ఇక్కడే ఉన్నందుకు

ఈ భూమ్మీద ఏదైనా గుర్తు వదిలి వెళ్ళాలని కోరిక కాదు. పొరపాటున ఏమైనా మచ్చని మిగిల్చి పోతానేమో అని భయమూ కాదు. పాత పరిచయస్తులు ఎవరో చిరునామా వెతికి, నా అజ్ఞాతపు ఏకాంతవాసంలోకి ఒక కవిత్వపు పుస్తకం పంపినట్టు… ఈ ముసురు రోజుల్లో ఒక పూట బాల్కనీలో రవ్వంత సూర్యకాంతి. సంతోషం కోసం ఆశపడే కాలం కాదు, క్షేమం కోసం ప్రార్డించుకునే కాలమిది. ఈ రూపం చాలిస్తే తిరిగి ఏ నేల మీద కురవాల్సి వస్తుందో అని మబ్బుకీ భయం ఉంటుందా? ఉన్నది ఒకటే జీవితమా, వేలాది రూపాల పరిణామ ప్రయాణమా? ఇంకెన్ని అనుభవాలు, ఎంత ప్రయత్నం, ఎంత ప్రయాస… కావాలనుకునీ, వద్దనుకునీ, ఏదనుకున్నా చివరికి జరిగేది ఇంకేదో అని తెలుసుకుని, అంతం దొరుకుతుందా ఈ వేదనకి అని ధ్యానాంకితమై అవలోకించుకుని, పాదాలు తాకి, పదాల్ని త్యజించి, రమ్మని పొమ్మని, కాదులెమ్మని పిల్లలాటలు ఆడుకుని, పెద్ద మాటల్తో నిందించుకుని ఇలా ఈ హాస్పిటల్ వెయిటింగ్ రూమ్‌లో చివరి తీర్పు కోసం ఎదురు చూస్తూ…

‘వూరి పేరు చెప్పమ్మా?’ క్యూలో నా ముందున్న ఆమెని అడిగింది రిసెప్షనిస్ట్.

‘మానికొండ.’

‘మీ ఊర్లో డాక్టర్ రఘురామ్‌గారు తెలుసా? వాళ్ళమ్మాయి కాలేజ్‌లో నా బెస్ట్ ఫ్రెండ్’ అని చెప్పాలనిపించింది. ఎనీవే, హౌ డస్ ఇట్ మాటర్ నౌ?

వరసలో తర్వాత ఉంది నేనే. రిపోర్టులు చేతికొచ్చాయి, వాటిని చూసి డాక్టర్‌తో మాట్లాడాక కడగొట్టు ఆశ కూడా ఆరిపోయింది.


ఆ రోజు మొదటిసారి చావు భయంతో ఏడ్చాను, మృత్యువు తర్వాత ఏముంటుందో తెలియని భయంతో. యాభయ్యేళ్ళ జీవితంలో చదువని, ఉద్యోగమని, కుటుంబం కోసమని ఇప్పటికి ఎన్నో చోట్లు తిరిగాను. కొన్నేళ్ళు ఒక ఊర్లో ఉండి అంతా అలవాటయ్యాక ఉన్నపళాన ఊరు మారాల్సివస్తే ఎప్పుడూ విసుక్కోలేదు. కొత్త చోటు, కొత్త భాష, సహించని తిండి, తట్టుకోలేనంత వేడి, భరించలేనంత చలి ఏదున్నా ప్రతిదాన్నీ ఒక అనుభవంగానే చూశాను. సిటీ ఐనా, పల్లెటూరైనా, మారుమూల అడవైనా చాలా త్వరగానే అలవాటయిపోయాను, కొత్త మనుషుల్ని స్నేహం చేసుకున్నాను. నేనెక్కడుంటే అక్కడే నాకో చిన్న ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. కానీ… చావు తర్వాత వెళ్ళబోయే చోటు ఏమిటో అక్కడ ఎలా ఉంటుందో ఎవరూ చూసొచ్చి చెప్పినవాళ్ళు లేరు. అక్కడ కూడా ఇలానే సర్దుకుపోగలనో లేదో. ఏమో… మరిగే నూనెలు, కత్తుల వంతెనలు, వైతరణి ప్రవాహాలు… నిజంగా ఉంటే? పాపపుణ్యాల లెక్కలను బట్టి ఏ దీనమైన పునర్జన్మో దాపురిస్తే? ‘Fear is misused imagination’ అని ఇంతమందికి చెప్పి ఇప్పుడు నేనే ఇంత భయంతో…

