Comment navigation


15803

« 1 ... 1271 1272 1273 1274 1275 ... 1581 »

  1. నన్నెచోడుని క్రౌంచపదము గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    03/10/2009 3:27 pm

    నన్నెచోడుని మీద జరుగుతున్న చర్చ చూస్తున్నాను. చర్చలో మంచిచెడ్డల గురించి చెప్పబోయేముందు చర్చకు వాడుతున్న భాషను గురించి ఒక మాటచెప్పాలనుకుంటున్నాను. ఆ చర్చల్లోని కొన్ని వాక్యాలలో స్పష్టత కన్నా ఆవేశం ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకి భూషణ్ గారి మొదటి వాక్యం: “అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం.” ఈ వాక్యం వల్ల చర్చకు ఏ రకమైన ఉపయోగం జరగదు సరికదా అనవసరమైన ఆవేశం పెరుగుతుంది. మనం ఎవరినీ చెంపదెబ్బలు కొట్టనక్కరలేదు. ఎవరి పాండిత్యాన్నీ ఈసడించుకోనవసరం లేదు. “ఈమాట” చదువుతున్న వాళ్ళందరూ చదువుకున్నవాళ్ళు. వాళ్ళంతట వాళ్ళు మంచి అభిప్రాయాలు ఏర్పరుచుకోగలిగినవాళ్ళు. అందువల్ల “ఈమాట”లో చేస్తున్న చర్చల్లో ఆవేశాలు ఎంత తక్కువుంటే అంత మంచిది.

    ఇక నన్నెచోడుని మీద మోహనరావుగారు రాసిన వ్యాసం నిజంగా బాగుంది. అయినా ఆ వ్యాసంలో కూడా సమాచారం కొత్తదే కానీ సమన్వయం కొత్తది కాదు. ఆయన ఛందస్సుని వాడుకున్న పద్ధతి అయన వ్యాసానికి చాలా బలానిచ్చింది. కాని ఆయన వేసుకున్న ప్రశ్న; నన్నెచోడుడు, నన్నయ వీరిద్దరిలో ముందెవరు, తరువాతెవరు అనేది. అయనిచ్చిన సమాచారంలో ఏదీ కూడా ఈ ప్రశ్నకు నిష్కర్షగా జవాబివ్వదు. దానికి కారణం ఆయనిచ్చిన సమాచారంలో లోపం కాదు. ఆ సమాచారాన్ని ఆయన విశ్లేషించిన తీరులో లోపం కూడా కాదు. లోపమల్లా ఆ ప్రశ్నలోనే వుంది. అది సమాధానం దొరకడానికి వీల్లేని ప్రశ్న. ఇంకొక మాటల్లో చెప్పాలంటే అది పరిశోధకులు వేసుకోవలసిన ప్రశ్న కాదు.

    నన్నెచోడుడు, నన్నయ రెండు భిన్నమైన సంప్రదాయాలకు చెందినవాళ్ళు. నన్నయది పురాణ సంప్రదాయం, నన్నెచోడుడిది కావ్య సంప్రదాయం. ఇద్దరూ తెలుగులో రాస్తున్నారు అన్నమాట మినహాయిస్తే వీళ్ళిద్దరి మధ్య పోలికలు లేవు. మోహనరావుగారు చేసిన ఉపకారం ఏమిటంటే నన్నెచోడుడు దాదాపుగా నన్నయ కాలానికి చెందినవాడే అని ఛందస్సులో ఋజువులు చూపించి చెప్పగలగడం.

