“కాని ఈయన కన్నా ఎంతో తక్కువ రాసి, తోటి మనుషులమీద సానుభూతి నాలుగు గేయాల్లొ కుమ్మరించేసి (అందులొ కొన్ని వేరే దేశపు కవుల పాటల అనువాదాలు) ప్రజాకవులై పోయారు కొందరు. తడి తక్కువ. బడాయి ఎక్కువ. 🙂 కవి ఒక్కటో రెండో చిన్న పాటల పుస్తకాలు రాస్తే, వాటినుండి రోజూ ఉదహరించటం తేలిక. మనకీ కంఠతా వస్తాయి. కంఠతా వచ్చాయి కాబట్టి, పద్యాలు గొప్పవీ, కవి గొప్పవాడు అని ఒక వాదం లేవదియ్యొచ్చు.”
లైలా గారు శ్రీశ్రీ మీద వేసిన పై విసురులో వేడెక్కువ, వెలుగు మాత్రం శూన్యం! కంఠస్థం చెయ్యడం సులభం అని మహాప్రస్థానాన్ని కంఠస్థం చెయ్యరు; గొప్ప కవిత్వం అంతా కంఠస్థం చెయ్యదగ్గది కనుకే చేస్తారు. శ్రీశ్రీ బండెడు సాహిత్యం రాసినా రాయకపోయినా మహాప్రస్థానం ఒక్కటే చాలు తనని నిలపడానికి. అయినా ఈ పోలిక వలన ఒరిగేదేముంది – సాహితీ చర్చల స్థాయిని దిగజార్చడం మినహా!
మన సాహిత్య చరిత్రలో విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ – ముగ్గురూ మూడు మార్గాలకు ప్రవర్తకులంటూ కాస్త వెలుగు ప్రసరించిన వడలి వ్యాసం [1] చదవదగ్గది.
విశ్వనాథ వ్యాసం బావుంది. కాని, భాషా సంపర్కం కలచోట నివసించే వాళ్ళు మార్పుని సంబాళించుకోలేరు అని ఆయన అన్నదానికీ, భాషాశాస్త్రవేత్తలు చెప్పేదానికీ పొంతన లేదు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “సాహిత్య ప్రస్థానం – కొన్ని మజిలీలు” లో వ్యాసం, “క్లాసిక్ – రొమాంటిక్.” వడలి మందేశ్వరరావు.
JUBV ప్రసాద్ గారి వ్యాఖ్య నుండి: సుద్దాల అశోక్ తేజ అనే సినీ పాటల రచయిత, శ్రీశ్రీ “మహాప్రస్థానం” లోని “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధార పోశాను” తీసుకుని, దాన్ని మూడు లైన్ల పల్లవిగా చేసి, సొంత చరణాలు రాసుకుని, ఠాగూర్ సినిమాకి ఇచ్చారు.
సినిమాలో ఏముందో నాకు తెలియదు కాని ఆ శ్రీశ్రీ గీతం ప్రారంభం ఇది:
“నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!”
సంప్రదాయ సాహిత్యాన్నీ, అభ్యుదయ సాహిత్యాన్నీ జమిలిగానే కాదు, విడిగా నయినా విమర్శించడానికి నాకు కనీస యోగ్యత కూడా లేదు. కాని డాక్టర్ స్మైల్ గారి అభిప్రాయం రెండురోజుల నుండి నా మనసును పట్టి వదలకపోవడాన ఇది రాస్తున్నాను. ఇది వారిపై విమర్శ కాదు. దీంట్లో సాహిత్యాభిమానులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉండొచ్చనే ఆశ.
పాతసాహిత్యం సామాన్యప్రజల జీవితాన్ని కావ్యవస్తువుగా తీసుకోలేదనీ, అభ్యుదయసాహిత్యానికీ సంప్రదాయ సాహిత్యానికీ గల ముఖ్యమైన తేడా అదేననీ అంటే నేనొప్పుకుంటాను.
వరూధిని సంప్రదాయసాహిత్యానికి ప్రతీక అయితే నష్టం లేదుగాని, “భిక్షువర్షీయసి” అభ్యుదయసాహిత్యానికి ప్రతీక అయితే మనకి లోటుగానే ఉంటుందనుకుంటాను. “భిక్షువర్షీయసి” మంచి కవిత కాదని కాదు, ప్రతీక కాకూడాదనే నాఉద్దేశం.
వరూధిని ప్రవరులది ప్రేమకథ. ప్రేమకథల్లో అందానికి ప్రాముఖ్యత ఉంటుంది. అందం బాహ్య సౌందర్యం గురించీ, హృదయ సౌందర్యం గురించీ కూడానూ. అయితే ఎవరికైనా మనిషిని చూడటంతోటే ఆకట్టుకునేది బాహ్య సౌందర్యమే. నాభి లోతు దాకా పోవాలో లేదో నాకు తెలీదు కాని, వరూధినిని పరిచయం చేసిన విధం ఆకర్షణీయమే. “మగువపొలుపుఁదెలుపు నొక్క మారుత మొలసెన్,” అన్న మాటలు కవితా సౌరభం తో నిండినవే. ఈతరం కవులు కూడా స్వీకరించదగ్గవే.
ఆ పద్యాల వెనువెంటనే వరూధినిని మన కళ్ళముందట నిల్పే పద్యమిది:
తిక్కన, సూరన లను మించి ఇంత సుకుమారమైన పద్యం మన భాషలోనే లేదన్నారు పుట్టపర్తి [1]. అదెందుకో తెలుసుకునే పరిజ్ఞానం నాకు లేదు కాని, “ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి రతిపారవశ్య విభ్రమము తెలుప,” అన్నది నన్నాకర్షించింది.
కారణం దానిపై రారా ఇచ్చిన వివరణలు. ఆయన దానిని “రసపారవశ్య” మని చదువుకున్నాడు. సుకుమార హృదయం గలవాళ్ళే సాహిత్యంలోనైనా ఏకళలోనైనా పారవశ్యం చెందుతారనీ, “కవితా! ఓ కవితా!” లో శ్రీశ్రీ చెప్పిన “క్షణికమై, శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం,” పెద్దన చెప్పిన పారవశ్యమూ ఒకటేననీ అన్నాడు. నాకది నచ్చింది.
