3.1 నరమాంస భక్షకుల ద్వీపం
నిశ్చలంగా ఉన్న నీటి మీద ఇథకాకు రాజు అయిన ఒడిస్సియస్, అతని నావికబృందం, విసుగు, విరామం లేకుండా తెడ్లను వేసి తమ ఓడలగుంపును నడుపుతున్నారు. ఒడిస్సియస్ తన అనుచరుల స్థితిని చూసి జాలి పడ్డాడు. తమ తోటి సైనికులలో ఆరుగురిని ఆ సైక్లాప్స్ రాక్షసుడు పొట్టన పెట్టుకున్నాడు. ఇది వారి నైతికస్థితికి ఒక గొడ్డలిపెట్టు. తరువాత బుద్ధి గడ్డితిని, దూరదృష్టి లేకుండా వాయుదేవుడు ఇచ్చిన సంచీ మూతిని విప్పి కొరివితో తల గోక్కున్నారు. ఇప్పుడు గాలి లేక ఈ నడిసముద్రంలో చిక్కడి ఎటూ కదలలేక పన్నెండు పడవలూ సదవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి.
ఒడిస్సియస్ అక్కడి వాతావరణంలో ఉన్న నిస్పృహను అర్థం చేసుకోగలడు. ఎన్ని ఇక్కట్లు ఎదురైనా అతని దృష్టి ఎటూ చెదరకుండా గమ్యం మీదనే ఉంది. ఆ గమ్యం ఇథకా పట్టణం. ఆ పట్టణంలో ఉన్న తన భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్. ఈపాటికి పిల్లడికి పన్నెండేళ్ళు వచ్చి ఉంటాయి. తన తల్లిదండ్రులు? వారింకా బ్రతికే ఉన్నారా?
ఇలా ఆరు దినాలు, ఆరు రాత్రులు, లేశమంత గాలి లేకుండా, కేవలం తెడ్లు వేసి పడవలను నడిపేరు. ఏడవ రోజున విధి కరుణించింది. ఎదురుగా నిగూఢమైన రహస్యాలతో నిండినట్లున్న ద్వీపం కనిపించింది. అక్కడ ఒక కొండ మాటున ఒక సముద్రపు గొంది కనబడింది. ఆ గొందిలోకి వెళితే, సముద్రపు అహంకారాలకు దూరంగా, క్షేమంగా పడవలను నిలుపుకోవచ్చు.
ఇరుకుగా ఉన్న జలమార్గంగుండా వారి ఓడల గుంపు ఆ గొందిలోకి జొరబడింది. ఒడ్డున ఓడలను నిలిపి లంగర్లు దింపి తాళ్ళతో గట్టుకి కట్టేరు. ఒడిస్సియస్ తానున్న మెరుగు మాసిన పడవను మాత్రం మిగతా జట్టుతో కట్టు కట్టకుండా విడిగా గొంది ముఖద్వారం దగ్గర లంగరు దింపి ఉంచేడు.
కొందరు నావికులు బిలబిలా ఒడ్డును చేరుకుంటూ ఉంటే, ఒడిస్సియస్ గట్టుమీద ఉన్న ఒక గుట్టను ఎక్కి పరిసరాలను సింహావలోకనం చేసేడు. దూరంలో మీదికి ఎగసిపడుతూన్న పొగ కనిపించింది. నిప్పు లేకుండా పొగ రాదు. నిప్పును ముట్టించడానికి ఎవరైనా ఉండాలి. “అక్కడ ఎవరు ఉన్నారో?” అని అనుకున్నాడు.
అనుకుని, గుట్ట దిగి, కిందికి వచ్చి, ముగ్గురు నావికులను పిలచి, “ఆ పొగ వస్తూన్న చోట ఎవరు నివసిస్తున్నారో చూసి రండి. మనం వాళ్ళ సుఖశాంతులు కోరేవారమే కాని కీడు తలపెట్టేవారం కాదని చెప్పండి.”
ఆ గూఢచారులు ముగ్గురూ పురమాయించిన పని మీద వెళ్ళేరు. అక్కడ ఒక రాయి మీద ఒడిస్సియస్ కూర్చుని వారి రాకకై ఎదురు చూస్తున్నాడు.
వెళ్ళిన వాళ్ళు వెళ్ళి పూర్తిగా పది నిమిషాలయినా కాలేదు. పెద్ద అరుపులు, పెడబొబ్బలు వినిపించేయి. వెళ్ళిన గూఢచారులలో ఇద్దరు పెద్దగా అరుచుకుంటూ, భయకంపితుల్లా చేతులు ఆడిస్తూ వస్తున్నారు.
“ఏం జరిగింది?” ఒడిస్సియస్ ఆతురతతో అడిగేడు.
భయంతో వణుకుతూ, ఆయాసంతో రొప్పుతూ వాళ్ళు కథనం చెప్పుకొచ్చేరు.
“కిందన ఒక సెలయేరు దగ్గర ఒక అమ్మాయిని కలుసుకున్నాం. ఆ అమ్మాయి తనతో రమ్మని ఆహ్వానించింది. వెళ్ళేం. వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి తల్లి కనిపించింది. ఆమె … ఆమె… ఒక భయంకరమైన, మహాకాయంతో… కొండంత ఎత్తు ఉన్న వ్యక్తి. ఆ అమ్మాయి తండ్రి అటువంటి మహాకాయంతోటే భయంకరంగా ఉన్న మరొక వ్యక్తి. వాళ్ళు నరమాంస భక్షకులు!” గద్గదస్వరంతో చెప్పుకొచ్చేరు.
“ఆ అమ్మాయి తండ్రి మమ్మల్ని చూసి, మాలో మూడోవాడిని చేత్తో పట్టుకుని ఆకాశం అంత ఎత్తుకు ఎత్తిపట్టుకుని, మా ఎదుటే గహ్వరమంత నోటిని తెరచి, అమాంతం నోట్లో పడేసుకుని గుటక వేసేసేడు.”
వాళ్ళు అలా చెబుతూ ఉండగానే ఉరుము ఉరిమినట్లు ఒక పెద్ద బొబ్బరింత వినపడింది.
ఒడిస్సియస్ ఆ శబ్దం వచ్చిన వైపు తలెత్తి చూసేడు. ఎదురుగా ఉన్న ఎత్తయిన కొండమీద మహాకాయుల దండు ఒకటి బారుగా నిలబడి ఉన్నది!
రక్తపిపాసతో ఆ నరమాంసభక్షకులు ఉగ్రరూపం దాల్చి కొండమీద నుండి పెద్ద పెద్ద రాతి బండలను కిందికి విసరడం మొదలుపెట్టేరు.
“పరిగెత్తండి. పడవలు ఎక్కండి. త్వరగా తెడ్లు వెయ్యండి. తెరచాపలు ఎత్తండి. జాగు చెయ్యకండి.” ఒడిస్సియస్ అరిచేడు.
ఒడిస్సియస్ తనతో తీసుకువచ్చిన సిబ్బందితో విడిగా తీసుకువచ్చిన మెరుగు మాసిన పడవ దగ్గరికి ఒగర్చుకుంటూ వడిగా పరిగెత్తాడు.
వారు ఒడ్డున వదిలిపెట్టిన ఓడల గుంపుకు ఆపాటి అదృష్టం కూడా లేకపోయింది. నరమాంసభక్షకుల దండు దండెత్తి ఓడలగుంపు మీద పడింది. వారి పాదాల కింద పడి ఆ పడవలు ఛిన్నాభిన్నం అయిపోయాయి. చాలామంది నావికులు ఈ మారణహోమంలో సమిధలైపోయారు.
ఈ పెనుప్రమాదంనుండి ఆ నావికులను తప్పించే మార్గం తోచక, కనీసం తాను ఉన్న పడవనైనా కాపాడదామనే ధ్యేయంతో పడవలోకి దూకి, కత్తిని దూసి, పడవను గట్టుకు కట్టిన మోకులను కోసి, “జోరుగా తెడ్లు వెయ్యండిరా!” అని నావికులను తోసి, “ప్రాణాలతో బయటపడండిరా!” అన్నాడు ఒడిస్సియస్.
“మమ్మల్ని కూడా రక్షించి మీతో తీసుకుపొండి.” అని మిగిలిన నావికులు గగ్గోలు పెడుతున్నా, వాళ్ళ ఆర్తనాదాలను లెక్క చెయ్యకుండా వెళ్ళడం తప్ప, వెంట తరుముకొస్తున్న నరమాంసభక్షకులనుండి తప్పించుకుని, ప్రాణాలతో బయటపడడానికి వేరే మార్గం కనబడలేదు.
3.2 దేవతల వరప్రసాదం
వెంట తరుముకొస్తున్న నరమాంసభక్షకులనుండి తప్పించుకోడానికి ఒడిస్సియస్ బృందం పడవను జోరుగా సముద్రం మధ్యకు తెడ్లతో తోసుకు వచ్చారు.
తన సహచరుల ఆర్తనాదాలు ఇంకా చెవులలో గింగురుమంటున్నాయి. ఇది తప్పకుండా ఆ సైక్లాప్స్ పాలీఫీమస్ శాప ఫలితమే. ఇంకా ఆ సైక్లాప్స్ సముద్రదేవుణ్ణి వేడుకుంటున్న మాటలు స్పష్టంగా చెవులలో మారుమ్రోగుతున్నాయి: “ఇథకా రాజైన ఈ ఒడిస్సియస్ని శపించు. ఇతను ప్రాణాలతో ఇంటికి చేరకూడదని శపించు. ఇతను సముద్రంలో దారి తప్పిపోవాలి. ఇతని పడవలు సముద్రంలో మునిగిపోవాలి. ఇతను దారి పొడుక్కీ అష్టకష్టాలు పడాలి.”
పన్నెండు పడవల గుంపుతో బయలుదేరిన ఒడిస్సియస్కి ఒక్క పడవ మిగిలింది. తన నావికబృందంలో ఇప్పుడు కేవలం నలభై అయిదుమంది మిగిలేరు.
