అప్రజాత

భగవానుడు ఆ రోజుకి ఉపన్యాసం పూర్తి చేశాక అందరి ప్రశ్నలకీ సమాధానం చెప్పి ఆసనం మీదనుంచి లేవబోతూంటే ఆనందుడొచ్చి చెప్పాడు, “ప్రసేనజిత్తు సేనాధిపతి బంధులుడి భార్య మల్లిక అనే ఆవిడట, మీతో మాట్లాడడానికి సమయం ఉందా అని అడుగుతున్నారు.”

“సరే రమ్మను.” చిరునవ్వుతో చెప్పాడు భగవానుడు.

ఖరీదైన ఆభరణాలు ధరించి లోపలకి వచ్చినావిడని భగవానుడు అంతకుముందు కొన్నిసార్లు చూశాడు తన ప్రసంగాలు వినడానికి వచ్చినప్పుడు. ఇప్పుడేం కష్టం వచ్చిందో మరి, “ఏమమ్మా, ఇలా వచ్చారు?” అడిగాడు.

“నా కథ పెద్దదే, మీ సమయం పాడుచేయాల్సి వస్తుంది, మరోసారి రావడం కుదరదు, వీటన్నింటికీ క్షమిస్తానంటే చెప్తాను. కుదరదంటే నా ఖర్మ అనుభవించడం ఎలాగా తప్పదు.” కళ్ళనీరు తిరుగుతుంటే చెప్పింది.

“మీకు సహాయం కావాలిస్తే అదేదో ఇప్పుడే చెప్పేయండి.”

మల్లిక తన కథ చెప్పడం మొదలుపెట్టింది.


“మాళ్వ రాజు నా తండ్రి. బంధులుడు నాకు బావ వరస, అంటే నా తండ్రికి మేనల్లుడు. తక్షశిలలో ప్రసేనజిత్తుతో పాటు కలిసి చదువుకున్నవాడే. యుధ్ధవిద్యలలో ఆరితేరి ఈ జంబూద్వీపంలో అంతటి నేర్పు ఉన్నవాడు మరొకడు లేడని పేరు తెచ్చుకున్నాడు. చదువు అయ్యాక ఇంటికి వచ్చిన బంధులుడికి నన్ను పెళ్ళిచేయాలా వద్దా అనే మీమాంసలో కొట్టాడాడు మా తండ్రి…”

“అటువంటి వీరుడితో మీకు పెళ్ళి చేయడానికి ఎందుకు సంశయం?” భగవానుడు అడిగాడు.

“వీరుడని పేరు వినిపించింది కానీ స్వతహాగా అతని నేర్పు చూడలేదని కావొచ్చు. అది చూడడానికో పరీక్షపెట్టాడు. అరవై వెదుళ్ళు మోపుగా కట్టిన అన్నింటినీ ఒక్క వేటుతో నరకగలిగితే కూతుర్ని ఇచ్చి పెళ్ళిచేస్తాననీ లేకపోతే వేరే అల్లుణ్ణి చూసుకుంటాననీ చెప్పాడు. బంధులుడికి ఇదేం పెద్ద గొప్ప పరీక్షగా కనిపించలేదు కనక చెప్పాడు, ‘ఇదేం పరీక్ష! మామూలు సైనికుడి కత్తితో ఒకదెబ్బకి ఎవరైనా కొట్టగలరు వీటిని.’ అయితే మా తండ్రి పట్టువదల్లేదు. బంధులుడు ఒక్కవేటుతో వాటిని ఛేదించాక తెల్సింది తండ్రి చేసిన మోసం. ఆ అరవై వెదుళ్ళ మధ్యలో ఇనుప చువ్వలు పెట్టారు. కానీ బంధులుడు ఒకే ఒక దెబ్బతో ఆ చువ్వలతో సహా అన్నింటినీ ఛేదించాడు….”

మల్లిక ఊపిరి తీసుకోవడానికి ఆగి భగవానుడి మొహంలో ఏ భావమూ లేకపోవడం చూసి చెప్పడం కొనసాగించింది.

