నాలుగో వరం

భగవానుడు ఆరోజు సాయంత్రం విందుకి పిలిచిన ఓ గృహస్థు ఇంటికి వెళ్ళాల్సి ఉంది. ఆనందుడు ముందొకసారి వచ్చి గుర్తు చేశాడు వెళ్ళవల్సిన సమయానికి వచ్చి పిలుస్తానని. కానీ బయల్దేరే సమయానికి ఆనందుడికి కుదరలేదు. ఆరామంలో ఉన్న పళంగా ఏదో పనిబడింది. కూడా మరొకర్ని తీసుకెళ్ళడం కుదురుతుందా అని అడగబోయేడు. కానీ ఎవరినీ తనకూడా రావద్దని నిక్కచ్చిగా చెప్పి భగవానుడొక్కడే బయల్దేరాడు. ఆనందుడికి ఆశ్చర్యం వేసి అడిగాడు.

“ఎందుకలా మరొకర్ని కూడా తోడు రావద్దన్నారు?”

“నేను వెనక్కి వచ్చాక తెలుస్తుంది ఆ విషయం. కంగారు పడకు.” భగవానుడు ముందుకి నడిచాడు.

దారిలో జనం పెట్టే నమస్కారాలందుకుంటూ నడుస్తూంటే కొంచెం చనువున్న మరో గృహస్థు శిష్యుడు కనిపించి అడిగాడు, భగవానుడు వెళ్ళేదెక్కడికని. బుద్ధుడు చెప్పిన సమాధానం విన్న ఈ గృహస్థు ఆశ్చర్యపోయేడు, భగవానుడు నడిచే ఈ దారిలో విందుకు వెళ్ళేసరికి గంట, రెండు గంటలు ఆలస్యం కావచ్చు. దారి మంచిది కూడా కాదు. వెళ్ళే దారి భగవానుడికి సరిగ్గా తెలియదేమో? అందుకే చెప్పాడు.

“భగవాన్, మీరు వెళ్ళేదారి చుట్టూ తిరిగి వెళ్ళేది, ఇలా కాకుండా క్షేమంగా ప్రజలందరూ వెళ్ళే దగ్గిర దారి మరోటి ఉంది. అటు వైపు వెళ్ళలేకపోయారా?”

“అవునా, వేరే దారి క్షేమం అంటున్నావు, ఈ దారి క్షేమకరం కాదా?”

“నిర్మానుష్యంగా ఉండే ఈ దారిలో ఓ చెట్టు దగ్గిర కల్మాషపాదుడనే నరభక్షకుడు ఉంటాడని అంటారు. ఇప్పటివరకూ చాలామందిని పట్టుకున్నాడని జనంలో పుకార్లు ఉన్నాయి. మీరు అటువైపు వెళ్ళకపోతే మంచిది.”

“నరభక్షకుడైనా, బ్రహ్మరాక్షసుడైనా నన్ను పట్టుకోడేమోలే. ఈ భిక్షాపాత్ర తప్ప నా దగ్గిరేమైనా డబ్బూ, నగలూ ఉంటే కదా? నన్ను తినడానికైనా మరోసారి ఆలోచించాలి; చిక్కి సన్నబడి వడిలిపోయిన నా శరీరంలో తినడానికేముంది కనక?”

మొహంలో చిర్నవ్వుతో భగవానుడు వడివడిగా ముందుకి వెళ్ళిపోవడం చూసి గృహస్థు కూడా నవ్వుకుంటూ వేరే దారిలో వెళ్ళిపోయాడు.

దాదాపు పావుగంట నడిచాక భగవానుడికి కనిపించింది చెట్టు. కనుచూపుమేరలో పురుగన్నది లేదు. చీకటి పడుతోంది కనక దీపాలు మిణుకుమిణుకుమంటున్నాయి దూరంగా జనపదాల్లో. చేతిలో భిక్షాపాత్రతో ముందుకి నడిచి చెట్టుకిందకి వచ్చేసరికి ఓ మహాకాయుడు భగవానుడి దారికి అడ్డంపడి ఆటకాయించాడు.

ఏమాత్రం భయం లేకుండా అడిగాడు భగవానుడు, “ఎవర్నువ్వు, ఏం కావాలి నీకు?”

