Comment navigation


15807

« 1 ... 1347 1348 1349 1350 1351 ... 1581 »

  1. మరో గుప్పెడు మొర్మొరాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/15/2008 12:15 am

    చదివించగలిగే శక్తి ఉన్న రచనని మరీ అంత హీనంగా చూడకూడదేమో! ఈ రచన ముఖ్యోద్దేశం ఏమిటి? పాత పద్యాల గురించి సామాన్య పాఠకులకుండే భయాన్ని పోగొట్టడం. ఎలా? ఓ పుస్తక పరిచయం ద్వారా.

    దానిని మన పత్రికలలో ఏదో మొక్కుబడికో పేజీ నింపడానికో చేసినట్లు కాక తన అనుభవంతో అన్వయించుకుంటూ సొంత జీవితంలో ఎరిగిన వ్యక్తుల్ని స్మరించుకుంటూ చేశాడు. అది మెచ్చుకోదగ్గ ప్రయత్నం.

    పోయినేడు, ఈమాట మిత్రులు నన్నేమైనా వ్యాసం రాయమని పదేపదే పోరితే, సరేనని మాఊళ్ళో లైబ్రరీ కెళ్ళి పుస్తకాలు తిరగేశా – Essay Writing for Dummies లాంటిదేమైనా దొరుకుతుందని. వ్యాస రచన నాకంత సులభం కాదని తెలిసిపోయింది. ఈ వ్యాసమూ, అబిప్రాయాలూ చదివాక, ఆ పుస్తకాలలో చదివినదొకటి గుర్తుకొచ్చింది:

    “The hallmark of the personal essay is its intimacy. The writer seems to be speaking directly into your ear, confiding everything from gossip to wisdom. Through sharing thoughts, memories, desires, complaints, and whimsies, the personal essayist sets up a relationship with the reader, a dialogue – a friendship, if you will based on identification, understanding, testiness, and companionship.” [1]

    Montaigne, “Every man has within himself the entire human condition,” అన్నాడట. అంటే బాబ్జీలు గారు తన గురించి చెప్తున్నప్పుడు నిజంగా మన (అంటే నాలాంటి వాళ్ళు, కామేశ్వరరావు గారి లాంటి వారు కాదు) గురించి చెప్తున్నట్లు.

    అలా చూస్తే ఇది చదవదగ్గ రచనే. లోపాల్లేవని కాదు. ఉదాహరణకి, “పోతన్న కవిత్వ పటుత్వం,” వ్యాసం గురించి రాజాజీ వ్యాఖ్య కన్నా చెప్పదగ్గ విషయం లేదా? (తేల్చుకోడానికి ఈ పుస్తకం నాకందుబాటులో లేదు.) మరొకటి, వాళ్ళ చిన్నాన్న పక్కన ఆయవారాలు చేసుకునే ఆయన్ని చూసి చికాకు పడే నాన్నమ్మ – ఇది పాఠకుడిలో సరయిన స్పందన కలిగిస్తుందా?

    “ఈ యువతరం వారు సుప్రసిద్ధాలయిన పాత విషయాలు,” తెలుసుకోవాలనే కోరికతో రాశానన్నారు తాపీధర్మారావు, అవి బూజుపట్టిన మరమరాలు, why the heck you are reintroducing us to something passé? అంటోంది యువత!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] From “Introduction,” in “The Art of the Personal Essay: An Anthology from the Classical Era to the Present,” by Philip Lopate.

  2. కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    09/14/2008 5:57 pm

    [ఈ అభిప్రాయం కొద్దిగా రీఫార్మాట్ చేయబడింది. — పద్మ]

    హనుమ గారూ:

    మిమ్మల్ని అలాగే పిలవాలనిపిస్తుంది.

    కొకు రచనల పునః ప్రచురణల గురించి తెలియ చేసినందుకు సంతోషం!