    అయితే ఆ కాలంలో నన్నెచోడుని కావ్యంలాంటి కావ్యం ఎలావచ్చిందో చెప్పడానికి కావలసిన సమాచారమేదీ మోహనరావుగారి వ్యాసంలో కనిపించదు. నన్నెచోడుడు ఏ పరిస్థితుల కారణాల వల్ల అలాంటి కావ్యాన్ని తెలుగులో నిర్మించాడో కానీ, ఆ తరువాత అతనికి దరిదాపు అయిదు వందలేళ్ళపాటు ఆయనకు అనూయాయులెవ్వరూ లేకపోయారు. ఎంతగా లేకపోయారంటే తరువాత వచ్చిన కవులెవ్వరూ ఆయన పేరుకూడా చెప్పలేదు. ఆయన రాసిన పుస్తకానికి ఒక్కటే ప్రతి దొరికింది. అంటే ఆ పుస్తకానికి ప్రతులు రాసుకున్నవాళ్ళు కూడా తక్కువేనన్నమాట. దీనితో పోల్చి చూస్తే నన్నయ భారతానికి ప్రతి తరంలోను కొన్ని వందల ప్రతులు రాసుకున్నారు. నన్నయ సంప్రదాయాన్నీ, దానికి తిరుగుబాటుగా వచ్చిన శివకవుల మార్గాన్నీ కలుపుకొని తిక్కన “ఉభయకవిమిత్రుడు” అనే పేరుతో నన్నయకే ఎక్కువ మిత్రుడై తెలుగులో పురాణ సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఆ తరువాత ప్రబంధం అని ఆధునిక విమర్శకులు అనే కావ్య సంప్రదాయం పెద్దన నాటికి కాని నిక్కచ్చయిన రూపు కట్టుకోలేదు. నన్నెచోడుడు ఆయనకు సుమారు 500 ఏళ్ళ ముందే కావ్యసంప్రదాయాన్ని తెలుగులో మొదలు పెట్టాడని తనకి తెలియకుండానే పెద్దన ప్రబంధ సంప్రదాయాన్ని మొదలు పెట్టి “ఆంధ్రకవితాపితామహుడ”యినాడు.

    ఇంతగా తెలుగు సాహిత్య సంప్రదాయంతో సంబంధం లేకుండా ఏకాకిగా నన్నెచోడుడు మిగిలిపోయాడు. నన్నెచోడుడిమీద చర్చంతా మానవల్లి రామకృష్ణకవిగారు కుమారసంభవాన్ని బయటకు తెచ్చిన తరవాతే మొదలయ్యింది. నన్నెచోడుడి భాషలో చాలా మాటలకి అర్థాలు అందుకే ఇప్పటికీ మనకు తెలియవు. ఉదా: వస్తుకవిత, జానుతెలుగు అనే రెండు మాటలు చూడండి. వాటికి తెలుగులో వాడుక లేకపోబట్టి ఆయన ఏ అర్థంలో ఈ మాటలు వాడాడో స్పష్టంగా చెప్పడం కష్టం అవుతుంది. ఈమాటలకు అర్థాలు మోహనరావుగారి వ్యాసం చదివిన తర్వాత కూడా అస్పష్టంగానే మిగిలిపోతాయి.

    నన్నెచోడుడు, నన్నయ దాదాపు ఒక కాలం వారయినప్పటికీ భిన్న సంప్రదాయాల వాళ్ళు అనేమాట గుర్తిస్తే ఈ యిద్దరిలో ఎవరు ముందు, ఎవరు తరువాత అనే ప్రశ్న తప్పేది. తారీఖులు మాత్రమే సాహిత్యచరిత్ర అని మనం 19వ శతాబ్దం చివరిలో నేర్చుకున్న పాఠాలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాం. మనకు కావలసింది ఋజురేఖలాగా నడిచే తారీఖుల సాహిత్యచరిత్ర కాదు, సంప్రదాయాల చరిత్ర కావాలి.

    ఇకపోతే ఈ చర్చలోకి Caldwellని, Brownని తీసుకురావడం స్పష్టత తీసుకురాదు సరికదా ఇంకా గజిబిజికి కారణమవుతుంది. ఈ చర్చకు సంబంధించిన విషయం కాదు కాబట్టి Caldwell, Brown తెలుగు సాహిత్య చరిత్రకు కానీ, తెలుగు భాషకు కానీ చేసిన ఉపకారమేమిటి, అపకారమేమిటి అన్న విషయాలు వేరేగా చర్చించాలి.

