మనసులు దోచే మనస్లు – 3

ట్రెక్ మొదలెట్టి మూడు రోజులు గడిచాయి.

అప్పటికి అంతా కలసి 50 కిలోమీటర్ల పైన నడిచాం. సుమారు 2000 మీటర్ల ఎత్తును అధిగమించి నేను ఎంతగానో ఎదురుచూస్తోన్న సెరాంగ్ గొంపా చేరుకున్నాం. రోజురోజుకీ ట్రెక్‌లోని క్లిష్టతా కష్టమూ పెరగసాగాయి. మాలో ఉన్నాయని మాకే తెలియని గుప్తసామర్థ్యాల సాయంతో, మా గైడ్ గురుంగ్ సారథ్యంలో అవన్నీ దాటుకుని ముందుకు సాగాం. ఆ ప్రక్రియలో రాబోయే రోజుల్లో ఎదురవగల సవాళ్ళను పరిష్కరించుకోగలమన్న మానసిక బలాన్ని సంతరించుకోగలిగాం…


సెరాంగ్ గొంపా

ఆనాటి రాత్రి సెరాంగ్ గొంపాలో మాకు చక్కని వసతి దొరికింది. సౌకర్యాలు ప్రాథమికమైనవేగానీ శుభ్రత విషయంలో వేలెత్తి చూపించే అవకాశం లేని వసతి అది. గదుల్లో చక్కని పడక, టేబులు, కుర్చీ అమర్చి ఉన్నాయి. ఉమ్మడి స్నానశాలల్లో టాయిలెట్లు, షవర్లు ఉన్నాయి. వెంటనే స్నానం ముగించి వెళ్ళి అప్పటికే డైనింగ్ రూమ్ చేరుకున్న మా బృందాన్ని కలిసాను.

ఆ అక్టోబర్ 6వ తారీఖు అనితారాణి జన్మదినం. అందరం ఆ ఉదయమే ఆమెకు శుభాకాంక్షలు అందించాం. రెండేళ్ళ క్రితం 2023లో అన్నపూర్ణ ట్రెక్‌లో ఆమె ఇలాగే మా అందరి మధ్యా తన పుట్టినరోజు జరుపుకుంది. ఇప్పటికీ ఆ అనుభవం గురించి మురిపెంగా చెప్పుకుంటుంది. మళ్ళా మరోసారి తన పుట్టినరోజు సెరాంగ్ గొంపాలాంటి చోట మాతో జరుపుకునే అవకాశం ఆమెకు లభించింది. ఆమెకు సహజంగానే ఎంతో సంతోషం…

ఆమెలో కలిగిన ఉత్సాహం, ఉత్తేజం సహజంగానే మా అందరి మనసులనీ అలుముకున్నాయి. పన్నెండు గంటల కాలినడక కలిగించిన శ్రమను మర్చిపోయేలా చేసాయి. మరోసారి అందరం డిన్నర్ సమయంలో ఆమెకు శుభాకాంక్షలు తెలిపాం. 2023 లో మాతోపాటు అన్నపూర్ణ ట్రెక్‌కు వచ్చిన బాబు గురుంగ్, రేషమ్‌లు కూడా మా ఉత్సాహంలో పాలు పంచుకోసాగారు. సెరాంగ్ గొంపా పర్వతాల నడుమ, సగటు నాగరికతలకు దూరంగా ఉంది గాబట్టి అనితారాణి పుట్టిన రోజును నేపాలీ సంప్రదాయ సరళిలో జరుపుకుంటే బావుంటుందని నాకనిపించింది.

అనితలో ఆధ్యాత్మిక ఆసక్తులు మెండు అని మా అందరికీ తెలుసు. అలాంటి మనిషి పుట్టినరోజును హిమాలయాల నడుమన ఉన్న అరుదైన బౌద్ధ ఆధ్యాత్మిక మందిరంలో సముచిత రీతిలో జరగాలనుకొంటే అక్కడి భిక్షువుల ఆశీస్సులు ఆమెకు అందేలా చెయ్యడమే సరైన పని అనిపించింది. బాబు గురుంగ్, రేషమ్‌లు వెంటనే రంగంలోకి దిగి దానిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు. వెళ్ళి అక్కడి ముఖ్యభిక్షువుల్లో ఒకరితో మాట్లాడారు. ఆయన సంతోషంగా అంగీకరించారు.

అందరం కాంటీన్ చేరుకున్నాం. మా గైడ్లూ పోర్టర్లూ కూడా మాతో కలిసారు. ఇంగ్లీష్, నేపాలీ భాషలలో వేడుక గీతాల ఆలాపన సాగింది. ఈలోగా ప్రముఖ భిక్షువు ఒకరు వచ్చి మాతో చేరాడు. తొలి ఇరవైల యువకుడాయన. ఆయనతోపాటు మరికొంతమంది భిక్షువులు కూడా వచ్చి చేరారు. ఆ గొంపాకు చెందినంతవరకూ ఆ యువకుడు రెండవ స్థానంలో ఉన్న ముఖ్యమైన భిక్షువు. బాగా చదువుకున్న మనిషిలా కనిపించాడు. చక్కని ఇంగ్లీష్ మాట్లాడాడు. టిబెటన్ భాషలో సమయోచితమైన ప్రార్థనలు చేసాడు. మధ్య మధ్య సంస్కృత పదాలు దొర్లాయి. ప్రార్థనల సాయంతో ఆయన అనితను ఆశీర్వదించాడు.

ఆశీర్వచనాలు ముగిసాక వాళ్ళంతా ఆమె మెడలో కండువాలు వేసి సత్కరించారు – ఉపభిక్షువు, ప్రధాన భిక్షువు, ఇతర భిక్షువులు, హోటల్ ఉద్యోగులు, గైడ్లు, పోర్టర్లు – మొత్తం అరడజను దాటి కండువాలు ఆమె మెడలో పడ్డాయి. కాస్తంత ఉక్కిరిబిక్కిరి పడింది కానీ, ఆమె మొహంలో సహజంగానే సంతృప్తి, సంబరం… పుట్టినరోజును ప్రతి ఏడాదీ ఆత్మబంధువుల మధ్య జరుపుకోవడం ఆమెకు అలవాటు. మాతో చేరాక ఇలా ట్రెకింగ్ బృందాలతో జరుపుకుంటోంది. బంధువులు లేని లోటును మేమూ ఇక్కడి భిక్షువులూ తీర్చిన సంతృప్తి ఆమె మొహంలో కనిపించింది.