    తన రచనల గురించి కొకు తన మాటల్లో: (‘కారుణ్యం’ 1937, ముందు మాట)

    నాకు ఒకటే ఆశయం – నా రచనల వల్ల కూడా మనోవికాసం పొందదగిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఉండి తీరాలి, వారందరూ నా కథలు చదవాలని నా కోరిక. వారందరికీ నా రచనల మీద ఎంత త్వరగా ఏవగింపు కలిగితే అంత ఉపకారం చేసినవాణ్ణి అవుతాను తెలుగు సారస్వతానికి. అప్పటికి తెలుగు సారస్వతానికి నాతో పని అయిపోతుంది, నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏ కోశానా లేదు.

    ఇంకా ఎప్పుడో పుట్టబోయే వాళ్ళ కోసం రాస్తున్నానన్న అహంకారం కూడా నాకు లేదు. నేను ఆకాశం నుంచి ఊడి పడలేదు. నాకు పూర్వం కథలు రాసిన వారు ఎక్కడ విడిచి పెట్టారో నేను కథా రచనను అక్కడే అందుకోగలను కాని, అంతకు పైన ఎట్లా అందుకోగలను?

    తమ కథలు చదివి, ‘బాగున్నాయని’ విమర్శించమనే కథకులున్న ఈ రోజుల్లో, పైన చెప్పిన మాటలు ఆలోచించ తగ్గవి.

    సమాజంలో (ఏ సమాజమైనా) సాహిత్యానికి ఉన్న స్థానం సరిగ్గా గమనించిన వారిలో కొకు ఒకరు. సాహిత్య ప్రయోజనాలు గురించి కొకు అవగాహన అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికైనా సరేనని నాకు అనిపిస్తుంది.

    నేను TIFRలో Ph.D చేస్తున్న రొజుల్లో, J.R.D.Tata అధ్యక్షతన MGK Menon 60వ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చెయ్యబడ్డ సభలో, అప్పటికి “భారతరత్న” రాని J.R.D. Tata మాట్లాడుతూ, “60వ పుట్టిన రోజుకే ఇంత హడావిడా! ఇలాంటి పుట్టిన రోజు నాకు 20 ఏళ్ళ క్రితం వచ్చింది. ఈ సభ అయిన వెంటనే మనం వెళ్ళి ఎవరి పని వారు చేసుకోవాలి” అన్నాడు

    కొడవళ్ల వారికి నమస్సులతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/14/2008 1:46 pm

    “కొకు రచనా ప్రపంచం”

    సాహిత్యం గురించీ, దాని ప్రయోజనం గురించీ, నిర్దుష్టమైన అభిప్రాయాలుండి, జీవితంలో సాహిత్యానికున్న ప్రాముఖ్యత పరిమితమైనదని గుర్తిస్తూనే, దానికో ఉత్కృష్టమైన స్థానాన్నిచ్చిన వాళ్ళలో అగ్రగణ్యుడు కొడవటిగంటి కుటుంబరావు.

    కొకు శతజయంతి సందర్భంగా, విరసం ఆయన రచనా సర్వస్వాన్ని ప్రచురించాలని నిర్ణయించిందనీ, జనవరిలో మొదటి దఫాగా నాలుగు సంపుటాలూ, 2009 చివరికల్లా మిగిలిన పన్నెండూ వచ్చేస్తాయనీ, ఈ మధ్యనే ఓ ప్రకటనలో చదివాను. “చదువు” లాంటివి ఒకటీ అరా రచనలు తప్ప కుటుంబరావువి మిగిలినవి దొరకడం కష్టంగా ఉంది కనుక ఇది పుస్తక ప్రియులందరికీ ఎంతో సంతోషకరమైన విషయం.

    దీంట్లో నాకు కొంత ఐరనీ కూడా కనిపిస్తుంది. నిజమైన సాహిత్యానికి చిరత్వం లేదని నొక్కి వక్కాణించినవాడు కుటుంబరావు. తన రచనల వలన పాఠకులలో కొంత సంస్కారం కలగాలనీ, సమాజంలో అలాంటి సంస్కారం పెరిగే కొలదీ తన రచనల అవసరం ఉండకూడదనీ, తన సాహిత్యం ఎంత త్వరగా మరుగునపడితే అంత మంచిదనీ గాఢంగా ఆకాంక్షించాడు. మరి ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా కొకు రచనల అవసరం మనం గుర్తిస్తున్నామంటే, మన సమాజం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లా? లేక కొకు రచనల లోని సాహిత్యేతర లక్షణాలకోసం వాటిని చదువుతున్నామా? అదీకాకపోతే అసలు కొకు సాహిత్య ప్రయోజనం గురించిన ఆలోచనలో లోపముందా? అన్న సందేహాలొస్తాయి నాకు.