తమ జట్టుకు అనూహ్యమైన ప్రాణనష్టం కలిగింది. పదకొండు పడవలు సముద్రగర్భంలోకి వెళ్ళిపోయాయి. విచారగ్రస్తులై, మౌనవదనులై, నిర్లిప్తంగా ప్రయాణం చేస్తున్నారు.
చిట్టచివరికి పడవ ఎదుట దట్టమైన చెట్లతో ఒక చక్కని ద్వీపం కనబడింది. పడవను ఒడ్డుకు చేర్చి రాళ్ళతో నిండిన ఇసక దిబ్బలమీద కూలబడిపోయేరు. అక్కడే రెండు రోజులపాటు తమ కర్మనూ, తమకు ఎదురైన ప్రాణనష్టాన్నీ తలుచుకుని, పదే పదే పరితపించేరు.
మూడో దినం సూర్యుడి లేత ఎరుపు రంగుతో కూడిన వెచ్చటి కిరణాల తాకిడికి ఒడిస్సియస్ నిద్ర లేచేడు. పక్షులు తమ గూళ్ళను వదలి గుంపులు గుంపులుగా ఉత్సాహంతో ఎగురుతున్నాయి.
…తన అనుయాయిలు ఇంకా నిద్రపోతున్నారు. అలసి సొలసి ఉన్న వారికి నిద్రాభంగం కలిగించదలుచుకోలేదు. దుఃఖసముద్రంలో మునిగి ఉన్న వారిని ఇప్పుడు లేపి వేటకు వెళ్ళమనడానికి అతని మనస్సు అంగీకరించలేదు. ఇంటికి క్షేమంగా చేరాలంటే వాళ్ళ అవసరం ఉంది…
ఇలా ఆలోచిస్తూ ఒడిస్సియస్ ఒరలో కత్తిని పెట్టి, శూలాన్ని చేత పట్టి వేటకు బయలుదేరేడు.
ఒడుదుడుకుగా వుండే, నిమ్నోన్నతమైన రాతి గుట్టని అతి ప్రయాసతో ఎక్కేడు. దూరంలో పచ్చటి చెట్ల మధ్యనుండి సన్నటి పొగ పైకి లేస్తూ కనబడింది. మహాకాయులు కానీ, నరమాంసభక్షకులు కానీ ఇక్కడ కూడా ఉన్నారా? అతని వెన్నులో వణుకు పుట్టింది. లేక ఇక్కడ నాగరికులు, మర్యాదస్తులు ఉన్నారా? అతని మనస్సులో లేశమంత ఆశ పుట్టింది.
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ముందు తక్షణకర్తవ్యం ఒకటి ఉంది. తమ క్షుద్భాధ తీర్చడానికి ఆహారం కావాలి కదా.
ఒడిస్సియస్ మనస్సులో ఉన్న ఈ ఆలోచనను దేవుడు విన్నట్లు ఉన్నాడు. అదే క్షణంలో ఆ చెట్ల చాటునుండి పెద్ద పెద్ద కొమ్ములతో, పోతరించిన దుప్పి ఒకటి ఎదుట సాక్షాత్కరించింది.
అసంకల్పిత ప్రతీకార చర్యలా ఒడిస్సియస్ చేతిలో ఉన్న శూలాన్ని ఆ జంతువు వైపు విసిరేడు. ఆ శూలాఘాతానికి అది నేల కూలింది. అక్కడ చెట్లనుండి వేలాడుతూన్న లతా రజ్జువులతో ఆ దుప్పి కాళ్ళను కట్టి, దాని కళేబరాన్ని భుజానికి ఎత్తుకుని సైకతస్థలిలో తన దండు ఉన్న శిబిరానికి చేరవేసేడు.
అక్కడ తన అనుయాయిలు, ముసుగులు కప్పుకుని, తలలు దించుకుని, గుంపుగా ఒక చోట చేరి, పోగొట్టుకున్న తోడి నావికులను తలుచుకుంటూ శోకసముద్రంలో మునిగి విలపిస్తున్నారు.
“చూడండి, మిత్రులారా! మనం ఈ దుఃఖంనుండి తేరుకోవాలి. మన ఇల్లు చేరుకోవాలి. ఆత్మసంరక్షణ మన ప్రథమకర్తవ్యం. తన్ను మాలిన ధర్మమూ లేదు. మొదలు చెడ్డ బేరమూ లేదు. కనుక లేవండి. ఇదిగో దేవుడు ఇచ్చిన ప్రసాదం. దీనిని తిని, శక్తిని సంతరించుకుని మన ప్రయాణం కొనసాగిద్దాం.”
ఎదురుగా కనిపించిన దుప్పి మృతదేహాన్ని చూసి, తమ ప్రాణాలను రక్షించడానికి ఒడిస్సియస్ చేసిన పనికి కృతజ్ఞత తెలుపుతూ, ఆ దుప్పిని మంటలలో కాల్చి, అందరూ సుష్టుగా విందు భోజనం చేసేరు.
3.3 మాంత్రికురాలి ఇంద్రజాలం
ఆ దినమంతా ఒడిస్సియస్ బృందం విందు భోజనం ఆరగించడంలోనూ, ద్రాక్ష సారా తాగడంలోనూ కాలం గడిపేరు. పగలంతా తన ప్రతాపం చూపెట్టిన సూర్యుడు పశ్చిమ దిశలోని సముద్రంలోకి క్రుంగుతున్నాడు. పక్షులు గుంపులు గుంపులుగా తమ గూళ్ళకేసి తిరుగు ప్రయాణంలో ఉన్నాయి. సముద్రపుటొడ్డున చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి. కడుపు నిండిన నావికులు భుక్తాయాసంతో కళ్ళు బరువెక్కగా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు.
తెల్లవారింది. ఒడిస్సియస్ అందరినీ నిద్ర లేపేడు. “మిత్రులారా! వినండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో నాకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు. మనం ఉన్నది ఒక ద్వీపం. నిన్న వేటకు కొండ మీదకు వెళ్ళినప్పుడు, చుట్టూ సముద్రం కనిపించింది. ఈ ద్వీపం మీద ప్రాణి సంచారం ఉంది. నేను కొండ ఎక్కినప్పుడు దూరంగా చుట్టలు చుట్టుకుంటూ సన్నటి పొగ పైకి లేస్తూ కనబడింది. అక్కడ ఎవ్వరో ఉన్నారు… “
ఒడిస్సియస్ మాట పూర్తి అవకుండానే, “ఎవ్వరో ఉన్నారో, ఏదో ఉన్నదో ఎవ్వరికి ఎరుక?” అన్నారు ఒకరు. “అక్కడ మరొక సైక్లాప్స్ ఉండొచ్చు! నరమాంసభక్షకులు ఉండొచ్చు!”
“పరుగులు పెడుతూన్న మీ భయాలకు కళ్ళేలు వేయండి.” అని ఒడిస్సియస్ మందలించేడు. ఈ ద్వీపం సానుకూలత పరీక్షించడం తప్ప మనకు మార్గాంతరం లేదు. ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నామో తెలియదు. ఇక్కడనుండి ఇంటికి ఎలా వెళ్ళడమో తెలియదు. పరిచయం లేకపోయినా పరదేశీయుల సహాయం కోరక తప్పదు.”
ఒడిస్సియస్ మాటలను ఎవ్వరూ లెక్క చెయ్యలేదు. వారిలో వ్యాకులత ఎక్కువైంది. ఒడిస్సియస్ మాటలను వినే స్థితిలో వారు లేరు. అప్పుడు ఒడిస్సియస్కి ఒక ఉపాయం తట్టింది.
“నా మాట వినండి. మనం రెండు జట్లుగా విడిపోదాం. ఒక జట్టుకు నేను నాయకత్వం వహిస్తాను. రెండవ జట్టుకు యూరిలోకస్ (Eurylochus; yoo-RIH-loh-kus) నాయకత్వం వహిస్తాడు,” అంటూ ఒకొక్క జట్టులో ఇరవై యిద్దరు సైనికులు ఉండేలా రెండు జట్లు చేసేడు.
“ఇప్పుడు ఈ నాణెం గాలిలోకి ఎగరేస్తాను. బొమ్మ పడితే నా జట్టు, బొరుసు పడితే యూరిలోకస్ జట్టూ ఈ ద్వీపాన్ని అన్వేషించడానికి వెళ్ళాలి.”
బొరుసు పడింది. యూరిలోకస్కి ఇహ మార్గాంతరం లేదు. అతని జట్టుతో పచ్చగా, దట్టంగా ఉన్న ఆ అడవిలో అన్వేషణకు సిద్ధం అయేడు.
అత్యంతమైన అయిష్టంతో ఇరవై యిద్దరు సైనికులు వరసకట్టి యూరిలోకస్ వెనక నిలబడ్డారు. మరణం తథ్యం అనే నమ్మకంతో వారిలో కొందరు కన్నీళ్ళు కార్చేరు.
వెళుతూన్న వారు తిరిగి వస్తారో రారో అనే భయంతో వెనక్కి ఉండిపోయిన రెండవ జట్టు కూడా కంట తడి పెట్టుకున్నారు.
కాలం నత్తనడక నడుస్తోంది. నిమిషాలు గంటల్లా కదుల్తున్నాయి. యూరిలోకస్ రాక కోసం ఒడిస్సియస్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. గాలికి రెపరెపలాడే ఆకుల సవ్వడిలో ఎక్కడైనా యూరిలోకస్ గొంతుక వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించి వింటున్నాడు. ఆ జట్టుని అలా పంపించడం పొరపాటేమో అని లోపల్లోపల స్థైర్యం కోల్పోయి సతమతమవుతున్నాడు. కానీ తన అంతర్మథనం పైకి కనబడితే మిగిలినవారు అధైర్యపడతారని బయటకు బింకంగా ఉన్నాడు.