ఆశీస్సులు

కార్యక్రమం ఆశీస్సులూ కండువాల దగ్గరే ఆగలేదు; స్థానిక దినుసులతో చేసిన చక్కని కేక్ ఒకటి క్షణాల్లో టేబుల్ మీద ప్రత్యక్షమయింది. అలా పుట్టినరోజు వేడుకల్లో తప్పనిసరిగా ఉండే ‘కేక్ కటింగ్ సెర్మనీ’ ఆరంభమయింది. అది ముగిశాక అందరం అనితను మాట్లాడమన్నాం. ఉద్వేగభరితంగా మాట్లాడింది. భిక్షువులు, గైడ్లు, పోర్టర్లు, బాబు గురుంగ్, రేషమ్, బృందసభ్యులు – అందరికీ తన పుట్టినరోజు వేడుకను మరపురాని జ్ఞాపకంగా మలచినందుకు ధన్యవాదాలు చెప్పింది. బాగా ఉదయమే ఆరంభమై రోజంతా కష్టభూయిష్టమైన నడకలతో నిండి మమ్మల్ని బాగా శ్రమ పెట్టిన ఆరోజు అలా సంబరంగా సంతోషకరంగా ముగిసింది.

ఆరోజు ఆశ్వయుజ శుక్ల చతుర్దశి. ఏడాది మొత్తంలో ఎక్కువ నిండుగా, ఎక్కువ ప్రకాశవంతంగా పూర్ణచంద్రుడు పలకరించే, పంటలు ఇంటికి చేరే నెలలోని ప్రత్యేకమైన పౌర్ణమి అది. చతుర్దశి కదా, చీకటి పడటానికి కాస్తంత ముందే ఉదయించిన చంద్రుడు, చీకటి పడీపడగానే తన వెలుగుల వెల్లువ ఆరంభించాడు. ఆ వెన్నెల వెల్లువలో మెరిసిపోతోన్న హిమగిరుల సౌందర్యాన్ని తనివితీరా చవి చూసి అందరం నిద్రకు ఉపక్రమించాం. అయినా తనివి తీరక, మరోసారి చంద్రుణ్ణి పలకరిద్దాం అని నేను గది బయట అడుగుపెట్టినపుడు, ఆరుబయట ఉన్న బెంచీ మీద కూర్చుని చంద్రసౌందర్యాన్ని ఆస్వాదిస్తోన్న మోహన్ కనపడ్డాడు. బయట బాగా చల్లగా ఉంది. 3000 మీటర్ల ఎత్తును దాటాంగదా – ఆ సంగతి చల్లదనంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్ని బట్టలూ తదితర రక్షణ పరికరాలూ ధరించి నేనూ వెళ్ళి మోహన్ పక్కన చేరాను. దీర్ఘ చతురస్రాకారపు ఆవరణలో నిర్మించిన సెరాంగ్ గొంపా రూపం కోటను తలపించింది. ఆవరణపు తల వేపున ఆకట్టుకొనే పెద్ద పరిమాణపు బౌద్ధాలయం, అటూ ఇటూ గోడల అంచులను హత్తుకుంటూ కట్టిన నివాస గృహాలు… అందులో మేము ఉంటోన్న భవనం కూడా ఒకటి. అసలు ఆ గొంపా ఉండటమే ఒక లోయలో ఉంది. చుట్టూ మంచుకొండలు… వాటిని ధగధగలాడిస్తూ పండు వెన్నెల – మరపు రాని అనుభవమది!


ఆ రాత్రి చక్కగా నిద్ర పట్టింది.


ఉదయసంధ్య

బడలిక తీరిన శరీరం… తాజా పడిన మనసు… ఎన్నాళ్ళనుంచో ఆ కొండల మధ్య ఉంటున్నామన్న భావన – ఒక నూతనోత్సాహంతో మా ఐదవ రోజు మొదలయింది. ఉదయం ఐదున్నరకే వినిపించిన ప్రార్థనా గీతాలాపన శృతి నిండిన అలారంలా పనిచేసి నన్ను నిద్ర లేపింది. మొదటి అంతస్తులోని నా గదిలోంచి బయటపడి క్రిందకి వెళ్ళాను. అప్పటికే అనిత, శ్రీనివాస్, అనిల్ అక్కడకు చేరుకుని ఉదయాన్ని ఆస్వాదిస్తూ, ఫోటోలు తీస్తూ కనిపించారు. నన్ను తమతో చేరమని ఆహ్వానించారు. ఉదయసంధ్యాసమయమది. జగత్తు నిండా మహత్తు నిండిన అపూర్వ క్షణాలవి. రాత్రి వెన్నెల్లో కనిపించిన మనోహరత్వమే ఆ ఉదయసంధ్యలోనూ పుష్కలంగా నిండి ఉండి మా అందరినీ అలరించింది.

మంద్రంగా వినిపిస్తోన్న మంత్రోచ్ఛారణ ఆలయం లోపలినుంచి వస్తోందో బయట ఎక్కడినించన్నా వస్తోందో బోధపడలేదు. కాసేపట్లోనే ఆ ప్రాంగణంలోని ఒక భవనంలోంచి వరుస కట్టి బయటకు వస్తోన్న బాలభిక్షువులూ, వారి వెనుకే వచ్చిన యువభిక్షువులూ నా అనుమానం తీర్చారు. వారిని వెన్నంటి వచ్చిన రమేష్‌ను చూసి నేను ఆశ్చర్యపోయాను. మాకన్నా ముందే లేచిన రమేష్‌కు కూడా మాలానే ఆ మధురధ్వనుల మూలస్థానమెక్కడా అన్న కుతూహలం కలిగిందట. అవి వస్తోన్న భవనపు ఉనికి గ్రహించి అక్కడికి వెళ్ళాడట. అది చూసిన మతాచార్యుడొకాయన అతన్ని ‘లోపలికి వచ్చి మా ప్రాతః ప్రార్థనలలో పాలు పంచుకో’మని ఆహ్వానించాడట. అదిగో, అలా మా రమేషుడు కూడా ఆ ప్రార్థనా బృందపు సభ్యుడి అవతారం ధరించి వారితోబాటు బయటకు వచ్చాడన్నమాట. అదంతా విని ‘అయ్యో! మంచి అవకాశం కోల్పోయామే’ అనిపించింది. “మరేం పర్లేదు – మరింత విస్తృత ప్రార్థనా కార్యక్రమం ఈ ప్రాంగణంలోని ముఖ్యాలయంలో కాసేపట్లో జరగబోతోంది,” అని భరోసా ఇచ్చాడు రమేష్.