ఇంతకీ రారా ఈ మాటలన్నది కొడవటిగంటి కుటుంబరావు రాసిన కొన్ని ప్రేమకథలను విశ్లేషించే సందర్భంలో [2]. కుటుంబరావు రాసిన పెద్దకథ “కురూపి” లో అనాకారిగా కనకం ప్రపంచంలోకి ప్రవేశించిన సరస్వతి అతనిని తన హృదయసౌందర్యం ద్వారా చివరికెలా వశం చేసుకుంటుందీ వివరిస్తూ శిల్పానికి గల ప్రాముఖ్యతని వివరించాడు.
సమాజంలో అందవిహీనమైన స్త్రీ పురుషులు ఉండితీరతారు. మరి వాళ్ళ ప్రేమా పెళ్ళీ లాంటి చిక్కు సమస్యలు తీరేదెలా? దీనికి కుటుంబరావు ఇచ్చిన సమాధానం – ఆధ్యాత్మికం. అంటే అదేదో పరలోకానికి సంబంధించిందని కాదు. మనిషి నుండి వేరే మనిషి పొందే లక్షలాది అనుభూతుల్లో అందం ఇచ్చేది ఒక్కటేననీ, అంతకంటే గాఢమైన అనుభూతులు చాలా ఉంటాయనీ, వీటి మూలంగా ప్రేమా పెళ్ళి సఫలం అవుతాయనీ వ్యక్తం చెయ్యడనికే “కురూపి” రాశానన్నాడు.
“అందచందాలు లేని భార్యలను ఆప్యాయంగా ప్రేమించే భర్తలున్నట్టు నాకు చిన్నతనం నుండి కూడా తెలుసు. నాకు తెలియనిదల్లా నేటి మన సమాజం కిందకే దిగుతున్నదో, మీదికో ఎక్కుతున్నదో, నేటీ యువకులు పైనే చూస్తున్నారో, కిందకో చూస్తున్నారో … అది మాత్రమే,” అని కొంత నిరాశపడ్డాడు.
కుటుంబరావువి చదవ్వలసిన ప్రేమకథలు. అవి అభ్యుదయసాహిత్యాన్ని “భిక్షువర్షీయసి” కవితా పరిమితుల్ని దాటి విస్తరింపచేస్తాయి.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1]. “వ్యాసవల్మీకం” లో “వరూధిని” అన్న వ్యాసం. పుట్టపర్తి నారాయణాచార్యులు, 2004. “వరూధిని హృదయమున రససముద్రమున్నది. మాటలలో కవిత యున్నది. ప్రకృతి యొక్క విచికిలస్వరూపము వరూధిని…” అని ముగించారు. ఈయనా, రారా, ఇద్దరూ ప్రొద్దుటూరు వారే! వాళ్ళూ, శ్రీశ్రీ, కొకు, ఇంకా కొందరు అభ్యుదయరచయితలూ కలిసి “సంవేదన” ఆవిష్కరణ సందర్భంగా తీయించుకున్న ఫొటొ ఈ పుస్తకంలో ఉంది.
[2] “కుటుంబరావు సాహిత్యం,” అయిదవ సంపుటం లో “భావుకుల రచయిత కొకు,” అన్న వ్యాసం, రాచమల్లు రామచంద్రారెడ్డి. 1983. కవులలోకెల్లా అల్లసాని పెద్దన తన అభిమాని కవి అని చాటుకుని, “కవిత్వానికి కావలసింది ఆవేశబలం కాదు, అనుభూతి సౌకుమార్యం,” అన్న విలక్షణ విమర్శకుడు రారా.
శ్రీశ్రీ షష్టిపూర్తికి ఇస్మాయిల్ రాసిన “శ్రీశ్రీ జన్మ వృత్తాంతం,” అన్న వ్యాసంలో, “కవిత్వమైనా తత్త్వమైనా సందేహాల్లోంచి, ఆందోళన నించి, తిరుగుబాటు నించీ పుడుతుంది. ప్రశ్నలే శాశ్వతం. సమాధానాలు కావు. సమాధానాలతో సంతృప్తి పడితే వెంటనే చస్తుంది కవి ప్రతిభ,” అన్నారు.
ప్రశ్నలతో కూర్చిన పదచిత్రాలతో నిండిన కవిత మనసుని పట్టేసింది. తూచేరాళ్ళని కాదు గాని, నేను స్థూలంగా కవితలని – అర్థంకాని, మామూలు, మంచి, గొప్ప అని – నాలుగు రకాలుగా చెప్పుకుంటాను. ఇది నిస్సందేహంగా మంచి కవిత. నా దృష్టిలో గొప్ప కవిత్వానికున్న ఒక గుణం – కంఠస్థనీయం కావడం. ఈ కవిత గొప్పది కాగలిగి ఉండీ కాలేదనిపించింది. అందుకు అక్కడక్కడా అనవసరంగా వాడిన మాటలే కారణం. క్లుప్తత ముఖ్యం అంటారు, ముఖ్యంగా కవిత్వానికి.
నాలుగు వందల సంవత్సరాల క్రితం, 1609లో, ఆధునిక విజ్ఞానశాస్త్రానికి పితామహుడైన గెలీలియో, తను కొత్తగా చేసిన టెలెస్కోపుతో సముద్రంలో దూరంగా కంటికి ఆనని నౌకలని చూపెట్టి వ్యాపారస్తుల మన్ననలు పొందాడు. ఆ టెలెస్కొపునే ఆకాశం వైపు మళ్ళించి సూర్య, శుక్ర, చంద్రాదుల రహస్యాలు చూపెట్టి సంచలనం సృష్టించాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నదనీ, ప్రకృతి రహస్యాలని వివేచనతో, పరిశీలనతో తెలుసుకోవాల్సిందేగాని పవిత్ర గ్రంథాల ద్వారా కాదనీ నమ్మి, మతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. గృహనిర్బంధితుడయి శిక్ష అనుభవించాడు – డెబ్భై ఏళ్ళ వయసులో! చివరకి అంధుడిగా మరణించాడు.
