లింకన్ తో ఓ రాత్రి

[మే రెండవ తేదీ సత్యజిత్ రాయ్ పుట్టినరోజు. నాకు ఈ కథ రాయడానికి ప్రేరణ ఆయన కథలే కనుక, ఈ కథ ఆయన స్మృతికి. — రచయిత్రి]

వంటగదిలో బ్రేక్‌ఫాస్ట్ పనిలో మునిగి ఉన్న స్నేహ డోర్‌బెల్ అరవడంతో ఆదివారంపూట ఇంతపొద్దున్నే వచ్చిందెవరా? అనుకుంటూ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా హేమంత్, తనతోనూ రాజాతోనూ కలిసి చదువుకున్న సహాధ్యాయి.

“ఏమిటి హేమూ పొద్దున్నే దిగబడ్డావు?”

“అది కాదు స్నేహా… మన రాజా గాడు ఏంటో తేడాగా ఉన్నట్లు కలొచ్చిందిలే. పన్లోపనిగా మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ కూడా కానిచ్చేయొచ్చని వచ్చేసా.”

“నీకు కల వచ్చిందన్న విషయం నమ్మమంటావా? నాకెందుకో నువ్వు తినడానికే వచ్చినట్లు అనుమానం. బ్యాచిలర్ గా ఉన్నప్పుడు రాజా కూడా ఇలాగే ఏదో ఒకటి చెప్పి ఆదివారం వచ్చేవాడు మా ఇంటికి .. ఇంటి భోజనం తొక్కా తోలూ అంటూ. నేను మా నాన్నకి జవాబు చెప్పలేక నానా అవస్థా పడేదాన్ని అప్పట్లో.”

“కనిపెట్టేసావన్నమాట. ఏమైనా నువ్వు చిన్నప్పట్నుంచి బాగా తెలివైనదానివి కదా స్నేహా….”

“సర్లే .. నీకు బ్రేక్‌ఫాస్ట్ శాంక్షన్డ్.”

“థాంక్స్! ఇంతకీ వాడేడీ? కనబడ్డే?”

“నీకు కల వచ్చినా రాకున్నా అది మాత్రం నిజమే… మన రాజా మన రాజా కాదు. నిజంగానే తేడా మనిషై పోయాడు పొద్దున్నుంచి.”

“ఏమిటీ? ఏమైంది?”

“అసలు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతావు .. అసలు నువ్వు ఊహించలేవు ఏమి చేస్తున్నాడో!”

“అబ్బ, స్నేహా! టెన్షన్ పెట్టకు నన్ను. ఏమైంది వాడికి? తలకేమైనా దెబ్బ తగిలి గతం మర్చిపోయాడా ఏమిటి కొంపదీసి?”

“వెటకారాలాడకు. ఇప్పుడు రాజా ఏమి చేస్తున్నాడో తెలియాలంటే, అలా కుడిపక్కకి తిరిగితే గెస్ట్ రూమ్ కీ, బెడ్‍రూమ్ కి మధ్య ఓ చిన్న గది ఉంటుంది. వెళ్ళి చూసి రా అక్కడ.”

“చిన్న గదేమిటి? పూజగదేగా ఉండేది? వీడి నాస్తికత్వం ఎక్కువై అది కూడా తీసేసి ఏమన్నా సర్దేస్తున్నాడా ఏమిటీ అక్కడ?”

“వెళ్ళుము … చూడుము …రమ్ము … మాట్లాడుము..”

“రమ్మా! అదికూడా అరేంజ్ చేసారా ఇంట్లో?”

“ఏహె! జోకులాపి చూసిరా…”


రెండు నిముషాల తరువాత అక్కడ్నుంచి మళ్ళీ స్నేహ వైపుకి వచ్చిన హేమంత్ కళ్ళు ఆశ్చర్యంతో వెండితెరంత పెద్దగా అయ్యాయి.

“స్నేహా .. ఏమిటిది? వాడు .. ఆ పుట్టు నాస్తికుడు … వాడెళ్ళి పూజ గదిలో కూర్చుని నమస్కారం చేయడమేంటి దేవుడికి? ఆ హారతియ్యడం ఏమిటి?”