    శతజయంతి అంటే మరొకటి కూడా గుర్తొస్తుంది. తన షష్టిపూర్తి సందర్భంగా కొకు ఓ వ్యాసం రాశాడు – అయితే ఏమిటీ అని! పుట్టినరోజు ఉత్సవాలూ, ఊరేగింపులూ చాలా కృత్రిమమైన వేడుకలనీ, మల్లినాధసూరి కాళిదాసుకి శతజయంతులు జరపలేదు – వ్యాఖ్య రాశాడనీ, ప్రముఖ రచయితల గురించి కావాల్సింది అర్థంలేని పొగడ్తలు కాదు, విమర్శలు, అంటూ తన సహజ ధోరణిలో చాలా రాశాడు. అవన్నీ మనం ఆయన శత జయంతి సందర్భంగా చర్చించుకోడానికి ఈ “కొకు రచనా ప్రపంచం” చేతికొస్తుంది. చాలా చవక గూడాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి Rama M.V. గారి అభిప్రాయం:

    09/14/2008 12:59 pm

    This series of articles is extraordinary in many respects. They are difficult to understand for anybody who is not interested in Astrology. But these are a must read for those who have a serious interest in the subject either positively or negatively. These articles try to show both sides of the coin and that is a very difficult task.

    I sincerely appreciate this work of Sri Muralikrishna. His mastery over the subject, shrewd observation and in-depth analysis are of a rare kind.

  5. రెండు కవితలు గురించి Ravi raj గారి అభిప్రాయం:

    09/14/2008 7:25 am

    నిముషం నిలువనంత పరుగెందుకంటే మది బదులు చెప్పగలదా?

  6. ఏటి ఒడ్డున గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    09/13/2008 7:45 pm

    నా “ఏటి ఒడ్డున” కవిత పై తమ స్పందనని,అభిప్రాయాలని తెలియజేసిన బాబ్జీలు,నిషిగంధ,మాలతి,కొడవళ్ళ హనుమంతరావు,కాళ్ళకూరి సాయిలక్ష్మి,సాయికిరణ్ కుమార్,కొత్తపాళీ,కొ స్యా సు రా, యెర్నేని లైలా, రాధిక,రవికిరణ్ తిమ్మిరెడ్డి గార్లకు ధన్యవాదాలు.
    I am truly happy that my poem could evoke a warm response from such gifted readership.
    Vaidehi Sasidhar.

  7. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/13/2008 9:26 am

    My two cents:
    ఇంగ్లీషువాళ్ళని గురించి వాళ్ళెప్పుడూ చెప్పుకుని ఉండరు కనక మనవాళ్ళకి వాళ్ళ గురించి ఫ్రెంచివాళ్ళ ద్వారా తెలిసి ఉండాలి. అందుకని వాళ్ళకి ఫ్రెంచి ఉచ్చారణని బట్టి ఆంగ్లేయులు అని పేరు పెట్టారు. అలాగే దక్షిణాది సంగీతం గురించి మహారాష్ట్రులకి ముందుగా తెలిసి ఉంటుంది. అది పాడేవాళ్ళంతా కర్ణాటక ప్రాంతంవాళ్ళయి ఉంటారు కనక దానికి కర్ణాటక సంగీతం అని పేరు పెట్టి ఉంటారు. రాగాలు తెలియని కొన్ని నాట్య సంగీత్ పాటలకి కర్నాటకీ అని రికార్డులమీద రాసి ఉంటుంది. As if it is self-explanatory!

