పరిచయము
అమెరికా సంయుక్త రాష్ట్రపు స్వేచ్ఛానివేదనపత్రము ప్రపంచ చరిత్రలో ఒక మహత్తరమైన సంఘటన. అందులో మొదటి వాక్యము ప్రజల ఉనికికి ప్రాధాన్యత నిస్తూ “ప్రజలమైన మేము (We the people)” అనే పదాలతో ఆరంభమవుతుంది. అధ్యక్షుడు లింకన్ మహాశయుడు “ప్రజల ప్రభుత్వం, ప్రజలచే ప్రభుత్వం, ప్రజలకోసం ప్రభుత్వం ఈ భూమిపై అజరామరము (government of the people, by the people, for the people shall not perish from the earth)” అన్నారు. లింకన్‌యొక్క పై వాక్యంలో ప్రభుత్వానికి బదులు భాష, సాహిత్యం, కవిత్వం అనే పదాలు కూడా ఎంతో సమంజసంగానే ఉంటాయి. కవిత్వపు పరమావధి అది ప్రజల హృదయాలలో నాలుగు కాలాలపాటు హత్తుకొని పోవడమే.
కదిలించేది, కరిగించేది, మారేది, మార్పించేది కవిత్వమన్నారు శ్రీశ్రీ. ప్రతి పదపు అర్థానికి నిఘంటువు పుటలు తిరగవేయాలంటే ఆ కవిత్వం ఎంత గొప్పదైనా సామాన్య మానవుని రసానుభూతికి దూరమవుతుంది. తెలుగు సాహిత్యాన్ని బహుళప్రజానీకానికి అర్థమయ్యేలా రాయాలనే ఉద్యమం సుమారు వంద సంవత్సరాలకు ముందు పుట్టింది. వాడుకలో నున్న వ్యావహారిక భాషను పాఠ్య పుస్తకాలలో, పత్రికలలో, నాటకాలలో ఉపయోగించాలని తాపత్రయపడ్డవారిలో ప్రముఖులు గిడుగు రామమూర్తి పంతులుగారు. జగమెరిగిన బ్రాహ్మడికి జందెమేల యన్నట్లు ఈ రంగంలో వీరి వీరవిజయాలు అందరికీ తెలిసినవే. వీరు ఒకప్పుడు ఇలా అన్నారు – “వ్యావహారికమంటే ముందు మనం విజ్ఞానవ్యాప్తికోసం కృషి చెయ్యవలసిన అవసరం ఉంది. కవిత్వం కాదు. ఎందులోనన్నా రాసుకో. నాకభ్యంతరం లేదు. చదివినవాళ్ళు చదువుతారు. లేకపోతే లేదు. ఇతర సాధనాలకు మాత్రం వ్యావహారికం తప్పదు. సాహిత్యంలో కథలకి, నాటకాలకి వ్యావహారికమే ఉండాలని నా ఆశయం.” కవిత్వాన్ని కూడా వాడుక భాషలో రాసే ఉద్యమానికి నడుము కట్టిన వారు గురజాడ అప్పారావుగారు. ఈ మహానుభావుల నిద్దరిని నవయుగ వైతాళికులని చెప్పవచ్చు.
ఈ వ్యాసపు ముఖ్యాశయం వాడుక భాషలో తెలుగు కవిత్వం ఎలా మెల్లమెల్లగా వికసించి నేటి స్థితికి వచ్చిందన్న విషయాన్ని సోదాహరణంగా వివరించడమే. వ్యాసం కొద్దిగా పొడవైనా ఈ ఉదాహరణలు పాఠకుల ఆసక్తిని ఎక్కువ చేస్తాయని నా నమ్మకం. ఈ వ్యాసంలో ఆధునిక కవిత్వపు వైవిధ్యాన్ని, అందులోని తీరు తెన్నులను వివరించ దలచుకోలేదు. కాల్పనికవాదం, వాస్తవికత, అభ్యుదయవాదం, హేతువాదం, అధివాస్తవికాన్వేషణ, అస్తిత్వవాదం, అనుభూతివాదం, చైతన్య స్రవంతి, విప్లవవాదం, సంప్రదాయవాదం, రూపవాదం, జనామోదవాదం మున్నగు విషయాలనుగురించి ఇంకెక్కడైనా చదువుకోవాలి.
