ఏ పాటికీ నిద్ర పట్టదు మనః తటిలో ఆలోచనా తరంగాలు,
కంటి మబ్బు క్రింద వణుకుతూ శ్రావణమాసపు పిలుపు.
ఏదీ తెలియని నేను ఇక్కడ ఇంటిలో పడి ఉన్నాను
టేబుల్ మీద అనాదరంగా అస్తవ్యస్తంగా పుస్తకాలు
పడివున్నాయి కిరాణా కొట్టువాడి బుట్టలో సరుకుల్లా!
చెట్లు దాటి ఇంటిపైకెగిరి దూరంగా ఆకాశంలో వెలుగుతూ చందమామ,
నా నిద్రని దొంగిలించిన దొంగలా! ఈ నిర్మానుష్య రాత్రిలో ఏడ్చి ఏడ్చి
ఎర్రబడ్డ కళ్ళతో మెలకువగా నేను, ఈ రహస్యం ఏదో అర్థం అవటల్లేదు
కిటికీ అటు ప్రక్కన రాత్రి పడుతున్న చల్లని మంచు బిందువులు.
నీ ప్రేమలా ఆరిపోయింది నా కళ్ళ వెలుగు,
మూసుకొని ఉన్న నా కళ్ళల్లో చిరుచేపలా నీ జ్ఞాపకం.
ఎడారిలో ఏకాకిగా భారంగా సంచరించే బాటసారిని నేను
గరుడపచ్చని ఎండమావి కోసం కుమిలి కుమిలి రోదిస్తూ.
మబ్బుల్లో నాచుక్రింద గేలిచేస్తూ వెలిసిపోతున్న ఒంటరి చందమామ
ఇవాళ నువ్వు ఎంత దూరం? ఎక్కడ ఉంది నా స్వప్న కవిత?