పరిపాకం

రాజాగృహంలో తానొచ్చిన వర్తకపు పని పూర్తవగానే బావమరిదిని కలవడానికి బయల్దేరాడు అనాథపిండకుడు. బావ ఇంట్లోకి వస్తున్న అనాథపిండకుడిని ఎవరూ పలకరించకపోవడం ఒక ఆశ్చర్యమైతే, ఇంట్లో అందరూ ఏదో శుభకార్యం కోసమన్నట్టూ తీరిక లేని ప్రయత్నాల్లో ఉండడం మరొకటి. జరిగే ఏర్పాట్లన్నీ వింతగా చూస్తూ లోపలకి వెళ్ళాక కనిపించిన బావమరిదితో నవ్వుతూ అన్నాడు.

“ఏం బావా, అంతా కులాసాయేనా, నాకు తెలియకుండా పెళ్ళో లేకపోతే మరో శుభకార్యమో జరిపిస్తున్నావులా ఉందే, నా దగ్గిరకూడా రహస్యాలు దాస్తున్నావన్నమాట.”

“ఇదేనా రావడం? నీ దగ్గిర రహస్యాలా, భలేవాడివే. పెళ్ళీ లేదు శుభకార్యమూ లేదు, రేపు తథాగతులవారినీ వారి శిష్యులనీ భిక్షకి ఆహ్వనించాను. ఎన్నోసార్లు అడిగాక ఇప్పటికి వస్తున్నారు. వాళ్ళొచ్చినప్పుడు అతిథ్యంలో ఏ మాత్రం తేడా ఉండకూడదని అన్ని పనులూ మానుకుని ఇవన్నీ దగ్గిరుండి నేనే చూస్తున్నాను.” బావ ఆహ్వానించాడు.

“తథాగతుడా, ఆయనెవరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన వర్తకుడా? ఎందుకాయనకీ విందు?”

బావమరిది అనాథపిండకుడి కేసి వింతగా చూసి చెప్పాడు, “ఈ విశాల ప్రపంచం దేనిమీద ఆధారపడి బతుకుతోందో, ఏది ధర్మమో, ఆ ధర్మాలకి మూలకారణం ఏమిటో శోధించి కనుక్కున్నవాడు, బుద్దుడు వర్తకుడు కాదు. రాజగృహంలో ఆయన గురించి వినని వాడు లేడు. ఒక్కసారి కానీ ఆ తథాగతుణ్ణి చూశావా, ఆ తర్వాత…”

“తథాగతుడు, బుద్ధుడు అనే పదాలు ఇంతకుముందు విన్నట్టులేదు కానీ, నువ్వు చెప్తుంటే ఆయనని చూడాలనే ఉంది. బుద్ధుడంటే?”

“బుద్ధుడంటే మానవుడిగా పుట్టాక పరిపూర్ణత్వాన్ని స్వంతంగా శోధించి కనుక్కున్నవాడు. ఆయన శిష్యులమని చెప్పుకునేవారికి బుధ్ధత్వం సిద్ధిస్తే వాళ్ళు అర్హతులు. ఓ సారి ఆయనని కలిసి చూడు, ఆ తర్వాత నీకే తెలుస్తుంది.”

“అలాగా, అయితే ఈ రోజే కలుసుకోవచ్చా ఆయనని?”

“విందు రేపు సాయంకాలానికి. ఆయన ఉండేది దూరంగా ఊరు బయట వేణువనంలో. ఈ లోపున నీ ప్రయాణం బడలిక తీరనీయి.”

భోజనం అయ్యాక రాత్రి పడుకోబోతూంటే బావమరిది వాడిన మాటలు అనాథపిండకుడి మనసులో అదేపనిగా మెదులుతున్నాయి. తథాగతుడు, బుద్ధుడు, పరిపూర్ణత్వం, ధర్మం, శోధించడం… మగత నిద్ర. తెల్లవారిందా? అప్పుడే? లేకపోతే తానింకా బద్ధకిస్తూ బారెడు పొద్దెక్కేదాకా పడుకున్నాడా? నిద్ర, మెలుకువ, కలలో బావమరిది చెప్పిన కబుర్లు – తథాగతుడు, బుధ్ధుడు, ధర్మం…

ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు, తూర్పు తెల్లవారుతున్నట్టే ఉంది. సూర్యోదయంతోటే లేచి ఓ సారి తానే బుద్ధుడు ఉండే విహారానికి వెళ్దాం అని కదూ నిన్న రాత్రి పడుకోబోతూ అనుకున్నది? లేచి బయల్దేరాడు అనాథపిండకుడు. ఇంటికి దూరంగా ప్రాకారం దగ్గిర ముప్పయ్యేసి అడుగుల ఎత్తు తలుపులు, కాపలా మనుషులూను. ఇంకా వీళ్ళు లేవలేదేం? తలుపులు తీయమని చెప్పాలి కాబోలు. వడివడిగా ముందుకి నడిచాడు కలలో నడుస్తున్నట్టూ. తలుపుల దగ్గిరకి వెళ్ళేసరికి తెల్సిన విషయం అవి దగ్గిరకి వేసి ఉన్నాయంతే, తాళాలూ గడియలూ లేవు. హమ్మయ్య, ఎవర్నీ లేపక్కర్లేదు, తలుపులు తోసి బయటకి నడిచేడు.

వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నై. మగతలో ఉన్నట్టు నడుచుకుంటూ బయల్దేరాడు బుద్ధుణ్ణి చూడడానికి. ఊరి బయట వేణువనం అనేది ఎక్కడో, ఆ రోజున అక్కడ బుద్ధుడుంటాడో లేదో తనకి బావమరిది చెప్పలేదని కూడా మనసులో తెలియడం లేదు. దూరం వచ్చేసరికి ఎవరూ లేకపోవడం గమనించి చుట్టూ చూశాడు అనాథపిండకుడు. అదే నిశ్శబ్దం. ఆకాశంలోకి చూస్తే ఇంకా నక్షత్రాలు మిణుక్కుమంటున్నాయి. సూర్యోదయం కాబోతోంది కదా? పొద్దుపొడుస్తున్నా లేవరా ఈ ఊర్లో జనం? పోనీయ్, తనకేల? మళ్ళీ నడక. మరి కాస్త దూరం నడిచాక ఏదో స్వరం వినిపించినట్టూ అయితే చెవులు రిక్కించాడు. రెండు మూడు సార్లు విన్నాక తెల్సింది, ఎవరో తననే పిలుస్తున్నారు, ‘రా సుదత్తా, మంచి సమయంలోనే వచ్చావు’ అంటూ. తాను పుట్టినప్పుడు పెట్టిన పేరు సుదత్తుడైనా ఆ పేరుతో తల్లితండ్రులు తప్ప మరొకరెప్పుడూ పిలవలేదు తనని. ఆ పేరు తనదే అని ప్రపంచంలో తెల్సినవారు దాదాపు ఎవరూ లేరే?

చెవులు రిక్కించి విన్నాక ఆ పిలిచే స్వరం ఎటునుంచి వస్తోందో గమనించి అటువేపు నడిచాడు. విహారానికి జేరిన అనాథపిండకుడికి ద్వారంలోనే కనిపించిన తథాగతుడు నవ్వుతూ ఆహ్వానించాడు. “రా సుదత్తా, యుద్ధం జరగడానికి ముందు వందల ఏనుగులు వేసే మొదటి అడుగుకంటే, వేల గుర్రాలు తీసే మొదటి పరుగుకంటే జ్ఞానం కోసం మానవులు వేసే మొదటి అడుగు అమోఘమైనది. ఆ అడుగు నువ్వీ రోజు వెయ్యగలిగావు, సంతోషం. సూర్యోదయం కాకుండానే వచ్చావు. రాత్రి సరిగ్గా నిద్ర పట్టిందా?”

మెదడు మొద్దుబారిన అనాథపిండకుడు నోటమ్మట మాట రాక అలాగే తథాగతుడి కేసి చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి నోరు పెగిలాక, భగవానుడు తన స్వంత చుట్టమో, దగ్గిర మిత్రుడో అయినట్టూ కుశలం అడుగుతున్నట్టూ అన్నాడు.

“ఎలా ఉన్నారు?”

“సన్యాసులెప్పుడూ ఉండేది ఆనందంగానే.” బుద్ధుడు నవ్వుతూ చెప్పాడు.

అప్పటికి తెలివి వచ్చిన అనాథపిండకుడికి తెలిసినదేమంటే, తాను అర్ధరాత్రి నిద్రలోంచి లేచి నడుచుకుంటూ బుద్ద్ధుణ్ణి చూడవచ్చాడు. సూర్యోదయానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. తథాగతుడు, బుద్ధుడు అనే పేర్లు వినగానే తాను దూరంగా ఉండి కూడా ఉన్మత్తుడిగా రాత్రంతా వళ్ళు మర్చిపోతే రోజంతా ఈయన కూడా గడిపేవాళ్ళకెలా ఉంటుందో? అయినా తననెప్పుడూ చూడని బుద్దుడికి తన అసలు పేరు సుదత్తుడనేది ఎలా తెల్సింది? తెల్లవారేదాకా బుద్ధుడి సమక్షంలో గడిపి వెనక్కి వస్తూంటే వళ్ళు, మనసు ఆనందంతో తేలడం తెలుస్తోంది. నిన్న తన బావమరిది చెప్పినది ఈ మనఃస్థితి గురించేనా? తిరిగి బుద్ధుడి దగ్గిరకి వెళ్ళి చెప్పాడు.

“ఈ రోజు తప్పకుండా మీరు మా బావమరిది ఇంటికి రావాలి భిక్షకి.”

“సరే, సాయంత్రం మళ్ళీ కలుద్దాం.”

నేలమీద కాళ్ళు ఆననట్టు నడుచుకుంటూ వెనకకొచ్చాక సాయంత్రం వరకూ వేచి చూడడం ఎంత కష్టం. మనసులో బుద్ధుడి విగ్రహం అనుక్షణం కదులుతోంది. ఎంతటి దివ్యమైన రూపం? ఎంతటి సంతోషం ఆయన మొఖంలో? ఏం వర్ఛస్సు ఆయన కళ్ళలో? అవన్నీ ఒక ఎత్తయితే చెప్పేవిషయాలు ఎంత కఠోరమైన నిజాలు? తన అదృష్టం కాకపోతే ఇంతటి వర్తకంతో సతమతమయ్యే తనకి ఆయనని కలుసుకోవడం అసలెప్పుడైనా కుదిరేనా? తానున్న మూడు నాలుగు గడియల్లో తానేం నోరు విప్పి అడకపోయినా ఆయనే తన మనసులో విషయాలన్నింటికీ సమాధానం ఇస్తున్నట్టే చెప్పాడు మాట్లాడుతూ. ఈయన దగ్గిరేదో బలమైన ఆకర్షణ శక్తి ఉన్నది. తన మనసులో విషయాలన్నీ ఈయనకెలా తెలుస్తున్నాయసలు?

సాయంత్రం భిక్షకి వచ్చిన భగవానుణ్ణి అనాథపిండకుడు అలా రెప్పలు ఆర్పకుండా చూడడమే తప్ప మరో పని చేయలేకపోవడం గమనించి బావమరిది అడిగాడు. “అర్థమైందా ఇప్పుడు?”

భిక్ష ముగించాక వెళ్ళబోయే భగవానుడితో చెప్పాడు అనాథపిండకుడు. “మీరు తప్పకుండా శ్రావస్తి నగరానికి రావాలి. ఎప్పుడు వస్తారో చెప్పగలిగితే నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లూ చూస్తాను.”

“శ్రావస్తి నగరంలో భిక్షువులకో విహారం ఉంటే నేను రావడానికెప్పుడైనా సిద్ధమే.” నవ్వుతూ చెప్పాడు వెళ్ళిపోయే భగవానుడు, “అయినా నేను రావడం, నువ్వు నన్ను రోజూ చూడడం అంత ముఖ్యం కాదు కానీ నేను చెప్పిన సూత్రాలు పాటిస్తూ ధర్మం తెలుసుకోవడం కోసం నువ్వు ధ్యానం చేయడం తప్పనిసరి. దానితోబాటు నువ్వుచేసే దానధర్మాలు ఆపవద్దు.”

