ఈమాట – నామాట

ఈమాటకి ఈ నవంబర్‌‌తో పదేళ్ళు నిండుతాయి. తెలుగు దేశంలో ప్రచురించబడే (సాహితీ) పత్రికల వయసుతో పోలిస్తే పదేళ్ళు పెద్ద వయస్సనే చెప్పాలి. కాని పాశ్చాత్యదేశాల్లో సాహితీ పత్రికల తోటి, ముఖ్యంగా అమెరికన్‌ సాహితీ పత్రికల తోటి పోల్చి చూస్తే ఈమాట ఇంకా పసిపిల్లే అని చెప్పవచ్చు. పోనీ పసిపిల్ల అనడం మరీ ఎబ్బెట్టుగా వినిపిస్తే, చిన్నపిల్లే అని మాత్రం ఒప్పుకోక తప్పదు. పదేళ్ళు అంటే, పాల పళ్ళన్నీ ఊడిపోయి కొత్త పళ్ళొచ్చిన వయస్సు అన్నమాట! పాల పళ్ళున్న రోజుల్లో కనిపించినదల్లా కొరికెయ్యాలనిపించేది. కొరికిన తరువాతే రుచి చూడటం! ఇప్పుడు, కాస్త జాగ్రత్తగా చప్పరించి రుచి చూడటం, ఆ తరువాతే కొరకడం అవసరం. అంత మాత్రం చేత అప్పుడప్పుడు ఊరికే తీపుతో కొరకబుద్ధి అవదని కాదు! ఇంకా చిన్నతనమేకదా!

పదహారు సంవత్సరాలు నిండితే కానీ జ్ఞానదంతాలు రావు. అయితే, చిన్నతనమేలే అని అశ్రద్ధ చెయ్య కూడదు. రాబోయే ఆరేళ్ళూ ఆ దంతాలు కొక్కిర్లు లేకండా సరిగా పెరిగేట్టు చూసుకోవాలి. జాగ్రత్త పడాలి. లేకపోతే పడవలసిన శ్రమ ఇంతా అంతా కాదని అందరికీ తెలుసు. ఈ పత్రిక నిర్వహణలో కూడా ఇంతే! అందుకు తగిన బృందం మాకు ఉన్నదనే అనుకుంటున్నాను.

ఎప్పుడూ ఎక్కడో కొద్దిమందే కుతూహలంతో ఒక క్రొత్తపనికి అంకురార్పణ చేస్తారు. ఆ పని నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరగాలని కోరుకుంటారు. వ్యవస్థాపకుడు రామారావు, అతని సహచరబృందం ఎంతో ముందు చూపుతో ఈమాట పత్రికని స్థాపించారు. వారందరికీ ఈనాటి ఈమాట బృందం మనసారా అభినందనలు తెలుపుకుంటున్నది.

రామారావు చెప్పింది నిజమే! అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగటల్లేదు. ముఖ్యంగా కథల్లోను, కవితల్లోనూ వైవిధ్యం కనిపించటల్లేదు. కొత్తదనం చాలా తక్కువేనని ఒప్పుకోవాలి. వచ్చిన వాటిల్లో మంచివి ఏరుకోగలవే కానీ ఏ పత్రికా లేని గొప్ప రచనను చూపించలేదు, కదా. ప్రవాసజీవితం ప్రతిబింబించే రచనలు అరుదుగానే వస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా క్రొత్త రచయితలని ప్రోత్సహించడం, పాత రచయితలని వెన్నాడటం జరుగుతూనే ఉన్నది. అయినా చెప్పుకోదగ్గ ప్రతిఫలం కనపడటల్లేదు.