“…నేనంటే ఇష్టం ఉండడం వల్ల నన్ను పెళ్ళి చేసుకున్నాడు కానీ నాతండ్రి చేసిన మోసం తెల్సింది కనక ఇంక అక్కడ ఉండడం ఇష్టం లేక ఇలా శ్రావస్తికి వలస వచ్చాం. కాబోయే స్వంత అల్లుణ్ణే మోసం చేయబోయిన రాజు ముందు ముందు ఇంకేమైనా చేయొచ్చని బంధులుడి ఊహ. ఇక్కడ శ్రావస్తి రాజు ప్రసేనజిత్తు బంధులుడికి సహాధ్యాయి, తక్షశిలలో. అందువల్ల ఇక్కడ సేనాధిపతిగా ఉద్యోగం. ప్రసేనజిత్తు భార్య పేరు కూడా మల్లిక కావడంతో నన్ను బంధుమల్లిక అంటున్నారు. మేము ఇక్కడకి జేరాక నేను మీ ప్రసంగాలు వినగలుగుతున్నాను. మనసు ప్రశాంతంగా ఉందనుకునేలోగా ఇప్పుడో కష్టం…” దుఃఖంతో మాట పెగలని మల్లిక ఆగింది.

భగవానుడు ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. మనసులో ఉన్న దుఃఖం దిగాక మల్లిక మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది.

“ఇక్కడకి వచ్చి దాదాపు ఆరేడు సంవత్సరాలు అవుతోంది. అతి బలవంతుడైన బంధులుడి వల్ల ప్రసేనజిత్తు బాగా బలపడ్డాడు. దేశం మొత్తంలో ముగ్గురి దగ్గిర మాత్రమే ఉండే అత్యంత ఖరీదైన మేఖల అనే ఈ వడ్డాణం లాంటి ఆభరణం కూడా నాకు బంధులుడే చేయించిపెట్టాడు. కానీ ఇప్పటివరకూ నాకు కడుపు పండలేదు. తనంతటి వీరుడు ఒక్కడైనా నా కడుపున పుడితే బాగుండునని బంధులుడి కోరిక. పిల్లలు లేరు కనక నన్ను తిరిగి నా తండ్రి దగ్గిరకి వెళ్ళిపోమని బంధులుడు నన్ను ఇంట్లోంచి బయటకి పంపించాడు. అతన్నే నమ్ముకుని వచ్చినదాన్ని; దిక్కు తోచక ఏం చేయాలో మిమ్మల్ని అడుగుదామని ఇలా వచ్చాను.”

అంతా విన్న భగవానుడు చెప్పాడు, “ఇప్పుడు బంధులుణ్ణి మాట్లాడడానికి పిలిస్తే రావడానికి ఒప్పుకుంటాడా?”

“నా వల్ల పిలిచారంటే మరింత కోపం రావచ్చేమో…”

“మీరు మీ స్నేహితుల ఇంట్లో వేచి ఉండండి, నేను బంధులుడితో మాట్లాడేటప్పుడు. ఏమంటాడో చూద్దాం.”


భగవానుడి దగ్గిర్నుంచి పిలుపు వచ్చేసరికి బంధులుడు ఆయనమీద గౌరవంతో వెంటనే బయల్దేరి వచ్చాడు.

“ఏమి బంధులా? రాజ్యం, రాజూ, అంతా క్షేమమేనా?” వచ్చిన బంధులుణ్ణి అడిగాడు తథాగతుడు.

“అన్నీ బాగానే ఉన్నాయి కాని ఒకే ఒక సమస్య భగవాన్!”

“రాజ్యాలు విస్తరిస్తుంటే, శత్రువులు పుట్టుకురావడం, యుధ్ధాలూ, వెనక పోట్లూ మామూలే కదా? యుగాలబట్టీ ఇదే కథ ఎక్కడచూసినా. ఇంతకీ ఏమిటి నీ సమస్య?”

“నాకు ఇప్పటివరకూ సంతానం కలగలేదు. నాకో కొడుకు పుడితే వాణ్ణి నా అంతవాడిగా చేయాలని నా ఆరాటం. ఈ రోజునే మల్లికని వాళ్ళింటికి తండ్రి దగ్గరకి వెళ్ళిపోమని చెప్పాను. ఒకసారి మల్లిక వెళ్ళిపోగానే విచారం పట్టుకుంది. ఇల్లంతా బోసిబోయినట్టూ వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. అటు సంతానం కావాలనే కోరిక, ఇటు మల్లికపట్ల అలా ప్రవర్తించినందుకు ఆందోళనా అంతా కలిపి విచారంగా ఉంది. ఏమి చేయాలో తెలియనపుడు మీరు పిలిచారు. ఏదో దారి చూపిస్తారని వెంఠనే వచ్చాను.”