“నన్ను కల్మాషపాదుడంటారు. నరభక్షణ నా నరాలలో జీర్ణించుకుపోయిన వ్యసనం. మంచి కులంలో పుట్టిన రాజకుమారులైతే వారిని దేవతలకి బలి ఇవ్వడం నేను పాటించే నియమాల్లో ఒకటి. నువ్వు చూడబోతే సన్యాసిలా ఉన్నావు కానీ మొహంలో వర్ఛస్సు బట్టి మంచి కులంలో పుట్టినట్టున్నావు. నువ్వు రాజవంశానికి చెందినవాడివైతే బలికి సరిపోతావు. లేదా ఈ రాత్రికి నా భోజనానికి.”

“నీకు భోజనంగా కావడానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ నన్ను విందుకి పిల్చిన ఒక గృహస్థు నా గురించి ఎదురుచూస్తూ ఉంటాడు. అందువల్ల అతని విందుకు వెళ్ళి నీ దగ్గిరకి రావడానికి అనుమతించాలి.”

“భలే చెప్పావులే, నువ్వోసారి నన్ను మభ్యపెట్టి ఇక్కడనుంచి తప్పించుకుంటే మరోసారి వస్తావా? నిన్ను నమ్మి వెళ్ళనిస్తే వెనక్కి రావడం కల్ల అని తెలిసిపోతూంటే ఎలా?”

“జీవితంలో నేను ఏనాడూ అసత్యం ఆడినవాడిని కాదు. మరో విషయం, నేనూ ఒకప్పుడు రాజకుమారుడినే. అందువల్ల నీ దేవతకి బలి ఇవ్వడానికి అర్హుణ్ణి. ఒకప్పటి రాకుమారుడు ఇప్పుడు సన్యాసి కనక నీ దేవతకి బలి ఇవ్వడం కుదరనట్లయితే నీ భోజనానికి పనికొస్తాను. నేను విందులో రుచికరమైన ఆహారం తిన్నాక నా శరీరం నీకు తినడానికి మరింత రుచికరంగా ఉండవచ్చు గదా? అందువల్ల ఏ విధంగా చూసినా నన్ను వెళ్ళనివ్వడమే నీకు మంచిది.”

ఆ రోజు ఏ కళనున్నాడో కానీ కల్మాషపాదుడు చెప్పాడు, “ఈ చెట్టుకింద ‘తప్పక తిరిగి వస్తా’నని ప్రమాణం చేసి వెళ్ళు అయితే. చేసిన ప్రమాణం తప్పితే తల వేయి చెక్కలౌతుంది.”

భగవానుడు కల్మాషపాదుడు చెప్పినట్టే ప్రమాణం చేసి ముందుకి కదుల్తూ చిరునవ్వుతో చెప్పాడు, “తప్పక వెనక్కి తిరిగి వస్తాను. ఏమీ అనుమానం వద్దు.”


గృహస్థు ఇంట్లో అందరికీ ఆశ్చర్యానందాలు భగవానుణ్ణి చూడగానే. ఒక్కరే వచ్చినందుకు ఆశ్చర్యం అయితే అసలు తమ ఇంటికి వచ్చినందుకే ఆనందం. విందులో మితంగా తినడం అయ్యాక కాసేపు సంభాషణ. మరికాసేపటికి భగవానుడు ఆరామం కేసి బయల్దేరాడు. గృహస్థు కంగారుగా చెప్పాడు, “ఒక్కరే వెళ్ళడం మంచిది కాదు ఈ చీకట్లో. రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్న వెళ్ళవచ్చు కదా?”

“లేదు, లేదు; ఇక్కడకి వచ్చేటప్పుడు దారిలో కలిసిన మరొకాయనని చూడడానికి ఈ విందు అయ్యాక వస్తానని మాట ఇచ్చాను. అక్కడకి తప్పనిసరిగా వెళ్ళి తీరాలి.”

“పోనీ మా అబ్బాయిని కూడా తోడు పంపిస్తాను, తీసుకెళ్ళండి.”

“వద్దు. మీ అబ్బాయి ఒక్కడూ మళ్ళీ వెనక్కి రావాలి కదా? నేను వెళ్ళగలను; ఏమీ చింత వద్దు,” అభ్యర్థనలన్నీ సున్నితంగా తిరస్కరించి బయల్దేరాడు భగవానుడు. అదే దారిలో.


