మరచిపొమ్మంటున్నారు నన్ను
మరచిపొమ్మంటున్నారు నిన్ను
ఓషన్ సిటీలో నీతోటి
ఆ సూర్యుని కెంపులను
ఆ గగనపు సొంపులను
ఆ సంద్రపు వంపులను
ఆ సొగసుల యింపులను
మరచిపోగలనా
స్కైలైన్ డ్రైవ్‌లో నీతోటి
ఆ ఆకుల రంగులను
ఆ మాకుల భంగులను
ఆ కొండల ఛాయలను
ఆ లోయల మాయలను
మరచిపోగలనా
క్రాస్బర్గ్ రోస్ గార్డన్స్‌లో నీతోటి
ఆ మాటల ఊటలను
ఆ పాటల తేటలను
ఆ నవ్వుల పువ్వులను
ఆ సుమముల గుమగుమను
మరచిపోగలనా
నయాగరా హోరులో నీతోటి
ఆ గుండెల దడదడను
ఆ ఆశల హరివిలును
ఆ చూపుల తూపులను
ఆ స్నేహపు శ్వేతతను
మరచిపోగలనా
మవుంట్ రెనియేర్‌పై నీతోటి
ఆ మోదపు శిఖరమును
ఆ నాదపు లోతులను
ఆ పెదవుల మధువులను
ఆ స్పర్శల హర్షమును
మరచిపోగలనా
మన యింటి డెక్‌పైన నీతోటి
ఆ వెన్నెల వన్నెలను
ఆ తారల తళతళను
ఆ మల్లెల మత్తులను
ఆ స్వర్గపు వాకిలిని
మరచిపోగలనా
రెడ్ లైన్ మెట్రోలో
సిల్వర్ స్ప్రింగ్ స్టేషనులో
ఏ క్షణాన
మన వీక్షణాలు కలిశాయో
అప్పుడే
అక్కడే
నా జీవన పరిధికి
నువ్వు
కేంద్రమయ్యావు
అప్పటినుండి
మన రమ్య ప్రణయ నాటకాన్ని
ఆ సూత్రధారుడి
అదృశ్య హస్తం రాస్తూనే ఉంది
అదృశ్య నేత్రం చూస్తూనే ఉంది
మరచిపొమ్మనే వాళ్ళకేం తెలుసు
మమతకు మతం లేదని
ప్రీతికి జాతి లేదని
ప్రేమకు వర్ణం లేదని
వలపుకు కులం లేదని
తలపుకు గోత్రం లేదని
స్మృతులకు మరపు లేదని
నువ్వు నేను
పరమాణువులు సృష్టించిన అపర ప్రేమస్వరూపాలు
సౌందర్య సాగర తరంగాల పీయూషఫేనాలు
అనుభూతులతో ఉప్పొంగిపోయే రసాయన రసార్ణవాలు
ఏకతాళముతో స్పందించే రెండు నిండు హృదయాలు
భావనా భువన భవనాలలో మ్రోగే జీవఘంటికలు
ఇంకిపోని కవన కుతూహల కూపకాలు
క్రుంకిపోని సతతహరిత జ్ఞాపకాలు
మరచిపొమ్మంటున్నారు నన్ను
మరచిపొమ్మంటున్నారు నిన్ను
తనువులోని తనువును తాకవద్దంటున్నారు
మనసులోని మనసును పూడ్చమంటున్నారు
ఆలోచనా లోచనాలను మూయమంటున్నారు
తేనె తీపి కలముతో రాసిన పాల గుండెలోని
పుటలను త్రుటిలో చింపివేయమంటున్నారు
చూచిన నీ చిత్రాన్ని, గీచిన ఆ చిత్రాన్ని
ఆనవాలు లేకుండా తుడిచివేయమంటున్నారు
కన్నీళ్ళతో భరతవాక్యం రాయమంటున్నారు
ఆడిన ఆటలను పాడిన పాటలను
మెట్టిన బాటలను కట్టిన కోటలను
పలికిన పలుకులను కలిపిన చేతులను
వేచిన ఘడియలను చూచిన మలుపులను
అమాంతంగా సాంతంగా మరచిపోవాలట
నిన్ను నేను మరచిపోవాలంటే
నన్ను నేను మరచిపోవాలి
నన్ను నేను మరచిపోవాలంటే
నన్ను నేను చంపుకోవాలి
కానీ
నన్ను నేను చంపుకోను
నా అంతరాత్మను చంపుకోను
నిన్ను నేను మరచిపోను
అందరినీ బెదరిస్తాను
లోకాన్నే ఎదిరిస్తాను
నాకాన్నే అందుకొంటాను
అమృతాన్నే జుర్రుకొంటాను