“చిన్నప్పటినుండీ పెంచిన తల్లీ తండ్రీ అందర్నీ వదిలి నిన్నే నమ్ముకుని వచ్చిన భార్యని అలా ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఆవిడకెలా ఉంటుందో అనే ఆలోచన రాలేదా?”

“కోపంలో అలా అన్నాను కానీ మల్లికని వదిలి ఉండలేనని అనిపిస్తోంది. మల్లిక కూడా మామూలు మనిషి కాదు, మంచి బలవంతురాలు. మేఖల అనే ఆభరణం ధరించగల సత్తా ఉన్నది. తన ఒక్కచేత్తో ఏనుగులని అదుపుచేయడం నేను స్వంతంగా చూశాను. మరి మల్లిక అప్రజాతగా ఉండిపోతే ఎలా?”

“జీవితం అంటే అలాగే ఉంటుంది, పిల్లలు పుడితే ఒక ఆనందం, వాళ్ళు పుట్టకపోతే మరో కష్టం. పుట్టాక వాళ్ళెలా బతుకుతారో అనే చింత, అలా వాళ్ళు పెరిగే కొద్దో ఒక్కో విషయం చింతిస్తూంటే జీవితం గడిచిపోతుంది. ఇప్పుడిలా ఉంది మీ జీవితం; పిల్లలు పుడితే బాగుంటుందనేది ఎంత నిజమో తెలుసా? పిల్లలు పుట్టినవాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టేనా? సరే, ఏదో విధంగా నీకు పిల్లలు పుట్టారనుకో. వాళ్ళు నీలా బలవంతులౌతారని చెప్పలేం కదా? బలవంతులు అయినా ఏదో యుధ్ధం జరగవచ్చు అందులో నువ్వు, నీ పుత్రులూ మరణించరని ఏదైనా ధీమా ఉందా? యుద్ధం రాకపోయినా వ్యాధులు ఉండనే ఉన్నాయి ప్రాణాలు కబళించడానికి.”

“అవును భగవాన్, కానీ కనీసం ఒక్క కొడుకైనా నా పేరు నిలబెడతాడని….”

“ఒక్కొక్కసారి పిల్లలు పుట్టడం ఆలస్యం కావచ్చు. కానీ నువ్వు మల్లికని వెళ్ళిపోమన్నావు కదా, పిల్లలు ఎవరి ద్వారా అయినా కనాలనా లేకపోతే నువ్వు చెప్పినట్టూ బలమైన మల్లికలాంటి రాజపుత్రికద్వారానా?”

“మల్లిక వల్ల ఒక్క కొడుకు పుట్టినా చాలు.”

“చెప్పాను కదా, పిల్లలు పుట్టడం ఆలస్యం కావచ్చు కానీ మీ ఇద్దరూ కలిసి ఉండడం ముఖ్యం. ఎందుకంటే అందర్నీ వదులుకుని వచ్చిన మల్లికని నువ్వు అలా వెళ్ళిపోమనడం మంచిదేనా? ఒకసారి ఆలోచించు మరి.”

బంధులుడికి బలంగా చెంపదెబ్బ తగిలినట్టయింది. కాసేపటి మౌనం తర్వాత చెప్పాడు “భగవాన్, నిజంగా నాదే తప్పు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఈపాటికి మల్లిక నిజంగానే రాజ్యం దాటి ఉంటే, నాకున్న అభిమానం వల్లా, అక్కడ పెళ్ళికి ముందు నాకు జరిగిన అవమానం వల్లా నేను కుశీనగరానికి వెళ్ళలేను. ఇంక మల్లికని వెనక్కి రప్పించడం ఎలా?”

