బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు

ప్రవాసాంధ్రులుగా జీవితం గడిపిన మనలో కొందరు తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుభూతి గల ఇతరులు దీన్ని అభిరుచి అనీ, గిట్టనివాళ్ళు దురద అనీ అంటూ ఉంటారు. బొంబాయిలో నాకు కలిగిన కొన్ని అనుభవాల గురించినదే ఈ వ్యాసం. ఊరు ఏదైనప్పటికీ ఇతరులకు కూడా ఇటువంటివీ, భిన్నమైనవీ అనుభవాలు కలిగే ఉంటాయి కనక ఇందులో చాలా గొప్పగా “కాలరెత్తుకునే” ప్రసక్తి ఏమీ లేదని మనవి.

1970లో నేను మొదటగా బొంబాయికి వెళ్ళినప్పుడు మరాఠీవాళ్ళు మాత్రమే దాన్ని ముంబయీ అనేవారు. “అంటే ముంబయీ అనాలి, లేకపోతే బోంబే అనాలి కాని మధ్యలో ఈ బంబయీ ఏమిటి?” అని ఉత్తరాదివాళ్ళ ఉచ్చారణ మీద మా మరాఠీ మిత్రుడొకతను విసుక్కుంటూ ఉండేవాడు. వీటన్నిటికీ భిన్నంగా మనవాళ్ళు బొంబాయి అంటారని నేనతనితో చెప్పడానికి జంకాను. బొంబాయికి దక్షిణాది నుంచి వెళ్ళే రైళ్ళన్నీ వీటీ (విక్టోరియా టెర్మినస్‌), లేదా దాదర్‌ స్టేషన్లకు చేరేవి. బొంబాయిలో నివసించిన ప్రసిద్ధ రచయిత సోమంచి యజ్ఞన్నశాస్త్రిగారు దీని మీద ఒక హాస్య రచన కూడా చేశారు. ఆంధ్ర ప్రాంతం నుంచి బొంబాయికి వెళుతున్న రైల్లో మొదటిసారిగా ప్రయాణిస్తున్నవారిని స్థానికులైన తెలుగువారు పలకరించి “మీరెక్కడ దిగుతారు? వీటీయా, దాదరా?” అని అడిగితే వాళ్ళు తెల్లబోయి “అబ్బే, రెండూ కాదు, మేము బొంబాయిలో దిగుతామండీ” అంటారు.

“మీరెక్కడ దిగుతారు? వీటీయా, దాదరా?” అని అడిగితే వాళ్ళు తెల్లబోయి “అబ్బే, రెండూ కాదు, మేము బొంబాయిలో దిగుతామండీ” అంటారు.

ఉద్యోగరీత్యా నేను పనిచేసినది ట్రాంబే ప్రాంతం కనక నా జీవితమంతా తూర్పు (ఈశాన్య) సబర్బ్‌ ఉపనగరాల్లో గడిచింది. బొంబాయి స్వరూపం తెలిసినవారికి అదొక సన్నటి ద్వీపకల్పం వంటిదనీ, డౌన్‌టౌన్‌ ప్రాంతాలన్నీ దక్షిణపు అగ్రాన ఉంటాయనీ తెలిసినదే. అందుచేత మధ్య తరగతి కుటుంబాలన్నీఉత్తరంగా ఉన్న ప్రదేశాల్లోనే నివసిస్తారు. అందులో కొన్ని తూర్పువీ (ఈశాన్యం), కొన్ని పడమటివీను (వాయవ్యం). బొంబాయిలోని తెలుగువారికి ప్రధాన సంస్థ ఆంధ్ర మహాసభ అండ్‌ జింఖానా. (ఈ జింఖానా పేరెందుకూ అని కొందరికి కోపం వచ్చేది కాని పబ్లిక్‌ సంస్థల స్థలం కేటాయింపు అవసరాలకై క్రీడల ప్రస్తావన తప్పనిసరిగా ఉండినందువల్ల ఆ తోక తగిలించక తప్పలేదని తెలిసింది). 1932లో స్థాపించబడిన ఈ సంస్థకు చాలా ఏళ్ళపాటు యజ్ఞన్నశాస్త్రి మొదలైనవారెందరో సేవ చేశారు. అలాగే 1943నుంచీ ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటీ స్కూలు మొదలైంది. 1950లలో యజ్ఞన్నశాస్త్రిగారు రాసిన నాటికల సంకలనాల్లో ఆయన ముందుమాట రాస్తూ “దీన్ని ప్రదర్శించదలుచుకున్నవారు నాకేమీ పారితోషికం ఇవ్వక్కర్లేదు గాని మా ఆంధ్రా స్కూలుకు విరాళంగా అయిదు రూపాయలు పంపితే సంతోషిస్తాను” అని రాశారు. బొంబాయిలో పది పదిహేను లక్షలమంది తెలుగువా రున్నారని అంచనా. సున్నితంగా చెప్పాలంటే వీరిలో ఎక్కువమందిది “బ్లూ కాలర్‌”. పెద్ద పేరున్నవన్నీ వైట్‌ కాలర్‌ ఊసుపోక సంస్థలేననీ, కోస్తా ప్రాంతం కానివారి గురించి తగినంతగా పట్టించుకోలేదనీ తరవాతి కాలంలో నా కనిపించింది కాని అది వేరే సంగతి.