“ఓ హారతిచ్చేస్తున్నాడా అప్పుడే … గుడ్. ఇప్పుడే ఓ పదిహేను నిముషాలే ఐందిలే వెళ్ళి … అప్పుడే బైటకి వస్తాడనుకోలేదు. కొత్తకదా … ఇంకా పెద్దగా పూజలూ అవీ తెలీవు కదా .. అందుకని త్వరగా అవజేసి ఉంటాడు.”

“అదికాదు .. నువ్వేంటి? నీకు ఆశ్చర్యంగా లేదూ?”

“హేమూ! నీకు ఇప్పుడే తెలిసింది కనుక నీకు అలా ఉంది. నాకు పొద్దున్న ఐదింటికి నిద్రలేపి మరీ చెప్పాడు నాయనా! అప్పటి షాక్ నుండి ఇప్పుడిప్పుడే తేరుకున్నా కనుక .. ”

“కారణమేంటి? చెప్పు .. చెప్పు .. కమాన్ కమాన్ టెల్మీ ఐ సే!” సాయికుమార్ స్టైల్లో అన్నాడు హేమంత్.

స్నేహ నోరు విప్పేంతలో,

“అరే! హేమూ … ఎప్పుడొచ్చావ్ రా? నేను పూజలో ఉన్నా కదా … చూస్కోలేదు. ఇదిగో హారతి” అంటూ వచ్చాడు రాజా.

“అదికాదొరే … నిన్నటిదాకా బానే ఉన్నావు కదా … ఈరోజేమిట?” నుదుట కుంకుమతో, చేతిలో హారతిపళ్ళెంతో ఎదురువచ్చిన రాజాని చూస్తూ అడిగాడు హేమంత్.

“అదొక పెద్ద కథ రా … చెప్తాను ఉండు. గెటప్ మార్చుకుని వస్తాను. తీరిగ్గా మాట్లాడుకుందాం.”

“స్నేహ పూజగది పెట్టించుకుంటేనే నానా హడావుడీ చేసావు కద అప్పట్లో… అసలు నీకూ, తనకీ ఈ విషయంలో ఇంత తేడాగా ఉండగా ఇద్దరూ ఎలా కలిసారో? అని కాలేజీలో అందరూ అనుకునేంత లెవెల్ లో నువ్వు నాస్తికుడిలా కటింగ్ ఇచ్చేవాడివి కదరా … ఒక్క రాత్రిలో ఏమైంది నీకు?”

“ఉండరా … వచ్చి చెప్తా” రాజా డ్రస్ మార్చుకోడానికి వెళ్ళాడు.


“స్నేహా! ఏమైంది వీడికి? అసలా కథేంటి?”

“ఏం చెప్పను హేమంత్! నాకు కథ విన్నాక మహేశ్‍బాబు కొడితే ఎలా దిమ్మతిరిగి మైండ్ బ్లాకౌతుందో .. అలా ఐపోయింది. ఏమన్నా అంటే ఫీలౌతాడని ఏమీ కామెంటెయ్యలేదు”

“అంత భయంకరమైన కథా!”

“ఇప్పుడు చెప్తాడు విను. నేను మళ్ళీ వినలేను గానీ .. అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తా. మళ్ళీ రాజా సీరియస్ గా చెబుతూ ఉంటే, నేను నవ్వడమో, ఏదో ఒకటి అనడమో చేసి .. అతను ఫీలయి .. నేను ఫీలయి … ఇదంతా ఎందుకు? అల్రెడీ పొద్దున్నే ఓసారి అయింది.”

“ఓహో! మేటర్ ఆసక్తికరంగా ఉంది. సర్లే. నువ్వెళ్ళు. వాడికి నే చెప్తాలే.”

“ఒకే! జాగ్రత్త.” అని నవ్వి “రాజా! నేను మార్కెట్ కి వెళ్ళొస్తా.” అని రాజాకి అక్కడ్నుంచే కేకేసింది.

“ఓ, అప్పుడే వెళ్తున్నావా!ఓకే ఓకే.” అంటూ బయటకి వచ్చాడు రాజా.

“మీరు తినేయండి .. పూరీ-కూర్మా చేసాను. టేబుల్ మీద ఉంది.” అంటూ వెళ్ళిపోయింది స్నేహ.