ఇప్పుడు ఈకథ ఎందుకు చెప్పానంటే, గెలీలియో చేసిన విశ్వరూప ప్రదర్శన నాల్గవ శతాబ్ది ఉత్సవాలకి ప్రపంచానికే కానుకగా ఓ టెలెస్కోపునివ్వాలని ఏడెనిమిదేళ్ళ క్రితం Jim Gray, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో పనిచేసే ఖగోళ శాస్త్రజ్ఞుడు Alex Szalay సంకల్పించారు. వాళ్ళు మొదలెట్టిన ప్రాజెక్టు అనేకమంది ఇతరుల సహాయంతో సఫలం కాబోతోంది. శాస్త్రజ్ఞులూ, పిల్లలూ, ఆసక్తిగల పెద్దలూ సులభంగా కంప్యూటర్ ని టెలెస్కోపుగా వాడి విశ్వరూపాన్ని సందిర్శించవచ్చు: http://www.worldwidetelescope.org/
మీరు బూదరాజు రాధాకృష్ణ గారి వాక్యాలు అర్థం కాలేదన్నారు. సందర్భం అవసరం కావచ్చు. ఆ వ్యాసం అందుబాటులో ఉన్న “తెలుగు సంగతులు” అన్న పుస్తకంలో ఉంది. ఆయన రచనలన్నీ చదవదగ్గవి.
హనుమంతరావు గారూ, నాకు రాధాకృష్ణగారి వ్యాక్యాలు అర్థం కాలేదు కానీ, మీరు చెప్పింది – రచయితలు పాఠకులవిమర్శలని సహృదయతతో స్వీకరించి ఆలోచించుకోవావి అన్నది అర్థం అయింది. ఒప్పుకుంటాను. రచయితలందరితరఫునా నేను వాదించడంలేదు కానీ, నామటుకు నేను నారచయితమిత్రులతో సంప్రదించి మార్పులు చేసుకున్న సందర్బాలున్నాయి.
బ్రహ్మానందం గారు వెలిబుచ్చిన రెండు అభిప్రాయాలు – రచయితలు తామేదో పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారు అనీ, ఈమాటవారు తమకి వచ్చిన విమర్శనలన్నిటినీ నిష్పక్షపాతంగా ప్రచురిస్తున్నారు అనీ.
ఈమాట వారు విమర్శలని ప్రచురిస్తారు కానీ కథలకి అలా కాదు. తమ కొలమానాలకి నప్పితేనే వేసుకుంటారు. అంటే ఆ రచన కనీసం ఒక రేటింగుకి నోచుకున్నట్టే.. రచయితలనుండీ పాఠకులు సహృదయత ఆశించడం ఎంత న్యాయమో, పాఠకులనుండీ రచయితలు కూడా అలాటి సహృదయతనే ఆశిస్తారు.
ఇలాటికథలు రాయకండి అని రచయితలకీ, ఇలాటివి వేసుకోకండి అని సంపాదకులకీ చెప్పడం సమంజసమే అనుకునే పాఠకులు తాము పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారేమోనని అనుకోడానికి అవకాశం వుంది కదా,
మీ సూచనలకి కృతజ్ఞతలు. మీరు చెప్పిన పుస్తకాలు కొనే శక్తీ, చదవాలనే ఆసక్తీ ఉన్నాయి. కాని అవి చాలవు; చదవాలనే దీక్షా, పట్టుదలా కావాలి! నేను పాత సాహిత్యాన్ని సులభంగా ఆకళింపు చేసుకోలేకపోవడానికి కారణం నా ఇంగ్లీషు చదువు కాదు. నేను ఇటివలి వాణ్ణీ కాదు.
పదో తరగతిదాకా తెలుగు మీడియం లోనే చదివాను. ఇంటర్ ఇంగ్లీషు మీడియం అయినా తెలుగు కూడా ఒక సబ్జెక్ట్. కాలేజీ చదువుల తర్వాత గత పాతికేళ్ళుగా సాహిత్యపరిచయం తక్కువ. వావిళ్ళా, దేవస్థానం వాళ్ళూ చేస్తున్న కృషి చెప్పుకోదగ్గదే కాని, సామాన్య పాఠకుడు తనంతటతాను మన కావ్యాలు – వ్యాఖ్యానాలున్నా – చదవడం శ్రమతో కోడిన వ్యవహారం అన్నది నాకు అనుభవపూర్వకం.
అయితే ఎవరైనా సందర్భోచితంగా ఏదన్నా పద్యాన్ని ఉదహరిస్తే, దాని గురించి ఇంకాస్త తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అందుకు స్వానుభవం నుంచి ముచ్చటగా మూడు ఉదాహరణలు :
1.. ఉప్పల లక్ష్మణరావు రాసిన “అతడు-ఆమె” నవలలో ‘కమ్యూనిస్టు’ చెల్లి అక్కదగ్గర కెళ్ళి పెద్దన మీద ఫిర్యాదు చేస్తుంది – వరూధిని, “నిన్ను వలచి వచ్చాను,” అని ప్రవరుడితో అంటే చులకనయిపోతుందా? అని:
2. తానా 2005 సూవనీర్లో వెలగా వెంకటప్పయ్య వ్యాసం, “తెలుగునాట చదివే అలవాటు పెంచిన గ్రంథాలయోద్యమం,” లో మనరాష్ట్రంలో ప్రస్తుత గ్రంథాలయాల దుస్థితిని వివరిస్తూ ఈ పద్యం ఉదహరించారు. “యుద్ధం ఆపడం నీ చేతిలో ఉంది,” అని ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు హెచ్చరించే సందర్భం:
“సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే శక్తి కలిగి ఉండి, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికి, సర్వ అనర్థాలకు కారణం అవుతుంది.”
