పని₹మని₹షి

“మేడమ్… నిన్న స్టోరీ చెబ్తానన్నావుగా…” నసుగుతూ బాల్కనీలోకొచ్చి నిలబడింది రత్నం.

పక్కనే పెద్ద బీన్ బ్యాగ్ మీద కూర్చుని ఓ ఇంగ్లీష్ నవల చదువుకుంటోంది నీరూ. పుస్తకంలోంచి తలెత్తి ఏదో ఆలోచిస్తున్నట్టు చూసింది. రత్నం బక్కగా ఉంటుంది. నీరూ సన్నగా ఉంటుంది. ఇద్దరిదీ చామనఛాయే కానీ నీరూది ఓ షేడ్ లైట్‍ గా ఉంటుంది రత్నానికన్నా. వాళ్ళిద్దరూ డ్రెస్సులు మార్చుకుంటే దాదాపు ఎవరు పనిమనిషో, ఎవరు యజమానో తేడా తెలియకపోవచ్చు.

…లేదు, అది మాత్రమే సరిపోకపోవచ్చు. గొంతు కూడా మార్చాల్సి రావచ్చు. పెదాలు, కనురెప్పలు, చెవులు, జుట్టూ… తప్పదు మొహం మొత్తం మార్చాలి!

“మేడమ్, స్టోరీ…”

“ఏయ్ ఏంటే స్టోరీ? ఎళ్ళి పన్చూస్కో. మా మమ్మీ ఒచ్చిందంటే నీకుంటది.” బెదిరించింది నీరూ.

జూబ్లీహిల్స్ రోడ్ నం. 48లో అడ్డదిడ్డంగా వీస్తున్న గాలికి రత్నం ఒళ్ళు కొంచెం ఒణికింది. “పన్లన్నీ ఎప్పుడో అయిపోయాయ్ మేడమ్! రోటీ కర్రీ… రూమ్ క్లీనింగూ… బట్టలు…”

“ఓకే, ఓకే… ఏదో జస్ట్ ఊర్కే అన్నానే నిన్న. ఇప్పుడు నాకు టైమ్ లేదు, చూద్దాంలే…”

“అబ్బ చెప్పచ్చుగా… మళ్ళా చదువుకుందుగాన్లే!” రత్నానికా చనువిచ్చింది నీరూనే.

“ఏంటే నీకింత ఇంట్రెస్ట్ సడెన్‍గా?”

“చెప్పమ్మా… పని మనిషిని ఈరోయిన్‍గా పెట్టి ఎవర్రాస్తారు జెప్పు స్టోరీలు?”

“హుఁమ్, సర్లే ఇట్రా” చదువుతున్న నవలని పక్కన పెట్టి కుర్చోమని సైగ చేసింది.

“ఈరో ఎవరు మేడమ్ కథలో? లవ్ చేస్కుంటారా ఆళ్ళిద్దరూ?”

రత్నం ఆతృత చూసి నీరూకి నవ్వొచ్చింది. “ఇది మన సినిమాల్లాంటిది కాదులే.”

“మరి?”

“ఓ రిచ్ ఫ్యామిలీకి కొత్త పనిమనిషి కావాలంటే, లిల్లీ అనే అమ్మాయిని పన్లో పెట్టుకుంటారు.”

“మన లాగ…” అంది రత్నం చెయ్యి వాళ్ళిద్దరి వైపూ తిప్పుతూ.

“మధ్యలో డిస్టర్బ్ చెయ్‍కు!” కసిరింది నీరూ. “పన్లోజేరాక లిల్లీకి రెండ్రోజుల్లోనే అదో తేడా ఫ్యామిలీ అని తెలిసిపోతుంది కానీ ఏం చెయ్యలేదు. జాబ్ ముఖ్యం అనుకుని సర్దుకుపోతూ ఉంటుంది.”

“తేడా అంటే?”

“ఆ ఓనర్ మంచోడే కానీ వాడి వైఫ్ మాత్రం మెంటల్ హాస్పిటల్కి ఎళ్ళొచ్చిందని తెలుస్తుంది. అది లిల్లీని తెగ టార్చర్ పెడుతూ ఉంటుంది.”

“ఎహె! వదిలెల్లిపోవచ్చుగా మేడమ్?”

“లేదు, లిల్లీ మీదో పాత కేసుంది. అందుకే దానికి వేరే ఎక్కడా ఉద్యోగాల్రావు…” పక్కకి వంగుతూ మెల్లగా అంది నీరూ. “చిన్నప్పుడో మర్డర్ చేసిందది?”

చేత్తో నోరు మూసుకుంది రత్నం అప్రయత్నంగా.

“ఆ ఓనర్ వాళ్ళ పాప ఇంకా తేడా. లిల్లీ ఏం చేసిపెట్టినా తినకుండా గొడవ చేస్తుంటది. ఇవన్నీ పడలేక లిల్లీ చివరికి ఓ ప్లానేస్తుంది.”

