గణపతి బప్పా మోరియా!

వక్త్రతుండ మహాకాయ
కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవా
సర్వకార్యేషు సర్వదా

తన్మయంగా భక్తురాలి ప్రార్థనని ఆలకించాడు వినాయకుడు. శ్లోకం పూర్తవగానే కళ్ళు తెరిచి సిధ్ధీ, బుధ్ధులని చూసి చిరునవ్వు నవ్వాడు.

“చూశారా? అమెరికాలో కూడా నేనంటే ప్రజలకి ఎంత భక్తో?” అని మీసం మెలివేయబోయి, వీలుకాక తొండం నిమురుకున్నాడు.

“అందులో ఆశ్చర్యమేముంది? అసలు అమెరికాలో కట్టిన మొదటి గుడి నీదే కదా, నాధా?” అన్నది సిధ్ధి.

“అందుకే — ఆదిలోనే ఆ విఘ్ననాయకుడి ఆరాధనతో మొదలుపెట్టారు కాబట్టే ఈనాడు అమెరికాలో ఇన్ని గుళ్ళూ గోపురాలూ వర్ధిల్లుతున్నాయి,” సమర్ధించింది బుధ్ధి.

గర్వంతో ఛాతీ ఉప్పొంగగా, “ఈ భక్తురాలి కోరికేమిటో చూద్దామా?” అంటూ మళ్ళీ అమెరికా వైపు దృష్టి సారించాడు వినాయకుడు.

హారతి ఇచ్చి, భక్తిగా కళ్ళు మూసుకుని నమస్కరించింది లలిత. “మా బుజ్జి బిజినెస్ బాగా నడిచేటట్టు చూడు స్వామీ,” అని ప్రార్ధించి కళ్ళు విప్పి చూసేసరికి నిస్సహనంగా నిరీక్షిస్తున్న కూతురు కనిపించింది.

“అయిందా?” చిరాకు కప్పిపుచ్చుకుంటూ అడిగింది మాయ.

“దేవుడికి దణ్ణం పెట్టుకున్నావా?” ఎదురు ప్రశ్న వేసింది లలిత.

“ఓ మాం!” విసుగ్గా మునివేళ్ళు అంటీ అంటనట్టుగా చేతులు జోడించి ఓ నమస్కారం లాంటిది పారేసింది మాయ.

ఆ తతంగం అవగానే, “ఇక అది తీసేయ్!” అన్నది వినాయకుడి పటం చూపిస్తూ.

విస్తుబోయి చూసింది లలిత. “తీసేయడమేమిటి? ఎందుకు?”

“ఏదో పూజంటే అయిదునిముషాలే కదా అని సరేనన్నాను. పూజ అయిందిగా? ఇంకా ఎందుకు?”

కూతురి అమాయకత్వానికి నిండుగా నవ్వింది లలిత. “పిచ్చిదానా! ఆ దేవుణ్ణి అక్కడ పెట్టడం అయిదు నిముషాల పూజ కోసం కాదు. నిత్యం, ప్రతిక్షణం అక్కడ ఉండి నిన్నూ, నీ కంపెనీనీ కనిపెడుతూండడానికి.”

కెవ్వుమన్నది మాయ. “వాట్! ఎప్పుడూ ఇక్కడుండాలా? గుమ్మంలో అడుగుపెట్టిన ప్రతివారికీ మొట్టమొదట ఆ పటం కనిపించాలా? మాం! నాది ఏ రకం బిజినెస్సో తెలిసే ఆ మాటంటున్నావా?”

అయోమయంగా చూసింది లలిత. “ఎందుకు తెలియదూ? ఫిట్నెస్ అండ్ యోగా సెంటర్ పెడతానని ఎన్నాళ్ళనుంచో అంటున్నావుగా?”

“అవును. ఇది ఫిట్నెస్ సెంటర్. అంటే ఏమిటి? ఇక్కడికొచ్చేవాళ్ళు బరువు తగ్గి, వాళ్ళ ఒంటికి మళ్ళీ ఒంపు సొంపులు తెచ్చుకుని, slim and trimగా తిరిగివెళ్తారని అర్ధం. ఇలాంటి చోట మంచి ఫిగరున్న వాళ్ళ బొమ్మలు పెట్టాలి గానీ, ఇలాంటివెందుకు?”

“తప్పు, తప్పు,” అంటూ లెంపలు వేసుకుంది లలిత. కూతురికి కూడా వేయాలని చూసింది కానీ, మాయ తన చేతులు తోసేయడంతో ఆ పని కుదరక, “ఏమిటా మాటలు?” అంటూ గద్దించింది.

“నేనన్న దాంట్లో తప్పేముంది? ఆ బొజ్జ చూడు. ఆ తలకాయ చూడు. ఆ తొండం చూడు. ఇవన్నీ చూసిన ఎవరికైనా ఇది Obesity and Ugliness Center అనిపిస్తుందిగానీ, Fitness Center కాదు,” నిష్కర్షగా తేల్చేసింది మాయ.

