అతడు నేను

కాంపౌండు వాల్‌ పక్కన వేపచెట్టు విరగబూసింది. ఫాల్గుణ మాసపు సాయంకాలం నులివెచ్చని గాలి చిరు చేదు సుగంధాన్ని కిటికీ లోంచి గదిలోకి మోసుకొస్తోంది.

కిటికీకి చేరబడి పశ్చిమాకాశంలో మారుతున్న రంగుల్ని చూస్తున్నాను. నీలి ఆకాశం మీద తెల్లని మబ్బుతునకొకటి రూపాల్ని మార్చుకుంటూ అక్కడే నిలిచి నిలిచి హఠాత్తుగా మాయమైంది. కిటికీలో సగం తెరిచి పెట్టిన మార్క్‌టల్లీ పుస్తకం ‘ ఇండియా ఇన్‌ స్లోమోషన్‌ ‘  కొత్త పేజీలు గాలికి రెపరెపమంటున్నాయి మన గురించి మనకి పూర్తిగా తెలీదు. మనల్ని మనం తెలుసుకునే క్రమంలోనే జీవితం కాస్తా వెళ్ళిపోతుంది. ఇతరులను అధ్యయనం చేసినంత లోతుగా ఆత్మ పరిశీలన సాధ్యం కాదు.

ఠక్‌…ఠక్‌… వెనక నించి కర్ణకఠోరమైన శబ్దం అసంకల్పితంగా వెనక్కి తిరిగేను.

మంచం పట్టె మీద శబ్దం చేసిన ఇనప ఊచని పక్కన పెట్టి ఎడమ చేతిని కొంత పైకెత్తి ప్రయత్నం మీద చిటికెన వేలు విడదీసి చూపించాడతను.

నేను తొందర తొందరగా అటు నడిచి యూరిన్‌ పట్టేను. అలా చెయ్యడం ఏ కొంత ఆలశ్యమైనా పక్క తడిచిపోతుంది. టాయ్‌లెట్లో వంపేసి, మగ్గుని డెటాల్తో కడిగి తెచ్చి యధాస్థానంలో ఉంచాను.

నేను తిరిగొచ్చేసరికి అతను నోరు తెరిచి తినడానికేమైనా కావాలని సైగచేస్తున్నాడు…

వంకరపోయిన నోరు, రెప్ప పడని ఒక కన్ను ముఖాకృతి వికృతంగా గుర్తుపట్టలేని విధంగా కదలకుండా నిలిచిపోయిన కుడి చెయ్యీ కాలూ, మూగవోయిన గొంతు

నేనలా నిశ్చలంగా నిలబడి అతన్నే పరిశీలిస్తున్నాను. ఒక్కసారిగా ఉధృతంగా పెరాలసిస్‌ స్ట్రోక్‌ నలభై అయిదేళ్ళ ఈ బలమైన వ్యక్తిని ఎంత నిస్సహాయుడిగా మార్చేసింది!

ఉన్నట్టుండి క్షణంలో అతని మొహంలో కోపఛాయలు నిండిపోయాయి. ఆ కోపపు ఉధృతికి మనిషి మొత్తం కంపించి పోసాగేడు.

ఎంత కోపం ఇప్పటికింకా! అతనన్నది క్షణాల్లో జరిగిపోవాలి. అతని మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. చెప్పేనో…ఇప్పుడు కదలకుండాపోయిన ఆ కుడిచెయ్యి ఆ రోజుల్లో బలంగా నా చెంపని చెళ్ళుమనిపించేది.

అతడి ఆ కంపన చూసి నాకే జాలేసింది.

జార్‌లోంచి కొన్ని బిస్కెట్స్‌ తీసి ప్లేట్లో వేసి, గ్లాసుతో పాలు తెచ్చి పాలల్లో ముంచి తినిపించసాగేను. రెండు మూడు బిస్కెట్స్‌ తిన్నాక అతని షివరింగ్‌ తగ్గింది.

గత ఏడాది కాలంగా ఇదంతా అలవాటైపోయింది. మొదట్లో అతనికన్నా ముందు నేను భయంతో వణికిపోయేదాన్ని. అతను పనిచేయించే చోట ఎవరి మీదో కోపం తెచ్చుకుని, అవతలి వ్యక్తిని చితక్కొట్టి, గొంతు చించుకుని అరిచేసరికి ఇలా స్ట్రోక్‌ వచ్చింది. రెండు రోజుల పాటు ఎవరూ పట్టించుకోక ఏదో సాధారణ వైద్యం చేయడంతో, ఇన్‌టైంలో సరైన వైద్యం అందక ఆ తర్వాత ఎన్నెన్ని వైద్యాలు చేయించినా స్ట్రోక్‌ బారి నుంచి పూర్తిగా కోలుకోవడం కష్టమైంది.

తన కోపమే తన శత్రువు

కానీ అతని కోపం నాకూ శత్రువే. అతని వల్ల నేనూ అందరికీ శత్రువునయ్యాను.

భర్త తోడిదే భార్య లోకం కదా !

అవును, మా పల్లెల్లో అది ఉత్త నానుడి మాత్రమే కాదు, తు.చ.తప్పకుండా ఆచరించాల్సిన నీతి, న్యాయం. భార్యలకి వ్యక్తిత్వాలుండవు. సొంత గుర్తింపులుండవు.