“మళ్ళీ మర్డర్ గానీ చేస్తదా, ఈ కథేం నాకు నచ్చలా…”

“కాదు కాదు… విను. లిల్లీకి బతకాలంటే డబ్బులు కావాలి, బైటేమో జాబు రాదు పాపం. అందుకని బైట గార్డెన్ పనిచేసే వాడితో కలిసి, స్లోగా ఇంట్లో కాస్ట్‌లీ ఐటమ్స్ నొక్కేస్తూ ఉంటది. వీలైనన్ని కొట్టేసి తొందరగా అక్కడినుంచి ఇద్దరూ పారిపోవాలని చూస్తుంటారు.”

“ఐటమ్స్ తీస్తంటే మరి పట్టుకోలేదా ఎవరూ?!”

“అదే ట్విస్ట్! ఆ ఇంట్లో ఒకళ్ళకి తెలీకుండా ఇంకోళ్ళకి సీక్రెట్లుంటాయ్. వాటిని వాడుకుని ఈళ్ళిద్దరూ కొట్టేస్తుంటారు.”

అర్థం కానట్టు మొహం పెట్టింది‌ రత్నం.

“యూ డంబ్… ఆ‌ ఓనర్ వైఫ్‍కి ఇంకోడితో సంబంధం ఉంటది. ఆడో చైన్ గిఫ్టిస్తాడు దీనికి. ఈ విషయం దీని హస్బెండ్‌కి తెలీదు. లిల్లీ ఇవన్నీ సీక్రెట్‍గా కనుక్కోని ఆ‌ చైన్‌ కొట్టేస్తది. ఆ వైఫేమో గట్టిగా అడగలేదు, హస్బెండ్‍కీ చెప్పలేదు. పూర్ లేడీ. బయటపడిపోద్దేమోనని భయం. ఇలాంటివి చాలా ఉన్నాయ్‍లే ఈ నవల్లో. ఓ సారైతే లిల్లీ దాదాపు దొరికిపోయి, జస్ట్‍లో తప్పించుకుంటది. మనకేమో ఫుల్ టెన్షన్!”

“బలే మేడమ్!”

“ఏంటే బలే, ఓనర్స్‌ని దోచుకుంటే నీకు హ్యాపీనా?!” అంది నీరూ సీరియస్‍గా చూస్తూ.

“అయ్యో అది కాదమ్మా, ఏదో తెలివిగలది కదా అనీ…”

“ఇదేదో బావుంది కదా అని నువ్వివన్నీ మా‌ మీద ట్రై చెయ్‍కే‌…” అంది నీరూ.

“నే…నేనలాంటిదాన్నామ్మా!” అంది రత్నం దెబ్బతిన్నట్టు చూస్తూ.

“లేదులే… నవల్లో ఫైనల్‍గా, లిల్లీ ఆ తోటపనోడూ కలిసి, ఆ శాడిస్ట్ ఓనర్స్ నుండి తప్పించుకుని పారిపోతారు. అంతే, ది ఎండ్!” తేల్చింది నీరూ.

అంతలోనే నీరూకో మెసేజొచ్చింది.

ఆర్ యూ రెడీ?
నో రాకీ! ఐ నీడ్ సమ్ మోర్ టైమ్
జల్దీ చెయ్

ఆ తర్వాతి వారం రోజులూ ఆపకుండా ఏవో ప్రశ్నలు వేస్తూనే‌ ఉంది రత్నం ఆ నవల మీద.

“జైలు కెల్లోచ్చాక గమ్మునుండక మల్లీ ఎందుకంట లిల్లీకి ఆ దొంగపన్లు?”
“ఇది నచ్చకపోతే పనికి ఇంకో‌సోటకి పోవాలి గానీ…”
“ఆ ఓనర్స్‌కి మాత్రం ఏం బుద్దిజెప్పకుండానే పారిపోయిందే చివరికి?”

విసుక్కుంటూనో, నవ్వుకుంటూనో సమాధానాలు చెబుతూనే ఉంది నీరూ.

“అయన్నీ సరే మేడమ్, లిల్లీ నీకు నచ్చిందా ఇంతకీ?” అడిగిందొక రోజు జ్యూస్ తెచ్చిస్తూ.

“యా, ఐ లైక్ హర్. చాలా ఇంటెలిజెంట్‍గా చేస్తుంది తెలుసా అన్నీ!”

“అంటే నీకు అలాంటోళ్ళు నచ్చరుగా మామూలుగా అనీ…”

“నా చుట్టూ ఉంటే నచ్చరు గానీ ఎక్కడో ఉంటే నాకేం?” క్యాజువల్‍గా అంది నీరూ.