అదిరిపడ్డాడు వినాయకుడు.

“శివ శివా!” అంటూ చెవులు మూసుకుంది లలిత.

స్టన్నయిపోయిన భర్తని ఎలా సముదాయించాలో తోచలేదు సిధ్ధికీ, బుధ్ధికీ.

“బాధపడకు నాధా. అజ్ఞానంతో ఆ అమ్మాయి అన్న మాటలు పట్టించుకోకూడదు. అసలు తన పేరే మాయకదా? మాయమాటలు ఎవరైనా వింటారా?” అన్నది బుధ్ధి తెగించి.
“అందుకే వాళ్ళమ్మ కూడా, ‘శివ శివా,’ అంటూ చెవులు మూసుకుంది, చూశావా?” అని అనునయించింది సిధ్ధి.

“‘శివ శివా!'” అంటూ మండిపడ్డాడు వినాయకుడు. “అవును. ఆయనదే తప్పంతా. అసలు మొదట కండకావరంతో నా తలని తెగ్గొట్టడమెందుకు? తెగ్గొట్టి, దానికి ప్రాయశ్చిత్తమంటూ ఈ ఏనుగు తలకాయ తెచ్చి తగిలించడమెందుకు? బుధ్ధిలేకపోతే సరి!”

“ఆయన భక్తుడికిచ్చిన వరం కోసమని …” అంటూ సమర్ధించబోయింది సిధ్ధి.

“ఆఁ, ఆయన వరాలగురించే చెప్పుకోవాలి. భక్తులు కోరితే ఒళ్ళూపై తెలియకుండా, అర్ధం పర్ధం లేకుండా వరాలిచ్చేస్తుంటాడని అందరికీ తెలిసిన సంగతే!”

“అయినా ఎక్కడో అమెరికాలో ఎవరో ఏదో అన్నారని ఇంత వ్యధ ఎందుకు నాధా? పుణ్యభూమీ, కర్మ భూమీ అయిన భారతదేశంలో నిన్నెంత శ్రధ్ధగా కొలుస్తారో చూడరాదా?”

“అవును. చూడు నీ Happy Birthday ఎంత సంబరంగా జరుపుకుంటున్నారో,”
అంటూ వంత పాడింది సిధ్ధి.

వినాయక చవితి వేడుకలతో హడావుడిగా, కోలాహలంగా ఉన్నది భారతదేశం. దేశం అన్ని మూలలనుంచీ గుళ్ళలో, గృహాలలో, వేదికలపై జరుగుతున్న పూజల ఘోషని చెవులొగ్గి శ్రధ్ధగా ఆలకించాడు వినాయకుడు. చాటలంత చెవులుగదా? వాళ్ళు చదువుతున్న స్తోత్రాలు చాలా స్పష్టంగా వినిపించాయి.

బుజ్జి బుజ్జి చేతులు జోడించి, బుల్లి భక్తులు ముద్దు ముద్దు మాటలతో పద్యం చదువుతున్నారు.

“ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ మీదికీ దండు పంపు
కమ్మని నెయ్యియు కడు ముద్ద పప్పును
బొజ్జ నిండా తినుము పొరలుకొనుచు!”

“ఆఁ!” తృళ్ళిపడ్డాడు వినాయకుడు. పటపటా పళ్ళు కొరకబోయాడు కానీ, ఆ ఉన్న ఒక్క దంతం కూడా విరుగుతుందేమోనని భయపడి ఊరుకున్నాడు. “విన్నారా? ఇంతకన్నా అవమానం ఉన్నదా? ఎంతసేపూ నా బొజ్జ మీదే వాళ్ళ దృష్టి! వారి ఉద్దేశంలో నేనొక తిండిపోతుని!”

“ఏదో చిన్నపిల్లలు …” అంటూ సర్దబోయింది సిధ్ధి. కానీ వినాయకుడు విరుచుకుపడ్డాడు.

“అవును, చిన్నపిల్లలే. ఇంత పసి వయసు నించీ వాళ్ళను brainwash చేస్తున్నారన్నమాట. ఇంక వాళ్ళు పెద్దయినా నామీద ఏం గౌరవం ఉంటుంది?”

ఎలా నచ్చచెప్పాలో తెలియక సిధ్ధి, “అక్కడ కొంచెం పెద్ద పిల్లలున్నారు. వాళ్ళేమిటంటున్నారో విందాం,” అంటూ వినాయకుడి దృష్టిని అటువైపు మళ్ళించింది.
“తుండమునేకదంతమును తోరపు బొజ్జయు –”

“చాలు! చాలు!” అంటూ గర్జించాడు వినాయకుడు. “మళ్ళీ అదే పాటా?”

“కొంచెం శాంతించు, నాథా. పద్యం పూర్తిగా విందాం,” అని బ్రతిమాలి మళ్ళీ ఆ పద్యాన్ని tune-in చేయించింది సిధ్ధి.