పశ్చిమాన సూర్యబింబం సముద్రంలోకి దిగిపోయింది. ఆ సంధ్యాసమయంలో దూరాన పాదాల సవ్వడి వినబడింది. పొడుగాటి చెట్లనీడల వెనుక నుండి యూరిలోకస్ బయటపడ్డాడు. ఒంటరిగా తిరిగి వచ్చేడు. అతని కళ్ళలో భీతి ప్రస్ఫుటమవుతోంది.
“ఏమైంది?” అంటూ ఒడిస్సియస్ ముందుకు నడిచేడు. యూరిలోకస్ నోట మాట రాలేదు. వణుకుతూ, మూలుగుతూ, కుప్పలా కూలిపోయేడు.
యూరిలోకస్ భుజాలు పట్టుకుని కుదేస్తూ, “జట్టులో మిగిలిన వాళ్ళు ఏమైయ్యారు? వాళ్ళను వదిలేసి నువ్వు ఒంటరిగా ఎందుకు తిరిగి వచ్చేసేవు?” అంటూ ఒడిస్సియస్ ప్రశ్నల వర్షం కురిపించేడు.
యూరిలోకస్ నుండి ఏ సమాధానం రాలేదు. ఒడిస్సియస్ ఇనుమడించిన ఆతురతతో మళ్ళా అడిగేడు, “చెప్పు. వాళ్ళు బ్రతికున్నారా? చచ్చిపోయారా?”
“లేదు. చచ్చిపోలేదు.” అన్నాడు యూరిలోకస్, “చావు కంటే తుచ్ఛమైన బ్రతుకు బ్రతుకుతున్నారు!”
కొద్దిగా తేరుకున్న యూరిలోకస్ గద్గదస్వరంతో జరిగిన వృత్తాంతం చెప్పుకొచ్చాడు. “మేము కొండలు, కోనలు దాటుకుని ఒక అందమైన లోయలోకి వెళ్ళేం. అక్కడ మిరుమిట్లుగొలిపే కాంతితో మెరుస్తూ ఒక రాతి గోడ కనబడింది. దానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారాన్ని తెరుచుకుని లోపలికి వెళ్ళేం. అక్కడ ఒక విశాలమైన మైదానం కనబడ్డది. ఇంతలో పెద్ద పెద్ద కోరలతో తోడేళ్ళు, బలమైన పంజాలతో పులులు కనిపించేయి.”
“ఆ క్రూరమృగాలు మీ మీద పడ్డాయా?” ఆతురతతో అడిగేడు ఒడిస్సియస్ .
“లేదు. అదే ఆశ్చర్యం! తోడేళ్ళు కుక్కపిల్లల మాదిరి కూనిరాగాలు తీస్తూ మా చేతులు నాకేయి. పులులు పెంపుడు పిల్లుల మాదిరి పంజాలతో మా చేతులు నిమిరేయి. ఆ అసహజమైన వింత ప్రవర్తన చూడగానే మేము మేల్కొని, జాగ్రత్త పడి, వెనక్కి తిరిగి ఉండవలసింది.”
ఈ మాటలు చెబుతూ యూరిలోకస్ జరిగిన దానికి సిగ్గుపడుతూ ముఖాన్ని రెండు చేతుల్లోనూ పెట్టుకుని ఏడ్వడం మొదలు పెట్టేడు. “ఇది ఆవేశానికి సమయం కాదు. తర్వాత ఏమి జరిగిందో చెప్పు.” అంటూ ఒడిస్సియస్ తొందరపెట్టేడు.
ఊపిరి పీల్చుకుని, తేరుకుని, యూరిలోకస్ కథనం కొనసాగించేడు. “ఆ వన్యమృగాలు అలా పెంపుడు జంతువుల్లా మమ్మల్ని పలకరించేసరికి మేము మ్రాన్పడిపోయేం. వాటిని దాటుకుని ఎదురుగా కనిపిస్తూన్న భవనపు లోగిట్లోకి వెళ్ళేం. ఒక గది లోపలనుంచి శ్రవణానందకరమైన సంగీతం వినిపిస్తోంది. ఆ పాట పాడుతూన్న అమ్మాయి కంఠం అతి కోమలం. అంత తియ్యని గొంతు నేనెప్పుడూ వినలేదు.”
“ఎవరా అమ్మాయి?”
“నాకు తెలియదు. మేము కిటికీలోంచి లోపలికి తొంగి చూసేము. అక్కడ ఒక అతిలోక సుందరి ఒక మగ్గం దగ్గర కూర్చుని ఏవో బట్టలు నేస్తూ కనిపించింది. చూడడానికి దివి నుండి భువికి దిగివచ్చిన దేవతలా ఉంది. పిరుదులదాకా వెళ్ళాడుతూన్న జుత్తు సూర్యకాంతిలో ధగధగ మెరిసింది. రత్నఖచితమైన ఆమె దుస్తుల మీద సూర్యరశ్మి పడ్డప్పుడు ఆ కిరణాలు పరావర్తనం చెంది, సప్తవర్ణాలతో ధగధగ మెరుస్తూ ఆమె పాటకు నాట్యం చేస్తూన్నట్లు అనిపించింది. ఆమె నేస్తూన్న వస్త్రం అతి సున్నితంగా, అతి మృదువుగా కనబడింది.”
“తర్వాత?”
“నమ్మశక్యం కాని ఈ దృశ్యాన్ని చూడగానే, ఇందులో ఏదో మోసం ఉన్నదని నా అంతరాత్మ ఘోషించింది. కానీ ఈ సంశయం నా ఒక్కడిలోనే వచ్చింది. మా జట్టు నాతో ఏకీభవించలేదు. నన్ను కాదని, వారంతా ఎలుగెత్తి లోపల పాట పాడుతూన్న అమ్మాయిని పిలిచేరు. ఆ అమ్మాయి తలుపు తీసి బయటకు వచ్చింది. అందరినీ లోపలకు రమ్మని ఆహ్వానించింది. నేను వారిస్తున్నా వినకుండా అందరూ బిలబిలా లోపలకి వెళ్ళేరు. ఆమె తలుపు వేసేసింది. చాటుగా నక్కి ఉన్న నేను మాత్రం లోపల ఏమి జరుగుతోందో ఒక కిటికీ వెనకనుండి చూస్తున్నాను. లోపలకి వెళ్ళిన నా వాళ్ళందరికీ తినడానికి ఆహారం, తాగడానికి మదిరం ఇచ్చింది. నా వాళ్ళు ఈ అతిథి సత్కారాలను అందుకుని ఆనందిస్తూన్న సమయంలో ఆమె వెనక్కి తిరిగి సారా, తేనెతో కలిపిన ఔషధంలాంటిదేదో తయారుచేసి మనవాళ్ళు తినే ఆహారపదార్థాల్లో కలిపింది. మనవాళ్ళకేదో మందు పెడుతున్నదేమోనని అనుమానపడి మన వాళ్ళను హెచ్చరిద్దామని ప్రయత్నం చేసేను. కానీ మన వాళ్ళ దృష్టిని ఆకర్షించలేకపోయాను. ఆమె తయారుచేసిన ఆ మందు కలిపిన పదార్థాలు అనుమానపడకుండా, అభ్యంతరం చెప్పకుండా తినేశారు.
“ఇలా తిన్నారో లేదో, తక్షణం వారిలో మార్పు గమనించేను. వాళ్ళెక్కడ ఉన్నారో వారికి తెలియదు. వారెవరో వారికి తెలియదు. వారి పేరేమిటో వారికి తెలియదు. వారి సహచరుల పేర్లు మరచిపోయారు. వాళ్ళీ స్థితిలో ఉండగా ఆ అమ్మాయి వీరిని ఒక్కొక్కరినీ తన చేతిలో ఉన్న మంత్రదండంతో తాకడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా…”
యూరిలోకస్ గొంతుక మూగబోయింది. నోట మాట లేదు. నొసట చెమట పట్టింది. ఈ పరిస్థితి చూడగానే ఒడిస్సియస్ ఒళ్ళంతా జలదరించింది. ఆ మంత్రగత్తె ఏమి అఘాయిత్యం చేసిందో…
యూరిలోకస్ పెల్లుబికి వస్తూన్న ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని, చెబుతోన్న కథనం పూర్తి చేసేడు. “నా అనుచరుల శరీరాల మీద బిరుసెక్కిన రోమాలు మొలవడం మొదలెట్టాయి. వాళ్ళ తలకాయలు క్రమేపీ కోలబడి, పంది ముట్టె ఆకారంలోకి మారిపోయాయి. వారంతా పందుల్లా గురక పెట్టడం మొదలు పెట్టేరు.”
కథనం వింటున్న శ్రోతలు భయభ్రాంతులై హాహాకారాలు చెయ్యడం మొదలుపెట్టేరు.
“అప్పుడు ఆ మాంత్రికురాలు వాళ్ళను ఒక పందులదొడ్డిలోకి తోలుకుపోయింది. అక్కడ పందులు తినే దుంపలు, జొన్నపొత్తులు నేల మీదకి విసిరింది. వాటి కోసం పందులు కుమ్ములాడుకుని ఆబతో తినడం మొదలు పెట్టేయి. ఆ దృశ్యం చూసినప్పుడు నా కడుపులో దేవినట్లు అయిపోయింది.”
ఒడిస్సియస్ చాలా సేపు కళ్ళప్పగించి యూరిలోకస్ వైపు చూసేడు. తుదకు నిశ్చితమైన మనస్సుతో, “నన్ను అక్కడకి తీసుకెళ్ళు. నాకు దారి చూపించు.” అంటూ లేచేడు.
యూరిలోకస్ ఆరాటంతో ఒడిస్సియస్ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడేడు. “వద్దు. మళ్ళా అటు వెళ్ళవద్దు. ఈ పాపిష్టి ద్వీపం విడచి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని పారిపోదాం. ఆ మాంత్రికురాలి వాత పడ్డామంటే మన గతి ఏమవుతుందో కళ్ళారా చూసేను.”