మెలమెల్లగా సూర్యోదయం ఆరంభమయింది. హిమశిఖరాల వెనుకనుంచి ఉదయిస్తోన్న బాలభానుడు తొట్టతొలిదశలో ఆ శిఖరాలను బంగారువన్నెలో ముంచెత్తి వదిలాడు. క్రమక్రమంగా అది వెండి వెలుగుగా మారింది. కాసేపటికల్లా ఆ పరిసరాలన్నీ వర్ణనాతీతమైన వెలుగుల వెల్లువలో మెరిసాయి. ఆ ప్రకృతి లీలలో లీనమైపోయి చేష్టలు కోల్పోయే తన్మయత్వంతో దాదాపు గంటసేపు అలా చూస్తుండిపోయాను. తెప్పరిల్లాక పరిసరాలను పరకాయిస్తే ఆ ప్రాంగణంలోనే ఉన్న ఓ చిన్న ఆరుబయలు మందిరంలోని శ్వేతవర్ణపు గణేశప్రతిమ కనిపించింది.


ప్రార్థనా ప్రాంగణం

టిబెటన్ బౌద్ధ సంప్రదాయంలో గణేశుడిని గణపతి అని వ్యవహరిస్తూ ఉంటారట. బౌద్ధ సంప్రదాయాలకూ ధర్మాలకూ ప్రతీప శక్తులు భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ కల్పించే అడ్డంకులను అధిగమించడం కోసం గణపతిని వారంతా ఆవాహన చేస్తూ ఉంటారట. ఇక్కడి విగ్రహంలోని శ్వేతవర్ణం శాంతి సౌభాగ్యాలకూ నిర్మలత్వానికీ ప్రతీక అట.

ఉదయం ఏడుగంటల వేళ జరిగే ప్రార్థనా కార్యక్రమం ఆరంభమవుతోందని సూచిస్తూ పెద్ద శబ్దంతో బాకా మ్రోగింది. ప్రధాన ఆలయమూ అక్కడి ప్రార్థనా ప్రాంగణమూ బౌద్ధ మతచిహ్నాలతోనూ, సంకేతాలతోనూ, జాతక కథలకు చెందిన చిత్రాలతోనూ నిండి ఉన్నాయి… ముఖ్యవేదిక మీద వైభవోపేతమైన బుద్ధవిగ్రహం నిలచి ఉంది. ఆ ప్రాంగణమంతా జూనిపర్ ధూమం అలముకొని ఉంది.


బాలభిక్షువులు

ఆ దీర్ఘచతురస్రాకారపు ప్రార్థనా ప్రాంగణంలో ఏడూ పన్నెండేళ్ళ మధ్య వయసుల్లో ఉన్న ఇరవైమంది బాలభిక్షువులు ఎదురుబొదురుగా కూర్చుని కనిపించారు. మరో ఇద్దరు కాస్తంత పెద్ద వయసు పసి యువకులు ప్రార్థనా కార్యక్రమం నిర్వహించడం మొదలెట్టారు. వారికి కొందరు మతాచార్యులు చేయూతనందించసాగారు. వారంతా టిబెటన్ భాషలో లయబద్ధంగా మంత్రోచ్ఛారణ ఆరంభించారు. ఆ మంత్రాలలో సంస్కృత పదాల ఛాయలు విరివిగా కనిపించాయి. ఆ మంత్రోచ్ఛారణకు తోడుగా రెండు పొడవైన బాకాలు, మరో రెండు చిన్నపాటి బాకాలు, శంఖాలు, రెండు ఢంకాలు, చేగంటలతో కూడిన పరికరాల సమూహం అతి చక్కని వాద్యసంగీతం అందించసాగింది. మానవ స్వరాలు, వాద్యసంగీతాలు అతి చక్కని మేళవింపుతో, శ్రుతిలయలతో సృష్టిస్తోన్న ధ్వని సంపద విన మనోహరంగా సాగిపోయింది. అది ఒక అతిలోక అనుభవం. అద్వితీయమైన అనుభూతి. ఆ హిమాలయాల నడుమ, బౌద్ధమందిరంలో కూడి, ఆ ప్రార్థనా కార్యక్రమంలో అలా పాలుపంచుకుంటున్నామన్న విషయం నాకే నమ్మశక్యంగాని క్షణాలవి. మనమెరిగిన నాగరికతకు దూరంగా, ఓ మారుమూలన ఉన్న ప్రశాంత బౌద్ధారామంలో, టిబెటన్ ప్రార్థనాగీతాలను వింటూ కాలం నిలచిపోయిన సమయంలో ఉంటూ, ఉనికినే మరచిపోయి పరిసరాలలో భాగంగా పరిణమించడమన్నది – దానికదే ఒక పరమాద్భుతం.

కార్యక్రమం ముగిశాక బాలభిక్షువులతోనూ, వారి ఆచార్యులతోనూ కాసేపు ముచ్చటించాం. ఆ పిల్లలకు మత సంబంధిత బోధనలతోపాటు సాధారణ విద్య కూడా అందుతోందట. అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. వారిలో పెద్ద పిల్లలు మాతో చక్కగా ఆంగ్లంలో మాట్లాడారు.


టిన్జెన్ నిమాతో

వారిలో టిన్జెన్ నిమా అన్న సీనియర్ ఆచార్యునిది మేము దాటి వచ్చిన బిహు గ్రామం. టిబెటన్ బౌద్ధ ధర్మాలనూ సంప్రదాయాలనూ బాగా అధ్యయనం చేసిన వ్యక్తి ఆయన. ఏడేళ్ళపాటు సిక్కింలో శిక్షణ పొందాక, మరో మూడేళ్ళు ఈ సెరాంగ్ గొంపాలో అధ్యయనం కొనసాగించాడట. ఆ శిక్షణలో భాగంగా మరో మూడు నెలలు ఒక గుహలో దాదాపు ఏకాంతంగా ధ్యానం చేసాడట. బయట ప్రపంచంతో ఏ సంపర్కమూ లేకుండా ఆయనా, తోటి అధ్యయనకారులూ సమయమంతా ధ్యానంలోనే గడిపారట. తమ భోజనాలు తామే వండుకుంటూ దృష్టంతా ధ్యానం మీదే నిలిపి గడిపిన సమయమది. అపుడపుడు సంచార భిక్షువులు వచ్చి బోధనలు చేసేవారట. తాము గుహాధ్యానంలో ఉన్న సమయంలో పెద్ద భూకంపం వచ్చిందనీ, అంత జరిగినా తాము బయటకు వెళ్ళే వీలు లేకపోయిందనీ గుర్తు చేసుకున్నాడాయన. ఏదేమైనా వారికి ఏ హానీ జరగలేదట.

మేమడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన ఓపిగ్గా జవాబులు చెప్పాడు. టిబెటన్ బౌద్ధమతంలో అతి పవిత్రమైన సెరాంగ్ గొంపా 600 సంవత్సరాల క్రితం స్థాపించారట. టిబెటన్ బౌద్ధానికి చెందిన నాలుగు ప్రధాన స్రవంతులలో ఒకటైనదీ, అతి ప్రాచీనమైనదీ అయిన ‘నింగ్మా పా’ సంప్రదాయానికి చెందినదట ఈ సెరాంగ్ గొంపా. స్థానిక మతానుచరులూ, దూరతీరాలనుంచి వచ్చిన యాత్రికులూ కలసి స్థాపించిన గొంపా అది.

ఈ సెరాంగ్ గొంపా నుబ్రీ వ్యాలీ అన్న ప్రదేశంలో ఉంది. ఆ ప్రదేశం క్యీమోలుంగ్ బెయూల్ అన్న ప్రాంతానికి చెందినది. ‘నిగూఢ ఆనందసీమ’ అని దానికి మరో పేరు. టిబెట్ ప్రాంతంలో బౌద్ధధర్మాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేసిన గురు పద్మసంభవునికి ఈ నిగూఢ హిమాలయ లోయలు ఎంతో ప్రీతిపాత్రమయినవట. ఆ లోయలన్నీ దుర్గమ ప్రదేశాలు. బౌద్ధ ధర్మపు అధ్యయనానికి ఈ నుబ్రీ లోయ అతి చక్కని, నిర్మలమైన ప్రదేశం అని పద్మసంభవుడు భావించాడని ప్రతీతి.

శిక్షణకోసం తమ తల్లిదండ్రుల అనుమతితో పరిసర గ్రామాల బాలురు తమ దగ్గరికి వస్తారని వివరించాడు టిన్జెన్. శిక్షణ పొందాక భిక్షువులు, మతాచార్యులు అవడమే అలాంటి వారి లక్ష్యమట. అలా అని వాళ్ళంతా భిక్షువులయి తీరాలన్న నియమమేమీ లేదట. పెరిగి పెద్దయ్యాక వారంతట వారు నిర్ణయాలు తీసుకునే సౌలభ్యమూ ఉందట. వారి శిక్షణలో భాగంగా మత సంబంధిత సాహిత్యమేగాకుండా లెక్కలు, సైన్స్, ఇంగ్లీష్‌లాంటి సాధారణ విషయాలూ ఉంటాయట. అలా ఏడేళ్ళ శిక్షణ తర్వాత – టిన్జెన్ విషయంలో ఇంతకు ముందే వివరించినట్లు – ఆ పిల్లలు తదుపరి స్థాయి శిక్షణకు అర్హత పొంది, ఆ స్థాయిలో మరో మూడేళ్ళు గడుపుతారట. ఆ తర్వాత మరో మూడు నెలలు గుహాంతర్భాగాలలో ఏకాంత ధ్యానం చేశాక భిక్షువు అయ్యే పరిపూర్ణత సాధిస్తారు. ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ అభిరుచుల ప్రకారం సెరాంగ్ గొంపాలాంటి బౌద్ధారామాలలో భాగమయిపోవడమో, లేదా స్థానిక ప్రజల మధ్య జీవిస్తూ ధర్మప్రచారమూ, మతకార్యక్రమాల నిర్వహణలో మునిగిపోవడమో చేస్తూ ఉంటారు. టిబెటన్ బౌద్ధంలో మనిషి పుట్టుకనుంచి మరణంవరకూ అనేకానేక సంప్రదాయ కార్యక్రమాలు ఉంటాయి – వాటి నిర్వహణ శిక్షణ పొందిన భిక్షువులే నిర్వహించడం అన్నది ఒక నియమం. భిక్షువులకు టిబెటన్ సమాజంలో మర్యాదామన్ననలు అపారం – ఆ జీవితాల కేంద్ర బిందువులు ఈ భిక్షువులే.

బౌద్ధ మత సంబంధిత కార్యక్రమాల ప్రభావం టిబెటన్ సమాజంలో చాలా ఎక్కువ. పరిసర గ్రామాలలోని వాళ్ళు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా సెరాంగ్ గొంపా దర్శించి వెళ్ళటం పరిపాటి. అలాగే ప్రతి కుటుంబంనుంచీ కనీసం ఒక బిడ్డనైనా భిక్షుకమార్గంలోకి ప్రవేశపెట్టాలి అన్న అప్రకటిత నియమం వారిలో ఉంది.

అనిత పుట్టినరోజు వేడుకలలో ముఖ్యపాత్ర వహించిన యువభిక్షువు గురించి వాకబు చేసాను. ఇప్పటి ప్రధానాచార్యుల వారసుడిగా గుర్తించబడిన భిక్షువట ఆ యువకుడు. గతించిన మఠాధిపతుల మరుజన్మే ఈ యువకుడు అని అక్కడి వారి నమ్మకం. టిబెటన్ బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఒక మతాధిపతి మరణానంతరం మళ్ళా వారి సమాజంలో ఆయన బాలుడుగా జన్మిస్తాడన్న నమ్మకం ఉంది. భిక్షువులంతా కలసి అలా జన్మించిన బాలుడు ఎక్కడున్నాడో పసిగట్టి, తమ గొంపాలకు తోడ్కొని వచ్చి, తదుపరి మఠాధిపతి అయ్యేందుకు తర్ఫీదు ఇస్తారు.

తనలాగా శిక్షణ పొంది మఠజీవితానికి అంకితమైన వారు ఆయా మఠాలలో ఉండే వేరు వేరు విభాగాలలో పని చేస్తుంటారని చెప్పుకొచ్చాడు టిన్జెన్. తన సంగతే తీసుకుంటే తాను ప్రస్తుతం సెరాంగ్ గొంపాలోని క్యాంటీన్ విషయాలకూ అతిథుల బాగోగులకూ బాధ్యుడినని తెలిపాడాయన. అదిగో ఆ బాధ్యతే ఆయన మాతో ఇంత సమయం గడిపేలా చేసిందన్నమాట. అంతా విన్నాక ఆయనకూ ఆయన తోటి భిక్షువులకూ, వారు మాకు అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి ధన్యవాదాలు చెప్పాం. అనిత తన పుట్టిన రోజు కేక్ గురించి ప్రస్తావించింది. ఆయన చిరునవ్వు నవ్వి ‘మేము సాధారణంగా కేకులలాంటివి, మా వంటింట్లో తయారు చెయ్యం. మీ గైడ్‌లు వచ్చి సందర్భం వివరించినపుడు మేమంతా చర్చించుకుని కేకులాంటి వంటకానికి రూపకల్పన చేసాం. దాన్ని మీరంతా ఇష్టపడినందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అన్నాడు.



