సరిహద్దులు కలవరపరచని కవి

ప్రవాస జీవితంలో కలిగే ఏకాంతం రెండు రకాలుగా ఉంటుంది: మొదటిది విదేశాలలో స్థిరపడిన లేదా సుదీర్ఘ కాలం అక్కడ నివసించిన వారు మాతృభూమికి, బంధుమిత్రులకి దూరమవటం వల్ల కలిగిన బెంగతో, చిన్నప్పటి జ్ఞాపకాలతో అనుభవించే ఒంటరితనం. రెండవది పిల్లల్ని చూడటానికి విదేశాలకు తాత్కాలికంగా వెళ్ళిన తల్లిదండ్రులు, ఇంటి దగ్గరికి బంధుమిత్రులని, అక్కడి స్వేచ్ఛా జీవితాన్ని తలచుకుంటూ అనుభవించే ఒంటరితనం. నిజానికి వలస పక్షులనే మాట వీరికే ఎక్కువగా వర్తిస్తుంది. కాకపోతే ఒకటే తేడా. పక్షులు శీతాకాలంలో వలస పోయి, వసంతాగమనం వేళకి పూసే కొత్త పువ్వుల మాదిరి తిరిగి తమ ఊరి చెట్టు కొమ్మలపై వాలతాయి. వీరు మాత్రం నడి వేసవిలో పడమటి తీరాలకి చేరి, చలి పులి అడుగులు వినపడగానే తిరిగి ఇంటిదారి పడతారు. ఇక్కడ స్థిరపడిన వారిని పక్షులనే కన్నా ట్రాన్స్ ప్లాంట్ చేయబడిన చెట్లతో పోల్చటం సబబుగా ఉంటుంది. మొదట్లో కొంత ఇబ్బందిపడినా ఈ చెట్లు ఇక్కడ ఫలపుష్ప భరితాలవుతాయి. కొన్ని మర్రి వృక్షాలై ఊడలు దింపి విస్తరిస్తాయి కూడా.

తాత్కాలికంగా వలస వచ్చిన వారిలో సాధారణ గృహిణుల కంటే ఉద్యోగపరంగా లేదా మరే వ్యాపకాల వల్లనైనా తమ ఊళ్లో బిజీ జీవితం గడిపిన వారిలో ఈ రకమైన ఏకాంత భావన అధికంగా ఉంటుంది. మరి కొందరైతే దీనిని ఒక మాండలే జైలు లాగా భావించి మండిపడటమో, రోజులు లెక్కపెట్టుకుంటూ గడపటమో చేస్తూ ఉంటారు. దీనికి భిన్నంగా అటువంటి ఏకాంతాన్ని, తీరికను, అదనంగా లభిస్తున్న అవకాశాలను తమ మానసిక వికాసం కోసం, వ్యక్తిత్వ అభివృద్ధి కోసం ఉపయోగించుకునేవారు కొందరుంటారు. అటువంటి వారిలో వి.ఆర్.విద్యార్థి గారు ఒకరు. పాత ప్రపంచంలో కొత్త పోకడల్ని, కొత్త ప్రపంచంలో పాత పోలికల్ని గుర్తించగలిగే తాత్విక దృష్టి ఆయనకి ఉంది. ప్రవాసంలో ఉండగా ఆయన రాసిన కవిత్వమే దానికి తార్కాణం.

విద్యార్థి గారి కవితల్లో నేను ఇష్టపడే వాటిలో ఎక్కువ భాగం వారు అమెరికాలో ఉండగా రాసినవే. సరిహద్దులు, కొత్త వాతావరణం ఆయనను కలవరపరచవు. “పలకబడే ప్రతిభాష తనకు మాతృభాష కదా/ వికసించిన ప్రతి సంస్కృతి తనకు ఆహార్యమే కదా” అని పక్షి గురించి ఆయన చెప్పిన మాట తన వ్యక్తిత్వానికి కూడా వర్తిస్తుంది. భారత సైన్యంలో టెక్నికల్ విభాగంలో పనిచేసిన రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం బహుశా ఇటువంటి వ్యక్తిత్వం ఏర్పడటానికి తోడ్పడి ఉండవచ్చు. మనసులో ఆత్మీయ భావం, సకల సృష్టిలో తానూ ఒక భాగం అన్న అవగాహన ఉండాలే గాని, ఏదీ పరాయిగా అనిపించదు. అలా ఉన్నప్పుడు, తులిప్ పుష్పం వికసిత వదనంతో చిరునవ్వులు చిందిస్తుంది. ఓక్ వృక్షం కొమ్మలు సాచి కరచాలనం చేస్తుంది. కరోలినా వెన్నెల చల్లని కిరణాలతో సేద తీరుస్తుంది. రాత్రి కురిసిన మంచు, ‘డైరీలో పేజీల మడతలై రెపరెపలాడుతుంది’. వారి అబ్బాయి పెరట్లో ఉన్న సింధూర వృక్షాన్ని ఆ ఊర్లో ఎరిగిన ఒకే ఒక్క మనిషిగా, ఎన్నో నిద్రారహిత రాత్రులకు ప్రత్యక్ష సాక్షిగా భావించటం చరాచరాల మీద తన మనసులో ఏర్పరచుకున్న ఆత్మీయ భావంతో ఆయన ఒంటరితనాన్ని ఎలా పోగొట్టుకున్నది తెలియజేస్తుంది.

