సీతాంజనేయ సంభాషణం – IV



శ్లో॥ సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తనహర్షితా
ఉవాచ వాక్యం వైదేహీ హనూమంతం ద్రుమాశ్రితమ్ ॥ 15 ॥

పదచ్ఛేదము:- సా – తస్య – వచనం – శ్రుత్వా – రామకీర్తనహర్షితా – ఉవాచ – వాక్యం – వైదేహీ – హనూమంతం – ద్రుమాశ్రితమ్ ॥

అన్వయక్రమము:- సా వైదేహీ తస్య వచనం శ్రుత్వా రామకీర్తనహర్షితా (సతీ) ద్రుమాశ్రితం హనూమంతం వాక్యమ్ ఉవాచ.

ప్రతిపదార్థము:- సా వైదేహీ = ఆ సీతాదేవి, తస్య = ఆ హనుమంతునియొక్క వచనం = మాటను, శ్రుత్వా = విని, రామకీర్తనహర్షితా = శ్రీరాముని కీర్తించుటచే సంతోషించినదై, ద్రుమాశ్రితం = చెట్టును చేరియున్నట్టి, హనూమంతం = హనుమంతుని గూర్చి, వాక్యం ఉవాచ = (ఈ) వచనమును పలికెను.

శ్లో॥ పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః ।
స్నుషా దశరథ స్యాహం శత్రుసైన్యప్రణాశినః ॥ 16 ॥

పదచ్ఛేదము:- పృథివ్యాం – రాజసింహానాం – ముఖ్యస్య – విదితాత్మనః – స్నుషా – దశరథస్య – అహం – శత్రుసైన్యప్రణాశినః ॥

అన్వయక్రమము:- పృథివ్యాం, రాజసింహానాం, ముఖ్యస్య, విదితాత్మనః, శత్రుసైన్యప్రణాశినః దశరథస్య అహం స్నుషా.

ప్రతిపదార్థము:- పృథివ్యాం = భూమియందు (గల), రాజసింహానాం = రాజశ్రేష్ఠులలో, ముఖ్యస్య = ప్రధానుడును, విదితాత్మనః = (ఆత్మజ్ఞానియును) సుప్రసిద్ధుడును, శత్రుసైన్యప్రణాశినః = శత్రుసైన్యములను నిర్మూలించునట్టివాడునగు, దశరథస్య = దశరథునకు, అహం = నేను, స్నుషా = కోడలిని.

శ్లో॥ దుహితా జనక స్యాహం వైదేహస్య మహాత్మనః ।
సీతేతి నామ్నా చోక్తాహం భార్యా రామస్య ధీమతః ॥ 17 ॥

పదచ్ఛేదము:- దుహితా – జనకస్య – అహం – వైదేహస్య – మహాత్మనః – సీతా – ఇతి – నామ్నా – చ – ఉక్తా – అహం – భార్యా – రామస్య – ధీమతః ॥

అన్వయక్రమము:- మహాత్మనః వైదేహస్య జనకస్య అహం దుహితా, నామ్నా సీతేతి ఉక్తా అహం ధీమతః రామస్య భార్యా (అస్మి). మహాత్మనః = మహాత్ముడైన, వైదేహస్య జనకస్య = విదేహదేశాధిపతి యగు జనకునకు, అహం = నేను, దుహితా = కుమార్తెను, నామ్నా = పేరుచే, సీతా ఇతి ఉక్తా = సీత యని పిలువబడుదాననైన, అహం = నేను, ధీమతః రామస్య ధీశాలియైన రామునకు, భార్యా (అస్మి) = భార్యనైయున్నాను.