    — శ్రీనివాస్

  2. నాచన సోమన చతుర వచో విలాసం గురించి mOhana గారి అభిప్రాయం:

    03/10/2009 11:12 am

    శ్రీనాథుని చాటువులలో ఇలాటి కాకువువంటిది ఒకటుంది. ఆ పద్యము –

    సర్వజ్ఞ నామధేయము
    శర్వునకే, రావు సింగ జనపాలునకే,
    యుర్విం జెల్లునుఁ, దక్కొరు
    సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే

    సర్వజ్ఞ నామధేయము
    శర్వునకే, రావు సింగ జనపాలున కే
    యుర్విం జెల్లునుఁ? దక్కొరు
    సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే

    విధేయుడు – మోహన

  3. నాచన సోమన చతుర వచో విలాసం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    03/10/2009 9:11 am

    ప్రసాద్ గారు – మీరన్నది నిజమే అయ్యుండొచ్చు. ద్విపద కావ్యాలమీద నాకున్న వ్యక్తిగతమైన అరుచి కారణంగా హరిశ్చంద్రోపాఖ్యానం పైపై చూడ్డం తప్ప ఎప్పుడూ చదవలేదు. దాని గురించి మీరే రాయవచ్చు కదండీ. ఆ స్ఫూర్తితోనైనా నేను దాన్ని చదువుతానేమో!

    బాబ్జీలుగారు – “Classical” అంటే పురాతన గ్రీకు, రోమను దేశాలకి సంబంధించినవి అనే అర్థం ముందుండేదనీ, వాటిని గొప్పగా భావించేవారు కాబట్టి కాలక్రమేణా దానికి గొప్పవైన అనే అర్థం వచ్చిచేరిందనీ ఎవరో చెప్పగా విన్నాను. మనమేమో “ప్రాచీన” అన్న పదానికి “పాతచింతకాయ” అనే అర్థాన్ని రూఢం చేసీసేం! ఇంతకీ అసలు విషయానికొస్తే, కాకువు గురించి తెలియాలంటే శంకరాభరణం శంకరశాస్త్రిగారు సంగీతం మాస్టారు దాసుగారికి వేసిన అక్షంతల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. “ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు. నిద్రలోంచి ఉలిక్కిపడిలేచిన పాపడు అమ్మా అని మరోలా అంటాడు…”. కాకువు కూడా అలాంటిదే. పదాలని ఉచ్చరించే విధానంలో వేరువేరు అర్థాలని కలిగించడం కాకువు. ఉదాహరణకి “అవునా” అన్నది పలికే విధానం బట్టి ప్రశ్నార్థంలోనూ, “అవును కదా” అనే అర్థంలోనూ కూడా పలకవచ్చు. ఇది కాకువు. వ్యాసంలో ఉదహరించిన పద్యంలో “చొప్పగునే” అనడంలో ఒకవైపు ప్రశ్న, మరోవైపు “చొప్పవదు” అని రెండర్థాలు వస్తాయి. కాకువు ఉచ్చారణకి సంబంధించినది కాబట్టి సంభాషణలలోనే వస్తుంది. చదివే కావ్యంలో దీన్ని ధ్వనించడం ఎలా? అంటే సందర్భాన్ని బట్టి, వాక్యవిన్యాసాన్ని బట్టి ధ్వనించవచ్చు. అలా చేస్తే కావ్యంలోని సంభాషణలు సహజత్వానికి మరింత దగ్గరగా ఉంటాయి. ఇంగ్లీషులో కాకువుని “Intonation” అంటారు.