ఓ రోజు రాత్రి డ్యూటీ దిగిపోయి ఆ బంగళా బైటికెళ్ళబోతూ సెక్యూరిటీ చెకింగ్ కోసం‌ గేటు దగ్గర లైన్లో ఆగింది రత్నం. ఆగి బాడీ అంతా చెక్ చేయించుకున్నాకే బైటికెళ్ళగలరు పనివాళ్ళు. పైన బాల్కనీలోకొచ్చి చూస్తోందిదంతా నీరూ. రత్నం టర్న్ వచ్చేటప్పడికి సెక్యూరిటీ వైపు చూస్తూ పెద్దగా అరిచింది.

“వదిలెయ్ రవణా! దాన్నొదిలెయ్. చెక్ చెయ్‍కు.” ఆశ్చర్యపోతూ చూశారు అక్కడున్న అందరూ పైకి.

“మేడమ్, చెక్ చేయకుండా వర్కర్స్‌ని బైటికి పంపద్దన్నారు పెద్ద‌ మేడమ్!”

“వర్కర్స్‌ని కదా? రత్నం ఇంకనుండీ ఈ ఇంట్లో వర్కర్ కాదు. నా సిస్టర్. నీ సిస్టర్ని చెక్ చేస్తే నువ్వూరుకుంటావా?” గొంతు పెంచింది. రత్నాన్ని కోపంగా చూసి వదిలేశాడు వాడు. అమాయకంగా పైకి చూసి చేతులూపింది రత్నం వెళ్తానన్నట్టు. నీరూ టాటా చెప్పింది నవ్వుతూ.

మూడు రోజుల తర్వాత, రత్నం పనిచేసుకుంటున్నప్పుడు ఇద్దరు ఎలెక్ట్రీషియన్లు హడావిడిగా ఇంట్లోకొచ్చి లోపల గోడల మీదున్న సీసీటీవీ కెమెరాలన్నీ తీసేయడం మొదలుపెట్టారు. రత్నం ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుంటే, “మిమ్మల్ని ట్రాక్ చెయ్యడం నాకస్సలిష్టం లేదు. అందుకే‌ తీయించేస్తున్నా. మీరేం స్లేవ్స్ కాదు, మనుషులే” అంది నీరూ. రత్నం మురిసిపోతూ మళ్ళీ పనిలో పడిపోయింది.

“నెక్స్ట్ సండే కలుద్దాం!” మొబైల్లో ఓ మెసేజ్ పంపింది నీరూ.


ఓ‌ పెద్ద‌ ఇంటి ముందు ఆపింది నీరూ తన ఆడీ కార్‌‍ని. ఆ ఇంటి గేటు మూసుంది. దానికో మూలగా ఉన్న బల్ల మీద కూర్చుని తల మొబైల్లో దూర్చి తనలోతను నవ్వుకుంటున్నాడా ఇంటి వాచ్‍మన్. నీరూ గేటుకెదురుగా ఉందని గమనించే పరిస్థితిలో లేడు. హారన్ కొట్టింది గట్టిగా. ఉలిక్కిపడి పైకి లేచాడు. ఓ చేత్తో సెల్యూట్ పెడుతూ, ఇంకో చేత్తో తలుపు నెట్టుకుంటూ మరో పక్కకి పోయాడు. వాడిని కళ్ళతోనే కాల్చేస్తూ లోపలికెళ్ళింది నీరూ. పార్క్‌ చేసి హడావిడిగా వెనక స్విమ్మింగ్ పూల్ వైపుకెళ్ళింది.

“హియర్ షీ ఈజ్!” అనౌన్స్ చేశాడు రాకీ నీరూని‌ చూస్తూ. వైట్ షర్ట్, షార్ట్స్ వేసుకుని, లైట్ షేడ్‌ గడ్డంతో, బాల్డ్‌హెడ్‍తో, ఓ బాలీవుడ్ విలన్లా ఉన్నాడు‌. పూల్ గట్టుమీద నుండి లోపలికి కాళ్ళు పెట్టుకుని కూర్చునున్నారు రజా, తన్వీలు. లేటెస్ట్ సెలెబ్రిటీ కపుల్! ఇద్దరూ లేచొచ్చి హగ్ లిచ్చారు నీరూకి.

“రాకీ, ఆ వాచ్‍మన్ గాడ్ని నువ్వింకా తీసెయ్‍లేదా? సచ్ ఎన్ ఇడియట్!”

“హేయ్, చిల్ బేబ్, మన సత్తి గాడా? నేనిచ్చే చీప్‌ శాలరీకి స్టుపిడ్ కాక, జీనియస్ దొరుకుతాడా!” నవ్వాడు రాకీ. మిగిలిన ఇద్దరూ జాయినయ్యారు.

“ఎనీవేస్, నీకు బిగ్ డే ఈ రోజు, టైం వేస్ట్ చెయ్యకుండా, బెట్టింగ్ స్టార్ట్ చేద్దాం పదండి!” పూల్ పక్కనే ఉన్న ఓ పెద్ద రూమ్‍ వైపు నడిచారు అందరూ.