వ.
రామకీర్తన విని రోమహర్షితయైన వైదేహి తొలిసారి వాతెఱవిడి పలుకంగ దొడగెను పవనాత్మజునితోడ:
సీ
అవునయ్య నే పృథ్వి నతుల ప్రతాపుడౌ
ప్రోడ దశరథుని కోడలినిని!
అవునయ్య నే భవ్యయశమొప్పు వైదేహ
జనకుని కూతురు జానకినిని!
అవునయ్య నే భువి ననవద్య గుణుడైన
ధీమంతుడౌ రాము ధీరసతిని!
అవునయ్య పతిబాసి అలమట పడుచుంటి
సీత నా నామమే స్నిగ్ధవచన!


శ్లో॥ సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే ।
భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామసమృద్ధినీ ॥ 18 ॥

పదచ్ఛేదము:- సమాః – ద్వాదశ – తత్ర – అహం – రాఘవస్య – నివేశనే – మానుషాన్ – భోగాన్ – భుంజానా – సర్వకామసమృద్ధినీ ॥

అన్వయక్రమము:- తత్ర రాఘవస్య నివేశనే ద్వాదశ సమాః మానుషాన్ భోగాన్ భుంజానా, సర్వకామసమృద్ధినీ (ఆసమ్)

ప్రతిపదార్థము:- తత్ర = అచ్చట, రాఘవస్య = రఘువంశవర్ధనుని, నివేశనే = = భవనమున, ద్వాదశ సమాః = పండ్రెండు సంవత్సరములు, మానుషాన్ భోగాన్ మానవసౌఖ్యములను, భుంజానా = అనుభవించుచున్నదాననై, సర్వకామసమృద్ధినీ : అన్ని భోగ్య వస్తువులను సమృద్ధిగా గల్గినదాననుగా (ఆసమ్ = ఉంటిని)



తే.గీ.
పరిణయముకాగ పన్నెండు వత్సరములు
రాము నింటను గడిపితి రహిని జెంది
కోరి నట్టి భోగములను కూర్మి పొంది
సకల మానుష సుఖముల చవినిగొంటి.


శ్లో॥ తత స్త్రయోదశే వర్షే రాజ్యే చేక్ష్వాకునందనమ్ !
అభిషేచయితుం రాజా సోపాధ్యాయః ప్రచక్రమే ॥ 19 ॥

పదచ్ఛేదము:- తతః – త్రయోదశే – వర్షే – రాజ్యే – చ – ఇక్ష్వాకునందనమ్ – అభిషేచయితుం – రాజా – సోపాధ్యాయః – ప్రచక్రమే ॥

అన్వయక్రమము:- తతః త్రయోదశే వర్షే సోపాధ్యాయః రాజా ఇక్ష్వాకునందనం రాజ్యే అభిషేచయితుం ప్రచక్రమే.

ప్రతిపదార్థము:- తతః = పిమ్మట, త్రయోదశే వర్షే = పదమూడవ ఏట, సోపాధ్యాయః = గురువైన వసిష్ఠునితో కూడినవాడై, రాజా = దశరథమహారాజు, ఇక్ష్వాకునందనం = ఇక్ష్వాకువంశవర్ధనుడైన శ్రీరాముని, రాజ్యే = రాజ్యమున, అభిషేచయితుం = పట్టము గట్టుటకు, ప్రచక్రమే = ఉపక్రమించెను.


తే.గీ.
పాడిగా పదమూడవ వత్సరమున
మామ దశరథుడు గురువు మంతనమున
జ్యేష్ఠ పుత్రుని పట్టాభిషేకమునకు
తగిన యేర్పాట్లు చేయంగ తనరుకొనియె!

శ్లో॥ తస్మిన్ సంబ్రియమాణే తు రాఘవ స్యాభిషేచనే ।
కైకేయిగా నామ భర్తార మిదం వచన మబ్రవీత్ ॥ 20 ॥

పదచ్ఛేదము:- తస్మిన్ – సంబ్రియమాణే – తు – రాఘవస్య – అభిషేచనే – కైకేయీ – నామ – భర్తారమ్ – ఇదం – వచనమ్ – అబ్రవీత్ ॥

అన్వయక్రమము:- తస్మిన్ రాఘవస్య అభిషేచనే సంబ్రియమాణే తు (సతి), కైకేయీ నామ (తస్య పత్నీ) భర్తారమ్ ఇదం వచనమ్ అబ్రవీత్.