తాను ఇలా దానధర్మాలు చేస్తూ అనాథలకి భోజనాలు పెడతాడని, తన పేరు అందుకే అనాథపిండకుడిగా మారిందనీ భగవానుడికెలా తెలిసిందో? ఆశ్చర్యపోతూ అనాథపిండకుడు బావమరిదికేసి చూశాడు.

“భగవానుడితో మనం ఏదీ నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు.“ బావమరిది సమాధానం చెప్పేడు, బుద్ధుడు వేణువనం కేసి బయల్దేరగానే.


శ్రావస్తి నగరానికి వెనక్కి వస్తూంటే ఊరి బయట కనిపించిన ఖాళీ స్థలం గురించి వాకబు చేశాడు అనాథపిండకుడు. తనకి తెల్సిన విషయాల ప్రకారం అది కోసల రాజు ప్రసేనజిత్తుకి చెందినది. భగవానుడి కోసం ఒక విహారం నిర్మించడానికి ఈ స్థలం సరిపోతుందనుకుంటే దీన్ని రాజు దగ్గిరనుంచి కొనాలి. తానో వర్తకుణ్ణని తెలిస్తే ఏం ధర చెప్తాడో? తన ప్రయత్నం చేయడం తప్పులేదు కదా. అయినా ఇంత ఆలోచన అనవసరం, తాను ఈ స్థలం భగవానుడి కోసం కొంటున్నానంటే రాజు ఒప్పుకోవచ్చు. తనమనసులో మంచి ఆలోచన ఉన్నంతకాలం తన మనసులో మెదిలే ప్రతీ ఆలోచనా తెల్సిన ఆ భగవానుడే చూసుకుంటాడు. వెంఠనే రాజమందిరానికి బయల్దేరాడు.

తాను వచ్చిన పని చెప్పాక రాజు ప్రసేనజిత్తు కాస్త నిర్లక్ష్యంగా చెప్పేడు సమాధానం. “ఆ స్థలం అమ్మకానికి లేదు.”

మరోసారి అడగానికి అనాథపిండకుడు చెప్పాడు, “ఆ స్థలం బౌద్ధవిహారం కోసం, భగవానుడి కోసం అడిగాను. నా వర్తకం కోసం కాదు. కాస్త మరోసారి ఆలోచించగలరా?”

ఈ సారి కాస్త కోపం వచ్చిన ప్రసేనజిత్తు అన్నాడు. “కోట్లకి పడగలెత్తిన వర్తకుణ్ణని గర్వంగా ఉన్నట్టుంది, ఆ స్థలం కావాలంటే ఆ నేల మొత్తం బంగారు నాణేలు పరిపించి నాకు కబురుపంపించు. అప్పుడు చూద్దాం, నీ గొప్పతనం, నువ్వు వర్తకంలో సంపాదించిన డబ్బూ ఎంత ఉన్నాయో.”

మరో మాట మాట్లాడకుండా బయటకొచ్చిన అనాథపిండకుడు తిన్నగా ఊరి బయట స్థలం దగ్గిరకెళ్ళి తనకూడా ఉన్న బంగారు నాణాలన్నీ స్థలంలో పరిపించమని సేవకులతో చెప్పాడు. ఆ పని అవుతుంటే, తన వర్తకం, ఇంటికెళ్ళడం అన్నీ మానుకుని అక్కడే ఉండి పరివేక్షించిన అనాథపిండకుడికి మూడోరోజు సాయంత్రానికి తేలినదేమంటే తన దగ్గిర ఉన్న మొత్తం నాణేలన్నీ పరిచినా మరో మూడు అడుగుల మేర నేల మిగిలిపోయింది. వెంఠనే తన దగ్గిర పనిచేసే మరోమనిషిని ఇంటికి పంపించి బండ్లమీద నాణేలు రప్పించబోయేడు.

ఎవరో పరుగున పోయి చెప్పినట్టున్నారు, ఈ వార్త చేరేసరికి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టిన ప్రసేనజిత్తు బయల్దేరి వచ్చి చూశాడు అనాథపిండకుడు చేయబోయే పని. బుద్ధుడు ఎంత గొప్పవాడు కాకపోతే ఈ వర్తకుడు ఇంతటి పని చేయగలడు? తాను రాజై ఉండీ ఈ వర్తకుడు నేలమీద పరిపించిన కాసులు తీసుకుంటే లోకం ఏమంటుంది? అనాథపిండకుడి దగ్గిరకొచ్చి చెప్పాడు, “ఈ కాసులన్నీ తీసి విహారం కట్టడానికి ఉపయోగించండి. ఈ రోజునుంచీ ఈ స్థలం మీదే. విహారం పూర్తవగానే బుద్ధుడు ఇక్కడకి వచ్చినప్పుడు మొదటి దర్శనం నాకు చేయించండి చాలు. అదే మీకు నేను అమ్మే ఈ స్థలం విలువ.”

“లేదు, లేదు. మీరు ఈ స్థలం ఉచితంగా ఇవ్వనవసరం లేదు, నేను మీరడిగిన వెల ఇవ్వగలవాడినే.”

“ఆ విషయం తెలుస్తూనే ఉంది కానీ, మీ దగ్గిర ఆ కాసులు తీసుకునే అర్హత నాకు ఉండవద్దా?”


ఇంటికి చేరిన అనాథపిండకుడు ఇంటిల్లపాదినీ కూర్చోబెట్టి చెప్పాడు తాను చేసిన పని; బుద్ధభగవానుణ్ణి కలుసుకోవడం, ఆయనని చూశాక మనసులో కలిగిన ఆనందం, ఆయనని పిలవడానికి చేసిన ప్రయత్నం, కట్టించబోయే విహారం గురించి కలిపి. పెద్ద కొడుక్కి తండ్రి చెప్పినది అర్ధం అయ్యీ అవనట్టు ఉంది కాబోలు అడిగాడు. “నాయనా, బుధ్ధుడు అంత గొప్పవాడా?”