“డూవీ రాలేదా?” అంది నీరూ వాళ్ళతో ఆ రూమ్‍ లోకి అడుగుపెడుతూ. లోపల ల్యాప్టాప్‍లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు డూవీ. ఆ మాట విని తల పైకెత్తాడు.

“మిస్సింగ్‌ మీ డార్లింగ్?”

“గాడ్! బెట్టింగ్ ముందు నీ ఫేస్ చూశా, ఏమౌతుందో మరి.” నీరూ కళ్ళు రోల్ చేస్తూ.

“మీరిద్దరూ మళ్ళీ మొదలుపెట్టారా! అసలు మీరు ఎక్స్ లవర్సేనా?” అంది తన్వీ.

“పాస్ట్ లవర్స్ ఈక్వల్ టు ప్రెసెంట్ ఎనిమీస్ ఈక్వల్ టు ఫ్యూచర్ బెడ్…” అన్నాడు డూవీ.

“స్టాపిట్ డూవీ… ఇనఫ్…” అరిచింది నీరూ.

“ఓకే! గైస్, ఫన్ టైమ్ ఈస్ ఓవర్. రండి రండి.” చప్పట్లు కొడుతూ పిలిచాడు రాకీ.

అందరూ వచ్చి పదిహేనడుగుల ఎత్తున్న ఓ గోడకి ఎదురుగా నిల్చున్నారు. ఆ‌ గోడంతా పెద్ద‌పెద్ద మానిటర్లు ఫిట్ చేసున్నాయ్.

“గయ్స్, ఇవాళ నీరూస్ టర్న్. సేమ్ రూల్స్‌ ఆస్ ఆల్వేస్!
ఫస్ట్ రూల్ – మూడు రౌండ్స్‌ బెట్టింగ్. అందరూ మూడూ ఆడాలి.
సెకండ్ రూల్ – హోస్ట్‌కే‌ ఫస్ట్ ఛాన్స్ టు బెట్.
మూడో రూల్ – నో‌ చీటింగ్, చీట్ చేసినట్టు తెలిస్తే, యు ఆర్ అవుట్ ఫరెవర్.”

తర్వాత రాకీ ఓ డివైజ్ తెచ్చి నీరూ ముందు పెట్టాడు. ఆ డివైజ్ లోకి తన పాస్‍వర్డ్‌తో లాగిన్ అయ్యి స్టార్ట్ బటన్ నొక్కింది నీరూ. ముందున్న మానిటర్స్‌ అన్నీ ఆన్ అయ్యాయి. ఒక్కొక్క‌ మానిటర్లో ఒక్కొక్క రూమ్ కనపడుతోంది. నీట్‍గా, పాష్‍గా ఉన్నాయా గదులన్నీ.

నీరూ వెనక్కి తిరిగి “వెల్కమ్ టు మై హమ్, స్వీట్ హోమ్!” అంది స్క్రీన్‌ వైపు చెయ్యి చూపిస్తూ.


నీరూ ఇంట్లో ఉన్న గదులన్నీ ప్రొజెక్టయ్యి ఉన్నాయి ఆ పెద్ద స్క్రీన్స్ మీద. రత్నం అటూ ఇటూ తిరుగుతూ పని చేసుకుంటోంది.

“మీట్ రత్నం, మై డంబ్ రత్నం!” అంది నీరూ స్క్రీన్ మీదున్న రత్నం వైపో ముద్దు విసురుతూ. అందరూ నవ్వారు.

“ఓకే, మీ మొబైల్స్, వాచెస్ అన్నీ తీసి నాకివ్వండి. బెట్టింగ్ అయ్యేంత వరకూ, నో కమ్యూనికేషన్స్.” వాళ్ళవాటితో బాటు తనవీ తీసి పక్కనే ఉన్న ఓ ప్లాస్టిక్ బిన్‍లో పడేసి మూతవేశాడు రాకీ.

వెనక్కి తిరిగి “నువ్వు ష్యూర్ కదా నీరూ ఈ సారి బెట్టింగ్‍కి? అన్ లైక్ లాస్ట్ టైమ్…” అన్నాడు రాకీ కన్నార్పకుండా స్క్రీన్ మీద రత్నాన్ని చూస్తూ.

“ఐ స్వేర్ రాకీ! నువ్విచ్చిన స్క్రిప్ట్ ఎక్సాక్ట్‌గా ఫాలో చేశాను. ఈ సారి వర్కవ్వాలి!” అంది నీరూ.

“నాకు డౌటే. పెద్ద దద్దమ్మల్ని పెట్టుకుంటావ్ నువ్వు పన్లో, లాస్ట్ టైమ్ చూశాంగా!” అన్నాడు డూవీ. రజా, తన్వీలు నవ్వారు.

“రాకీ! వీడవసరమా మనకీ గ్రూప్‍లో అసలు?” అంది నీరూ చిరాగ్గా మొహం పెడుతూ.