ప్రతిపదార్థము:- తస్మిన్ = ఆ, రాఘవస్య అభిషేచనే = శ్రీరాముని పట్టాభిషేకము, సంబ్రియమాణే తు (సతి) = ఏర్పాటు చేయబడుచుండగా, కైకేయీ నామ = కైకేయి అనెడు, (తస్య పత్నీ = ఆతని భార్య), భర్తారం = పెనిమిటిని గూర్చి, ఇదం వచనం అబ్రవీత్ = ఈ మాటలను పలికినది.


తే.గీ.
సరగు నభిషేకపు పనులు సాగుచుండ
రామునికి రాజ్యమేలంచు రభసజేసి
మూడవ సతి దశరథుని ముద్దు రాణి
కైక నిలదీసె భర్తను కఠినముగను

న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనమ్ ।
ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే ॥ 21 ॥

పదచ్ఛేదము:- న – పిబేయం – న – ఖాదేయం – ప్రత్యహం – మమ – భోజనమ్ – ఏషః – మే – జీవితస్య – అంతః – రామః – యది – అభిషిచ్యతే ॥

అన్వయక్రమము:- రామః అభిషిచ్యతే యది అహం ప్రత్యహం న పిబేయమ్; మమ భోజనం న ఖాదేయమ్; ఏషః మే జీవితస్య అంతః (భవిష్యతి).

ప్రతిపదార్థము:- రామః = శ్రీరాముడు, అభిషిచ్యతే యది = పట్టాభిషిక్తుడైన యెడల, అహం = నేను, ప్రత్యహం = ప్రతిదినము, న పిబేయం = (నీరు) త్రాగను, మమ భోజనం = నా భోజనమును, న ఖాదేయం = తినను, ఏషః = ఈయది, మే = నాకు, జీవితస్య అంతః = జీవితమునకు అంతము, (భవిష్యతి = కాగలదు).

శ్లో॥ యత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతిసత్తమ ।
తచ్చేన్న వితథం కార్యం వనం గచ్ఛతు రాఘవః ॥ 22 ॥

పదచ్ఛేదము:- యత్ – తత్ – ఉక్తం – త్వయా – వాక్యం – ప్రీత్యా – నృపతిసత్తమ – తత్ – చేత్ – న – వితధం – కార్యం – వనం – గచ్ఛతు – రాఘవః ॥

అన్వయక్రమము:- తత్, నృపతిసత్తమ, త్వయా ప్రీత్యా (పూర్వం) యత్ వాక్యమ్ ఉక్తం, తత్ న వితధం కార్యం చేత్ రాఘవః వనం గచ్ఛతు.

ప్రతిపదార్థము:- తత్ = ఆ కారణమున, నృపతిసత్తమ = ఓ రాజోత్తమా! త్వయా = నీచేత, (పూర్వం = మున్ను), ప్రీత్యా – ప్రేమతో, యత్ వాక్యం = ఏ వచనమైతే, ఉక్తం = చెప్పబడినదో, తత్ = ఆ వచనము, న వితధం = అసత్యముకానిదిగా, కార్యం చేత్ = చేయదగినదియైన యెడల, రాఘవః = శ్రీరాముడు, వనం గచ్ఛతు =
అడవికి వెడలుగాక!


కం.
ముట్టను నీటిని యికపై
పట్టను గ్రాస మనిశమును ప్రాశించక నే
నెట్టన బ్రతుకింతేయని
పట్టము రామునికి గట్ట ప్రాణము విడుతున్!
కం.
ప్రేమగ మున్నిడిన వరము
నేమము దప్పక నిలుపుము, నేడీ వేళన్!
తామస మింతయు లేకను
రాముని పంపు మడవికిని రాజవరేణ్యా!