అతనిలో ఎప్పటికైనా ఏదో ఓ గొప్ప మార్పు రాక తప్పదని, ఆనందం అంతా అప్పుడే వెల్లువెత్తి నన్ను ముంచేస్తుందని, మీరుతున్న వయసు అతనికి నన్ను, నాకు అతన్ని సన్నిహితం చేస్తుందని ఓదార్పు కలలు కన్నాను. అవన్నీ కొంతసేపటి క్రితపు ఆకాశంలోని మబ్బు తునకలాగే కరిగిపోయాయి.

ఇదిగో ఇతడిలా మంచం పట్టేడు. నేనిలా ఆజన్మాంత సేవకురాలిగా మిగిలిపోయేను.

కొత్తలో ఎందరెందరో చుట్టాలు పక్కాలు వచ్చి చూసి ముఖం మీద సానుభూతి చూపించి, వెనక్కెళ్ళి వ్యంగ్యంగా నవ్వుకుని వెళ్ళేవారు. ‘ అబ్బో అంతా బాగున్నప్పుడు వీళ్ళిద్దరికీ ఎవరైనా కళ్ళకు కనిపించేరా? ఎంత గర్వం, ఎంత పొగరుమోతుతనం, ఇప్పుడిలా బాగా జరిగింది ‘ నా కిప్పుడిక ఈ పడమటి కిటికీయే నేస్తం. కొంచెం తీరిక దొరికితే చాలు  రంగులు మారే ఆకాశం, దాని అంచుల నించి నేలకు దిగినట్లనిపించే దూరపు కొండలు, కొండ పాదాలకీ నాకు మధ్య బారులు తీరిన సైనికుల్లా నిలిచిన తాటి చెట్ల వరసలు, ఆ చెట్ల మొవ్వుల్లోంచి ఉన్నట్టుండి గుంపులుగా పైకెగిరే రామచిలుకలు, అడవి పావురాలు ;  అప్పుడప్పుడూ కొండ సానువుల్లోని అడవి నించి దారి తప్పిపోయి వచ్చి పెరట్లోని కరివేప చెట్టు మీద వాలి కొత్త కొత్త గొంతుల్తో వీనుల విందు చేసే పేరు తెలీని రంగు రంగుల పక్షులు  అన్నిట్నీ చూసే భాగ్యాన్ని ఈ కిటికీయే నాకు ప్రసాదిస్తోంది.

దూరంగా కొండ పాదంలో కనిపించే తామరపూల చెరువు ఎంతో దయగా నా బాల్యాన్ని నాకు గుర్తుచేస్తూ ఉంటుంది. ఎప్పుడూ కొద్దిపాటి నీళ్ళనైనా మిగుల్చుకొనే ఆ చెరువు ఈ యేడాది ఎండి నెరియలు విచ్చి నా లాగే కళ తప్పి వెలవెల పోతోంది.

బాల్యం అనే మాటే నా కెంతో మధురంగా తోస్తుంది.

అడవి మధ్యలో అప్పుడప్పుడే వికసిస్తున్నట్టు ఎదుగుతున్న మా వూరు, ఆ పచ్చని చెట్ల పరిసరాలు నా కిష్టం. ఊహ తెలిసీ తెలీని రోజుల్లోనే పెళ్ళి అనే మాటంటే నాకెంతో ఇష్టం. అది ఎవరి పెళ్ళైనా కానీ పెళ్ళిలోని రంగురంగుల చీరలు, మామిడాకుల పచ్చ తోరణాలు, అడవి పూల దండలు, తాటాకు పందిళ్ళ చల్లదనాలు, పచ్చని అరిటాకుల్లో వడ్డించే వేడి వేడి బూరెలు, ముద్దపప్పు  నెయ్యి ఇవేమీ కావు నా కిష్టమైనవి  ఇప్పటికీ ఒక మధుర భావ వీచికలా నా మనసులో రూపుదిద్దుకొని నర్తించేది పల్లకీ ఒక్కటే. రంగు రంగుల గాజుపూసలు, ముత్యాల జాలర్లు అలంకరించుకుని పెళ్ళిలో ఓ గొప్ప ఆకర్షణై నిలిచిపోయే పల్లకీ. పెద్దయ్యాక క్రిష్ణశాస్త్రి గారి ‘ పల్లకీ ‘  కవిత చదివి ఒకటే మురిసిపోయేదాన్ని. ఇంటి ముందు నుంచి ఏ పెళ్ళి ఊరేగింపు వెళ్ళినా నన్నూ పల్లకీలోకి ఎక్కించమని ఒకటే పేచీ పెట్టే దాన్ని, ఊరేగింపులోని ఎవరో ఒకళ్ళు నన్నెత్తి పల్లకీలో కొత్త జంట మధ్య కూర్చోపెట్టేవాళ్ళు. లయబద్ధంగా ఊయలూగే పల్లకీలో కూర్చుని నేను ఒకటే మురిసిపోయేదాన్ని. నాలుగిళ్ళ అవతల వరకూ మా నాన్న పల్లకీ వెంట నడిచి దిగనని మారాం చేసే నన్ను పల్లకీలోచి దించి ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇంకా చిన్నప్పుడు వీధిన పోయే వాళ్ళెవరైనా ‘ పల్లకీ ఎక్కిస్తాను వస్తావా ‘ అంటే చాలు, చేతులు చాచి వాళ్ళ మీదికి ఉరికేదాన్నట, మా అమ్మ చెప్పేది. నా బలహీనత కనిపెట్టి మామయ్య వరసయ్యేవాళ్ళు కొందరు మా వీధి వెంట వెళ్తూ, ‘ పిల్లా, నన్ను పెళ్ళాడతావా పల్లకీ ఎక్కిస్తాను ‘  అంటూ ఉండేవాళ్ళట. నేను వెంటనే ఇంట్లోంచి పరుగెత్తుకొచ్చి ‘ సరే సరే ‘ అనేదాన్నట. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తెలిసీ తెలీని బాల్యంలోనేకాదు పెద్దయ్యాక కూడా స్త్రీల భావుకత్వాన్ని, బలహీనతల్నీ ఎగతాళి చేసి ఏడిపించే వాళ్ళుంటారని పెళ్ళయ్యాక అర్థమైంది.