హిమాలయన్ థార్‌లు

ముందే అందిన సూచనలకు అనుగుణంగా ఆ గొంపా పరిసరాల్లో హిమాలయన్ థార్‌ల బృందం కనిపించింది. మనవేపున కనబడే పెద్దపాటి గొర్రెల పరిమాణం ఈ థార్ మృగాలది. అవన్నీ గొంపా పరిసర ప్రాంతాల్లో మేత కోసం వస్తూ ఉంటాయట. అపుడపుడు భిక్షువులు వాటికి ఉప్పూ ఆహారం అందిస్తూ ఉంటారట. అంచేత వాటికి మనిషి భయం లేదు. అడవి జంతువులే అయినా మనుషుల్ని చూసి బెదరవు. చిన్నపుడు చూసిన రామాయణం, మహాభారతం ఎపిసోడ్లు గుర్తొచ్చాయి – వాటిల్లోనూ మునివాటికల్లో జింకలూ కుందేళ్ళూ చిలుకలూ పక్షులూ యథేచ్ఛగా తిరుగాడటం గుర్తొచ్చింది.

సెరాంగ్ గొంపాలాంటి అరుదైన ప్రదేశాలకు వెళ్ళినపుడు ఆయా ప్రదేశాలలో వైఫై అందుబాటులో ఉంటే బాగా దగ్గరివాళ్ళకు వీడియో కాల్ చెయ్యడం, ఆయా పరిసరాలనూ వ్యక్తులనీ చూపించడం నాకు అలవాటు. అలా చూపించే వ్యక్తుల్లో మా అమ్మా, నేను యాత్రాగాథలు రాయడానికి కారకుడైన ప్రొఫెసర్ ఆదినారాయణా, వాటిల్ని తెలుగులోకి అనువదించి గొప్ప సహాయసహకారాలు అందిస్తున్న దాసరి అమరేంద్ర ముఖ్యులు. ఆరోజు కూడా అదే ప్రయత్నం చేసాను. అమ్మనూ ఆదినారాయణనూ అందుకోలేకపోయినా అమరేంద్ర సులభంగా వీడియోకు దొరికాడు. ఆయన ఆ సమయంలో వాళ్ళమ్మాయి దగ్గర అట్లాంటా నగరంలో ఉన్నాడు. సెరాంగ్ గొంపా ప్రాంగణాన్ని, పరిసర హిమశిఖరాలనూ వ్యాఖ్యానసహితంగా ఆయనకు చూపించాను. అలాగే మా గైడ్ బాబు గురుంగ్‌నూ, సహ యాత్రికులు అనితలాంటి వాళ్ళనూ పరిచయం చేసాను. గత ఏడాదీ రెండేళ్ళుగా నా హిమాలయ యాత్రలను అనువదిస్తోన్న అమరేంద్రకు వాళ్ళతో చక్కని పరోక్ష పరిచయం ఉంది. అనితతో అయితే ప్రత్యక్ష పరిచయమే ఉంది. వారందరినీ ఆప్యాయంగా పలకరించి మాట్లాడాడు అమరేంద్ర. ‘మీ బృందంలో పదిమందే సభ్యులంటున్నారు. కాదు. ఇదిగో ఇప్పుడు నాతో కలసి పదకొండు’ అని చమత్కరించాడు. చమత్కారాల సంగతి ఎలా ఉన్నా మా మనస్లు ట్రెక్ ముగిసిన తర్వాత ఆ అనుభవాలను అనువదిస్తూ ఆయన నిజంగానే పదకొండో సభ్యుడిగా సహయానం చేస్తున్నాడన్నది అతి చక్కని వాస్తవం. అలా అమరేంద్రను మా బృందపు సభ్యునిగా భావించుకోవడం నాకెంతో సంతోషం కలిగించే విషయం.

ఇక్కడొక మాట చెప్పాలి… ఈ సెరాంగ్ గొంపా అన్నది మనస్లు ట్రెక్ మార్గానికి కాస్తంత పెడగా ఉన్న ప్రదేశం. డెంగ్ నుంచి బయల్దేరాక ఇటు వేపుకు రాకుండా తదుపరి మజిలీ ఘాప్ చేరుకోవచ్చు. తిన్నగా వెళ్ళకుండా సెరాంగ్ వేపు మళ్ళడమూ అంటే మొత్తం యాత్రలో అదనంగా రెండు రోజులు చేర్చడం అన్నమాట. పైగా సెరాంగ్ అన్నది ఎంత మారుమూల ప్రదేశం అంటే, అక్కడి కొండలలో ఎంతగానో తిరిగిన బాబు గురుంగ్ కూడా ఈ చోటకు అప్పటిదాకా రాలేదట. నాలుగుసార్లు మనస్లు ట్రెక్ బృందాలకు గైడ్‌గా వ్యవహరించినా ఈ గొంపా వేపు రానే లేదట. మనస్లు మార్గాన్ని పరిశోధిస్తున్న సమయంలో సెరాంగ్ గొంపా నా కంట పడింది. ఈ విషయం మా టూర్ ఏజెంట్ సూర్య దగ్గర ప్రస్తావించినపుడు “అవునవును, ఆ గొంపా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విన్నాను. నిజానికి నేనూ ఇంతవరకూ వెళ్ళలేదు. మీరు మీ యాత్రలో తప్పకుండా చేర్చండి,” అని ప్రోత్సహించాడు. అలాగే కాలిఫోర్నియాలో ఉండే మరో ట్రెకింగ్ సహచరుడు, రామ్ గుమ్మడి, “నేను వెళ్ళొచ్చాను. ఎంతో బావుంటుంది. తప్పకుండా వెళ్ళండి,” అన్నాడు. అలా సెరాంగ్ గొంపా మా యాత్రా పరిధిలో వచ్చి చేరింది.