యూరిలోకస్ని ఓదార్చలేక ఒడిస్సియస్ అన్నాడు. “సరే! ఈ ద్వీపం మీద ఉన్న గ్రీకులందరికీ నేను నాయకుడిని. మిమ్మల్ని రక్షించే బాధ్యత నామీద ఉంది. కనుక నేను ఒక్కడినే వెళ్ళి ఆ పందులదొడ్డిలో పడి మగ్గుతూన్న మన వాళ్ళను తీసుకురావడానికి నా మానవప్రయత్నం నేను చేస్తాను. అక్కడకు వెళ్ళేదారి కూడా నేనే కనుక్కుంటాను.”
3.4 దైవదూత
ఒడిస్సియస్ ఆలస్యం చెయ్యకుండా కరవాలం చేతబుచ్చుకుని ఒంటరిగా బయలుదేరేడు. అతను అలా ఏకాంతంగా అడవిలోకి వెళుతూ ఉంటే అతని అనుచరులు ఖిన్నులయ్యారు. ఒడిస్సియస్ ఆ అడవిలో చెట్ల మధ్యనుండి, చొరవగా దారి చేసుకుని ధైర్యంగా ముందుకు కదిలేడు. ఎదురుగా విశాలమైన పచ్చటి మైదానం కనిపించింది. ఆ మైదానానికి ఆవలి చివర సూర్యకాంతిలో మెరుస్తూ మాంత్రికురాలి భవనం కనబడింది.
ఒడిస్సియస్ ఒక్క నిమిషంపాటు ఆగేడు. ముందుకు వెళ్ళడమా, వెనకకు తగ్గడమా? అదీ అతని ప్రశ్న. ముందుకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు.
ఇంతలో, అకస్మాత్తుగా ఎట్టయెదుట ఒక అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు.
ఒడిస్సియస్ అసంకల్ప ప్రతీకారచర్యగా ఒరనుండి కత్తిని దూసేడు. కానీ కత్తి బయటకి రాలేదు. వెంటనే ఎదురుగా ఉన్న వ్యక్తి సాధారణ మానవుడు కాదనీ, ఒక అసాధారణమైన వ్యక్తి అనీ అతనికి అవగతమైంది. ఏమి ఆ వ్యక్తి ముఖవర్చస్సు! ఆ వ్యక్తి కోటిసూర్య సమప్రభతో ప్రకాశిస్తూన్న వైనం! ఆ వ్యక్తి వైపు ఒడిస్సియస్ చూడలేకపోతున్నాడు.
“ఒడిస్సియస్! నీ ధైర్యసాహసాలను చూసి మెచ్చుకుంటున్నాను,” అన్నాడా వ్యక్తి. “కానీ, నీ ప్రత్యర్థి ఎవ్వరో నీకు తెలుసా? సర్సీ (Circe; SIR-see) పేరు ఎప్పుడూ వినలేదా? ఆమె సూర్యదేవుడు హీలియోస్కీ (Helios; HEE-li-yoos), సముద్ర జలకన్య పెర్సెకీ (Perse; PER-se) పుట్టిన బిడ్డ. ఆమె జగన్మోహిని. మంత్రగత్తె.”
ఒడిస్సియస్ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచేడు. సర్సీ తెలియకపోవడమేమిటి? ఆమె మాంత్రికురాలు. జిత్తులమారి. ఏ మానవుడూ ఆమెను జయించలేడు. ఆమె భవనంలో అడుగు పెడితే, అంతే సంగతులు. అప్రమత్తతతో మెలగకపోతే మిగిలిన వారికి పట్టిన గతే తనకీ పడుతుంది.
“భయపడకు, ఒడిస్సియస్!” అన్నాడు దైవాంశసంభూతుడిలా ఉన్న ఆ ఆగంతకుడు. “సర్సీని గెలిచి, నీ సైనికుల్ని విడిపించడానికి నేను సహాయం చెయ్యడానికే వచ్చాను. హర్మీజ్ (Hermes; HUR-meez) మాటని నమ్ము.”
ఒడిస్సియస్ ఎదుట నిలబడిన వ్యక్తిని మరొకసారి చూసేడు. ఒలింపస్ పర్వతం మీద నివసించే దేవత, హర్మీజ్. చేతిలో ఆ తంబురా. సాక్షాత్తూ దేవతల రాజైన జూస్ కుమారుడు! త్రిలోకసంచారి, బాటసారుల రక్షకుడు. తన ఎదుట నిలబడ్డాడు. తనని రక్షించడానికి వచ్చేడు.
“ఎటువంటి ప్రమాదంనుండైనా నిన్ను రక్షించడానికి నీకొక తావీజు పట్టుకొచ్చేను. ఈ తావీజు లోపల ఒక ఓషధి ఉంది. ప్రకృతిలో దీని ఉనికిని మానవులు గుర్తించలేరు,” అంటూ తన భుజం మీద ఉన్న సంచీనుండి ఒక తావీజుని తీసి, దాని నుండి ఒక ఓషధిని బయటకు తీసేడు హర్మీజ్. చూడ్డానికి అది మల్లెపువ్వులా తెల్లగా ఉంది. “ఈ ఓషధిని తిను. సర్సీ తినడానికిగాని, తాగడానికిగాని నీకు ఏది ఇచ్చినా ఇది దానికి విరుగుడుగా పని చేస్తుంది. సర్సీ నిన్ను మంత్రదండంతో తాకడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నీ ఖడ్గాన్ని దూసి ఆమెను బెదిరించు. నీకు ఏ విధమైన అపకారమూ చెయ్యనని ఆమె చేత ప్రతిజ్ఞ చేయించుకో.” అంటూ ఓషధి ఒడిస్సియస్ చేతికి ఇచ్చి మాయం అయిపోయేడు హర్మీజ్.
ఒడిస్సియస్ కళ్ళప్పగించి, నిశ్చేష్టుడై నిలబడ్డాడు. తను ఇంతవరకూ దేవుళ్ళ ఆగ్రహానికి గురయేడు కానీ అనుగ్రహానికి కాదు; ముందు యుద్ధదేవత అథీనా, తరువాత సముద్రాలకు అధిపతి అయిన పొసైడన్, తరువాత వాయుదేవుడు ఈయోలస్. తను ఎప్పుడు, ఏమి పుణ్యం చేసుకున్నాడో కానీ ఇప్పుడు అవసరానికి హర్మీజ్ వచ్చి ఆదుకున్నాడు.
ఒడిస్సియస్ చేతిలో ఉన్న ఓషధిని చూసేడు. అది మల్లెపువ్వులా తెల్లగా ఉంది. దాన్ని నోటిలో పెట్టుకుని, నమిలి, మింగేసేడు. అప్పుడు ఇనుమడించిన ధైర్యంతో ముందుకు – ఆ మాయలాడి భవనం వైపు – అడుగులు వేసేడు.
3.5 మాంత్రికురాలి మాయదారి భవనం
ఒడిస్సియస్కి ఎదుట మిరుమిట్లుగొలిపే కాంతితో ఒక గోడ కనబడింది. దానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారాన్ని తెరుచుకుని లోపలికి వెళ్ళేడు. అక్కడ ఒక విశాలమైన పచ్చని మైదానం కనబడింది. ఇంతలో పెద్ద పెద్ద కోరలతో తోడేళ్ళు, బలమైన పంజాలతో పులులు కనిపించేయి. వాటిని చూడగానే వెన్నులో వణుకు పుట్టింది.
భయంతో మిళితమైన ఏవగింపుతో ఒడిస్సియస్ ఆ జంతువులను చూసేడు. అవి పెంపుడు జంతువుల మాదిరి దగ్గరికి వచ్చి అణకువతో మెలిగేయి. అప్పుడు అవి వన్యమృగాలు కావనీ, ఒకానొకప్పుడు అవి కూడా తనవంటి మానవులేనని ఒడిస్సియస్కి అవగతమైంది. అందుకనే వాటిని చూసి జాలి పడ్డాడు.
ఆ జంతువులను తప్పించుకుని ఒడిస్సియస్ త్వరగా అడుగులు వేస్తూ ఎదురుగా ఉన్న భవనం చేరుకొని, తలుపు తెరవమని మాంత్రికురాలిని పేరు పెట్టి పిలచేడు.
సత్వరం తలుపు తెరుచుకుంది. ఒక జగన్మోహిని ఎదుట నిలుచుంది. పిరుదుల దాకా వేళ్ళాడే జొన్నపొత్తు జుత్తులాంటి పొడుగాటి జుత్తు మిలమిలా మెరుస్తోంది. రత్నఖచితమైన ఆమె వస్త్రం పాము కుబుసంలా కనిపించింది.
మెల్లగా, సాదరంగా ఆమె ఒడిస్సియస్ని లోనికి రమ్మని ఆహ్వానించింది.
మారుమాట్లాడకుండా ఒడిస్సియస్ లోనికి ప్రవేశించాడు. సర్సీ అతనికి ఉచితాసనం చూపించి కూర్చోమని మర్యాద చేసింది.
“దూరప్రయాణం చేసి వచ్చినట్లు కనబడుతున్నారు. సేద తీర్చుకునేందుకు చల్లటి పానీయం పట్టుకొస్తాను,” అంటూ లోపలి గదిలోకి వెళ్ళింది, ఆమె. మిలమిలా మెరిసే ఒక బంగారు పాత్రతో తిరిగివచ్చి “ఇదిగో, తీసుకొండి.” అంటూ దానిని ఒడిస్సియస్ చేతికి అందించింది.
ఒడిస్సియస్ చేతిలో ఉన్న పాత్రను పెదవుల దగ్గరికి చేర్చి పానీయాన్ని రుచి చూసేడు. అదే సమయంలో సర్సీ తన చేతిలో ఉన్న మంత్రదండంతో ఒడిస్సియస్ శిరస్సుని తాకింది.