“ఇట్సోకే. బట్ లాస్ట్ ఛాన్స్ నీరూ నీకిది. బెట్స్ స్టార్ట్ చేద్దాం.” అన్నాడు రాకీ.


నలుగురూ వచ్చి నాలుగు టేబుల్స్ ముందు నించున్నారు. ‘యెస్, నో’ అని లేబుల్స్ వేసిన రెండు బటన్స్ ఉన్నాయి ప్రతి టేబుల్ మీదా.

అందరూ ఆ మానిటర్స్ వైపే చూస్తున్నారు. రత్నం హాల్లోకొచ్చి పెద్ద గ్లాస్ టీపాయ్ క్లీన్ చేస్తోంది. ఆ టీపాయ్ కింద ఓ ప్లాస్టిక్ బ్యాగ్ వేలాడుతూ ఉంటే, దాన్ని పట్టుకుని గట్టిగా లాగింది పైకి. లోపల్నించి రెండు నోట్ల కట్టలు జారి కిందపడ్డాయి. రత్నం ఆశ్చర్యపోయి చూసింది. చూస్తే కవర్ కింద వైపు చినిగి ఉంది.

“వాఁవ్! నువ్వో మాన్‍స్టర్‍వి నీరూ!” అన్నాడు రజా చప్పట్లు కొడుతూ.

“ఓకే, ఫస్ట్ బెట్!” చేతులు రుద్దుతూ అంది నీరూ.

“టెన్ లాక్స్, స్టార్టింగ్ బెట్” అన్నాడు రాకీ. అందరూ డబ్బులు తీసి టేబుల్స్ మీద పెట్టారు.

“ఆ కవర్లో ఉంది టోటల్ వన్ లాక్. రత్నం అది తీస్కోదు.” అంది నీరూ ‘నో’ బటన్ ప్రెస్ చేస్తూ.

“నా బెట్ వేస్తా కానీ ఇప్పటి వరకూ ఇంట్లోంచి ఏమన్నా తీసిందా అసలు మీ రత్నం?” అడిగాడు డూవీ వెటకారంగా.

“యెస్, లాస్ట్ వీక్ సీసీటీవీ కెమెరాస్ అన్నీ తీసేశాక, ఒక ట్వంటీ థౌసండ్ తీసింది. తర్వాత ఇంకో సిల్వర్ గ్లాస్ మిస్సయ్యింది.”

“దెన్ వై డార్లింగ్? తియ్యదు అని బెట్టెందుకేస్తున్నావ్ నువ్వు?” ఫస్ట్ టైమ్ మాట్లాడుతూ అంది తన్వీ‌ నీరూతో.

“తెలీదు, అమౌంట్ ఎక్కువ కదా అని గెస్ చేస్తున్నా. నేనే రాంగ్ అవ్వచ్చు.” అంది నీరూ బుజాలెగరేస్తూ.

అంతలో రత్నం కింద పడ్డ ఆ డబ్బు తీసుకుంది. అటూ, ఇటూ చూసింది దాన్ని గుండెలకి హత్తుకుంటూ. రజా, తన్వీలు ఒకరిమొహాలొకరు చూసుకుని ఇద్దరూ ‘యెస్’ బటన్ నొక్కారు.

“డూవీ, సెలెక్ట్ క్విక్లీ!” అరిచాడు రాకీ. డూవీ మానిటర్ దగ్గరికెళ్లి రత్నం మొహాన్ని క్లోజప్‍లో చూస్తున్నాడు. ఆమె చూపులు చటుక్కున ఓ హ్యాండ్ బ్యాగ్ మీద పడ్డాయి. వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ‘యెస్’ నొక్కాడు.

రత్నం ఆ డబ్బులు తీసుకుని అటూ ఇటూ చూస్తూ హడావిడిగా వెళ్ళి ఆ బ్యాగ్ జిప్ తీసి దాంట్లో పెట్టి, మెల్లగా మళ్ళీ తన పని చేసుకోవడం మొదలుపెట్టింది. మిగిలిన ముగ్గురూ అరుస్తూ గట్టిగా హైఫైలు ఇచ్చుకున్నారు.

“యూ లాస్ట్ నీరూ!” అరిచాడు డూవీ. నీరూ వాళ్ల ముగ్గురివైపూ సైలెంట్‍గా తిరిగి, పెదాలు సాగదీసి నవ్వింది.

“సారీ గయ్స్, నేను కాదు మీరే ఓడిపోయారు.” అంది.

“హేయ్, బట్ అది బ్యాగ్ లో పెట్టుకుంది కదా?”

“ఎస్, కానీ అది దాని బ్యాగ్ కాదు. నాది!”

“వాట్!”

“చూడండి, సేమ్ గుచ్చీ మోడల్.” అంటూ తను తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ చూపించింది. “డిఫెరెంట్ కలర్. అంతే” అంది నవ్వుతూ.

“బ్రిలియంట్ నీరూ!” అన్నాడు రాకీ అందరి డబ్బులూ తీసుకుని నీరూకిస్తూ. ఓ కట్ట తిరిగి అతనికిచ్చింది కమీషన్ కింద.

“ఇట్సోకే గయ్స్. రాకీ, సెకండ్ బెట్ స్టార్ట్ చేయ్.” అన్నాడు డూవీ అవమానంగా చూస్తూ.


రత్నం ఇప్పుడు నీరూ పేరెంట్స్ బెడ్‍రూమ్‍లోకి వెళ్ళింది మాపింగ్ బకెట్ తోసుకుంటూ. మెల్లగా నేల తుడిచాక, పరుపు మీదున్న పక్కలు మార్చింది. దిండ్లు రెండిటినీ తీసి గట్టిగా ఒకదానికొకటేసి కొట్టింది. ఒక దిండులోంచి రింగొకటి విసురుగా కిందపడి దొర్లుతూ ఓ మూలకెళ్ళి ఆగింది.

“గైస్, బెట్స్ ఆన్! ఆ రింగ్ తీస్కుంటుందా లేదా?”

రత్నం మెల్లగా దాని వైపు నడుస్తోంది.

“ఈ రింగెవరిది నీరూ, ఏంటి స్టోరీ?” అన్నాడు డూవీ.

“మా ఫాదర్‍ది. మా ఫాదర్ లాస్ట్ వైఫ్‍ది. దాన్ని ఇంకా దగ్గర పెట్టుకున్నాడని మా మమ్మీకి తెలీదు.”

“ఇవన్నీ ఆ రత్నానికి తెలుసా? షీ నోస్?” అడిగింది తన్వీ.

“తెలుసు. నేనే చెప్పాను. థాంక్స్ టు రాకీ.”

“ఎస్, ఈ గేమ్‍ని కనిపెట్టిన మన రాకీ బాబాకీ…” అందరూ బౌ చేశారు అతడి వైపు తిరిగి.

“గయ్స్, వీటికి టైమ్ లేదు. ఫిఫ్టీన్ లాక్స్ బెట్. తీస్కుంటుందా లేదా? యెస్ ఆర్ నో?”

“నేను యెస్.” బటన్ నొక్కింది నీరూ.

డూవీ ‘నో’ నొక్కాడు. మిగతా ఇద్దరూ నీరూ వైపు చూసి కాన్ఫిడెంట్‍గా ‘యెస్’ నొక్కారు.

రత్నం ఆ ఉంగరం వైపో క్షణం చూసి, మళ్ళీ అక్కడే బెడ్ మీద పెట్టేసి రూమ్ బైటికెళ్లిపోయింది. డూవీ నవ్వాడు. రత్నం ఎక్కడుందో కనపడట్లేదు వాళ్ళకి ఒక్క క్షణం.

“రూమ్ బైట కారిడార్లో పెట్టలేదేంటి రాకీ కెమెరాస్?” అంది తన్వీ.

“రూమ్స్‌లో అన్నివైపులా పెట్టాగా, నీ ప్రాబ్లమ్ ఏంటి…”

ఓ నిమిషం తర్వాత డూవీనే గెలిచినట్టు డబ్బులు తీసి అతనికి ఇవ్వబోతుంటే, రత్నం రూమ్‍లోకొచ్చి ఆ రింగ్ తీసుకుని చటుక్కున జాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోయింది. అందరూ షాక్ తిన్నారు. డూవీ నోరు తెరిచాడు.

“యూ చీట్!” అరిచాడు నీరూ వైపు చూస్తూ.

“హేయ్ చిల్! నేనేం చేశాను?”

“నీకు తెలీదా! దాంతో అన్నీ సెట్ చేస్కోనొచ్చావు. నువ్వేం చెబితే అదే చేస్తోందది.”

“యెస్, నాక్కూడా అదే ఫీలింగ్.” రజా కోపంగా చూశాడు నీరూ వైపు.

“పీపుల్, నీరూని ట్రస్ట్ చెయ్యాలి మనం. వన్ యియర్ నుంచి ఆడుతున్నాం‌ ఇది. ఇప్పటివరకీ తనెప్పుడూ చీట్ చెయ్యలేదు!” అన్నాడు రాకీ నీరూకి సపోర్ట్ చేస్తూ.

“నీరూ లాస్ట్ టూ టైమ్స్ ఓడిపోయింది అందుకే బాగా డెస్పరేట్‍గా ఉన్నట్టుంది.” అంది తన్వీ చేతులు కట్టుకుంటూ.

“అసలీ రాకీగాడు కూడా నీరూతో కలిసిపోయాడేమోనని నా డౌట్!” అన్నాడు డూవీ.

“కమాన్ బ్రో… ఇప్పుడు నా మీద పడ్డారా! సరే, నేనా మానిటర్స్ వైపు చూడను. నీరూ కాకుండా మీ ముగ్గుర్లోనే ఎవరో ఒకరు బెట్ స్టార్ట్ చెయ్యండి.” అన్నాడు కూర్చుంటూ.

“ఈ సారి కనక అది నువ్వు చెప్పింది చేస్తే, నువ్వీ బెట్‍లో ఓడిపోయినట్టే!” అన్నాడు డూవీ. “జస్ట్ నాట్ దట్, దాన్ని వెంటనే పన్లోంచి తీసెయ్యాలి. నాకు నమ్మకం లేదు మీ మీద!”

“పాపం రా, ఇప్పటికే ముగ్గుర్ని మార్చింది ఈ యియర్‍ లో… ప్చ్…ప్చ్…” అంది తన్వీ డ్రమెటిగ్గా. నీరూ కోపంగా కిందకి చూస్తూ ఉండిపోయింది.


రత్నం ఇప్పుడు నీరూ స్టడీ రూమ్‍లో ఉంది. డెస్క్ మీద నీరూ చదువుతున్న ఇంగ్లీష్ నవల పెట్టుంది. అది చేతిలోకి తీసుకుని కవర్ మీదున్న పనిమనిషి బొమ్మనే తదేకంగా చూస్తోంది.

“ఆ స్టోరీ అంటే దానికి పిచ్చి.” అంది నీరూ నిట్టూరుస్తూ. ఆ బుక్ మళ్ళీ కింద పెట్టబోయేటప్పుడు అందులోంచి సన్నటి ప్లాటినమ్ చెయినొకటి డెస్క్ మీద జారిపడింది.

“ప్లాటినమ్ చెయిన్ విత్ డైమండ్ పెండెంట్, ఫోర్ లాక్స్. నా బర్త్ డే గిఫ్ట్!” చెప్పింది నీరూ.

“అంత వాల్యూ ఐటమ్ ఎందుకు తీస్తుంది. నో‌ వే, నా బెట్ ‘నో’” అంది తన్వీ. రజా కూడా ఆలోచించకుండా అదే నొక్కాడు.

“ఎవరిచ్చిన గిఫ్ట్ నీరూ అది?” అన్నాడు డూవీ డౌట్‍ఫుల్‍గా.

“నా ఫ్రెండ్…”

“నీ ఫ్రెండ్! వాహ్, ఆ డీలర్ గాడేనా… ఎంతమ్మి పెట్టావ్ వాడికి?”

“ష్… ష్…” అన్నాడు రాకీ నోటి మీద వేలు పెట్టి అటూ ఇటూ చూస్తూ.

నీరూ ఇబ్బందిగా కదిలింది.

“నా బెట్ ‘యెస్’” నొక్కాడు డూవీ. “అది నొక్కేసినా నువ్వెవ్వడితో చెప్పుకోలేవ్.”

నీరూకేం నొక్కాలో అర్థం కాలేదు. మెల్లగా ‘నో’ నొక్కింది.

“గుర్తుందిగా, అది నువ్వు చెప్పినట్టు చేస్తే, ఈ టోటల్ బెట్టింగ్ క్యాన్సిల్ అవుతుంది.” బెదిరించాడు డూవీ.

అందరూ మానిటర్స్ వైపు చూస్తున్నారు. ఆ డెస్క్ మీదున్న చెయిన్ తీసుకుని దాన్ని తడిమి చూస్తోంది రత్నం. అలాగే కాసేపు కిందున్న డైమండ్‍ని పట్టుకుని చూసింది. చటుక్కున దాన్ని గుప్పిట్లో పెట్టుకుని బైటికెళ్ళిపోయింది.

డూవీనే గెలిచాడు. రజా, తన్వీలు తల పట్టుకున్నారు. బెట్ ఓడిపోయిన దానికన్నా రత్నం తనని మోసం చేసిందన్న కోపమే ఎక్కువగా ఉంది నీరూ మొహంలో.

అందరూ వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంటే, “గైస్! లాస్ట్ బెట్. నాకు మీ మనీ ఒద్దు. ఈ రౌండ్ జస్ట్ నా కోసం. అది మళ్ళీ నా చెయిన్ తెచ్చి పెడితే, ఆల్ గుడ్. పెట్టకపోతే మాత్రం దానికి నరకం చూపిస్తాను. ఐ విల్ కిల్ దట్ బిచ్!” అంది.

బైటికెళ్ళిన రత్నం ఎంతసేపటికీ లోపలికి రాలేదు. అలా అని వేరే ఏ రూంలోనూ కనపడలేదు వాళ్ళకి.

“కారిడార్లో ఉన్న బాత్రూమ్ కెళ్ళుంటుంది. లెట్స్ వెయిట్!” అంది నీరూ.

కొంతసేపటికి రత్నం మెల్లగా మళ్ళీ నీరూ స్టడీ రూమ్‍లోకొచ్చింది. ఆమె మొహం నిండా చెమట పట్టుంది. చీరతో మొహం తుడుచుకుంటూ, క్లీనింగ్ బకెట్లోంచి ఆ చెయిన్ తీసి, చేత్తో తుడిచి మెల్లగా బుక్ మధ్యలో పెట్టేసింది.

“హోలీ కౌ!” అరిచాడు రాకీ.

“జీసస్…” రజా.

“హౌ? నీరూ హౌ రే?” నోరు తెరుస్తూ అంది తన్వీ.

“సింపుల్ రే, ఇదంతా దీని సెటప్!” అన్నాడు డూవీ.

“షటప్ డూవీ! తను లాస్ట్ బెట్‍లో ఓడిపోయింది కదా? ఇప్పుడు మన దగ్గర మనీ కూడా తీస్కోవట్లేదు. హౌ ఈజిట్ ఎ సెటప్?” రజా అరిచాడు.

డూవీ దగ్గర సమాధానం లేదు. పెద్దగా నవ్వింది నీరూ డూవీని చూసి క్లాప్స్ కొడుతూ.

“అది చాలా మంచిదిరా… మంచిదంటే… డర్పోక్ రే, బుద్ధూ టైప్స్, పెద్దవేం తీయలేదు, నాకు తెలుసు!” అంది నవ్వుతూ.

డూవీ డబ్బులేం పోలేదు కాబట్టి పెద్ద గొడవ చెయ్యకుండా బైటికెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళూ వాళ్ళ డబ్బులూ, మొబైల్స్ తీసుకుని అతడిని ఫాలో చేశారు. రాకీ‌కి మాత్రం ఏదో డౌటొచ్చి, ఆ మానిటర్స్ దగ్గరకెళ్ళి కాసేపు పైకీ, కిందకీ చూసి ఏం తేడా‌లు కనపడక‌పోవడంతో తల అడ్డంగా ఊపుతూ బైటికి నడిచాడు.


ఓ‌ పెద్ద‌ ఇంటి ముందు ఆపింది నీరూ తన ఆడీ కార్‌‍ని. ఆ ఇంటి గేటు మూసుంది. దానికో మూలగా ఉన్న బల్ల మీద కూర్చుని తల మొబైల్లో దూర్చి తనలోతను నవ్వుకుంటున్నాడా ఇంటి వాచ్‍మన్. నీరూ గేటుకెదురుగా ఉందని గమనించే పరిస్థితిలో లేడు. హారన్ కొట్టింది గట్టిగా. ఉలిక్కిపడి పైకి లేచాడు. ఓ చేత్తో సెల్యూట్ పెడుతూ, ఇంకో చేత్తో తలుపు నెట్టుకుంటూ మరో పక్కకి పోయాడు. వాడిని కళ్ళతోనే కాల్చేస్తూ లోపలికెళ్ళింది నీరూ.

ఆతరువాత పదిహేను నిమిషాలకు వాచ్‍మన్ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేశాడు. రత్నంకు ఒక మెసేజ్ పెట్టాడు.

మొదలెట్టారు
సరే
డబ్బు తీస్కో
ఉంగరం తీస్కో.
సరే
గొలుసు తీస్కో
ఇందాకే తీస్కున్నా
గొలుసొద్దు పెట్టెయ్
సరే
ఈడికి డౌటొచ్చింది
చూసాడా?
లే, ఎల్లిపోతన్నాడ్లే

ఆ బెట్టింగ్ గ్యాంగ్ లో ఒక్కొక్కరూ వాళ్ల వాళ్ల ఖరీదైన కార్లలో రాకీ ఇంట్లోంచి బైటికి రావడం మొదలుపెట్టారు. హఠాత్తుగా బైటికొస్తున్న కార్ల శబ్దానికి, తల మీద జారిపోతున్న క్యాప్ సర్దుకుంటూ గేట్ దగ్గర లేచి నిలబడ్డాడు సత్తి. రత్నం నుండో కొత్త మెసేజ్…

నా జాబ్ ఉంటదా?
ఆ…ఇయాల్టికి

మొబైల్ లోపల పెట్టి ఆవలిస్తూ తల పైకెత్తి చూశాడు. కార్లోంచి కోపంగా చూస్తోంది నీరూ అతని వైపు. తడబడుతూ అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశాడు.

“స్టుపిడ్!” తిట్టింది వెళ్లిపోతూ.

అది‌ విని, లోపల‌ మానిటర్స్ రూంలో సత్తి పెట్టిన హిడెన్ కెమెరా, సైలెంట్‍గా నవ్వింది‌.


పాణిని జన్నాభట్ల

రచయిత పాణిని జన్నాభట్ల గురించి: 'తనలో నన్ను' , 'చెయ్యాల్సిన పని' కథా సంపుటులు, 'మనుషులు చేసిన దేవుళ్ళు' నవల. ...