“కొండొక గుజ్జురూపమున –”

కైలాసమంతా దద్దరిల్లేటట్టు ఘీంకరించి, ఒక్క ఉదటున అక్కడినించి మాయమయ్యాడు వినాయకుడు.

లోకాలన్నీ వెతికి, వెతికి, చివరకి వెండి కొండ శిఖరాన్న చందమామని తదేకంగా చూస్తున్న వినాయకుడ్ని పట్టుకున్నారు సిధ్ధీ, బుధ్ధీ. వారి రాక గమనించి, “అందుకే చంద్రుడు నన్ను చూసి నవ్వాడు,” అన్నాడు వినాయకుడు.

“అందుకే మీ అమ్మ అతన్ని శపించింది కూడా,” అన్నది బుధ్ధి.

“ఏం లాభం? ఆ శాపానికి విరుగుడు కూడా చెప్పిందిగా. అందుకే అందరూ పూజ చేశామన్న ధీమాతో నన్ను అడ్డమైన మాటలూ అంటున్నారు. అందుకే ఆ మాయ నా పటాన్ని తీసేయమంది.”

“ఇంకా ఆ మాయ మాటల మీద మధన పడుతున్నావా? ఎదుటి వారిలోని అంతః సౌందర్యం గుర్తించలేని వారికి దృష్టి లోపమో, మనోదోషమో తప్పక ఉంటుంది,” అన్నది బుధ్ధి.

“ఊఁ హూఁ. దోషమంటూ ఉంటే అది నాలోనే ఉంది. మిగిలిన వారి నందరినీ ‘ఆజానుబాహుడూ’, ‘అరవింద దళాక్షుడూ’, అంటూ వర్ణించి, నన్ను మాత్రం ‘వక్ర తుండా, మహాకాయ, గుజ్జురూపా అని ఎందుకంటారు? అసలు నేను దేవుణ్ణేనా? కాదు. దేవుళ్ళకి బఫూన్ని.”

వినాయకుడి విపరీత ధోరణిని ఎలా మరల్చాలో తెలియక ఊరకుండిపోయారు సిధ్ధీ, బుధ్ధీ.

“నేను వెళ్తున్నాను,” అన్నాడు వినాయకుడు.

“ఎక్కడికి?” అప్రయత్నంగా అడిగేసింది సిధ్ధి.

“అమెరికాకి. ఆ మాయ fitness center లో చేరి, మన్మధాకారంతో తిరిగివస్తాను,” ధృఢంగా అని మాయమయ్యాడు వినాయకుడు.

“మన్మధాకారంతోనా? బుధ్ధీ!” గద్గదంగా అన్నది సిధ్ధి.

“అవును. మన్మధుడికి శరీరం లేదు,” అన్నది బుధ్ధి వెలవెలబోతూ.

* * * *

వినాయకుది పటం లేని Fitness Center లో గోడలకి మంచి మంచి models తాలూకు పోస్టర్లని అంటించి తృప్తిగా చూసుకున్నది మాయ. “ఇంక ప్రారంభోత్సవానికి అంతా సిధ్ధం,” అనుకుంటూ వెనక్కు తిరిగి కెవ్వుమంది. ఎదురుగా పొట్టిగా, లావుగా, పెద్ద బొజ్జతో, పొడుగాటి ముక్కుతో, బయటకి చొచ్చుకువచ్చిన దంతాలతో … ఎవరది?

“భయపడకు. నన్ను గుర్తు పట్టలేదా?” అనడిగాడు వినాయకుడు శాంతంగా.

“నువ్వు … మీరు.. ఐ మీన్ …” ఎలాగో ధైర్యం కూడగట్టుకుని, “పటం తీసేశానని కోపం వచ్చిందా?” అని మెల్లగా అడిగింది మాయ.

“కోపమెందుకు? నువ్వు చెప్పింది నిజమే. నీ Center లో జేరి నవనవలాడేటట్టు తయారవుదామని వచ్చాను.”

ముందు తెల్లబోయినా, వినాయకుడు అన్నదేమిటో నెమ్మదిగా అర్ధమయ్యేసరికి మాయ ముఖం నవ్వుతో కలకలలాడింది. “ఓ! తప్పకుండా! కావాలంటే మళ్ళీ మీ పటం తగిలించి, మీ కొత్త రూపంతో ఓ ఫొటో తీయించి దాని పక్కన పెడదాం. ‘Before and After’ పిక్చర్స్ గా భలే ఉంటాయి!” అంటూ ఉత్సాహపడింది. అంతలోనే ముఖం మళ్ళీ చిన్నబోయింది. “కానీ …,” అంది, సందేహిస్తూనే.

“ఏమిటి కానీ?”

“అఁహఁ. ఏం లేదు. మీ శరీరం ఎంత బాగా తీర్చి దిద్దినా, మీ మొహం — అదే — ఆ ముక్కూ, దంతాలూ, వగైరా …”

మనసు చివుక్కుమన్నా ఆ బాధ మొహం మీద ప్రతిబింబించకుండా జాగ్రత్తపడ్డాడు వినాయకుడు. “నిజమే. దాన్ని గురించి కూడా నువ్వే ఏదో చేయాలి.”

