నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ!

చం. క్షితిపయి వట్టి మ్రాకులు జిగిర్ప వసంతుడు దా రసోపగుం
      భిత పద వాసనల్ నెఱప, మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస
      న్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె;

ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా మధుమాసం వచ్చింది. వసంత ఋతువుని వసంతునిగా సంభావించడం కవిసమయం. అతను మన్మథుని చెలికాడు కదా. వసంతుడు వస్తూనే చక్కగా భూమిపై మోడువారిన చెట్లనన్నింటినీ చిగురింపజేశాడు. మామూలుగా చిగురించాయా అవి! రస ఉపగుంభిత పద వాసనల్ నెఱప – చిగురించాయి. రసవంతమైన (ఫలపుష్పాల వంటి) సామగ్రితో, వాటినుండి వచ్చే సుగంధాలు నలువైపులా వ్యాపించేట్టుగా చిగురించాయి. అలా చిగురింపజేశాడు వసంతుడు. వసంతుడు అంతటి ఘనకార్యాన్ని చేసినా పైనుండి చూస్తున్న చంద్రుడు మెచ్చుకోలేదు. సరికదా, అతనితో స్పర్థ బూనాడు. అతని కంటే ఘనుడనని నిరూపించుకోడానికి ప్రసన్నమైన, సుకుమారమైన తన వెన్నెలజల్లు కురిపించి రాళ్ళను సైతం కరగింపజేశాడు! శరత్తులాగే వసంతంలో కూడా వెన్నెల విరగకాస్తుంది, ఆకాశం నిర్మలంగా ఉంటుంది కాబట్టి. పైగా వేడెక్కే పొద్దులనుండి చల్లని ఉపశమనాన్ని కూడా యిస్తుంది. అంచేత మధుమాసం కూడా వెన్నెల మాసమే. ఈ రెండంశాలనూ కలపోస్తూ, వసంతునికీ చంద్రునికీ మధ్య స్పర్థనొక దాన్ని కల్పించాడు కవి. కవి చమత్కారానికి హద్దేముంది! పైగా ‘ప్రతి పద్యమునందు జమత్కృతి గలుగన్ జెప్పనేర్తు’నని ప్రతినబూనిన కవి కూడాను.

ఈపాటికే ప్రాజ్ఞులయిన పాఠకులకి ఈ కవి ఎవరో ఎరుకలోకి వచ్చే ఉంటుంది. ఇది చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసములోని పద్యం. నేను పైన యివ్వడం మానేసిన చివరి పాదం కూడా ఈపాటికే చాలామంది గుర్తించి ఉంటారు.

      ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!