స రాజా సత్య వాగ్దేవ్యా వర దానమనుస్మరన్ ।
ముమోహ వచనమ్ శ్రుత్వా కైకేయ్యాః క్రూరమప్రియమ్ ॥ 23 ॥

పదచ్ఛేదము:- సః – రాజా – సత్యవాక్ – దేవ్యాః – వరదానమ్ – అనుస్మరన్ – ముమోహ – వచనం – శ్రుత్వా – కైకేయ్యాః – క్రూరమ్ – అప్రియమ్ ॥

అన్వయక్రమము:- సత్యవాక్ సః రాజా దేవ్యాః (దత్తం) వరదానమ్ అనుస్మరన్, క్రూరమ్, అప్రియం, కైకేయ్యాః వచనం శ్రుత్వా ముమోహ.

ప్రతిపదార్థము:- సత్యవాక్ = సత్యవచనుడైన, సః రాజా = ఆ దశరథుడు, దేవ్యాః (దత్తం) = భార్యకు (ఇచ్చిన), వరదానం = వరదానమును, అనుస్మరన్ = జ్ఞాపకముచేసికొనుచు, క్రూరమ్ = ఘోరమైనట్టిదియును, అప్రియం = బాధాకరమైనట్టియు నగు, కైకేయ్యాః = కైకేయియొక్క, వచనం = మాటను, శ్రుత్వా = విని, ముమోహ = మూర్ఛిల్లెను.


తే.గీ.
క్రూర మప్రియమగు కైక కోరిక విని
కొరలి తానిచ్చిన వరము గుర్తు రాగ
సత్యసంధుండు చిడిముడి సైపలేక
సొలసి శోకసంతప్తుడై సొమ్మసిల్లె!

శ్లో॥ తత స్తం స్థవిరో రాజా సత్యధర్మే వ్యవస్థితః ।
జ్యేష్ఠం యశస్వినం పుత్రం రుదన్ రాజ్యమయాచత ॥ 24 ॥

పదచ్ఛేదము:- తతః – తం – స్థవిరః – రాజా – సత్యధర్మే – వ్యవస్థితః – జ్యేష్ఠం – యశస్వినం – పుత్రం – రుదన్ – రాజ్యమ్ – అయాచత.

అన్వయక్రమము:- తతః సత్యధర్మే వ్యవస్థితః స్థవిరః రాజా రుదన్, యశస్వినం తం జ్యేష్ఠం పుత్రం రాజ్యమ్ అయాచత.

ప్రతిపదార్థము:- తతః = అటుపిమ్మట, సత్యధర్మే = సత్యవ్రతమునందు, వ్యవస్థితః : కట్టుబడి యున్నట్టివాడైన, స్థవిరః రాజా = వృద్ధభూపతి, రుదన్ = విలపించుచు, యశస్వినం = కీర్తిశాలియగు, జ్యేష్ఠం పుత్రం = పెద్ద కుమారుని, రాజ్యమ్ అయాచత = రాజ్యమును యాచించెను.


తే.గీ.
ధర్మసత్యాచరణుడైన దశరథుండు
కంట నీటిని దిగమింగి కష్టముగను
యశము నొందిన జ్యేష్ఠుని యలరి పిలిచి
యియ్యబూనిన రాజ్యము నియ్యమనియె!

శ్లో॥ స పితు ర్వచనం శ్రీమా నభిషేకా త్పరం ప్రియమ్ ।
మనసా పూర్వ మాసాద్య వాచా ప్రతిగృహీతవాన్ ॥ 25 ॥

పదచ్చేదము:- స – వచనం – శ్రీమాన్ – అభిషేకాత్ – పరం – ప్రియమ్ – మనసా – పూర్వమ్ – ఆసాద్య – వాచా – ప్రతిగృహీతవాన్ ॥

అన్వయక్రమము:- శ్రీమాన్ (సః) అభిషేకాత్ పరం ప్రియం పితుః వచనం మనసా పూర్వమ్ ఆసాద్య, (పునః) వాచా ప్రతిగృహీతవాన్.