“నేనా? అబ్బే కుదరదు. అలాంటివి చేసేందుకు నాకు qualifications లేవు.”

“పోనీ నీ ఎరికలో ఎవరైనా –?” సూచించాడు వినాయకుడు.

మాయ ముఖం విప్పారింది. “అఫ్ కోర్స్! తార దగ్గరకు తీసుకెళ్తాను.”

“తారా?” అంటూ భృకుటి ముడిచాడు వినాయకుడు. “చంద్రుడి తాలూకు తార కాదు కదా?”

“ఊఁహూఁ. తను తారా చంద్ర కాదు. తారా మోహన్. మంచి plastic surgeon.”

“అంటే?”

“అంటే — ఎవరికైనా వారి పుట్టుకతో వచ్చిన ముఖం నచ్చకపోతే, వాళ్ళకిష్టమైన రీతిలో వాళ్ళ ముఖం మళ్ళీ చెక్కి సరిచేసే డాక్టరన్నమాట.”

“సృష్టికి ప్రతి సృష్టన్నమాట,” అని పైకని, “ఔరా! ఈ మానవులు ఎంత ప్రగతీ, ఉన్నతీ సాధించారు!” అని మనసులో మెచ్చుకున్నాడు వినాయకుడు.

* * * *

తారా మోహన్ వినాయకుడి వైపు అయిదు నిముషాలు కన్నార్పకుండా చూసి, చివరికి, “Fantastic!” అన్నది.

“అంటే?” అన్నాడు వినాయకుడు.

అతని మాట వినిపించుకోకుండా, మాయ వైపు తిరిగి, “Thank you, మాయా. నాకింత మంచి కేసు తెచ్చినందుకు నీకెంతైనా కృతజ్ఞురాలిని. ఇది నా సొంత Elephant Man కేసవుతుంది! దీంతో నాకెంత పేరూ, ప్రతిష్టలొస్తాయో!” అంటూ సంబర పడింది తార. “మీ మొహం లో ఎలాంటి మార్పులు కావాలనుకుంటున్నారు?” అని వినాయకుణ్ణడిగింది.

“ఏముంది? ఈ ముక్కూ, దంతాలూ, తగ్గించడం.”

“ఓకే,” అంటూ తార ఎవో ఫైళ్ళు బయటకి తీసి, కొన్ని ఫొటోలను వినాయకుడి ముందుంచింది. “ఎలాంటి ముక్కు కావాలి మీకు? షారూఖ్ ఖాన్ ముక్కు లాంటిదా?”

“అసలే ముక్కు పెద్దదనుకుంటుంటే, మళ్ళీ ఆ ముక్కెందుకు?” అని విసుక్కున్నది మాయ.

“పోనీ సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్,” అంటూ వేరే ఫొటోలు ముందుంచింది తార.

“ఎవరు వీళ్ళంతా?” వింతగా అడిగాడు వినాయకుడు.

“అరె! వీళ్ళే తెలియరా? వీళ్ళు ఇండియాలో ఇప్పుడు టాప్ హీరోలు. ఈ కాలంలో వీళ్ళే దేవుళ్ళు. త్రిమూర్తుల్లాగన్నమాట. ప్రజలందరూ వీళ్ళనే ఆరాధిస్తారు. వీళ్ళలాగే ఉండాలనుకుంటారు.”

అలాగా అనుకుంటూ ఫొటోలు చూడబోయి ఇంతలో సందేహం వచ్చి ఆగాడు వినాయకుడు. “ఏమిటో ఖాన్ ఖాన్ అంటున్నావు. వీళ్ళు హిందువులేనా?” అని ప్రశ్నించాడు.

“కాదు,” అన్నది తార వింతగా.

“అయితే వీళ్ళెవరి ముక్కూ నాకు వద్దు,” అన్నాడు వినాయకుడు.

“అదేం?”

“ఎందుకైనా మంచిదని. వేరే మతాలవాళ్ళతో పెట్టుకుంటే ఏం ముంచుకొస్తుందో ఎవరికి తెలుసు? అటు వాళ్ళకి కోపం, ఇటు వీళ్ళకి రోషం. మధ్యలో నేను రెంటికి చెడ్డ రేవడినౌతాను. వద్దు, వద్దు.”

“పోనీ ఎవరైనా తెలుగు హీరోలను చూపించు,” అన్నది మాయ.

“సరే. అయితే చిరంజీవి ముక్కులా చేద్దాం.”

“చిరంజీవా? అంటే కలకాలం నుంచీ ఉన్నాడా ఇతను?”

“అఁహఁ, కాదు. అది ఆయన స్క్రీన్ నేం. ఆయన అసలు పేరు శివశంకరవరప్రసాద్.”

“ఆఁ! అయితే అసలు వద్దు,” అంటూ తార తన ముందుంచబోయిన ఫొటోని పక్కకి తోసేశాడు వినాయకుడు.