దూరాన్నుంచి భగవానుడు వెనక్కి రావడం చూసిన కల్మాషపాదుడి మనసులో ఓ చింత ప్రారంభమై అది బుద్ధుడు దగ్గరకి వచ్చే క్రమేపీ మహావృక్షంగా ఎదగడం మొదలైంది. చెట్టుకిందకి వచ్చిన భగవానుడు తనకోసం వేచి చూస్తున్న కల్మాషపాదుణ్ణి చూసి నవ్వుతూ అడిగాడు, “ఇప్పుడు నీ అనుమానం నివృత్తి అయిందా? ఇచ్చిన మాట ప్రకారం వెనక్కి వచ్చాను. నీ ఇష్టప్రకారం నన్ను దేవతకి బలి ఇచ్చినా సరే, భోజనం చేసినా సరే.”

“నువ్వు ఒకప్పటి రాజకుమారుడివైనా ఇప్పుడు సన్యాసివి కనక దేవత బలికి పనికిరావు. భోజనానికి ఇంకా వ్యవధి ఉంది. ఈలోపుల కొన్ని విషయాలు చెప్పు. నువ్వు వెళ్ళినది ఎక్కడకి, అక్కడ ఏం జరిగింది?”

“గృహస్థు విందుకి పిలిచాడు. అదయ్యాక కాసేపు సత్సంగం. అందులో కొన్ని విషయాలు చెప్పాను.”

“సత్సంగం అంటే? ఏమిటా చెప్పిన విషయాలు? నేను నిన్ను పట్టుకున్నాననీ, వెనక్కి వచ్చేదాకా వేచి చూస్తున్నాననీ చెప్పావా?”

“లేదు, నీ విషయం కాదు. సత్సంగం అంటే ఏమిటో తెల్సుకోవడం వల్ల నీకేం ప్రయోజనం? జిహ్వచాపల్యం కోసం క్షమ, దయాధర్మాలు వదిలిపెట్టినవాడివి. అధర్మాన్ని ఆచరించే నీకు సత్సంగంలో చెప్పిన విషయాలు తలకి ఎక్కవు. నీతో వృథా సంభాషణ చేసి ఆయాసం తెచ్చుకోవడం నాకెందుకు?”

“అదలా ఉంచు గానీ, నేను నరమాంస భక్షకుణ్ణి అని చెప్పాక కూడా నాతో అంత నిర్భయంగా ఎలా మాట్లాడగల్గుతున్నావు? ఇప్పటివరకూ నేను పట్టుకున్న ప్రతీ ప్రాణీ ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేక ప్రాణ భయంతో చిగురుటాకులా వణికిపోయేది తెలుసా?”

“శుభకర్మలు చేయనివారే మరణానికి భయపడేది. అందరం ఒకరోజు పోవాల్సిన వాళ్ళమే; నీలాంటి వాడి చేతిలో పడ్డాక ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేనని నువ్వే చెప్పావు కదా? ఇంక భయపడి ఏమి ప్రయోజనం?”

ఈ సారి భగవానుడి మాటలు కల్మాషపాదుడి మనసులో సూటిగా తగిలాయి. వళ్ళు జలదరించింది. మొదట్లో తాను ఈ సన్యాసి ఎవరో అనుకున్నాడు, తిరిగివస్తానని చెప్తే అబద్ధం ఆడుతున్నాడనుకున్నాడు. అయితే అసత్యం ఆడకుండా ప్రమాణం చేసినట్టూ తిరిగి వచ్చాడు. ఈయన నిర్భీతి, చెప్పే మాటలూ చూస్తూంటే ఇటువంటివారిని చంపడం మాట అటుంచి ఏమాత్రం అపకారం చేసినా అది విషంతో సమానం కావచ్చు లేదా తాను అర్చించే దేవతే తనని దండించవచ్చు. భగవానుడి ఎదురుగా కూర్చుని చెప్పాడు వణుకుతున్న కంఠంతో, “మీ మాటలు వినేకొద్దీ వినాలని ఉంది. దయచేసి సత్సంగంలో ఏం చెప్పారో వినిపించండి.”

“సరే అంతగా అడుగుతున్నావు కనక విను. నేను చెప్పిన విషయాలు ఇవే.