ఇన్నాళ్ళ జీవితంలో భర్త చేసిన పనుల్లో ఎప్పుడూ ఎవరూ వేలెత్తి చూపించేవి ఏ ఒక్కటీ లేవు కనక అనాథపిండకుడి భార్య పుణ్యలక్షణ అంది కొడుకుతో. “నాయనగారు చేసిన పనుల్లో ఎప్పుడైనా వేలెత్తి చూపించేది కనిపించిందా? అదీగాక ఇచ్చేది బౌద్ధభిక్షువులకి అని చెప్తున్నారు కదా? బుద్ధుడు ఎంత గొప్పవాడు కాకపోతే స్థలంలో ప్రతీ అంగుళం బంగారు కాసులు నింపడానికి సిద్ధపడి ఉంటారు?”

అనాథపిండకుడు కొడుకుతో ఏదో అనేలోపునే కలాపిని అనే ఆవిడ అడిగింది కాస్త కంగారుగా, “ఈ బుద్ధుడనే ఆయన వస్తే నాకేమీ అడ్డం కాదు కదా?”

కలాపిని కేసి చూసిన అనాథపిండకుడికి కొన్నేళ్ళ క్రితం జరిగిన విషయం గుర్తొచ్చింది. ఈ కలాపిని తనకి వేలువిడిచిన దూరపు చుట్టం. ముగ్గురు పిల్లలు ఉన్న ఈవిడకి ఏ ఆధారం లేనప్పుడు తన ఇంటికొచ్చి బతిమాలింది ఇంట్లో ఉంచుకోమని. అయితే ఇంట్లోకొచ్చేముందు ఆవిడ చెప్పిన విషయం మరొకటి. ఆవిడ కొంతకాలం క్రితం నేర్చుకున్నది ఓ క్షుద్రదేవతారాధన. దానివల్ల ఈవిడకి కొన్ని కొన్ని ముందు జరగబోయే విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ దేవత సహాయంతో కొంతమందికి కీడుచేయడం కుదురుతుంది. అలా కొన్నిసార్లు చేసింది కూడా. ఒకసారి నేర్చుకుంది కనక తనకి నిలువనీడ లేకపోయినా ఆ దేవతారాధన మానకూడదు. మానితే తానూ, పిల్లలూ ఆ దేవతకి బలి అవుతారు. ఈ విషయం తెలిసున్న ఎవరూ ఆవిడని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకోనప్పుడు తన దగ్గిరకొచ్చింది. పిల్లలతో ఇలా నీడలేకుండా తిరుగుతున్న ఆవిడని చూసి జాలివేసి తన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాడు-కొన్ని షరతుల మీద. తన కుటుంబం మీద, హితులమీద, స్నేహితులమీద ఆవిడ చేతిలో ఉండే క్షుద్రదేవతని ప్రయోగించరాదు, ఇంట్లో ఆవిడ చేసే ఉపాసన, ఆరాధన, ఏమిటనేది తనకి తప్ప మూడో కంటికి తెలియరాదు వగైరా, వగైరా. అలా పరస్పరం ఒప్పుకున్నాక అప్పట్నుండీ ఆవిడ ఇక్కడే ఉంటోంది సుఖంగానే. అయితే ఇప్పుడు ధర్మం, బుద్ధుడనే మాటలు వినిపించేసరికి ఇది ఎటుతిరిగి ఎటువస్తుందో అని ఈ ప్రశ్న అడిగింది కలాపిని.

అనాథపిండకుడు చెప్పాడు, “అమ్మా, బుద్ధుడు ఎవరినీ తనమాట వినమని బలవంతం చేయడం, తన మార్గం బలవంతంగా రుద్దడం నేను చూడలేదు. అయితే మీరు కూడా ఆయన చెప్పేది విని చూడండి; మీకు లాభించవచ్చు. అది కూడా భగవానుడు ఇక్కడకి వచ్చాక చూద్దాం. ముందు ఆయన వచ్చేది విహారానికి. అక్కడే ఉంటారు ఉన్నన్నాళ్ళూ. ఎప్పుడైనా పిలిస్తే ఏ గృహస్థు ఇంటికో భిక్షకి వెళ్ళినా తిరిగి విహారానికి వెళ్ళడం పరిపాటి.”

అలా ఇంట్లో అందరికీ అంగీకారం అయ్యాక, విహారం కట్టడానికి, జేతవనంగా పిలవబోయే ఈ విహారాన్ని బుధ్ధుడికి కైంకర్యం చేయడానికి పనులు శరవేగంగా ఊపందుకున్నై. జేతవనం పూర్తయిన కొద్ది రోజులకే భగవానుడు శ్రావస్తికి బయల్దేరాడు కాలినడకన. దారిలో చెప్పాడు ఆనందుడితో, “ప్రస్తుతం కట్టిన విహారంతో బాటు ముందు రోజుల్లో ఓ భక్తురాలు కట్టించే మరో విహారం కూడా నా చేత్తోనే స్వీకరించాల్సి ఉంటుంది. మనకి ఇంత చేసిన అనాథపిండకుడి జీవితంలో మరో పెద్ద మార్పు చూడబోతున్నాం రాబోయే రోజుల్లో.”

తినబోతూ రుచులడగడం అనవసరం కనక ఆనందుడు సరేనన్నట్టూ చిరునవ్వుతో తల ఊపాడు.