జీవితం అంతా ఒంటరితనం గురించి ఫిర్యాదు చేస్తూనే బతికాను. చుట్టూ ఉన్న మనుషులు మొరటువాళ్ళని, మనసు తెలుసుకోలేని వాళ్ళని, మాట చెప్పుకోలేని మొద్దు మనుషులని ఎప్పుడూ ఎదో వెలితితో, అసంతృప్తితో రోజులు వెళ్ళదీశాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నారు. గొడవపడ్డవాళ్ళు, చాడీలు చెప్పుకున్నవాళ్ళు, కదలనీయకుండా సోది కబుర్లు చెప్పి విసిగించినవాళ్ళు… ఎవరైనా సరే, సాటి మనిషి అయినంత మాత్రానికే ఎంతో కావాల్సినవాళ్ళలాగా తోస్తున్నారు. వీళ్ళలో ఎవరైనా నాకు తోడొస్తారా? ఏ ఒక్కరైనా పర్లేదు. పోనీ అవతల వైపు దాకా దింపి వెనక్కి వచ్చేసినా సరే.

ఐనా నా పిచ్చి కానీ…

వీళ్ళలో నన్ను గుర్తు చేసుకునే వాళ్ళెవరు? నేను లేకపోతే తల్లకిందులైపోయే వాళ్ళెవరు? నేను వెళ్ళిపోయాక ఎవరో ఒకరైనా నాకోసం దుఃఖపడాలని ఎందుకో ఈ కోరిక. నేను పోయాక కూడా ఏదో ఒక రూపంలో, కనీసం జ్ఞాపకంగా ఐనా మిగిలిపోవాలని ఏమిటి ఈ ఆరాటం?


కొన్ని నెలల క్రితం ఒకరోజు, నిద్రలేచేసరికి ఉన్నట్టుండి పొట్ట పెద్దగా అయినట్టు అనిపించింది, నిండా గాలి ఊదిన బెలూన్‌ లాగా, పేలిపోతుందేమో అన్నట్టు. గాస్ట్రిక్ ఏమో, నిన్న ఏం తిన్నాను? పొత్తికడుపులో ఏదో అడ్డుపడ్డట్టు నొప్పి, ఎంతకీ తగ్గట్లేదు. మెనోపాజ్ వల్ల కూడా కావచ్చు. మొదటి ఆలోచన, ఇంత పొట్టతో బయటికి ఎలా వెళ్ళాలి. డయట్, ఎక్సర్‍సైజ్… ఎన్ని రకాలుగా జాగ్రత్తపడ్డాను పొట్ట పల్చగా ఉండాలని, రెండు డెలివరీల తర్వాత కూడా గట్టిగా నడుము కట్టు కట్టుకుని. నా డిసిప్లిన్‌కి, శరీరం మీద చూపించే శ్రద్ధకి సన్నటి శరీరం, పల్చటి పొట్టా చిహ్నాలు అనుకున్నానే. ‘నీకు ఎలాంటి డ్రెస్ అయినా చక్కగా సూట్ అవుతుంది, అసలు ఆడ్‌గా అనిపించవు. చీరలో ఐతే చూడముచ్చటగా ఉంటావు’ అని ఎవరైనా మెచ్చుకుంటే ఎంత గర్వపడేదాన్ని! చామనచాయలో ఉన్నా, అంత పొడుగు కాకున్నా, కొట్టొచ్చే కనుముక్కు తీరు లేకున్నా, బ్యూటీ టిప్స్, చర్మ సంరక్షణ లాంటివాటికి ఓపిక లేకున్నా, ఒళ్ళు ఔట్ ఆఫ్ షేప్ కాకుండా చూసుకోవడం వల్ల కదా, కాన్ఫిడెంట్‌గా బయట తిరగ్గలుగుతున్నాను!

కష్టాల్లో బిడ్దని కడుపులో పెట్టి కాపాడుకున్నావమ్మా అనేది అమ్మ. కడుపులోది తీసి పెట్టే మనసు నీది అంది అత్తగారు. కడుపులో మాట ఎవరికీ చెప్పుకోదు అంటాడు నాన్న. కడుపు మాడ్చుకుని కష్టపడి చదివి ఇంతదయింది అన్నారు చుట్టాలు. ఆయనకి కోపం వచ్చినప్పుడు ‘కడుపుకి గడ్డి…’ అనేదో అంటాడు. ఇన్నేసి విషయాల్ని దాచుకోడం వల్లే కడుపు ఇంత పెద్దదైపోయిందా?

“అమ్మా! టెస్టులకి ఎందుకు వెళ్ళవు, భయమా?” అన్నాడు చంటి. “పోనీ కాలేజ్‌కి సెలవు పెట్టి రానా, నాన్నకి చెప్పావా?”