ప్రతిపదార్థము:- శ్రీమాన్ = శుభలక్షణసంపన్నుడైన, సః = ఆ శ్రీరాముడు, అభిషేకాత్ – పట్టాభిషేకము కంటెను, పరం ప్రియం = మిక్కిలి ప్రియమైనట్టి, పితుః వచనం = తండ్రిమాటను, మనసా = మనఃపూర్వకముగా, పూర్వమ్ ఆసాద్య = మొదట స్వీకరించి, (పునః = తరువాత) వాచా = వాగ్రూపముగా, ప్రతిగృహీతవాన్ = స్వీకరించెను.


తే.గీ.
తండ్రి మాటను పాటించు ధర్మనిరతి
పట్టమబ్బుట కన్నను పరమమనుచు
మదిని స్వీకృతి గావించి ముదము తోడ
వచన మిచ్చెను తండ్రికి వగపుదీర!

శ్లో॥ దద్యా న్న ప్రతిగృహ్ణీయా న్న బ్రూయత్ కించిదప్రియమ్ ।
అపి జీవితహేతో ర్హి రామ స్సత్యపరాక్రమః ॥ 26 ॥

పదచ్ఛేదము:- దద్యాత్ – న – ప్రతిగృహ్ణీయాత్ – న – బ్రూయాత్ – కించిత్ – అప్రియమ్ – అపి – జీవితహేతోః – హి – రామః – సత్యపరాక్రమః ॥

అన్వయక్రమము:- సత్యపరాక్రమః రామః (స్వయం) దద్యాత్; న ప్రతిగృహ్ణీయాత్; న బ్రూయాత్ కించిత్ అప్రియమ్ జీవితహేతో అపి అనృతం న చ బ్రూయాత్.

ప్రతిపదార్ధము:- సత్యపరాక్రమః = సత్యపాలననిమిత్తపరాక్రముడైన, రామః = శ్రీరాముడు, (స్వయం = తాను) దద్యాత్ = దానము చేయును, న ప్రతిగృష్ణాయాత్ = పరులనుండి స్వీకరింపడు, జీవితహేతో! అపి = జీవితరక్షణ కొఱకు గూడ, న బ్రూయాత్ కించిత్ అప్రియమ్ = అప్రియమైన మాటలను నెంతమాత్రము పలుకడు.

శ్లో॥ స విహా యోత్తరీయాణి మహార్హాణి మహాయశాః ।
విసృజ్య మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశత్ ॥ 27 ॥

పదచ్ఛేదము:- సః – విహాయ – ఉత్తరీయాణి – మహార్హాణి – మహాయశాః – విసృజ్య – మనసా – రాజ్యం – జనన్యై – మాం – సమాదిశత్ ॥

అన్వయక్రమము:- మహాయశాః సః మహార్హాణి ఉత్తరీయాణి విహాయ, మనసా రాజ్యం విసృజ్య, మాం జనన్యై సమాదిశత్.

ప్రతిపదార్థము:- మహాయశాః = మహాయశస్సంపన్నుడైన, సః = ఆ శ్రీరాముడు, మహార్హాణి = అమూల్యము లైనట్టి, ఉత్తరీయాణి = దుస్తులను, విహాయ = విడచిపెట్టి, = రాజ్యం = సామ్రాజ్యమును, మనసా విసృజ్య = మానసికముగా పరిత్యజించి, మాం నన్ను, జనన్యై = తల్లియగు కౌసల్యకు, సమాదిశత్ = అప్పగించెను.