నా పదిహేనేళ్ళ వయసులో నన్ను ఇష్ట పడ్డానని కోరి పెళ్ళాడిన ఇతడు నేను ‘ పల్లకీ ‘  అనగానే ” ఛీ, అదేం కోరిక, పాత చింతకాయ పచ్చడి కోరిక ” అన్నాడు.

నేనింకా పట్టుపడితే అతడు నన్ను పెళ్ళాడనంటాడేమోనని మా వాళ్ళకి భయం. అలా నా చిరకాల వాంఛ ఛిద్రమైపోయింది.

పల్లకీ పాతబడిపోయినా చాలాకాలం వరకూ చాకలి నర్సయ్య ఇంటి వీధరుగు పల్లకీ గూట్లో అలంకారాలు లేని బోసి పల్లకీ ఉండేది. నేనెప్పుడు మా వూరి కెళ్ళినా మంచినీళ్ళ చెరువు నానుకుని ఉన్న చాకలి వీధి కెళ్ళి పల్లకీని చూసి, ఏదో ఓ వంకతో దాన్ని నిమిరి, దాని పూర్వ వైభవాన్ని కళ్ళల్లో నింపుకుని వచ్చేదాన్ని. ఓ సారలా వెళ్ళినప్పుడు బోసిపోయిన గూడుని చూసి అడిగితే, ” ఏవుందమ్మా. వాడకం లేక పల్లకీకి చెదలు పట్టేసేయి. ఏ ముక్కకా ముక్క ఇరిగిపోయింది ”  అన్నాడు నర్సయ్య కళ్ళు తుడుచుకుంటూ. నాకూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ తర్వాత ఇంకెప్పుడూ అవసరమైనా ఆ వీధిలోంచి వెళ్ళలేదు.

బాల్యం నాటి ఆ చిన్న చిన్న తీపి స్మృతులు తప్ప పాతికేళ్ళ నా వైవాహిక జీవితంలో ఏనాడైనా గుర్తు చేసుకొనే మధుర స్మృతులున్నాయా?

మా అటవీ ప్రాంతాల్లో వరుడికి కట్నం ఇచ్చే సాంప్రదాయం లేదు. ఇష్టపడి వచ్చిన వాడికి పిల్లనిచ్చి పెళ్ళి జరిపించడమే. పెళ్ళిలో లాంఛనాలైనా జరిపించలేదని బతికున్నన్నాళ్ళూ ఇతని తల్లి నా వైపు ఎంత చీదరగా చూసేదో! అవకాశం దొరికితే చాలు. ” ఇంతోటి అందగత్తె ఎక్కడా దొరకదని ఈ అడవి మొహాన్ని కట్టుకున్నాడు ” అంటూండేదావిడ.

అసలితనికీ నాకూ పెళ్ళి జరగడమే గొప్ప ఆశ్చర్యం.

ఆడా మగ భేదాలు పాటించడం, మగ వాళ్ళని చూసి తలుపుల వెనక దాక్కుని మాట్లాడడం, అక్కర్లేనంత మర్యాదలు ఒలకబొయ్యడం నాకు తెలీదని వీళ్ళ మొదటి ఫిర్యాదు.

నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు అతను బస్తీ నుంచి మా ఊరి మీదుగా ఎక్కడికో వెళ్తూ స్కూలుకెళ్తున్న నన్ను చూసేడట. తన తరఫున పెద్దలెవరూ లేరని, తన తల్లి ఉన్నా ఆవిడకేం తెలీదనీ చెప్పి మా పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్ళి నిశ్చయం చేసుకున్నాడు. ఒక బస్తీ యువకుడు, సొంత ఇల్లు వ్యాపారం ఉన్నవాడు తన కూతుర్ని కోరి పెళ్ళాడతానన్నందుకు మా అమ్మ నాన్న ఒకటే మురిసిపోయేరు.

ఆ తర్వాత పెళ్ళి జరిగేలోపల ఎన్నోసార్లు మా క్లాస్‌రూమ్‌ దగ్గరకొచ్చి నన్ను బైటకి పిలిచి ఓ గులాబి పువ్వు నా చేతికిచ్చేవాడు. ఆ టైంలో అతని ముఖంలో ఏం భావముండేదో నేనెప్పుడూ గమనించలేదు. నేను తిరిగి క్లాసులో కొస్తూంటే క్లాసులో అందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళు. నేను అవమానంతో కళ్ళనీళ్ళ పర్యంతమయ్యేదాన్ని.

