[ప్రసిద్ధ తమిళ నవలా రచయిత జయమోహన్ రాసిన వెళ్ళైయానై అన్న తమిళ నవలకు తెలుగు అనువాదం అయిన ‘తెల్ల ఏనుగు’ ఆగస్టు 9న విడుదల అవుతోంది. ఆ సందర్భంగా ఆయన ఈమాటకు ఇచ్చిన ఇంటర్యూ. -సం.]
రచయిత: ఈ నవలంతా 1870ల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాశాను. బ్రిటిష్ కాలంలో దళితులకు రెండు ప్రధాన సమస్యలు ఉండేవి. ఇందులో మొదటిది కుల వ్యవస్థ వల్ల తరతరాలుగా అనుభవిస్తున్న అణచివేత. ఇది కాక చాప కింది నీటిలా బ్రిటిష్ ప్రభుత్వం కులవ్యవస్థను అడ్డం పెట్టుకుని చేసే భయంకరమైన దోపిడీ. ఆ కాలంలో కొంతమంది దళిత నాయకులు, మేధావులు మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. దీనికి కారణం – సంస్థానాధీశులు, జమీందార్లు పాలించే ప్రాంతాల్లో కంటే బ్రిటిష్‌వాళ్ళు నేరుగా పాలించిన ప్రాంతాల్లో దళితుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటం. తమిళనాడు ప్రాంతానికొస్తే పుదుకోట్టై, తంజావూరు, రామనాథ పురం సంస్థానాల్లో దళితుల్ని అధిక శాతం బానిసల కింద చూసేవారు. కలకత్తా, బాంబే, ఢిల్లీ, మదరాసు లాంటి పెద్ద నగరాల్లో బ్రిటిష్‌వాళ్ళు హై కోర్టులు ఏర్పాటు చేసింతర్వాత పరిస్థితి కొంత బాగైంది. బ్రిటిష్ కోర్టులు కొంత మటుకు కనీసపు న్యాయం, సరైన విచారణ జరిగేలా చూశారు. ఇందువల్ల లక్షలాదిమంది దళితులు మెరుగైన జీవితం ఆశిస్తూ బ్రిటిష్ నేరుగా పాలించే ప్రాంతాలకు తరలి వెళ్ళారు. కానీ తెల్లవాడి పాలన గొప్పది అన్న ఉద్దేశ్యం సరైనది కాదని తెలిసింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా మన దేశంలోని సామాజిక పరిస్థితులను తమ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది అని ప్రజలకు అర్థం అయ్యింది. తమ చేతిలో అధికారం ఉన్నా కూడా బ్రిటిష్‌వాళ్ళు సంస్థానాల్లో కానీ తాము నేరుగా పాలించే ప్రాంతాల్లో కానీ స్థానిక ఆచార వ్యవహారాల్లో ముఖ్యంగా కుల పరమైన సమస్యల్లో జోక్యం చేసుకోవడం మానేశారు. పరిస్థితులు మెరుగు పరచాలంటే వాళ్ళు తమ అధికారాన్ని ఉపయోగించి కుల వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు చేసుండొచ్చు. కానీ వాళ్ళ ముఖ్య లక్ష్యం పన్నుల ద్వారా డబ్బులు సమకూర్చుకోవడం, తమ వ్యాపారాలకు అడ్డం రాకుండా శాంతి భద్రతలను కాపాడటం మాత్రమే! ఇక్కడి సమాజాన్ని కులవ్యవస్థను సరిదిద్దే అవసరం వాళ్ళకు కనపడలేదు. కుల, మత వ్యవహారాల్లో వాళ్ళు జోక్యం చేసుకోపోవటం ఇక్కడి దుర్మార్గమైన ఆచారాలకు ఇంకా చేయూతనిచ్చి వాటిని బలపరిచింది.
