సత్యప్రమాణం

గత పది రోజులుగా అర్ధాకలితో కాళ్ళు కడుపులో పెట్టుకుని పడుకుంటున్నాడని విన్న భగవానుడు అంగుళిమాలుణ్ణి పిలిచి అడిగాడు. “నువ్వు భిక్షు సంఘంలో జేరినది ఆకలితో చావడానికా లేక ధర్మం తెలుసుకోవడానికా?”

ఆత్మన్యూనతతో కుమిలిపోతున్న అంగుళిమాలుడు చెప్పేడు. “స్వామీ! గడప గడపకీ తిరిగి భిక్షకోసం చేతులు చాపితే గృహస్థులు నాకేసి భయంగా చూడ్డమూ, మొహంలో అసహ్యం చూపించడమూ చూస్తే నాకు అసలు బతకాలనే లేదు. ఇంతమందిని చంపి ఎన్నో కుటుంబాలని నాశనం చేసిన నేను ఓ రోజు తిండి తింటే ఎంత, తినకపోతే ఎంత?”

“కాలేకడుపుతో ధ్యానం చేయగలుగుతున్నావా?”

“ఎవరో ఒకరు భిక్ష ఇచ్చినా, అది నోట్లో పెట్టుకోబోయే ముందు నేను చంపిన ఎవరో గుర్తుకొస్తున్నారు. నేను వాళ్ళ బొటనవేళ్ళ కోసం కత్తి తీస్తున్నప్పుడూ వాళ్ళని చంపుతున్నప్పుడూ ఏడుస్తూ మొరపెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటీ గుర్తుకొచ్చి అసలు ముద్ద నోట్లోకి దిగితే కదా?”

“ముందొకసారి చెప్పాను కదా, జరిగిపోయిన వాటిగురించి అదేపనిగా చింతించడం కంటే ప్రస్తుతం ఏం చేయగలవు ఆ పాపం కడుక్కోవడానికి అనేదే ముఖ్యం. అతిగా ఆలోచించక మధ్యేమార్గం ఎంచుకో. కాలానుగుణంగా అన్నీ అవే సర్దుకుంటాయి.”

అంగుళిమాలుడు వెళ్ళిపోతూంటే భగవానుడు ఆనందుడితో చెప్పేడు, “క్రూరాతిక్రూరుడిగా పేరు తెచ్చుకున్న ఈ అంగుళిమాలుడు కూడా భిక్షువుగా జీవితంలో అద్భుతాలు చేయగలడు. అదేమిటో చూడాలని ఉందా?”

ఆనందుడు కుతూహలంగా చూశాడు భగవానుడేం చెప్తాడా అని.

“రేపు జరగబోయేది జాగ్రత్తగా గమనించు.” చిరునవ్వుతో చెప్పాడు తథాగతుడు.

మర్నాడు భిక్షకి బయల్దేరిన అంగుళిమాలుడు నగరం మధ్యలోకి వచ్చాడు. ఎప్పటిలాగానే జనం తనని చూసి భయంతో పరుగులు పరుగెట్టడం, కాస్త ధైర్యం ఉన్నవాళ్ళు తన మొహంలోకి సూటిగా చూడడం, ఇంకొంతమంది తిట్టుకోవడం జరుగుతూనే ఉంది. భగవానుడు చెప్పినట్టూ తనకి కోపం రాకూడదు. ఒకానొక దశలో తాను వేరు, ఇప్పుడు తన జీవితం వేరు. తాను చేసిన పాపకర్మలకి ఈ తిట్లూ, శాపనార్థాలు ఏపాటి? ఈ ఆలోచనల్లో ఉండగానే ఎవరో విసిరిన రాయి వచ్చి సూటిగా తలమీద తగిలింది. రక్తం కారుతుంటే తాను చేసిన హత్య ఒకటి గుర్తొచ్చింది. చంపడానికి కత్తి తలమీద పెట్టాక ఒక్క బొట్టు రక్తం మీద పడేసరికి చావబోయే ఆయన తన కాళ్ళమీద పడి తనకున్న మూడేళ్ళ కవలపిల్లలని తల్చుకుని ఏడిచాడు. తన మనసు కరిగితేనా? ఇప్పుడదంతా మనసులో కదిలేసరికి కడుపులో దేవినట్టయింది. తల కిందకి దించుకుని కారే రక్తం ఆపడానిక్కూడా ప్రయత్నం చేయకుండా అక్కడ్నుండి మరో చోటకి బయల్దేరాడు భిక్షకి.

