Tandem Songs అంటే ఒకే పాటని -సాహిత్యంలో కొద్దిగా మార్పులుండవచ్చు- వేర్వేరు గాయనీ గాయకులు, అదే బాణీలోనో లేక వేరే బాణీలోనే పాడటం. తెలుగు సినిమా పాటల్లో కంటే లలిత సంగీతంలో ఇలాంటి పాటలు చాలా యెక్కువగా కనిపిస్తాయి. అలాంటి ఒక ఒక 5 లలితగీతాలు ఇక్కడ వినండి.

వసంతఋతువును వెంటబెట్టుకొని, తెలుగువారి కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సందర్భంగా వసంతునికి, వెన్నెలఱేనికి మధ్యన పోటీ గురించి భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం శీర్షిక; వసంత తిలకమనే వృత్తం గురించి జెజ్జాల కృష్ణ మోహన రావు వ్యాసం; అంతా కొత్తగా మొదలెడదామని కోగంటి విజయ్ కవిత; ఇంకా మరికొన్ని చక్కని కవితలు; వలసయుగంలో తెలుగు భాష, సాహిత్యదృక్పథాల్లో వచ్చిన మార్పులు, వాటికి ఎదురొడ్డి తన వాదాన్ని వినిపించిన విశ్వనాథ సాహిత్యగళం, సాహిత్య సందర్భం గురించి వెల్చేరు నారాయణరావు 2018లో ప్రచురించబోతున్న పుస్తకం ముందుమాటకు అబ్బరాజు మైథిలి తెలుగు అనువాదం; దామెర్ల రామారావు చిత్రానికి ఎక్‌ఫ్రాస్టిక్ కవిత రాసిన వేలూరి వేంకటేశ్వర రావు వినూత్న ప్రయత్నం; సినీప్రముఖులు రచించి నటించిన అరుదైన రేడియో నాటకం మనోరమ; కథలు, సమీక్షలు, ఇతర శీర్షికలూ ఈ సంచికలో.

ఎవ్వరయినా సరే!
‘బావిదగ్గిర నీళ్ళకోసం’
మరొక కొత్త బొమ్మ గీయాలి.
లేకుంటే, ఏ ఆస్కార వైలుడో
రాజరాజనగరంలో పాతబొమ్మని
చీరి చింపేయచ్చు.

విశ్వనాథ రెండు నవలికలు (Two Novellas by Visvanatha Satyanarayana) అన్న పేర, హా హా హూ హూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవలికలను 2018లో పుస్తకంగా పెంగ్విన్ ఇండియా వారు ప్రచురించబోతున్నారు. నారాయణరావు అనువదించిన అన్ని కావ్యాలు, రచనలు లాగానే ఈ అనువాదానికి కూడా ఆయన రాసిన తొలి, మలి పలుకులు మన సాహిత్య చరిత్త్ర గురించి, కవులు రచయితల గురించి ఒక విభిన్నమైన, విశిష్టమైన దృక్పథాన్ని మనకు అందిస్తాయి. ఇక్కడ ఈ పుస్తకానికి నారాయణ రావు రాసిన ముందుమాట తెలుగులో ప్రచురిస్తున్నాం.

సౌభాగ్య కవిత్వం నేల విడిచి సాము చెయ్యదు. అతనిదంతా ఈ లోకపు కవిత్వం. అతను చూపించినదంతా ఇక్కడి సగటు మనిషి జీవితం. ప్రత్యేకించి, ప్రాంతీయతను పదిలపరుచుకున్న కవిత్వమితనిది. ఇతని ఊహలు, కవిత్వము కూడా ఒరిస్సా వాతావరణాన్ని దాటి వెళ్ళవు.

మొన్న మనిద్దరం ఎటన్నా వెళ్ళిపోదాం అన్నప్పుడు, ఇక నువ్వే నా హీరోవి. చెప్పు, నేను రెడీ! అన్నప్పుడు వచ్చి నా గుండె మీద నీ చెవి ఆన్చి ఉండవలసింది. ఉరుములు మెరుపులతో వాన మొదలయేముందు ఆకాశానికి కూడా గుండె దడ పుడుతుందని తెలిసేది. అది అచ్చు నా గుండెకు మల్లే కొట్టుకుంటుందని అర్థమయేది. మొన్న రెస్టారెంట్‌లో ‘బిర్యాని వద్దు. నాకు అన్నం, టమాటా పప్పు తినాలని ఉంది.’ అని ఆంధ్రా రెస్టారెంట్‌కు తీసుకెళ్ళి, ‘ఇప్పుడు నాకు కలిపి ముద్దలు తినిపించు,‘ అన్నప్పుడు నేను లోపలే ఒక జలపాతాన్ని సృష్టించుకున్నానేమో అనుకున్నా!

అంచేత మన్మథుని దండయాత్రకు అనువైన సమయం సాయంత్రమే. ఇక్కడ జైత్రయాత్ర ఎవరిపైన అంటే, పాంథనిచయంబులపైన. అంటే ప్రయాణంలో ఉన్నవాళ్ళపైన. తమ ప్రియతములకు దూరమై విరహంతో వేగుతూ ఉండే వాళ్ళపైనన్న మాట! రాజు ఎక్కడికైనా బయలుదేరాడనగానే పెద్ద సన్నాహమే కదా. అతని ఠీవికి తగ్గట్టుగా ముందు కొంతమంది రాజోచిత లాంఛనాలను పట్టుకొని నడుస్తారు. అలాంటి రాజచిహ్నాలలో సూర్యచంద్రుల బొమ్మలున్న పలకలు అమర్చిన పొడుగాటి కర్రలను సూర్యపాను చంద్రపాను అంటారు. కాని, ఇక్కడ యాత్రకి సన్నద్ధమయినది మామూలు రాజు కాదు కదా!