బుద్ధుడు శ్రావస్తిలో విహారానికి వచ్చాక కలాపినికి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఈ అనాథపిండకుడు రోజుకోసారి వెళ్ళి భగవానుణ్ణి దర్శించుకోవడం, ఇంటికి పిలిస్తే బుద్ధుడనే ఆ పెద్దమనిషి ఈ భవంతిలోకే వచ్చి కూర్చోవడం, ఏదో ధర్మం మీద సంభాషించడం. ఈయన ఫలానా రోజు వస్తాడని తెలియగానే తనకి రెండు రోజుల ముందు నుంచీ పీడకలలు; తన వంటి మీదా, పిల్లలకీ ఏవో తెలియని రోగాలు కనిపిస్తున్నాయి. తాను ఉంటున్న మూడో అంతస్తు గదిలో అనేక అవకతవకలు జరుగుతున్నై. కలలో తాను ఆరాధించే దేవత కనిపించి ఇంక ఇక్కడ ఉండొద్దని, ఇంట్లోంచి పొమ్మనీ తనని అదేపనిగా హెచ్చరిస్తోంది. అవి పట్టించుకోనప్పుడు ఆ దేవత తనని అనాథపిండకుడి మీదకి ప్రయోగించి అతన్ని చంపి వదుల్చుకోమని భయపెట్టడం. మరోసారి అనాథపిండకుడి ఆస్తులు పోగొట్టమనో, అతని పిల్లలని చంపమనో భయంకరమైన బెదిరింపులు. ఈ విషయాల వల్ల బుద్ధుడు ఈ ఇంటికి వస్తాడంటేనే తనకీ తన పిల్లలకీ వంటి మీద కారం రాసినట్టూ ఉంది. ఇప్పటివరకూ ఈ ఇంట్లో సుఖంగా గడిచిపోతోంది. ఈ మూడో అంతస్తులో తన గదిలోకి ఎవరూ రారు కనక తనకి ఇక్కడ లోపం లేదు ఇప్పటివరకూ. ఈ బుద్ధుడు వచ్చాక తన ఉపాసన చేస్తుంటే అది పూర్తికాకుండా అడ్డంకులు తగుల్తున్నాయి. ఉపాసన చేయకుండా ఆపితే ఆ దేవత తనని ఏం చేస్తుందో తెలియదు. తనకి ఆశ్రయం ఇచ్చినప్పుడు ఒప్పుకున్న షరతులకి కట్టుబడి ఉండాలి కనక అనాథపిండకుణ్ణి తాను ఏమీ చేయలేదు. ఇంకపోతే ఏదైనా చేయాల్సింది బుద్ధుణ్ణే. ఈ బుద్ద్ధుడు రావడం మొదలుపెట్టాక జీవితం తారుమారై తనకి కంటి మీద నిద్ర కరువైంది కనక బుద్ధుణ్ణి వదుల్చుకోవడానికో దారి అతని ప్రాణాలు తీయడం ఎవరికీ అనుమానం రాకుండా. బుద్ధుడు ఉపన్యాసం ఇస్తున్న సమయంలో అందరూ అక్కడే ఉంటారు కాబట్టి తాను చాటుగా వంటగదిలోకి వెళ్ళి వండిన పదార్ధాలలో విషం కలిపితే? సులువుగా పని అయిపోతుంది. కలాపిని ఈ ఆలోచన రాగానే దాన్ని ఎవరూ చూడకుండా అమల్లో పెట్టగలిగింది.

అయితే కలాపిని తన పని పూర్తిచేసి ఏమీ తెలియనట్టూ బుద్ధుడి ఉపన్యాసం వింటున్న అందర్లో కలిసిపోయాక జరిగినది ఎవరూ ఊహించలేనిది. అందరికీ భోజనం వడ్డించబోతున్నప్పుడు బుద్ధుడు వడ్డన ఆపించి ఆనందుడితో చెప్పినది అందరితోబాటు కలాపిని విన్నదే, “నా భిక్షాపాత్ర నిండా నీరు తీసుకెళ్ళి ఏదీ మర్చిపోకుండా వండిన అన్ని పదార్ధాలమీద చల్లిరా.”

ఆనందుడు ఆ నీళ్ళు జల్లి వచ్చాక కలాపిని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే చచ్చిపడిపోతాడనుకున్న బుద్ధుడికీ ఏమీ కాలేదు. అదలా ఉంచితే ఈ నీళ్ళలో ఏముందో మరి, భోజనం చేసిన ప్రతీ ఒక్కరూ విహారానికి వెళ్ళి హాయిగా పడుకున్నారు. తాను ప్రయోగించిన కాలకూటంలాంటి విషం బుధ్ధుడి భిక్షాపాత్రలో మామూలు నీటి ముందు ఎందుకూ పనికిరాలేదు. ఇలాంటి ప్రయోగాలు అయిదారుసార్లు జరిగాక ఏం చేయాలో కలాపినికి తోచనపుడు ఇంక మిగిలినది – మంచిగా ఈ అనాథపిండకుడికో ఆయన భవన సంరక్షకులకో, పిల్లలకో చెప్పి వాళ్ళని మార్చడం, బుధ్ధుడు ఏదో విధంగా ఇక్కడకి రాకుండా చూడడం. యజమానికి బుధ్ధుడి మీద ఉన్న గౌరవం వల్ల ఎదురుగా వెళ్ళి చెపితే ఏమంటాడో? ఏదీ కుదరకపోతే తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకున్న షరతులు పక్కనపెట్టి దండోపాయం ప్రయోగించాలేమో? మనసులో తర్జన భర్జనలు.

ఈ బుద్ధుడు ఇంత గొప్పవాడా? తాను వినలేదా ఈ బుద్ధుడి ప్రసంగాలు. ఎంతసేపూ ధర్మం, సత్యం అనే గోలే తప్ప ఈ అనాథపిండకుడికి మంచి సలహా ఇచ్చాడా ఎప్పుడైనా? ఇప్పటికి తాను ప్రయోగించిన విషం, మంత్రతంత్రాలూ నాశనం అయ్యాయి. ఎదురుగా వెళ్ళి నయానా చెప్పినప్పుడు వినకపోతే ఇంక మిగిలింది భయానా ఒకటే. తన ఉపాసన చేసే దేవతతో చెప్పి ఈయన సంపద పోగొడితే అప్పుడు కానీ బుద్ధి రాదా? అప్పటికీ ఈ భగవానుణ్ణి పట్టుకుని వేళ్ళాడతారా వీళ్ళు? అన్నీ పోయిన సమయంలో ఈ భగవానుడనే బుద్ధుడు ఏం చేయగలడు వీళ్ళకి? కోపంలో ఉన్న కలాపినికి మొదట్లో యజమాని తనని ఇంట్లోకి రానిచ్చినప్పుడు చేసిన వాగ్దానాలు గుర్తుకు రాలేదు. గుర్తున్నదల్లా ఎలాగో ఒకలాగ ఈ బుద్ధుడనేవాణ్ణి వదిలించుకోవాలి.