  8. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి mOhana గారి అభిప్రాయం:

    09/13/2008 8:10 am

    కర్ణాటకమా లేక కర్నాటకమా అనే దానిని గురించి ఒక కన్నడ కవి (బహుశా కువెంపు కాబోలు) అది “నొణ (నకార ణకారాలు) కాట” (ఈగ పోరు) అని అన్నారు. ణ-కారాన్ని న-కారంగా పలకడం సర్వసామాన్యం. హిందీ వంటి భాషలో ఇది వ్యాకరణరీత్యా సరియైనదే. అందుకే తెలుగులో ఈ రెండు అక్షరాలకు ప్రాస (యతి) సరిపోతుంది. కాని నాకు నచ్చనిది కర్నాటిక్ అనడం! – మోహన

  9. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    09/13/2008 1:36 am

    శ్రీనివాస్ గారు,

    “ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు.”

    ఈ పద్యం ఆకట్టుకోవడం కోసం రాసిన పద్యం కాదు. మీరు చెప్పిన “వరమున బుట్టితిన్” పద్యంలో ద్రౌపది ఆత్మప్రత్యయం ఉంది. దానికి తగినట్టు పద్యం నడక ఠీవిగా సాగింది. మరి ఈ పద్యంలో ఏముంది? ద్రౌపదిలో చాలా రోజులుగా అణిగి ఉన్న విద్వేష జ్వాల ఉబకడం ఉంది. అందులో ఠీవీలేదు, ఔద్ధత్యం లేదు. తీరూ తెన్నూ లేకుండా, లోపల ఉన్న కసి ఉన్నదున్నట్టుగా కట్టలు తెంచుకోవడమే ఉంది. అది ఎవరినీ ఆకట్టుకోలేదు కదా!

    ఇక మీకిది మంచినీళ్ళ కోసం ఆడవాళ్ళ తిట్టుకోవడంలా కనిపించడానికి కారణం ఈ పద్యాన్ని ఇలా విడిగా చదవడం అని ఊహిస్తున్నాను. ఇలాటి పద్యాల గురించి విడిగా రాయడంలో ఉన్న ఇబ్బంది ఇది. వీలైతే తిక్కన భారతంలో ఈ సన్నివేశాన్ని ఏకబిగిన చదవండి. అందులో ద్రౌపది “రక్కెస తాల్మి”తో మదిలో అణచుకున్న ఈ చిచ్చుని మీరు అనుభవించ గలిగితే, ఈ మాటల్లో మీకు ఆవేశం కనిపించదు, మనిషి లోలోతు పొరల్లో దాగి ఉన్న ఒక జాంతవమైన కసి నగ్నంగా సాక్షాత్కరిస్తుంది.

    మరి ఇట్లాంటి అనుభూతిని ఎందుకిలా సీస పద్యంలో రాయాలి, వచనంలో రాయవచ్చు కదా, మరింత శక్తివంతంగా అని సందేహం. దీనికి కచ్చితమైన సమాధానం అంటూ ఏదీ ఉండదనుకుంటాను. నాకు తోచినది, ద్రౌపది వ్యక్తిత్వంలో సహజమైన ఒక ఠీవీ హుందాతనం ఉన్నాయి, సీస పద్యానికున్న సహజమైన నడకలాగే. దాన్ని తోసిరాజని కసి కట్టలు తెంచుకుంది. సీసమూ అలాగే కట్టలుతెంచుకుంది. “సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు, యతులు ఈ పద్యంలో ఎంత అద్భుతంగా ఒదిగిపోయాయో” అనడంలో బృందావనరావుగారి ఉద్దేశం ఇదే అనుకుంటాను.

  10. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/12/2008 2:39 pm

    శశాంక గారూ,

    కర్ణాటకం సరైందా? లేక కర్నాటక అనే రాయాలా? అన్నవిషయం పై భాషాశాస్త్ర పరంగానూ, చరిత్ర పరంగానూ వివరిస్తూ ఓ పది పేజీల వ్యాసం రాయచ్చు. నాకు తెలిసీ రెండు విధాలుగానూ అనచ్చు. కాదని పండితులెవరైనా అధారాలతో వివరిస్తే మంచిదే! వినడానికి కర్ణాటకం, పలకడానికి కర్నాటకం ఎంచుకోడంలో ఇబ్బందుండదనుకుంటాను.

« 1 ... 1347 1348 1349 1350 1351 ... 1581 »