అడవితల్లి ఒడిలో పుట్టిన మా బతుకులు పూర్తిగా చెట్టు పుట్టల్తో మమేకమై ఉండేవి. కొండ వాలుల్లోని పోడు వ్యవసాయం, ఊరి మార్గాలన్నింటి పక్కన బారులు తీరి నిల్చున్న తురాయి చెట్లు, అడవి మల్లె వృక్షాలు, ఊరి బైట గట్లంట పుట్లంట కాసిన కొండ మామిడికాయల అతి పులుపుదనాలు. బడి నుంచి ఇంటికెళ్ళేదారి నిండా రాసులుగా రాలి పడిన కుంకుడుకాయల్ని, ఉసిరికాయల్ని పుస్తకాల సంచుల్లో నింపుకొని మొయ్యలేక మోసుకెళ్ళడాలు తప్ప ఇలా గులాబీపూల ప్రణయం తెలీనివాళ్ళం.

పదిహేనేళ్ళకే తల వంచుకుని ఇతని సహచరిగా ఇతని ఇంటికొచ్చాను.

మళ్ళీ…ఠక్‌… ఠక్‌…

టైం చూసాను, ఆరున్నర, టీవీ ఆన్‌చేసి ఆంధ్రావని ట్యూన్‌ చేసాను. గోధుమ జావలో పప్పు పులుసు వేసి స్పూనుతో కలిపి తెచ్చాను. అతను కష్టం మీద నోరు తెరిచాడు. ఒక్కొక్క స్పూను జావ నోట్లో వేస్తూంటే నమలకుండానే మింగుతున్నాడు.

నా దృష్టి టీవీ మీద నిల్చింది.

ఇంటర్మీడియట్‌ పరీక్షలకి క్లోజ్డ్‌ సర్క్యూట్‌ కెమెరాలు అమరుస్తారట. ఎందుకు చదువులకి ఇంతంత ప్రదర్శనలు పటాటోపాలు? నిజంగా కష్టపడి చదివినా ఉద్యోగాలెక్కడున్నాయని? డబ్బుతో పోటీపడి కొనుక్కునే సీట్ల కోసం ఈ వడపోత షో లెందుకో…కోట్లలో జనం డబ్బు మింగేసి ఏడాదైపోయిన సందర్భంగా ఏడుస్తున్న జనానికి కంటి తుడుపుగా యాభై వేల డిపాజిట్లు ఒకటొకటిగా ఎప్పుడో ఒకప్పుడు ఇస్తానని హమీ ఇస్తున్నాడు ఓ ప్రైవేట్‌ బేంక్‌ ఎమ్‌.డి. ఆ మొహంలో ఎక్కడా గిల్టీ అనేదే లేదు. పైగా ఏదో ఘనకార్యం చేసిన గర్వం తొంగిచూస్తోంది.

ఆటోలు బేన్‌ చేస్తారట. ఇకపై అందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చెయ్యాలట. ఎందరి నోళ్ళు కొట్టే ప్రయత్నమిది !  ఎందరికి ఇబ్బంది !  ప్రొద్దుట పేపర్లో నేను చదివిన డా. సి. రంగరాజన్‌ వ్యాసంలోని వాక్యాలు గుర్తుకొచ్చాయి. ఆర్ధిక ప్రపంచీకరణ జరుగుతున్న సందర్భంలో సాంస్కృతిక ప్రపంచీకరణ గురించి కొంత భయాన్ని వ్యక్తం చేసాడు. ‘ ఆర్ధిక ప్రపంచీకరణ ధనవంతుల్ని ఇంకా ధనవంతులుగా, పేదవారిని ఇంకా పేదవారుగా చేస్తుంది. భారతదేశ ఆర్ధిక వ్యవస్తను పరిశీలిస్తే దిగువ కులాలకు చెందిన సాంప్రదాయక కుల వృత్తుల్ని నాశనం చేసింది. వారి ఉనికిని దెబ్బ తీసింది. సామాన్య ప్రజలకి వృత్తి మార్పిడి కొన్ని నిబంధనల్ని సృష్టించింది ‘ అంటాడు. నేను చదివిన చదువుతో నిమిత్తం లేకుండా నాలో ఈ జిజ్ఞాస అన్నీ తెలుసుకోవాలనీ, అన్నీ చదవాలనీ ఎలా ఏర్పడిందో నాకు తెలీదు. అది కూడా ఇతని కంటగింపుకి కారణమైంది.

నా అదృష్టమేమో నేను అక్షరాలు నేర్చుకొనే టైంకి మా ఊరికి లైబ్రరీ వచ్చింది. ‘ చందమామ ‘ కధల్తో ప్రారంభించిన నేను త్వరలోనే పుస్తకాల పురుగునైపోయాను. బడిలో మా తెలుగు మాస్టారు వేయించిన సంస్కృత నాటకాలు, హిందీ నాటకాలు నాకు కొంత ఉచ్ఛారణా పటిమని, భాషా జ్ఞానాన్ని ఇచ్చాయనుకుంటాను.

అతను నన్ను చూసే వేళకే ఇవన్నీ జరిగిపోయాయి.

పైకి చూడడానికి నేనొక అమాయకమైన బాలికలా కనిపిస్తే నేనేం చెయ్యను? కొత్తలో హుషారుగా అతన్తో నా భావాలన్నిట్నీ పంచుకోవాలనుకునేదాన్ని.

” జీవితంలో పల్లకీ ఎక్కడం తప్ప మరో కోరిక లేని, ఏమీ తెలీని అడివి మాలోకానివి ; చెప్పినట్టల్లా వింటావు, తోచినట్టల్లా మల్చుకోవచ్చు అనుకుంటే నువ్విలా కొరకరాని కొయ్యలా తయారయ్యావేంటి ?” అనేవాడు. ” నీ నాలెడ్జంతా నా దగ్గర వొలకబొయ్యకు ” అని ఈసడించుకునేవాడు.

ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకుంటున్నాను అని చెప్పిన ఇతనిలో ఈ ద్వైదీభావం ఏమిటో, ఈ అకారణ ద్వేషం ఏమిటో మొదట్లో నాకర్థమయ్యేది కాదు. కాని, అతను నా రూపాన్ని మాత్రమే ఇష్టపడ్డాడు తప్ప నన్ను నన్నుగా ప్రేమించలేదనీ, నా వ్యక్తిత్వాన్ని భరించలేకపోతున్నాడనీ త్వరలోనే అర్థమైంది.

చదువుకోవడానికి ఒక్క పుస్తకమైనా దొరక్క విలవిలలాడిపోయేదాన్ని.

” అమా, దీని చేత గిన్నెలు తోమించి పాచిపనంతా చేయించు. దీనికి పైత్యం ఎక్కువైంది ” అనేవాడు హాస్యమాడుతున్నట్టు మొహం పెట్టి. అడవి బిడ్డలం అయిదేళ్ళ వయసు నుంచే పనులన్నిట్లో ఆరితేరతాం అని తెలీని వెర్రివాడు.

ఒకసారేం జరిగింది ? ఆ దృశ్యం ఇప్పటికీ పచ్చి మాయక కళ్ళ ముందుకొచ్చి నన్ను గొప్ప అవమానాగ్నిలో దహించేస్తుంది. పెళ్ళైన కొత్తల్లో మా అమ్మా వాళ్ళనీ, మా ఊరినీ చూడాలని చాలా అన్పించేది. ఏ కాస్త అవకాశం దొరికినా ఊరెళ్ళి పోయేదాన్ని. ఓసారి    నెమలి కన్నుల్ని తలపైన జుట్టు ముడిలో అలంకరించుకొచ్చే కోయ దొర మామ, మా కులం వాళ్ళ ఇళ్ళకి మాత్రమే యాచనకొచ్చే పొడపోతల తాత, ఆ తాత మోసుకొచ్చే దేశదేశాల కథలు కబుర్లు అన్నీ మరీ మరీ గుర్తుకొచ్చాయి. రెండు రోజులుగా ఇతనికి చెప్తున్నాను.  ఆ రోజుల్లో మా ఊరికి ఇన్ని బస్సుల్లేవు. బస్తీ నుంచి రోజూ ఉదయాన్నే ఓ బస్సు ఉండేది. నేను తయారై వున్నాను. రాత్రి ఏదో పని మీద వెళ్తున్నానని బైటికెళ్ళిన అతనింకా ఇంటికి రాలేదు. నా ఆత్రం ఆగలేదు. నేనొక్కదాన్నీ వెళ్ళలేనా?

సంచిలో ఒక జత బట్టలు పెట్టుకుని మా అత్తగారికి చెప్పి ఆ ఇంట్లోంచి బైటపడ్డాను. బస్టాండులో బస్సు వచ్చి ఇక ఎక్కుదామనుకునేంతలో అతనొచ్చాడు. రగిలిపోతున్న అతని ముఖాన్ని గమనించకుండా అతని దగ్గరికి పరుగెత్తేను. అంతే, పొడవైన నా జడని చేతికి చుట్టుకుని చెంపలు వాయగొట్టి ఈడ్చుకెళ్ళి రిక్షాలో కుదేసాడు. రిక్షా ఇళ్ళు చేరగానే కిందికి లాగి, కాళ్ళతో కుమ్మి…

మా ఊళ్ళో గ్రామ దేవతకి బలి ఇచ్చే వేళలో అమాయకమైన మేకపిల్ల ఎందుకలా వణికిపోతోందో నా కప్పుడర్ధమైంది.

” బరి తెగించిన అడవి వేషాలు నా దగ్గిరెయ్యకు, చంపేస్తాను జాగ్రత్త ” అన్నాడు.

” కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే ఏమవుద్ది మరి ” అంది వాళ్ళమ్మ. నేనేం తప్పు చేసానో నాకర్థం కాలేదు.

అడవిలో పుట్టడం నా తప్పా? కట్టుబొట్టు నాగరీకతల్లో వీళ్ళతో సమానంగా ఉండకపోవడం నా తప్పా? బస్తీ బస్తీ అంటున్నారు, వీళ్ళ ఆలోచనలెందుకింత సంకుచితంగా ఉంటున్నాయి? మా ఊళ్ళో అయితే ఒక ఆడపిల్ల పుట్టింటి కెళ్ళడానికి ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదు. మా వూళ్ళో మగ వాళ్ళు మాట పట్టింపు కోసం ప్రాణాలు వదుల్తారు తప్ప ఇలా అకారణంగా ఎవర్నీ హింసించరు. అనుకోకుండా తను విసిరిన కర్ర తగిలి తను పెంచుతున్న గొర్రె పిల్ల కాలు విరిగితే మా పక్కింటి వుల్లిగాడు ఎంత ఏడ్చాడనీ !