నిన్నటి రోజున ఈ గొంపాకు వస్తున్నపుడు ఈ నేపథ్యమంతా మా బృందానికి వివరించాను. అప్పటికే ఆ దుర్గమమార్గంలో అలసిపోయి ఉన్నారేమో, కొంతమంది మొహం చిట్లించారు. ఎవరూ ఏమీ బయటకు అనకపోయినా, “ఇంత కష్టపడి ఒక సామాన్య బౌద్ధమఠం చూడటం కోసం వెళ్ళాలా,’ అన్న అనుమాన వీచిక కొంతమంది మొహంలో గమనించాను. అప్పటికి ఆ ప్రశ్నకు నా దగ్గరా సమాధానం లేదు. అంచేత వారి మనోభావాలను ముందు ముందు పనికివచ్చే ఫీడ్‌బాక్‌గానే పరిగణించాను.

ఒక్కసారి సెరాంగ్ గొంపాలోకి అడుగు పెట్టాక మా అందరి భావనలలోనూ గణనీయమైన మార్పు వచ్చింది. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అపురూపానుభవమది అన్న ఎరుక అందరికీ కలిగింది. ఈ రోజు ఆ ప్రదేశాన్ని వదిలివెళ్ళేటపుడు అందరికీ ఎంతో కొంత బెంగ పుట్టింది. కళ్ళు చెదిరే అందం, మనసు మురిసే ప్రశాంతత, నిండైన ఆధ్యాత్మిక వాతావరణం, భిక్షువుల ఆత్మీయాతిథ్యం, వారిలోని నిరాడంబరత, పరిసర జీవజాలమంతా ఏ ఆందోళనా లేకుండా తిరుగాడగలగడం, టిబెటన్ శైలిలో సాగిన అనిత పుట్టిన రోజు వేడుకలు, పండువెన్నెలలో మెరిసిన వెండికొండలు, ఉదయభానుడు నింపి వదిలిన స్వర్ణవర్ణ పరిమళాలు, తొలి వేకువఝామున వినిపించి నిద్ర లేపిన మంద్ర మంత్రోచ్ఛారణ, ప్రాతఃసమయాన సాగిన భిక్షువుల వరుస, ముఖ్యమందిరంలో జరిగిన ప్రార్థనా కార్యక్రమం, భిక్షువులతో సాగిన మాటామంతీ, వెళుతోన్నపుడు వారినుంచి అందిన వీడ్కోలు &emdash

అవును. జీవితంలో అరుదుగా సంభవించే అనుభవాలివి.


సెరాంగ్ గొంపాలాంటి బౌద్ధమఠాలూ, కేదార్‌నాథ్‌లాంటి శైవపీఠాలూ ఎందుకు అంతంత దూరప్రాంతాలలో ఉంటాయా అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. తిరుపతి, శ్రీశైలంలాంటి చోటికి ఇప్పుడంటే వెళ్ళడం సులభమయింది కానీ ఒకప్పుడు అవీ దుర్గమ ప్రాంతాలే. సామాన్యులు సులభంగా చేరుకోలేని ప్రాంతాలే. బౌద్ధమూ, హిందూమతమూ అనే కాదు; నేను క్రిస్టియన్ మొనాస్టరీలు చూసాను. సూఫీ, జొరొష్ట్రియన్ మతకేంద్రాలు చూసాను – అన్నీ విడివిడిగా, సామాన్యులు అందుకోలేనంత పెడగా ఉండటం గమనించాను. కొంతమంది ఇదంతా దాడులనుంచి రక్షించుకోవడం కోసం అంటారు. కొంతమంది ఆయా ప్రదేశాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతవల్ల అంటారు. ఇంకొందరు ఆయా ప్రాంతాలలోని ప్రశాంత సుందర వాతావరణం అందుకు కారణమంటారు. మరికొందరు, నిజమైన యాత్రికులూ భక్తులూ కష్టపడితేగానీ చేరుకోలేని ప్రదేశాలలో కావాలని వాటిని కడతారంటారు. ఇందులో ఏ ఒక్కటీ పూర్తి కారణం కాకపోవచ్చు. ఈ కారణాలన్నిటి సమ్మేళనమే అందుకు దోహదం చేస్తూ ఉండవచ్చు. నా అనుభవాల ప్రకారం చూస్తే మనం కష్టించి శ్రమించి చేరుకున్నపుడే ఆయా ప్రార్థనాప్రదేశాల మార్మికత, కాంతిమత్త్వం మనకు అవగతమవుతాయి. గమ్యం చేరుకోగలిగామన్న సంతృప్తి ఆయా ప్రదేశాలను నిశితంగా క్షుణ్ణంగా చూసి గ్రహించే శక్తిని ఇస్తుంది. వాటిలోని ప్రతి వివరాన్నీ, ప్రతి అంశాన్నీ గమనించి పరిశీలించి ఆకళింపు చేసుకోవాలన్న ప్రేరణనిస్తుంది. హిందూమతానికి చెందిన తిరుమల, శబరిమల, అమర్‌నాథ్ కావచ్చు… గ్రీస్, ఇథియోపియాలలోని క్రిస్టియన్ మానెస్టరీలు కావచ్చు, మొరాకోలోని ఆట్లస్ పర్వతశ్రేణిలోని సూఫీ కేంద్రం కావచ్చు, ఇరానియన్ ఎడారిలోని ఛక్‌ఛక్ అన్న జొరొష్ట్రియన్ కేంద్రం కావచ్చు – యాత్రికులు ఎంతో కష్టిస్తేగానీ అక్కడికి చేరుకోలేరు. ఒకసారి చేరుకున్నాక ఆయా ప్రదేశాలు వారి మీద చెరగని ముద్ర వేస్తాయి. జీవితాంతం ఆ యాత్రనూ, ఆ ప్రదేశాలనూ గుర్తుంచుకొనేలా చేస్తాయి. ఈ సెరాంగ్ గొంపాయేగానీ అందరికీ అవలీలగా అందుబాటులో ఉన్నట్లయితే మేమంతా దానిని అంత ఆరాధనగా చూసేవాళ్ళమా అన్నది అనుమానమే. ఏదేమైనా మన యాత్రికులమంతా నమ్మే ‘గమ్యంకన్నా గమనం మిన్న’ అన్న త్రికాల సత్యం ప్రార్థనాస్థలాలకూ వర్తించి తీరుతుంది.



