భ్రమలు

ఏవేవో ఎండమావులు
భ్రమించి పరుగులు తీస్తాం
ఎడారి చిగురిస్తుందని
తాపగ్రస్తమైన దీని విశాల దేహం మీద
ఎక్కడైనా ఒక తడికన్ను రెప్ప విప్పుతుందని

లెక్కలేనన్ని జారుడు మెట్లు
నిలదొక్కుకొని ఎక్కుతూనే ఉంటాం
ఎప్పటికైనా ఈ చీకటి గుయ్యారం నుండి బయటపడి
వెలుగు వాకిట్లోకి అడుగు పెడతామని

ఆకాశం మీద ఏవో కొన్ని నలుపు మరకలు
మబ్బులని భ్రమపడతాం
జలజల వాన కురిసి
అలసిన భూమి వదనం మీద
చిరునవ్వులు పూయిస్తుందని

మబ్బులన్నీ జలదాలు కావు
కొన్ని ఊరికే కాలపురుషుడు సరదాగా ఊదిన సిగరెట్టు పొగలు

రైలులో వెళుతున్నామనుకుంటాం
కానీ ఇది కేవలం ఒక వెయిటింగ్ రూమ్
ఆశించినదేదో జరుగుతుందని
అనంతకాలం చేసే విఫల నిరీక్షణ

తన చుట్టూ తాను పరిభ్రమించే
గోళాకార జీవితంలో
మరల మరల తారసపడే ఇటువంటివన్నీ
మార్పు లేదనటానికి సంకేతాలే.