ది వేస్ట్‌ లాండ్: 3. గేమ్ ఆఫ్ చెస్

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


2. ఎ గేమ్ ఆఫ్ చెస్

వేస్ట్‌ లాండ్‌లో రెండవ కవితాభాగం ఎ గేమ్ ఆఫ్ చెస్ (A Game of Chess). దీనిని సాధారణంగా రెండు భాగాలుగా చూస్తారు. ఒకటి, ఒక సంపన్న స్త్రీ వర్ణన; రెండు, కింది తరగతి స్త్రీల జీవనచిత్రం. కాని, యీ రెంటికి మధ్య ఒక సంభాషణ ఉన్నది. దీనిని సాధారణంగా మొదటి దృశ్యంలోని స్త్రీకి సంబంధించినదిగా చూస్తారు. విడిగా, స్వతంత్రంగా కూడా యీ సంభాషణ నిలబడగలదేమో, లేక ప్రారంభదృశ్యాన్ని, ముగింపు దృశ్యాన్ని సంధించగలదేమో కూడా చూద్దాం.

ఎ గేమ్ ఆఫ్ చెస్‌లో ప్రధాన గాథలు:

ఈ కావ్యనాయిక వర్ణనలో తక్కిన కావ్యంలో లాగానే, అనేక పూర్వకావ్యాల స్మరణ ఉన్నది. అవి:

  • మిడిల్‌టన్ (17వ శతాబ్ది) నాటకాలు రెండు: ఎ గేమ్ ఆఫ్ చెస్, ఉమెన్ బివేర్ ఉమెన్.
  • షేక్స్‌పియర్ నాటకం: ఆంటొనీ అండ్ క్లియోపాత్ర.
  • ఫిలోమెల్ గాథ.

మిడిల్‌టన్ నాటకం, ఎ గేమ్ ఆఫ్ చెస్ అని దీని పేరు. చదరంగం ప్రస్తావన యిందులో ఒకే ఒకసారి వస్తుంది. ‘రేపు ఏం చేద్దాం? ఎపుడైనా ఏం చేద్దాం?’ అని అడిగిన ప్రశ్నకు జవాబు: ‘చదరంగం ఒక ఆట ఆడుదాం.’) ఏమిటి యీ కవితాభాగాన్ని మొత్తము ఆక్రమించగలిగిన దీని ప్రాముఖ్యం? మిడిల్‌టన్ రాసిన రెండు నాటకాలలో యీ చదరంగం ఆట ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో పాత్రలు మనుషులు కారు, చదరంగంలోని పావులు. రాజు రాణి బిషప్ – యిట్లా వేషాలు, అవే పేర్లు. ఇంగ్లండ్‌కు స్పెయిన్‌కు జరిగిన యుద్ధం యిందులో రూపకం (Allegory). రాజకీయం యిందులో ప్రధాన విషయం. ఆ రాజకీయంలో భాగంగా కొంత శృంగారం. పావుల యుద్ధం, పావుల శృంగారం. ఈ నాటకంలో పాత్రలు, ఎవరో నడిపితే నడిచే పావులు, కొయ్యబొమ్మలలాగా మారిపోయిన మనసు లేని మనుషులు. స్వేచ్ఛ లేదు, సహానుభూతి లేదు. ఎత్తులు జిత్తులు, ఎత్తుకు పై ఎత్తులు. ప్రపంచనాటకరంగం చదరంగమయితే, ఆ రంగస్థలంపై నలుపు తెలుపు గడులలో నడిచే కొయ్యబొమ్మలే కాని, మనిషి మృగ్యమైనాడు. ఇదీ యీ నాటక సందేశం.