విద్యార్థి గారి ప్రవాస కవిత్వంలో ప్రకృతి దృశ్యాలు, పర్యాటక ప్రదేశాలకి సంబంధించిన కవితలనేకం ఉంటాయి. ఐతే, అవి పర్యాటక దృష్టి కంటె, మైత్రీ భావంతోనూ, తన్మయత్వంతోనూ నిండి, తనకు చిరకాలంగా పరిచితమైన వాటిని తిరిగి కలుసుకొని, పలకరిస్తున్నట్టుగా ఉంటాయి. “అపరిచితులు” కవితతో పేరు పొందిన ఈ కవికి నిజానికి ఎక్కడా అపరిచితమైనదంటూ ఏదీ లేదు. అంతా సుపరిచితమే.

విద్యార్థి గారితో స్నేహ పరంగా, సాహిత్య పరంగా సుదీర్ఘ ప్రయాణమే చేశాను గాని, భౌతికంగా ఆయనతో కలిసి ప్రయాణం చేసే అవకాశం కొన్నిసార్లు మాత్రమే కలిగింది. ఆర్యీసీ వరంగల్ లో నేను టీచింగ్ అసిస్టెంట్ గాను, ఆయన టెక్నికల్ విభాగంలోను పనిచేసే రోజుల్లో కొంత కాలం పాటు మేము ఇరుగుపొరుగు. అప్పట్లో ఒకసారి ఇస్మాయిల్ గారి షష్టిపూర్తి సన్మానం ఆయన అభిమానులైన సీనియర్ IAS ఆఫీసర్ల చొరవతో, గవర్నర్ కుముద్ బెన్ జోషి చేతుల మీదుగా రాజ్ భవన్ లో జరిగింది. దానికి నేను, విద్యార్థి గారు, వారి శ్రీమతి రత్నమాల గారు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాము. హుందాగా, నిరాడంబరంగా జరిగిన ఆనాటి కార్యక్రమం మాకందరికీ ఎంతో ఆనందం కలిగించింది. ఆ కార్యక్రమం విశేషాలు, దారిలో విద్యార్థి గారితో జరిపిన సంభాషణలు నాకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.

అలాగే ఒకసారి ఇస్మాయిల్ గారు కాజీపేటలో ఉన్న వారి కూతురు దగ్గరికి వచ్చారు. విద్యార్థి గారి ఇంట్లో కలిసినప్పుడు సుప్రసన్న గారిని చూడాలనే కోరిక వ్యక్తం చేయటంతో మేము ముగ్గురం బయల్దేరాం. సుప్రసన్న గారు సుదూరంలో ఉన్న ఒక కాలనీలో కొత్తగా ఇల్లు కట్టుకొని, అక్కడకు మారారని తెలిసింది. మేము ఎక్కిన సిటీ బస్సులో ప్రతి వరుసలో రెండు విండో సీట్లు మాత్రమే ఉన్నాయి. బస్సులో నిలబడి ప్రయాణం చేయటానికి ఇబ్బంది పడుతున్న ఇస్మాయిల్ గారు “మరీ ఇన్ని తక్కువ సీట్లు వేశారేమిటి?” అని అడిగారు. అప్పటికి నేను కుర్రవాణ్ణి కావడం, సిటీ బస్సులో నిలబడి ప్రయాణం చేయడం నాకు నిత్యకృత్యం కావటంతో “మంచిదే కదా, అలా అయితే ఎక్కువ మంది పడతారు!” అన్నాను. దానికి ఆయన నవ్వుతూ “అలా అయితే ఒక లారీ వెయ్యవలసింది!” అన్నారు. మొత్తానికి అంత కష్టపడి వెళ్ళినా, మేము వెళ్ళే సమయానికి సుప్రసన్న గారు ఇంట్లో లేకపోవటంతో, హతాసులమై తిరిగి వచ్చాం. ఆ సాయంకాలం డ్రాయింగ్ రూములో మద్యపాన కార్యక్రమానికి రత్నమాల గారు అభ్యంతరం చెప్పకపోవటమే కాకుండా, ఆమ్లెట్ వంటి ఆధరువులతో సహకారం అందించటం చూసిన ఇస్మాయిల్ గారు సంతోషించి, “దొడ్డ ఇల్లాలు!” అని మెచ్చుకున్నారు.