3. సైన్సూ, సాహిత్యాలలో ప్రతిభావంతుడైన మహీధర నళినీమోహన్ రాసిన “కేలెండర్ కథ” లో మన దేశంలో కాలాన్ని ఎలా విభజించారో విశదపరుస్తూ, క్రీడాభిరామంలో ఇద్దరు మిత్రులు ఓరుగల్లు వీధుల్లో తిరుగుతూ నగర విశేషాలని వర్ణించిన పద్యం ప్రస్తావన ఉంది:
అది చదివి క్రీడాభిరామం ఇంకాస్త చదవాలనే ఆసక్తి పెరిగింది.
ఈ రీతిన అప్పుడప్పుడు అరా ముక్కా చదివితే ఎన్నేళ్ళకి ఏ కావ్యమైనా గట్టెక్కుతుంది? నిజమే, బహుశా ఇది కావ్య పఠనా మార్గం కాదు. కాని యుక్త వయసులో ఇలా పాత సాహిత్యంతో పరిచయం పెరిగితే కొన్నాళ్ళకి తమంతట తామే చదువుకోగల స్థాయికి చేరుకోవచ్చు. అందుకు తెలుగునాడి లో “రసధుని” శిర్షికా, ఈమాటలో పాత సాహిత్యంపై వచ్చే కొన్ని వ్యాసాలూ సహాయపడతాయి.
ఇది నేను రాయడానికి కారణం మిమ్మల్ని ఖండించడానికి కాదు; నా అనుభవం మిగిలినవాళ్ళకి కొంత ఉపయోగపడుతుందేమోనని ఆశతో.
కథనంలోని లోపాలకి బాధ్యుడు రచయిత. వాటిని పాత్రకి ఆపాదించడం భావ్యం కాదేమో. దానివలన మన దృష్టి కథ ముఖ్యోద్దేశం మీద కాక వేరే వాటి మీదకి మళ్ళే ప్రమాదం ఉంది.
సుందరం ముందర మదర్స్ డే అంటే అనుమానంగానో తృణీకారంతోనో చూసినా, ఆరోజు ఎలా గడపాలి అన్న చర్చలో అతని వాదన సవ్యంగానే ఉంది.
మీకు సుందరం, వరలక్ష్మి, జీవితంలో అనేక సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద చాలా అనుమానాలుండొచ్చు. కాని ఇది కథానిక – ఓ సంఘటన ఆధారంగా ఒక జీవిత కోణంపై వెలుగు చూపే ప్రయత్నం. పాత్రల విస్తార జీవితాన్ని విశ్లేషించడానికి నవల కాదు.
ఈ మాటల్లో నాకు లింగ వివక్షతతో కూడిన కుటుంబ జీవనంనుంచి స్వేచ్ఛ కన్నా గానుగెద్దు బతుకైపోయిన జీవితంనుంచి వొకరోజు ఆటవిడుపు కోసం తపనే కనిపిస్తుంది.
బ్రతుకలా తయారుకావడానికి పిల్లల బరువూ, ఇంటి పనీ మగవాడి కంటె ఆడదే ఎక్కువ భరించడాన కాదా? ఈ కథ మనం మదర్స్ డే జరుపుకునే తీరులోని అసంబద్ధతని చూపెడుతున్నా, దీని ప్రాధాన్యత నిత్యజీవితంలో మన ఇంట్లో కళ్ళెదుటే సాగే అసమానత గురించి కాస్తన్నా ఆలోచింపచేయడమే.
కొన్ని సంభాషణలు ఉపన్యాసాలుగా, కొంత కథనం ఉపదేశంగా ఉండి కథకు కాస్త లోపం వచ్చినా, భూషణ్ గారన్నట్లు కథాంశం మంచిది. “జీవితాన్ని విమర్శించడం, అలంకరించడం, ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం,” అన్న కుటుంబరావు మాటలు గుర్తొచాయి.
“యేడాదంతా కుటుంబాన్నంటి పెట్టుకునే వుంటాం కదా? ఒక్క రోజు స్వేచ్ఛగా వుంటే తప్పేంటీ?” అంది ఇంకొకావిడ ఘాటుగా.
ఇది మనం సాధారణంగా వినే మాటే. కాస్త ఆలోచిస్తే దీంట్లో ఉన్న అమానుషం తెలుస్తుంది. సంవత్సరం పొడుగూతా లేని స్వేచ్ఛ గురించి ఆలోచింపచేస్తుంది.
“స్వేచ్ఛాలేమిలో వుండే (ఆత్మవంచనవల్ల కలిగే) సుఖం మరిగితే స్వేచ్ఛలో వుండే తృప్తి వో పట్టాన రుచించదు. ఆస్తిలోనూ, అధికారంలోనూ, విద్యలోనూ, వృత్తిలోనూ, సాంఘిక పరిగణనలోనూ చారిత్రకంగా విహితమైన జాతికి మానసికంగానూ శారీరకంగానూ సామర్థ్యం లేకపోవడం సహజమేగానీ; అనివార్యం కాదు.
ఆడది అన్నింటా తనతో ఆచరణలో సరిసమానమైతే యెన్ని బరువులూ బాధ్యతలూ తప్పుతాయో తెలుసుకోలేని మూర్ఖుడు మగ వెధవ. మరి దురహంకార అధికార పదవీ వ్యామోహం ఆపైన చెల్లిచావదే! అందుగ్గాను మూర్ఖంగా గాడిద బరువు మొయ్యటానికి సిద్ధపడతాడు.”