1971లో అనుకుంటాను, ఘంటసాల వెంకటేశ్వరరావుగారు అమెరికా వెళుతున్నప్పుడు ఆంధ్రమహాసభలో ఒక చిన్న వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. నేనక్కడికి వెళ్ళి ఆయననూ, నాకు పరిచయస్థులైన సంగీతరావుగారినీ, సితార్‌ విద్వాంసుడు జనార్దన్‌ తదితరులనూ కలుసుకున్నాను. అప్పటికే 40 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆ సంస్థలో ఆ సభకై జరిగిన ఏర్పాట్లు నాకు చాలా అసంతృప్తికరంగా అనిపించాయి. ఆ తరవాత వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులూ, అంతర్గత సమస్యల గురించి తెలిసింది. (194247 మధ్యలో మా నాన్న కుటుంబరావుగారు బొంబాయిలో ఉన్న రోజుల్లోనే అప్పటికి పది పదిహేనేళ్ళ వయస్సు గల ఆంధ్రమహాసభలో సంస్థాగతమైన కీచులాటలు ఉండేవని విన్నాను). వీటన్నిటినీ ఓపికగా భరిస్తూ వచ్చిన యజ్ఞన్నశాస్త్రిగారు తన సహజ ధోరణిలో “తెలుగువారిది వ్యక్తిగత ప్రతిభా, సామూహిక వైఫల్యం” అంటూ ఉండేవారు. అప్పుడే ఆంధ్రా యూనివర్సిటీ కేంపస్‌లో ప్రఖ్యాత నటుడూ, నాటక ప్రయోక్తా అయిన కె. వెంకటేశ్వరరావు వంటివారి ప్రతిభని రెండేళ్ళపాటు చూసి, ఆనందించి వచ్చిన నాకు ఇదంతా చూసి మొదట్లో నిరుత్సాహం కలిగింది. ఆ తరవాత నేనుంటున్న ప్రాంతంలో నాకు పరిచయమైన డా. ఎ.వి.మురళి తదితరులను చూశాక మళ్ళీ కాస్త తెలుగువారి శక్తిసామర్య్థాల గురించిన ఆశ పుట్టింది.

1972 ప్రాంతాల్లో నాతోబాటు భాభా అణుకేంద్రంలో పనిచేస్తున్న కొందరు తెలుగువారు అణుశక్తి శాంతియుత ప్రయోజనాల గురించి ఏదో పుస్తకం రాసి పోటీకి పంపిస్తున్నట్టుగా తెలిసింది. నాకప్పటికి గట్టిగా 23 ఏళ్ళుకూడా లేనప్పటికీ దాని రచయితలు ఒకరిద్దరు తమ రాతప్రతిని నాకు చూపించారు. అది ఏ మాత్రమూ సంతృప్తికరంగా లేదని చెప్పడానికి నోరు రాక నేను ఒకటి రెండు రోజుల్లో కొంతవరకూ తిరగరాసి వారికిచ్చాను. ఎక్కువ భాగం అలాగే ఉండిపోయింది. దాంతో సంతోషపడిన ఆ మిత్రులు తమ “తెలుగు సాహిత్య సమితి”లో చేరమని నన్ను ఆహ్వానించారు. (పేరును విని అపోహ పడిన నాకు ఆ తరవాత సాహిత్యమంటే స్నేహపూర్వకమనే అర్థంలో వాడారని తెలిసింది. తరవాత నేననుకున్నట్టుగానే ఈ రచనకు బహుమతి ఏమీ రాలేదు) మొత్తం మీద “మన”కొక తెలుగు సంస్థ ఉందని తెలియగానే నాకు సంతోషం కలిగింది. ఎటొచ్చీ అది డబ్బులు లేక కుంటుతోందనీ, పొరుగునే చెంబూరులో ఉంటున్న ఎందరో తెలుగు కుటుంబాలూ, బ్రహ్మచారుల సంగతి నిర్వాహకులు పట్టించుకోవడం లేదనీ తెలిసింది. 1973 నుంచీ నేనూ, ఇతర మిత్రులూ సమితిలో చేరి, ఎంతోమంది కొత్తవారిని సభ్యులుగా చేర్పించడం, కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాం. వందలోపున ఉండిన సభ్యుల కుటుంబాల సంఖ్య నాలుగు వందలకు పెరిగింది. ఎన్నో తెలుగు కుటుంబాలూ, వారిలో అభిరుచి ఉన్న వ్యక్తులూ పరిచయం కాసాగారు. సంగీతంలో నాకున్న ప్రవేశం దృష్య్టా నేను తెలుగు సినిమా పాటల నిర్వహణా, చిట్టా శంకర్‌ తదితరులు నాటికల ప్రదర్శనా వగైరాలన్నీ మొదలుపెట్టాం. తక్కిన పెద్ద సభల్లో ఎవరైనా మేము పాడతాం, ఆడతాం అని ముందుకొస్తే నిర్వాహకులు ఎగాదిగా చూసి, వీలున్నప్పుడు చూస్తాం అనేవారు. దీనికి నేను భోజరాజు మనస్తత్వం అని పేరు పెట్టాను. ఔత్సాహికులను నీరుకార్చే ఈ ధోరణి అంటే ఇప్పటికీ నాకు నచ్చదు. ఎందుకంటే ఈ నిర్వాహకులకు సామాన్యంగా కళానైపుణ్యాన్ని అంచనా వేసే సామర్య్థం చాలా తక్కువగా ఉండేది. నిర్వాహకులూ, కళాకారులూ స్థానికులే అయినప్పుడు ఎంతో మర్యాదగా, సామరస్యంతో వ్యవహరించాలని నా ఉద్దేశం.