అయ్యో భయమెందుకు, ఏదైనా పెద్ద రోగం వస్తే బావుండు అని ఎప్పుడూ ఒక రహస్యపు కోరిక ఉండేది కుర్ర వయసులో. సినిమాల్లో హీరోయిన్‌కి కాన్సర్ అని తెలియగానే అందరూ ఆమెని ఒక దేవతలాగ చూడటం మొదలుపెడతారు, ఏ పనీ చెప్పరు, ప్రేమగా చూసుకుంటారు. కొన్నాళ్ళే ఐతేనేం చాలా స్పెషల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కదా. ఎలాగు చావు తప్పనప్పుడు ఏ ఆక్సిడెంట్‌లోనో హార్ట్ ఎటాక్‌తోనో నాకే తెలీకుండా పోయేకంటే కొన్నాళ్ళు ప్రత్యేకమైన అభిమానాన్ని పొందుతూ బ్రతికి తర్వాత పోవచ్చు కదా అనుకునేదాన్ని. కాకపోతే ఈ నారేషన్‌లో నేను పెద్దగా పట్టించుకోని విషయాలు ఏంటంటే శారీరకంగా అనుభవించాల్సిన బాధ, నిజ జీవితంలో మనుషులు సినిమా మనుషుల్లాగ అతి ప్రేమ చూపించరనే వాస్తవం, అన్నిటికంటే ముఖ్యంగా చావు రాబోతుందని తెలిసినప్పుడు ఇంత భయం కలుగుతుందనే విషయం తెలీకపోవడం.


తాతయ్య చివరి రోజుల్లో డెలీరియమ్‍లో ఎవర్నీ గుర్తు పట్టలేని సమయంలో, ‘తాతయ్యా, నన్ను గుర్తు పట్టావా?’ అనడిగితే, ‘నడిజామున, మంచినీళ్ళకి లేచాను, సరస్వతి సన్నగా వీణ వాయిస్తూ వసారాలో… ఒకటే సందేహం తీరలేదు, కలడు కలండనెడి వాడు కలడో లేడో…’ అని. నాతో ఆయన చెప్పిన ఆఖరు మాటలు అవే. పోనీ నాకైనా తీరిందా సందేహం?

ఎప్పుడో ఒకరోజు ముగింపు తప్పదని తెలుసు కానీ, మరీ ఇంత అర్ధాంతరమా? అమ్మమ్మ అంటూ ఉండేది. ‘నాకు ఇప్పుడే చావొస్తుందా, చూడు వెనకాల ఎంత పెద్ద మూట ఉందో. అనుభవించకుండా ఎక్కడికి పోయేది? చేసిన కర్మము చెడని పదార్థము’ అని.

ఇదంతా ఒక పర్ఫెక్ట్ డిజైన్. అలా వేలితో తాకి చూడు, ఏ చిన్న పీస్ మిస్ అయినా మొత్తం కుప్పకూలిపోతుంది. ఆ చిన్న పీస్ నేను కూడా కావచ్చా? ఉన్నట్టుండి నేను లేకుండా పోతే ఈ డిజైన్ మొత్తం కుప్పకూలుతుందా, లేక నేను లేకుండా పోవడంతో ఈ డిజైన్ ఇప్పటికి పర్ఫెక్ట్ అవుతుందా?


సెలైన్ లోనుంచి చుక్క చుక్క మెల్లగా తెల్లగా ఎర్రగా పారదర్శకంగా… దర్శకం దర్శనం దర్శనీయ స్థలం… ఆకుపచ్చ కర్టెన్లలో నుంచి బయట కనపడేదంతా పుణ్యక్షేత్రమే.

ఈ పవిత్ర స్థలానికి, ఈ అరుదైన జీవితానికి ఎప్పుడైనా విలువిచ్చానా? దొరికిన సంతోషాలకి, అదృష్టాలకి సరిపడా కృతజ్ఞత చెప్పుకున్నానా?