అంటూ ఓ రెండు పేజీల అగ్నికణాన్ని వదిలాడు వడ్డెర చండీదాస్. 1982 ఆంధ్రజ్యోతి వారపత్రిక ఉగాది ప్రత్యేక సంచికలో, “అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో” పేరిట . “చీకట్లోంచి చీకట్లోకి” కథా సంపుటి చివర “యీ కథానగ్నిక” పేరుతో అందుబాటులో ఉంది. చదవదగ్గది
గ్రామ్యమా? వాడుకభాషా? గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
06/18/2008 10:34 pm
లైలా గారు శ్రీశ్రీ మీద వేసిన పై విసురులో వేడెక్కువ, వెలుగు మాత్రం శూన్యం! కంఠస్థం చెయ్యడం సులభం అని మహాప్రస్థానాన్ని కంఠస్థం చెయ్యరు; గొప్ప కవిత్వం అంతా కంఠస్థం చెయ్యదగ్గది కనుకే చేస్తారు. శ్రీశ్రీ బండెడు సాహిత్యం రాసినా రాయకపోయినా మహాప్రస్థానం ఒక్కటే చాలు తనని నిలపడానికి. అయినా ఈ పోలిక వలన ఒరిగేదేముంది – సాహితీ చర్చల స్థాయిని దిగజార్చడం మినహా!
మన సాహిత్య చరిత్రలో విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ – ముగ్గురూ మూడు మార్గాలకు ప్రవర్తకులంటూ కాస్త వెలుగు ప్రసరించిన వడలి వ్యాసం [1] చదవదగ్గది.
విశ్వనాథ వ్యాసం బావుంది. కాని, భాషా సంపర్కం కలచోట నివసించే వాళ్ళు మార్పుని సంబాళించుకోలేరు అని ఆయన అన్నదానికీ, భాషాశాస్త్రవేత్తలు చెప్పేదానికీ పొంతన లేదు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “సాహిత్య ప్రస్థానం – కొన్ని మజిలీలు” లో వ్యాసం, “క్లాసిక్ – రొమాంటిక్.” వడలి మందేశ్వరరావు.
సడిచేయకే గాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/27/2008 7:17 pm
“జయభేరి”
JUBV ప్రసాద్ గారి వ్యాఖ్య నుండి:
సుద్దాల అశోక్ తేజ అనే సినీ పాటల రచయిత, శ్రీశ్రీ “మహాప్రస్థానం” లోని “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధార పోశాను” తీసుకుని, దాన్ని మూడు లైన్ల పల్లవిగా చేసి, సొంత చరణాలు రాసుకుని, ఠాగూర్ సినిమాకి ఇచ్చారు.
సినిమాలో ఏముందో నాకు తెలియదు కాని ఆ శ్రీశ్రీ గీతం ప్రారంభం ఇది:
“నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!”
కొడవళ్ళ హనుమంతరావు
పేరులేదు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/27/2008 12:09 am
వరూధిని అందం, సరస్వతి సౌందర్యం
సంప్రదాయ సాహిత్యాన్నీ, అభ్యుదయ సాహిత్యాన్నీ జమిలిగానే కాదు, విడిగా నయినా విమర్శించడానికి నాకు కనీస యోగ్యత కూడా లేదు. కాని డాక్టర్ స్మైల్ గారి అభిప్రాయం రెండురోజుల నుండి నా మనసును పట్టి వదలకపోవడాన ఇది రాస్తున్నాను. ఇది వారిపై విమర్శ కాదు. దీంట్లో సాహిత్యాభిమానులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉండొచ్చనే ఆశ.
పాతసాహిత్యం సామాన్యప్రజల జీవితాన్ని కావ్యవస్తువుగా తీసుకోలేదనీ, అభ్యుదయసాహిత్యానికీ సంప్రదాయ సాహిత్యానికీ గల ముఖ్యమైన తేడా అదేననీ అంటే నేనొప్పుకుంటాను.
వరూధిని సంప్రదాయసాహిత్యానికి ప్రతీక అయితే నష్టం లేదుగాని, “భిక్షువర్షీయసి” అభ్యుదయసాహిత్యానికి ప్రతీక అయితే మనకి లోటుగానే ఉంటుందనుకుంటాను. “భిక్షువర్షీయసి” మంచి కవిత కాదని కాదు, ప్రతీక కాకూడాదనే నాఉద్దేశం.
వరూధిని ప్రవరులది ప్రేమకథ. ప్రేమకథల్లో అందానికి ప్రాముఖ్యత ఉంటుంది. అందం బాహ్య సౌందర్యం గురించీ, హృదయ సౌందర్యం గురించీ కూడానూ. అయితే ఎవరికైనా మనిషిని చూడటంతోటే ఆకట్టుకునేది బాహ్య సౌందర్యమే. నాభి లోతు దాకా పోవాలో లేదో నాకు తెలీదు కాని, వరూధినిని పరిచయం చేసిన విధం ఆకర్షణీయమే. “మగువపొలుపుఁదెలుపు నొక్క మారుత మొలసెన్,” అన్న మాటలు కవితా సౌరభం తో నిండినవే. ఈతరం కవులు కూడా స్వీకరించదగ్గవే.
ఆ పద్యాల వెనువెంటనే వరూధినిని మన కళ్ళముందట నిల్పే పద్యమిది:
“తతనితం బాభోగ ధవళాంశుకములోని
అంగదట్టపు కావిరంగువలన
శశికాంతమణిపీఠి జాజువారగ కాయ
లుత్తుంగ కుచపాళి నత్తమిల్ల
తరుణాంగుళీ ధూత తంత్రీస్వనంబుతో
జిలిబిలిపాట ముద్దులు నటింప
ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి
రతిపారవశ్య విభ్రమము తెలుప
ప్రౌఢి పలికించు గీతప్రబంధములకు
కమ్ర కరపంకరుహ రత్న కటక ఝణఝ
ణధ్వనిస్ఫూర్తి తాళమానములు కొలుప
నింపు తళుకొత్త వీణ వాయింపుచుండి.”
తిక్కన, సూరన లను మించి ఇంత సుకుమారమైన పద్యం మన భాషలోనే లేదన్నారు పుట్టపర్తి [1]. అదెందుకో తెలుసుకునే పరిజ్ఞానం నాకు లేదు కాని, “ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి రతిపారవశ్య విభ్రమము తెలుప,” అన్నది నన్నాకర్షించింది.