“ఇప్పుడు చెప్పవోయ్ అసలేమైందో.” టేబుల్ వద్ద కూర్చుంటూ అడిగాడు హేమంత్.

“చెప్తాగానీ … నువ్వు నమ్మాలని నేను కోరుకోడం లేదు. చెప్పాలి కనుక చెప్తున్నా. నమ్మడం నమ్మకపోడం నీ ఇష్టం కానీ … నా నమ్మకాలని హేళన చేయకుండా ఉంటే చాలు.”

“అబ్బ సర్లేరా! అంత కష్టపడకు .. నేనేమీ అననులే. చెప్పు.”

“రాత్రి నాకు జ్ఞానోదయమైందిరా. బుద్ధుడికి బోధిచెట్టుకింద అయింది కానీ … నాకు పడగ్గదిలో ఫ్యానుకిందే అయిపోయింది.”

“హుం! ఇలా కష్టం కానీ .. నువ్వు నీ ఫ్లో లో నువ్వు కథ కానివ్వు. నేను ఏమన్నా ఉంటే చివర్న అడుగుతా. మొత్తం స్క్రీన్‍ప్లే కానిచ్చేయ్. గెట్ సెట్ గో.”


“ఎప్పటిలాగే నేను రాత్రి డిన్నరయ్యాక కాసేపు వాకింగ్ కి వెళ్ళొచ్చాము ఇద్దరం. తను టీవీ చూస్తా అని వెళ్ళింది. నేను అక్కడ దయ్యాలమీద ఏదో పుస్తకం ఉంటే చదువుతూ కూర్చున్నా కాసేపు. అందులో, ఓ కథ ఆకర్షించింది నన్ను. అది లింకన్ దయ్యం గురించి. అబ్రహాం లింకన్ చనిపోయాక కూడా చాలా మందికి కనిపించాడంట. ఆ వైట్ హౌస్ భవనం లో నౌకర్లకి చాలాసార్లు కోపంగా చూస్తున్న పోజులో కనిపించాడట. ఇలాంటి సంఘటనల గురించిన వ్యాసం అది. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించి చదివాను. రాత్రిపూట దయ్యాలకథలేమిటి? అనకు. నాకు నమ్మకాల్లేవని నీకు తెలుసు కదా. ఏదో .. టైంపాస్ అని చదువుతూ ఉంటా వాటిని. అంతే. సరే, తరువాత స్నేహ వచ్చి అడిగింది ఏమి చదువుతున్నానని. నేను చెప్తే, “నాకు భయం, ఇప్పుడు చెప్పకు ఆ కథంతా” అనేసి పడుకుంది. సరే, తరువాత కాసేపటికి లైటాపి, బెడ్‍లైట్ ఆన్ చేసి పడుకున్నాను. ఇదంతా పదిన్నర ప్రాంతంలో జరిగింది.

“ఆ .. తర్వాత?” అన్నాడు హేమంత్.

“కాసేపటికి నాకు మెలుకువొచ్చింది. దాహంగా అనిపించడంతో, ఫ్రిజ్లో ఉన్న వాటర్ తాగుదామని లేచాను. లేచిన మనిషిని లేచినట్లే అలా నోరు తెరిచి ఉండిపోయాను. కొయ్యబారడం అంటే ఏమిటో అప్పుడే తెలిసొచ్చింది. రోమాలు నిక్కబొడుచుకోవడం కూడా అనుభవంలోకి వచ్చింది. ఎందుకంటావా? ఎదురుగా నిలబడి ఉన్నాడు .. లింకన్! నా వైపు అభావంగా చూస్తున్నాడు! నేను షాక్ లో లేచిన వాడినల్లా మళ్ళీ మంచం మీద పడిపోయాను. నేను లింకన్ వైపూ, లింకన్ నా వైపూ చూసుకున్నాం కాసేపు. ఇందాక అభావంగా చూసిన లింకన్ కళ్ళలో నాకు కోపం కనబడ్డది. ఇంతసేపూ షాక్లో మాత్రమే ఉన్న నాకు ఆ చూపు చూసి భయం వేసింది. తెలీకుండానే ముడుచుకు పోయాను. స్నేహని లేపుదామా అనుకున్నా… కానీ, చేయి కదల్లేదు. అప్పుడే అర్థమైంది నేనెంత భయంతో బిక్కచచ్చి ఉన్నానో.”

“ఏమైందిరా మరి? చివరాఖరికి మెలుకువొచ్చిందా అప్పుడు?”

“ఏరా … మధ్యలో ఆపను అన్నావ్ కదా… ఇలా వెధవ డౌట్లడిగితే నే చెప్పను పో!”

“సరే .. సరే … చెప్పు.”

“సరే, అది కలేమో అని అనుమానం వచ్చింది. కల్లో అది కలేమో అన్న అనుమానం రావడమేమిటి? అనుకున్నాను. అయినప్పటికీ ఓ సారి గిల్లి చూసుకున్నాను … నిజంగానే నొప్పేసింది. దానితో, నేను కలగనడంలేదు అని అర్థమైంది. నేను అలా గిల్లుకోడం చూసి లింకన్ పెదాలపై ఓ విషపు నవ్వు మెరిసింది. నాకు భయం పెరిగింది. కానీ, లింకన్ తో నాకు చెప్పుకోదగ్గ పరిచయమూ లేదు. లింకన్ కి నాపై తీర్చుకు తీరాల్సిన పగా లేదు … మరి ఎందుకు వచ్చాడు? అని అనుమానం వచ్చింది. కానీ … ఎలా అడగను? అయినా వెళ్ళడేంటి ఈ మనిషి … అదే దయ్యం? వచ్చినప్పట్నుంచి అదే స్థానం లో నిలబడి ఉన్నాడు .. చూస్తూ ఉన్నాడు. కాస్త ఇందాకటికంటే రెండుమూడు అడుగులు ఎత్తులో ఉన్నట్లు అనిపిస్తున్నాడు .. అంతే. ఎంతకీ వెళ్ళడేంటి? అని ప్రశ్నించుకున్నాను … నేనే. జవాబు తెలిస్తే కదా … ముందే దాహంగా ఉంది … ఇక ఇదంతా చూసేసరికి పూర్తిగా ఎండిపోయింది నాలుక. ఫ్యాన్ తిరుగుతున్నా కూడా చెమట్లు. దాహం వేస్తోంది … కదలాలంటే ఆ లింకన్ చూస్తూ ఉన్నాడు … ఏం చేస్తాడో ఏమో అని భయం!

ఇంతలో “కొంపదీసి పూర్వజన్మలు గానీ నిజంకాదు కదా! ఈ లింకన్ గాడిని …” అని అతని చూపు గుర్తొచ్చి మళ్ళీ …”సారీ! లింకన్ గారిని చంపిన వెధవని నేనే కాదు కదా అప్పట్లో!” అని సందేహం!

మళ్ళీ ఇంతలోనే నాలోని హేతువాది “ఛ! దయ్యాలేంటి? పునర్జన్మలేంటి? అంతా ట్రాష్!” అని అరిచాడు. కానీ ఎదురుగ్గా ఎప్పుడో ఎన్నో ఏళ్ళ క్రితం చనిపోయిన మనిషి కనబడుతూ ఉంటే, దాన్ని ఎలా అర్థం చేసుకోను?

నాకు తెలిసిన జవాబేదీ దొరకలేదు. తెలియంది ఎలాగో దొరకదు ఇప్పుడు. ఓ క్షణం కళ్ళు మూసుకున్నాను. మూతబడ్డ కళ్ళ సందులోంచి, కీహోల్ నుండి గదిలోకి చూసినట్లు, మళ్ళీ ఆ వైపు చూసాను.