“మల్లిక ఈ నగరంలోనే మీకు తెలిసిన స్నేహితుల ఇంట్లో ఉంది. వెళ్ళి చేసిన పనికి క్షమాపణ చెప్పి గౌరవంగా వెనక్కి తీసుకెళ్ళు. నీకు మల్లిక ద్వారా పిల్లలు కావాలంటే ఆవిడ మానసికంగా ఎల్లవేళలా సంతోషంగా ఉండేటట్టూ చూడవల్సిన భాధ్యత నీదే కదా? నీకు ఒకడే కొడుకు పుడతాడో అనేక మంది సంతానమే కలుగుతుందో ముందు ముందు చూద్దాం. కాలమనే ప్రవాహంలో అప్రజాత ప్రజాతగానూ మేఖల అమేఖలగానూ కావొచ్చు.” భగవానుడు చెప్పాడు ప్రశాంతంగా.

కథంతా అక్కడే ఉండి విన్న ఆనందుడు “అప్రజాత ప్రజాతగానూ మేఖల అమేఖలగానూ కావొచ్చు” అనేమాట విని మనసులో నవ్వుకున్నాడు.


బంధులుడితో పాటు వెనక్కి ఇంటికి వచ్చిన బంధుమల్లిక ఎప్పటిలాగానే భగవానుడి ప్రసంగాలు వినడానికి వెళ్తోంది. అయితే ఈసారి బంధులుడిలో మార్పు సుస్పష్టం. అన్నింటికన్నా బంధులుడి మొహంలో ధైర్యం ఏమిటంటే, తనకి భగవానుడు చెప్పాడు ఆలస్యం అయినా పిల్లలు పుట్టవచ్చనేది. ప్రపంచంలో ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు కానీ భగవానుడి నోటి మాట వ్యర్ధం కావడం అసంభవం. రెండేళ్ళకి మల్లిక గర్భం ధరించాక ఓ రోజు బంధులుణ్ణి అడిగింది మల్లిక, “నాకు లిఛ్ఛవీ రాజ్యంలో రాణులు స్నానం చేసే కలువకొలనులో స్నానం చేయాలని ఉంది, అది ఏదో ఒక విధంగా కుదర్చగలరా?”

అడిగినది మొదటిసారి గర్భంతో ఉన్న తన భార్య కానీ లిఛ్ఛవులు తమ రాజ్యానికి ప్రథమ శత్రువులు. వాళ్ళని స్నేహంగా అడగడం కుదరని పని. సిగ్గు విడిచి అడిగినా సరేననిపించుకోవడం అసాధ్యం. వాళ్ళతో గొడవ వస్తే యుధ్ధానికి దిగినా లేదా అక్కడే తన ఒక్కడినీ రెచ్చగొట్టినా మల్లికకి అవమానం జరగవచ్చు. అవమానం మాట అలా ఉంచి గర్భంతో ఉన్న మల్లిక గానీ గాయపడితే? ఈ ఆలోచన రాగానే బంధులుడిలో వీరుడు పైకొచ్చి అరిచేడు మనసులో, ‘ఈ జంబూద్వీపంలో బంధులుడిని జయించగలిగేది ఎవరు?’ ఒక్కసారి నవ్వు వచ్చింది బంధులుడికి. “మీ ఆడవాళ్ళు గర్భంతో ఉన్నప్పుడు అడిగే కోరికలు తీర్చాలంటారు కనక రేపే బయల్దేరుదాం. నీతో పాటు నేనూ ఆ కొలనులో దిగుతాను. ఎవరు అడ్డుకుంటారో చూద్దాం.”

వారం రోజులు పోయాక ఆనందుడు వచ్చి చెప్పాడు తాను విన్న సంగతి భగవానుడితో. బంధులుడు మల్లికతో సహా ఆయుధాలు ధరించి లిఛ్ఛవీ రాజ్యానికి వెళ్ళాడు భార్య అడిగిన కోరిక ప్రకారం కొలనులో స్నానం చేయడానికి. ఎవరూ అడ్డుచెప్పేవాళ్ళు లేకపోయారు కానీ వీళ్ళు స్నానం అయ్యాక వచ్చేస్తూ ఉంటే ఆ లిఛ్ఛవీ రాజకుమారులు, మిగతా సైన్యంలోవారూ ఐదువందల మంది ఆటకాయించారు. జరిగిన దొమ్మి యుధ్ధంలో కొంతమంది అక్కడే చనిపోతే, మిగతావారు ఇళ్ళకి వెళ్ళాక తగిలిన గాయాలకి పోయారు. తన వంటి మీద గాటు అనేది పడకుండా బంధులుడు అందర్నీ యమలోకానికి పంపించాడు. మల్లిక, బంధులుడూ క్షేమంగానే ఉన్నారు కానీ అటువైపు లిఛ్ఛవీ రాజ్యంలో యుధ్ధానికి వచ్చిన ఐదు వందలమందిలో రాజకుమారుడనేవాడు ఒక్కడూ మిగలలేదు.