మిడిల్‌టన్ మరో నాటకం ఉమెన్‌ బివేర్ ఉమెన్ (Women Beware Women). ఇందులో, ఒక దృశ్యంలో యిద్దరు స్త్రీలు చదరంగం ఆట ఆడుతారు. సరిగా చెప్పాలంటే, ఒక స్త్రీ మరొక స్త్రీని ‘ఆడిస్తుంది’. లివియా ఒక సంపన్న స్త్రీ. ఆమె యువతులను వంచనతో పురుషుల వశం చేస్తుంటుంది. అది ఆమె వృత్తి కాదు, కాని ప్రవృత్తి. బ్రాంకా వెనిస్‌లో ఒక గొప్పయింటి పిల్ల. పేదవాడిని ప్రేమించి పారిపోయి ఫ్లోరెన్స్ చేరుతుంది. అక్కడి డ్యూక్ ఆమెను స్వకీయం చేసుకోవలె అనుకొంటాడు. ఆ ప్రయత్నంలో అతడికి లివియా తోడుపడుతుంది. డ్యూక్, లివియా యింటిలో ఒక గదిలో దాగి ఉంటాడు. అప్పుడు ఆమె బ్రాంకాను, ఆమె అత్తను తన యింటికి ఆహ్వానిస్తుంది. వారు ఆమె యింటికి రావడం అది మొదటిసారి. పనిమనిషి తోడు యిచ్చి బ్రాంకాను యిల్లంతా చూసి రమ్మంటుంది. ఆ పనివాడు ఆమెను డ్యూక్ వేచి ఉన్న గదికి తీసుకెళ్ళి వదిలేస్తాడు. ఆ గదిలో డ్యూక్ ఆమెను వశం చేసుకోవడంలో సామదానభేదదండములు ప్రయోగిస్తూ ఉంటాడు. ఆ గదిలో బ్రాంకా, డ్యూక్‌ల మధ్య ఏమి జరుగుతున్నదో తెలియకుండా, అత్త దృష్టిని మళ్ళించడానికి ఆమెను చదరంగం ఆటకు కూర్చోపెడుతుంది లివియా. గది లోపలి క్రీడను స్ఫురింపచేసే విధంగా, చదరంగపు ఎత్తులను చెబుతూ ఉంటుంది లివియా. (చదరంగంలోని రూక్‌ను ఆ కాలంలో డ్యూక్ అనేవారేమో?) అక్కడ గది లోపల డ్యూక్ ఆడుతున్న ఆట, వెలుపల చదరంగం ఆట, రెండు కలిసి సాగి, రెండు కలిసి ముగుస్తాయి. రెండూ విజయవంతమవుతాయి.

ఆంటొనీ అండ్ క్లియోపాత్ర:

ఎలియట్ ఎ గేమ్ ఆఫ్ చెస్ ప్రారంభదృశ్యం, ఒక సంపన్న స్త్రీ, ఆమె అందమైన గది, ఆమె అలంకారసామగ్రి, ఆ గది ఖరీదైన అలంకరణ – ఈ వర్ణన షేక్స్‌పియర్‌ రాసిన ఆంటొనీ అండ్ క్లియోపాత్రలో క్లియోపాత్రను గుర్తు చేస్తుంది. ఈ నాటకం షేక్స్‌పియర్ నాటకాలలో ప్రసిద్ధమైనది. ఎలియట్‌కు బాగా నచ్చిన నాటకం కూడా, తన సాహిత్యవిమర్శ వ్యాసాలలో తరచు యీ నాటకాన్ని ప్రస్తావిస్తాడు.

ఈ నాటకంలో, ఆంటొనీకి ఆంతరంగికుడు ఈనోబార్బస్, క్లియోపాత్ర సౌందర్యాన్ని, వైభవాన్నీ వర్ణిస్తున్నాడు.

Enobarbus:
I will tell you.
The barge she sat in, like a burnish’d throne,
Burned on the water: the poop was beaten gold;
Purple the sails, and so perfumed that
The winds were lovesick with them; the oars were silver,
Which to the tune of flutes kept stroke, and made
The water which they beat to follow faster,
As amorous of their strokes. For her own person,
It beggar’d all description: she did lie
In her pavilion, cloth-of-gold of tissue,
O’erpicturing that Venus where we see
The fancy outwork nature: on each side her
Stood pretty dimpled boys, like smiling Cupids, …

క్లియోపాత్ర ఒక నౌకపై కూర్చుని ఉన్నది. ఆమె మహారాణి. ఆమె అందానికి అధికారానికి తగినట్టే ఉంది ఆ నౌక, తప్తకాంచనసింహాసనంలా – like a burnish’d throne. కాగి కరుగుతున్న బంగారంలా నీటిపై దాని బంగారుకాంతులు – Burned on the water. గంధవాహుడికే మత్తెక్కించే సుగంధాలు – the winds were lovesick with them. వెండి తెడ్డులకు లయను, నౌకకు వేగాన్ని యిచ్చే సుమధురవేణుగానతరంగాలు – the oars were silver, Which to the tune of flutes kept stroke. తెడ్డు వేయడం, ప్రియురాలి శరీరాన్ని తడిమినట్టు నీటిని తడుముతూన్న అరచేతులలా తెడ్లు – As amorous of their strokes. వీనస్, క్యూపిడ్ బొమ్మలు. రాజవైభవము, శృంగారభావము నిండిన సన్నివేశం.