“అదేంఇటి?” అంటూ తెల్లబోయారు తారా, మాయా.

“ఆఁ. శివుడు చేసిన నిర్వాకం నా విషయం లో చూడలేదూ? పోనీ నాది అతికిన తలనుకుంటే మా తమ్ముడికి ఆరు ముఖాలు. అందుకే ఆయన ప్రసాదం జోలే నాకు వద్దు.”

ఇది లాభం లేని కేసనుకొంది మాయ. తార ఒక్క క్షణం ఆలోచించి, “పోనీ తారక రాముడంటే మీకేమీ అభ్యంతరం లేదు కదా?” అనడిగింది.

“లేదు,” అన్నాడు వినాయకుడు అనుమానిస్తూనే.

“అయితే మీ ముఖం నందమూరి తారక రాముడిలాగా చేస్తాను.”

“కానీ అతను ఈ కాలపు దేవుళ్ళలో ఒకడేనా? అదేదో హీరోలన్నావు?” సందేహంగా అడిగాడు వినాయకుడు.

“ఆహా. ఆయన దేవుళ్ళకి దేవుడు లాంటి వాడు. ఆయన పెద్ద హీరోయే కాక, రకరకాల దేవుళ్ళ వేషాలు వేశారు కూడా.”

“వేషాలంటే?”

“అవతారాల్లాంటివన్నమాట.”

ఇంక అభ్యంతరాలేమీ కనిపించలేదు వినాయకుడికి. వెంటనే make over program మొదలయింది.

* * * *

అక్కడ కైలాసం లో సిద్ధీ, బుధ్ధీ వినాయకుడు ఎప్పుడు తిరిగివస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

“అవును బుధ్ధీ, మానవలోకం లో సంవత్సర కాలం మనకు ఒక రోజుతో సమానమంటారు కదా? నాధుడు భూలోకానికి వెళ్ళి అప్పుడే ఎన్నో ఏళ్ళయినట్టు అనిపిస్తోంది. ఇంకా ఎన్నాళ్ళు వేచి ఉండాలంటావు?”

“ఏమో మరి,” అంది బుధ్ధి నిస్పృహగా.

బుధ్ధి బుధ్ధికే అందని సమస్య తమదనుకుంటే సిధ్ధికి గుండె బేజారైపోయింది. “మరెలా?” అనబోతూంటే ఇంతలో ఒక ఆగంతకుడు అక్కడ సాక్షాత్కరించాడు.

“ఏయ్! ఎవరు నువ్వు? నేనూ, బుధ్ధీ ఏకాంతం గా ఉన్నప్పుడు ఇంకెవరికీ ప్రవేశం లేదని తెలియదా?”

“తెలిసే వచ్చాను,” అన్నాడాగంతకుడు చిరునవ్వులు చిందిస్తూ.

“ఎంత ధైర్యం! ఉండు నీ పని చెప్తాను,” అని బుధ్ధి భటులని కేకేయబోయింది.

“అయ్యో బుధ్ధీ! సిధ్ధి కాకపోతే నీవైనా నీ నాధుణ్ణి గుర్తిస్తావనుకున్నానే! ఎంత దుర్గతి!” అంటూ ఆ యువకుడు ఫకాలుమని నవ్వాడు.

“ఆఁ! ఏమిటీ మాయ?” అంటూ నిర్ఘాంతపోయింది సిధ్ధి.

“అవును. మాయే. మాయ మాయ,” అంటూ మళ్ళీ నవ్వాడతను.

“నాధా, నిజం గా నువ్వేనా? నేను నమ్మలేక పోతున్నాను,” అంది బుధ్ధి అతనిని నఖశిఖ ప్రయంతం పరీక్ష చేస్తూ. ధృఢంగా కండలు తిరిగిన శరీరం, చెక్కి దిద్దినట్టున్న ముఖం, నడకలో దర్పం, నుంచోవడం లో ఠీవీ — ఇతను వినాయకుడేనా?

“ఏవీ ఆ దొన్నె చెవులు? ఏదీ ఆ పొడుగు తొండం? ఏదీ ఆ గుండ్రని బొజ్జ?” అప్రయత్నం గా ఒక ఆక్రోశం లాంటిది వచ్చింది బుధ్ధి నోటివెంట.

“అవన్నీ వదిలించుకునేందుకేగదా నేను అమెరికా వెళ్ళింది? మళ్ళీ వాటినే కోరతావేం? అది సరేగానీ, చూశారు కదా మాయ ఎలాంటి అద్భుతాలు సాధించిందో? ఇక మీరు కూడా బయల్దేరండి.”

“మేమా? ఆంటూ తెల్లబోయారు సిధ్ధీ, బుధ్ధీ.

“మేమెందుకు? మేము అతిలోక సుందరులమని ప్రతీతి కదా?” అన్నది సిధ్ధి రోషం గా.