భగవానుడు అంతా విని మౌనంగా ఊరుకున్నాడు.


పుట్టిన కవలపిల్లల్ని తీసుకొచ్చి మల్లిక భగవానుణ్ణి చూడబోయింది. తల్లిగా మారినందుకు అమిత సంతోషం మనసులో, దానికి భగవానుడిమీద రెట్టింపు భక్తి – తన కాపురం నిల్చినందుకూ, తాను భగవానుడి బోధనలు రోజూ వినగల్గుతున్నందుకూ, బంధులుడు ఇప్పుడు తనని బాగా చూసుకుంటున్నందుకూ. ఈ కలగలిసిన ఆనందాలనన్నింటినీ గమనించిన భగవానుడు చెప్పాడు: “ఇప్పటినుండి సంఘసేవ, ధర్మం గురించి తెల్సుకోవడానికి ప్రయత్నం మరింత ముమ్మరం చేయాలి. లేదా కాలప్రవాహంలో కన్ను మూసి తెరిచేలోపుల అనేక మార్పులొచ్చి జీవితం అయిపోతుంది. ప్రపంచంలో దేనికైనా సరే ఎదగడం, క్షీణించడం అనేవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేవి, ఆ మార్పు తప్పదు. మృత్యువు ఎవరి ముంగిట కాసుకుని ఉందో ఎవరూ చెప్పలేరు.”

బంధుమల్లిక వెళ్ళిపోయాక ఆనందుడు అడిగాడు భగవానుణ్ణి, “పుట్టిన పిల్లలతో వచ్చినావిడ మీరు చెప్పిన మృత్యువు గురించి మాట విని ఏమనుకుంటుందో?”

“నా గురించి అలా అనుకునేది అయితే ఇక్కడకి వచ్చేదే కాదు ఆవిడ. అయినా ధర్మం గురించి చెప్పేటప్పుడు తరుముకొచ్చే మృత్యువు గురించి చెప్పకపోతే ఎలా? మరో కొన్ని సంవత్సరాలలో జరిగబోయే ఏ మారణహోమానికైనా ముందునుంచే సిధ్ధమై ఉండి ధర్మం గురించి అన్వేషణ మొదలుపెట్టాలి కదా?

జరగబోయే మారణహోమం ఏమిటనేది అడగడం అనవసరం కనక ఆనందుడేమీ మాట్లాడలేదు


పదహారు సంవత్సరాలు గడిచాయి. ఏడాదికి ఇద్దరేసి కవలలతో మొత్తం ముప్ఫై ఇద్దరు పిల్లలని కన్నా ఇంకా ధృఢంగానే ఉంటూ, ధర్మం తెలుసుకోవడానికి భగవానుడి ప్రసంగాలు వింటూ బంధుమల్లిక బౌద్ధారామనికి వస్తూనే ఉంది. కాల ప్రవాహంలో మరో కొన్నేళ్ళు గడిచాక బంధులుడి పిల్లలందరూ తండ్రి శిక్షణలో అతనికి తీసిపోని బలవంతులగా తయారౌతున్నారు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళయి ఈ బంధులుడి కుటుంబం పెద్ద ప్రతిపక్ష సేనలా తయారౌతోంది. ఈ బలవంతులందరికీ పిల్లలూ మనవలూ పుట్టి అందరూ రాజుతో కలిస్తే ప్రసేనజిత్తు మరింత బలవంతుడై చక్రవర్తి అయిపోగలడు. ఇదంతా నచ్చని శత్రువులు బంధులుడి గురించి రాజుకి పితూరీలు చెప్పడం మొదలుపెట్టారు. వాటి ప్రకారం బంధులుడు రాజుని చంపి తానే రాజు కావాలని అనుకుంటున్నాడని, రాజంటే ఇప్పుడు అసలు గౌరవం అనేదే ఇవ్వడని, ఇందరు పిల్లలు పుట్టాక తనకి ఇచ్చే జీతభత్యాలు సరిపోక అసంతృప్తితో ఉన్నాడని, అలా అనేకానేక ఆరోపణలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ప్రసేనజిత్తు దగ్గిరకి. ఇందులో రాజు చేసిన పొరపాటు ఏమిటంటే నిజానిజాలు కనుక్కోకపోవడమూ, బంధులుడికి అసలు ఇటువంటి ఆలోచనలు లేవనీ, బంధులుడికి ఉన్న రాజ్యభక్తి అపారం అనీ తెలుసుకోక పోవడమూ. ఇవన్నీ వింటూ మనసు మారాక ప్రసేనజిత్తు ఓ పథకం ఆలోచించాడు.