పాపం సమాచరతి వీతఘృణో జఘన్యః ప్రాప్యాపదం సఘృణ ఏవ తు మధ్య బుద్ధిః
ప్రాణాత్యయేపి తు న సాధుజనః స్వవృత్తిం వేలాం సముద్ర ఇవ లంఘయితుం సమర్ధః

నీచ మానవుడు తన క్రూరత్వం వల్ల ఎప్పుడూ జీవహింసా పాపాన్ని చేస్తూ ఉంటాడు. మధ్యమ బుద్ధి గల సాధారణ మానవుడు తనకి ఆపదలు కలిగినప్పుడు మాత్రమే జీవహింస చేస్తూంటాడు. ఉత్తమ మానవులైన సాధుజనులు చెలియలి కట్ట దాటని సముద్రం వంటివారు; ప్రాణాపాయం కలిగినప్పటికీ వాళ్ళు తమ సద్వృత్తిని అతిక్రమించరు.”

మొహం మీద కొరడాతో ఛెళ్ళున కొట్టినట్టూ మ్రాన్పడిపోయిన కల్మాషపాదుడు అన్నాడు. “నిత్యం నర భక్షణ చేస్తూ జీవహింసని చేసే నేనే ఆ నీచ మానవుణ్ణి. మీ ప్రాణాలు తీస్తానని తెలిసినా సరే ఇచ్చిన మాట తప్పక వెనక్కి వచ్చి సద్వృత్తిని అతిక్రమించని మీరు సాధుజనులైన ఉత్తములు.”

భగవానుడు చెప్పడం కొనసాగించాడు.

“నేను చెప్పిన రెండో విషయం:

అభ్యాసయోగాద్ధి శుభాశుభాని కర్మాణి సాత్మ్యేన భవంతి పుంసాం
తథా విధాన్యేవ యదప్రయత్నాజ్జన్మాంతరే స్వప్న ఇవాచరంతి

అభ్యాసం ద్వారా శుభాశుభ కర్మలు మానవులకి సహజ గుణాలు అవుతాయి. దీనివల్లనే ఏ విధమైన కర్మలు పూర్వం, ప్రస్తుతం అభ్యసించామో అవే తరువాతి జన్మలలో అప్రయత్నంగా, చేయబడుతూ ఉంటాయి; స్వప్నంలో మనం అనాయాసంగా చేసే పనులలాగానే ఇవీ అంతే.”

దాదాపు నేలమీద కూలబడిపోతూ అడిగాడు కల్మాషపాదుడు, “నరభక్షణే నేను చేసే అభ్యాసం ఈ జన్మలో. దీని ముందు ఎన్ని జన్మలలో ఎటువంటి క్రూరకర్మలు చేస్తే ఇటువంటి బతుకు సంప్రాప్తమైందో ఆలోచించడానికే భయం కలుగుతోంది. మీలాగా సత్య సంధత, నిర్భీతి కలగాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి నేను? ఎటువంటి పరిస్థితుల్లో, ఏయే కర్మలు ఆచరిస్తే నాకు ఇటువటి ధీర లక్షణాలు కలుగుతాయి?”

“నేను విందుకు వెళ్ళిన గృహస్థు ఇంట్లో చెప్పిన విషయం కూడా ఇదే. ధర్మాచరణ వలన మాత్రమే మనిషి సాధువుగా మారడానికి ఆస్కారం ఉంది. సాధుజనులకి మాత్రమే సత్య సంధత, నిర్భీతి, ధీర లక్షణాలు కలుగుతాయి.

ప్రవర్తనే హి దు:ఖస్య తిరస్కారే సుఖస్య చ
ధైర్యప్రయామః సాధూనాం విస్ఫురన్నివ గృహ్యతే

దుఃఖం ప్రాప్తించినప్పుడు, సుఖం నష్టమైనప్పుడు మాత్రమే సాధువుల ధీరలక్షణం ప్రస్ఫుటంగా తెలుస్తుంది.”

పూర్తిగా కళ్ళు తెరుచుకున్న కల్మాషపాదుడు భగవానుణ్ణి అడిగాడు. “మొదట్లో మీరొక రాజవంశానికి చెందినవారినని చెప్పారు. సుఖసంపదలతో తులతూగే విలాసవంతమైన జీవితం వదిలేసి ఇలా సాధువుగా మారడానికీ ఈ తపోజీవితం అవలంబించడానికి ఏమిటి కారణం?”

ఈ సారి భగవానుడి దివ్యమైన కంఠస్వరం కల్మాషపాదుడికి వినిపించింది.

“పూర్వాశ్రమంలో నేను శాక్యవంశపు రాజు శుద్ధోధనుడికి పుట్టిన సిద్ధార్థుడనే రాకుమారుణ్ణి.