కవిత్వాన్ని సులభం చేసే ప్రయత్నాలు
సంస్కృత నాటకాలలో కథానాయకుడు, బ్రాహ్మణులు, దేవతలు తప్ప మిగిలినవారి సంభాషణలు ప్రాకృతంలో ఉంటాయి. వీరు చెప్పే పద్యాలు కూడా లయబద్ధమైన ప్రాకృత ఛందస్సులో ఉంటుంది. జనాలు చూచి, విని ఆనందిస్తేనే సాహిత్యానికి ప్రయోజనం ఉంటుందని ఆనాటి కవులకు కూడా తెలుసు. సంస్కృతము బాగుగా తెలియనివారికోసమే నన్నయ ఆంధ్రమహాభారతాన్ని తెలుగులో రాయడానికి ఆరంభించారు. అందుకే అతనితో రాజరాజనరేంద్రుడు, ఓ మహాత్మా, వ్యాసుడు చెప్పిన భారతాన్ని మీ బుద్ధిబలంతో తెలుగులో రాయండి అన్నారు –
జననుత కృష్ణద్వైపాయన
మునివృషభాభిహిత మహాభారత బ-
ద్ధనిరూపితార్థ మేర్పడఁ
దెనుగున రచియింపు మధిక ధీయుక్తిమెయిన్
– నన్నయభట్టు, ఆదిపర్వము (1.16)
అందుకే నన్నెచోడుడు “జానుతెనుగులో” కుమారసంభవాన్ని రాస్తున్నానని చెప్పారు. అందుకే పాల్కురికి సోమనాథుడు బసవపురాణము రాసేటప్పుడు తాను దేశి తెలుగు ఛందస్సైన ద్విపదలో రాస్తానని చెప్పారు.
ఉరుతర గద్య పద్యోక్తులకంటె
సరసమై పరగిన జానుతెనుంగు
చర్చింపగా సర్వసామాన్య మగుట
కూర్చెద ద్విపదలు కోర్కిదైవార
– సోమనాథుడు, బసవపురాణము
అందుకే మొల్ల కూడా “తేనెసోక నోరు తీయన యగు” విధంగా రామాయణాన్ని తెలుగులో రాస్తున్నానని చెప్పారు.
కందువ మాటలు, సామెత
లందముగాఁ గూర్చి చెప్ప నది తెనుఁగునకున్
బొందై, రుచియై, వీనుల
విందై, మఱి కానుపించు విబుధుల మదికిన్
– మొల్ల, రామాయణము (1.18)
అందుకే పోతన భాగవతాన్ని అందరూ అర్థం చేసుకొనేలా రాశారు. ప్రజాకవి వేమన కూడా తన సూక్తులను జనులు వాడే భాషలో దేశి ఛందస్సైన ఆటవెలదిలో రాశారు. వాగ్గేయకారుడైన అన్నమయ్య కూడా తన పాటలను వ్యావహారిక భాషలో ప్రజల కర్థమయ్యేటట్లు రాశారు. రామదాసు, త్యాగయ్య వంటి మిగిలిన సంగీతకారులు కూడ ఇతనిలాగే వాడుక భాషలో పాటలను రాశారు.
సంధి యుగం
పందొమ్మిదవ శతాబ్దాంతం, ఇరవైయవ శతాబ్దపు ఆరంభం తెలుగు దేశంలో మాత్రమే కాదు, భారతావనిలో ఒక సంధి యుగం. ముద్రించబడిన గ్రంథాలు జనులను కొని చదవమని ఆహ్వానించేవి. అంటే రాయసగాళ్ళు తాటాకులపై రాసుకోవలసిన అవసరం లేదు. పెద్ద ఊళ్ళలో విద్యుచ్ఛక్తి కూడా ఉండేది. కాబట్టి కష్టం లేక చదువుకోవచ్చు. నాటకాలను సమాజాలు ప్రదర్శించేవారు. అప్పుడే గ్రామఫోన్ రికార్డులు వచ్చాయి. ఇంకొక మూడు దశాబ్దాలకు మాట్లాడే సినిమా కూడా వస్తుంది. వీటితోబాటు రాజకీయాలలో కూడా ఒక కొత్త గాలి వీచింది. స్వాతంత్ర్యేచ్ఛ, స్వరాజ్యవాంఛ అనే విత్తనాలు ప్రజల హృదయాలలో మొలకెత్తి పెరగడానికి అవకాశం కలిగింది. పనుల కోసం పాశ్చాత్య విద్యావిధానం తప్పనిసరి అయింది. ఇలా నాలుగు దిక్కులనుండి వ్యావహారిక భాష అనే పెనుతుఫానుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆధునిక కవిత్వంలో వాడుక తెలుగును మొదట ఎక్కువగా ఉపయోగించిన ఘనత గురజాడ అప్పారావుగారికి దక్కుతుంది. ఈ విషయంలో వీరు యుగపురుషులు. వీరు దీనికై ఒక కొత్త ఛందస్సును ఉపయోగించారు. అదే ముత్యాలసరం. ముత్యాలసరము పదే పదే వచ్చే మూడు, నాలుగు మాత్రల మిశ్రగతిలో నడుస్తుంది. ఇట్టి గతి ఉండే వృషభగతి రగడలాటి ఛందస్సులు తెలుగులో ఉన్నా కూడా, ఇందులో విరివిగా కవితలను రాయడమనేది తెలుగు భాషకు కొత్త. ఆ ఘనత గురజాడవారికి చేరిందే. ముత్యాలసరానికి కన్నడములోని భామినీషట్పదికి తేడా లేదు. కన్నడములో షట్పదులలో మహాకావ్యాలనే రాశారు. కానీ గురజాడవారు ఈ ఛందస్సును పారసీక భాషనుండి గ్రహించినట్లు భావన. తెలుగులో కూడా ముత్యాలసరము ఛందస్సులో గురజాడ కంటె నాలుగు నెలలకు ముందుగా కింది పద్యం ప్రచురింపబడింది. కవి ఎవరో తెలియదు.