మొదట్లో మేము నిర్వహించిన కార్యక్రమాలన్నిటిలోనూ స్థానికులే పాల్గొనేవారు. దీనికి ముఖ్యకారణ మేమిటంటే బైటినుంచి పెద్ద కళాకారులను తెప్పించేందుకు డబ్బులు ఉండేవి కావు. ఒక విధంగా ఇది మేలే చేసింది. కాకిపిల్ల చందంగా తమవారి కళాప్రదర్శన తిలకించటానికి వచ్చిన సభ్యుల కుటుంబాలూ, వారి మిత్రులూ అందరితోనూ ఎంత చిన్న ప్రోగ్రామైనా కళకళలాడేది. అప్పట్లో జనాన్ని ఆకర్షించని పెద్ద సభల తీరును గమనించిన మేము అలాంటివి జరగకుండా జాగ్రత్తపడ్డాం. వారుచేసిన పొరబాట్లలో ఒకటి ఏమిటంటే ప్రతి ప్రోగ్రాంకూ ఖర్చును బట్టి టికెట్లు అమ్మడం. ఎవరైనా నాటకం వేస్తామని ముందుకొస్తే నిర్వాహకులు మీ టికెట్లు మీరే అమ్ముకోవాలి అని షరతులు పెట్టేవారు. మితిమీరిన ఖర్చులూ, ఎంతో ఆర్భాటంగా చేసిన ఏర్పాట్లకు తగినంత రాబడి రాకపోవడంతో ఆడినవారికీ, నిర్వాహకులకూ తీవ్రమైన అభిప్రాయభేదాలు కలిగేవి. మా సమితి విషయంలో నిర్వాహకులూ,కళాకారులూ మేమే కావడంతో పొదుపుగా జరిపేవాళ్ళం. సంవత్సరాని కొకసారే సభ్యత్వ రుసుము వసూలు చేసేసి దాన్నిబట్టి ఏడాది పొడుగునా ప్రోగ్రాములను ప్లాన్‌ చేసేవాళ్ళం. ఇది అప్పట్లో ఏ స్థానిక తెలుగు సంస్థా చేసేది కాదు. వందలకొద్దీ ఇన్విటేషన్లన్నీ నలుగురైదుగురం కబుర్లు చెప్పుకుంటూ, చేత్తోనే రాసేసేవాళ్ళం. ఎప్పుడు, స్టేజి మీద ఏం చెయ్యాలో, పట్టుకుంటే వదలని “మైకాసురులనీ”, వెర్రివేషాలు వేసేవాళ్ళనీ ఎలా దూరంగా ఉంచాలో అన్నిట్లోనూ నిక్కచ్చిగా ఉండేవాళ్ళం. ముఖ్య అతిథులూ, ఉపన్యాసాలూ, వందన సమర్పణలూ మరీ తప్పనిసరి అయితే తప్ప ఉండేవి కావు. ఒకవేళ పెట్టుకున్నా ఎవరేం మాట్లాడాలో మేమే రాసిచ్చి, క్లుప్తంగా ముగించి దింపేసేవాళ్ళం. దీనివల్ల ప్రేక్షకులు ఎప్పుడూ మమ్మల్ని అభినందించేవారు. పెద్ద సభల్లో లాగా అవసరం ఉన్నా లేకపోయినా స్టేజి మీద డజన్ల మందిని కూర్చోబెట్టడం, అందులో ఒక్కక్క పుల్లయ్య పేరూ చదవడమే కాక అతనికి పుష్పగుచ్ఛం ఇచ్చే మరో మల్లయ్య పేరు మైకులో చెప్పడం మొదలైన మూర్ఖపద్ధతులేవీ ఉండేవికావు. కాస్త నిరంకుశంగా వ్యవహరించినప్పటికీ మా ప్రోగ్రాములన్నీ అందరికీ ఎంతో నచ్చేవి. మరొక ముఖ్యవిషయం ఏమిటంటే ఒకవంక ఉద్యోగాలు చేసుకుంటూ సమితి కోసం కష్టపడుతున్న మమ్మల్ని చూసి అందరూ సహాయపడడం నేర్చుకున్నారు. అటువంటివారు అవసరమున్నప్పుడల్లా తమ కారును సమితి పనులకు వాడడం, పరిచయస్థుల ద్వారా మా ప్రయత్నాలకు సహకరించడం మొదలైనవి మాకు చాలా తోడ్పడేవి. సభ్యుల్లో కొందరు మహిళలు టిఫిన్లూ, కాఫీలూ స్వయంగా చేసి ఖర్చులకి సరిపడే రేట్లకు అమ్మేవాళ్ళు. అంతా కుటుంబ వ్యవహారంలాగా సరదాగా ఉండేది.