సీ.
సత్య పరాక్రమ శాలియౌ రాముండు,
యిచ్చును గాని తా పుచ్చుకొనడు;
ప్రాణ సంకటమైన పరుల దూషించడు,
పిత్రాజ్ఞ పాటించు ప్రీతితోడ!
అట్టి రాముడు తండ్రి ఆజ్ఞను తలదాల్చి
విలువైన వస్త్రాల వీడనాడి
రాజ్యభోగము తృణప్రాయముగ విడిచి
నారచీరను గట్టె నయముమీర

శ్లో॥ సాఽహం త స్యాగ్రత స్తూర్ణం ప్రస్థితా వనచారిణీ।
నహి మే తేన హీనాయా వాస స్స్వర్గేఽపి రోచతే ॥ 28 ॥

పదచ్ఛేదము:- సా – అహం – తస్య – అగ్రతః – తూర్ణం – ప్రస్థితా – వనచారిణీ – న – హి – మే – తేన – హీనాయాః – వాసః – స్వర్గే – అపి – రోచతే ॥

అన్వయక్రమము:- సా అహం, తస్య అగ్రతః తూర్ణం ప్రస్థితా వనచారిణీ (అభవమ్), తేన హీనాయాః మే స్వర్గే వాసః అపి న రోచతే.

ప్రతిపదార్థము:- సా అహం = అట్టి నేను, తస్య అగ్రతః = అతనికి ముందుగనే, తూర్ణం = శీఘ్రముగా, ప్రస్థితా = బయలుదేరినదాననై, వనచారిణీ (అభవమ్) = వనచారిణి నైతిని, తేన హీనాయాః = అతనినుండి వియోగము నొందినట్టి, మే = నాకు, స్వర్గే వాసః అపి = స్వర్గమునందలి నివాసముగూడ, న రోచతే = ఇష్టముగాదు.


తే.గీ.
అత్త కౌసల్యకును నన్ను నప్పగించ,
వలదు వలదంచు నాథుని బ్రతిమలాడి
కాంతు తోడుత కదిలితి కాన కేగ!
పతిని విడనాడి స్వర్గంపు ప్రాప్తి కూడ
సుంత యైనను నాకది సుఖము గాదు!

శ్లో॥ ప్రాగేవ తు మహాభాగ స్సౌమిత్రి ర్మిత్రనందనః ।
పూర్వజ స్యానుయాత్రార్థీ కుశచీరై రలంకృతః॥ 29 ॥

పదచ్ఛేదము:- ప్రాక్ – ఏవ – తు – మహాభాగః – సౌమిత్రిః – మిత్రనందనః – పూర్వజస్య – అనుయాత్రార్థీ – కుశచీరైః – అలంకృతః ॥

అన్వయక్రమము:- మిత్రనందనః, మహాభాగః సౌమిత్రిః ప్రాక్ ఏవ పూర్వజస్య అనుయాత్రార్థీ కుశచీరైః అలంకృతః (అభవత్).

ప్రతిపదార్థము:- మిత్రనందనః = మిత్రుల నానందింపచేయువాడును, మహాభాగః = మహాత్ముడును అగు, సౌమిత్రిః = సుమిత్రానందనుడైన లక్ష్మణుడు, ప్రాగేవ = : ముందుగనే, పూర్వజస్య = అగ్రజుడైన శ్రీరామునియొక్క అనుయాత్రార్థీ అనుగమించుటకై, కుశచీరైః = నారచీరలతో, అలంకృతః (అభవత్) = అలంకరించు కొనినవా డాయెను.


తే.గీ.
అన్న తోడుత వనవాస మరుగుటకు
నాకు పూర్వమే ధరియించి నారచీర
సిద్ధ మాయెను సౌమిత్రి శీఘ్రముగను

శ్లో॥ తే వయం భర్తు రాదేశం బహుమాన్య దృఢవ్రతాః ।
ప్రవిష్టాః స్మ పురాఽదృష్టం వనం గంభీరదర్శనమ్ ॥ 30 ॥

పదచ్ఛేదము:- తే – వయం – భర్తుః – ఆదేశం – బహుమాన్య – దృఢవ్రతాః – ప్రవిష్టాః – స్మ – పురా – అదృష్టం – వనం – గంభీరదర్శనమ్.