ఇంత ఉజ్వలంగా వెలిగిపోతున్న క్లియోపాత్ర చిత్రం కింద షేక్స్‌పియర్ మంట పెట్టడం మరచిపోలేదు. నీరు కాలుస్తుందా? (Burned on the water.) ఏది సుఖశీతలహేతువో అదే దుఃఖకారణమవుతుంది. నీరు నిప్పయి ఆమె జీవితాన్ని దహించబోతుంది, అన్న ధ్వని. భగ్నప్రేమ, దగ్ధజీవితము. షేక్స్‌పియర్‌ను మరో ప్రయోజనానికి వాడుకోచూడడం సాహసమే! ఎలా వాడుకొన్నాడు ఎలియట్?

ఈ క్లియోపాత్రను మరో పాత్రతో (అలెక్జాండర్ పోప్ వ్యంగ్యకావ్యం లోని బెలిండా) కలిపి తన నాయికను రూపిస్తాడు ఎలియట్.

ది రేప్ ఆఫ్ ది లాక్ (The Rape of the Lock)

పోప్ కావ్యంలో నాయిక బెలిండా. ఆమె డ్రెసింగ్ టేబుల్ వర్ణన:

First, rob’d in White, the Nymph intent adores
With Head uncover’d, the Cosmetic pow’rs.
A heav’nly Image in the Glass appears,
To that she bends, to that her Eyes she rears;
… Puffs, powders, patches, bibles, billet-doux.
Now awful beauty puts on all its arms;
The fair each moment rises in her charms,
Repairs her smiles, awakens every grace,
And calls forth all the wonders of her face; Sees by degrees a purer blush arise,
And keener lightnings quickens in her eyes
The busy sylphs surround their darling care
These set the head, and those divide the hair
Some folds the sleeve, while others plait the gown;
And Betty’s praised for labours not her own.[138-148]

ఇక్కడ చెప్పిన అలంకరణ సామగ్రి, పూజకు ఆమె సిద్ధం చేసుకున్న పూజాద్రవ్యాలు మాత్రమే కాదు, ఆమెను పూజించడానికి కూడా ద్రవ్యాలు. బెలిండా నిద్ర లేవగానే యీ పూజావస్తువులకు నమస్కారం చేసి తన దినచర్య ప్రారంభిస్తుంది. ఆమె తల వంచేది, అద్దంలో కనిపించే తన దేవతాప్రతిబింబాన్ని చూచుకోడానికే – A heav’nly Image in the Glass appears /To that she bends.

తరువాత, అవే వస్తువులతో పూజారిణులు ఆమెను పూజకు సిద్ధం చేస్తారు. ఆమె వాడే పౌడర్లు, అత్తరులు, లేపనాలు, ప్రేమలేఖలు, వీటితో కలిసిపోయి బైబిల్ కాపీలు కూడా ఆమె డ్రెసింగ్ టేబుల్‌ను అలంకరిస్తాయి – Puffs, powders, patches, bibles, billet-doux. దేహార్చన దేవతార్చన ఏకమవుతాయి. ఈ వ్యంగ్యం ఎలియట్‌కు ఎంతవరకు అవసరం? ఇందులోని వ్యంగ్యాన్ని ఎంతవరకు దించుకున్నాడు ఎలియట్? ఎలియట్ దేనినైనా యథాతథంగా స్మరించడు కదా?

ఇంతటితో అయిపోలేదు. ఎలియట్ మరో స్త్రీ విషాదగాథను కూడా యీ నాయిక కథలో కలిపేస్తాడు.

