Comment navigation


15820

« 1 ... 1154 1155 1156 1157 1158 ... 1582 »

  1. గుండుగొమ్ములనుమానం – 3 గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    05/08/2010 6:15 pm

    నాకు చాలా నచ్చిన అతికొద్దిమంది తెలుగు కథకుల్లో కనకప్రసాద్ ముఖ్యులని ఇదివర్లో చెప్పాను. అదేమాట మరోమారు అనేందుకు ఇది అవకాశంగా తీసుకుంటాను. అతని సునిశిత పరిశీలన, దాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించటానికి అతను ఎంచుకునే భాష మిరుమిట్లుగొలిపిస్తాయి. తొలిసంచిక లోని “బర్సాత్ మే బిల్లీ” నుంచి నేటివరకూ అతని కథల్లో పాత్రలు, వాటి పరిసరాలు ఎంత పరిపూర్ణంగా, మల్టీ డిమన్షనల్ గా వుంటాయో ! అలాగే అతని కవితలూ. ముచ్చటగొలిపే పదాలు, పదబంధాలు, భావాలు.

    ఇక ప్రస్తుతానికి వస్తే – బహుశ సాహిత్యం మొదలైనప్పట్నుంచీ వున్న ప్రశ్నేనేమో “ఏది నిజమైన సాహిత్యం? ఏది ఉత్తమం? ఏది కాదు?” అనేది. నా మట్టుకు నా అనుభవం ఉన్నతసాహిత్యసృష్టి ఒక అలౌకికక్రియ అని, అలా సృష్టి ఐన సాహిత్యాన్ని అనుభవించటానికి పాఠకుడు కూడ ఎంతో కొంత అలాటి స్థితిని పొందాలని. అలా సృష్టికర్తా సృష్టిద్రష్టా ఒకే అనుభూతిస్థితిని కొంతవరకైనా కొన్నిక్షణాలపాటైనా పంచుకుంటారని. ఇలా సృష్టి ఐన సాహిత్యం నా దృష్టిలో “అప్రయత్నపూర్వకంగా” వచ్చినది, అలా కానిది “ప్రయత్నపూర్వకంగా” వచ్చినది. మొదటిది బుద్ధిజనితమైతే రెండోది మేధోజనితమో మనోజనితమో ఔతుంది. ఈ చివరి రెంటిలోనూ మేధోజనితం మనోజనితం కంటే ఉన్నతంగా వుంటుందని నేను అనుకుంటాను.

    కనుక, పాఠకుడిగా ఒక రచనని చదువుతున్నప్పుడు ఎవరికి వారే బహుశ అసంకల్పితంగా ఎక్కడెక్కడ అది ప్రయత్నపూర్వకమో ఎక్కడెక్కడ అప్రయత్నపూర్వకమో “గ్రహిస్తారని” నా నమ్మకం. (కనకప్రసాద్ అనే జూటాకోరుతనం ప్రయత్నపూర్వకంగా ఎవరి మెప్పు కోసమో లేక మరెవరి భయం వల్లనో లేక తలియని విషయాన్ని తెలిసినట్టు బుకాయిస్తూనో రాసేరాతలలో కనిపిస్తుందని నేననుకుంటాను.) అలాటి గ్రహింపు నుంచే ఎవరికి వారు ఆ రచన గుణాగుణాల గురించిన అభిప్రాయాలు ఏర్పాటుచేసుకుంటారు. అనుభవజ్ఞులైన విమర్శకులు, నిశితశోధన వున్న పాఠకులూ అలా గ్రహించిన రచనాభాగాల గురించిన వారి అనుభూతిని మామూలు భాషలోకి తర్జుమా చేసి ఇతరులతో పంచుకోగలుగుతారు (సోమరిపోతులు ఇతరుల అభిప్రాయాలు విని వాటినే మళ్లీ తమ భాషలోనో లేక అంత ఓపిక కూడా లేకపోతే ఇతరుల భాషలోనో వెళ్లగక్కుతారు).

    ఏతావాతా ఏ రచనా సార్వత్రికంగా సార్వకాలికంగా పాఠకులందరికీ ఒకే విధంగా అనుభూతినివ్వటం అసాధ్యం అని నేను అనుకుంటాను. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఒక రచనకి “నిజమైన” – అంటే దాని సృష్టిస్థితితో కొంతైనా తాదాత్మ్యం చెందగలిగిన – పాఠకులు చాలా కొద్దిమందే. కొండొకచో ఎవరూ లేకపోవచ్చు కూడా – ఓ కవిగారు తన కవిత గురించి వ్యాఖ్యానిస్తూ “అది రాసినప్పుడు ఇద్దరికి అది తెలుసు – ఒకరు నేను, మరొకరు దేవుడు; ఇప్పుడు ఒకరికే తెలుసు, అది నేను కాదు” అన్నట్టు. ఒక రచన విషయంలోనే ఇలా వుంటే ఇక ఒక రచయిత లేదా కవి తన జీవితకాలంలో చేసే రచనలన్నింటినీ కలిపి టూకీగా గుణనిర్ణయం చేసెయ్యటం దుడుకుతనం అని నా ఉద్దేశం. అలా చేసెయ్యటమే కాకుండా మిగిలిన పాఠకులంతా ఆ నిర్ణయాన్ని ఆమోదించి తీరాలనీ, ఆమోదించకపోవటం వాళ్ల సాహిత్యాస్వాదనాదారిద్ర్యానికి నిదర్శనమనీ తిట్టిపొయ్యటం ఘోరం, దౌర్భాగ్యం, దౌర్జన్యం.

    ఒక చక్కని విషయాన్ని లేవనెత్తి దాని గురించి అద్భుతమైన వ్యాసాన్ని రాసిన కనకప్రసాద్ ని ఎంతగానో అభినందిస్తూ –

    రామారావు

  2. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/08/2010 5:35 pm

    మోహనగారు, కామేశ్వరావుగారు కూడా క్షమించాలి.
    ఏంచదవాలో ఎంత చదవాలో ఎప్పుడు చదవాలో అన్నది ఎట్లా నిర్ణయించుకుంటామో నాకు తెలియదు, పూర్తిగా, నిజంగానూ. కామెంట్లు చూసి ఏం చదవాలొ నిర్ణయించడమంటే, తెలిసిన ఒక కారణం చెప్పడం మాత్రమే.

    పాపం చెపితే పోతుందేమో అని చెప్పడం. చాలా సార్లు రచనలు (మీవి కూడా!) silent గా చదివి ఆనందించే వారిలో, చాలా సార్లు కనీసం బాగుందని కూడా చెప్ప మరిచే వారి జాబితాలో నేనైతే వుంటానని నమ్మకం. ఎప్పుడు చదివినా ఏవో తెలియని విషయాలు తెలుస్తుంటాయి.
    ===========
    విధేయుడు
    -Srinivas

  3. కళావసంతము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/08/2010 5:15 pm

    చాలా విషయాలందించినందుకు కృతజ్ఞతలు.

    “అశోక స్తబకాంగారః
    షట్పదస్వన నిస్వనః
    మాం హి పల్లవతామ్రార్చః
    వసంతాగ్నిః ప్రధక్ష్యతిః” – వాల్మీకి రామాయణము (4.1.29)

    శ్లోకం, శోకం యొక్క తెలుగు పద్యీకరన ఆకట్టుకుంది

    “అరుణము లశోక పుష్పమ్ము లనల మాయె
    నిప్పు చిటపటల్ భ్రమరాల నిస్వనములొ
    చిగురుటాకుల యరుణిమ చితికి జ్వాల
    లీ వసంతాగ్ని నను దహియించుచుండె”

    వసంతం ముందున్నా, పక్కన సీతలేకున్న అది వసంతాగ్ని అని ఒక్క పదంతో శోకాగ్నిని వర్ణించడం, కాదు ప్రజ్వలించడం ఎంతో సార్థకంగా ఉంది.

    ‘ఆకాశవాణి’ లో లలితసంగీత కార్యక్రమంలో ప్రసారమైన
    “వచ్చింది వచ్చింది వాసంతము,
    వాసంతము విజయ భాసంతము”
    అనే మంచి పాట గుర్తొచ్చింది వ్యాసం చదువుతుంటే.
    ==========
    విధేయుడు
    -Srinivas

  4. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    05/08/2010 2:36 pm

    “అంటే నాబోటి రచయితల రచనలు ఎవరూ చదవడం లేదన్న మాట, చదవరన్న మాట. మరి నేనెందుకు రాయడమో?”
    విధేయుడు – మోహన

    రచయితలు తమ కోసమే తాము రాయాలి. తమకేవి ఇష్టమో వానిని గురించి రాయాలి. పబ్లిష్ చెయ్యవచ్చు, ఇతరులు కూడా ఆనందిస్తారనుకున్నప్పుడు. కాని పబ్లిష్ అయ్యాక ఇక స్పందన కోసం ఆందోళన పడటం, ఆశించిన స్పందన లేకుంటే విరమించటం దేనికి. అంతగా రచయిత వేరే వారి అభిప్రాయానికి తలఒగ్గటం దేనికి?
    స్పందన కోసం వెనువెంటనే రొక్కించటం పాఠకునికి విసుగు కలిగించవచ్చు. రచయిత ఇప్పుడు రాసినా ఎప్పుడు రాసినా, ఏ కాలంలో పాఠకులు చదువుకుంటారో, చెప్పలేం. ఎన్నేళ్ళ క్రిందో రాసిన వారిని ఇప్పుడు చదవటల్లేదా? ఇప్పుడు రాసిన వారిన కొందరిని వెనువెంటనే చదువుతాము కూడా. పాఠకులెప్పుడూ ఏ శతాబ్ది రచయితలనైనా వరుస క్రమంలో చదువుతారనుకోటం భ్రమ. పబ్లిషర్లు మేగజీన్లు, ఏంథొలొజీలు, గ్రంధాలు వేస్తూ పోవచ్చు. కాని ఏ పాఠకుడు ఏ సంచికతో, ఏ రచయితతో చదువు మొదలెడతాడో, ముందుకే వెడతాడో, వెనక శతాబ్దులలొకి పయనిస్తాడో చెప్పలేం. అదంతా అతని ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇష్టాలు మారుతుంటయ్.