అన్వయక్రమము:- తే వయం భర్తుః ఆదేశం బహుమాన్య దృఢవ్రతాః, పురా అదృష్టం, గంభీరదర్శనం వనం ప్రవిష్టాః స్మ.

ప్రతిపదార్థము:- తే వయం = ఆ మేము (మేము మువ్వురము) భర్తుః ఆదేశం = ప్రభువుయొక్క ఆజ్ఞను, బహుమాన్య = గౌరవించి, దృఢవ్రతాః = స్థిరమైన నిశ్చయము గలవారమై, పురా అదృష్టం = పూర్వము చూచియుండనట్టి, గంభీరదర్శనం = భీకరమైన దృశ్యములు గల, వనం = అరణ్యమును, ప్రవిష్టాః స్మ = ప్రవేశించిన వారమైతిమి.


తే.గీ.
ప్రభువు వాక్కును మన్నించి ప్రతినబూని
భయద గంభీర దృశ్యాల వనముజొచ్చి
కనుల మునుపెన్నడు గనని కాననమున
అడుగు పెట్టితి మంతట అధిపు గూడి!

శ్లో॥ వసతో దండకారణ్యే త స్యాహ మమితౌజసః ।
రక్షసాఽపహృతా భార్యా రావణేన దురాత్మనా ॥ 31 ॥

పదచ్ఛేదము:- వసతః – దండకారణ్యే – తస్య – అహమ్ – అమితౌజసః – రక్షసా – అపహృతా – భార్యా – రావణేన – దురాత్మనా ।
అన్వయక్రమము:- దండకారణ్యే వసతః, అమితౌజసః తస్య భార్యా అహం, దురాత్మనా, రక్షసా రావణేన అపహృతా.

ప్రతిపదార్థము:- దండకారణ్యే = దండకారణ్యమునందు, వసతః = నివసించు చున్నట్టివాడైన, అమితౌజసః = అమిత ప్రతాపశాలియగు, తస్య శ్రీరాముని యొక్క భార్యా = భార్యనైనట్టి, అహం = నేను, దురాత్మనా = దుర్మార్గుడైనట్టి, రావణేన రక్షసా = రావణాసురునిచే, అపహృతా = అపహరించబడితిని.

శ్లో॥ ద్వౌ మాసౌ తేన మే కాలో జీవితానుగ్రహః కృతః ।
ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తత స్త్యక్ష్యామి జీవితమ్ ॥32 ॥

పదచ్ఛేదము:- ద్వౌ – మాసౌ – తేన – మే – కాలః – జీవితానుగ్రహః – కృతః – ద్వాభ్యాం – తు – మాసాభ్యాం – తతః – త్యక్ష్యామి – జీవితమ్ ॥

అన్వయక్రమము:- తేన మే ద్వౌ మాసౌ జీవితానుగ్రహః కృతః. తతః ద్వాబ్యాం మాసాభ్యాం ఊర్ధ్వం, (స్వయమేవ) జీవితం త్యక్ష్యామి.

ప్రతిపదార్థము:- తేన = ఆ రావణునిచే, మే నాకు, ద్వౌ మాసౌ = రెండునెలలు, జీవితానుగ్రహః = జీవితమునకు అనుమతి, కృతః = కల్పింపబడినది, తతః = అటుపిమ్మట, ద్వాబ్యాం మాసాభ్యాం ఊర్ధ్వం = రెండునెలల అనంతరం, (స్వయమేవ = స్వయమేవ) జీవితం త్యక్ష్యామి = ప్రాణము విడిచెదను.


కం.
దండక వనమున నుండగ,
అండగ నమితౌజసుడగు ఆర్యుని తోడన్
దుండగుడగు రావణు డట
గుండెలు పగులగ చెరగొనె కుత్సిత మతితోన్!

ఇరు మాసంబులు గడువని
కరకు దనుజుడిట మనుటకు కాలము నొసగెన్
సరగున పతి ప్రోవనిచో
మరణమె శరణనుచు నేను మనికిని విడుతున్!