లింకన్ ఈసారి “నిను వీడని నీడను నేనే” అని నవ్వుతున్నట్లు అనిపించింది. పాటల్లా కూడా నవ్వొచ్చని అప్పుడే అర్థమైంది. అలా కళ్ళార్పకుండా అంత సేపు అతను ఎలా నన్ను తదేకంగా చూడగలుగుతున్నాడో అర్థం కాలేదు నాకు. కానీ, అతన్ని అడగాలన్నా, అటకాయించాలన్నా, పలకరించాలన్నా – ఏమి చేయాలన్నా కూడా నాలోని ఏ భాగమూ కదలడంలేదు. పక్షవాతం వచ్చినట్లు అయిపోయింది నాకు. స్నేహ లేస్తే లింకన్ నన్ను వదుల్తాడు అనిపించింది ఎందుకో గానీ. నేను లేపలేకపోతున్నా గనుక త్వరగా పొద్దున్నైతే బాగుండు అనిపించింది. పైగా .. దయ్యాలు పగళ్ళు కనబడవంటారు కదా. ఇతను వెళ్ళిపోతాడేమో అనుకున్నా.

అసలు దయ్యాలని ఇతను, ఈవిడా వంటి సర్వనామాలతో పిలవొచ్చా? నాలోని లాజికల్ మనిషి ప్రశ్నలేయడం మొదలుపెట్టాడు.

నా బుర్ర కూడా నా అధీనం తప్పి … ఇలా ఇష్టమొచ్చినట్లు ఆలోచించడం మొదలుపెట్టింది. అసలైన నేను తప్ప నాలోని ఇతర “నేను” లు అందరూ విజృంభించేస్తున్నారు ఇలా .. ఈ లాజిక్ వెధవా, ఆ హేతువాది వెధవా అయితే మరీనూ!”

“అసలైన నేను .. ఇతర నేనులు ఏమిట్రా, తమ వదనం!” హేమంత్ మధ్యలో సందేహం వెలిబుచ్చాడు.

“అది కాదు .. అసలైన నేను అంటే … ఈ నేనుల సమాహారం అనమాట. అంటే … అందరూ వారి వారి పాళ్ళలో ఉంటారు. కానీ … నిన్న రాత్రి .. ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తించారు.”

“భయం అని చెప్పడానికి ఈ డొంకతిరుగుడు కాబోలు.” మనసులో అనుకుని హేమంత్ పైకి మాత్రం “ఆహా … సరే చెప్పు.” అన్నాడు. రాజా కొనసాగించాడు.

“అప్పుడు నాకు మళ్ళీ ఇంకో సందేహం వచ్చింది. నా ధైర్యం పరీక్షించడానికి మీరే ఎవరన్నా స్నేహతో కుమ్మక్కై ఈ ప్లానేసి ఎవర్నో పెట్టారేమో అక్కడ అని. కానీ … అక్కడ నిలబడ్డ ఆకారమేమో లింకన్ లానే ఉంది. ఇప్పటి దాకా రాని ఆలోచన అప్పుడు వచ్చింది. ఓసారి భయంగానే తల కిందకు వచ్చి, లింకన్ కాళ్ళ వంక చూసాను. అక్కడ కాళ్ళంటూ ఏమీ లేవు. ప్యాంటువరకూ కనిపిస్తోంది కానీ … కింద మరి .. ఏముందో .. ఆ బెడ్లైటు వెలుతురు చాలక తెలీడంలేదు. అనుమానమొచ్చి లింకన్ వంక చూసాను.

ఆ పెదాలపై ఇందాకటి విషపు నవ్వు. “ఇప్పుడర్థమైందా, నేనెవర్నో?” అన్నట్లు ఉంది ఆ నవ్వు. సాధారణంగా ప్రేమికులకి తెలుస్తుందేమో ఈ కళ్ళభాష, నవ్వుల భాషా! నాకు ఈ సందర్భంలో ఇలా తెలుస్తుందని అసలు ఊహించలేదు.

నేనూ, లింకన్ అలా ప్రేమికుల్లా కళ్ళతో మాట్లాడుకోడం వింతగా అనిపించినప్పుడొచ్చిందా ఆలోచన .. ఏదో ఓ పూర్వజన్మలో నేను అమ్మాయినేమో, లింకన్ లవర్నేమో .. అని. కానీ .. నవ్వొచ్చినా నవ్వలేనంత భయం. ఓపక్క లింకన్ నా ఆలోచనల్ని చదువుతున్నాడేమో అన్న అనుమానం.