ఫిలొమెల్ గాథ:

ఓవిడ్ (Ovid) కావ్యం మెటమార్ఫసిస్‌లో (Metamorphoses), టిరియస్ (Tereus) అనే రాజు తన భార్య చెల్లెలయిన ఫిలోమెలాను బలాత్కరించి మానభంగం చేసి, ఆమె నాలుకను కోసేస్తాడు, తనకు జరిగిన అత్యాచారం చెప్పుకోలేకుండా. కాని ఫిలోమెలా తనకు జరిగిన అత్యాచారాన్ని ఒక బట్టలో చిత్రరూపంలో నేతనేసి తన సోదరికి పంపుతుంది. అక్కా చెల్లెలు ప్రతీకారంగా, రాజు కొడుకును చంపి వండి, కొడుకు మాంసం తండ్రికి తినిపిస్తారు. ఈ విషయం రాజుకు తెలిసి, వారిద్దరినీ చంపడానికి తరుముతాడు. కాని, దేవతలు వారి ముగ్గురిని పక్షులుగా మార్చేస్తారు. (ఈ ఓవిడ్ కథ తరువాత కొంత మారి ప్రచారమైంది.) ఫిలోమెలా నైటింగేలుగా మారింది. నైటింగేలు అప్పటినుండి తన విషాదగాథను వినిపిస్తూనే ఉంది, తన భాషలో.

కీట్స్ ఓడ్ టు ఎ నైటింగేల్ (Ode to a Nightingale) చాలా ప్రసిద్ధమైన కవిత. కాని ఆ విషాదగీతిలో కూడా యీ గాథను స్మరించలేదు కీట్స్. కాని, పదహారవ శతాబ్దపు కవి జాన్‌ లిలీ (John Lyly) కవితలో వస్తువు యీ విషాదగాథే. ఇందులో టిరియస్ పేరు స్ఫురించే టిరూ (tereu) కూడా ఉంది.

WHAT bird so sings, yet so does wail?
O ‘tis the ravish’d nightingale.
Jug, jug, jug, tereu! she cries,
And still her woes (Spring’s Welcome.)

ఎలియట్ యిందరి స్త్రీమూర్తులను, యిన్ని రసాలను కరగించి పోసిన పోతను చూద్దాం.

ఎ గేమ్ ఆఫ్ చెస్ – మొదటి దృశ్యంలో పూర్వభాగం:

ఈ కవితాభాగంలో రెండు దృశ్యాలు. ఒకటి ఒక సంపన్నస్త్రీ జీవితం. రెండు, ఒక పబ్‌లో (pub) సంభాషణ. ఇద్దరు తక్కువ తరగతి ఆడవాళ్ళు, అక్కడ లేని మరో ఆడమనిషి గురించి మాట్లాడుకొంటారు. అయితే, యీ రెండు దృశ్యాలు రెండు సామాజిక వర్గాలమధ్య అంతరాన్ని చెప్పడానికి కాదు, ప్రాథమికంగా వారి జీవితాలలో జీవితసాఫల్యంలో భేదం లేదు అని చెప్పడానికి.

The Chair she sat in, like a burnished throne – ఇది ఒక స్త్రీ వైభవ దృశ్యం అని తెలుస్తూనే ఉన్నది. ఒక మహారాణిలా జీవిస్తున్నది అని తెలియజెప్పడానికి క్లియోపాత్రను గుర్తు చేస్తున్నాడు ఎలియట్. ఆమె కుర్చీ బంగారు సింహాసనంలా ఉంది. ఆ బంగారుకాంతులు చలువరాతిపై ప్రతిఫలిస్తున్నాయి – Glowed on the marble. ఇంతవరకు యీమె క్లియోపాత్ర. తరువాతి పాదంలో బెలిండాగా మారబోతున్నది – the glass/ Held up by standards wrought with fruited vines…