నిన్ననే ఎవరో అన్నారు, ‘మీ పత్రికకి రచనలు పంపించడం అంటే భయం,’ అని. ‘ఎందుచేత?’ అని ప్రశ్నిస్తే, ‘మీరు ప్రతి రచననీ కనీసం ఇద్దరి చేత సమీక్షించి, మార్పులు, చేర్పులూ కూర్పులూ, చేయిస్తారు, అందుకని భయం!’ నిజం చెప్పాలంటే, రచయితలకు సమీక్షలంటే భయం ఉండకూడదు. వాటిని ఆహ్వానించాలి. ఎందుకంటే, ఆ సమీక్షల మూలంగా రచన మరింత పరిపుష్టం అవుతుందనే విశ్వాసం ఉండబట్టే మేము ఈ సమీక్షలని (peer reviews) ప్రవేశ పెట్టాం. రచయితని, పాఠకులనీ దృష్టిలో పెట్టుకునే ఈ సమీక్షలు చేయడం జరుగుతున్నది. ఇకముందు ఇంతకన్నా శ్రద్ధగా సమీక్షలు చేయడం అవసరమని మేము నమ్ముతున్నాం. ఆషామాషీగా కాకుండా, పత్రికలో ప్రచురితమైన కథలపైన, కవితలపైన, వ్యాసాలపైనా ఇకముందు విమర్శనాత్మకమైన వ్యాఖ్యానాలు వ్రాయమని పాఠకులని కోరుతున్నాం. అటు వంటి లేఖలే ప్రచురించడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రక్రియ పాశ్చాత్యదేశాల్లో సాహితీపత్రికలలో వచ్చే అన్ని రకాల రచనలకే కాక, సంపాదకునికి వ్రాసే లేఖలకు కూడా వర్తింపజేయడం ఆనవాయితీ. అటువంటి పద్ధతే మనకి కూడా అవసరం. అందుకు మీరు సహకరిస్తారని భావిస్తున్నాను.అతిథి సంపాదకీయం లాంటి కొన్ని సరి క్రొత్త శీర్షికల గురించి, ప్రత్యేకసంచికల ప్రచురణ గురించీ ఆలోచనలు సాగుతున్నాయి.

కొన్ని పత్రికలు పాత చరిత్ర వెళ్ళిన పుంతలోనే బరి తప్పకుండా వెడతాయి. వాటి విషయం మనకి అనవసరం. కొన్ని పత్రికలు క్రొత్త దారిలో వెళ్ళి సరి క్రొత్త చరిత్రని సృష్టిస్తాయి. ఈమాట క్రొత్త చరిత్రని సృష్టించేదిగా చేయాలని మా అభిలాష. మరో పదేళ్ళ తరువాతో, ఇరవై ఏళ్ళ తరువాతో, పాత సంచికలు చూసే క్రొత్తవారు, ‘సెబాస్‌’ అని మెచ్చుకునేట్లుగా పత్రికని నడపాలని ఆశిస్తున్నాం. ఈ మెచ్చుకోలు చరిత్ర పరంగానే కాదు – సాహితీ పరంగా, సారస్వత పరంగా కూడా! అలా పాత సంచికలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకునే సులువు కూడా ఈమాటకి ఉన్నది! ఇక్కడ చెకోవ్‌ గురించి ప్రచారంలో ఉన్నకథ అసందర్భం కాదనుకుంటాను. చెకోవ్‌ క్రొత్త రచయితలకి ఒక సలహా ఇచ్చాడు. ‘చందమామ గురించి చెప్పదలచుకుంటే ఆకాశంలో చందమామని వర్ణించకు. నీపాదాల ముందు పగిలిన అద్దంలో ఆ చందమామ ప్రతిబింబం చూపించు,’ అని! భవిష్యత్తులో పాఠకులకి ఇప్పటి మన సారస్వతజీవితం, అదే అద్దంలో ఏడు రంగులతో ఈమాటలో ప్రతిఫలిస్తుందని ఆశిస్తున్నాను.

ప్రస్తుతం మాబృందంలో సంపాదకులు పద్మ ఇంద్రగంటి, సురేశ్‌ కొలిచాల, పాణిని శంఖవరం, మాధవ్ మాచవరం, నారాయణ స్వామి (నాశి) – వీళ్ళకి అనుభవంతో పాటు విపరీతమైన ఆసక్తి. ఒక్కొక్కరికీ ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యత! అంతకన్నా ఎక్కువ passion! టీనా బ్రౌన్‌ గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఆవిడ ఆధ్వర్యంలో రెండు అమెరికన్‌ పత్రికలు దేదీప్యమానంగా వెలిగి అభివృద్ధి చెందాయి. మొదటిది, Vanity Fair, రెండవది The New Yorker. మా బృందానికి టీనా బ్రౌన్‌ లాంటి సంపాదకురాలు పద్మ ఇంద్రగంటి . ఒక్కటే తేడా! రచయితలకి, ఇతర సంపాదకులకీ టీనా బ్రౌన్‌ తో పనిచెయ్యడం చాలా కష్టం అయ్యేది అని చెప్పుతారు. కానీ మా పద్మతో పని చెయ్యడం మాత్రం తియ్య మామిడి పండు ముక్క తిన్నంత సులువు. అంతేకాదు, ఆఖరి నిమిషంలో ఈమాటను చూడముచ్చటగా తీర్చిదిద్ది, ముందుమాటతో సహా మీ ముందుకు తీసుకువచ్చేదీ తనే. ఈ ఐదుగురు సంపాదకులూ కష్టపడి పని చేస్తారు; ప్రతిష్ట మాత్రం నాది.