వీడ్కోలు

సంతృప్త మానసిక స్థితిలో మేమందరం ఆనాటి ఉదయాన గొంపా దాటి ముందుకు సాగాం. భిక్షువులూ ఆచార్యులూ వచ్చి మా అందరికీ కండువాలు కప్పి సాదరంగా వీడ్కోలు పలికారు. వారిలోని ఆత్మీయభావన మా అందరి మనసులనీ ఆకట్టుకుంది. మాలో కొంతమంది, మరికొన్ని రోజులు ఇక్కడ ఉండి ఉంటే ఎంత బావుండేది అన్నారు. రమేషూ అనిలూ మళ్ళా తప్పకుండా వచ్చి తీరుతాం అన్నారు. నిన్న ‘ఎందుకీ అదనపు ప్రయాస,’ అని మొహం చిట్లించిన వాళ్ళే అందరికన్నా ముందుగా, ‘ఎంత చక్కని అనుభవమిదీ’ అంటూ ధన్యవాదాలు చెప్పారు. ‘ముందు ముందు మనకు ఇంకెంత మహత్తరమైన అనుభవాలు కలుగుతాయో తెలియదుగానీ ఈ సెరాంగ్ గొంపాకు రాకుండా ఉంటే మాత్రం మన యాత్ర అసంపూర్ణంగా మిగిలిపోయేది’ అని అన్నారు.

ఆనాటి మా గమ్యం ఘాప్ గ్రామం. 18 కిలోమీటర్లు. అంతా కలసి వెయ్యి మీటర్ల దిగుడుబాట. బిహి గ్రామం దగ్గర మళ్ళా మా ముఖ్యమార్గంలో చేరి ఘాప్ దిశగా వెళతామన్నమాట… కనీసం ఎనిమిదిగంటలు పడుతుంది. బాగా పెందరాళే బయల్దేరి ఉంటే సులువుగా ఉండేదిగానీ సెరాంగ్ గొంపా ప్రార్థనా కార్యక్రమం, అక్కడి వారితో సంభాషణలు – అంచేత బయల్దేరడమే ఆలస్యమయింది. చీకట్లు ముసిరేలోగా ఘాప్ గ్రామం చేరడమన్నది పెద్ద సవాలే మరి!


బిహి

దిగుడుబాట కదా – వడివడిగానే సాగాం. కానీ వందలాది మెట్లు దిగటమన్నది వేసట కలిగించింది. దారిలో బుధిగండకి నది మీద ఉన్న 280 మీటర్ల వంతెన దాటాం. ఆ ప్రాంతంలో ఉన్న వంతెనలలో అత్యంత పొడవైన వంతెన అది. మాకు ఎదురుగా కంచరగాడిదల సమూహం ఒకటి తటస్థపడింది. అది మమ్మల్ని దాటేదాకా ఆగి ముందుకు సాగాం. దారిలో అనేక వంతెనలు… అవి దాటడంకోసం క్రిందకు దిగడం… మళ్ళా పైకి ఎక్కడం. బిహి గ్రామం చేరేసరికి సాయంత్రం ఐదు అవనే అయింది.

బిహి దాటుకుని బర్ అనే గ్రామం చేరేసరికి చీకటి పడిపోయింది. ఆ గ్రామంలోని టీ హౌస్ దగ్గర కాస్తంత కాళ్ళు చాపుకోడానికి ఆగాం. బాగా నిషాలో ఉన్న ఆ టీ హౌస్ యజమాని మాకు స్వాగతం పలికాడు. తడబడే మాటలతో తనను తాను గోపాల్ తమాంగ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఐదుసార్లు ఎవరెస్ట్ ఎక్కిన మనిషినని చెప్పుకున్నాడు. అతని ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ మాట నమ్మడం ఎవరికైనా కష్టమే! మేమింకా ముందుకు సాగి ఘాప్ దాకా నడవనున్నామని విని బాగా కలవరపడ్డాడు. “వెళ్ళకండి… అదేమంత మంచి పని కాదు. దారి బాగా ఇరుకు. లాండ్ స్లైడ్లు జరిగే అవకాశం ఉంది. ఏమాత్రం క్షేమం కాదు. ఈ రాత్రికి మా టీ హౌస్‌లో ఉండిపొండి,” అని గట్టిగా చెప్పాడు. “నువు చూపిస్తున్న శ్రద్ధ అక్కరలకు వేనవేల ధన్యవాదాలు. మాతోపాటు అనుభవజ్ఞులైన గైడ్‌లు ఉన్నారు. వారి సాయంతో కాస్త కష్టమే అయినా ఎలాగోలా ఘాప్ చేరుకోగలం,” అని అతనికి నచ్చచెప్పి ముందుకు సాగాం.

చీకట్లు బాగా కమ్ముకున్నాయి. అందరం హెడ్‌లైట్లు వెలిగించాం. వెళ్ళేకొద్దీ దారి కష్టంగా మారసాగింది. దారిలో ఒక పెద్దపాటి రాతిగుట్టను దాటవలసి వచ్చింది. దానికి అడ్డంగా ఆ మధ్యే సంభవించిన లాండ్ స్లైడ్ అవశేషాలు… ఆ రాళ్ళూ బండల మధ్య కొత్త మార్గం కనిపెట్టి ముందుకు సాగాం. ముందు ఉన్న మార్గం దుర్గమం కాబట్టి మాకు ఆసరాగా నిలవడానికి రాజు గురుంగ్, చంద్ర అన్న పోర్టర్లను పురమాయించాడు మా బాబు గురుంగ్. రాజు గురుంగ్ అందరికన్నా ముందున ఉండి దారి వెతుకుతూ వెళ్ళాడు. చంద్ర, రేషమ్‌లు అందరికన్నా వెనుక ఉండి మమ్మల్ని నడిపించసాగారు. ఈ రాజు గురుంగ్ హెడ్‌లైట్ వాడడట – నా హెడ్‌లైట్ కాంతినే ఆసరాగా చేసుకుని తన పని చేయసాగాడు. ‘అదేమిటీ? నువ్వూ హెడ్‌లైట్ పెట్టుకోవచ్చుగదా,’ అని అడిగితే, నవ్వేసి ‘నాకు చీకట్లలో వెళ్ళడమే ఇష్టం… అంతకీ అవసరమయితే మొబైల్‌లో ఉండే వెలుగు సాయం తీసుకుంటాను,’ అన్నాడు. మేము వెదుకులాడుతున్న బాట మహా ఇరుగ్గా ఉంది. ఎడమవేపున లాండ్ స్లైడ్ల ప్రభావంనుంచి కాపాడుకోవడానికి పెట్టిన తీగల కంచె… కుడివేపున ఎంతో దిగువన పెద్ద పెద్ద శబ్దాలతో పారుతోన్న బుధిగండకి నది…