ఆరోజు రాత్రి కలాపిని క్షుద్రదేవత సహాయంతో అనాథపిండకుడి ఆస్తులు పరికించబోయింది తన ఉపాసనలో. శ్రావస్తిలో వర్తకం చేస్తూ నష్టపడిన మిగతా వర్తకులని ఆదుకోవడానికి అనాథపిండకుడు దాదాపు ఇరవైమందికి ఒక్కొక్కరికి పదేసి లక్షల ముసురణాలు అరువిచ్చాడు. దూరంగా నది ఒడ్డున ఇరవైకోట్ల ముసురుణాలు బిందెలలో పాతిపెట్టి ఉన్నై అవసరానికి. ఇంట్లోనూ ఇక్కడా అక్కడా దాచినవి, వర్తకంలో తిరుగుతున్నవీ మరో పాతిక కోట్లు. ఇందులో వర్తకులకి అప్పు ఇచ్చినవి, నది ఒడ్డున పాతిపెట్టినవీ పోతే ఇంత అతిగా ఖర్చుపెట్టే అనాథపిండకుడు అనాథ కావడం ఖాయం. కలాపినికి అంతకుముందే తెలిసిన మరో విషయం బుద్ధుడు ఇప్పట్లో శ్రావస్తి నుంచి కదిలే ఆలోచనలోలేడు. ఎక్కడికైనా వెళ్ళినా రెండు మూడు రోజుల్లో వెనక్కి వస్తున్నాడు. ఓ సారి తాను కానీ అనాథపిండకుణ్ణి దరిద్రంలోకి నెట్టగలిగితే ఈ భగవానుడనే బుద్ధుడు మళ్ళీ ఇటుకేసి రాడు. దరిద్రం వదులుతుంది తనకి. మర్నాటినుంచే కలాపిని క్షుద్ర దేవతని ఆవాహన చేసి ఎవరైతే తనకి నిలువనీడ ఇచ్చారో వారినే నాశనం చేయడానికి శ్రీకారం చుట్టింది.


ఏడాది తిరక్కుండా ఏ నది ఒడ్డున అయితే డబ్బులు దాచిపెట్టాడో ఆ నదికి వరదలొచ్చి అనాథపిండకుడు దాచిన బిందెలూ అందులో ముసురణాలు కొట్టుకుపోయి ఏమయ్యాయో ఎవరికీ తెలియలేదు. డబ్బులు పోయిన అనాథపిండకుడు తన స్వంత ఖర్చులు తప్పక తగ్గించుకోవాల్సిన స్థితి. బీదసాదలకి రోజూ పంచిపెట్టబడే దానాలు తగ్గించాల్సిన దుస్థితిలో తాను డబ్బిచ్చిన వర్తకుల దగ్గిరనుంచి అప్పులు వసూలు చేసుకోవడానికి బయల్దేరిన అనాథపిండకుడికి మొండి చేయి ఎదురైంది. దీనికి అనేక కారణాలు చూపించారు తీసుకున్న వర్తకులు. ఏదైతేనేం కష్టాలు వచ్చేటప్పుడు అన్నీ కలిసికట్టుగా వస్తాయన్నట్టు బ్రహ్మాండంగా వెలుగు వెలిగిన అనాథపిండకుడు ఇక అతి సామాన్యుడిగా జీవించడం తప్పనిసరి అయింది. ఎవరైనా అడిగితే భగవానుడు చెప్పినట్టూ అసత్యం ఆడకుండా జరిగినదేదో చెప్పి ఇంతకన్నా చేయలేం అని చేతులు జోడించడమే. అలా డబ్బు విషయంలో ఒక్కోమెట్టూ కిందకి జారుతూ ధనికుడిగా వెలిగిన అనాథపిండకుడు అతి మామూలు స్థాయికి దిగిజారిపోయేడు రెండేళ్ళలో.

ఎప్పట్లాగే తన దగ్గిరకొచ్చిన అనాథపిండకుణ్ణి ఈ సారి ఎందుకో నిశితంగా చూసి అడిగాడు భగవానుడు. “ఏమి సుదత్తా, నీ దానధర్మాలు బాగా జరుగుతున్నాయా? మొహం ఎందుకో విచారంగా ఉన్నట్టుందే?”

కన్నీళ్ళ పర్యంతమైపోయిన అనాథపిండకుడు పైబట్టతో కళ్ళు ఒత్తుకుంటూ చెప్పేడు, “దానధర్మాలు అని చెప్పుకునేంత కథే లేదు. ఒకప్పుడు ఎంతో బాగా భోజనాలు సమకూర్చగలిగే ఈ అనాథపిండకుడు ఇప్పుడు అనాథలకి ఒకే ఒక్కసారి పోసేది కేవలం గంజి మాత్రమే భగవాన్! వాళ్ళు ఆకలితో అడిగితే గిన్నెలో రెండోసారి పోయడానికి కూడా గంజి లేదు. ఖాళీ కడుపులని బయటకి పంపింస్తూంటే గుండె చెరువైపోయి నేను చేసే ఈ గంజి పోయడం అనే నీచపు పని ఎంత పాపం కలిగిస్తుందో అనేదాని వల్ల అసలు కంటి మీద కునుకే లేదు.”

“దానం చేసేటప్పుడు మనఃస్థితి ముఖ్యం కానీ ఎంత విలువైనవి దానం చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు. నీ మనఃస్థితి బాగున్నంతకాలం నువ్వేం దానం చేసినా మంచిదే. విచారించకు, రోజులన్నీ ఒక్కలా ఉండవు కదా, ప్రపంచంలో ప్రతీదానికీ నాశనం ఉన్నట్టే మన ఐశ్వర్యానిక్కూడా ఓ రోజు పెరగడం వినాశనం తప్పవు.” భగవానుడు ఊరడించాడు.