ఈ పథకం ప్రకారం బంధులుడు, అతని ముప్ఫై ఇద్దరు పిల్లలూ రహస్యంగా వెళ్ళి ఫలానా రాజ్యం సరిహద్దుల్లో జరగబోయే తిరుగుబాటు అణచాలి. అలా వాళ్ళు వెళ్ళినపుడు అక్కడ దాక్కున్న ప్రసేనజిత్తు సైన్యం ఈ బంధులుణ్ణీ, అతని పిల్లలనీ హతమారుస్తుస్తుంది వాళ్ళు నిద్రలో ఉండగా. అలా అతి బలవంతుడైన బంధులుణ్ణి పిల్లల్తో సహా వదిలించుకుంటే దరిద్రం వదులుతుంది ప్రసేనజిత్తుకి. బంధులిడికి ఉన్న ముఫ్ఫై ఇద్దరిలో ఏ ఒక్క కొడుకు మిగిలినా ప్రసేనజిత్తు ప్రాణానికి అపాయమే కదా?

బంధులుడు తన కొడుకులతో తిరుగుబాటు అణచడానికి బయల్దేరే సమయానికి మల్లిక భగవానుడి శిష్యులని భోజనానికి పిలిచింది. ఆవిడ బుధ్ధుడి ముఖ్యశిష్యులైన సరిపుత్ర, మౌద్గల్యానులకీ మిగతా సన్యాసులకీ విందుకు ఏర్పాటు పనుల్లో ఉండగానే బంధులుడు రాజ్యం సరిహద్దుకి చేరుకున్నాడు. ఇక్కడ ఈవిడ భోజనాలు స్వంతంగా వడ్డించే సమయానికి వార్త రానే వచ్చింది – బంధులుడితో సహా తన ముఫ్ఫై ఇద్దరు పిల్లలూ హత్య చేయబడ్డారు. వడ్డన స్వయంగా చేసే మల్లిక దగ్గిరకి వెళ్ళి ఒకావిడ చెప్పింది జరిగిన సంగతి. మల్లిక మనసులో ఒక్క క్షణం అగ్ని పర్వతం బద్దలైనట్టు అయింది. కానీ వెంఠనే తమాయించుకుని చుట్టూ పరికించి చూసింది. ఇప్పుడు తాను ఏడవడం కానీ మొహంలో ఏదైనా దుఃఖం చూపించడం కానీ చేస్తే ఈ విందు పాడవుతుంది. తన ఆహ్వానం అందుకుని అసంఖ్యాకంగా వచ్చిన ఈ బౌద్ధ భిక్షువుల నోటిమీద కొట్టడం మహాపాపం. ఏమీ ఎరగనట్టు కోడళ్ళకి ఎవరికీ చెప్పకుండా విందు కొనసాగించాక భిక్షువులకి తెల్సింది ఈ సంగతి. వారినుంచి భగవానుడికూడా చేరిందీ వార్త. విందు అయ్యాక మొత్తం కుటుంబం అంతా దాదాపు సర్వనాశనం అయినందుకు రోదనలు, ఆ తర్వాత ఎవరో బంధులుడి దగ్గిర బంధువు ప్రసేనజిత్తుని ఎప్పటికైనా ఏదోవిధంగా చంపితీరుతానని ప్రతిజ్ఞలు ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయేయి. భగవానుడు మాత్రం మల్లిక బంధులుడి, కొడుకుల మరణ వార్త విన్నాక చూపించిన స్థితప్రజ్ఞత్వానికి ఆవిడని అందరి ముందూ మెచ్చుకున్నాడు.