తరవాత కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మొదట్లో ఒకే ప్రభుత్వ కాలనీకి పరిమితమైన సంస్థ కాస్త విస్తరించడంతో అక్కడ ఉద్యోగరీత్యా సీనియర్‌ పదవుల్లో ఉన్నవారికి తమ ప్రాధాన్యత తగ్గిపోతుందన్న దిగులు పట్టుకుంది. వారిలో కొందరు విడిపోయి తమ కాలనీవారి కోసమని ప్రత్యేకంగా మరొక సంస్థ పెట్టుకున్నారు కాని అది త్వరలోనే మూసుకుపోయింది. మా సమితి మాత్రం బాగా ఎదిగి, పెద్ద కార్యకమాలు చేపట్టే స్థితికి చేరుకుంది. 1974లోనే బాలమురళీకృష్ణ కచేరీనీ, రావి కొండలరావు బృందం ప్రదర్శించిన ప్రొఫెసర్‌ పరబ్రహ్మం నాటకాన్నీ ఏర్పాటు చెయ్యగలిగాం. ఉత్తమ స్థానిక (వేణువు) కళాకారుడైన ఏల్చూరి విజయరాఘవరావుగారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. అలాగే 1979లో మేము నిర్వహించిన ఎస్‌. రాజేశ్వరరావు నైట్‌కు ప్రసిద్ధ సంగీత దర్శకుడైన నౌషాద్‌ను ముఖ్య అతిథిగా పిలిచాం. ఈ సంస్కారం తరవాతి కాలంలో తగ్గిపోయి ఎవరు మన సంస్థకు డొనేషన్‌ ఇవ్వగలడో అతన్నే ముఖ్య అతిథిగా పిలవాలనే సంప్రదాయం మళ్ళీ ముందుకొచ్చింది. ఈ మధ్య నేను హాజరైన ఒక కూచిపూడి నృత్య ప్రదర్శనకు అటువంటివాడు ఒక తెలుగతను గౌరవ అతిథిగా వచ్చి తాను మునుపెన్నడూ కూచిపూడి నృత్యం చూడలేదనే సంగతి తన ఉపన్యాసంలో బైటపెట్టాడు. అంతవరకూ బాగానే ఉంది కాని, ఆ వెంటనే తన జేబులోంచి ఒక కాయితం తీసి కూచిపూడి విశిష్టతను గురించి చెప్పడం మొదలుపెట్టాడు. సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో మనవారి సంగతి తెలిసినదే అయినా మా నిర్వహణలో ఇటువంటివారిని స్టేకి ఎక్కనిచ్చేవాళ్ళం కాదు. మా కమిటీలో కొందరు తమ అమాయకత్వాన్ని బైటపెట్టేవాళ్ళు కాని ఆ సంగతి పొక్కేది కాదు. ఒక సందర్భంలో ఎవరో బాలమురళి కచేరీ పెడితే ఎలా ఉంటుందని ప్రస్తావించినప్పుడు మరొకతను అదే కార్యక్రమం మధ్యలో తన మిత్రుడి చేత మిమిక్రీ చేయిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డాడు.

