పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. రచయితలకు సూచనలు గురించి suresh అభిప్రాయం:

    04/26/2009 12:33 am

    పత్రిక చూడగానే ప్రవాసం లో ఉన్న నేను పరమానంద భరితుణ్ణయ్యాను.
    మిత్రుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాదు గారి వ్యాసం సంగీత ప్రియులకి చాలా ఆసక్తిజనకం గాను , ప్రత్యక్ష పురాణం లాగా సందర్భోచిత ఆడియో క్లిప్పింగుల తో కూలంకషం గానూ ఉంది. పత్రిక ప్రచురణ లో మీరు నిలబెడుతున్న సాంకేతిక సాహిత్య విలువల ప్రమాణాలకి జోహార్లు,ఈ మాట బాగుంది. ఇందులో మీ మాటలూ బాగున్నాయి

  2. వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి M.S.Prasad అభిప్రాయం:

    04/25/2009 12:01 am

    తెలుగు వారందరికి
    వాడుక భాషా ప్రయోగం వలన కవితా వికాసం పక్కనుంచితే, భాషా వికాసం జరిగిందాలేక వినాశం జరిగిందా అనేది ఆలోచించదగిన విషయం. నాకైతే వినాశం జరిగినదనిపిస్తోంది.
    దయమాలి తుదముట్ట తలకట్లు నిగిడించి
    ధీరుడై నన్ను బాధించు నొకడు
    పాదాంబులోపల పాదంబు లిమిడించి
    వీరుడై నన్ను నొప్పించు నొకడు
    ప్రాసంబుపై పెక్కు ప్రాసంబు లడరించి
    పోటుబంటయి నన్ను పొడుచు నొకడు
    బెండు పల్కులు గూర్చి నిండైన నగలంచు
    దిట్టయై చెవులు వేధించు నొకడు

    ఖడ్గ చక్రాది రూపముల్ గానిపించి
    వర్ణముల్ మార్చి నను చిక్కుపరచు నొకడు
    కుమతు లొడ లెల్ల విరిచి ప్రాణములు తీయు
    ఒడలి పస లేక శుష్కించియున్న దాన
    రసజ్ఞులను ఆకట్టుకొనే రసాన్ని అలక్ష్యం చేసి కేవలం అద్భుతం విస్మయం కలిగించే పై దిక్కుమాలిన సర్కస్ ఫీట్ల పై దృష్టి పెట్టిన ఆనాటి కవుల ధోరణిని నిరసిస్తూ చేసిన సరస్వతీ దేవి విలాపం సరి ఐనదే. కానీ దానికి స్పందన, విస్పందన, ప్రతిస్పందన, విపరీత స్పందన బాగా ఎక్కువై ఈనాటి స్థితికి కారణమైనది. నాకైతే ఇప్పుడు మాత సరస్వతి మన ముందు నిలబడి ఈ విధంగా ఆక్రందిస్తున్నట్లు అనిపిస్తుంది.
    ప్రాస, యనుప్రాస, బహు ప్రాస, యంత్యను
    ప్రాస నా బడు నగల్ దీసినారు
    శ్లేషోప మాది విశిష్టార్ధ భూషల
    పాత పెట్టెల పార వైచినారు
    లలిత నారీకేళ రస రమ్య పాకాల
    చీనాంబరాల్ చింపి చీల్చినారు
    కంద మత్తేభాది కమనీయ గతులిచ్చు
    మంజీరముల హత మార్చినారు
    తిలక, మంగరాగము, కురుల్ తీర్చి దిద్దు
    సరణి, పారాణి, ప్రాతని పరిహరించి
    అన్ని దిగలాగి నగ్నతా ఖిన్న జేసి
    నిలిపి నారయ్యయో వీధి నేటి కవులు