అక్కడ ఒక నిలువుటద్దం. ఆ అద్దానికి కళాత్మకమైన కాళ్ళు (standards), ఆ కాళ్ళపై పోతపోసిన ద్రాక్షతీగలు, ద్రాక్షగుత్తులు. ఆ చట్రంలో క్యూపిడ్ (శిశు మన్మథుడు) తొంగి చూస్తున్నాడు. ఆ మన్మథుడి కళ్ళు మరొకడు వెనుకనుండి మూస్తున్నాడు. (ప్రేమలో కనులు మూసుకుపోతాయి కదా!) సప్తదీపాల సెమ్మెనుండి – the flames of seven branched candelabra – వెలుగులు ఆమె డ్రెసింగ్ టేబుల్ మీద పడుతున్నాయి. ఆ దీపపు వెలుగులను ఎదురెళ్ళి కలుస్తున్నాయి, టేబుల్‌పై తెరచి పరచి ఉంచిన శాటిన్ పెట్టెలలోని ఆమె నగల కాంతులు. తెరచి ఉన్న దంతపు భరిణలలోని, రంగుల సీసాలలోని సుగంధద్రవ్యాల వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కిటికీలో నుండి వస్తున్న బయటిగాలి ఆ వాసనలను కదిపి కలవరపెడుతున్నది. దీపకాంతులు రాగిరేకులు అద్దిన గది లోపలికప్పును (coffered ceiling) రాగరంజితం చేస్తున్నాయి. ఒక డాల్ఫిన్ యీదుతున్న బొమ్మ. ఫిలొమెల్ విషాదగాథను చిత్రించిన ఒక చిత్రపటం. ఇది ఆమె దర్బారు వైభవం.

ఇది ఎవరి వర్ణన?కవి యిందులో ఒక స్త్రీని వర్ణిస్తున్నాడా? ఈ వర్ణనలో స్త్రీ కనిపిస్తున్నదా? ఆమె జాడ లేదు. ఆమెతో కాదు, ఆమె కుర్చీతో మొదలైంది వర్ణన – The Chair she sat in:

ఇక్కడి భూతకాలక్రియ ఆమెను చెప్పడం లేదు, ఆమె కుర్చీని చెబుతున్నది. (sat – Past habit. అంటే used to sit. Chair, C in caps.) వర్ణనలో ఆమెకు కాదు, ఆమె కుర్చీకి పెద్ద పీట. అది ఆమె యిప్పుడు ‘కూర్చున్న’ కుర్చీ కాదు, ఆమె ఎప్పుడూ ‘కూర్చునే’ కుర్చీ. ఈ దృశ్యంలో ఆమె లేదు. ఆమె మాత్రమే కాదు, ప్రాణమున్నదేదీ లేదు. కుర్చీ ఉన్నది. దీపపు సెమ్మె ఉన్నది. ప్రాణం లేని డాల్ఫిన్ ఉన్నది. డాల్ఫిన్ బాధ ఉన్నది. డాల్ఫిన్ స్వభావం ఉల్లాసం. ఇక్కడ అది యీదడం నీటిలో కాదు, కృత్రిమకాంతిలో (sad light).

ఉద్దీపనం చేయవలసిన సుగంధద్రవ్యాలు, ముక్కులు బిగించేస్తున్నాయి. గొడ్డలిపెట్టు (Axe Effect!) లాంటి ఆ ఘాటువాసనలకు ‘తల తిరిగి’పోతుంది – drowned the sense in odours (senses కాదు, ‘sense’) అంటే బుద్ధి. కిటికీనుండి వస్తున్న సహజవాయువులను సహించలేక ఆ కృత్రిమగంధాలు పైకి పాకుతున్నాయి. ఈ దృశ్యంలో ప్రాణమున్న వస్తువు ఒక్కటి లేదు. అంతా కృత్రిమమే. సహజత్వాన్ని సహించలేనంత కృత్రిమత్వం.

ఈ ఫిలోమెల్ చిత్రపటానికి చట్రం (frame) ఏమిటి? అకృత్రిమమైన సహజప్రేమ సన్నివేశం – the sylvan scene. మిల్టన్ వర్ణించిన స్వర్గం, పేరడైజ్. ఈ దృశ్యంలో కనిపిస్తున్న శిల్పాలు చిత్రపటాలు, నరికిన కాలవృక్షపు ఎండిన మొదళ్ళలా ఉన్నాయి (withered stumps of time). ఈ దృశ్యం చివరి వరకు, చివర కూడా, ‘ఆమె’ కనిపించదు. ఆమె కేశ’పాశం’ మాత్రం కనిపిస్తుంది.