మేలుకొనుమీ భరతపుత్రుడ
మేలుకొనుమీ సుజనపుత్రుడ
మేలుకొనుమీ సచ్చరిత్రుడ
మేలుకొనవయ్యా, వత్సా, మేలుకో
వేడుకను జాతీయతయను
వేగుచుక్క పొడిచె నదుగో
కూడి వందేమాతరమ్మని
కుక్కుటము లరచెన్, వత్సా, మేలుకో
ఇందులో వత్సా, మేలుకో అనే పదాలను తొలగిస్తే ఇది అచ్చంగా ముత్యాలసరమే. గురజాడవారి మొదటి ముత్యాలసరము తోకచుక్కలోనిది. దీనిని వీరు కొత్తపాతల మేలు కలయిక అంటారు. కొత్త భావాలను కొత్త భాషలో పాత సంస్కారాన్ని అవలంబిస్తూ రాస్తున్నారని మనం అనుకోవచ్చు.
గుత్తునా ముత్యాల సరములు
కూర్చుకొని తేటైన మాటల
కొత్తపాతల మేలు కలయిక
క్రొమ్మెరుంగులు జిమ్మగా
– తోకచుక్క
గురజాడవారి సార్వత్రిక దృష్టి విశాలమైనది. గురజాడగారు కాలాతీతులు. ప్రజలందరికీ అర్థమయ్యేటట్లు రాయడం మాత్రమే గాక తమ కవితలో దేశభక్తిని పెంపొందించారు, సాంఘిక దురాచారాలను ఎత్తి చూపారు, స్త్రీకి పురుషునితో సరిసమానమైన స్థానాన్ని ఇచ్చారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నాను.
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్
ఆకులందున అణగి అమణగీ
కవిత కోయిల పలుకవలెనోయ్
పలుకులను విని దేశమం దభి-
మానములు మొలకెత్తవలెనోయ్
– దేశభక్తి
మనిషి చేసిన రాయి రప్పకి
మహిమ కలదని సాగి మొక్కుతు
మనుషులంటే రాయిరప్పల
కన్న కనిష్టం
గాను చూస్తావేల బేలా
దేవు డెకడో దాగె నంటూ
కొండకోనల వెతుకులాడే
వేలా
కన్ను తెరచిన కానబడడో
మనిషిమాత్రుడు యందు లేడో
యెరిగి కోరిన కరిగి యీడో
ముక్తి
– మనిషి
మరులు ప్రేమని మది దలంచకు
మరులు మరలును వయసుతోడనె
మాయ మర్మము లేని నేస్తము
మగువలకు మగవారి కొక్కటె
బ్రదుకు సుకముకు రాజమార్గము
ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును
ఇంతియె
మగడు వేల్పన పాత మాటది
ప్రాణ మిత్రుడ నీకు
– కాసులు
మిశ్రగతి నడకతో ఉండే ముత్యాలసరాలను మాత్రమే కాదు, వీరు చతుర్మాత్రలను కూడా ఉపయోగించారు తమ కవనాలలో. మచ్చుకు పుత్తడిబొమ్మ పూర్ణమ్మలోని ఆఖరు పద్యం –
పూర్ణమ్మ
కన్యాశుల్కం సినిమా, ఘంటసాల
కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ
– పూర్ణమ్మ (ఈ కవనాన్ని కన్యాశుల్కం చలనచిత్రంలో వినవచ్చు.)