చప్పరించేశాడు వినాయకుడు. “అదొక లెక్కా? ఈ రోజుల్లో భారత వనితలు ప్రపంచసుందరి, విశ్వసుందరి అని బిరుదులు తెచ్చుకుంటున్నారు.”

సిధ్ధీ, బుధ్ధీ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. “ఓస్. బిరుదులేకావలంటే మేమూ పోటీలకి వెళ్ళి తెచ్చుకుంటాం,” అన్నది బుధ్ధి.

“మీరు గెలవరు. మీ స్తన భారమూ, జఘనభారమూ చూసి అసలు మిమ్మల్ని పోటీలో జేరనివ్వరు. ఈ కాలపు సుందరులు సన్నగా, పొడుగ్గా, రివటల్లాగా ఉండాలి.”

“అంటే గెడకర్రల్లాగానా?” అంది బుధ్ధి కొంచెం హేళనగా.

“అసూయ వద్దు. మీకెందుకు? మీరు వెళ్ళి మీ వ్యవహారం మాయ చేతుల్లో పెడితే, మిగిలినదంతా తను చూసుకుంటుంది.”

“అయినా ఇప్పుడా పిచ్చిబిరుదుల్లేకపోతేనేం? నీకు నచ్చినట్టుంటే అంతే చాలు,” అన్నది సిధ్ధి.

వినాయకుడు ఒక్క క్షణం బుర్రగోక్కున్నాడు. “నాకు నచ్చారని ఎవరన్నారు?”

“ఆఁ! నాధా! ఆ మాయ నీ ఒంటికి కండలే కాదు, కళ్ళకి పొరలు కూడా చేకూర్చినట్టుందే?”

“అబ్బా, బుధ్ధీ, ఇంకా ఆ పాత బూజుభావాలను పట్టుకు వేళ్ళాడతావెందుకు? నా కొత్త రూపానికి సరిపోయేటట్టు మీరూ మారాలి.”

“నాధా, నేను ఇదివరకే చెప్పాను. ఎదుటివారిలోని అంతః సౌందర్యాన్ని గుర్తించలేనివారికి దృష్టి దోషమో, మనోదోషమో ఉంటుందని.”

“నాలో ఏ దోషమూ లేదు. మీలో ఉన్న దోషాలని సరిజేసుకోమంటున్నాను.”

“అయితే ఈ దోషభూయిష్టమైన రూపాన్ని నీ ఎదుటినుంచి తొలగిస్తాను,” అని విసవిసా వెళ్ళిపోయింది బుధ్ధి.

తెల్లబోయి చూస్తున్న వినాయకుడిని జాలిగా చూస్తూ, “సెలవు,” అన్నది సిధ్ధి.

“ఆఁ! సిధ్ధీ, నువ్వు కూడా నన్నొదిలి పోతావా?”

“బుధ్ధి లేనివాడికి సిధ్ధి మాత్రం దక్కుతుందా, నాధా?” అంటూ నిష్క్రమించింది సిధ్ధి.

ఒక్క నిముషం దిగాలు పడినా, అంతలోనే సర్దుకున్నాడు వినాయకుడు. “పోతే పోనీయ్. సినిమా దేవుణ్ణవగానే కొత్త దేవతా భార్యలు దొరుకుతారు,” అని స్టూడియోకి బయల్దేరాడు.
తీరా చేరాక అక్కడ కాబోయే హీరోల క్యూ చూస్తే వినాయకుడి గుండె గుభేలుమన్నది. అందరూ కండలు తిరిగి, ధృఢమైన శరీర సౌష్టవం కలిగిన వారూ, చెక్కి దిద్దినట్టున్న ముఖారవిందాలు కలిగిన వాళ్ళూ.

“ఎక్కడ్నుంచి వచ్చారు ఇంతమంది?” స్వగతం ప్రకాశంగానే అనేశాడు వినాయకుడు.

“అది కూడా తెలియదా? మాడలింగ్ రంగం నుంచి వచ్చారు. వీళ్ళుగాక ఇంకా ఇలాంటి వాళ్ళు కోకొల్లలు,” వచ్చిన అభ్యర్ధులని జాబితా వేస్తున్న వ్యక్తి చెప్పాడు.

“ఆఁ! అంతమందున్నారా? ఈ పోటీ బాదరబందీ లేకుండా హీరో అయ్యే మార్గమేదన్నా ఉన్నదా?”

“లేకేం? నీకు ఎవరైనా గాడ్ ఫాదర్ ఉంటే నీ పని పండినట్లే.”

“గాడ్ ఫాదరా? నా ఫాదరే ఒక గాడ్. అయితే పనయిందన్నమాట.” సంబరపడ్డాడు వినాయకుడు. వెనక గణాధిపతిగా ఎవరు ఉండాలని పోటీ పెట్టినప్పుడు కూడా తన గాడ్ ఫాదర్ ఇలాగే భూప్రదక్షిణానికి రహస్యం చెప్పి తన పని తేలిక చేశాడు. ఇక్కడకూడా అదే పనికొస్తుందన్నమాట.