బస్తీలోని గాలి అడవి ఇళ్ళ మధ్య ఊపిరి తిరగనట్టై ఒకసారి ఎవరికీ చెప్పకుండా మా ఊరి బస్సెక్కేసేను. దురదృష్టవశాత్తు మా ఊరిని అప్పుడప్పుడే బ్రాహ్మణ సంస్కృతి గుప్పెట్లోకి తీసుకుంటోంది. చిత్రంగా మా ఇంట్లో రాముల వారి ఫోటోలూ, పూజలూ మొదలయ్యాయి. ‘ ఇష్టంలేని బతుకు ఎందుకు బతకాల ‘  అని అందరికీ ధైర్యం చెప్పే మా అమ్మ రామాయణంలో సీతాదేవిని అత్తింటి కంపేటప్పుడు చెప్పిన నీతుల్ని వల్లించి, ‘ కట్టమో సుకమో అక్కడే బతకాల ‘ అని నన్ను వెనక్కి పంపించింది. మా నాన్న వచ్చి ఇతన్ని కాళ్ళూ కడుపు పట్టుకుని బతిమలాడి నన్ను దిగబెట్టి వెళ్ళేడు.

ఇతడికి సొంతంగా గ్రానైటు మిల్లు ఉండేది. నిరంతరం అది కఠోరమైన చప్పుడు చేస్తూ రాళ్ళను పిండిగా చేస్తూ ఉండేది. మిల్లు కానుకునే ఇల్లు. నన్ను ఆ మిల్లుకు డ్రైవర్ని చేసాడు. డ్రైవరంటే ఏం లేదు   స్విచ్‌ ఆన్‌ చెయ్యడం, డబ్బులు వసూలు చెయ్యడం. రాళ్ళెత్తి పొయ్యడం, పౌడర్ని బస్తాల కెత్తడం అన్నీ పని కుర్రాడు చంటి చూసుకొనేవాడు. బతుకు తెరువు వెదుక్కుంటూ వాడూ మా ప్రాంతం నించి వచ్చినవాడే. పదిహేనేళ్ళ వాడు కష్టం చేసి డబ్బులు పట్టుకెళ్తే తప్ప వాళ్ళింట్లో అందరూ పస్తులుండే పరిస్థితి.

నేను యజమానురాల్ని, వాడు పనివాడు అన్న భేదం తప్ప సాయంకాలానికి ఇద్దరం నల్లని గ్రానైటు పౌడరు తల నించి కాలిగోరు దాకా పట్టేసి ‘ చందమామ ‘  కథల్లో భూతాల్లా తయారయ్యే వాళ్ళం. మా పళ్ళు, కళ్ళు మాత్రం తెల్లగా మెరుస్తుండేవి. ఒకళ్ళని చూసి ఒకళ్ళం పగలబడి నవ్వుకునేవాళ్ళం. ఆ నవ్వునీ బంద్‌ చేయించడానికి వీళ్ళకెంతో కాలం పట్టలేదు. పనోడితో నవ్వులేంటని ఇతడు నా మీద చెయ్యి చేసుకున్నాడు.

ఆ పౌడర్‌ ఊపిరితిత్తుల్లోకి పోకుండా నేను ముక్కుకి పైటకొంగు అడ్డాం పెట్టుకునేదాన్ని. పాపం చంటికి కొన్నేళ్ళకి టి.బి. వచ్చేసింది. ఎప్పుడూ జ్వరంతో దగ్గుతూ ఉండేవాడు. అప్పటికి నా దగ్గరుండే కొద్ది పాటి చిల్లరా వాడి చేతిలో పోసేదాన్ని మందులు కొనుక్కోమని. క్రమంగా నీరసించిపోసాగేడు.ఆ తర్వాత పనిలోకి రాలేకపోయాడు. ఆ పైన వాడూ, వాడి కుటుంబం ఏమయ్యారో !

వెంటనే పనివాళ్ళు దొరక్క చంటి చేసే పని కూడా నేనే చెయ్యాల్సివచ్చేది.

ఠక్‌…ఠక్‌…

గిన్నెలో జావ ఎప్పుడో అయిపోయింది. టీవీ తనంతటికి తను ఏదో పిచ్చి ప్రోగ్రామ్‌ని ప్రసారం చేసుకుంటోంది. ఇప్పుడిక చానల్‌ మార్చి మరేదో సీరియల్‌ పెట్టాలి.మంచం మీది నుంచి కదలలేకపోతున్న ఇతనికి టీవీ గొప్ప కాలక్షేపం అయిపోయింది. కాలకృత్యాల్తో సహా అన్నీ మంచం మీదే ఉండి చేయించుకుంటూ టీవీని చూస్తూ కాలాన్ని దొర్లించేస్తున్నాడు. తలలో నెర్వస్‌ సిస్టం దెబ్బతినడం వల్ల స్క్రీన్‌ మీద పాత్రలు ఏడిస్తే తనూ ఏడుస్తాడు. వాళ్ళు నవ్వితే తనూ వెర్రిగా నవ్వుతాడు. అరచేతి నిండా ఆయుర్వేదతైలం పోసుకుని అతని కాలికీ, చేతికీ చర్మం లోపలికి ఇంకేలా మర్దనా చేసాను. ఆవు పాలతో అతనికివ్వాల్సిన మందులన్నీ మింగించి, పనులన్నీ ముగించి, అతనికి దుప్పటి కప్పి, నేను నా మంచం మీద వాలేను.