కవిత్వము సులభంగా, అర్థవంతంగా ఉండాలి. ఆధునిక కవిత్వం ఆనందవర్ధనుని కింది సిద్ధాంతంపైన ఆధార పడినది. అసీమమైన కావ్య జగత్తుకు కవియే సృష్టికర్త. అతడు తాను చూచినదానిని ఉన్నదున్నట్లుగా రాస్తాడు అన్నదే దీని సారాంశం.
అపారే కావ్య సంసారే
కవిరేవ ప్రజాపతిః
యథాస్మై రోచతే విశ్వం
తథేదం పరివర్తతే
– ఆనందవర్ధనుడు
చిత్ర కవిత్వము, గర్భకవిత్వము, బంధ కవిత్వము, కష్టమైన పదాలు, నీరసమైన భావాలతో శృంఖలాబద్ధను చేశారని సరస్వతీదేవి నారదునితో చెప్పుకొంటుంది కందుకూరి వీరేశలింగం పంతులుగారు రాసిన సరస్వతీనారదసంవాదములో. అంటే ఆడంబరాలు కవిత్వానికి అందాన్ని ఇయ్యదని పంతులుగారి వాదన. ఆ విషయాన్ని ఎలా చెప్పారో ఇక్కడ చూడండి –
దయమాలి తుదముట్ట తలకట్లు నిగిడించి
ధీరుడై నన్ను బాధించు నొకడు
పాదాంబులోపల పాదంబు లిమిడించి
వీరుడై నన్ను నొప్పించు నొకడు
ప్రాసంబుపై పెక్కు ప్రాసంబు లడరించి
పోటుబంటయి నన్ను పొడుచు నొకడు
బెండు పల్కులు గూర్చి నిండైన నగలంచు
దిట్టయై చెవులు వేధించు నొకడు
ఖడ్గ చక్రాది రూపముల్ గానిపించి
వర్ణముల్ మార్చి నను చిక్కుపరచు నొకడు
కుమతు లొడ లెల్ల విరిచి ప్రాణములు తీయు
ఒడలి పస లేక శుష్కించియున్న దాన
ఆధునిక తెలుగు కవిత్వానికి నాందీగీతం పాడినవారు ఇద్దరు మహనీయులు, వారు రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు. భావకవిత్వానికి నాంది బహుశా రాయప్రోలువారి “లలిత”. రాయప్రోలుగారు తెలుగులో సామాన్యముగా వాడబడే ఛందస్సులోనే లలితను తీర్చి దిద్దారు. ఫలించని ప్రేమ ఇందులోని కథావస్తువు. వేంకటపార్వతీశ్వర కవులు దేశి ఛందస్సైన ద్విపదలో తమ ఏకాంతసేవను లోకప్రియముగా రాశారు. కృష్ణ శాస్త్రిగారు భావకవిత్వంలో శిఖరాలనే చేరుకొన్నారు. కాని ఇవన్నియు ఛందోబద్ధమైనవే. ఐనా కూడా జనసామాన్యానికి సులభంగా అర్థమయ్యేటట్లు కూడా ఇట్టీ కవులు కొన్ని కవితలను రాశారు. వాటికి కింద కొన్ని ఉదాహరణలు –
పొదలలో పూవువై పోయినావేమొ
ఆలలో దూడవై యరిగినావేమొ
తమ్ముల తీయగా ద్రవియించితేమొ
కలికి వేణువుతోడ కరిగినావేమొ
నిన్నెందు జూతురా చిన్నారి కృష్ణ
ఏమూల వెదికేదిరా మోహనాంగ
– రాయప్రోలు, జడకుచ్చులు, రాధ పిలుపు
లయ పెంచుతూ మధ్య
లయ దించుతూ పాట
రయ మెంచుతూ కిన్నె
రటు సోలి యిటు సోలి
తెలి నీటి మేనితో
తలిరాకు మేనితో
ఒయ్యారములు పోయెనే
కిన్నెరా
అయ్యారె యనిపించెనే
– విశ్వనాథ సత్యనారాయణ, కిన్నెరసాని పాటలు, కిన్నెర నృత్యము
నువ్వటే నువ్వటే
పువ్వు విరిసిన వయసు
నవ్వు లలమిన సొగసు
రువ్వి నా ఎదపైన
చివ్వు నంతర్హివే
నువ్వటే నువ్వటే
నువ్వటే నువ్వటే
కవ్వించి నా కాంక్ష
త్రవ్వించి నా కలలు
ఉవ్విళ్ళుగొన మనసు
దవ్వైతివే దెసల
నువ్వటే నువ్వటే
నువ్వటే నువ్వటే
జవ్వనీ ప్రణయినీ
మువ్వంపు వగలాడి
అవ్వారు ముద్ది మా
నవ్వుతూ నను వదలి
రివ్వురివ్వున మిన్ను
పవ్వళింపయితివే
నువ్వటే నువ్వటే
– అడవి బాపిరాజు, శశికళ
అభ్యుదయ కవిత్వంలో అపారమైన కీర్తి గడించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. గురజాడ తరువాత సాహిత్యాకాశంలో ఉన్నట్లుండి మెరిసిపోయిన మరొక తోకచుక్క శ్రీశ్రీ. శ్రీశ్రీ కవిత్వం చదువని తెలుగువాడు తెలుగువాడు కాదు. ఛందోబద్ధమైన కవిత్వంతో ప్రారంభించి కొత్త కొత్త దారులను తొక్కారు వీరు. కాని ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వీరి కొన్ని కవితలు వాడుక భాషలో లేదు. అందులోని కొన్ని పదాలకు నిఘంటువును వెదకాల్సిందే! ఉదాహరణకు కింది గేయంలోని పదాలు వ్యావహారికభాషకు చెందినవి కావు.