తాకుతూ, “బుద్ధిహీనుడా. నువ్వు కూడా నా పందులదొడ్డిలోకి పద.” అన్నది.
హర్మీజ్ ఇచ్చిన ఓషధి పని చేసింది. ఒడిస్సియస్కి ఏమీ కాలేదు. మాంత్రికురాలు అనుకున్నట్లు ఒడిస్సియస్ పందిలా మారిపోలేదు. ఆమె చేసిన పనికి ప్రతీకారంగా ఒడిస్సియస్ ఒర నుండి కత్తిని లాగి మాంత్రికురాలి మెడ మీద పెట్టేడు.
సర్సీ భయంతో ఒక కేక పెట్టింది. “ఎందువల్లో నా మంత్రశక్తి నీ మీద పని చెయ్యలేదు. ఇంతకీ నువ్వు ఎవరు? నీ పేరు ఏమిటి?”
“నా పేరు ఒడిస్సియస్. ఇథకా దేశపు రాజుని.”
“ఆహా. ఒడిస్సియస్ అంటే నువ్వా. నీ పేరు విన్నాను. ఒకప్పుడు హర్మీజ్ చెప్పేడు. ఒకనాడు ఒడిస్సియస్ అనే మహావీరుడు వస్తాడని చెప్పేడు. నువ్వే ఆ ఒడిస్సియస్ అయిన పక్షంలో ఆ కత్తిని పక్కని పెట్టు. మనం ఒకరినొకరు నమ్మి స్నేహితులం అవుదాం.”
ఒడిస్సియస్ కళ్ళు ఎర్రబడ్డాయి. “నిన్ను నమ్మడమా? నీ మాయలను, మహేంద్రజాలాలను ఉపయోగించి నా ఆప్తులను జంతువులుగా మార్చిన నిన్ను నమ్మడమా? నాకు ఏ విధమైన అపకారమూ చెయ్యనని నువ్వు ముందు నా ఎదుట, దేవుని ఎదుట, ప్రమాణం చెయ్యి. నమ్మకం సంగతి తర్వాత చూద్దాం.”
పరాజిత అయిన సర్సీ తల వంచుకుంది. రహస్యంగా మాట్లాడుతున్నట్లు, అతి నెమ్మదిగా, “ఒడిస్సియస్కి ఎప్పుడూ, ఏ విధంగానూ, అపకారం చేయను” అని గొణిగింది. ఒడిస్సియస్ కత్తిని ఒరలో పెట్టిన తరువాత సర్సీ తన పరిచారికలను పిలచింది.
అందమైన జలకన్యలు, వనకన్యలు ఆ భవనం నాలుగు మూలలనుండి బిలబిలా వచ్చేరు. బయట పెద్ద డేగిశా కింద మంట పెట్టి నీళ్ళు కాచేరు. ఒడిస్సియస్ ఒంటికి జిత (Olive) తైలం రాసి మర్దనా చేసి, వేడి నీటిలో స్నానం చేయించేరు. ధరించడానికి మెత్తని కొత్త బట్టలు ఇచ్చేరు. తరువాత ఒడిస్సియస్ని అందంగా అమర్చిన ఒక భోజనశాలలోకి తీసుకెళ్ళేరు.
సర్సీ స్వయంగా బంగారు పాత్రలలో ద్రాక్ష సారా నింపి, ఒడిస్సియస్ని విందు ఆరగించమని కోరింది.
ఒడిస్సియస్ పళ్ళెంలో ఉన్న పదార్థాలేవీ ముట్టనైనా ముట్టలేదు. సర్సీ వైపు కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్నాడు.
“ఒడిస్సియస్! ఏమైంది? నీ కోసం ప్రత్యేకంగా వండించిన భోజన పదార్థాలు. ముట్టనైనా ముట్టలేదు.” సర్సీ నొచ్చుకుంటూ అడిగింది. “భయపడకు. నీకు ఏ రకమైన హానీ కలిగించనని హామీ ఇచ్చేను కదా.”
ఒడిస్సియస్ ఆమె వైపు తీక్షణంగా చూసేడు.
“నేను మా దండుకు నాయకుడిని. నా అనుచరులందరూ నీ బందెలదొడ్డిలో పందులుగా బందీలయి ఉండగా నేను ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ విందు ఆరగించగలను?”
సర్సీ ఒక్క క్షణం పాటు అతన్ని తీక్షణంగా చూసింది. నిండుగా నిట్టూర్పు విడిచింది. మారుమాట్లాడకుండా లేచి నిలబడింది. తన మంత్రదండం చేతబుచ్చుకుని నెమ్మదిగా వాకిట్లోకి నడచి వెళ్ళింది.
ఒడిస్సియస్ మౌనంగా ఆమెను అనుసరించేడు. సర్సీ పందులు ఉన్న దొడ్డి తలుపులు తెరచింది. గుఱ్ఱుగుఱ్ఱుమని ఘుర్ఘురిస్తూ బిలబిలా పందులు బయటకి వచ్చేయి. ద్రవరూపంలో ఉన్న ఏదో ఔషధము వాటి ముట్టెల మీద పోసి, మంత్రదండంతో వాటిని తాకింది, సర్సీ. వెంటనే ఆ పందుల ముట్టెల మీద ఉన్న పొడుగాటి ముతక రోమాలు రాలిపోయాయి. పంది ముట్టెలు మానవ మూతులుగా మారిపోయాయి. పందులన్నీ తిరిగి మనుష్యులుగా మారిపోయాయి. వారు వెంటనే ఒడిస్సియస్ని కౌగలించుకుని ఆనందబాష్పాలు రాల్చేరు. సముద్రపుటొడ్డున ఉండిపోయిన రెండవ జట్టులో ఉన్న సైనికులు క్షేమమేనా అని అడుగుతూ కొందరు వెక్కి వెక్కి ఏడిచారు.
హృదయవిదారకమైన ఈ దృశ్యం చూసి సర్సీ కూడా చలించింది. “ఒడిస్సియస్! వెనక్కి వెళ్ళి మీ నావికుల దండు అందరినీ విందుకి తీసుకురా. నేను ఎవ్వరికీ ఎటువంటి హాని చెయ్యనని హామీ ఇస్తున్నాను.”
ఒడిస్సియస్ మాయదారి భవనం వదలి, వచ్చిన దారి వెంబడే తిరిగి వెనక్కి వెళ్ళి, తాను ఒడ్డున వదలిపెట్టి వచ్చిన నావికుల దండుని కలుసుకున్నాడు. నాయకుడు ప్రాణాలతో తిరిగి రావడం చూడగానే అక్కడి వారి ఆనందానికి హద్దులు లేవు. కేరింతలు కొట్టేరు. వారి నాయకుడిని వాటేసుకుని ఎగిరి గంతులు వేసేరు.
“మన అదృష్టం కొద్దీ హర్మీజ్ సహాయంతో సర్సీ మంత్రమహిమను ఛేదించగలిగేను. మీ సహచరులందరూ మళ్ళా తిరిగి మానవరూపంలోకి మార్చబడ్డారు. మీరందరూ నాతో రండి. వాళ్ళను కలుసుకుందురుగాని.”
కొందరు గ్రీకులు భయంతో వెళ్ళడానికి సంశయించేరు.
“పరవాలేదు. మీ క్షేమానికి నా హామీ ఇస్తున్నాను. సర్సీ మిమ్మల్ని అందరినీ ఆదరిస్తానని హామీ ఇచ్చింది. భయం వలదు.”
గ్రీకు వీరులందరికి ఎట్టకేలకు ధైర్యం వచ్చింది. ఒడిస్సియస్తో సర్సీ మంత్రాల భవనానికి వెళ్ళడానికి సుముఖత చూపించేరు. వాళ్ళ పడవను ఒడ్డు మీదకి లాగి, వారి సరంజామాను ఒక గుహలో భద్రపరచి, ఒడిస్సియస్ని అనుసరించి, పచ్చటి చెట్ల మధ్యనుండి ప్రయాణం చేసి, మిరుమిట్లుగొలిపే కాంతితో మెరుస్తూన్న సర్సీ భవనం చేరుకున్నారు.
సర్సీ వచ్చినవారందరికీ అతిథి సత్కారాలు చేయమని వనకన్యలకు ఉత్తర్వులు జారీ చేసింది. వనకన్యలు సైనికులందరి చేత జితతైలంతో అభ్యంజనం చేయించి, వెచ్చటి నీటితో స్నానాలు చేయించి, నూతన వస్త్రాలు ఇచ్చి, అందరినీ భోజనశాలలోకి తీసుకువచ్చి, ఉచితాసనాలలో కూర్చోపెట్టేరు.
విందులో ప్రసంగిస్తూ ఒడిస్సియస్ని ఉద్దేశిస్తూ సర్సీ ఇలా వేడుకుంది: “మీరు ఇథకా వదలిపెట్టి పదేళ్ళు దాటింది. ఈ మధ్య కాలంలో యుద్ధాలు చేసేరు, సముద్ర ప్రయాణంలో ఎనలేని ఇక్కట్ల పాలు పడ్డారు. ఇప్పుడు ఆరోగ్యం, బలం, కోలుకుందుకి మీకు కాసింత విశ్రాంతి అవసరం. నా దగ్గర, నా భవనంలో ఉండి, నా ఆతిథ్యం స్వీకరించి, విశ్రాంతి పొందమని అడుగుతున్నాను.”
ట్రోయ్లో జరిగిన భీకరయుద్ధం, ఆ తరువాత పీడకలలాంటి అనుభవాలతో కూడిన సముద్రయానం, భీకరాకారులు, నరమాంసభక్షకులు, తన అనుయాయులు ఎదుర్కున్న దారుణమైన మరణాలు ఒకసారి తలుచుకుంటే ఒడిస్సియస్కి తన జబ్బలో శక్తి,, మనస్సులో ఆశ సన్నగిల్లినట్లు అనిపించింది.