  4. నాకు నచ్చిన పద్యం: వసుచరిత్రలో చంద్రోదయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/10/2009 6:45 am

    అవును లైలా గారూ! రాత్రి మార్మికంగా ఉంటుంది. ఉద్విగ్నంగా ఉంటుంది, ఊహాతిరేకాల కవ్వింతగా ఉంటుంది. రాత్రి నలుపు సృష్టి రహస్యాల కలగలుపుగా ఉంటుంది. వ్యధకీ విశ్రాంతికీ వ్యాఖ్యానంలా ఉంటుంది. ఎంతైనా రాత్రి రాత్రే!!

    మీరు ఉదాహరించిన poem చెప్పలేనంత బాగుంది. పరమ సున్నితమైన తండ్రిని బొమ్మకట్టి చూపింది. భట్టుమూర్తి కాలానికి వర్ణనీయ వస్తువు ఆడదే!మగవాడి మనసుని శృంగార పరంగా మాత్రమే పట్టించుకున్నారు తెలుగు కవులు. అందుకే పాత కావ్యాల్లో ముసలమ్మలూ, పసి బాలికలూ ఉండరు. వయసులో ఉన్న స్త్రీమీదే వారి దృష్టి. అందులో మరీ వేలంవెర్రి రామరాజభూషణునిది. అది అలా ఉంచినా, కొన్ని వర్ణనలు పాత సాహిత్యంలో నిషిధ్ధం, అందునా జనన మరణాలు. అదీకాక తండ్రి ప్రసవాన్ని చూడటం పాశ్చ్యాత్త దేశాల్లో సాధ్యం. మన పాత సమాజంలోనే కాదు..ఇవాళ్టికీ ఇక్కడ తండ్రికి ఆ అవకాశం లేదు. పైగా పాత కాలంలోనూ ఇప్పటి కాలం లోనూ కూడా తెలుగు సమాజం ఒప్పుదల అన్న విషయంలో బహు జాగ్రత్తగా ఉంటుంది. మీరు ఉటంకించింది అమెరికా తండ్రి స్పందన. ఈ దేశం నించి ఇంకా ఈ సమాజం నించి ఇప్పటప్పట్లో అలాంటి కవిత వచ్చే వీలులేదు. మంచి పోయెమ్ ని ఉదాహరించినందుకు నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను.

    రమ.

  5. కథ దేని గురించి? గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    03/10/2009 6:26 am

    తమ్మినేని యదుకుల భూషణ్ గారు “హిందీలో ప్రేంచంద్ నవలలు తేలిపోవడానికి, జయశంకర్ ప్రసాద్ కథలు వెలిగిపోవడానికి కారణం ఇదే” అన్నారు. మరి ప్రేంచంద్ కథల విషయమో? “ఈద్గాహ్”, “రక్షా మే హత్యా” వంటి కథలు ఎన్నేన్నో – ఆబాలగోపాలం చదివి ఆనందించగలిగినవి. ఎన్నటికీ మరువలేనివి కూడా.

    రాజాశంకర్

  6. క్రీడాభిరామము:1 వ భాగం గురించి prakash గారి అభిప్రాయం:

    03/10/2009 2:56 am

    చాలా మంచి సేకరణ ఇది. మీకు వందనాలు.
    అయితే, సరళమైన తెలుగు భావం ఇస్తే బాగుంటుంది

  7. నాకు నచ్చిన పద్యం: వసుచరిత్రలో చంద్రోదయం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/09/2009 11:25 pm

    సమర్ధన చాలా సమంజసంగా వున్నది. కృతజ్ఞుడిని.