కనీసం సంవత్సరాని కొకసారి పాత తెలుగు సినిమా పాటల ప్రోగ్రామ్‌ నిర్వహించేవాళ్ళం. పాడేవారూ వాయించేవారిలో చాలామంది స్థానికులే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్‌.ఎఫ్‌.సి. అధిపతి అయిన జయరాజ్‌, ఇ.సి.ఐ.ఎల్‌.లో సీనియర్‌ అధికారి చాగంటి శంభుప్రసాద్‌, గాయకుడు రఘు, అన్నపూర్ణ, ఇప్పుడు అమెరికాలో ఉంటున్న పెమ్మరాజు భవాని, ఆమె తమ్ముడు రామారావు, రాయసం ప్రసాద్‌, డా. విష్ణుభొట్ల రాజేంద్ర ప్రసాద్‌, డా. విష్ణుభొట్ల లక్ష్మన్న తదితరులందరూ ఉత్సాహంతో పాల్గొనేవారు. పాటల క్వాలిటీకే కాక వాటి ఎంపికకు కూడా మమ్మల్ని మెచ్చుకునేవారు. బొంబాయిలో తెలుగు టీవీ చానల్స్‌ ఏవీ లేని ఆ రోజుల్లో మా ప్రోగ్రాముల కారణంగా తమ పిల్లలు తెలుగు సినిమా పాటలు వినడం మొదలుపెట్టారని తల్లిదండ్రులు మాకు సంతోషంగా చెపుతూ ఉండేవారు. మా సమితిలోనే కాక మాటుంగా, కొలాబా, పొవయీ, పరేల్‌, పరిసర ప్రాంతాలైన ఠాణే, డోంబివలీ, కల్యాణ్‌, పూనా వగైరాల్లో కూడా మా బృందం ప్రోగ్రాములిచ్చింది. మాతో పాడడం మొదలుపెట్టిన కొందరు తరవాత ఇతరత్రా ప్రొఫెషనల్‌ రంగంలోకి కూడా వెళ్ళారు. అలాగే మావాళ్ళు ప్రదర్శించిన కొర్రపాటి గంగాధరరావు రచన యథా ప్రజా తథా రాజా నాటకం చాలా రక్తికట్టింది. అందరం రాత్రంతా కూర్చుని పెంకుటింటి ముందు భాగం సెటింగ్‌ తయారు చేశాం. పాలేరును సజీవ దహనం చేసే సీను కూడా చాలా వాస్తవికంగా కనిపించింది. నాటికలలో చురుకుగా పాల్గొన్న నండూరి రాజగోపాల్‌, ఆయన భార్య భానుమతి తదితరులు తరవాతి రోజుల్లో బిజీ డబ్బింగ్‌ ఆర్టిస్టులయారు.

1975 ప్రాంతాల్లో మా సభ్యుల్లో డాన్స్‌ నేర్చుకున్న టీనేజి అమ్మాయిలుండేవారు. వారిలో ఒకరిద్దరి చేత పోగ్రాములు ఇప్పించాక వారందరికీ విడిగా అవకాశం ఇచ్చే ఆర్థిక స్థోమత మాకు లేదనీ, ఈ రౌండ్‌ పూర్తయే లోపల వాళ్ళంతా పెళ్ళిళ్ళై కాపరాలకు వెళతారనీ గ్రహించాం. అందర్నీ ఒకేసారి ప్రవేశపెట్టాలంటే నృత్యనాటిక వంటిది తలపెట్టాలి. మాలో నృత్యదర్శకు లెవరూ ఉండేవారు కారు. ముందుగా ఎక్కువ నాట్యం అవసరం లేని గురజాడ రచన పుత్తడిబొమ్మను ప్రదర్శించాం. అతి పరిమితమైన సౌకర్యాలతో అవస్థ పడుతున్నప్పటికీ మా మిత్రుడు రాయసం ప్రసాద్‌ దీనికి మంచి సంగీతం సమకూర్చాడు. ఆ తరవాత డా. ఎ.వి. మురళి అమెరికా నుంచి బొంబాయికి తిరిగి వచ్చిన గంట లోపునే సరికొత్త నృత్యనాటిక కుమార సంభవం ప్రదర్శనకు ప్లాన్‌ వేశాం. 1978 జనవరిలో అంతా స్థానిక గాయనీ గాయకులూ, డాన్సర్లతో నాటిక తయారైంది. రచన, దర్శకత్వం మురళి చేపట్టగా సంగీతం నేను సమకూర్చాను. ఇందులో రతీదేవిగా నటించడమే కాక గాత్ర సహకారం అందించిన భవాని అందరికీ అభిమానపాత్రురాలయింది. ఘాట్‌కోపర్‌లో జరిగిన తొలి ప్రదర్శన తరవాత “వన్స్‌మోర్‌” నినాదాలు పెరగడంతో మళ్ళీ 1978 నవంబర్‌లో సయాన్‌లో మలి ప్రదర్శన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన విజయరాఘవరావుగారు ఎంతో మెచ్చుకోవటమే కాక ఆ వెంటనే ఎస్‌. రాజేశ్వరరావు నైట్‌ ఏర్పాటు చెయ్యమని సలహా ఇచ్చి ఎంతో తోడ్పడ్డారు.