దారిలో ఏదో కూడలి దగ్గిర గుమికూడి ఉన్నారు జనం, ఏదో వింత చూస్తున్నట్టు. దగ్గిరకెళ్ళి చూశాడు. దారుణమైన నెప్పితో పడి ఉన్న ఒక స్త్రీ మూలుగుతోంది. ప్రసవవేదన. ఇందుకేనా భగవానుడు చెప్పేది జననమరణాలనుంచి విముక్తి పొందాలని? పాపం ఎంతటి వ్యథ! చుట్టూ ఉన్నవాళ్ళలో ఎవరికీ ఏమీ చేయడానికి పాలుపోవడంలేదు. ఎవరో పరుగున పోయి వైద్యుణ్ణి పిలుచుకొచ్చారు. ఆయనేదో మందిచ్చినా నెప్పి మాత్రం తగ్గినట్టూ లేదు. తాను వినడం ప్రకారం ఆవిడ గత ఆరు గంటలుగా ఈ వేదన పడుతోంది. కడుపులో బిడ్డగానీ అడ్డం తిరిగిందేమో? ఆవిడ అరుపులు వింటున్నవాళ్ళు నిస్సహాయంగా చూడ్డం తప్ప ఏమీ చేయలేరని తెలుస్తూనే ఉంది. చాలాసేపు అక్కడే తచ్చాడేసరికి ఎవరో తనని చూసి అన్నారు, ‘ఈ అంగుళిమాలుడు ఇక్కడ ఉన్నందువల్లే ఈవిడకి తగ్గడంలేదు. ఈ వెధవని ఇక్కడ్నుంచి పొమ్మనండిరా.’

వెంఠనే తనమీదకి ఓ అయుదుగురు దాడి చేయడానికి వచ్చేసరికి అక్కడనుంచి కదలవల్సిన పరిస్థితి.

ఇంత జరిగాక కడుపులో ఆకలి గురించి మర్చిపోయి వెనక్కి వస్తుంటే మనసులో వ్యథ. మనిషి పుట్టడానికి ఇంత నెప్పి అవసరమా? పాపం ఆ ప్రసవవేదన పడే ఆవిడ నెప్పి తగ్గేదెప్పుడు? బిడ్డ పుట్టాక మరెన్ని రోజులు అనుభవించాలో? బిడ్డ పెరిగేకొద్దీ ఆ పెరగడం బాగుంటుందో లేదో అనే వ్యథ, పెరిగాక జీవితంలో నిలదొక్కుకున్నాడా అనే వ్యథ. తర్వాత పెళ్ళీ, పిల్లలూ, ఈ లోపునే ఎప్పుడు వస్తుందో తెలియని, ఎవరికీ తప్పని చావు. ఏం మానవ జీవితం? భగవానుడు దీని గురించి ఎన్నిసార్లు చెప్పాడుకాదు? తన జీవితంలో భగవానుణ్ణి ఏ పదో ఏటో కల్సుకుని ఉంటే ఎంత బాగుండేది! తాను చదువుకోవడానికెక్కడో జేరడం, ఆ గురువు తనని వెయ్యిమందిని చంపి వాళ్ళ బొటనవేళ్ళు తెగేసి తెమ్మనడం, తాను అన్నింటికీ ఒప్పుకుని మనుషులని చంపడం. భగవంతుడా, ఎప్పుడు తనకి విముక్తి? కాళ్ళీడ్చుకుంటూ విహారానికి వచ్చేసరికి ఎదురుగా ఆనందుడు కనిపించాడు చిరునవ్వుతో.

తన మొహం చూడగానే తెల్సినట్టూ ఉంది ఈ రోజు కూడా తాను భిక్ష ఏమీ తేలేదని. తనకూడా లోపలకి వచ్చి అడిగాడు, “ఏమిటీ రోజు విశేషాలు?”

“నన్ను ఏమీ అడగవద్దు. మానవజీవితం ఇంత పాపంతో కూడుకున్నదని తెలిసేకొద్దీ నేనెంత దౌర్భాగ్యపు జీవితం అనుభవించానో అనేవి గుర్తుకురాగానే నేను జీవించడం అనేది ఎందుకా అని…”

మాట పూర్తవకుండానే ఆనందుడు అంగుళిమాలుణ్ణి చేత్తో లేవదీసి భగవానుడి దగ్గిరకి తీసుకెళ్ళాడు. ఎప్పటిలాగే తథాగతుడు మొహంలో చిరునవ్వుతో అంగుళిమాలుణ్ణి అడిగాడు.

“ఏం ఇలా వచ్చారు మళ్ళీ?”