బెడ్‌ లైట్‌ వెలుగులో పక్కకి తిరిగి అతన్ని పరిశీలించడం మొదలు పెట్టేను. నేనెప్పుడూ అతన్నింత పరిశీలనగా చూసిన గుర్తు లేదు. మందుల ప్రభావం వల్ల కాబోలు నోరు తెరిచి పెద్దగా గురక పెడుతున్నాడు. నిద్రలోనూ మూతపడని కన్ను నిశ్చలంగా చూస్తోంది. జబ్బు వలన చెంపలు లోతుకు పోయి బైటికి చొచ్చుకొచ్చినట్టు కనిపిస్తున్న ముందు పళ్ళు. మొదట్నుంచీ నన్నేమాత్రం ఆకట్టుకోలేకపోయిన అతని వ్యక్తిత్వం.

ఏనాడైనా ఇతను నా జీవన సహచరుడనే తీయని భావం నన్ను అలుముకుందా? జీవిత మాధుర్యం నన్నెప్పుడైనా పలకరించిందా? ఇవాళ వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నేనెందుకు వీళ్ళకిలా అంకితమైపోయాను? జీతం బత్తెం లేని సేవకురాలినని వాళ్ళనుకున్నారు సరే, నాలోని ఏ పిరికితనం నన్నీ జీవితం నుంచి పారిపోకుండా పట్టి ఆపింది? నేను తినే గుప్పెడు మెతుకులు ఎక్కడ దొరకవని? అదేం కాదు, ఇక్కడ దొరికే సాంఘిక భద్రత కోసం నేనీ జైలుకి అంకితమైపోయాను. జీవిత కాలాన్ని చేజార్చుకున్నాను.

పిల్లలు పుట్టలేదనే నెపంతో మరో స్త్రీతో మరో ఇంట్లో కాపురం పెట్టాడని తెలిసినప్పుడు కూడా నాకు ఏ మాత్రం బాధ కలగలేదు. ఒక గొప్ప రిలీఫ్‌ అనిపించింది.పాపం అక్కడా అతని ఆశ నెరవేరలేదు. ‘ ఇలాంటి మారెమ్మకు పిల్లలెలా పుడతార్రా ‘ అంటూ నా మీద ద్వేషం కురిపించే ఇతని తల్లి తర్వాత ఆ మాట అనడం మానేసింది.

చచ్చిపోయే ముందు నెలరోజులు మంచం మీద ఉన్నప్పుడు నా చేత సేవలు చేయించుకుంటూ ఆవిడ గొప్ప మార్పుకి లోనైంది. ఒకసారి హఠాత్తుగా నా చెయ్యి పట్టుకుని, ” అమ్మా, నా కొడుక్కి బోలెడంత కట్నం వచ్చేది, నీ మూలంగా అది తప్పిపోయిందనే కసితో నిన్ను కాల్చుకు తిన్నాను. అయినా ఈవేళ నువ్వు నాకిదంతా చేస్తున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ ” అంది ఏడుస్తూ.

ఏదో మొక్కుబడిగా అయిష్టంతో నేను చేస్తున్న ఈ పనులు ఈమెకింత ఊరట కలిగించడం నాకు ఆశ్చర్యమనిపించింది. అప్పుడు నాకు సేవలోని గొప్పతనం అర్థమైంది.

మనుషులెవ్వరూ పూర్తిగా చెడ్డవాళ్ళు కారనీ, మనుషుల నైజాల్లో సహస్ర ముఖాలుంటాయనీ నేను చదివిన సాహిత్యం నా కెప్పుడో నేర్పింది. నేనూ నా నడవడికా కొందరికి మంచిగా అన్పించొచ్చు. మరికొందరికి నచ్చక పోవచ్చు. నాలో ఈ తల్లీ కొడుకులకి నచ్చనిదేదో ఉంది.

ఈవిడ తెల్లవారి లేచి ఆ శరీరాన్ని తోమి తోమి గంటలు గంటలు స్నానం, మరో కొన్ని గంటలు పూజలూ చేసేది. కాని, ఎంగిలి చేతిని కాకికి కూడా విదిలించి ఎరగదు. ఈమె పూజించిన దేవుళ్ళెవరూ ఈమెని మంచం పట్టకుండా కాపాడలేకపోయారు. ఈమె పూజలకు చేసిన ఖర్చులు, ఆలయాలకిచ్చిన చందాలు కలిపితే కొందరు అనాధలు హాయిగా బతికేసేవాళ్ళు.

ఇప్పుడు ప్రభుత్వ విధానమూ అలాగే ఉంది కదా !  పల్లెల్లో జనం ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లు కట్టుకోలేక, చేద్దామంటే పనుల్లేక, కడుపునిండా తిండిలేక సతమతమౌతుంటే మండలానికో పాతిక లక్షలు శాంక్షను చేసి ఆలయాలు నిర్మిస్తారట. పాతికలక్షలు చాలలేదని చందాలిమ్మని జనం మీద తప్పకుండా పడతారు కార్యకర్తలు. అప్పుడు కరువులో అధికమాసం అన్నట్టవుతుంది.

గ్లాసు నీళ్ళ కన్నా పెప్సీ  కోక్‌ చవగ్గా ఉంటున్నాయి, జనాలకు అలవాటయ్యేవరకూ.

ఠక్‌…ఠక్‌…

లేచి కూర్చున్నాను. అతడు మామూలుగా నిద్రపోతూనే ఉన్నాడు. అలవాటు ప్రకారం నిద్రలో చప్పుడు చేస్తున్నాడు.

ఇతని తల్లి పోయాక ఈ మధ్యకాలంలో నాకు దొరికిన తీరికతో వందల కొద్దీ పుస్తకాలు, నేను ఎన్నుకున్న సాహిత్యం చదివే అవకాశం చిక్కింది. రేడియోలకి, పత్రికలకి చిన్న చిన్న వ్యాసాలు రాయడం, సేవా సంస్థల్లో పనిచెయ్యడం అలవాటైంది.