పి. సుశీల, రామకృష్ణ తదితరులతో 1979లో చాలా విజయవంతంగా జరిగిన ఈ రాజేశ్వరరావు నైట్‌ కార్యక్రమంతో మూడు వేల పైచిలుకు సీట్లు గల షణ్ముఖానంద హాలు తొలిసారిగా తెలుగు ప్రేక్షకులతో హౌస్‌ఫుల్‌ అవడం, టికెట్లు బ్లాక్‌లో అమ్మడం జరిగాయి. ఎటొచ్చీ అప్పటికి మా సమితిలో “రాజకీయాలు” మొదలై ఈ కార్యక్రమానికి పెత్తనం వహిస్తామని ముందుకొచ్చిన కొందరు పెద్దలు చివరి నిమిషాన వెనకడుగు వేసి బోల్తా కొట్టించే ప్రయత్నం చేశారు. అయినా మాలో కొందరం పట్టుదలగా నిలదొక్కుకుని 35 మంది వాలంటీర్ల సహాయంతో జయప్రదం చేశాం. మరొక రెండేళ్ళకు పెండ్యాల నైట్‌ ఏర్పాటు చేశాం. వెంపటి చినసత్యం బృందం తమ పద్మావతీ శ్రీనివాసం నాటికను తొలిగా తిరుపతిలోవేసిన తరవాత 1979లో మా ముందే ప్రదర్శించారు. మా చిన్న ప్రయత్నం కుమార సంభవం చూసి ప్రభావితుడైన జి.ఎం.శర్మగారు నృత్య నాటకాల పట్ల ఎంతో ఆసక్తి పెంచుకుని, ఆ తరవాత చినసత్యంగారికి పెద్ద అభిమాని అయిపోయారు. తరవాతి కాలంలో చినసత్యంగారికి బొంబాయి నుంచి అనేక ఆహ్వానాలు రావటానికీ, పదేళ్ళ క్రితం బొంబాయిలో కూచిపూడి కళాకేంద్రం స్థాపనకూ, నర్తనం అనే ఇంగ్లీషు త్రైమాసిక వెలువడడానికీ కారకుడైన శర్మగారికి మొదటగా ప్రేరణ నిచ్చినది మా నాటికే కదా అని నాకు సంతోషంగా ఉంటుంది.

తరవాతి కాలంలో ప్రసిద్ధికెక్కిన బాలమురళీకృష్ణ, భీమ్‌సేన్‌జోషీల జుగల్‌బందీ ప్రతిపాదన మొదటగా చేసినది మా తెలుగు సాహిత్య సమితే అనేది చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని జోషీగారితో ప్రస్తావించడానికి డా. ఎ.వి.మురళి తదితరులు పూనా కూడా వెళ్ళారు. బాలమురళి గారికి నేను ఉత్తరాలు రాశాను. ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే ఈ ప్రతిపాదనకు జోషీగారు వెంటనే ఒప్పుకున్నారుగాని బాలమురళిగారే కొన్ని అభ్యంతరాలనూ, షరతులనూ ప్రస్తావించారు. వ్యవహారం ముందుకు సాగలేదు. దీని విషయం మాత్రం చాలామందికి తెలిసింది. తరవాత అప్పటి గవర్నర్‌ కోన ప్రభాకరరావు ప్రమేయంతో ఈ కచేరీ పెద్ద స్థాయిలో జరిగింది. దీన్ని గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మాకు ఏ రకమైన స్థోమతా లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసమూ, ధైర్యమూ బాగా ఉండేవి. పబ్లిక్‌గా ఒప్పుకోరేమో కాని మా సమితిని చూసి ఆంధ్రమహాసభ దగ్గరనుంచీ ఇతర సంస్థలన్నీ చాలా నేర్చుకున్నాయి. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలకు వెళ్ళడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదని మొదటగా నిరూపించినది మేమే. మా సమితి కోసం సినీ నటుడు చంద్రమోహన్‌, తాళ్ళూరి రామేశ్వరి కలిసి తెలుగు నాటకం ఆడారు. నాటకం తరవాత అందరూ సరదాగా భోజనాలు చేస్తున్నప్పుడు రామేశ్వరి చంద్రమోహన్‌తో “ఏమండోయ్‌, వీళ్ళని చూసి బొంబాయిలో తెలుగు సభలన్నీ ఇలాగే ఉంటాయని అనుకోకండి, వీళ్ళు స్పెషల్‌” అని అందరి ఎదుటా చెప్పింది. అలాగే మా ఆహ్వానం గురించి మొదట్లో తటపటాయించిన పెండ్యాల గారితో “వాళ్ళు మంచివాళ్ళే” అని రాజేశ్వరరావు స్వయంగా భరోసా ఇచ్చారట.

