నారి వేర్లు. - వెగటు చూడరు
సమాధానం: కనరు (double definition) - అప్పాజీ
సమాధానం: తిమ్మరుసు. - ప్రాసమాటల పెన్నేరు ఇకపై ఆగునా పారునా?
సమాధానం: వెంకయ్యనాయుడు. ప్రవాహంలా సాగే ప్రాసమాటల ఉపన్యాసాలతో ప్రసిద్ధుడైనా ఉపరాష్ట్రపతి అయ్యాక పెద్దగా ఉపన్యాసాలిచ్చే అవకాశం ఉండకపోవచ్చు. స్వస్థలం పెన్నాతీరంలోని నెల్లూరు. - అందమైన అక్షరాలకు, పలువరుసకు ఉపమానం
సమాధానం: అందమైన అక్షరాలను, పలువరుసను ముత్యాలకోవలా ఉన్నాయనడం వాడుక. - కెవ్వున మంపును చెదరగొడితే ఆ-విరి ప్రత్యక్షం
సమాధానం: ఒక విరి (పువ్వు) మంకెనపువ్వు. ఏనగ్రామ్ - చెప్పమని గారంగా అడగండి
సమాధానం: చెపుమా - కొండకింద నలిగి ఆర్తారావము చేసిన అసురుడు
సమాధానం: రావణ. ఒకసారి రావణాసురుడు తన భుజబలంతో కైలాసపర్వతాన్నే ఎత్తబోయి శివుడు పాదం మోపేసరికి దానికింద పడి గట్టిగా రావం (శబ్దం) చేశాడట, అప్పటినుంచి అతడి పేరు రావణుడు అయింది. - పాలమూరు ప్రాంతంలో తిన్నగా తాలము పాటి ఊరు
సమాధానం: తాటిపాముల. ఏనగ్రామ్ - అడ్డం 43తో కలిసి చప్పున రాగలవాడు ఏలుకోవడానికి మధ్య సర్దుకునే ఆభరణాలు
సమాధానం: ఏడువారాల+నగలు. ఏనగ్రామ్ - వామనుడు దీని జోలికి పోలేదని సందేహం వద్దు. ఆయన పేరులోనే దాగి ఉంది
సమాధానం: మనువా. వామనుడు బ్రహ్మచారి. ఏనగ్రామ్ - భోజనం తయార్!
సమాధానం: సిద్ధంగా ఉన్న భోజనం సిద్ధాన్నం. - సముద్రాన్ని లంఘించిన హనుమంతుడికి ‘ఎదురైన’ నగరదేవత(!)
సమాధానం: ణికిలం. హనుమంతుడికి ఎదురైనది లంకిణి. - వదిలించు
సమాధానం: డులుచు - అడ్డం 37తో కలిపి చూడండి
సమాధానం: నగలు
నిలువు
- కావేరికి ఒక ఉపనది
సమాధానం: కబిని - చారానా బిళ్ళ
సమాధానం: పావలా కాసు - మరులుగొలిపేవాడు
సమాధానం: మరుడు. అంటే మన్మథుడు - మొక్కులు తీర్చుకునే పనికదే డవుటు లేని క్షేత్రం
సమాధానం: దేవుని కడప. తిరుమలకు వెళ్ళలేని స్థానిక భక్తులు ఆ మొక్కులు ఇక్కడే తీర్చుకునేవారు. ఏనగ్రామ్ - ఒక పురం, ఒక వరం? ఊహూ అనేక పురాలు అనేక వరాలు
సమాధానం: అనంత. అనంతపురం, అనంతవరం అనే పేర్లతో అనేక ఊర్లున్నాయి. - అక్షమాల
సమాధానం: జపమాలిక - తెనాలి రామకృష్ణుడు
సమాధానం: వికటకవి - నలకూబరుడెరికి ప్రియుడు?
సమాధానం: రంభకు - బడలిక
సమాధానం: అలుపు - అతివ రామభక్తి బుద్ధుడి మీదికి మళ్ళిందా?
సమాధానం: అమరావతి. ఒక బౌద్ధక్షేత్రం. ఏనగ్రామ్ - గోవులతోపాటే కాపరి కూడా వెనక్కి మళ్ళాడు
సమాధానం: డులుపాగో. వెనక్కి మళ్ళిన గోపాలుడు. - కన్నడ లగోరి తెలుగు పేరు
సమాధానం: డికోరి. ఏడు పెంకులు పేర్చి బంతితో కొట్టే ఆటకు తెలుగు పేరు. కన్నడంలో దీన్ని లగోరి అంటారు - డాగరు కంటే చాలా పెద్దది
సమాధానం: గడారు. అంటే గడ్డపార లేక గునపం. డాగర్/పిడిబాకు కంటే చాలా పెద్దది - దాత ఒకరే, బహుమతులు బహుళం. అడగడానికి మొహమాటపడకండి.
సమాధానం: కానుకలివ్వు - మాదిరి
సమాధానం: నమూనా - శ్రీవారి పొడుగుబొట్టు
సమాధానం: తిరునామం. పొడుగ్గా పెట్టుకునే బొట్టు నామం. శ్రీవారిది కాబట్టి తిరునామం - రకము సరి చెయ్యి
సమాధానం: కరము. అంటే చెయ్యి. ఏనగ్రామ్ - ఒడిశా సరిహద్దులో ఉరికే జలపాతం
సమాధానం: డుడుమా. మాచ్ ఖండ్ నది మీదున్న జలపాతం - తీర్థంకరుడి వెంట నగ్నపాదాల నడువు
సమాధానం: దానవులపాడు. కడప జిల్లాలోని జైనుల 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడికి సంబంధించిన క్షేత్రం. ఏనగ్రామ్ - లక్షాధికారిని కూడా ఇదే మింగమన్నాడు శేషప్పకవి
సమాధానం: లవణమన్నం. లక్షాధికారైన లవణమన్నమె కాని, మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు అన్నాడు నరసింహ శతకం రాసిన శేషప్పకవి. - పడతి పలుకు
సమాధానం: వనితావాణి. పడతి అంటే వనిత, పలుకు అంటే వాణి. - దుర్గంధం
సమాధానం: చెడువాసన - లక్ష సిరాచుక్కల మధ్య దాక్కున్న దానవి
సమాధానం: రాక్షసి. ఏనగ్రామ్ - పాటతో పల్లవించే గులాబి వర్ణం
సమాధానం: పాటలం. అంటే గులాబిని పోలిన రంగు. - ఆరున్నొక్కరాగం తీయు
సమాధానం: ఏడుచు. - పువ్వులు తలమీదే ఉంటాయి వీటికి
సమాధానం: లతలు. ఏనగ్రామ్