రోజులు గడిచి మామూలు భోజనాలు కూడా కష్టమైనప్పుడు ఇంట్లో వంట మానేసి అందరితో పాటు గంజి మాత్రమే తాగడం అలవాటు చేసుకున్నాడు అనాథపిండకుడు. ఒకప్పుడు అనాథలకి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టిన చోట ఇప్పుడు నీళ్ళలాంటి గంజి మాత్రమే వడ్డించగలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో తన పథకం ప్రకారం కలాపిని అనాథపిండకుడితో బుద్ధుణ్ణి కనక ఇంక ఈ ఇంటికి ఎప్పుడూ రాకుండా చేస్తే క్షుద్రదేవతోపాసనతో మళ్ళీ తను వర్తకంలో పుంజుకునేలాగా చేయగలనని చెప్పింది. అన్నీ విన్న అనాథపిండకుడు భగవానుణ్ణి వదులుకోనని చెప్పేడు స్థిరంగా. కోపం వచ్చిన కలాపిని సర్వనాశనం అవుతావని బెదిరించింది. అయినా అనాథపిండకుడు బెదరలేదు. యజమానిని బెదిరిస్తే కాళ్ళబేరానికి వచ్చి రక్షించమంటాడనీ బుద్ధుణ్ణి వదిలేస్తాడనీ తాను అనుకుంది కానీ పరిస్థితి ఇలా ఎదురు తిరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. హతాశురాలై తన పిల్లలతో బయటకి నడిచింది.


అనాథపిండకుడి ఇంట్లోంచి బయట కొచ్చిన కలాపినికి ఒక్కసారి తన గతం గుర్తొచ్చింది. ఈ ఇంట్లో ఉన్న ఏనాడూ తనకి కానీ తన పిల్లలకి కానీ ఒక్క అపకారం జరగలేదు. ఇంట్లో ఒక్కరు కూడా తమని అవమానపర్చలేదు. ఐతేనేం అనాథపిండకుడి లాంటి వర్తకులు కో అంటి కోటిమంది లేరా ఈ శ్రావస్తిలో? మరో వర్తకుడికి తన చేతిలో ఉన్న దేవత, ఆ దేవతతో తాను ఇవ్వగలిగే లాభమూ చూపిస్తే తనని హాయిగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అయితే ఈ పువ్వుల్లో పెట్టి చూసుకోవడం అనేది అంత సులభం కాలేదు. మరో వర్తకుడి ఇంట్లో తనకి సుఖంగా నివాసం కుదరదని కలాపినికి తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఏడునెలల పాటు పడే పాట్లన్నీ పడ్డాక కాని అనాథపిండకుడి మంచితనం తెలిసిరాలేదు కలాపినికి. తాను బయటకొచ్చేసి ఎంత తప్పు చేసిందో అర్థమయ్యాక మళ్ళీ వెనక్కి వెళ్దామా అనే ఆలోచన. అనాథపిండకుడు తనని మరోసారి లోపలకి రానివ్వడేమో అని మరో ఆలోచన. ఇంత అపకారం చేశాక ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? ఏం చేయాలో తెలియక నిలువనీడలేని గతిలో ఊరి మధ్యనున్న గ్రామదేవత గుడిలోకొచ్చింది కలాపిని పిల్లలతో. తిండి దొరకడం అంత కష్టం కాదు ఈ దేవతకిచ్చే ప్రసాదాల వల్ల కానీ ఈ జీవితానికీ, అనాథపిండకుడి ఇంట్లో తాను గడిపిన జీవితానికీ పోలిక చూసుకుంటే నక్కకీ నాకలోకానికీ ఉన్నంత దూరం.

కలాపినికి తాను చేసిన పనులు గుర్తొచ్చాయి. తన వల్ల అనాథపిండకుడికి ఎంతటి అపకారం జరిగిందో! కాసేపు ఆలోచించాక అనాథపిండకుడి ఇంటికి వెళ్ళడానికి మరో పథకం మనసులో తిరిగింది. దాని ప్రకారం మొదట తాను పోగొట్టిన ఆ డబ్బులన్నీ యజమానికి వెనక్కి వచ్చేలా చేయాలి. ఆ డబ్బులెక్కడున్నాయో తనకి ఎలాగా తెలుసు కనక అది అంత కష్టంకాదు. ఆ తర్వాత కొంతకాలం ఆగి వెళ్ళి క్షమించమనీ మళ్ళీ ఇంట్లోకి రానిమ్మనీ అడిగితే? అనాథపిండకుడు మంచి మనసు కలవాడు కనక ఒప్పుకోవచ్చేమో? ఈ లోపునే మరో ఆలోచన. అనాథపిండకుడు ఎప్పుడో చెప్పడం ప్రకారం, తాను విన్న మాటల ప్రకారం తన వంటి వాళ్ళని బుద్ధుడు చాలామందిని మంచి మార్గంలోకి మార్చాడు. తననీ ఈ క్షుద్రదేవతోపాసన నుంచి తప్పించగలడేమో?

కలాపిని మళ్ళీ అనాథపిండకుడి దగ్గిరకే వెళ్ళడానికి నిశ్చయించుకొని తన పథకాలు మరోసారి ప్రయోగించడం మొదలుపెట్టింది. రోజులు గడిచేకొద్దీ అప్పు ఇచ్చిన వర్తకులు తాము తీసుకున్న డబ్బులన్నీ తెచ్చి అనాథపిండకుడికి బాకీలు తీర్చడం మొదలుపెట్టారు. త్వరలోనే ఎప్పుడో వరదల్లో కొట్టుకుకుపోయిన తన ముసురుణాల బిందెలు దూరంగా ఇసుకతిన్నెలలో దొరికాయి. అనాథపిండకుడి ఆలోచనల ప్రకారం పోయిన డబ్బులు దొరకడం, తాను మళ్ళీ దానధర్మాలు సరిగ్గా చేయడం అనేవి జరుగుతున్నాయంటే ఇదంతా భగవానుడి అనుగ్రహమే. ఒక్కసారి యజమాని ఇల్లు మళ్ళీ లక్ష్మీ కటాక్షంతో కలకల్లాడడం మొదలవగానే కలాపిని అనాథపిండకుడి ఇంటికి బయల్దేరింది.