పద్యం తెలియని చాలామందికి కూడా తెలిసే వాక్యం ఇది. తెలుగు సాహిత్యంలో అంతగా ప్రసిద్ధికెక్కింది. వసంత వర్ణనలో విశేషమైన కల్పన చేయడమే కాకుండా దానిని ఉదాహరణగా తీసుకొని, సామాన్యంగా మనుషులలో ప్రత్యేకించి కవులు కళాకారులలో, కనిపించే ఒకానొక లక్షణాన్ని ఎత్తిచూపిస్తున్నాడు చేమకూర కవి. ఈ కవి ప్రతి పద్యం లోనే కాదు ప్రతి పదంలో కూడా చమత్కారం గుప్పించగల దిట్ట. చివరి పాదం చదివిన తర్వాత మళ్ళీ పద్యమంతా తిరిగి చదివితే, చివరి పాదం హఠాత్తుగా ఊడిపడింది కాదని, పద్యం మొదటినుంచీ కవి ఆ విషయాన్ని తాను ప్రయోగించిన పదాల ద్వారా స్ఫురింపజేశాడనీ అర్థమవుతుంది. ‘రసోపగుంభిత పదవాసనలు’ అంటే నవరసాలతో శోభిల్లే పదభావాలు. అలాంటి శబ్దార్థాలు కూడిన కవిత్వాన్ని రచించి, ఒక కవి మోడువారిన హృదయాలను చిగురింపజేశాడు. మరొక కవి దానిని మెచ్చకుండా పంతంతో తను కూడా కావ్యరచన చేశాడు. ప్రసాదము, సౌకుమార్యము అనే గుణాలతో ప్రకాశిస్తూ, రాతి గుండెలను సైతం కరిగించే కావ్యం అది. ప్రసాదము, సౌకుమార్యము అనేవి కావ్యగుణాలు. ఆలంకారికులు మొత్తం పది కావ్యగుణాలను చెప్పారు – శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సౌకుమార్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజస్సు, సమాధి. ప్రసాదము అంటే అందరికీ అర్థమయ్యే పదాలతో సులువుగా సాగిపోయే గుణం. సౌకుమార్యం అంటే అక్షరరమ్యతతో చెవికి ఇంపుగా ఉండే లక్షణం. ఇలా ఒకవైపు వసంతాన్ని వర్ణిస్తూనే మరొకవైపు ఒకానొక లోకస్వభావాన్ని స్ఫురింపజేయడం కవి ప్రతిభ. రసోపగుంభిత పదవాసనలు, ప్రసన్నత, సౌకుమార్యము మొదలైన పదాలలో శ్లేష ద్వారా దీన్ని సాధించాడు వేంకటకవి. అయితే పద్యం మొత్తం మీద ఉన్న అలంకారం శ్లేష కాదు. ఎందుకంటే ఈ పద్యంలో ఉన్నది వసంతుడూ చంద్రుడే కాని కవులు కాదు. కవుల మధ్యనున్న స్పర్థ కేవలం పాఠకులకు స్ఫురించే అంశమే తప్ప నేరుగా కవి చెప్పింది కాదు. ఇటువంటి అలంకారాన్ని సమాసోక్తి అంటారు. శ్లేష ఎక్కువగా శబ్దప్రధానమైనది. సమాసోక్తి అర్థప్రధానమైనది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, భావప్రధానమైనది. అది మనసుని మరింతగా హత్తుకుంటుంది.

ఏదయితేనేమి, ఆ యిరువురి స్పర్థ, వారి రచనలను అనుభవించేవారికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది! అది కవుల విషయమైనా సరే, చంద్రవసంతుల విషయమైనా సరే. స్పర్థయా వర్ధతే విద్య అని అన్నారు కదా. అయినా ఒక కవిగా, ఎంత గొప్ప కవిత్వాన్ని రచించినా సమకాలము వారలు మెచ్చకపోవడాన్ని గూర్చి వాపోయాడు వేంకటకవి. మెచ్చకపోవడమే కాదు, ఏ రకంగా తక్కువ చేసి చిన్నబుచ్చుతారో కూడా మనకీ పద్యంలో చూచాయగా తెలియజెప్పాడు. పద్యాన్ని మరొకసారి జాగ్రత్తగా చదివితే, చంద్రుడు వసంతుడిని తక్కువ చేయడం మనకి కనిపిస్తుంది. ‘వట్టి మ్రాకులు చిగిర్ప’ అన్న పదబంధంలో ‘వట్టి’ అనే పదం మోడువారిన అనే అర్థంతో పాటు, విడిగా చదివితే ‘కేవలం’ అనే హేళన భావం కూడా ధ్వనిస్తుంది. కేవలం చెట్లని మాత్రం చిగురింపజేయడమే వసంతుడు చేసే పని అని, తాను మాత్రం రాళ్ళను సైతం కరిగించగలడనీ- చంద్రుని పరంగా అన్వయించుకోవచ్చును. అలాగే వసంతుడు తన కార్యాన్ని సాధించడానికి ‘క్షితిపయి’కి వెళ్ళవలసి వచ్చింది. మరి తానో, ఆకాశంలో ఉండే తన కార్యాన్ని సాధిస్తాడు. ఇలా ప్రతి పదాన్ని సార్థకంగా ప్రయోగించడం చేమకూర ప్రత్యేకత. తాపీ ధర్మారావుగారు విజయవిలాసానికి చేసిన హృదయోల్లాస వ్యాఖ్యలో ఈ ప్రత్యేకతను అద్భుతంగా పట్టి మనకందించారు. వేంకటకవి పద్యాలలో అధికాధికం శబ్దచమత్కార బంధురమైనవి. అర్థచమత్కారంతో సున్నిత భావాన్ని స్ఫురింపజేయడం ఈ పద్యంలో నన్ను ఆకట్టుకొన్న అంశం. సాధారణంగా కవుల కావ్యాలలో ఋతువర్ణనలు విస్తారంగా సాగుతాయి. అయితే వేంకటకవి విడిగా ఋతువర్ణన చేయలేదు. సాయంకాల వర్ణనతో కలిపి వసంతాన్ని వర్ణించడం ఇక్కడున్న విశేషం. పై పద్యంలో చంద్రుని ప్రసన్నతకూ సౌకుమార్యానికీ కారణం వసంతకాలం ఒక్కటే కాదు. అది పున్నమిరేయి కూడానూ. దీని ముందరి పద్యాలను చదివితే ఆ విషయం బోధపడుతుంది. అది కూడా కవి నేరుగా చెప్పడు, సాయంకాల దృశ్యాన్ని చిత్రించడం ద్వారా మనకి ప్రత్యక్షం చేస్తాడు. ఆ పద్యాన్ని కూడా ఆస్వాదించి వసంతుని ఆగమనాన్ని స్వాగతిద్దాం.

