2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్

బ్రౌన్ పురస్కారం-2012

అనువాదాల్లో ఎక్కడా అనువాదకుడు కనిపించరాదు, మూల రచయితే మూల విరాట్టుగా భాసించాలి. ఈ శిల్పం తెలిసిన ఆలూరి భుజంగరావు గారు, మహాపండితులు రాహుల్ సాంకృత్యాయన్ చారిత్రక నవలా సాహిత్యంతో పాటు తత్వ శాస్త్రాలను కూడా సమర్థంగా తెనిగించారు. వీరి కృషికి గుర్తింపుగా నందన నామ సంవత్సరానికి గాను బ్రౌన్ పండిత పురస్కారాన్ని వీరికి ప్రకటిస్తున్నాము.వీరు శారదకు (నటరాజన్) ఆత్మీయ స్నేహితులు, శారద సాహిత్యం వెలుగులోకి రావడానికి ఎంతో కృషి చేశారు. వీరి ప్రస్తుత నివాసం గుంటూరు.

ఇస్మాయిల్ అవార్డు -2012

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు రామినేని లక్ష్మి తులసి ఎంపికైంది. ఆధునికత, పాదరసంలా మెదిలే భావగతులను అలతి అలతి పదాలతో పట్టుకురావడంలో అనితర సాధ్యమైన నేర్పు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు, పద్మలతలకు ఈ అవార్డ్ లభించింది.

తులసిదళాలు

మనలో లేని ఆధునికత మన కవిత్వాల్లోకి, జీవితాల్లోకి ప్రవేశించదు. తులసి కవిత్వం సాంతం చదవగానే నాకు కలిగిన అభిప్రాయం తనది ఎంతో ఆధునికమైన కవిత్వం. తెలుగులో ఆధునికతకు మారుపేరు గురజాడ. పాతవాసనలు లేని కొత్తదనం కవిత్వాన్ని సజీవంగా మారుస్తుంది. మనకాలాన్ని మనం ప్రతిబింబించ లేకపోతే ఆ మేరకు మనం ఆధునికులం కాదు. అంతేగాదు, ఆలోచనలను, అనుభవాలను నిజాయితీగా, నిర్భయంగా వెల్లడించడం సదరు ఆధునికతలో భాగమే. మన జీవితం పరిమితమన్న విషయాన్ని వచ్చి పోయే ఋతువులు పలుమార్లు బహు సున్నితంగా సూచిస్తాయి. ఈ కాలశిల్పం అవగతం కాకపోతే కవి కేవలం లోతులేని వర్ణనకు పరిమితమవుతాడు, అంటే వచనంలో దిగబడతాడు. భావనా పరిధిని విస్తరించలేక గానుగెద్దులా తిరిగి తిరిగి చివరికి ఉన్నచోట చతికిల పడిపోతాడు. ఇక “అల్పాక్షరముల అనంతార్థ రచన” అటకెక్క వలసినదే.

నిరంతరం మనల్ని అంటి పెట్టుకుని ఉండే ఎండ ఎందరి కవిత్వాల్లో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది?

“గుమ్మం ముందు ఎండ పొడలో అదోలా
ఆదివారం మధ్యాహ్నాలు”

“సంధ్యతాలూకు ఎండ నీడ
గుమ్మంలోకి ఒరిగింది ఏటవాలుగా ”

ఎంత మందికి కవిత్వానికి జీవగర్ర అనదగ్గ ఏకాంతం అనాయాసంగా లభ్యమవుతుంది?

“ఒక్కోసారి
కళ్ళ ముందు కాస్తున్న ఎండను
గాలి మోసుకొచ్చే పరిమళాలను
ఇదివరకెప్పుడో
అనుభవించినట్టుగా అనిపిస్తుంది.
వెంటనే
మనసు ఒంటరిదవుతుంది”

నిశ్శబ్దం ఏమి చేయగలదో కవికి తెలియకపోతే మరెవరికి తెలుస్తుంది?