కానీ అవతలి వ్యక్తి చప్పరించేశాడు. “నీ ఫాదర్ గాడ్ అయితేనేం? డెవిల్ అయితేనేం? ఆయన ప్రొడ్యూసరా? డైరక్టరా? అదీ నేనడిగింది.”

“ఏదీ కాదు,” అన్నాడు వినాయకుడు బిక్క మొహం వేసి.

“అయితే నువ్వు దయచేయవచ్చు. మిగతా వాళ్ళతో పోలిస్తే నీకేం ప్రత్యేకత ఉంది?”

నీరసం గా కాళ్ళీడ్చుకుంటూ బయల్దేరాడు వినాయకుడు. ఈ హీరో ఛాన్సు దక్కడం అంత తేలిక కాదన్నమాట. ఇన్నాళ్ళూ తను పడిన కష్టాలూ, శరీరానికి పెట్టిన రొష్టులూ వృధా యేనా? దిక్కు తెలియకుండా రోడ్లు దున్నుతున్న వినాయకుడికి ఇంతలో ఎదురుగా గుడి కనిపించింది. పరికించి చూస్తే అది తన గుడే! హఠాత్తుగా ఉత్సాహం వచ్చింది వినాయకుడికి. అవును. సినిమా దేవుణ్ణి కాకపోయినా మామూలు దేవత్వం మిగిలి ఉన్నదికదా. ఈ గుళ్ళోకి వెళ్ళి భక్తులు తనని ఎలా కొలుస్తున్నారో చూస్తే కాస్త మనస్వాంతన పొందచ్చు.

ఇలా అనుకుంటూ లోపలికి వెళ్ళిన వినాయకుడికి పెద్ద షాక్ తగిలింది. ఎదురుగా ఉన్నది పెద్ద విగ్రహం. భక్తుల పూజలనూ, నమస్కారలనూ అందుకుంటున్న విగ్రహం. కానీ ఎలాంటి విగ్రహం? పెద్ద బాన కడుపుతో, పొడుగాటి తొండం తో, విరిగిన దంతం తో — ఎప్పటి వికారరూపం తో నున్న విగ్రహం.

పట్టలేని ఆవేశమొచ్చింది వినాయకుడికి. వీల్లేదు. ఇలాంటి రూపంలో తను పూజలందుకోడు. అదృష్టవశాత్తూ స్టూడియోలో ఇచ్చేందుకని తీయించిన ఫొటోలు తన దగ్గిరే ఉన్నాయి. వెంటనే ఈ విగ్రహం పెకిలించి, దాని స్థానాన తన కొత్త ఫొటో ఒకటి పెడతాడు.

గబగబా వెళ్ళి విగ్రహాన్ని పెరికివేశాడు. ఫొటో అక్కడ పెట్టబోయేలోపల గుళ్ళోని భక్తులందరూ హాహాకారాలు చేసుకుంటూ వినాయకుడిమీద పడి అతన్ని అవతలికి లాగేశారు. పక్కన పడేసిన విగ్రహాన్ని తీసి మళ్ళీ యధాస్థానం లో ఉంచేశారు.

“ఎంత కండకావరం రా నీకు? దేవుడి విగ్రహాన్నే పీకుతావా?” అంటూ రెచ్చిపోయిన భక్తులు వినాయకుడి మీదపడి బాదసాగారు.

వారి దెబ్బలకు కాచుకుంటూనే, “మూర్ఖులారా! నేనేరా మీ దేవుణ్ణి! నేనే వినాయకుణ్ణి!” అని గర్జించాడు వినాయకుడు.

“పోరా పో! నువ్వేం వినాయకుడివి? బొజ్జ లేదు, తొండం లేదు, దంతాలు లేవు!” అని ఇంకా విజృంభించారు ప్రజలు.

“ఓరీ అజ్ఞానులారా! మీ మూఢ భక్తి మాయలో పడి నిజమైన దేవుణ్ణి మీరు గుర్తించడం లేదు!” అని ఆక్రోశించాడు వినాయకుడు. కానీ ఉద్రిక్తులైన భక్తులు అతన్ని వినిపించుకోలేదు. వారి దెబ్బల ధాటీ తగ్గనూ లేదు. ఇంకా అక్కడ ఉండడం ప్రమాదమని గ్రహించాడు వినాయకుడు. ఎందుకొచ్చిన ప్రయాస? బతికుంటే బలుసాకైనా తినచ్చు, అనుకుని అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం మీద దృష్టి నిలిపాడు.

చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఎలాగో ఆ మంద లోంచి బయటపడ్డాడు కానీ, ఇప్పుడు తన పరిస్థితేమిటో అర్ధం కాలేదు. అనురాగవతులైన భార్యలిద్దరూ తనని వదిలి వెళ్ళిపోయారు. దొరుకుతుందనుకున్న కొత్త దైవత్వం అందుబాటులో లేకుండా పోయింది. సొంతమైనదనుకున్న పాత దైవత్వం ఈ కొత్త రూపం లో దక్కేటట్టు లేదు. మరి ఇన్నాళ్ళ తన ప్రయాసకి అర్ధమేమిటి? ఇప్పుడు తన స్థానమెక్కడ?