బాల్యం గురించి ‘నా చిన్నప్పుడు’ అని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నాకు బహుశా అది ‘నిస్సహాయత’గా వినిపిస్తుంది. యవ్వనపు రోజుల్ని తలచుకుంటే మోసిన బరువులు, ఈదేసిన బాధ్యతలు మాత్రమే జ్ఞప్తికి వస్తాయి. ‘ఆ రోజులే వేరు’ అని ఏ రోజు గురించీ అనుకోబుద్ది కాదు. ఇన్ని మైలురాళ్ళూ దాటాక సాధించిన విజయం ఏమిటంటే ‘అబ్బా, ఇదంతా ఈ క్షణంలో ముగిసిపోతే బావుండు’ అనిపించకపోవడం. ‘నా అవసరం ఇంకా ఎవరికైనా ఉందేమో’ అని సందేహిస్తూ ఉండగానే ఒక్కోసారి మన ప్రయత్నం ఏమీ లేకుండానే జీవితం మనని వదిలేస్తుంది, బిగించిన తన గుప్పిళ్ళని తెరిచి.


‘స్పృహలోకి వచ్చింది ఇక భయం లేదు’ అంటున్నారు ఎవరో… ఎవరికి భయం లేదు? నాకుంది.

కిటికీ బయట ఎర్రగా సంధ్య వారుస్తున్నారు… గంజి వార్చినట్టు. అయ్యో గంజి వార్చకూడదు చాలా పోషకాలు… చంటిగాడికి జ్వరమొచ్చినప్పుడు ఒక ఉప్పు కల్లు, ఇంత వాము కలిపి…

‘యు షుడ్ స్టే స్ట్రాంగ్’ ఆయన చెవిలో ఎవరో రహస్యంగా అంటున్నారు.

‘హి ఆల్వేస్ స్టేడ్ స్ట్రాంగ్’ నా మాట గొణుక్కున్నట్టు బయటికి వస్తుంది.

‘ఏదైనా ఇంకా కొన్నిరోజులే. ఇంటికి తీసికెళ్ళొచ్చు’ మరొక చెవిలో ఇంకొకరు.

మహా అయితే ఇంకొన్ని రోజులు…

ఎందుకు?

కూనిరాగాలు తీసుకుంటూ నేను చేసుకునే నా చేతివంట నేనే ఇంకోసారి తినడానికా? ‘దిల్ అభీ భరా నహీ’ అని ఎవర్తోనైనా బతిమాలించుకోడానికా? రేపోమాపో లౌక్యం నేర్చుకుని అచ్చంగా మనుషుల్లా మారిపోయే పిల్లల పసితనాన్ని పునర్జీవించడానికా? కించిత్ మధుపానాసక్తమైన చిత్తభ్రమల మజా మళ్ళీ చవిచూడటానికా? మొహం మొత్తని మోహాల ఊబిలో జారి జారి పడీపడీ లేచి పడుటకా, ప్రేమించుటకా, కామించబడుటకా?

వార్తలు చదివి, ఆటలాడి, ఊర్లు తిరిగి, తిని, తాగి, తనయనుభూతి తనది గాన చంపి, చంపబడి, వచించి, వంచించి, వేధించి, వధించి, ఆకలికి మాడి, అజ్ఞానంతో అలమటించి, అంతరాంతరాల్లో ఆక్రోశించి, అజ్ఞాతాల్లో అనంతంగా చావులాంటి బతుకులు బతికి, బతికిన కాలమంతా రోజుకో చావుగా చచ్చి, నిజాన్ని కోరి, నినాదాలిచ్చి, కొనియాడి, కొట్లాడి, సంఘర్షించీ సమీకరించీ… ఒక మలిన భాష్పమౌక్తికాన్ని ఆశించి, పరులకోసమై రాల్చలేని ఒక్కగానొక్క H2O కణానికై వగచ చేతగానితనాన్ని మూర్తీభవించి, బిచ్చమెత్తి, దానమిచ్చి, మారిపోయి, మరచిపోయి, పోనిమ్మని క్షమించి, పోలేనని దేబిరించి….

ఎన్నిరోజులు బ్రతికినా ఇంతకంటే గొప్పగా చేసేది ఏదైనా ఉందా?


“అమ్మా, ఏమన్నా చెప్పాలా?” చంటిగాడు పెద్దరికంలోకి వెళ్ళే మొదటి మాట అన్నాడు.

“నాన్నకి కోపమొస్తే కాసేపు ఊరుకో, తగ్గిపోతుంది.”

“ఏమన్నా కావాలా?” ఆయన దగ్గరికొచ్చాడు. ఆయన్ని ఈమాట అడిగేవాళ్ళు ఇక ఉండరని దిగులు కళ్ళల్లో.

“చంటిగాడి మీద కోపమొస్తే కాసేపు ఊరుకో. తగ్గిపోతుంది.”

ఇంకా…

నాకోసం నాకేం కావాలి?

సంజాయిషీతో మలినం కాని స్వచ్ఛమైన క్షమాపణ ఒక్కసారైనా నాకు నేను చెప్పుకునే శక్తి కావాలి!