పునః పునర్జాతిరతీవ దుఃఖం జరావిపద్వ్యాధి విరూపతాశ్చ
మర్తవ్యమిత్యాకులతా చ బుద్ధేర్లోకానతస్త్రాతుమితి స్థితోస్మి

అనేకసార్లు చస్తూ మళ్ళీ మళ్ళీ పుట్టుతూ ఉండడం చాలా దుఃఖదాయకమైన విషయం. ముసలితనం, విపత్తులూ వ్యాధులూ వీటివల్ల ఏర్పడే మార్పులన్నీ కూడా దుఃఖమే. ఏదో ఒక రోజు చావు రాబోతోంది అని మనసులో తెలుస్తూనే ఉంటుంది; అదీ దుఃఖమే. ఇటువంటి దుఃఖాలనుంచి అందరికీ విముక్తి చూపించిడానికే నేను సన్యాసం స్వీకరించి తపోజీవితం అవలంబించాను.”

ఈసారి కల్మాషపాదుడికి జ్ఞానోదయం అయినట్టయి భగవానుడితో అన్నాడు, “నాలుగు ముక్కల్లో చెప్పిన విషయాలతో నన్ను పూర్తిగా మార్చగలిగారు కనక నేను మిమ్మల్ని తిననూ లేను; బలీ ఇవ్వలేను. నేను కొలిచే దేవత నాకు ఇచ్చిన నాలుగు వరాలూ మీకు ఇచ్చేస్తాను. కోరుకోండి మీకేం కావాలో.”

“నీ మీదే నీకు అధికారం లేదని తెలుస్తూంది కదా, అటువంటివాడివి నాకు వరాలు ఎలా ఇవ్వగలవు? తీరా నేను ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నువ్వు తీర్చలేకపోవచ్చు. అప్పుడు నీ చేత అసత్యం పలికించినవాడినౌతాను. అందువల్ల నువ్వు ఇవ్వబోయే వరాలు నాకు అక్కరలేదు.”

మరోసారి తన అహం మీద భగవానుడు కొట్టిన తీవ్రమైన దెబ్బ తెలిసివచ్చింది కల్మాషపాదుడికి. మనసులోంచి పౌరుషం తన్నుకొస్తూంటే ఎలుగెత్తి చెప్పాడు, “ప్రాణాలైనా వదిలిపెడతాను గానీ మీ విషయంలో అసత్యం ఆడను. అనుమానం వదిలిపెట్టి మీకు కావాల్సిన నాలుగు కోరికలూ కోరుకోండి. మాట తప్పితే నా తల పగిలి ఛస్తాను. ఇది నేను చేసే ప్రమాణం.”

“సరే ప్రమాణం చేశావు కనక విను. నేను కోరే మొదటి వరం: ఇప్పటినుండి నువ్వు సత్యవ్రతం పాటించాలి. రెండో వరం: నువ్వు దేవత, బలీ అంటూ చేసే జీవహింస మానాలి. మూడో వరం: ఇప్పటి జీవితం వదిలిపెట్టి ధర్మమార్గంలో జీవించడానికి నువ్వు భిక్షుసంఘంలో సన్యాసిగా చేరాలి. నేను కోరే నాలుగో ఆఖరి వరం: నీ జీవితానికి ఇంతటి అధోగతి కలిగించిన నరమాంస భక్షణ నువ్వు విడిచిపెట్టాలి.”

రత్నరాసులో, సంపదలో, మరొక విలువైనది ఏదో కోరుకుంటాడనుకున్న భగవానుడి కోరికలు విని దీర్ఘంగా ఆలోచించాల్సిన పరిస్థితి కల్మాషపాదుడికి. భగవానుడు తనకోసం ఏమీ కోరుకోలేదు. అడిగిన నాలుగు కోరికలూ ఆయనకి తీవ్రమైన అపకారం చేయబోయిన తన గురించే!

కంఠం వణుకుతుంటే చెప్పాడు కల్మాషపాదుడు, “మొదటి మూడూ ఇవ్వడానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ నరమాంస భక్షణ చాలాకాలం అలవాటు వల్ల నాలుగో వరం ఇవ్వలేను. మరొకటి వేరే ఏదైనా అడగండి.”