కారణం దానిపై రారా ఇచ్చిన వివరణలు. ఆయన దానిని “రసపారవశ్య” మని చదువుకున్నాడు. సుకుమార హృదయం గలవాళ్ళే సాహిత్యంలోనైనా ఏకళలోనైనా పారవశ్యం చెందుతారనీ, “కవితా! ఓ కవితా!” లో శ్రీశ్రీ చెప్పిన “క్షణికమై, శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం,” పెద్దన చెప్పిన పారవశ్యమూ ఒకటేననీ అన్నాడు. నాకది నచ్చింది.
ఇంతకీ రారా ఈ మాటలన్నది కొడవటిగంటి కుటుంబరావు రాసిన కొన్ని ప్రేమకథలను విశ్లేషించే సందర్భంలో [2]. కుటుంబరావు రాసిన పెద్దకథ “కురూపి” లో అనాకారిగా కనకం ప్రపంచంలోకి ప్రవేశించిన సరస్వతి అతనిని తన హృదయసౌందర్యం ద్వారా చివరికెలా వశం చేసుకుంటుందీ వివరిస్తూ శిల్పానికి గల ప్రాముఖ్యతని వివరించాడు.
సమాజంలో అందవిహీనమైన స్త్రీ పురుషులు ఉండితీరతారు. మరి వాళ్ళ ప్రేమా పెళ్ళీ లాంటి చిక్కు సమస్యలు తీరేదెలా? దీనికి కుటుంబరావు ఇచ్చిన సమాధానం – ఆధ్యాత్మికం. అంటే అదేదో పరలోకానికి సంబంధించిందని కాదు. మనిషి నుండి వేరే మనిషి పొందే లక్షలాది అనుభూతుల్లో అందం ఇచ్చేది ఒక్కటేననీ, అంతకంటే గాఢమైన అనుభూతులు చాలా ఉంటాయనీ, వీటి మూలంగా ప్రేమా పెళ్ళి సఫలం అవుతాయనీ వ్యక్తం చెయ్యడనికే “కురూపి” రాశానన్నాడు.
“అందచందాలు లేని భార్యలను ఆప్యాయంగా ప్రేమించే భర్తలున్నట్టు నాకు చిన్నతనం నుండి కూడా తెలుసు. నాకు తెలియనిదల్లా నేటి మన సమాజం కిందకే దిగుతున్నదో, మీదికో ఎక్కుతున్నదో, నేటీ యువకులు పైనే చూస్తున్నారో, కిందకో చూస్తున్నారో … అది మాత్రమే,” అని కొంత నిరాశపడ్డాడు.
కుటుంబరావువి చదవ్వలసిన ప్రేమకథలు. అవి అభ్యుదయసాహిత్యాన్ని “భిక్షువర్షీయసి” కవితా పరిమితుల్ని దాటి విస్తరింపచేస్తాయి.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1]. “వ్యాసవల్మీకం” లో “వరూధిని” అన్న వ్యాసం. పుట్టపర్తి నారాయణాచార్యులు, 2004. “వరూధిని హృదయమున రససముద్రమున్నది. మాటలలో కవిత యున్నది. ప్రకృతి యొక్క విచికిలస్వరూపము వరూధిని…” అని ముగించారు. ఈయనా, రారా, ఇద్దరూ ప్రొద్దుటూరు వారే! వాళ్ళూ, శ్రీశ్రీ, కొకు, ఇంకా కొందరు అభ్యుదయరచయితలూ కలిసి “సంవేదన” ఆవిష్కరణ సందర్భంగా తీయించుకున్న ఫొటొ ఈ పుస్తకంలో ఉంది.
[2] “కుటుంబరావు సాహిత్యం,” అయిదవ సంపుటం లో “భావుకుల రచయిత కొకు,” అన్న వ్యాసం, రాచమల్లు రామచంద్రారెడ్డి. 1983. కవులలోకెల్లా అల్లసాని పెద్దన తన అభిమాని కవి అని చాటుకుని, “కవిత్వానికి కావలసింది ఆవేశబలం కాదు, అనుభూతి సౌకుమార్యం,” అన్న విలక్షణ విమర్శకుడు రారా.
పేరులేదు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/23/2008 9:29 pm
“ప్రశ్నలే శాశ్వతం”
శ్రీశ్రీ షష్టిపూర్తికి ఇస్మాయిల్ రాసిన “శ్రీశ్రీ జన్మ వృత్తాంతం,” అన్న వ్యాసంలో, “కవిత్వమైనా తత్త్వమైనా సందేహాల్లోంచి, ఆందోళన నించి, తిరుగుబాటు నించీ పుడుతుంది. ప్రశ్నలే శాశ్వతం. సమాధానాలు కావు. సమాధానాలతో సంతృప్తి పడితే వెంటనే చస్తుంది కవి ప్రతిభ,” అన్నారు.
ప్రశ్నలతో కూర్చిన పదచిత్రాలతో నిండిన కవిత మనసుని పట్టేసింది. తూచేరాళ్ళని కాదు గాని, నేను స్థూలంగా కవితలని – అర్థంకాని, మామూలు, మంచి, గొప్ప అని – నాలుగు రకాలుగా చెప్పుకుంటాను. ఇది నిస్సందేహంగా మంచి కవిత. నా దృష్టిలో గొప్ప కవిత్వానికున్న ఒక గుణం – కంఠస్థనీయం కావడం. ఈ కవిత గొప్పది కాగలిగి ఉండీ కాలేదనిపించింది. అందుకు అక్కడక్కడా అనవసరంగా వాడిన మాటలే కారణం. క్లుప్తత ముఖ్యం అంటారు, ముఖ్యంగా కవిత్వానికి.
తనకి పేరులేకపోయినా కవికి పేరుతెచ్చే కవిత.