    పలుభూషణంబులు వలదంటి నే గాని
    తల శిరోమణి నైన దాల్పనొక్కొ?
    నగలిన్ని మోయంగ జగడమాడితి గాని
    ఒకపేట గొలుసైన నొల్లనొక్కొ?
    పట్టు జరీ చీర పెట్టెలొల్లను గాక
    వస్త్రమే వలదని పలికితొక్కొ?
    పలుగతులను నృత్యముల సేయ భరమంటి
    నడవనే నని సుడి వడితి నొక్కొ?
    భావ భాషాది భూషల బార వైచి
    యమక గమకాదిగతులెల్ల యణగ ద్రొక్కి
    రస విలాసాఖ్యమౌ యంబరముల నూడ్చి
    నిలిపి నారయ్యయో మది తొలచినారు
    నేను మీ వ్యాసంలో ఉదహరించిన పేరెన్నిక గన్న మహా కవుల గురించి గానీ జనాదరణ పొందిన వారిఉదాహృత కవితల గురించి గానీ పై అభిప్రాయాన్ని వెలువరించ లేదు. ఈ మహా కవులందరు అద్భుత ప్రతిభా వ్యుత్పత్తి గలవారు. భాషలో అనంత పద పరిజ్ఞానం గలవారు. జనరంజకమైన భావాభి వ్యక్తికై ఛందో బంధనాలనుంతెగద్రెంచిన వారు. కావలసి వస్తే గర్భ కవిత్వాన్ని గానీ బంధ కవిత్వాన్ని గాని అలవోకగా నిర్మించగల భాషా శెముషి గలవారు.
    నేను చింతించేది తామర తంపరలుగా అనేక పత్రికలలో వచన కవిత అనే పేరుతో కవితా సరస్వతిని గాయపరచే వారి గురించి. ఈ తరహాలో నాకు తెలిసిన చాలా కవులకు 100 -150 కన్నా తెలుగు పదాలు రావు. ఒక ఆట వెలదిలో పద్యం వ్రాయగలిగే పద సామర్ధ్యం లేదు. అసలు వారికి ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి తెలిసిన పదం ఒకటే, అదీ అన్య భాషా పదం ఐనపుడు ఛందస్సు అనేది తెగగొట్టలేని అయోమయ శృంఖలగా అనిపించడంలో వింత లేదు. కనీసం ఒక లయ (మాత్రా ఛందస్సులో) ప్రకారం కూడా వ్రాయలేక ఈ నియమాలేవీ లేని వచన కవితనిఎన్నుకోవడం శొచనీయం. జన సామాన్యానికి అర్ధం అయే భాషలో వ్రాయడం మాత్రమే ముఖ్యం కాదు, జనరంజకంగా వ్రాయగలగాలి. అందుకు భాషలో పద పరిజ్ఞానం ఉండాలి. అది మృగ్యం ఔతోంది.
    ఇంకొక సంగతి. జనసామన్యానికి అర్ధం కాని సాహిత్యం నిరర్ధకమైనదనే దానిని ఎవ్వరూ ఇష్టపడరు, దానిపై మా కసహ్యం లేదు. మానేశాము అనే వాదన ఈ వ్యాసంలో బయట కూడా కర్ణతాడితమౌతోంది. జనసామాన్యానికి అర్ధం కాలేని వన్నీ పరిత్యజించాలంటే, ఒక గణితం, సర్వ విజ్ఞాన శాస్త్రాలు పరిత్యజించి గుహలలో ఉండాల్సి వస్తుంది. క్లిష్టమైన దాని ఆలోచించి అర్ధం చేసుకోవడం ద్వారానే విజ్ఞానం పెరుగుతుంది. భాషకు కూడా ఇది వర్తిస్తుందని తెలుసుకోక పోవడం వలన మన భాష ఇప్పటికే చాలా నష్టమైంది. వ్యాసకర్తగారు వొక చోట వేమన గారు జనసామాన్య భాషలో వ్రాశారన్నారు. ఆ మాట కు కాలదోషం పట్టిందని తెలుసుకుంటే వారు తమ మాటను వెనక్కు తీసుకుంటారేమో. ఎందుకంటే ఇప్పటి తెలుగు వారికి వేమన సుమతీ శతకం లు అర్ధం కావడం లేదు. ఆ గ్రాహ్య శక్తి 100-150 దాక పద పరిజ్ఞానం గలిగిన కవులకే పరిమితం. ఈ విధంగా భాష ఒక్కొక్క తరంలో క్రమక్రమంగా వినష్టమైపోతోంది. ఛందో బద్ధమైన కవిత్వం వ్రాయడం వలన కవి పద పరిజ్ఞానం పెరుగుతుంది. భాష విస్తృతమౌతుంది. తన అధీనంలో వున్న అనంత పదరాశిలో జనరంజకమైన పదాన్ని ఎన్నుకోడానికి కవికి వీలుంటుంది. నియమ బద్ధంగా ఆరంభించినవారికే ఆ నియమాలను ఎట్టి సందర్భాలలో ఎలా అతిక్రమించి జనరంజకమైన కవిత్వం వ్రాయడం సాధ్యమౌతుంది.