అప్పట్లో బొంబాయిలో తెలుగు పత్రికలేవీ ఉండేవి కావు. అరుదుగా సావనీర్‌ వేసినప్పుడు అందులో ఒకటి రెండు పేజీలు తెలుగులో ప్రింట్‌ చేయించడానికి నానా తంటాలూ పడేవాళ్ళం. కార్యవర్గంలో అడ్వర్టిజ్‌మెంట్‌ రెవెన్యూ సంపాదించని తెలుగు పేజీల వల్ల నష్టమేనని కొందరు ప్రబుద్ధులు వాదించేవారు. వెంగంపేటవంటి చోట్ల అచ్చయిన సావనీర్లలో కూడా మంచి తెలుగు వ్యాసాలు పడేవని నేను వాదిస్తూ ఉండేవాణ్ణి. లేని సంస్కారాన్ని నేర్పడం చాలా కష్టంగా ఉండేది. మరొకవంక మాలాగా స్టేజి ఎక్కలేని చాలామందికి రచనలో మంచి అభినివేశమూ, ఆసక్తీ ఉండేవి. ఇదంతా చూసి మేము చేత్తో రాసి సైక్లోస్టైల్‌ చేసిన తెలుసా అనే తెలుగు మాసపత్రికను ప్రారంభించాం. ఆ తరవాత అమెరికా మిత్రుల సహాయంతో తెలుగు ఫాంట్‌ సంపాదించి నేను కంప్యూటర్‌ మీద టైప్‌ చెయ్యడం మొదలుపెట్టాను. ఒక కాపీ ప్రింట్‌ చేసి 400 కాపీలు తీసి సమితి తరఫున అందరికీ పోస్ట్‌ చేస్తూ ఉండేవాణ్ణి. ఈ ప్రోత్సాహంతో అంతకు ముందు తెలియని చాలామంది స్థానికుల రచనాశక్తి బైటపడసాగింది. ఒకావిడ ఏకంగా నవల రాసి సీరియలైజ్‌ చెయ్యడానికి ఇచ్చింది. 1997లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు బొంబాయిలో నిర్వహించిన తెలుగు సభల సందర్భంగా సానవీర్‌కు సంపాదకత్వం వహించే అవకాశం నాకు కలిగింది. అందులో ప్రచురణార్థం బొంబాయిలో దశాబ్దాల క్రితం వచ్చిన తొలి తెలుగువారి గురించిన వ్యాసాల కోసం ప్రయత్నించాను. ఆ సందర్భంలో నాకు అంతకు ముందు ఎక్కువ పరిచయస్థులు కాని ద్యావరిశెట్టి వెంకటేశ్వర్‌ తదితరులతో స్నేహం పెరిగింది. నేత పరిశ్రమ వగైరాలతో సంబంధం ఉన్న ఇటువంటి సీనియర్ల ద్వారా నాకు చాలా విషయాలు తెలిశాయి. అలాగే ఒకప్పుడు ఎస్‌.ఎ.డాంగేతో పనిచేసిన ఎం.వి.రామదాసు వంటి కార్మిక నాయకులు తమ వ్యాసాల ద్వారా ఎంతో తెలియజేశారు. సభకు వచ్చిన తిరుమల రామచంద్ర గారిని కలుసుకునే అవకాశం కలిగింది. ఈ అనుభవాలన్నీమరొక సందర్భంలో చెప్పుకోవాలేమో.

డబ్బులూ, పేరు ప్రఖ్యాతులూ వేటి గురించీ ఆలోచించకుండా ఉత్సాహంతో చేసిన ఈ కృషి వంటిది చెయ్యడానికి తరవాతి తరం ముందుకు రావటంలేదని కూడా మాకు అనిపించింది. 1980ల తరవాత “పనికొచ్చే పనే” చెయ్యాలన్న ధోరణి పెరిగింది. పెళ్ళిళ్ళయి, సంసారాలు పెరిగిన తరవాత కూడా మాలో కొందరం చురుకుగానే ఉండేవాళ్ళం కాని కుర్రాళ్ళలో అటువంటి వైఖరి తగ్గిపోయింది. కార్యవర్గంలో కూడా డబ్బులు వెనకేసి గుమాస్తాల చేత పని చేయించేద్దాంలే అనే ధోరణి పెరిగింది. మాలాంటి వాళ్ళం “పెద్ద” కళాకారులమనీ, తెరలు కట్టడం, దించడం, సభ్యుల చందా వివరాలు రాయడం మొదలైన రోజువారీ పనులు మేము చెయ్యనక్కర్లేదనీ అనేవారు కాని అందులో నాకు వినిపించిన అపశ్రుతి నిజమేనని తరవాత తెలిసింది. ఏడాది కొకసారి ఇంటింటికీ వెళ్ళి చందా వసూలు చేసే పద్ధతి పోయి జీవిత సభ్యత్వపు వడ్డీ మీదనే ఆధారపడదాంలే అనసాగారు. దీనితో మునుపటిలాగా ప్రోగ్రాములకు వచ్చినవారిలో ఎవరి పేరేమిటో వ్యక్తిగత స్థాయిలో ఎవరికీ తెలిసేది కాదు. చందాలతో పోలిస్తే ప్రతి ఏడాదీ వేసే సావనీర్‌ ద్వారా చాలా ఎక్కువ డబ్బు వచ్చేది. ఉద్యోగరీత్యా పలుకుబడి ఉండి సావనీర్‌కు అడ్వర్టిజ్‌మెంట్లు తెచ్చేవారు పెద్ద కామందులలాగా ప్రవర్తించసాగారు. మా సమితి కూడా “పెద్ద” సభలను పోలసాగింది. మాలో కొందరం మాత్రం పాత పద్ధతిలో అందరూ సమానులే అన్నట్టుగా ప్రవర్తించడం వీళ్ళకి నచ్చలేదు. నా లెక్కన సమితిలో పనిచేసే ప్రతివారినీ సమానంగా గౌరవించాలి. ఎవరి పరిస్థితిని బట్టి వారు తెర ముందో, తెర వెనకో పనిచేస్తారు గాని డబ్బులు తెచ్చేవాళ్ళదే పెత్తనం (అది వారి స్వంత సొమ్ము ఎలాగూ కాదు) అని ఒప్పుకోలేము. దీనితో కొన్ని కోపతాపాలు వచ్చాయి. మరొకవంక తెర ముందుకు వచ్చే సామర్య్థం లేని ఇతరులకు అసూయలు పెరిగాయి. ఎవరు తయారు చేస్తున్నారో ఎక్కడా పేరు వెయ్యకపోయినా తెలుసా బులెటిన్‌ బాగా పాప్యులర్‌ అయింది. ఇది కూడా కొందరికి కంటగింపయింది. ఎవరికైనా పేరు వస్తోందంటే అందుకోసం వారు ఆరాటపడుతున్నట్టే అనే మనస్తత్వం చాలామందికి ఉంటుంది. ఇలా ప్రతి క్షణమూ “శీలాన్ని శంకించే” పరిస్థితిలో తప్పుకోవడమే మంచిదని మాలో కొందరికి అనిపించింది.