మల్లిక ఆ తర్వాతి రోజుల్లో భగవానుడి దగ్గిరకి వచ్చాక చెప్పింది, “బంధులుడే పోయాక ఈ మేఖలాభరణం నేను ధరించలేను. మీకు ఇచ్చేస్తాను, దాని విలువతో మరో ఆరామం కట్టించండి భిక్షువులకి.”

“వద్దు, అది నీ దగ్గిరే ఉండనీయ్. నీకు ధరించాలని లేకపోతే అలాగే మీ ఇంట్లోనే ఉంచు. దాని అవసరం ముందు తెలుస్తుంది. అది చివరిగా నా దగ్గిరకే రావొచ్చు కూడా.”

భగవానుడు అన్నది ఆరోజుకి ఏమీ అర్ధం కాకపోయినా ఆయన చెప్పాడు కనక మల్లిక తన వంటిమీదనుంచి మేఖలాభరణాన్ని తీసేసి ఇంట్లోనే ఉంచింది.

కాలం ఎవరికోసమూ ఆగదు కనక అది మహాప్రవాహంలా పరిగెడుతూనే ఉంది. భగవానుడికి ఎనభై ఏళ్ళు నిండబోతున్నాయి. కుశీనగరంలో వెళ్ళే దారిలో చుందుడి ఇంట భోజనం అయ్యాక ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలొస్తున్నాయి. ఈ వయసులో భగవానుడికి ఏమౌతుందో అనే ఆలోచన వచ్చేలోగా మరో పిడుగులాంటి వార్త. భగవానుడు మహాసమాధి చెందాడు. ఈ వార్త విన్న మల్లికకి భగవానుడు తన మేఖలాభరణం గురించి అన్నమాట గుర్తొచ్చింది. వెంటనే ఆ ఆభరణం తీసి సుగంధజలంలో కడిగి భగవానుణ్ణి ఆఖరిసారి చూడ్డానికి బయల్దేరింది.

మల్లిక తన మేఖలాభరణం భగవానుడి శరీరంమీద ఉంచాక చితికి నిప్పుపెట్టబడింది. దాదాపు ఏభైఏళ్ళు ధర్మచక్రాన్ని అవిశ్రాంతంగా తిప్పిన భగవానుడి శరీరం పంచభూతాల్లో కల్సిపోయాక మల్లిక కన్నీటితో వెనుతిరిగింది. ఆ తర్వాత అతి స్వల్ప కాలంలో మల్లిక తన కోడళ్ళతో శ్రావస్తి విడిచి తండ్రి దగ్గిరకి వెళ్ళిపోయిందని ఆనందుడు విన్నాడు. తన స్థానంలో ఎవరో ఒక గురువుని మార్గదర్శిగా చూపించమని ఆనందుడు ఎంతవేడుకున్నా, తన బదులు తాను ఎన్నుకున్నట్టే భిక్షువులందరికీ తాము కనుక్కోబోయే ధర్మాన్నే మార్గదర్శకంగా చేసుకోమని భగవానుడు దేహం చాలించాడు. క్షయం అయ్యే మానవ జీవితం కంటే అక్షయమైన ధర్మమే మంచిదని తలచాడు కాబోలు.

భగవానుడి మహాభినిష్క్రమణానంతరం ఆనందుడికి గుర్తు వచ్చింది – అప్రజాత ప్రజాతగానూ మేఖల అమేఖలగానూ కావొచ్చు – అని భగవానుడు ఒకప్పుడు బంధులుడితో అన్న మాట. భగవానుడీ మాట అన్నప్పుడు బంధుమల్లిక అప్రజాతగా మేఖలని ధరించి భగవానుడి దగ్గిరకి రావడం ఎరిగినదే. ప్రస్తుతానికి వస్తే బంధుమల్లికకి ముప్ఫై ఇద్దరు పిల్లలు పుట్టి ప్రజాతగా మారడం, ఒకప్పుడు మేఖల అనే ఆభరణం ధరించిన మల్లిక ఆ ముఫ్ఫై ఇద్దరు కొడుకులనీ పోగొట్టుకుని మేఖల అనే ఆ ఆభరణాన్ని విసర్జించి అమేఖలగా మారడం అన్నీ అక్షర సత్యాలుగా జరిగాయి. ఆనందుడు ఆశ్చర్యానందాలతో కళ్ళు మూసుకుని మనసు భగవానుడి మీద కేంద్రీకరించి ధ్యానంలోకి జారుకున్నాడు.