అంగజరాజు పాంథ నిచయంబులపై విజయం బొనర్ప నే
గంగ దలంచునంత మునుగల్గగ దాసులు పట్టు జాళువా
బంగరు టాలవట్టముల భంగి గనంబడె బూర్వ పశ్చిమో
త్తుంగ మహీధరాగ్రముల దోయజశాత్రవమిత్ర బింబముల్

వసంతుడు మన్మథుని చెలికాడే కాదు, సేనాపతి కూడా. అందువల్ల వసంతమాసం అంటే మన్మథుడు జైత్రయాత్ర చేసే సమయం అన్నమాట. మన్మథరాజు జైత్రయాత్రకి సన్నద్ధమైన సమయాన్ని వర్ణిస్తున్న పద్యమిది.

ఇక్కడొక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. ఒకసారి భవభూతి, దండి, కాళిదాసులతో కలిసి భోజరాజు సముద్రపుటొడ్డుకు విహారానికి వెళ్ళాడట. అక్కడ అస్తమిస్తున్న సూర్యుడిని చూసి ‘పరిపతతి పయోనిధౌ పతంగః’ అన్నాడట. అంటే సూర్యుడు సముద్రంలో పడిపోతున్నాడు అని. మిగిలినవారు ఒకొక్క పాదంతో ఆ పద్యాన్ని పూరించాలి. వెంటనే దండి ‘సరసిరుహా ముదరేషు మత్తభృంగః’ అన్నాడట. అంటే పద్మాల కడుపుల్లో మత్తిల్లిన తేనెటీగలున్నాయి అని. తేనె తాగేందుకు వాలిన భ్రమరాలు పద్మ మరందాన్ని త్రాగి మత్తెక్కి ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. పద్మాలు ముడుచుకుపోయాయి. అలా ముడుచుకుపోయిన పద్మాల కడుపుల్లో మత్తిల్లిన భృంగాలు ఉండిపోయాయి! ఆ తర్వాత భవభూతి ‘ఉపవనతరుకోటరే విహంగః’ అన్నాడు. ప్రక్కనే ఉద్యానవనాలున్నాయి. ఆ తోటల్లో చెట్లున్నాయి. ఆ చెట్ల తొర్రలలోకి పక్షులు చేరుకున్నాయి అని అర్థం. ఇక చివరగా కాళిదాసు వంతు. అతను ‘యువతి జనేషు శనై శ్శనై రనంగః’ అని పూరించాడు. అంటే యౌవనవతులైన స్త్రీలలోకి మెల్లమెల్లగా మన్మథుడు ప్రవేశిస్తున్నాడు అని.