    పాఠకుల టేస్ట్ ననుసరించి రచయిత రాయటం అనే ఘోర గెస్సింగ్ గేం రచయితను గోతిలోకి లాగుతుంది. విమర్శకుల మాటలు, వారి టేస్ట్ సరేసరి. ఇదిగో, కాఫ్కా రచనొకటి మళ్ళీ చదువుకుంటున్నా. దాన్ని రచయితే స్వయంగా తగలపెట్టమన్నాడు. బహుశా అప్పటి సమాజం లోని వేరేవారి ఆలోచనలతో అతని రచనకు సామీప్యం లేదు – దానిని వారు appreciate చెయ్యలేరు అని అతడు భావించి ఉండొచ్చు. అప్పుడది నిజమే కావచ్చు. కాలక్రమాన అలా జరగలేదు. కాఫ్కా నేనెన్నోసార్లు చదువుతాను.
    కొన్ని రచనలు ఒక్క సారే చదువుతాను. ఒక్కసారే అనుభవించినంత మాత్రాన అది తక్కువ ఆనందమా? ఆ అనుభవాన్ని గురించి మళ్ళీ మాటల్లో చెప్పకపోతే, ఏం నష్టం. ఫీడ్ బేక్ కి కట్టుబడి రచయిత ఉండనేగూడదు. రచయిత స్వతంత్రుడుగా ఉన్నప్పుడే, ఎవరికైనా గాని ఎక్కువ interesting గా ఉండేది.

    లైలా

  5. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    05/08/2010 2:01 pm

    మోహనగారు పడ్డ భ్రమలో రచయితలు పడే అవకాశం ఉండడం ఈ కామెంట్ల సదుపాయం వల్ల ఉన్న ప్రమాదాలలో ఒకటి!
    మోహనగారూ, నా మటుక్కి నేను కేవలం “బాగుంది/అద్భుతం” వంటి కామెంట్లు రాయడానికి సాధారణంగా ఇష్టపడను. మీ వ్యాసాల విషయంలో అలా నేను చేస్తే అది కూడా “పాడింది పాటరా…” అవుతుంది. 🙂

  6. సంగీత పట్నం – కదనకుతూహలం గురించి Gannavarapu Varaha Narasimha Murty గారి అభిప్రాయం:

    05/08/2010 8:33 am

    వ్యాసం చాలా కుతూహలకరంగా వుంది.

  7. నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి sesha kumar kv గారి అభిప్రాయం:

    05/08/2010 7:24 am

    చక్కని పద్యాన్ని గుర్తు చేసి వివరించారు.పెద్దగా పేరు కెక్కని ఇలాంటి మంచి కవులు ఎందరెందరో!మంచి వ్యాఖ్యానం.వందనములు.
    శేష్ కుమార్

  8. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి baabjeelu గారి అభిప్రాయం:

    05/08/2010 7:15 am

    ఉపేంద్ర గారూ,
    “ఆ రెండు” సంభాషణలూ సవ్యంగా జరిగితే ఏవిఁటవుతుంది?
    కవిత్వం ఎలా చదవాలో తెలుస్తుందా? కవిత్వం ఎలా రాయాలో తెలుస్తుందా?
    “ఆ రెండు” సంభాషణలూ ఎవరు చేయాలి?
    అసలు ఎందుకు చెయ్యాలి? చెయ్యకపొతే ఏవిఁటి నష్టం?
    ఆ పంచాయతీ తీర్పు ని ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోకుండా కవిత్వాలు రాసీవాళ్ళని ఎవరేం చెయ్యగలరు?

    బాబ్జీలు

  9. ‘వికృతి’ ఉగాది గురించి sesha kumar kv గారి అభిప్రాయం:

    05/08/2010 6:13 am

    వ చ న కవిత్వమా లేక కవిత్వ వచనమా అనిపించింది కవిత చదివాక. భాషాసృష్టి గమ్మత్తు గా ఉంది. English Literature లో PROEM అనే మాట ఉంది. PROSE+POEM కు బదులుగా వాడుతారు, అలా ఉంది. “విపరీతపు లోతులలో భాషా ప్రయోజనము” ఏమిటో!.నేను రమ గారితో ఏకీభవిస్తున్నాను.

  10. పాఠకులకు సూచనలు గురించి Madhu గారి అభిప్రాయం:

    05/08/2010 12:18 am

    నేను కూడా ‘ఈ మాట’ కు నా కవితలు పంపాలనుకుంటున్నాను. ఎలా పంపాలో వివరాలు తెలియజేయగలరు. కృతజ్ఞుణ్ణి.

    [‘రచయితలకు సూచనలు’ చూడండి. – సం]

« 1 ... 1154 1155 1156 1157 1158 ... 1582 »