కొడవళ్ళ హనుమంతరావు
అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/21/2008 9:30 pm
బడిపిల్లలకీ, ఆసక్తి గల పెద్దలకీ
నాలుగు వందల సంవత్సరాల క్రితం, 1609లో, ఆధునిక విజ్ఞానశాస్త్రానికి పితామహుడైన గెలీలియో, తను కొత్తగా చేసిన టెలెస్కోపుతో సముద్రంలో దూరంగా కంటికి ఆనని నౌకలని చూపెట్టి వ్యాపారస్తుల మన్ననలు పొందాడు. ఆ టెలెస్కొపునే ఆకాశం వైపు మళ్ళించి సూర్య, శుక్ర, చంద్రాదుల రహస్యాలు చూపెట్టి సంచలనం సృష్టించాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నదనీ, ప్రకృతి రహస్యాలని వివేచనతో, పరిశీలనతో తెలుసుకోవాల్సిందేగాని పవిత్ర గ్రంథాల ద్వారా కాదనీ నమ్మి, మతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. గృహనిర్బంధితుడయి శిక్ష అనుభవించాడు – డెబ్భై ఏళ్ళ వయసులో! చివరకి అంధుడిగా మరణించాడు.
ఇప్పుడు ఈకథ ఎందుకు చెప్పానంటే, గెలీలియో చేసిన విశ్వరూప ప్రదర్శన నాల్గవ శతాబ్ది ఉత్సవాలకి ప్రపంచానికే కానుకగా ఓ టెలెస్కోపునివ్వాలని ఏడెనిమిదేళ్ళ క్రితం Jim Gray, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో పనిచేసే ఖగోళ శాస్త్రజ్ఞుడు Alex Szalay సంకల్పించారు. వాళ్ళు మొదలెట్టిన ప్రాజెక్టు అనేకమంది ఇతరుల సహాయంతో సఫలం కాబోతోంది. శాస్త్రజ్ఞులూ, పిల్లలూ, ఆసక్తిగల పెద్దలూ సులభంగా కంప్యూటర్ ని టెలెస్కోపుగా వాడి విశ్వరూపాన్ని సందిర్శించవచ్చు: http://www.worldwidetelescope.org/
University of California at Berkeley లో మే 31 న జిమ్ గ్రే గౌరవార్థం సభ జరగబోతోంది.
కొడవళ్ళ హనుమంతరావు
లింకన్ తో ఓ రాత్రి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/18/2008 8:13 pm
“తెలుగు సంగతులు”
మాలతి గారూ,
మీరు బూదరాజు రాధాకృష్ణ గారి వాక్యాలు అర్థం కాలేదన్నారు. సందర్భం అవసరం కావచ్చు. ఆ వ్యాసం అందుబాటులో ఉన్న “తెలుగు సంగతులు” అన్న పుస్తకంలో ఉంది. ఆయన రచనలన్నీ చదవదగ్గవి.
కొడవళ్ళ హనుమంతరావు
లింకన్ తో ఓ రాత్రి గురించి malathi అభిప్రాయం:
05/18/2008 7:17 am
హనుమంతరావు గారూ, నాకు రాధాకృష్ణగారి వ్యాక్యాలు అర్థం కాలేదు కానీ, మీరు చెప్పింది – రచయితలు పాఠకులవిమర్శలని సహృదయతతో స్వీకరించి ఆలోచించుకోవావి అన్నది అర్థం అయింది. ఒప్పుకుంటాను. రచయితలందరితరఫునా నేను వాదించడంలేదు కానీ, నామటుకు నేను నారచయితమిత్రులతో సంప్రదించి మార్పులు చేసుకున్న సందర్బాలున్నాయి.
బ్రహ్మానందం గారు వెలిబుచ్చిన రెండు అభిప్రాయాలు – రచయితలు తామేదో పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారు అనీ, ఈమాటవారు తమకి వచ్చిన విమర్శనలన్నిటినీ నిష్పక్షపాతంగా ప్రచురిస్తున్నారు అనీ.
ఈమాట వారు విమర్శలని ప్రచురిస్తారు కానీ కథలకి అలా కాదు. తమ కొలమానాలకి నప్పితేనే వేసుకుంటారు. అంటే ఆ రచన కనీసం ఒక రేటింగుకి నోచుకున్నట్టే.. రచయితలనుండీ పాఠకులు సహృదయత ఆశించడం ఎంత న్యాయమో, పాఠకులనుండీ రచయితలు కూడా అలాటి సహృదయతనే ఆశిస్తారు.
ఇలాటికథలు రాయకండి అని రచయితలకీ, ఇలాటివి వేసుకోకండి అని సంపాదకులకీ చెప్పడం సమంజసమే అనుకునే పాఠకులు తాము పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారేమోనని అనుకోడానికి అవకాశం వుంది కదా,
నన్నయ హంసగీతికలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/17/2008 11:24 am
పాత సాహిత్యాన్ని చదివించడం ఎలా?
భరద్వాజ గారూ,
మీ సూచనలకి కృతజ్ఞతలు. మీరు చెప్పిన పుస్తకాలు కొనే శక్తీ, చదవాలనే ఆసక్తీ ఉన్నాయి. కాని అవి చాలవు; చదవాలనే దీక్షా, పట్టుదలా కావాలి! నేను పాత సాహిత్యాన్ని సులభంగా ఆకళింపు చేసుకోలేకపోవడానికి కారణం నా ఇంగ్లీషు చదువు కాదు. నేను ఇటివలి వాణ్ణీ కాదు.
పదో తరగతిదాకా తెలుగు మీడియం లోనే చదివాను. ఇంటర్ ఇంగ్లీషు మీడియం అయినా తెలుగు కూడా ఒక సబ్జెక్ట్. కాలేజీ చదువుల తర్వాత గత పాతికేళ్ళుగా సాహిత్యపరిచయం తక్కువ. వావిళ్ళా, దేవస్థానం వాళ్ళూ చేస్తున్న కృషి చెప్పుకోదగ్గదే కాని, సామాన్య పాఠకుడు తనంతటతాను మన కావ్యాలు – వ్యాఖ్యానాలున్నా – చదవడం శ్రమతో కోడిన వ్యవహారం అన్నది నాకు అనుభవపూర్వకం.
