హిమపాతము

ఆకసమునుండి దేవత లవనిపైని
పెల్లుగా గురిసెడి పూలజల్లువోలె
ఏకమొనరించుచున్ ధరానాకములను
ఉత్కటంబుగ హిమపాత మొదవసాగె.

గగనమందలి తారకాగణము లెల్ల
అవనికిం జాఱిపడినవో యనఁగఁ గురిసె
అర్యమాంశుభాస్వంతంబు లగుచు ధవళ
హిమకణంబులు ధాత్రిలో నెందుఁ గనిన.

తెల్లన రాజమార్గములు, తెల్లన చర్చులు, గోపురంబులున్,
తెల్లన యింటికొప్పులును, తెల్లన తోఁటలు, వృక్షసంతతుల్,
తెల్లన ముంగిళుల్, మఱియుఁ దెల్లన దారుల నేఁగు కారులున్,
తెల్లన సర్వదిక్కులును, తెల్లని వెల్ల హిమాగమంబునన్.

అతులితతీవ్రవేగగమనాంచితుఁడై సుడిగొంచు మ్రోయుచుం
బతనమొనర్చు చాత్మపథమందలి సర్వమహీజశాఖలం,
బతితహిమంబు నద్రులుగ బాగుగఁ బేర్చుచు, శైత్యపూర్ణసం
ప్రతిభయవృత్తిమైఁ దిరిగె స్పర్శనుఁ డంత నియంత పోలికన్.

ఒకయెడ సాగరోర్మికల యొద్దిక, నొక్కయెడ న్మహోష్ట్రశా
బకమువిధంబున న్మఱొక ప్రక్క మదద్విరదంబులీల, నిం
కొకదెసఁ గందకంబువలె నుర్వర నెల్ల విచిత్రరూపముల్
చకచకఁ జెక్కుచు న్మసలె స్పర్శనుఁడంతట శిల్పిపోలికన్.

తాఁకినయంత దేహముల దార్ఢ్యము వీసరవోవఁ జేయుచున్
నాకము భూమి యేకమగునట్టుల మంచును విస్తరించుచున్
వీఁకను బాంథనేత్రములఁ బిండివలెం దుహినంబుఁ జిమ్ముచుం
భీకరుఁడై చెలంగెను సమీరణుఁ డంతట దుర్దమోద్ధతిన్.

చూచుటకుఁ దారకలరీతిఁ దోఁచుఁగాని,
తాఁకఁ గొంకరల్ వోవును తనువు లకట!
ఈ హిమకణంబుల చెలువమెన్నగాను
ముద్దులొల్కెడి పూతన కుద్ది యగును!

ఉదయముదొట్టి యప్రతిహతోత్కటధాటిగఁ బడ్డయట్టి యా
సదమలహైమపాతపరిసంభృతమైన గృహంబులెల్లెడన్
విదితములయ్యెఁ బాల్కడలి వీచికలందునఁ దేలుచున్న యా
త్రిదశమతంగజాతములరీతిగ శ్వేతవిభాంచితంబులై.

గుట్టలఁ బోలు మంచుగమికుప్పలపైని టొబాగనాదులం
గట్టిగఁ గూరుచుండి కనుగల్వల హాసము తాండవింపఁగా
నట్టిటు జాఱుచుం జిఱుతహాసము సేయుచు బాలబాలికల్
నెట్టిరి యాదినంబుఁ గమనీయపుఁబర్వమువోలె నాడుచున్.

*లండనుఫాగులం దనువులం దగ దూర్చి, శిరఃకరంబులన్
దండిగ థిన్సులేటులను దాల్చి, పదంబులు కోడియాకుబూ
ట్లం డిగజార్చి బాలురు విలాసముగా నడివీథి మంచుతోఁ
జెండులు గట్టి యొండొరులఁ జెచ్చరఁ గొట్టుచు నాడిరత్తఱిన్.

ఇది పథమంచు నేర్పరుప నింతయు సాధ్యముగాని రీతిగా
నుదయమునుండి పర్విన మహోత్కటహైమవితానమందునం
గదలక చిక్కికొన్నవదె కారులు దారుల నెందుఁ జూచినన్
సదమదమంది చోదకులు శైత్యమునందునఁ గుందుచుండఁగన్.

హిమముచే నావృతంబులై ద్రుమములెల్ల
వెండిశిల్పములట్లు శోభిల్లుచుండె,
మంచుచే నావృతంబైన మహితలంబు
వెండిపాత్రంబురీతిగ వెలుగుచుండె.

స్ఫారతరతుహిననివహాచ్ఛాదనమున
ధవళితంబులై వెలుగొందు పువులపొదలు
తెల్లయేనుఁగుగున్నల తీరు నలరి
కనులవిందొనరించె ప్రాంగణములందు.

అతిరయ మొప్పఁగాఁ దరులతాదులు దాల్చిన పత్త్రవస్త్రసం
తతులను మున్ను డుల్చిన సదాగతి తద్దురితాపనోదన
స్థితమతి యయ్యెనేమొ మఱి! శ్వేతవినూతనహైమవస్త్రసం
వృతములఁ జేసె నిల్వునను వృక్షలతాదుల నెల్ల నిత్తఱిన్.

మోకాళ్లబంటిగా ముంగిట్ల నిండిన
     తుహినమ్ముఁ బాఱతోఁ ద్రోయువారు,
హిమపిహితంబులై నింతయుం గనరాని
     కారుల న్వెదకంగఁ జేరువారు,
మంచులో దిగబడి యించుకం గదలని
     వాహనంబుల నట్లె వదలువారు.
ప్రాలేయపథములం బదచారులై జఱ్ఱు
     నం జాఱిపడి లేచి నడచువారు,
స్కీగేరు ధరియించి చెంగుచెంగున నంగ
     లిడుచును మంచులో నేఁగువారు,
స్వయముగా మంచులో జనలేక యాస్పత్రి
     కాంబ్యులెన్సులఁ బిల్చి యరుగువారు,

ఈ మహాహిమపాత మేయేసువరమొ?
భూమి నెల్లఁ గ్రమ్మెను పెనుభూత మటుల!
అనుచు నా వైపరీత్యంబు నాత్మలందు
దూఱువారలు నైరిల పౌరు లపుడు!

శీతవాతాతపంబులు, శీకరములు
ప్రకృతిధర్మంబు, లవి లేక ప్రకృతి లేదు!
వాని కోర్చి యుండుటె మానవాళి ధర్మ
మనిరి కొందఱు వేదాంతులట్టు లపుడు.

శోకమొందని మనసుకు సుఖము విలువ
తెలియనట్టుల శైత్యబాధితము గాని
వపువు కాగామిమధుమాసవైభవంబు
నరయు శక్తి లేదని పల్కిరన్యు లపుడు.

అరయఁ గాలపూరుషసదాయానమునకు
అర్హమైనట్టి హయములౌ నాఱు ఋతువు
లవ్వి కొనివచ్చు శోకసౌఖ్యంబు లెల్ల
మానవావళి మంచికే యౌను గాదె!

*London Fog coats, Thinsulate gloves & caps and Kodiak boots are famous brands of winter wear