“భిక్షకి వెళ్ళిన దారిలో ఒక స్త్రీ కనిపించింది ప్రసవ వేదన పడుతూ. వైద్యులొచ్చి మందులిచ్చినా ఏమీ తగ్గలేదు. ఆ స్థితిలో ఆవిణ్ణి చూసేసరికి ఏమి చేయాలో తెలియలేదు. ఆవిడ బతుకుతుందో లేదో తెలియదు అంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. భిక్ష మాట అటుంచి అవతల ఆ మనిషి చావు బతుకుల్లో ఉన్నందుకు నాకు మతి పోయినప్పుడు నేను అక్కడ ఉన్నందువల్లే అవిడకి నెప్పి అలా ఉందని నన్ను వెళ్ళగొట్టారు. నెప్పి నా మూలానా అయితే నేను ఏం చేస్తే ఆవిడకి తగ్గుతుంది? వెయ్యికి ఒక్కటి తక్కువగా హత్యలు చేసిన నేను ఆవిడ దగ్గిరకెళ్ళగానే నెప్పి ఎక్కువైందంటే నమ్మగలను కానీ నేను వచ్చేసినప్పుడూ, ఇంకా ఇప్పటికీ ఆవిడ వ్యథ అనుభవిస్తూనే ఉంది. భగవాన్ మీరే ఏదో చేసి ఆవిడకి నయం చేయవచ్చుగదా? నేను ఆవిడని చూసినప్పటినుండీ మరో విషయం మీద ఆలోచించలేక పోతున్నాను. దయచేసి మీరు…”

“నేను చెప్పినది చేస్తానంటే ఆవిడకి నెప్పి తగ్గి ప్రసవం అవుతుంది. నిజంగా నన్ను నమ్మి నేను చేయమన్నది చేస్తావా? నా మీద ఆ నమ్మకం ఉంటే చెప్పు.”

“ఆవిడకి నెప్పి తగ్గడానికి ఏమి చేయమన్నా సిధ్ధమే.”

“అయితే విను. నువ్వు ఆవిడ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ‘నేను ఈ జీవితంలో ఇప్పటివరకూ తెలిసి ఎటువంటి పాపకర్మా చేయలేదని’ నీ భిక్షాప్రాత్రలో నీరు చల్లి సత్యప్రమాణం చేసినట్టయితే వెంఠనే అవిడకి తగ్గుతుంది.”

భగవానుడి మాట విన్న అంగుళిమాలుడు కుదేలైపోయాడు. కళ్ళలో నీరు తిరుగుతుండగా నేలమీద కూలబడిపోయేడు.

“స్వామీ! చచ్చిపోయిన పాముని ఎన్నిసార్లు కొట్టి చంపుతారు? నేను వెయ్యికి ఒక్కటి తక్కువగా మనుషులని క్రూరంగా అమానుషంగా చంపినవాణ్ణి. ఎటువంటి పాపకర్మా చేయలేదని ప్రమాణం చేస్తే అది సత్యం ఎలా అవుతుంది? మీరు ఆవిడ నెప్పి తగ్గించలేనని చెప్పరాదా, ఇటువంటి అసత్య ప్రమాణం నన్ను చేయమనడంకంటే? ఈ అసత్యం వల్ల ఇప్పటికే పూర్తిగా పాపంలో మునిగి ఉన్న నన్ను మరో పాపం చేయమని చెప్పడం దేనికి? క్షమించండి నేను ఈ ప్రమాణం చేయలేను, చేయడానికి నాకు అర్హతా లేదు.”

“ఇంతక్రితమే ఆవిడ నెప్పి తగ్గడానికి ఏదైనా చేయడానికి సిద్ధమే అన్నట్టున్నావు?” భగవానుడి మొహంలో చిరునవ్వు, “నా మీద నమ్మకం ఉంటే, వెంఠనే వెళ్ళి నేను చెప్పిన సత్యప్రమాణం చేసిరా. ఆ తర్వాత జరిగేది చూసి వెనక్కి వచ్చాక మిగతా విషయాలు మాట్లాడదాం.”

ఈసారి మారు మాట్లాడకుండా వడివడిగా వెళ్తున్న అంగుళిమాలుణ్ణి చూపించి భగవానుడు చెప్పాడు ఆనందుడితో, “అతని వెనకే వెళ్ళి చూసిరా, ఏం జరుగుతుందో.”

ఆనందుడు అంగుళిమాళుణ్ణి అనుసరించాడు, కుతూహలంగా.