  8. కథ దేని గురించి? గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    03/09/2009 6:41 pm

    నీవు బ్రతికున్నావు అన్నదానికి దాఖలా:కథ,కవిత లేదా మరే కళాకృతైనా. కథ అనాది నుండి ఉంది.కథ అంటే పిల్లలు ఎందుకు చెవి కోసుకుంటారు?? కలతచెందిన మనసుకు-వెచ్చని ఊహాలోకాల్లో విహరింపజేసి హాయిగొల్పేదికథే కదా.బుద్ధిమార్గం ప్రతి ఒక్కరికీ అనాయాసంగా సిద్ధిస్తుంది.ప్రొద్దున లేచింది మొదలు పక్కలోచేరే దాకా మనం చేసే పనుల్లో బుద్ధి ప్రాబల్యం ఎక్కువ.దాన్నుండి రక్షించేదే కథైనా,కవితైనా.మనందరం అన్నీ మరచి చిన్నపిల్లల్లా కల్పనాజగత్తులో తేలిపోవాలనుకుంటాము.స్థాయీభేదాలతో ఆ అవసరాన్ని తీర్చేవి కథ, నవల.ఈ ప్రాథమిక విషయాన్ని మరచి కథారచన పేరిట మనం చేసే కసరత్తులన్నీ వికటిస్తాయి.కవిత ఒక రూపం ద్వారా, కథ ఒక వాతావరణం ద్వారా వ్యక్తమవుతుంది.

    వాతావరణం లేని కథ నీలోని కల్పనాశక్తిని తట్టిలేపదు.నానా వాదాలు (కమ్యూనిజం,ఫెమినిజం,వల్లకాడిజం) తాకేది బుద్ధిని.కథలో ఏ పాత్రకైనా పూనకం వచ్చినట్టు నానా వాదాలను ఏకరువు పెడితే రసాభాసయిపోతుంది.గొప్ప కథను ,మామూలు కథను విడదీసేది, ఈ వాతావరణ కల్పనే.పా.ప,కొ.కు ల కథలను విడదీసేది ఈ లక్షణమే.పా.ప కథలు మనలోతులని తడుముతాయి.కొ.కు కథలు పైపైనే తారాట్లాడుతాయి.ఇద్దరు వారి వారి ఫాయాలో గొప్ప రచయితలే. కొ.కు మంచినీళ్ళ ప్రాయంగా కథారచన చేసినా, ఒక గొప్ప పాత్రను మన కళ్ళముందు నిలపలేక పోయాడు.వేలాది పుటల్లో విస్తరించిన ఆయన కథలు చదివి, పుస్తకం మూసి,కనులు మూసుకుంటే బలంగా మనసు పొరల్లో చొచ్చుకుపోయే పాత్రలు తక్కువ.

    గురజాడ కథల్లో వాతావరణ కల్పన ఎంతో ఉజ్వలంగా ఉండి పాత్రలు బలంగా మనసులో దిగబడిపోతాయి.హిందీలో ప్రేంచంద్ నవలలు తేలిపోవడానికి, జయశంకర్ ప్రసాద్ కథలు వెలిగిపోవడానికి కారణం ఇదే.(వాతావరణ కల్పనలో మన గురజాడకు సరిజోడు,దాదాపు ఆయనకు సమకాలికుడు చంద్రధర శర్మ గులేరి ఉస్నే కహా థా (1911)కు సాటి రాగల కథలు హిందీలో నాకు తెలిసి లేవు.ఈయన గురజాడలాగే అనేక భాషల్లో మహా పండితుడు.ఈ కథను ఇదే పేరుతో సినిమా కూడా తీశారు(1961).ఈయన తన జీవిత కాలంలో రాసినవి ముచ్చటగా మూడు కథలే.)

    కేవలం వస్తువుంటే చాలు కథయిపోతుంది ,కవితైపోతుంది, అన్న ధోరణి అసలుకే ఎసరు పెడుతుంది.ఈ ధోరణి వల్లే మన భాషలో కల్పనా శక్తిని మెలకువగా కాపాడుకోవలసిన కవులు/రచయితలు కరపత్రాలు రాసే స్తాయికి దిగజారిపోయారు.గతం గతః రాగల కాలంలోనైనా కథా రచయితలు వాతావరణ కల్పన మీద దృష్టి నిలిపితే బుద్ధిబులపాటాలు తగ్గి కథ యథాస్థానానికి చేరి హుందాగా మనగలుగుతుంది.

    ఈ దిశలో ఆరి.సీతారామయ్య గారి వ్యాసం మంచి ముందడుగు. క్లుప్తంగా చెప్పవలసింది చెప్పి ముగించడం చాలా గొప్ప విషయం.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  9. నాకు నచ్చిన పద్యం: వసుచరిత్రలో చంద్రోదయం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    03/09/2009 11:29 am

    “ఇది కొంచెం సమంజసరహితంగా కనిపిస్తున్నది. నాటకంలో క్రమక్రమంగా నటి ముఖ చంద్రుడు కనిపించినట్లు ఒకే రోజున చంద్రరెఖ, అర్ధచంద్రుడు, పూర్ణ చంద్రుడు కనపడరు. సమర్ధించగలరు.” -M.S.Prasad

    అంటే -ఆ రాత్రి, నల్ల మబ్బు తెరచాటు నుండి కొంచెం కొంచెంగా , పూర్ణచంద్రుడు బైటికి వచ్చినట్లు అనుకోండి. తిరగబడిన నెలవంక ఏమైనా కంగారు కలిగిస్తున్నదా? 🙂
    What about this recurrent natural event, which time and again causes lot of anticipation, concern, pain and joy that Kevin Young penned in “The New Yorker” (Feb,23,2009) under the heading ‘Crowning’ (which is an obstetrical term, indicating a certain stage of labor. )

    The poet writes about how a father sees first a little bit of his son’s hair, then the top of his head , then his face, and then his whole body. The father sees the emergence of the baby as:

    “she squeezing my hand, her face
    full of fire, then groaning your face
    out like a blood bloom,
    crocussed into the air…

    He closes the poem with:

    “..now opening
    your eyes midnight
    blue in the blue-black dawn.”

    This too is a beautiful poem. Ancient traditional telugu poetry might not have permitted the description of such a birthing room scene.

    వసుచరిత్రములోని ఈ అందమైన పద్యము సంగతికి వస్తే – ‘రాత్రి’ ఆకర్షించినంతగా, ‘పగలు’ మనిషిని ఎప్పుడూ ఆకర్షించలేదు అని నాకు అనిపిస్తుంది. నాకన్నా ముందు “It often seems to me that the night is much more alive and richly colored than the day” – అని Vincent Van Goghకూ, అతనికన్నా ముందు భట్టుమూర్తికీ, ఎర్రనకూ, నన్నయకూ, ఎన్నోసార్లు ఎప్పుడో అప్పుడు సౌందర్య ప్రియులు అందరికీ అనిపిస్తుంది. అనిపించదూ? 🙂

    లైలా.

  10. కథ దేని గురించి? గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    03/09/2009 7:31 am

    సీతారామయ్య గారూ,

    మీరు చెప్పిన – “కథనం ద్వారానో, పాత్ర నోటినుంచో తను చెప్పదల్చుకున్న విషయం చెప్పలేకపోతే ఇక రచయితకు ఉన్న ఆఖరి మార్గం స్వయంగా వ్యాఖ్యానం చెయ్యటం. ప్రధమ పురుషలో రాసే కథల్లో ఇది సులభంగా వీలవుతుంది. వ్యాఖ్యానం కథకుడి మాటల్లోనో, లేక ఒక పాత్ర ఇలా ఆలోచిస్తుందంటూనో చెయ్యవచ్చు.” అనే పద్దతిని ఉత్తమ పురుషలో చెప్పే కధావిధానం లోకి వస్తుంది కదండీ? ఇక్కడ ప్రధమ పురుష కాదనీ నా అభిప్రాయం. ఏమంటారు?

« 1 ... 1271 1272 1273 1274 1275 ... 1581 »