చాలామంది గమనించని ఇంకో ముఖ్య విషయం, బ్రిటిష్ పాలన కుల అస్తిత్వాన్ని ఒక చట్రంలో పెట్టి మరీ బిగించింది. వాళ్ళు ఇక్కడికి రాక ముందు కులాల్లో హెచ్చు తగ్గులున్నా మార్పుకు కొంత వెసులుబాటు ఉండేది. కొత్త ప్రదేశాలకు, కొత్త వృత్తుల్లోకి మారడం ద్వారా లేదంటే అధికారాన్ని బలంతో గెల్చుకోవడం ద్వారా ఒక కులం నించి ఇంకో కులంలోకి మారే అవకాశం ఉండేది. ఉదాహరణకు కైకోళ్ మఱవర్లు (కాపులు) చోళుల రాజ్యంనించి కేరళకు వెళ్ళిపోయి నేత కులానికి మారారు. కొంతమంది మఱవర్లు రామనాథ పురం ప్రాంతానికి వెళ్ళి పోయి రైతులుగా మారి వేళాల (వ్యవసాయ) కులంలోకి మారారు. అలాగే మహారాష్ట్రకు చెందిన మరాఠా అగ్ర కులస్థులు పరిస్థితుల ప్రభావంతో కర్ణాటకకు వలస వచ్చి అక్కడ పారిశుద్ధ్య కార్మికుల కింద మారి దళిత కులంలోకి వచ్చేశారు. కానీ బ్రిటిష్ పాలకులు కొత్త నియమాలు, చట్టాలు తెచ్చి కుల మార్పిడికి అవకాశం లేకుండా, ప్రభుత్వానికి కుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా చేశారు. జోసెఫ్ కొల్లెట్ అనే బ్రిటిష్ గవర్నర్ 1719లో తీసుకొచ్చిన చట్టం ఇందుకు మూలం. ఇదెలా జరిగిందనేది నవలలో ప్రస్తావించాను. ఈ చట్టం దళితులకు చాలా నష్టం కలిగించింది. ఇది కాక బ్రిటిష్ ఆర్ధిక విధానాలు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. వాళ్ళిక్కడి సంపదను డబ్బుల్నీ తిండి ధాన్యాలను తీసుకెళ్ళి వేరే దేశాల్లో తమ సైన్యం చేసే యుద్ధాల మీద ఖర్చు పెట్టారు. ఈ తీవ్రమైన ఆర్థిక నష్టం 1876లో దక్కను ప్రాంతంలో వచ్చిన కరువును ఇంకా తీవ్రతరం చేసింది. లక్షలాది మంది పేదలు తమ ప్రాణాలను కోల్పోయారు. అనేక సంఖ్యలో దళితులు గ్రామాలని వదిలేసి పట్టణ ప్రాంతాలకు, విదేశాలకు దుర్భర పరిస్థితుల్లో వలస వెళ్ళాల్సి వచ్చింది. ఇలా అధిక సంఖ్యలో బ్రిటిష్ చట్టాలు, ఆర్థిక విధానాల వల్ల ఏర్పడ్డ కృత్రిమ కరువులు, వలసలు వాటి వల్ల జరిగిన తీవ్ర జన నష్టం లేకుండా ఉంటే ఈ రోజున దక్షిణాది రాష్ట్రాల జనాభాలో దళితులు యాభై నించి అరవై శాతం ఉండేవాళ్ళనీ, ప్రతి దక్షిణాది రాష్ట్రాన్ని దళిత ముఖ్యమంత్రి పాలించేవాడనీ మనం చెప్పొచ్చు.
ప్రశ్న: దక్కను కరువు గురించి ప్రజల మరణాల గురించి నవలలో వివరాలు ఉన్నాయి. ఎంతమటుకు అది వాస్తవ చిత్రీకరణ? అందుకు చారిత్రక ఆధారాలు ఏమన్నా ఉన్నాయా?