దృశ్యప్రారంభంలోని క్లియోపాత్ర ముగింపులో మెడుసాగా (Medusa) మారిపోయింది. క్లియోపాత్రగా మొదలై, బెలిండాగా, ఆ తరువాత ఫిలోమెల్‌గా మారి, చివరకు మెడుసాగా కథ ముగుస్తుంది (metamorphoses). వైభవం విచారంలోకి దిగి (sad light), విచారంలో నుండి ఘోరవిషాదం లోకి మారి, అది తీవ్రప్రతీకారంగా ముగుస్తుంది. నిజానికి కథ ఎక్కడ మొదలయిందో అక్కడే ముగిసింది. క్లియోపాత్ర విషాదంలో మొదలై ఫిలోమెల్ అత్యాచారంలో రూపం మారి మెడుసాగా అవతారమెత్తింది, భయంకర ప్రతీకారానికి.

Under the firelight, under the brush, her hair
Spread out in fiery points
Glowed into words, then would be savagely still.

Fiery points/ Glowed into words: మాటలా? మాటలెక్కడివి? ఫిలోమెల్‌పై అత్యాచారం చేసిన మగమహారాజు (టిరియస్) ఆమె నాలుక కోసేశాడు కదా? ఆమె యిప్పుడు మెడుసా. ఆమెకు మాటలు లేవు, మంటలే. కేశపాశం, విప్పిన అగ్నికీలలు. ఆమె మాయలో మాడిపోయిన మనుషుల జాడ ఉండదు. (ఈ వర్ణనలో కూడా ఆ జాడ లేదు.) మంత్రం ముగిశాక ఆమె మళ్ళీ నిశ్చలశిల – savagely still.

ఇంతకూ ఎలియట్ ఈ దృశ్యంలో వర్ణించిన స్త్రీ ఎవరు? ఆయన మొదటి భార్య వివియన్ అని కొందరి ఊహ. ఆయన వర్ణించింది ఒక స్త్రీని కాదు, స్త్రీని. స్త్రీకి ఎన్ని ముఖాలుంటాయో అన్నీ కరిగించి పోసిన పోత. మసి అయిపోయేది స్త్రీయే, మసి చేసేది స్త్రీయే. ఈ దృశ్యంలో వస్తువు స్త్రీ మాత్రమే కాదు. కృత్రిమత్వంలో బుద్ధి నశించిన మనిషి – drowned the sense in odours (senses కాదు, ‘sense’, ‘బుద్ధి’ అని చెప్పుకున్నాం.)

కాలం మనిషిని, స్త్రీని కాని పురుషుణ్ణి కాని, మార్చదు. పురాణమైనా (ఫిలోమెల్), చరిత్ర (క్లియోపాత్ర) అయినా, వర్తమానమైనా భవిష్యత్ అయినా, సింహాసనంపై కూర్చున్నా సాదా కుర్చీలో కూర్చున్నా మనిషి మనిషే. మహారాణి సింహాసనంపై ఎందుకు కూర్చుంటుంది? ఆమెకూడా సామాన్యమైన మనిషి అని తెలిసిపోకుండా ఉండడానికి. తొడుగులు తీసి చూపిస్తున్నాడు ఎలియట్. ఈ దృశ్యంలో ఫిలొమెల్ గాథను చూపించే పెద్ద చిత్రం ఉంది. అది ఎక్కడ చూపిస్తున్నాడు కవి?

As though a window gave upon the sylvan scene
The change of Philomel, by the barbarous king
So rudely forced…

స్వర్గపటంపై నరకాన్ని చిత్రిస్తున్నాడు ఎలియట్. మిల్టన్ వర్ణించిన ఈడెన్‌ను గుర్తుచేస్తున్నది sylvan scene. సహజస్వచ్ఛస్వభావమనే స్వర్గరంగస్థలంపై, ఫిలోమెల్‌పై జరిగిన ఘోర అత్యాచారాన్ని ప్రదర్శిస్తున్నాడు, కాలమానాలు విప్పేసి, స్వర్గనరకాలు కలిపేసి.

ఈ భాగంలో స్వరం ఎవరిదో తెలియదు, కాని గంభీరస్వరం. ఈ వర్ణన ముగిసిన తరువాత మనం వినబోయే సంభాషణలో ఒక పురుషస్వరం వినిపిస్తుంది. కాని యీ వర్ణన అతడు చేయగలిగింది కాదు. పాపం అతడికి మామూలు మాటలే రావు! కవి మాటలా? వేస్ట్ లాండ్‌లో కవి మాట్లాడడు కదా!

(సశేషం)