“నా ఆతిథ్యం స్వీకరించి కొన్నాళ్ళపాటు ఇక్కడ ఉండి శారీరకంగానూ, మానసికంగానూ బలపడ్డ తరువాత వెళ్ళండి.” అని మరొకసారి అడిగింది సర్సీ. “మీరంతా కోలుకున్న తరువాత మీ తిరుగు ప్రయాణం తేలికగా అయేటట్లు నేను సహాయం చేస్తాను.”
ఇంతవరకూ తాను ఎదుర్కున్న కష్టనష్టాలను తలుచుకుని, తాను అక్కడ కొన్నాళ్ళు ఉండడమే శ్రేయస్కరం అని ఒడిస్సియస్ నిశ్చయించేడు.
3.6 మరొక ప్రయాణం
ఒడిస్సియస్, అతని సైనికులు మాంత్రికురాలి ఆతిథ్యం స్వీకరిస్తూ, ఆ అందమైన భవనం అందించే సదుపాయాలను అనుభవిస్తూ ఉత్సాహంగా కాలం గడుపుతూ, మంచి ఆహారం, మాదకద్రవ్యాలు సేవిస్తూ మంచి ఉషారుగా ఉన్నారు. కాలగమనం వారికి తెలియలేదు. దినాలు దొర్లిపోయాయి. వారాలు గడచిపోయాయి. నెలలు దాటిపోయాయి. ఇలా ఒక సంవత్సరం గడిచిపోయిన తరువాత ఒడిస్సియస్ బృందంలో నావికుడు ఒకతను అందరిని ఉద్దేశించి అడిగేడు:
“ఏడాది గడచిపోయింది. మనం ఇటుపైని కదిలితే బాగుంటుందేమో?”
“మన ఊరు ఇథకాని మరచిపోయినట్లున్నాము.” అని మరొకరు.
“మన దేశాన్ని మళ్ళా చూస్తామా? బాగుందని ఇక్కడే ఉండిపోతామా?” అని వేరొకరు.
ఈ వ్యాఖ్యలు విన్న తరువాత ఒడిస్సియస్ హృదయం చలించిపోయింది. గభాల్న భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్ స్మృతిపథంలో మెదిలేరు. వెనువెంటనే వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేరు. వారింకా బ్రతికి ఉన్నారో? లేదో?
ఒడిస్సియస్ వెంటనే సర్సీ గదిని సమీపించి, “నీ దయవల్ల నా వాళ్ళంతా బాగా కోలుకున్నారు. వారి కండరాల్లో బలం పుంజుకుంది. ఇప్పుడు మా ప్రయాణం కొనసాగించగలం. మా తిరుగు ప్రయాణం సజావుగా, క్షేమంగా ఉండేటట్లు చూస్తానని మాట ఇచ్చేవు. ఆ వాగ్దానం మరచిపోవద్దు.”
“ఇచ్చిన మాట జవదాటే వ్యక్తిని కాను. తప్పకుండా సహాయం చేస్తాను. నా సహాయం అందుకునే లోగా మీరంతా వేరొక ప్రయాణం చెయ్యవలసిన పని ఉంది. థీబ్స్ (Thebes; THEEBZ) నగరంలో టైరీసియస్ (Tiresias; ty-REE-sih-us) అనే అంధ భవిష్యద్వాచకుడు ఉన్నాడు. అతని సలహా మీరు పాటించాలి. అతనొక్కడే మీరు క్షేమంగా ఇంటికి చేరుకునే కిటుకు చెప్పగలడు.”
“పెద్ద చిక్కే వచ్చిందే. థీబ్స్ నగరానికి చెందిన టైరీసియస్ ఎప్పుడో చచ్చిపోయాడు కదా!”
“నిజమే. ఇప్పుడు టైరీసియస్ లేడు. కానీ అతని వివేకం ఇంకా ఈ భూమి మీద బ్రతికే ఉంది.”
“నాకు అర్థం కావటం లేదు. ఎప్పుడో చచ్చిపోయి, మరో లోకంలో ఉన్న వ్యక్తి ఈ భూలోకంలో బ్రతికున్న వ్యక్తికి ఎలా సలహా ఇవ్వగలడు?”
“అందుకనే నువ్వు ముందస్తుగా మరణించిన వారి లోకానికి వెళ్ళాలి. అక్కడ నువ్వు టైరీసియస్ ప్రేతాత్మతో మాట్లాడాలి.”
ఒడిస్సియస్ నోట మాట రాలేదు. ప్రాణం ఉన్న ఈ బొందెతో దేవదేవుడు జూస్ సోదరుడైన హేడీస్ (Hades; HAY-deez), అతని దేవేరి, జూస్ కూతురు అయిన పర్సెఫొనీ (Persephone; pur-SEF-oh-nee) అజమాయిషీలో ఉన్న మృతుల ఆవాసమైన ఆ పాతాళ ప్రదేశానికి వెళ్ళడమా?
“మానవులెవ్వరూ మరణించిన వారి నివాసమైన అధోలోకానికి ప్రాణాలతో వెళ్ళడం నేను వినలేదు” అన్నాడు, అతి నెమ్మదిగా. “అక్కడకి ఆత్మలే వెళ్ళగలవు. ఏ పడవలో వెళితే నేను అక్కడకి చేరగలను? ఏ పవనం వీచి నన్ను అక్కడకు చేరవేస్తుంది?”
“మృతుల ఆవాసమైన ఆ అధోలోకానికి నిన్ను ఏ పడవా తీసుకుని వెళ్ళలేదు.” అని చెప్పింది సర్సీ. “ఈ భూప్రపంచాన్ని చుట్టుముట్టి ఓషనస్ (Oceanus) అనే మహాసముద్రం ఉంది. నిన్ను ఉత్తరపు గాలి ఆ మహాసముద్రపు అంచుల దగ్గరికి తీసుకుని వెళుతుంది. ఆ మహాసముద్రపు ఆవలి గట్టున మృతుల ఆవాసమైన అధోలోకం ఉంది.”
“అక్కడకు వెళ్ళి నేను ఏమి చెయ్యాలి?”
“పడవ దిగి, పచ్చని తోటగుండా కాలి నడకన కొంత దూరం వెళ్ళాలి. అక్కడ శోకా నది, జ్వాలా నది అనే రెండు నదుల సంగమస్థానం కనబడుతుంది. అక్కడ ఒక గోతిని తవ్వి, ఆ గోతిలో పాలు, తేనె, మదిరం, బార్లీ గింజలు ప్రేతాత్మలకు ఆహారంగా నైవేద్యం పెట్టు. తరువాత రెండు గొర్రెలను బలి ఇచ్చి, వాటి రక్తంతో ఆ గోతిని నింపు. అప్పుడు టైరీసియస్ ప్రేతాత్మ వచ్చేవరకు అక్కడే కాసుకుని ఉండు. ఆ ప్రేతాత్మ ఆ గోతిలో ఉన్న ఆహారాన్ని తినేవరకు వేచి ఉండు. అప్పుడు ఆ ప్రేతాత్మ తనంత తానే నీకు ఇథకా చేరుకునే మార్గం చెబుతుంది.”
ఒడిస్సియస్ నిశ్చేష్టుడై, తల వంచుకుని వింటూ నిలబడి ఉన్నాడు. ఎప్పటికైనా ఇథకా చేరుకోవాలంటే, ఎప్పటికైనా తన భార్యను, పిల్లాడిని తిరిగి చూడాలను ఉంటే, ఈ భయానకమైన ప్రయాణం చెయ్యక తప్పదని అతనికి తెలుసు. ధైర్యాన్ని కూడగట్టుకుందుకి ప్రయత్నించేడు. తాను తన అనుచరులకు ‘ధైర్యమే విజయానికి మొదటి మెట్టు’ అని ఎన్నిసార్లు బోధ చెయ్యలేదు? సర్సీ వైపు తిరిగి తల పంకిస్తూ తన అంగీకారాన్ని మౌనంగా తెలియజేసేడు.
వెనువెంటనే, మరో మాట మాట్లాడకుండా, పరదాను భుజం మీద వేసుకుని, ఆ మంత్రగత్తె ప్రాసాదంలో విశ్రమిస్తూన్న తన సహచరులను, ఒకొక్కరినే, లేవగొడుతూ, “లేవండి. పదండి ముందుకు. ఈ ప్రాసాదాన్ని విడచి మన పనిలో మనం పడాలి.” అని తొందర పెట్టసాగేడు.
ఇన్నాళ్ళకు ఇంటి ముఖం పడుతున్నామన్న సంతోషంతో, ద్విగుణీకృతమైన ఉత్సాహంతో, అందరూ ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. ప్రాసాదాన్ని వదలిపెట్టి పడవ దగ్గరికి వచ్చేరు.
“అతి త్వరలోనే మనం ఇంటి ముఖం పట్టబోతున్నాం. కానీ ఇంటికి వెళ్ళే ముందు మరొక చిన్న కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. ముందు మనం మృతుల ఆవాసమైన అధోలోకానికి వెళ్ళి, అక్కడ టైరీసియస్ అనే భవిష్యద్వాచకుడితో మాట్లాడాలి.”
ఈ మాటలు వినగానే ఒడిస్సియస్ అనుచరులు నీళ్ళుగారిపోయేరు. కొందరు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తపరిచేరు. మార్గాంతరం లేదని ఒడిస్సియస్ నచ్చజెప్పేడు.
“మనం ఇంటికి క్షేమంగా చేరుకోడానికి మార్గం టైరీసియస్ ఒక్కడికే తెలుసు. ఆ టైరీసియస్ అధోలోకంలో ఉన్నాడు. అక్కడికి ఒక్కడినీ వెళ్ళాలంటే అదోలా ఉంది. మీరంతా నాకు సాయం రాండి.“
నాయకుడిని కాదనలేక, మానసికక్షోభతో తలలు వంచుకుని, అందరూ మౌనంగా పడవను సిద్ధం చేసి, ఎవరి స్థానాలలో వారు సర్దుకున్నారు.