రచయిత: నవలలోని కరువు వివరణ కల్పన కాదు. నేను పుస్తకాల, రికార్డుల సహకారంతో సేకరించిన సమాచారం ఆధారంగా రాశాను. నిజానికి నవల రాస్తూండటం వల్ల తీవ్రతను కొంచెం తగ్గించి రాయాల్సి వచ్చింది. 1870ల్లో వచ్చిన కరువు పరిస్థితులకు బ్రిటిష్‌వాళ్ళు బెంగాల్ కరువనీ. దక్కను కరువనీ. మదరాసు కరువనీ ప్రాంతాన్ని బట్టి పేర్లు పెట్టినా నిజానికి అదంతా అస్సామ్ నించి తమిళనాడు దాకా తూర్పు తీర ప్రాంతంలో ఒకేసారి వచ్చి మీదపడ్డ కరువు. అందులో లక్షలాదిమంది చచ్చిపోయారు. నాకు వీటన్నిటి గురించి చాలా సమాచారం దొరికింది. రాయ్ మాక్సోమ్ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచిన పత్రాల ఆధారంగా రాసిన ‘ది గ్రేట్ హెడ్జ్ అఫ్ ఇండియా’, ‘గ్రేట్ తెఫ్ట్ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకాలు అందులో ముఖ్యమైనవి. ఇదికాక ఆ రోజుల్లో మదరాసు నించి ప్రచురించిన ‘మెడ్రాస్ మెయిల్’ అనే పత్రిక కరువు గురించి విస్తారంగా వ్యాసాలు రాసింది. అమర్త్య సేన్ లాంటివారు కూడా దీనిపై పుస్తకాలు రాశారు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇంత జన నష్టం వాతావరణ పరిస్థితుల వల్ల జరిగింది కాదు. ఈ కరువు బ్రిటిష్ పాలకుల విధానాల వల్ల కృత్రిమంగా ఏర్పడ్డ కరువు. ఆ సమయంలో దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో పంట సమృద్ధిగా పండింది. బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ నించి ధాన్యం ఇక్కడికి రవాణా కాకుండా ఆపింది. కావాలనే చేసిన పని అది. ఒరిస్సా నించి కాశ్మీర్ దాకా వాళ్ళు ధాన్యం, ఉప్పు రవాణా కాకుండా ఒక పెద్ద కంచెను నిర్మించారు. ఒక పక్క జనం ఆకలితో చస్తూంటే ఇంకో పక్క విశాఖపట్టణం రేవు నించి బ్రిటిష్‌వాళ్ళు అరబ్బులతో ఈజిప్టులో చేస్తున్న యుద్ధంలోని సైన్యం కోసం ధాన్యం, తిండి దినుసులు పెద్ద ఎత్తున ఎగుమతి చేశారు. ఇలా దేశంలో ఆహార ధాన్యాల సరఫరాకు అడ్డు పడటం, కరువు నివారణ చర్యలకోసం అనాదిగా దేవాలయాల్లో గిడ్డంగుల్లో ధాన్యాన్ని దాచే పద్ధతికి స్వస్తి పలకడం లాంటి వాటివల్ల అంతులేని జన నష్టం, ప్రజలు కష్టాలకు గురి కావటం జరిగింది.
ప్రశ్న: ఏడెన్ పాత్ర చిత్రీకరణ ప్రత్యేకంగా అనిపించింది. అతను బ్రిటిష్ ప్రభుత్వానికి పనిచేస్తూనే బాధితులవైపు మొగ్గు చూపుతాడు. షెల్లీ కవిత్వాన్ని ఇష్టపడతాడు. ఈ పాత్రను గురించి చెప్తారా?