గుమ్మంలోనే ఎదురైన యజమాని మళ్ళీ తనకి కనిపించిన కలాపినిని చూసి ఎప్పట్లాగే పలకరించాడు మనసులో ఏం మాలిన్యం లేనట్టు. ఇదేనా బుద్ధుడి భోధనలవల్ల కలిగే జ్ఞానం? ఇంట్లోంచి బయటకి వెళ్ళాక తాను పడిన అష్టకష్టాలు అన్నీ చెప్పాక, కలాపిని దాదాపు ఏడుస్తూ ఇంట్లోకి రానిమ్మని బ్రతిమాలుకుంది. కాసేపు మౌనంగా ఉన్నాక అనాథపిండకుడు చెప్పాడు. “నిన్ను క్షమించడానికి నేనేపాటివాణ్ణి? నిన్ను తథాగతుడి దగ్గిరకి తీసుకెళ్తాను. అందరిముందూ ఆయనకి చెప్పుకో క్షమాపణ. ఆయన ఎటువంటివారినైనా క్షమించగలడు. కనీసం అలాగైనా నువ్వు ఇందరి కడుపులు కొట్టిన పాపం పోగొట్టుగోగలవేమో. నీకు ఇష్టం అయితే చెప్పు ఇప్పుడే భగవానుడి దగ్గిరకి పోదాం. మళ్ళీ ఈ ఇంట్లోకి రావచ్చు. అది నీకు ఇష్టంలేకపోతే నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పను.”

ఇద్దరూ బయల్దేరారు భగవానుడి దగ్గిరకి.


తన దగ్గిరకి వచ్చిన కలాపినినీ ఆనాథపిండకుడినీ కూర్చోబెట్టి వాళ్ళు చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు భగవానుడు. చుట్టూ ఉన్న సంఘంలో భిక్షకులందరితో పాటు అందర్నీ సమానంగా చూసే భగవానుడికి కలాపిని చేసిన పని చిన్నపిల్లల ఆటలా అనిపించి సున్నితంగా మందలిస్తున్నట్టూ అడిగాడు.

“మొదట్లో నేను ఇంటికి వచ్చినప్పుడు ఆహారంలో విషం కలపడం, ఆ తర్వాత మా మీద ప్రయోగించిన మంత్ర తంత్రాల వల్ల నీకు ఏమి లాభం కలిగింది? మనశ్శాంతి అనేది ఉందా? ఆ దేవతా ఉపాసన వల్ల ఇన్నాళ్ళలో నీలో భయం తప్ప మరోటి కలిగిందా? మనసులో శాంతి కలిగించలేని ఆ ఉపాసన ఎవరి కోసం? ఇప్పటికైనా అర్ధమైందా ఇటువంటి ఉపాసన ఎంతటి అనర్ధమో?”

“ఇప్పుడు మీరేం చేయమంటారో చెప్పండి. ఆ ఉపాసన వదులుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. ఆ ఉపాసన చేయకపోతే ఆ క్షుద్రదేవత నాకూ నా పిల్లలకీ అపకారం చేస్తుందని అలా చేయాల్సివచ్చింది. ఈ భయం పోవడానికేం చేయాలి?”

“ధర్మం కనుక్కోవడమే మనుష్య జీవితానికి పరమావధి. ఆ కనుక్కోవడంలో ఇటువంటి క్షుద్రదేవతారాధనలు ఎందుకూ పనికిరావు. సంఘంలో చేరి నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు. ఇప్పట్నుంచి ఆ దేవత నిన్నేం చేయదు.”

తనకి ఇచ్చిన భరోసాతో ఒక్కసారి మనసులో భయం, కలవరం అన్నీ పోయి ఆనందం ఆవరించిన కలాపిని భగవానుడికి చేతులు జోడించింది.

తర్వాత అక్కడే కూర్చున్న భిక్షువులకేసి చూసి చెప్పాడు భగవానుడు, “విన్నారు కదా కర్మ పరిపాకం సంగతి? ఫలితం అనుభవించేటపుడు కానీ చేసినది ఎంతటి పాపపు కర్మో గుర్తురాదు. కలాపిని క్షుద్రదేవతని ఆరాధిస్తూ తాను అనాథపిండకుడికి మంచి చేస్తున్నాననుకుంటూ, తన స్వంత కోరిక కోసం – నన్ను యజమాని ఇంటికి రాకుండా ఉంచడం కోసం, అతడి డబ్బునీ వర్తకాన్ని పాడుచేసింది. అయితే దీనివల్ల ఆవిడకి కలిగిందేమిటి? ఇంట్లోంచి బయటపడి తలదాచుకోలేక దిక్కులేకుండా పోయి అదే స్థితిలో మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. అలా ఈవిడ మంచి చేస్తున్నాననుకుంటూ చేసినది చెడ్డపని. అయితే అనాథపిండకుడు మాత్రం తాను చేసే దానధర్మాలు మానకుండా చేసేవి చిన్నవి అనీ తాను పోసేది గంజి మాత్రమే కనక తనకి నరకం తప్పదనీ అనుకున్నాడు. తాను చేసేది చెడు కర్మ అనుకుంటూ, చేసే మంచి పని అనాథపిండకుడికి మంచి ఫలితం వస్తే మంచి కర్మ అనుకుంటూ చెడ్డ కర్మ చేసిన కలాపినికి చెడ్డ ఫలితం ఇచ్చింది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. పరహింస అనేది అతి దారుణమైన కర్మ. ఎన్నడూ తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు పనులు కానీ చేయవద్దు, అహింసా పరమో ధర్మః”

తేటపడిన మనసుతో కలాపిని, అనాథపిండకుడూ వెళ్ళాక భగవానుడు ఆనందుడికేసి చూశాడు నవ్వుతూ. భగవానుడు చెప్పినది తనకి అర్ధమైనట్టూ ఆనందుడు తల పంకించాడు.