పడవ కదిలింది. నౌకాశ్రయం దాటింది. తెరచాపలు ఎత్తేరు. ఉత్తరపు గాలి సహాయంతో పడవ పరుగులు తీసింది.
3.7 మృతుల లోకం
సూర్యుడు అస్తమించి, చీకటి పడే వేళకి ఒడిస్సియస్ నావికబృందం సముద్రం అంతం అయే ప్రదేశానికి వచ్చేరు. అక్కడ సముద్రాన్ని చుట్టబెడుతూ ప్రవహించే లోతైన నీలిరంగు ఓషనస్ నది కనబడింది. ఆ నదిని దాటుకుని ఆవలి తీరంలో ఉన్న మృతుల ఆవాసమైన అధోలోకానికి చేరుకున్నారు.
అక్కడ ఒక వారగా పడవను గట్టుకు కట్టి, కాలి నడకని ప్రయాణం చెయ్యడానికే సమకట్టేరు. ఆ పొగమంచులో, ఆ చలిలో, దయ్యాలు తిరిగే ఆ మరుభూమిలో, వారికి వెన్నునుండి వణుకు పుట్టుకొస్తూంటే కాలు కదలదే! వాళ్ళకేమిటి, వారి నాయకుడు ఒడిస్సియస్కే భయంతో ఒళ్ళు కంపరమెత్తుతోంది. అయినా తప్పదు. ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనకాడితే ఎట్లా? తెగించి పడవలోని కాలు ఒడ్డు మీద పెట్టేడు. రెండు గొర్రెలను తోలుకుని తనని అనుసరించమని తోడి సైనికులకు ఆజ్ఞ నిచ్చేడు.
ఒడిస్సియస్, అతని సైనికులు బూరుగు తోటలు (poplars), జలమాల తోటల (willows) గుండా చీకటిలో ప్రయాణించి రెండు నదులు కలుసుకునే సంగమస్థానం దగ్గర ఆగేరు. అవే శోకా నది, జ్వాలా నది అయుంటాయని ఊహించేరు. అక్కడ సూర్యకిరణాల తాకిడికి నోచుకోని ఒక చీకటి మూలన ఒడిస్సియస్ ఒక అగడ్తను తవ్వేడు. దాంట్లో తమతో తెచ్చిన పాలు, తేనె, మదిరం, బార్లీ గింజలు ప్రేతాత్మలకు ఆహారంగా నైవేద్యం పెట్టేడు. అప్పుడు తమతో తీసుకువచ్చిన రెండు గొర్రెలను బలి ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చేడు.
బలి పశువుల రక్తం ఆ అగడ్తలో పడడమే తడవుగా ఆ మంచుతెరల మధ్యనుండి ప్రేతాత్మలు పుంఖానుపుంఖంగా కనబడడం మొదలయింది. పురుషులు, స్త్రీలు, సైనికులు, కవచ శిరస్త్రాణాలతో వీరులు, భగ్నప్రేమికులు, ఇలా వందల, వేల సంఖ్యలో ప్రేతాత్మల ప్రదర్శన మొదలయింది.
రుధిరం ఆఘ్రాణించి కాబోలు వింతైన రోదన శబ్దాలతో కొన్ని ప్రేతాత్మలు గ్రీకు సైనికుల వైపు సందేహాస్పదమైన ధోరణితో దండెత్తి వస్తున్నాయి.
వారి ధోరణి చూసి ఒడిస్సియస్, అతని అనుచరులు భయకంపితులయ్యారు. ఒడిస్సియస్ ముఖం భయంతో పాలిపోయింది. అసంకల్పంగా తన కరవాలాన్ని ఒరనుండి బయటకి లాగేడు.
ప్రేతాత్మల ప్రదర్శన ఇలా జరుగుతూ ఉండగా ఒడిస్సియస్ మాత్రం తాను తయారు చేసిన అగడ్తను అప్రమత్తంగా కాపలా కాస్తున్నాడు. అకస్మాత్తుగా అతని దృష్టి ఒక ప్రత్యేకమైన ప్రేతాత్మ మీద పడింది.
తన వీక్షణ పరిధిలో కనిపించిన ఆ ప్రేతాత్మను భయపడుతూ చూసేడు. అది అతని మాతృమూర్తి ప్రేతాత్మ!
3.8 ఇది నీడా? కలా?
మాతృమూర్తి ప్రేతాత్మను చూసి ఒడిస్సియస్ విలవిలా విలపించేడు. తన తల్లిని చూసి పదేళ్ళు దాటిపోయింది. ఎప్పుడో ట్రోయ్ యుద్ధానికి వెళ్ళే సమయంలో ఇథకాలో చూసేడు. తన తల్లి మరణించిందన్న వార్త ఎప్పుడు వినవలసి వస్తుందో అని ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు. ఆ భయం ఇప్పుడు నిజం అయింది.
తల్లిని పేరు పెట్టి పిలిచేడు. కానీ తల్లి ప్రేతాత్మ పలకలేదు. ఆమె తనని గుర్తు పట్టినట్లు కూడా లేదు. ఆమె దృష్టి అంతా తాను తవ్విన అగడ్తలో ఉన్న గొర్రె రక్తం రుచి చూడాలనే ధ్యాస మీదనే ఉన్నట్లు అనిపించింది.
ఇంత దుఃఖంలోనూ ఒడిస్సియస్ చేయి కత్తిని ఎత్తి పట్టుకుని తయారుగా ఉన్నాడు. తల్లి ప్రేతాత్మని అగడ్త దరిదాపులలోకి రాకుండా అప్రమత్తంగా కాపలా కాస్తున్నాడు – టైరీసియస్ ప్రేతాత్మ వచ్చేవరకు.
ఎట్టకేలకు, ఆ మంచుతెరల నడుమన క్రమంగా రూపుదిద్దుకొని ఒక ముదుసలి ఆకారం ఒడిస్సియస్కు కనిపించింది. అది అంధుడైన టైరీసియస్ ప్రేతాత్మ. ఒక చేతిలో బంగారు రాజదండంతో ఆ ఆకారం గాలిలో తేలుతూ గొర్రె రక్తంతో నిండిన అగడ్త వైపు కదిలింది. ఒడిస్సియస్ కత్తిని కిందికి దింపి ఆ ఆకారాన్ని అగడ్తలో ఉన్న రక్తాన్ని తాగనిచ్చేడు.
ఆ ప్రేతాత్మ కడుపు నిండా ఆ గొర్రె రక్తం తాగిన తరువాత ఒడిస్సియస్ వైపు తిరిగి అన్నాడు: “ఒడిస్సియస్! నీ తిరుగు ప్రయాణం గురించి అడగడానికి ఇక్కడకు వచ్చేవు. ఒలింపస్ పర్వతం మీద ఉన్న దేవతలు నీ ప్రయాణానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. తన కొడుకు సైక్లాప్స్ని గుడ్డివాడిని చేసేవని పోసైడన్ నీమీద చాల కోపంగా ఉన్నాడు.”
ఈ మాట వినగానే ఒక నిరుత్సాహ తరంగం ఒడిస్సియస్ని ముంచెత్తింది. సైక్లాప్స్ ఇచ్చిన శాపం తనని వదిలిపెట్టడం లేదన్నమాట.
“ఆశ వదులుకోకు.” ప్రేతాత్మ ఇంకా చెబుతోంది. “నువ్వు ఇథకా చేరుకోవాలంటే నేను చెప్పబోయే సలహాను తు చ తప్పకుండా పాటించాలి. నీ తిరుగు ప్రయాణంలో నీకు సూర్యదేవుడి ద్వీపం తగులుతుంది. ఈ ద్వీపం మీద చాలా పశువులు, గొర్రెలు ఉంటాయి. అవి సూర్యదేవుడివి. వాటికి మీరెవ్వరూ ఏ విధమైన అపకారమూ చెయ్యకూడదు. వాటిని చంపడానికి ప్రయత్నిస్తే మీకు చేటు కలుగుతుంది. ఈ ఉపద్రవంనుండి నువ్వొక్కడివే తప్పించుకోగలవు. నువ్వు తప్పించుకోవడం జరిగితే మాత్రం నువ్వు అన్ని విధాలా చితికిపోయినవాడివి అవుతావు. నీకు ఇంట్లో సుఖశాంతులు ఉండవు. కానీ, చివరికి నీ భార్యని, కొడుకుని కలుసుకుంటావు.”
ఒడిస్సియస్ తల పంకించేడు.
“నీ వారందరికీ మరీ మరీ చెప్పు. ఆ పశువుల మీద, గొర్రెల మీద చెయ్యి వెయ్యడానికి కూడా వీలు లేదు,” ప్రేతాత్మ మరొకసారి ఉద్ఘాటించింది. “నా యీ మాటను అతిక్రమించేరో, మీకు ముప్పు తప్పదు.”
ఇలా చీకు ముదుసలి టైరీసియస్ ప్రేతాత్మ ఇచ్చిన హితోపదేశానికి ఒడిస్సియస్ కృతజ్ఙత తెలిపేడు. సూర్యదేవుడి పశువులకు ఏ విధమైన హాని కలగకుండా చూడమని తన సిబ్బందికి పదేపదే చెప్పేడు.
టైరీసియస్ ప్రేతాత్మ కదలి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, “ఒక్క నిమిషం. మరొక్క ప్రశ్న, ….”
ప్రేతాత్మ ఆగేడు.
“నా తల్లి ప్రేతాత్మ ఎందుకు నాతో మాట్లాడడం లేదు? నేను పేరు పెట్టి పలకరించినా మౌనంగానే ఉండిపోయింది.”
“నీ తల్లి ప్రేతాత్మ పోషణ లేక చాలా నీరసంగా ఉంది. అగడ్తలో ఉన్న రక్తం తాగనియ్యి. అప్పుడు బలం పుంజుకుని మాట్లాడుతుంది.”