కాసేపటి ముందే ఇక్కడకి వచ్చినప్పుడు తాము కొట్టబోతూ తిట్టి పొమ్మన్నప్పుడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయిన అంగుళిమాలుడు మరోసారి రావడంతో ప్రసవవేదన పడుతున్న స్త్రీ చుట్టూ ఉన్న జనం ‘వీడు మళ్ళీ వచ్చాడే, ఏమౌతుందో?’ అనుకుంటూ మీదకి రాబోయేరు.

అంగుళిమాలుడు ఆ గుంపులో జనం తనని ఏమని తిట్టుకుంటున్నారో చెవిలో పడుతున్నా, ఆవిడ దగ్గిరకి వెళ్ళగలిగేంత దూరం వెళ్ళి తన భిక్షాపాత్రలోంచి నీళ్ళు చేతిలోకి తీసుకుని చెప్పాడు పైకి, “నేను కనక భగవానుడు చెప్పినది నిజమని మనఃస్ఫూర్తిగా నమ్మి ఈ జన్మలో ఏ పాపకర్మా చేయనివాడినైతే, ఈవిడకి సుఖ ప్రసవమై శాంతించుగాక!” వెంఠనే ఆ నీళ్ళని అక్కడ నేలమీద జల్లి వెనుతిరిగేడు, ఏమి జరిగినా తనకి పట్టనట్టూ. అప్పటివరకూ తనని వెనకే అనుసరించిన ఆనందుడు కనిపించేసరికి చెప్పాడు, “నేను ఇలా సత్యప్రమాణం చేసినట్టూ భగవానుడికి చెప్పడానికి మీరే సాక్ష్యం.”

మరుక్షణం ఆనందుడు నవ్వుతూ అంగుళిమాలుణ్ణి కూడా చూడమని చేయెత్తి చూపించాడు జనం ఉన్న గుంపుకేసి. ఏ క్షణంలో అయితే అంగుళిమాలుడు ప్రమాణం చేసాడో అదే సమయంలో ఆవిడకి ప్రసవం అయి, జనం తామిద్దరికేసీ వింతగా చూడ్దం కనిపించింది. అంగుళిమాలుడి మొహంలో సంతోషం, దానివల్ల అతని శరీరం కంపించడం ఆనందుడికి కనబడుతూనే ఉంది.

విహారానికి తిరిగి వచ్చాక జరిగినది భగవానుడితో చెప్పి అడిగాడు అంగుళిమాలుడు, “నేను మీరు చెప్పినట్టు చేసిన ప్రమాణం సత్యం కాకపోతే ఆవిడ వేదన తగ్గి ఉండేది కాదనేది నిజం. నేను అంత పాపాత్ముడినైనా ఆ ప్రమాణం సత్యం ఎలా అయిందో చెప్పండి. దాన్ని సత్యప్రమాణం అనడానికి ఇప్పటికీ నా మనసు ఒప్పుకోవడంలేదు.”

“ఎప్పుడైతే నువ్వు నన్ను అనుసరించడం ప్రారంభించావో ఆరోజునే నీకు మరో జన్మ మొదలైంది. నువ్వు చేసిన హత్యలూ అన్నీ క్రితం జన్మలోవి. ఈ విహారంలో జేరగానే భిక్షువుగా కొత్త జన్మ ఎత్తిన నువ్వు ఏ పాపకర్మా చేయనట్టే. ఒకప్పుడు కర్కశంగా మనుషులని చంపగలిగిన నువ్వు ఈ నాడు ఎవరైనా కొంచెం బాధ అనుభవిస్తుంటే చూడలేకపోతున్నావు కదా? అందువల్లే నీ మాట సత్యప్రమాణంగా పనిచేసింది. నువు నేర్చుకోవల్సిందేమిటంటే గతం గతః దాన్ని ఎప్పటికీ మార్చలేవు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న జీవితంలో తప్పులు చేయకుండా ధర్మం తెలుసుకోవడం కోసం పాటుపడడమే నీ పని. అర్థమైందా?”

ఒక్కసారి మనసులో ఆనందం ఉప్పొంగేసరికి అంగుళిమాలుడు తథాగతుడికి చేతులు జోడించాడు.

ఎంతటి పాపాత్ముడైనా భగవానుడు చెప్పిన ధర్మపథం ఆచరిస్తే ఆయన అనుగ్రహంతో జీవితంలో అద్భుతాలు చేయగలడని తనకి తథాగతుడు చెప్పినది గుర్తొచ్చి ఆనందుడి మొహంలో చిరునవ్వు గోచరించింది.