దిగులుగా, ఒంటరిగా, దీనవదనం తో కూర్చుండిపోయాడు వినాయకుడు.

ఇంతలో ఏదో వెలుగు తన దగ్గరికి వస్తున్నట్టు తోచి తలెత్తి చూశాడు. ఆశ్చర్యకరం గా ఎదురుగా సిధ్ధీ, బుధ్ధీ నిలచి ఉన్నారు. ఎందుకో దుఃఖం పొంగుకు వచ్చింది వినాయకుడికి.

“చూశారా? నేను దేవుణ్ణే కాదు పొమ్మన్నారు ఆ గుళ్ళో వాళ్ళు. వాళ్ళు నా భక్తులట!”

“అందుకే వాళ్ళు నిన్ను గుర్తించలేదు,” మృదువుగా అన్నది బుధ్ధి. “భక్తుల మనసులో ఏర్పరుచుకున్న రూపం తప్ప దేవుడికి వేరే రూపమేమీ లేదు.”

“అయితే మళ్ళీ నేనా వికార వేషం వెయ్యాల్సిందేనా?” బెంగగా అడిగాడు.

మందహాసం చేసింది బుధ్ధి. “నువ్వు కోరుకున్నట్టు హీరో దేవుడివైతే ఎన్నెన్ని వికార వేషాలు వేయాల్సి వచ్చేదో, ఎలాంటి వికార చేష్టలు చేయాల్సి వచ్చేదో ఆలోచించలేదా?”

వెలవెలబోయాడు వినాయకుడు. “అయితే నేనా మూర్ఖ భక్తుల పంచలోనే పడి ఉండాలా?” నిరాశగా అడిగాడు.

“వాళ్ళు మూర్ఖులెందుకయ్యారు? నిజమైన భక్తులకు దేవుడెప్పుడూ తమలోని దైవత్వాన్ని గుర్తించేందుకు ఒక సాధనం మాత్రమే. వారికి కావాల్సింది ఆకాశమంత ఎత్తులో ఉన్న దేవుడు కాదు, తమకు అందుబాటులో ఉండి, తమలో ఒకడిగా మసలే దేవుడు. వాళ్ళకి పరిపూర్ణమైన ఆత్మ చాలు, పరిపూర్ణాకారం అక్కరలేదు. పొట్టిగా, లావుగా, అతికించిన తలతోఉన్నా, పరిశుధ్ధమైన ఆత్మతో దేవుడవగలిన వాడే వాళ్ళకు అసలైన హీరో.”

బుధ్ధి మాటలు వింటూంటే వినాయకుడి మనసు నెమ్మదిగా కుదుటపడ్డది. “నువ్వు చెప్పిందంతా నిజమే, బుధ్ధీ. కానీ ఒక్కసారి ఆ సినిమా హీరోని కూడా అవుతే బావుండేదనిపిస్తోంది,” అన్నాడు నిట్టూరుస్తూ.

“దానికేం, నాధా? నువ్వు సినిమాల్లో లేవని ఎందుకనుకుంటున్నావు? అటు చూడు,” సిధ్ధి చిలిపిగా పక్కనున్న టీవీ చూపించింది. దాని తెరమీద సినిమా హీరో హుషారుగా నాట్యం చేస్తూ, పాట పాడుతూ ఊరేగింపుకి దోవ చూపిస్తున్నాడు. ఆ ఊరేగుతున్న దేవుడెవరు? గుండ్రటి బొజ్జ, బారెడు తొండం, పొడుగాటి దంతం …

“అరె! అది నేనే!” సంబరంగా అన్నాడు వినాయకుడు.

“ముమ్మాటికీ నువ్వే.”

“అంటే, నా పాత రూపంతో అటు గుళ్ళో పూజలనూ అందుకోవచ్చు, ఇటు సినిమాల్లోనూ ఉండవచ్చన్నమాట!” సంతోషం పట్టలేకపోయాడు వినాయకుడు.

“మరేమిటి? పద, కైలాసానికి వెళ్దాం,” అంటూ బయల్దేరింది బుధ్ధి.

“దోవలో కాస్త నమిలేందుకు ఇవిగో,” అంటూ ఉండ్రాళ్ళ పళ్ళెం అందించింది సిధ్ధి.

“మోరియా! మోరియా! మోరియా! మొరియా!” అని టీవీలో పాట సాగుతోంది.


రచయిత మాచిరాజు సావిత్రి గురించి: జననం ఏలూరులో. తొమ్మిదేళ్ళ వయసు నుంచి అమెరికా, కెనడాలలోనే ఉన్నారు. నివాసం కేలిఫోర్నియాలో. వాతావరణకాలుష్య రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు, నాటకాలు, ఓ నవల రాసారు. ...