ఇలా చెబుతూ టైరీసియస్ యొక్క ప్రేతాత్మ అక్కడ ఉన్న చల్లని పొగమంచులో కలిసిపోయి అదృశ్యం అయిపోయింది.
అప్పుడు ఒడిస్సియస్ తల్లి ప్రేతాత్మను పిలచి అగడ్తలో ఉన్న రక్తాన్ని తాగమని ఆహ్వానించేడు.
ఆమె గొర్రె రక్తాన్ని తాగగానే కొంత శక్తి పుంజుకుని ఒడిస్సియస్ వైపు తిరిగి కెవ్వుమంది.
“నాయనా! నువ్వు ఈ ప్రేతాత్మల లోకానికి ఎందుకు వచ్చేవు? నువ్వు బ్రతికే ఉన్నావా?”
తల్లి ప్రేతాత్మకు తన రాకకు కారణాన్ని, జరిగిన కథని క్లుప్తంగా చెప్పుకొచ్చిన పిమ్మట భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్ల యోగక్షేమాలు చెప్పమని అడిగేడు, ఒడిస్సియస్. “పెనలొపీ నన్ను మరిచిపోయి మరెవరినైనా పెళ్ళి చేసుకుందా? నా తండ్రి ఇంకా బాగానే ఉన్నారా?”
“వీ వాళ్ళంతా బాగానే ఉన్నారు కానీ, కష్టాలు పడుతున్నారు. నీ భార్య నీ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తూంది. మరొక వివాహం ప్రసక్తే లేదు. నీ కొడుకు ధైర్యవంతుడు. వయస్సులో చిన్నవాడైనా నీ ఇంటిని, నీ పాడిపంటలను, తన తల్లిని బాధ్యతతో చూసుకుంటున్నాడు. నీ తండ్రి పట్టణం విడచి, వానప్రస్థంలో, ఒంటరిగా జీవిస్తున్నారు. నిత్యం నీ స్మరణతోటే కాలం గడుపుతున్నారు.”
ఒడిస్సియస్ దుఃఖపడ్డాడు. “మరి నీ సంగతి ఏమిటి?”
“నువ్వు లేని జీవితం వెలితిగా తయారయింది, నాయనా! ఏళ్ళ తరబడి, కళ్ళు కాయలు కాసేలా, నీ రాక కోసం ఎదురు చూసేను. ఇక నువ్వు తిరిగి రావేమో అనే నిరాశతో కన్ను మూసేను.”
తల్లిని ఒకసారి మనసారా కౌగలించుకుందామని చేతులు బారజాపేడు. మూడుసార్లు ప్రయత్నించేడు. పొగమంచును పట్టుకుందుకి ప్రయత్నిస్తే చేతికి ఏమి చిక్కుతుంది?
“అమ్మా! నా పరిష్వంగానికి పట్టుబడకుండా పారిపోతున్నావెందుకు?”
“నాయనా! నాకు భౌతికమైన శరీరం లేదు. నేను కేవలం ప్రేతాత్మను. నువ్వు త్వరగా ఈ చీకటి లోకాన్ని వదలిపెట్టి, వెలుగు లోకంలోకి వెళ్ళి క్షేమంగా ఉండు.”
కలలో బొమ్మలు కరిగినట్లు, వెలుగులో నీడ చెరిగినట్లు ఆమె ప్రేతాత్మ అక్కడ ఉన్న తెల్లని చిక్కని పొగమంచులో కలిసిపోయింది.
3.9 యుద్ధవీరుల ప్రేతాత్మలు
ఒడిస్సియస్ తల్లి యొక్క ప్రేతాత్మ నిష్క్రమించిన తరువాత అగడ్తలోని రక్తం కోసం వందలకొద్దీ ప్రేతాత్మలు వరసకట్టి వస్తున్నాయి.
ఒడిస్సియస్ కత్తిని దూసి, ఒక క్రమపద్ధతిలో, ఒకరి తరువాత ఒకరు చొప్పున, వరసకట్టి అగడ్త దగ్గరికి వచ్చి, రక్తం తాగవచ్చని చెప్పేడు.
వరసలో మొదట ట్రోయ్ యుద్ధంలో మరణించిన గ్రీకు వీరుల తల్లుల ప్రేతాత్మలు, తరువాత వారి భార్యల ప్రేతాత్మలు, ఆ తరువాత గ్రీకు రాజుల, వీరుల ప్రేతాత్మలు రావాలని ఆదేశించేడు. ఆ వరుసలో గ్రీకు సైన్యపు సర్వసేనాధిపతి అయిన అగమేమ్నాన్ మహారాజు ప్రేతాత్మ కనిపించింది.
“మహారాజా! రాజాధిరాజా! మీరు కూడా ఇక్కడ…?” అని అశ్చర్యంతో పలకరించేడు.
అగడ్తలో ఉన్న గొర్రె రక్తం రుచి చూసిన వెంటనే అగమేమ్నాన్ ఎదురుగా ఉన్న ఒడిస్సియస్ని గుర్తు పట్టి, అతన్ని కౌగలించుకోడానికి రెండు చేతులూ ముందుకు జాపేడు. కానీ ఆ ప్రేతాత్మ బాహువులలో శక్తి లేదు.
ఆ దృశ్యం చూసి, భరించలేక ఒడిస్సియస్ కంట తడి పెట్టుకున్నాడు. ఇప్పటివరకు మహారాజు అగమేమ్నాన్ చనిపోయాడన్న విషయం ఒడిస్సియస్కి తెలియనే తెలియదు. ఇపుడు వారిద్దరూ అక్కడే నిలబడి గతకాలపు కబుర్లు చెప్పుకున్నారు – రక్తంతో నిండిన అగడ్తకి ఒక వైపున ఇప్పుడు బ్రతికున్న ఒడిస్సియస్, రెండవ వైపున ఒకప్పుడు రాజాధిరాజైన అగమేమ్నాన్ యొక్క ప్రేతాత్మ.
“మహారాజా. విధి ఎలా వక్రించి మీరు ఇక్కడికి వచ్చేరు? మీరు కానీ సముద్రంలో తుపాను వాత పడి చనిపోయారా? లేక శత్రువులు కుట్ర పన్ని సంహరించారా?”
తన భార్యే తన చావుకు కారణమని అగమేమ్నాన్ విచారవదనంతో వెల్లడించాడు.
“కానీ నీకు నా గతి పట్టదు, ఒడిస్సియస్! నీ భార్య పెనలొపీ నీయందు సద్భక్తి కల ఉత్తమురాలు. ఆమె శీలం శ్లాఘనీయమైనది. నువ్వు ఆమెను వదలి యుద్ధభూమికి తరలి వెళ్ళిననాటికి ఆమె వయస్సులో చాలా చిన్నది. నువ్వు తిరిగి వెళ్ళే నాటికి ఆమె నీ కొడుకుతో నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.”
ఇలా అగమేమ్నాన్, ఒడిస్సియస్ ఒకరితో ఒకరు గతస్మృతులను తలుచుకుంటూ ఉంటే ట్రోయ్ యుద్ధంలో మరణించిన ఇతర వీరుల ప్రేతాత్మలు కూడా అక్కడ సమావేశం అయ్యాయి. వారిలో వీరాధివీరుడైన అకిల్లీస్ (Achilles; ah-KIL-eez) ప్రేతాత్మ కూడా ఉంది.
“ఒడిస్సియస్! ఎంత తెగింపు చేసి వచ్చావిక్కడికి?” అంటూ పలకరించేడు అకిల్లీస్. “ఇక్కడికి ఎందుకు వచ్చావు?”
అకిల్లీస్కి, తదితరులకు ఒడిస్సియస్ తన బృహత్ ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు. టైరీసియస్ ప్రేతాత్మని కలుసుకోవడం తన ముఖ్యోద్దేశం అని చెప్పేడు. తరువాత అకిల్లీస్ని పొగుడుతూ, “మరణించిన వీరులలో నువ్వు రాకుమారుడివి.” అన్నాడు.
“ఆహా! కావచ్చు. కానీ ఈ మరణించిన వారి లోకంలో రాకుమారుడిగా వెలిగే కంటే బ్రతికున్న వారి లోకంలో బిచ్చగాడిలా బ్రతకడమే మేలు కదా.” అన్నాడు అకిల్లీస్.
అప్పుడు అక్కడ సమావేశమైన ప్రేతాత్మలు ఒకొక్కరు ముందుకు వచ్చి హృదయవిదారకమైన తమ కథలు చెప్పుకున్నారు. ఒడిస్సియస్ ఓపికగా విని ఇంకా బ్రతికున్న వారి బంధుమిత్రుల సమాచారం వారికి అందించేడు.
ఒడిస్సియస్ ఆ పొగమంచులోకి అలా చూస్తూ ఉంటే, అంతు లేకుండా, తండోపతండాలుగా, ప్రేతాత్మలు తన వైపే నెమ్మదిగా కదులుతూ వస్తున్నాయి. మొదట్లో మృదువుగా వినిపించిన వారి గళాలు క్రమేపీ కర్కశంగా, భయంకరంగా మారడం మొదలెట్టేయి. సహాయం కావాలని గొంతెత్తి అరవడం మొదలెట్టేయి.
ధీరోదాత్తుడైన ఒడిస్సియస్ ఒక్కసారి భయపడ్డాడు. వెనక్కి తిరిగేడు. అతని సహచరులు అతనిని అనుసరించేరు. అందరూ కాళ్ళకు బుద్ధి చెబుతూ, పర్సెఫొనీ తోటగుండా పరుగెట్టి, ఒగుర్చుకుంటూ వాళ్ళ పడవను చేరుకున్నారు.
అందరూ పడవను ఎక్కి, వెనక్కి తిరిగి చూడకుండా, తెడ్లు వేసి ఓషనస్ నదిని దాటి, సముద్రంలోకి వచ్చి పడ్డారు. సముద్రపు గాలి తగలగానే తెరచాపలను పైకెత్తి ప్రయాణం కొనసాగించారు.
(సశేషం)