  3. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/24/2009 10:42 pm

    చారి గారూ!
    “నిప్పట్టు” అన్న ది రాయలసీమ ప్రాంతం వాడుక. అరిసె లేదూ అలాంటిది. ఎంత పాటి పిండి అయితే..ఆ అట్టు అంత పాటే అన్న ట్టుగా అన్నమాట. పిండి ఎంతో నిప్పట్టు కూడా అంతే అని సామెత గా అన్నమయ్య ఉపమిస్తున్నాడు. నిప్పు మీద కాల్చే అట్టు “నిప్పట్టు”..అని.

    “ఎంత మాత్రమున ఎవ్వరుదలచిన..అంత మాత్రమే నీవు ..అంతరాంతరములెంచి చూడ..పిండంతే నిప్పటు అన్న ట్టూ.”…అన్న ది
    అన్నమయ్య ..అన్న మాట. అంటే ….ఎవరి భావన ఎంత మేరకు వుందో..వారి ఊహని అనుసరించే ఆ మేరకు మాత్రమే..వారికి ఆ దేముని దర్శన ప్రాప్తి సాధ్యమౌతుంది..అని చెప్పే సందర్భంలో ఈ సామెతని అన్నమయ్య వాడటం
    మీరు గమనించండి. ఇప్పుడు మీకు భావం..సామెతతో కలిసి స్పష్టపడిందనుకుంటాను.

    రమ.

  4. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    04/24/2009 8:48 pm

    “పిండంతే నిప్పటి” అనే పలుకుబడి “పిండి కొద్ది రొట్టె” కి సమానార్థకం. బ్రౌన్ నిఘంటువు లోంచి:
    నిప్పటి (p. 0654) [ nippaṭi ] or నిప్పట్టు nippati. [Tel. నిప్పు+అట్టు.] n. A sort of cake or biscuit. ఆకులలో పెట్టి కాల్చు భక్ష్యము.
    (http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=nippaTi&table=brown)
    ఈ నడుమనే రాముని తోక పివరుడిట్లనియె అన్నట్లు మీరు ఉదహరించిన పలుకుబడిని “పిండం తేనె ఇప్పటి అన్నట్లు” అని విరిచి చదువుకున్న శబ్ద విరించిని నేను 🙂

  5. ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Dr Tatiraju Venugopal అభిప్రాయం:

    04/24/2009 12:03 pm

    తెలుగు సినీ సంగీతంలో రెండు యుగాలున్నాయి. ఒకటి ఘంటసాల యుగం. ఇంకొకటి బాలు యుగం. దేనికదే ప్రత్యేకమైనది. ఘంటసాల వారిది 30 యేళ్ళ యుగం. బాలు వారిది కూడ ఇంచుమించు అంతే. ఒక యుగం మరొక యుగానికి స్వాగతం పలికే యుగ సంధి కాలంలో వారిద్దరూ కలసి పాడిన పాటలు- ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం ‘ అనే ఉదయ గీతం మొదటిదైతే ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అనే రేయి గీతం రెండవది. ఇక ఆ తర్వాత వచ్చినవి-‘భలే మజాలే భలే ఖుషీలే టయిము రోజాలే మనం రాజాలే’, ‘దేవుడు చేసిన మనుషుల్లారా …. వినండి’. ఈ రెండు యుగాల్లో మంచి పాటలూ వచ్చాయి, ‘అయ్యో ఖర్మ’ అనుకునేలా చెడ్డ పాటలూ వచ్చాయి. ఇప్పుడు కేవలం మంచి పాటలే ముందు తరాలకు అందేలా చూడాలి. అందుకు అద్భుతమైన సాధనం- కంప్యూటరే. కంప్యూటర్ ఘంటసాల యుగంలో అంత అందుబాటులో లేదు. అందాక ఎందుకూ? క్యాసెట్లే లేవు. కాని కంప్యూటర్ యుగంలో ఘంటసాల పాట ఇంకా ఉంది. బాలు చాలా అద్రుష్టవంతులు. సాంకేతిక ప్రగతిని అంచెలంచెలుగా చూస్తూ తన గొంతును రక్షించుకుంటున్నారు. తెలుగు మాట కరువైపోతున్న ‘కన్ ఫ్యూజన్ యుగంలో తెలుగు పాట ‘రస హీనమై పోతోంది’, పాడేవారి విషయంలో ‘వారస హీనమై పోతోంది’.
    – డా. తాతిరాజు వేణుగోపాల్