ఇది యుగాది సమయము. వసంతఋతువుతో ప్రారంభమవుతుంది క్రొత్త సంవత్సరము. ఈ హేవిలంబినామ సంవత్సరమును కొన్ని వసంతతిలకములతో, ఆ లయ ఉండే పద్యములతో శుభాకాంక్షలతో ఆహ్వానిద్దామా?

పెద్దోడి వయసు పదకొండేళ్ళకంటే ఎక్కువుండదు. చిన్నోడికి ఆరేళ్ళుండచ్చు. ఆ పిల్లలిద్దరూ ఆ జనసముద్రంలో తేలుతున్న రెండు చిన్న ఆకుల్లా అటూ ఇటూ అల్లల్లాడుతున్నారు. ఇంతలో అక్కడికి బాగా బలిసి భీకరంగా ఉన్న ఆకారం ఒకటి వచ్చింది. కిందవాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా అధికారం చెలాయించడానికి అలవాటుపడిన ముఖం. నల్లరంగులో పెద్ద ఓవర్కోటు, బెల్టు, టోపీతో ఉన్నాడు. చేతిలో ఒక కర్ర పట్టుకుని తిప్పుతూ ఉన్నాడు. కరకు గొంతుతో ఏదో అరుస్తున్నాడు అప్పుడప్పుడూ. వాడేం చెప్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అయినా ఆ జనసమూహమంతా వాడి ఆజ్ఞలకి కట్టుబడింది.

ఒక్క పదేళ్ళ క్రితం వరకు సినిమా ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు దర్శక నిర్మతల నుండి ఒకే రకమైన జవాబు ఉండేది: కథ, సెంటిమెంట్, హాస్యం, ఏక్షన్‌తో పాటు యువతకు, మహిళలకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి మా చిత్రంలో, అని. ఈమధ్య కాలంలో ఆ మొత్తం చెబితే ఎగతాళి చేస్తారనో ఏమిటో, ఆ పైని పడికట్టు పదాలు అన్ని కలిపి ఎంటర్‌టైన్‌మెంట్ అన్న గంప గుత్త మాటతో సరిపుచ్చేస్తున్నారు.

తనతో నడుస్తూ ఉంటే
కబుర్లన్నీ మారాకు వేస్తాయి
ఒక్కో మొగ్గ పూవై విరుస్తుంది
తన నుండి వీచే గాలిని కప్పుకుని
పూలన్నీ పరిమళం అద్దుకుంటాయి

మనసూ కొత్తగా గొంతు సవరించుకుంటోంది
వసంత మొస్తున్నదేమో!

ఎపుడూ వుండే
చేదు మాటలూ పులుపు గుర్తులూ
వుంటూనే వున్నై,
ఇప్పుడైనా
కొంచెం తియ్యదనాన్నీ కలిపి చూద్దాం!

స్వాదుసౌందర్య దీప్తుల్ని వెలయించే
కళాకర్పూరగంధి కోసం కలవరిస్తే
నిత్యనిస్సారవికారాకారంతో
ప్రత్యక్షమైంది కవితాలలామ

మర్నాడూ ఆ పైరోజూ కూడా స్తిపనీదా ఆలోచనలు ఎవ్‌గెనీని వదల్లేదు. ఏవో పనులున్నా అవన్నీ చేస్తున్నా మనసునిండా ఈవిడే. పెళ్ళితో తన పాత జ్ఞాపకాలన్నీ పూర్తిగా పోయాయనే అతననుకున్నాడు. స్తిపనీదా పొందు అతనిప్పుడు కోరుకోటల్లేదు కానీ ఆమె పైని వ్యామోహం ఇంకా ఉన్నందుకు అతను మథనపడ్డాడు. తరవాత గుర్రాల దగ్గరకి నడుస్తుండగా తనను దాటి పరుగెత్తుకుంటూ పోయిన అదే ఎర్ర గౌనూ తలకు చుట్టిన ఎర్ర రుమాలూ అదే ఆరోగ్యవంతమైన శరీరం అతనికి ఆ పొలాన్నీ ఆ గడ్డివామినీ ఆ మధ్యాహ్నాలనూ గుర్తుకు తెచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టాయి.

నీ ప్రేమలా ఆరిపోయింది నా కళ్ళ వెలుగు,
మూసుకొని ఉన్న నా కళ్ళల్లో చిరుచేపలా నీ జ్ఞాపకం.
ఎడారిలో ఏకాకిగా భారంగా సంచరించే బాటసారిని నేను

కాని, నేను స్వయంగా చూశాను నీ ఆ ఇంటి వెలుగు
అవును, నా నిర్జీవ కఠిన వేదన కల్పనే కావచ్చు;
ఎప్పుడో ఒకవేళ మెరుస్తూ చంచలానురాగంతో మలయమారుతం వస్తే,
మెడపట్టిగెంటినట్టు వెనక్కి తిరిగిపోతుంది;

రూపసీ! నీవు తనని క్షమిస్తావు, క్షమించడం నీ సహజ లక్షణం
ఏదో ఒక పచ్చనిచెట్టుపై పగలూ రాత్రీ ఎన్నెన్నో పక్షులు
పాటలు పాడుతూ ఉంటే, నా మనసు కూడా
ఆ పక్షుల పాటల కోసం ఎన్నడూ ఆలసించదు.

అలసిన దేహం, నిశ్చల చింతనకి బలహీనం
రెండవఝాము ఎండ తుక్కునంతా కడుగుతుంది
నది ఒడ్డున ఉల్లాసంగా వినపడుతుంది వంశీరవం
పూలై వికసిస్తుంది ల్యాండ్‌స్కేప్‌, నామనశ్శాఖలో.