అయితే ఎవరైనా సందర్భోచితంగా ఏదన్నా పద్యాన్ని ఉదహరిస్తే, దాని గురించి ఇంకాస్త తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అందుకు స్వానుభవం నుంచి ముచ్చటగా మూడు ఉదాహరణలు :
1.. ఉప్పల లక్ష్మణరావు రాసిన “అతడు-ఆమె” నవలలో ‘కమ్యూనిస్టు’ చెల్లి అక్కదగ్గర కెళ్ళి పెద్దన మీద ఫిర్యాదు చేస్తుంది – వరూధిని, “నిన్ను వలచి వచ్చాను,” అని ప్రవరుడితో అంటే చులకనయిపోతుందా? అని:
“అనుటయు మాటలేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై
కనలుచు నీరుదేరు తెలిగన్నుల నాతనిఁ బుల్కుపుల్కునం
గనుఁగొని మాటలంబొదువుగద్గదికందలయూచి యక్కటా
వనిత తనంతఁ దా వలచి వచ్చినెఁ జుల్కనగాదె యేరికిన్.”
నేను మనుచరిత్ర కాస్తయినా చదవడానికి ఇదే కారణం!
2. తానా 2005 సూవనీర్లో వెలగా వెంకటప్పయ్య వ్యాసం, “తెలుగునాట చదివే అలవాటు పెంచిన గ్రంథాలయోద్యమం,” లో మనరాష్ట్రంలో ప్రస్తుత గ్రంథాలయాల దుస్థితిని వివరిస్తూ ఈ పద్యం ఉదహరించారు. “యుద్ధం ఆపడం నీ చేతిలో ఉంది,” అని ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు హెచ్చరించే సందర్భం:
“సారపు ధర్మమున్ విమల సత్యము బాపముచేత బొంకుచేఁ
భారము బొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసిరది వారలచే టగుఁగాని ధర్మని
స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్.”
“సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే శక్తి కలిగి ఉండి, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికి, సర్వ అనర్థాలకు కారణం అవుతుంది.”
3. సైన్సూ, సాహిత్యాలలో ప్రతిభావంతుడైన మహీధర నళినీమోహన్ రాసిన “కేలెండర్ కథ” లో మన దేశంలో కాలాన్ని ఎలా విభజించారో విశదపరుస్తూ, క్రీడాభిరామంలో ఇద్దరు మిత్రులు ఓరుగల్లు వీధుల్లో తిరుగుతూ నగర విశేషాలని వర్ణించిన పద్యం ప్రస్తావన ఉంది:
“ఉడువీథిన్ శిఖరావలంబియగు నంధ్రోర్వీశు మోసాలపై
గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్ ఘంటా ఘణత్కారముల్
సడలెన్ భానుడు పశ్చిమంబునకు వైశ్యా! పూటకూటింటికిన్
కడువుం బోదమె లెక్క యిచ్చి? కడు నాకొన్నార మిప్పట్టునన్.”
అది చదివి క్రీడాభిరామం ఇంకాస్త చదవాలనే ఆసక్తి పెరిగింది.
ఈ రీతిన అప్పుడప్పుడు అరా ముక్కా చదివితే ఎన్నేళ్ళకి ఏ కావ్యమైనా గట్టెక్కుతుంది? నిజమే, బహుశా ఇది కావ్య పఠనా మార్గం కాదు. కాని యుక్త వయసులో ఇలా పాత సాహిత్యంతో పరిచయం పెరిగితే కొన్నాళ్ళకి తమంతట తామే చదువుకోగల స్థాయికి చేరుకోవచ్చు. అందుకు తెలుగునాడి లో “రసధుని” శిర్షికా, ఈమాటలో పాత సాహిత్యంపై వచ్చే కొన్ని వ్యాసాలూ సహాయపడతాయి.
ఇది నేను రాయడానికి కారణం మిమ్మల్ని ఖండించడానికి కాదు; నా అనుభవం మిగిలినవాళ్ళకి కొంత ఉపయోగపడుతుందేమోనని ఆశతో.
కొడవళ్ళ హనుమంతరావు
మదర్స్ డే గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/17/2008 8:55 am
రవికిరణ్ గారూ,
కథనంలోని లోపాలకి బాధ్యుడు రచయిత. వాటిని పాత్రకి ఆపాదించడం భావ్యం కాదేమో. దానివలన మన దృష్టి కథ ముఖ్యోద్దేశం మీద కాక వేరే వాటి మీదకి మళ్ళే ప్రమాదం ఉంది.
సుందరం ముందర మదర్స్ డే అంటే అనుమానంగానో తృణీకారంతోనో చూసినా, ఆరోజు ఎలా గడపాలి అన్న చర్చలో అతని వాదన సవ్యంగానే ఉంది.
మీకు సుందరం, వరలక్ష్మి, జీవితంలో అనేక సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద చాలా అనుమానాలుండొచ్చు. కాని ఇది కథానిక – ఓ సంఘటన ఆధారంగా ఒక జీవిత కోణంపై వెలుగు చూపే ప్రయత్నం. పాత్రల విస్తార జీవితాన్ని విశ్లేషించడానికి నవల కాదు.
బ్రతుకలా తయారుకావడానికి పిల్లల బరువూ, ఇంటి పనీ మగవాడి కంటె ఆడదే ఎక్కువ భరించడాన కాదా? ఈ కథ మనం మదర్స్ డే జరుపుకునే తీరులోని అసంబద్ధతని చూపెడుతున్నా, దీని ప్రాధాన్యత నిత్యజీవితంలో మన ఇంట్లో కళ్ళెదుటే సాగే అసమానత గురించి కాస్తన్నా ఆలోచింపచేయడమే.
కొడవళ్ళ హనుమంతరావు
మదర్స్ డే గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/15/2008 11:13 pm
ఆలోచించాల్సిన విషయం