రచయిత: ఏడెన్ బ్రిటిష్ ఉద్యోగి అయినప్పటికీ ఐరిష్ జాతీయుడు. అప్పట్లో మన దేశంతో పాటు ఐర్లాండ్‌ను కూడా బ్రిటన్ ఆక్రమించింది. మన దేశంలో జరిగినట్టే అక్కడ కూడా కరువుకు అనేకమంది ఐరిష్‌వాళ్ళు బలయ్యారు. వేల మంది ఐరిష్ జాతీయులు బ్రిటిష్ సైన్యంలో చేరిపోవడమో అమెరికాకు తప్పనిసరై వలస వెళ్ళటమో జరిగింది. ఈ కారణం వల్ల ఈ దేశంలో బాధితుల మీద అంతరాంతరాల్లో ఏడెన్‌కు సానుభూతి ఉంది. అదికాక ఏడెన్ బ్రిటన్‌లో చదువుకున్నాడు. అతనికి షెల్లీ కవిత్వం అంటే విపరీతమైన ఇష్టం. షెల్లీ కవితల్లో సామ్రాజ్యవాదం మీద వ్యతిరేకత, స్వేచ్ఛ, విప్లవ భావాలు, ఆదర్శ వాదం కనిపిస్తాయి. పంతొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ యువతను ఒక ఊపు ఊపాడు షెల్లీ. అందువల్ల తను తీవ్ర ఉద్వేగానికి గురైనప్పుడల్లా ఏడెన్‌కు షెల్లీ కవిత్వం గుర్తుకొస్తుంది.
ప్రశ్న: నవలలో కార్తవరాయన్ అనే పాత్ర ఒకప్పటి కాలంలో దళితుల్లో విద్యావంతులు, పండితులు ఉండేవాళ్ళనీ దేవాలయాల్లో కూడా పూజలు చేసేవారనీ అంటాడు. ఇదెంతమటుకు వాస్తవం?
రచయిత: అయోధ్యదాస్ పండితుడు అనే దళిత నాయకుడి నిజ జీవితం ఆధారంగా కార్తవరాయన్ పాత్రను సృష్టించాను. ఆయన తమిళ, పాళీ భాషల్లో పండితుడు, దళితోద్యమ నాయకుడు. తిరుక్కురళ్ కావ్యం ప్రచురణలోకి రావడానికి వాళ్ళ నాన్న గారు ఎంతో కృషి చేశారు. దళితుల్లో ఇంతకు పూర్వం విద్యాధికులు ఉండేవారు. వాళ్ళకంటూ విద్యావిధానం ఉండేది. ఈ మధ్య తవ్వకాల్లో దొరికిన ఏడవ శతాబ్దపు శాసనాల్లో పఱైయన్ (మాల) కులస్థులు దేవాలయాల్లో పూజలు చేసేవారని రాసుంది. కానీ పల్లవుల కాలం ముగిసి చోళులు రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ కులం తమ ప్రాధాన్యాన్ని కోల్పోయింది. వాళ్ళు తమ సంపదను భూముల్నీ కోల్పోయి, బ్రాహ్మణ కులస్థులు దేవాలయాల్లో పూజలు చేయటం ప్రారంభించారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమంటే – శతాబ్దాల చరిత్రలో అధికారంలో ఉన్నవాళ్ళను బట్టి సామాజిక పరిస్థితులని బట్టి దళితులకు సమాజంలో ఉండే స్థానం మారుతూ వచ్చిందని!