మనకి దొరికిన ఈ జీవితం ఏడ్వడానికి, అంతం చేసుకోడానికి కాదని నాకో గొప్ప నమ్మకం ఏర్పడింది. మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమించనీ, ప్రేమించకపోతే పోనీ  నువ్వు మాత్రం నిస్సహాయుల్ని ప్రేమిస్తూనే ఉండు. వివేకానందుడు చెప్పినట్లు స్మారక మందిరాల్లో తాజ్‌మహల్‌లాగా మానవ శరీరమే అత్యుత్తమ దేవాలయం.

కాంట్రాక్టు బిజినెస్‌ మొదలుపెట్టేక ఇతడు ఆర్థికంగా ఎదగడం మొదలుపెట్టేడు. ఆ డబ్బును ఎంజాయ్‌ చేస్తున్నాననుకుని అలవాట్లు పెంచుకున్నాడు.

రాజకీయ నాయకుల్తో స్నేహం, పార్టీలు, పార్టీకి ఫండ్సివ్వడం అంతా స్టేటస్‌ సింబల్‌ అనుకున్నాడు. అలవాట్లు ఒంటిని గుల్ల చేస్తే, రాజకీయ పరిచయాలు ఇంటిని గుల్ల చేసాయి. ఇంకొన్నాళ్ళుంటే తన దగ్గరేం మిగల్చడనుకుందో ఏమో తనకి అందుబాట్లో ఉన్న బంగారం, డబ్బు తీసుకుని ఆమె ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. గత్యంతరం లేక తిరిగి ఇంటి కొచ్చాడు.

బెల్లంతో బాటు చీమలూ మాయమయ్యాయి. అలవాట్లకి చిహ్నంగా శరీరంలో జబ్బులు మిగిలాయి. కోపం…కోపం  మనిషి ఎప్పుడూ కోపంతో రగిలిపోతూ ఉండేవాడు. అది అతని శారీరక లక్షణం. అతని నైజం.

ఆ నైజమే ఉన్నట్టుండి దెబ్బ కొట్టి మంచాన్నెక్కించింది. ఉన్న ఇంటిని అమ్మి ఇతనికి వైద్యం చేయించవలసి వచ్చింది. ఆ సమయంలో సేవాశ్రమం వాళ్ళు ఆదుకుని ఈ కాటేజ్‌ని ఇచ్చి ఉండకపోతే ఇవాళ నిలువ నీడ లేకపోయేది. ఆశ్రమంలో నేను చేస్తున్న ఉచిత సేవకు ప్రతిఫలంగా ఆశ్రమం వాళ్ళే మాకు కాస్త తిండి పెడుతున్నారు.

* * *

సేవా సంస్థ కార్యకర్త నా మిత్రురాలు షరీఫా వచ్చిందో రోజు మా కాటేజ్‌కి. ఆమెకి నా జీవితం మొత్తం తెలుసు.

కొన్ని గంటలు నన్ను గమనిస్తూ ఉండిపోయింది.

” యుద్ధం మొదలయ్యేలా ఉంది ” అంది హఠాత్తుగా  ” ఓ పక్క కరువు మరో పక్క యుద్ధం. మధ్య తరగతి నుంచి అట్టడుగు వర్గాల వరకు మనిషి మనుగడ కష్టమైపోతోంది ”

నేనేం మాట్లాడలేదు. ఏదో అడగాలని, మరేదో అడిగి సంభాషణ మొదలు పెట్టడం షరీఫాకి అలవాటు. తర్వాత మాట్లాడబోయే విషయానికి నాందిగా పొంతన లేని ఇంకేదో విషయం మాట్లాడుతుంది.

” అవునూ, అతడు నీకేం చేసాడని నువ్వతనికింతగా సేవలు చేస్తున్నావు? ”

” ఫరీషా, ఈ ప్రశ్న మాములు వాళ్ళు అడిగితే బావుండేది. సేవాశ్రమంలో ఎవరెలాంటివాళ్ళో తెలీకుండానే మనం వాళ్ళకి సర్వీసు చెయ్యడం లేదూ ?  ఇతన్నీ అలాగే అనుకుని నేనిదంతా చెయ్యగలుగుతున్నాను. మనిషి నిస్సహాయస్థితిలో వున్నప్పుడు ఆదుకోవాలని కదా మనం నేర్చుకున్నది ”  అన్నాను. ” మనం జీవించడానికి కావల్సిన ముఖ్యమైన లక్షణం జీవితం మీద ప్రేమ. ఇతరుని జీవింపచెయ్యడానికి కావల్సిన ముఖ్యమైన లక్షణం మనుషుల మీది నమ్మకం, జాలి, దయ, ప్రేమ. ప్రపంచాన్నీ, మనుషుల్నీ నమ్మలేని ప్రేమించలేని స్థితి విషాదకరమైంది. ”

షరీఫా నా వైపు నిశ్చలంగా చూసిందో నిముషం. ఆ చూపులో వున్నది జాలో, మెచ్చుకోలో నాకు తెలీలేదు.

తర్వాత మాట మాటా కూడదీసుకుంటూ అంది

” ఈ లోకంలో అందరూ నీలా ఆలోచించగలిగితే దేశాల మధ్య అసలు యుద్ధాలే రావు. “