“నాలుగో వరం ఇవ్వకపోతే మొదటి రెండూ ఇచ్చినట్టు ఎలా అవుతుంది?” భగవానుడి మొహంలో సన్నటి మందహాసం.

కాసేపు కల్మాషపాదుడు ఏదో వాదించబోయేడు కానీ చివరకి తెల్సిన విషయం–వరాలు ఇస్తానని ఎలుగెత్తి భీకరంగా ప్రమాణం చేసిన తానే ఈ సంకటమైన పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. ఎంత నచ్చచెప్పినా ఈ నాలుగు కోరికలూ తప్ప భగవానుడికి మరేమీ అక్కరలేదు. అదలా ఉంచి అన్నీ ఒప్పుకుని భిక్షుసంఘంలో జేరితే భగవానుడి అనుగ్రహంతో తన జీవితం బాగుపడుతుదని ఏమిటి? ఆ విషయమే అడిగాడు.

“సంఘంలో జేరితే నేను ధర్మం పూర్తిగా తెలుసుకుంటానా? మీ మాటలు నమ్మడం ఎలా?”

“భిక్షు సంఘంలో జేరేముందు తప్పక అడగవల్సిన ప్రశ్నే అడిగావు కనక విను, నేను చెప్పే సత్సంగంలో విషయాలు ఎటువంటివో, వాటివల్ల నీకేం ప్రయోజనమో.

తాపాత్ ఛేదాత్ చ నికషాత్ సువర్ణమివ పండితైః
పరీక్ష్య భిక్షవో గ్రాహ్యం మద్వచో న తు గౌరవాత్

చేతికి వచ్చింది బంగారమా కాదా అనేది తేల్చుకోవడానికి దాన్ని కొలిమిలో కాల్చి, విరిచి, రుద్ది పరీక్షించే విధంగా నా వాక్యాలని నా మీద గౌరవంతో కాకుండా నీ అనుభవం అనే కొలిమిలో పెట్టి పరీక్ష చేసి నిలబడితే స్వీకరించు, లేదా ఏ అనుమానానికీ తావివ్వకుండా విసిరికొట్టు.”


బాగా పొద్దుపోయాక ఆరామానికి వచ్చిన భగవానుడి కూడా మరొక వ్యక్తి ఉండడం ఆనందుడికి ఆశ్చర్యం కలిగించలేదు కానీ మర్నాడు ఆ వ్యక్తి చెప్పిన స్వంత విషయాలు, సరిగ్గా నాలుగు ముక్కలలో ఆయన జీవితాన్ని భగవానుడు ఎలా మార్చినదీ, భగవానుడు కోరుకున్న కోరికలూ విన్నాక ఆనందుడికి అర్థమైంది తన బదులు మరొకర్ని తోడు తీసుకెళ్ళమంటే వద్దని చెప్పి భగవానుడు ఒక్కడే ఎందుకు బయల్దేరాడో. కూడా మరో మనిషి ఉంటే కల్మాషపాదుడు భగవానుడిని వెళ్ళనిచ్చి ఆ మనిషికి ఏమి అపకారం చేసి ఉండేవాడో? అయితే ఆనందుడి నోట భగవానుడు ఒంటరిగా బయల్దేరడం అనే విషయం, గృహస్థు ఇంటికి రెండు దార్లు ఉన్నాయనే విషయం విన్నాక కల్మాషపాదుడు అడిగాడు, “నిజంగా భగవానుడికి విందుకు పిల్చిన గృహస్థు ఇంటికి దగ్గిర దారి తెలియదా, లేకపోతే దగ్గిర దారిలో వెళ్ళకుండా నేను ఉండే ప్రాంతానికి ఎందుకు వచ్చి ఉంటారు?”

ఆనందుడు నవ్వుతూ చెప్పాడు, “పిచ్చివాడా, ‘బుద్ధేర్లోకానతస్త్రాతుమితి స్థితోస్మి’ ఆయనే చెప్పారన్నావుగా? మనకి ఈ ప్రపంచంలో తగులుకున్న భవరోగానికి దారి చూపించే భగవానుడికి గృహస్థు ఇంటికి దగ్గిర దారి ఎటువైపు ఉందో తెలియకపోవడమేమిటి? నీ కోసమే అటువైపు కావాలని, నేను మరొకర్ని తోడు పంపిస్తానన్నా వద్దని, ఒక్కడూ వచ్చాడు. నీ అదృష్టం ఏమని చెప్పేది?”