ఈ కంగార్ల మధ్య ఇక దాహం ఆపుకోవడం నా వల్ల కాలేదు. దాహంతోనే ప్రాణం పోతుందేమో అన్న అనుమానం వచ్చింది. సాధారణంగా భయంగా ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటారు కదా అందరూ. నిన్నటిదాకా అది వెటకారంగా అనిపించింది కానీ, ఆ క్షణంలో నాకూ తలుచుకోవాలని అనిపించింది. కానీ, ఏ దేవుణ్ణి తలుచుకోవాలో కూడా అర్థం కాలేదు. “దేవుడా!” అని మాత్రం అనుకోగలిగాను పెదాలు కదల్చకుండానే. లింకన్ విషపు నవ్వు తీవ్రత తగ్గినట్లు అనిపించింది. నాకు ధైర్యం చిక్కి, కాస్త లేచి కూర్చున్నాను. లింకన్ అలాగే నిలబడి చూస్తున్నాడు. నేను మరోసారి “దేవుడా!” అనుకుని లేచాను. లింకన్ విషపు నవ్వు తీవ్రత ఇంకాస్త తగ్గినట్లు అనిపించింది. నేను మరింత ఉత్సాహంగా మంచం పైనుంచి కాలు బయటకు పెట్టాను .. అందులోని వణుకును గమనించినా కూడా. లింకన్ ఇంకా అక్కడ్నుంచి కదలనూ లేదు .. ఆ దృష్టి నాపైన్నుంచి మరలనూ లేదు. నేను మంచంపైనుంచి లేస్తూనే పరుగులాంటి నడకతో వెనక్కి చూడకుండా హాల్లోకి వచ్చాను. అప్పుడు వెనక్కి చూస్తే లింకన్ లేడు. “హమ్మయ్య!” అనుకుని వడివడిగా ఫ్రిజ్ వద్దకెళ్ళి ఓ బాటిల్ నీళ్ళు తాగి, ఇంకో బాటిల్ తెచ్చుకుని మళ్ళీ పడగ్గదిలోకి అడుగుపెట్టాను. యధావిధిగా లింకన్ ప్రత్యక్ష్యం మళ్ళీ! నాకు ఆ కళ్ళలోకి చూస్తూ వెళ్ళి మంచం మీద ఎలా పడుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడే రెండుసార్లు పనిచేసిన మంత్రం మళ్ళీ ఉపయోగించి కళ్ళుమూసుకునే మంచందాకా వెళ్ళాను. మంచానికి మోకాలు కొట్టుకుని నొప్పి పుట్టగానే గమ్యం చేరానని అర్థమైంది. వెంటనే దూకబోయి … ఒకవేళ లింకనొచ్చి నా మంచంపై పడుకుని ఉంటే ఎలా? అన్న సందేహమొచ్చి ఓ క్షణం ఆగాను. ఇంతలోనే .. ఇంతసేపు కదలని శాల్తీ ఇప్పుడు కదుల్తాడా? అనిపించి దూకేశాను. మంచంమీద ఉన్నానని నిర్థారించుకున్నాక కళ్ళు తెరిచాను. ఎదురుగా అవే కళ్ళు, అవే చూపులు. ఆ పుస్తకంలో వేసిన ఫొటో లాగానే ఉన్నాడు. నేను చివరిసారిగా దేవుడా అనుకుని కళ్ళుమూసుకుని, ఎందుకన్నా మంచిదని ముసుగువేసుకున్నాను. వేసుకున్నానే కానీ … నిద్రపోలేదు. ఆ దుప్పటి దారాల మధ్య ఉన్న సందుల్లోంచి వీలైనంత ప్రయత్నం చేస్తూనే ఉన్నాను … అతను ఉన్నాడా లేడా? అని చూస్తూనే ఉన్నాను.

రాత్రంతా గడిచిపోయిందని నాకు ఎప్పుడు తెలిసిందంటే … ఈ మధ్య స్నేహ యోగా మొదలుపెట్టిందిలే … ఐదుకి తను లేచింది. తను లేచిందని అలికిడి తెలిసి నేను ధైర్యంగా ముసుగు తీసాను. ఆశ్చర్యం! ఎదురుగా లింకన్ లేడు. వెంటనే స్నేహని పిలిచాను … పిలవడం కాదు అరిచాను … అప్పుడే లేచిన స్నేహ నేనలా అరవడంతో ఉలిక్కిపడింది.