ప్రశ్న: నవలలో ఒక పాత్ర – క్రీస్తు ఇప్పుడు అనుకుంటున్నట్టుగా తెల్ల జాతీయుడు కాదనీ నల్లవాడనీ వాదిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
రచయిత: మామూలుగా మనకు కనిపించే చిత్రపటాల్లో క్రీస్తును తెల్లవాడుగానే చిత్రీకరిస్తారు. కానీ ఆయన ఏ ప్రాంతంలో పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎక్కడ జీవించాడు అనే విషయాలు పరిశీలిస్తే అది వాస్తవానికి దూరం అనిపిస్తుంది. జూడియా అనే ఎడారి ప్రాంతంలో ఒక యూదుడిగా పుట్టాడాయన. చరిత్రను పరిశీలిస్తే జూడియా ప్రాంతానికి ఇతియోపియాతో ఈజిప్టుతో సంబంధ బాంధవ్యాలుండేవి. భౌగోళికంగా కూడా ఆ ప్రాంతాలు దగ్గరగా ఉండేవి. అక్కడి ప్రజల్లో అధిక శాతం నల్లవాళ్ళు లేదంటే కాప్టిక్ జాతికి చెందినవాళ్ళు. అందువల్ల క్రీస్తు నల్లవాడయ్యుండే అవకాశం ఉంది. ఇంకో విషయం మనకందరికీ చిరపరిచితమైన తెల్ల క్రీస్తు బొమ్మ మొహం, చూడ్డానికి రోమన్ మొహంలా ఉంటుంది. ఇందుకు కారణం ఇప్పుడు మనం చూస్తున్న క్రీస్తు బొమ్మ తరువాతెప్పుడో ప్రాచుర్యంలోకి వచ్చింది. రోమన్ చక్రవర్తి కాన్‌స్టాన్‌టైన్ క్రీస్తు బొమ్మ గీయమని చిత్రకారులను పురమాయిస్తే వాళ్ళు క్రీస్తు తమ చక్రవర్తిలాగే ఉంటాడని నిర్ణయించుకుని క్రీస్తుకు ఆయన మొఖాన్ని తగిలించారు. నేనిప్పుడు ఆస్ట్రియాలో పర్యటిస్తున్నాను. ఇక్కడున్న చాలా మ్యూజియాలలో పురాతన కాలం నాటి బాల క్రీస్తు బొమ్మ స్పష్టంగా నల్ల చర్మంతో ఉండటం గమనించాను.
ప్రశ్న: చివరిగా – అప్పటి పరిస్థితుల గురించి శోధించి మీరు పాత్రలను ప్రవేశపెట్టి నవలగా ఎందుకు రాశారు? ఈ వివరాలన్నిటితో వాస్తవాలను క్రోడీకరించి నాన్ ఫిక్షన్ పుస్తకం రాసి ఉండొచ్చు కదా?
రచయిత: నాన్ ఫిక్షన్ పుస్తకాలు రాజకీయ, సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి సిద్ధాంతాల గురించి గణాంకాల గురించీ విశ్లేషణ చెయ్యడానికి వ్యాఖ్యానించటానికీ బాగా పనికొస్తాయి. కేవలం ఆ వాస్తవాలు చెప్పడమే నా లక్ష్యం కాదు. వ్యక్తుల అంతరాంతరాల్లోకి వెళ్ళి వాళ్ళ మానసిక పరిస్థితులనీ, ఉద్వేగాలనూ, బాధనీ వర్ణించడానికి కాల్పనిక సాహిత్యం ఒక గొప్ప ఆయుధం. దాని ద్వారా పాఠకులకు వాస్తవాన్ని అనుభూతం చెయ్యడం నా లక్ష్యం. ఈ పని నాన్ ఫిక్షన్ పుస్తకం చెయ్యలేదు. ఉదాహరణకు నవలలో కరువులో చనిపోయినవాళ్ళందరూ మదరాసు పట్టణంలో ఊరేగింపుగా వెళ్ళే దృశ్యం ఒకటుంది. అది కేవలం కల్పన మాత్రమే కాదు, ఆ పట్టణాన్ని నిర్మించడానికి సహాయపడిన వేలాదిమంది తరతరాలుగా న్యాయానికి దూరమై పడ్డ ఆక్రోశాన్ని దృశ్యమానం చెయ్యడం. ఈ పని నవల మాత్రమే చెయ్యగలదు. అదే కాకుండా మనిషి ఒక్కోసారి పొందే అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని లేదంటే గాఢమైన భావోద్వేగాన్ని పాఠకుడికి తెలియచేసే శక్తి కల్పనకు మాత్రమే ఉంది. సత్యాన్ని శోధించేందుకు కల్పన ఒక పెద్ద ఆయుధం.