మేము నడుస్తోన్న దారి క్షేమం కాదనీ, అడుగు ఏమాత్రం తడబడినా దిగువనున్న బుధిగండకి మాకోసం ఎదురుచూస్తోందనీ మా అందరికీ తెలుసు. అంతా కలసి 30 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న దారి… అడుగడుగూ చూసుకుంటూ వెళ్ళవలసిన దారి… సరిగ్గా అదే సమయంలో నా హెడ్‌లాంప్ పని చెయ్యడం మానేసింది. పులి మీద పుట్ర. అయినా కంగారుపడకుండా తమాయించుకున్నాను. ‘మరేం పర్లేదు. నేనున్నాను గదా,’ అని రాజు గురుంగ్ ధైర్యం చెప్పాడు. చెప్పినట్టే అడుగడుగునా సాయం చేసాడు. తన మొబైల్ టార్చ్ వెలిగించి ఆ చిట్టి వెలుగులో అడుగులు తడబడకుండా చూసాడు. అతని ఆసరాతో కాసేపటికల్లా మరి కాస్త అనువైన ప్రదేశం చేరుకున్నాను. చేరాక నా బాక్‌పాక్‌లో ఉన్న టార్చ్‌లైట్ వెలికి తీసి దాని సాయంతో ముందుకు సాగాను.

అసలా సమయంలో ట్రెకర్లకు శారీరక సామర్థ్యం ఒక్కటే చాలదు. నమ్మకం, ధైర్యం, శ్రద్ధ, జాగరూకత, స్థిరసంకల్పం – ఇవన్నీ ఉంటేనే అలాంటి ప్రమాదకర మార్గాలను అధిగమించగలం. అవన్నీ మా బృందంలో ప్రతి ఒక్కరిలో క్రమక్రమంగా గూడు కట్టుకుని ఉన్నాయి కాబట్టే మేము ఆనాడు ముందుకు సాగగలిగాం. ఇక బాబు గురుంగ్ సారథ్యంలో ఇతర గైడ్లు, పోర్టర్లు అందించిన సహాయం అసామాన్యం.

అలా ఓ గంటసేపు ముందుకు సాగి ఘాప్ గ్రామం చేరుకున్నాం. మరి కాసేపట్లో ‘ఘాప్ కాటేజ్ గెస్ట్ హౌస్’ అన్న మా వసతిగృహంలో స్థిరపడ్డాం. ముందే చెప్పినట్టు ఘాప్ గ్రామం 2080 మీటర్ల ఎత్తున ఉంది. సెరాంగ్‌తో పోలిస్తే 1000 మీటర్లు దిగువన ఉందన్నమాట.


ట్రెకింగ్ దారిలో

ఆనాటి నడక యథాప్రకారం మా అందరినీ అలసటతో ముంచెత్తింది. అయినా అది సంబరాలు చేసుకోవలసిన సమయం. సెరాంగ్ గొంపా అనుభవం పొందిన రోజు… నాలుగు రోజులపాటు ఎన్నెన్నో క్లిష్టతలను దాటుకుంటూ ట్రెకింగ్ కొనసాగించిన సమయం. మాలో దాగి ఉండిపోయిన శారీరక మానసిక శక్తులు వెలికివస్తోన్న సమయం – అవును, సంబరాల సమయం.

మా టీ హౌస్ రిసెప్షన్‌లోని రిఫ్రిజిరేటర్లో బీరు కాయలు కనిపించాయి. ట్రెకింగ్ సమయాల్లో మదిరాపానానికి నేను స్వతహాగా వ్యతిరేకిని. మా బృందాలను కూడా ఆల్కహాల్‌కు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ఆరోజు ప్రత్యేకమయినది అనిపించింది. బాబు, రేషమ్, చంద్ర, రాజు – వాళ్ళ అమూల్యమైన సహాయసహకారాలకు కనీసం ఒక బీరు మగ్గుతోనయినా థాంక్స్ చెప్పడం సరైన పని అనిపించింది. మేమున్నది మరీ అంత ఉన్నతశ్రేణి ప్రదేశంలో కాకపోవడమూ అందుకు సహకరించింది. పైగా మా బృందంలోని వాళ్ళంతా అనుభవం పండిన మనుషులు… పరిమితులు గుర్తెరిగిన వాళ్ళు.

బాబుకూ అతని బృందానికీ బీరు మగ్గులు అందించాను. ‘మీరూ మాతో కలసి ఎంతో శ్రమించారు – మీరూ తీసుకోవడం సమంజసం’ అని వాళ్ళంతా పట్టుపట్టారు. ఒక బాటిల్ అందుకుని మా గదిలోకి వెళ్ళాను.

అప్పటికే గోపి, సురేష్, రమేష్, అనిల్ గదిలో చేరి గట్టిగట్టిగా కబుర్లు చెప్పుకోవడం వినిపించింది. నేను అడుగుపెట్టగానే వాళ్ళంతా నిశ్శబ్దమైపోయి తమ తమ బాటిళ్ళను దాచే ప్రయత్నం చేయబోయారు. నేను నింపాదిగా నా బాటిల్ బయట పెట్టేసరికి నిశ్శబ్దం బద్దలయింది… గదంతా కేరింతలు…

చల్లని బీరు, వెచ్చని నీరు శారీరక శ్రమకు చక్కని ఉపశమనాలు. శ్రమనంతా తుడిచిపెట్టగల దివ్యౌషధాలు. వేన్నీళ్ళ స్నానం ముగించి డిన్నర్ టేబుల్ దగ్గర అందర్నీ కలుసుకున్నపుడు, ‘మనమంతా ఈ నాలుగురోజుల్లో అతి క్లిష్టమైన మార్గాలను అధిగమించాం. రానున్న రోజుల్లో మనం వెళ్ళే దూరాలు తక్కువ అవుతాయి. ఎత్తులు ఎక్కువ అవుతాయి. ఇంత దూరం ఇంత పట్టుదలతో జాగరూకతతో వచ్చిన మీరు ముందున్న బాటలను అవలీలగా దాటగలరని నా గట్టి నమ్మకం,’ అని బాబు గురుంగ్ ప్రకటించాడు. అందరి మనసుల్లోనూ 5160 మీటర్ల ఎత్తున ఉన్న లార్కే పాస్ కనుమ ఆహ్లాదకరంగా కదలాడింది.

మర్నాటి మా గమ్యం నమ్రుంగ్ గ్రామం. నాలుగు గంటల నడక…