అంచేత మన్మథుని దండయాత్రకు అనువైన సమయం సాయంత్రమే. ఇక్కడ జైత్రయాత్ర ఎవరిపైన అంటే, పాంథనిచయంబులపైన. అంటే ప్రయాణంలో ఉన్నవాళ్ళపైన. తమ ప్రియతములకు దూరమై విరహంతో వేగుతూ ఉండే వాళ్ళపైనన్న మాట! రాజు ఎక్కడికైనా బయలుదేరాడనగానే పెద్ద సన్నాహమే కదా. అతని ఠీవికి తగ్గట్టుగా ముందు కొంతమంది రాజోచిత లాంఛనాలను పట్టుకొని నడుస్తారు. అలాంటి రాజచిహ్నాలలో సూర్యచంద్రుల బొమ్మలున్న పలకలు అమర్చిన పొడుగాటి కర్రలను సూర్యపాను చంద్రపాను అంటారు. వాటినే ఆలావర్తములని (ఆలవట్టములు) కూడా అంటారు. ఇక్కడ యాత్రకి సన్నద్ధమయినది మామూలు రాజు కాదు కదా! జగజ్జేత అయిన మన్మథుడు. అతనికి బొమ్మలతో పని లేదు. అచ్చంగా చంద్రసూర్య బింబాలే మేలిమి (జాళువా) బంగారు ఆలవట్టములయ్యాయి అన్నట్టుగా అటూ యిటూ, తూర్పుపడమటి కొండలపై (పూర్వ పశ్చిమ ఉత్తుంగ మహీధరాగ్రముల) ప్రకాశించాయి. తోయజశాత్రవుడు అంటే పద్మాలకు శత్రువు – చంద్రుడు. తోయజమిత్రుడు సూర్యుడు. చంద్రబింబం తూర్పుకొండపైన, సూర్యబింబం పడమటికొండపైన వెలుగుతోంది. అందుకే అది సాయంసమయం. సూర్యాస్తమయమూ చంద్రోదయమూ ఒకేసారి అవుతున్నాయంటే అది పున్నమి అన్నమాట. అది మధుమాసమనీ పున్నమినాటి సాయంసంధ్యా సమయమనీ ఎక్కడా నేరుగా చెప్పకుండా కేవలం దృశ్యచిత్రీకరణ ద్వారా తెలియజేయడం కవి రచనలోని చమత్కారం! అంగజరాజు అనే పదానికి కూడా గొప్ప సార్థకత ఉందని వివరించారు తాపీవారు. దీనికి అంగదేశంలో పుట్టిన రాజు అనే అర్థం కూడా వస్తుంది. అంగదేశం భరతఖండంలో ఉత్తరాన ఉంది. అందువల్ల అంగజరాజు ఉత్తరదిక్కు నుండి బయలుదేరుతున్నాడని ఊహించవచ్చు. అప్పుడు సరిగ్గా అతని కుడిపక్క (అంటే పడమట) సూర్యపాను, ఎడమపక్క (అంటే తూర్పున) చంద్రపానూ ఉన్న దృశ్యం మనకి చక్కగా సాక్షాత్కరిస్తుంది.

వసంతం వచ్చేసింది కాబట్టి రాబోయే పున్నమినాడు మన్మథరాజు వేంచేసే ఆ దృశ్యాన్ని మీరు స్వయంగా తిలకించవచ్చు! ఈమాట పాఠకమిత్రులందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు.