ఎర్రని ఆకాశం

చేతుల్లో
పచ్చపచ్చని భూమి
లోపలంతా
ఎర్రని ఆకాశం

పాదాలకు చెప్పులు లేని
రక్తపు చుక్కల
పంట దిగుబడి

నోటిలో జల పుట్టించే
ఎర్రెర్రని వాగుల ప్రవాహం

పుచ్చకాయంతా
దీర్ఘ వృత్తాకార కక్ష్యల మార్గం
పళ్ళెం నిండా పర్వతాల ఆకృతి

దేహమంతా తీయని కన్నులు
మన్ను ఒక ముక్కగా
మిన్ను ఇంకో ముక్కగా గల
రెండు చందమామల సంగమం