విద్యార్థి గారి రెండవ కుమారుడు శైలేంద్ర మాకు దగ్గరలో ఉన్న షార్లెట్ నగరంలో చాలా సంవత్సరాలు నివసించేవాడు. అతని దగ్గరకి విద్యార్థి దంపతులు వచ్చిన సందర్భంలో అనేకమార్లు కలిసేవాళ్ళం. ఒకసారి అంతా కలిసి బహుశా 2001 తానాసభలకి అనుకుంటాను ఫిలడెల్ఫియా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. అదొక విచిత్రమైన అనుభవం. మొదటి రోజు మేము పార్క్ చేసిన గరాజ్ మేము కార్యక్రమాలు చూసి, రాత్రి పొద్దు పోయాక తిరిగి వచ్చేవేళకి పూర్తిగా మూతబడి ఉంది. అంతేకాకుండా అది సోమవారం వరకు మళ్ళీ తెరుచుకోదని వాచ్మెన్ చెప్పటంతో ఏమి చెయ్యాలో తెలియలేదు. శైలేంద్ర సమర్థుడు కాబట్టి, ఆరోజు టాక్సిలో హోటల్ కి తీసుకువెళ్ళటం, ఏదో విధంగా మర్నాడు పొద్దుటికి కారు విడిపించటం వంటివి చెయ్యగలిగాడు. ఆసభల్లోనే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, జానకి బాల గారు, శివారెడ్డి గారు మొదలైన వారంతా కలిశారు విద్యార్థి గారు వివిధ కవులతో చేసిన వీడియో ఇంటర్వ్యూల వీసిడి విడుదల చేయించగలిగాం.

బహుశా 2006లో అనుకుంటాను విద్యార్థి గారు, అంపశయ్య నవీన్ గారు, నేను, తమ్మినేని యదుకుల భూషణ్ కలిసి చేసిన అట్లాంటా ప్రయాణం సంగతులు ముఖ్యంగా అక్కడ జరిగిన సభా విశేషాలు ఆయన ఖండాంతర కావ్యం లో ఒక కవితలో ఉంటాయి. వేరొక సందర్భంలో విద్యార్థి గారు, మెడికోశ్యాంతో కలిసి చేసిన అట్లాంటా ప్రయాణం మరొక అనుభవం (శ్యామ్ అప్పట్లో కొలంబియాలో ఉండేవారు) శ్యాంతో ప్రయాణం అంటే కబుర్ల కోలాహలం. కొత్తవి, పాతవి, ఎప్పుడైనా విన్నవి, ఎప్పుడూ విననివి – ఇలా ఎన్నో సంగతులతో సంభాషణ పలు శాఖలుగా విస్తరిస్తుంది. ఈ ప్రయాణం తర్వాత వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అక్కడ వెల్చేరు వారిని పెమ్మరాజు వారిని కలిసి, విద్యార్థి గారు తన పుస్తకాలు వారికి అందించటం ప్రధాన ఉద్దేశం. అప్పుడే ఆయన పెమ్మరాజు దంపతుల గురించి మిథునం అనే మంచి కవిత రాశారు. నేను ఇందాక పేర్కొన్న స్నేహభావానికి, పెమ్మరాజు గారివంటి ఒక గొప్ప మనిషిలో ఉన్నమంచిని చూడటమే కాదు, దానిని కవితగా రికార్డ్ చేయటం ఆయన మంచితనానికి ఒక నిదర్శనం.

విద్యార్థి గారి కోర్ వ్యాల్యూ ఇన్ లైఫ్ ఏమిటంటే స్నేహం అని చెప్పుకోవచ్చు సాహితీ మిత్రులతో మాత్రమే కాదు ఒకప్పటి భారత సైనికదళ సహచరులైనవారితో ఆయన నెరపిన సన్నిహిత మైత్రి చాలా విలువైనది. అదే స్వభావం ఆయన కవిత్వంలో వ్యక్తమౌతుంది. ఆయన కవితలలో చాలా భాగం మిత్ర వాక్యం లాగా ధ్వనించటానికి అదే కారణం కావచ్చు.

పరహితం, లోకహితమే కాకుండా సన్నిహిత మిత్రులకి సదా శ్రేయోభిలాషిగా ఉండే విద్యార్థి గారు 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు! ఆయన సాహితీ వ్యవసాయం పచ్చని పంటలతో కళకళలాడుతూ మరింత కాలం నిరంతరాయంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.