“రాజా! ఎందుకలా అరిచావు? ఎంత భయపడ్డానో తెలుసా!” భయంగానే అడిగింది నన్ను.

“దీనికే ఇలా భయపడ్డావు .. రాత్రంతా నేనెంత భయపడ్డానో తెలుసా? నేను దయ్యాన్ని చూసాను రాత్రి.”

“ఆ కథలన్నీ పడుకునే ముందు చదవొద్దంటే వినవు కదా!”

“అబ్బ! నేను కథలు చదివి భయపడ్డం ముందెప్పుడన్నా చూసావా? ఇదేకదా మొదటిసారి! అంటే .. ఇది నిజంగా జరిగినట్లే కదా!”

“కలొచ్చిందా?”

“నేను నిజమంటే కల అంటావేంటి?” అని తనని కూర్చోబెట్టి కథంతా చెప్పాను.” రాజా ఊపిరి పీల్చడానికి అన్నట్లు ఆగాడు.

“ఇక్కడిదాకా బానే ఉంది … కానీ, దీనికీ, నువ్వు పొద్దున్నే పూజ చేయడానికి ఏమిటీ సంబంధం?” హేమంత్ సందేహంగా అడిగాడు.

రాజా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు “నిజానికి, నిన్న లింకన్ కనబడ్డప్పుడే నాలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. నిన్న అతనితో నా మొదటి మీటింగ్ అయ్యేసరికి ఆ ప్రశ్నలకి జవాబుకూడా దొరికిందా అనిపించింది. పొద్దున్న లేచేలోపు ఆ జవాబు కాస్తా జడివానై నాలో పేరుకున్న నా పూర్వపు విశ్వాసాలన్నీ కడిగేసింది. దాంతో … ఈ నా కొత్త అవతారం…”

“అంటే … నీ ధోరణి నీదే కానీ … మామూలు మనుష్యులు మాట్లాడే భాష మాట్లాడవు అనమాట…”

“అబ్బ! సరే… నీ భాషలో చెబుతా విను. నీకు డాన్ బ్రౌన్ అంటే ఇష్టం కదా… ఆయన నవల్లలో ఏది ఎక్కువ ఇష్టం?”

“ఏంజెల్స్ అండ్ డెమన్స్”

“ఏమిటి నీకందులో ప్రత్యేకంగా నచ్చింది?”

“ఎందుకురా ఇప్పుడు ఇది అంతా?” హేమంత్ కి విసుగు వస్తోంది.

“చెప్పు .. అది చదివినరోజుల్లో దీని గురించి ఏది నచ్చిందని చెప్పేవాడివి? ఓసారి గుర్తు తెచ్చుకో. మన మధ్య దీని పై ఓ చర్చ కూడా జరిగింది. నీ ప్రశ్నకి జవాబు ఆ చర్చలోనే ఉంది.”

“ఏది నచ్చింది .. ఓ! గుర్తొచ్చింది … సిమెట్రీ! అదేనా నువ్వు నా నుంచి ఎదురుచూస్తున్నది …??”

“సరిగ్గా అదే. సిమెట్రీ .. మంచి ఉంటే, చెడు ఉంటుంది. ఒకటి ఉన్నచోట ఇంకోటి ఉండకపోవడం కాదు. ఒకదానికొకటి దోహదం చేసుకుంటాయి. నీల్స్ బోర్ అన్నట్లు “ఆపోజిట్స్ ఆర్ కాంప్లిమెంటరీ”. ఏమంటావు?”

“అవును, అప్పుడు ఇదంతా మాట్లాడుకున్నాము. “యిన్ యాంగ్” గురించి కూడా అనుకున్నాము.”

“ఈరోజు సూర్యోదయమన్నా కాకుండానే నాకు జ్ఞానోదయమైంది అన్నానే. ఇదే చర్చని ఇక్కడికి అన్వయించుకున్నాను.”

“ఊహూ … ఇంకా అర్థం కాలేదురా.”