“ఒక్క మబ్బు పట్టిన క్షణం చాలు
గతంలోనూ, వర్తమానంలోనూ
నిశ్శబ్దాన్ని నింపడానికి
అయినా
నిర్లిప్తత దూసుకెళ్ళినంత లోతుకు
సందడి తోసుకెళ్ళ లేదెందుకో ”

కిటికీ కూడా కవిత్వంలాంటిదే!

“మంచు పడినా, మనసు బాగోకపోయినా
వాన కురిసినా, వడగాల్పువీచినా
అన్నిటికీ అదే కిటికీ
ఎన్నో నిర్వచనాలకు నిదర్శనంగా…!”

సున్నితంగా కనిపించేదానికే బలమెక్కువ అన్నది చైనీయుల కవితాతత్వం, అందుకే అనేక కళాకృతులు వేల సంవత్సరాలు మనగలుతాయి,వాటికి ధీటుగా –

“వెన్నెలా, వేకువా కలిసినట్టుందేమో
వాగు వయ్యారానికి
పొగమంచు
సాంబ్రాణి అద్దుతుంది.”

కొన్ని చోట్ల ఉమర్ ఖయ్యాంను గుర్తుకు తెస్తుంది.

“చిన్న ఆకాశం ముక్క
ఓ పచ్చని పత్రం, ఒక పిట్ట
కాస్త మట్టి, ఓ వానచినుకు
ఇదేగా ప్రకృతి అనుకున్నాను.”

మన కవులు ఎప్పుడూ చీకటి కూపాల్లో పడి దొర్లుతూ ఉంటారు , కనుకనే,హాయిని గొలిపే ఒక వాక్యం కనిపించదు. తులసి సకల ఋతువుల వర్ణ వైభవాన్ని కవిత్వంలో అలవోకగా ప్రవేశ పెట్టగల భాగ్యశాలి.

“ఎక్కడ నుండి మొదలయానో
అక్కడికే వచ్చి ఆగినట్టుంది
ఉన్నట్టుండి ప్రతి మలుపు
వసంతానికే దారి చూపినట్టుగా”

“ఎదురుగా వున్న ఎండుగడ్డిలో కూడా
ఎదో తెలీని అందం
వాన చుక్కలన్నీ వరస గట్టి
జారుతుంటేను !”

‘కనికట్టునేదో కనిపెట్టినట్టుగా ,ఇంద్రధనస్సులో ఎనిమిదో రంగైనట్టుగా ‘ ఉండే కవిత్వమంటే ‘రాత్రివాక్యాలకు కొనసాగింపు’ అని తులసికి తెలుసు.అంతేకాదు, వెన్నెల వీధుల్లో ఒక ‘పరిపూర్ణమైన ఏకాంతం’ అవసరమయే దాని సృజన వేళ:

“ఇంత నిస్సంకోచపు నిశ్శబ్దపు రాత్రి
మళ్ళీ మళ్ళీ వెంట రాదని తెలుసు!
ఇన్ని చీకటి దారాలు
ఒక అర్థవంతపు సాంగత్యంలా
మళ్ళీ మళ్ళీ పెనవేసుకోవనీ తెలుసు.”

అయినా కూడా,

“మధ్యాహ్నపు ఎండ,సాయంత్రపు గాలి,
రాత్రి చుక్కలు ఎప్పుడూ ఏదో ఒకటి
గుర్తుకు తెస్తూనే వుంటాయి
మనసు మెచ్చే క్షణాలెన్నెదురైనా,
అడుగు ఆగిపోయిన గతాలే ఎక్కువ!”

‘జారిపోయిన ఆలోచనలో ఒక నక్షత్రం ‘ లాంటి కవితలను నేను ఎన్ని ఉటంకించినా , ‘శబ్దాల్లో సరఫరా కాని ఒంటరి సంభాషణలు’ అనేకం ఉండిపోతాయి.

మరి తులసి కవిత్వం చదవడం ఎటువంటి అనుభవం?

“తెలిమంచు తెరల్లో సాగే తెరచాప పడవలో
నాతో ఓ సారి పయనించి చూడు!

నది లేత పరవళ్ళలో
కాలమాగిన ఒక జీవితకాల క్షణముంటుంది.
అదే నీదీ నాదీ!”

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...