  6. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి D Srinivasa Chary అభిప్రాయం:

    04/23/2009 11:12 pm

    చాలా బాగా అభివర్ణించారు అన్నమయ్య కీర్తనలోని తెలుగుతనాన్ని.
    చిన్న సందేహం. పిండంతే నిప్పటి యన్నట్లు అనే పలుకుబడికి అర్థం చెపతారా?

  7. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి ranganath middela అభిప్రాయం:

    04/23/2009 2:13 am

    భాషా విజ్ఞానాల కలబోతగా సురేష్ గారు అందించిన ఈ వ్యాసమ్ ఓ వైపు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగించడమే గాక విశ్వ సామ్యాన్ని కూడా అందించడం రచయిత పటిమను స్పష్టం చేస్తొంది.. మరిన్ని జ్ఞాపకాల కోసమ్ ఎదురుచూస్తూ ..

    రంగనాథ్ మిద్దెల

  8. అల్లాష్టకము గురించి M.S.Prasad అభిప్రాయం:

    04/23/2009 1:41 am

    ఏ కరీముద్దీన్ గారి కలం నుండి గాక ఒక కృష్ణ మోహనుని కలం నుండి వచ్చిన ఈ అల్లా స్తుతి అభినందనీయం.
    శివుడెంచగా కాళి, శ్రీ పతి కాళి, పవనాత్మజుడు విఘ్న పతియును కాళి
    నవగ్రహ దేవతల్ నారాయణుండు, వివరింప వేంకట విభుడును కాళి
    నరసింహదేవుండు నాకెంచ కాళి, గురు రామకృష్ణుండు కొండంత కాళి
    శిరిడీ నివాసుండు శ్రీకరి కాళి, అరయ దోచెడు విశ్వమంతయు కాళి
    ధరియించు వస్త్రంబు తగ కాలిజోడు, ధరనూడ్చు చీపురు, తట్టయు కాళి
    తిరువళికయు కాళి, దీపంబు కాళి, బరగ గూర్చొను గోనె పట్టయు కాళి
    అభీష్ట దైవాన్నే అంతటా చూసే వారికి నామ రూపాలతో పని లేదు. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు (న ఏసు అనేసు = ఏసు కానిది)
    అనేది ప్రపంచంలో లేదు.

  9. శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి ఆర్కే అభిప్రాయం:

    04/22/2009 10:25 pm

    కథ బావుంది. ముగింపు సరియైనదిగా లేదు.అది తప్పు. ఒకరి అవసరాన్ని(భయాన్ని) అడ్డుపెట్టుకుని లాభం పొందడమే ఈ కాలం నీతిగా మారిందా!

  10. నన్నయ హంసగీతికలు గురించి M.S.Prasad అభిప్రాయం:

    04/22/2009 1:16 am

    వ్యాసమొక్కటే గాక దానిపై పలువురు పండితుల అభిప్రాయాలు కూడా చాలా హృద్యంగాఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి వ్యాసాలు, వాటిపై అభిప్రాయాలు, చర్చలూ అనంతంగా కొనసాగాలని ఆశిస్తూ
    భవదీయుడు