“అరే … రాత్రంతా లింకన్ నాకు కనిపించాడు కదా. చనిపోయిన మనిషి కనిపించాడు అంటే. దయ్యాలున్నట్లే కదా? దయ్యముంటే దేవుడూ ఉండాలి కదా?”

“ఆహా శ్రీకృష్ణపరమాత్మా! ఎంత బాగా సెలవిచ్చావురా! దయ్యాలున్నాయి కాబట్టి దేవుణ్ణి నమ్ముతున్నావా నాయనా నువ్వు?”

“హమ్మయ్య! యు గాట్ ది పాయింట్!”

“నీ మొహం పాయింట్. అసలు అక్కడ దయ్యముంటే కదా. నీకు కలొచ్చింది. అంతే. సో … నీ లాజిక్ ప్రకారం నువ్వు నాస్తికుడిగా కొనసాగొచ్చు.”

“కలకాదు అని నేనంటున్నాను. నిజంగా జరిగింది అంటున్నాను. అదే నమ్మటంలేదు ఎవరూ. నువ్వూ నమ్మలేదు. స్నేహా నమ్మలేదు.”

ఇక్కడే స్నేహ లోపలికొచ్చింది మార్కెట్ నుండి బోలెడు సామానుతో. ఈ మాటలు విని

“అయితే హేమంత్ … రాజా మొత్తం చెప్పేశాడా?”

“అబ్బో! చెప్పాక నువ్వన్నట్టే నాక్కూడా కాస్త మైండ్ బ్లాకైందిలే.”

“అదన్నమాట సంగతి …” రాజా తాపీగా సోఫాలో కూర్చుంటూ అన్నాడు.

“ఆహా .. ఎంత బాగా చెప్పాడో! స్నేహా .. నువ్వు అదృష్టవంతురాలివి. దీనికి తొలి శ్రోతవి నువ్వే కావడం నీ పూర్వజన్మ ఫలం.” హేమంత్ ఆవేశంగా అన్నాడు.

“నా అదృష్టం గురించి ఇప్పుడా … సంవత్సరం క్రితం పెళ్ళాడినపుడే తెలిసింది లే.” అని నవ్వుతూ రాజా పక్కన కూర్చుంది స్నేహ.

“కానీ .. ఇప్పుడు నాకో కొత్త సందేహం వచ్చి పడింది. ఇప్పుడే తట్టింది ఈ ఐడియా…” ఇంతలో రాజా అన్నాడు.

“అమ్మో! ఇంకో కొత్త సందేహమా .. బాబోయ్!” అన్నాడు హేమంత్. పైకి చెప్పకపోయినా కూడా స్నేహ మొహంలో అదే భావం.

“కంగారు పడకు. చిన్నదే. మరి … చెప్పనా??” మీ జవాబుతో సంబంధం లేదు ఎలాగైనా చెప్పేస్తా అన్నట్లు అన్నాడు రాజా.

“ఏం చేస్తాం. చెప్పు. బయటకెళ్ళి ఇట్లాంటివి అడిగితే కష్టం కదా. వాళ్ళెవరో రాళ్ళూ అవీ తీసుకుని ఇక్కడికి రావడం దేనికి .. అదేదో మేమే పడతాం.” హేమంత్ అన్నాడు.

“లేటెందుకు … అడిగేయ్” స్నేహ కూడా పర్మిషనిచ్చింది.

“ఇప్పుడు … మరి … దయ్యాలు చాలా ఉంటాయి కదా … సిమెట్రికల్ గా దేవుళ్ళూ చాలా మంది ఉండొద్దూ? మరి … నేను ఎవరికి పూజ చేయాలి? ఈరోజంటే కొత్త కనుక ఇంట్లో ఉన్న అందరికీ చేసేసాను. రేపట్నుంచి?”

రాజా ప్రశ్న అడిగి తల ఎత్తి చూస్తే, జుట్టు పీక్కుంటున్న హేమంత్, ఏమి చేయాలో తెలీక తలపట్టుకు కూర్చున్న స్నేహా కనిపించారు. తనలోని మార్పు వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయి ఇంకా తేరుకోలేదని అర్థమై తన ప్రశ్నకు తానే సమాధానం వెదుక్కునే ప్రయత్నంలో తను కూడా తలపట్టుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు రాజా.