ఎగిరించకు లోహవిహంగాలను
కదిలించకు సుప్తభుజంగాలను
ఉండనీ
మస్తిష్కకులాయంలో
మనోవల్మీకంలో
– సాహసి
శ్రీశ్రీ కొత్త కొత్త ఛందస్సులలో రాశారు. మాత్రాఛందస్సును తెలుగు కవితలలో అతి రమ్యంగా వాడిన ఘనత వీరిదే. తెలుగు కవులు నిరసించిన ఎదురు నడక (లఘువు-గురువుతో ప్రారంభం) వీరి గేయాలలో పదేపదే ప్రత్యక్షమవుతాయి.
మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
– మహాప్రస్థానం
తిరుగుబాటు కవులలో తనకై ఒక స్థానాన్ని నిర్మించుకొన్న, కాదు లాగుకొన్న, “భావకవి కాని అహంభావ కవి” పఠాభి. “నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రల్తో పద్యాల నడుముల్ విరుగదంతాను, చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను” అన్నారు పఠాభి. వీరి ఫిడేల్ రాగాల డజన్‌లో పాశ్చాత్య ప్రభావం ఉంది, వ్యంగ్యం కూడా ఉంది. పదాలతో ఆడుకోగలిగిన శక్తి, నిబ్బరము వీరికుంది. వీరి కవితకు కింద ఒక ఉదాహరణ –
హవాయి కడుతీ
యవాయి పడతీ (కడు తీయ వాయి)
భవచ్చతురిమన్
విలాస గరిమన్
నుతింప నసహా
యుడీతడు సహా (అసహాయు డితడు సహా)
సఖి నీకలహా
సమాలీ కలహా (నీ కలహాస మాలిక లీక లహా)
వసంత కుసుమా
లసంత లుసుమా (కుసుమాల సంతలు సుమా)
ప్రియా విపులనే
త్రయుగ్మములనే
నుతింప గలనా
అలోహ లలనా
– యాత్రాఛందస్సులు – హ్యోల
గ్రామీణ భాషను సాహిత్యంగా తీర్చి దిద్ది అందరి మన్నలను పొందిన కవి నండూరివారు. వీరి యెంకి పాటలు పల్లెపడుచుల అమాయకత్వాన్ని, ముగ్ధత్వాన్ని, స్నేహాన్ని మనముందు చిత్రించి సంతృప్తి కలిగిస్తుంది. ఉదాహరణకు ఒక యెంకి పాట –
ఆరిపేయవే దీపమూ
యెలుగులో నీమీద నిలపలేనే మనసు
ఆరిపేయవే దీపమూ
జిమ్ముమంటా తోట సీకటై పోవాలి
సీకట్లో సూడాలి నీ కళ్ళ తళతళలు
ఆరిపేయవే దీపమూ
తళుకుతో నీ రూపు తలుసుకొని తలుసుకొని
సీకట్లో నా కళ్ళు సిల్లులడ సూడాలి
ఆరిపేయవే దీపమూ
సూపులే ఆపేసి మాపు వూసే మరిసి
వొక రెరుగ కింకోకరు వొరిగి నిదరోదాము
ఆరిపేయవే దీపమూ
– నండూరి సుబ్బారావు , ఎంకి పాటలు