కిందా మీదా పడుతూ నిర్వహించే ఇటువంటి ప్రవాసాంధ్రుల కార్యక్రమాల ఉపయోగమేమిటి? ఇది కాలాన్ని బట్టి కొద్దిగా మారే విషయం. 1970లతో పోలిస్తే మా పిల్లలు బొంబాయిలో టీవీ ద్వారా ఎన్నో తెలుగు సినిమాలూ (ముఖ్యంగా పాతవి), ఇతర కార్యక్రమాలూ చూడగలిగారు. ప్రస్తుతం బొంబాయిలో ఈనాడు దినపత్రికా, ఎక్కడున్నవారికైనా ఇంటర్నెట్‌ మీద సమాచారమూ అందుతోంది. ఆసక్తి ఉన్నవారికి తెలుగుకు సంబంధించిన విషయాలన్నీ అందుబాటులోనే ఉన్నాయి. అందుకని ఇటువంటి విషయాల్లో మీడియా పాత్ర కూడా ఉంటుంది. ముఖ్యవిషయం ఏమిటంటే ఎప్పటికైనా తెలుగు భాష, సాహిత్యం, లలితకళలు, వీటన్నిటితో సంపర్కం కోల్పోకుండా ఉండాలి. అందుకని స్థానికులు (ముఖ్యంగా పిల్లలు) కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలి. మంచి తెలుగు సంస్కారంతో పరిచయం కొనసాగిస్తే ఎప్పుడైనా పేరుపొందిన తెలుగువారిని మన ప్రాంతాలకు ఆహ్వానించినప్పుడు వారి ఎదుట మనవాళ్ళు బొత్తిగా అయోమయంగా కనబడకుండా ఉండే అవకాశం ఉంటుంది. సంస్థల పరిణామం కూడా ఒక్కొక్క రకంగా జరుగుతుంది. మార్పు తప్పనిసరి అయినప్పటికీ వ్యక్తిగత సంస్కారంలాగే సంస్థలు కూడా ఒక రకమైన సంస్కారాన్ని ప్రదర్శించాలని నా ఉద్దేశం. ఉదాహరణకు (మంచి ఉద్దేశంతో చేసినప్పటికీ) తమ ఎదుట ప్రతిభను ప్రదర్శించిన పిల్లలకూ, పెద్దవారికీ కూడా ప్రేక్షకులలోని కొందరు “సంపన్నులు” అప్పటికప్పుడు కట్నాలు చదివిస్తూ ఉంటారు. ఈ ఫ్యూడల్‌ పద్ధతి అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. అలాగే అప్పుడప్పుడూ అవసరార్థం కమర్షియల్‌ కార్యక్రమాలు నిర్వహించకుండా జరగదు. అయినప్పటికీ ఎన్టర్‌టైన్‌మెంట్‌కూ, కల్చర్‌కూ ఉన్న తేడాలను నిర్వాహకులు గుర్తించి తీరాలి. కార్యక్రమాల నిర్వహణలో ఈ విషయం గురించిన సరైన అవగాహన ఉంటే ఈలలు వెయ్యకూడని ప్రోగ్రాములు ఎటువంటివో ప్రేక్షకులకు అర్థమౌతుంది. సిన్సియర్‌గా చేసిన మా ప్రయత్నాలకు ఆ రోజుల్లోనే ఇతర ప్రోగ్రాముల్లో అల్లరి చేసేవారి నుంచి కూడా మాకు మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉండేది. ఈ అనుభవాలను పంచుకోవడం వల్ల ఎంతమందికి ప్రయోజనం ఉంటుందో తెలియదు కాని కొంతమందికైనా ఇదే రకమైన అనుభవాలు కొన్నయినా కలిగి ఉంటాయని అనుకుంటాను.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...