అంతరిక్ష అన్వేషణ ఎందుకోసం?

అంతరిక్ష అన్వేషణ, పరిశోధనల కోసం దేశాలు వేల కోట్లు ఖర్చు పెడుతుంటాయి. 2021లో మన ప్రభుత్వం అంతరిక్ష కార్యక్రమాలకై సుమారు ₹15 వేల కోట్లు ఖర్చు చేసింది. అదే సంవత్సరంలో అమెరికా సుమారు ₹4 లక్షల కోట్లు, చైనా ₹78 వేల కోట్లు, జర్మనీ ₹18 వేల కోట్లు ఖర్చు చేశాయి. అంతరిక్ష రంగం శాస్త్ర సాంకేతికత మరియు ఆవిష్కరణ రంగంలో ఒక భాగం. పూర్తి శాస్త్ర సాంకేతికత రంగాన్ని, సంబంధిత పరిశోధనా సంస్థల ఖర్చును తీసుకుంటే అది పై అంకెలకు కనీసం కొన్ని రెట్లు ఉంటుంది. ప్రభుత్వాలు సైన్స్ కోసం ఇంత ప్రజాధనాన్ని ఖర్చు పెడుతుంటే, ఈ ఖర్చు ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్న చర్చకు రావడం సహజం. మనం రెండున్నర ఏళ్ళుగా కరోనా వల్ల ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితి శాస్త్ర సాంకేతికత ఎంత ముఖ్యమో మనకు తెలియజేస్తుంది. అయితే అంత మాత్రాన ఈ చర్చ ముగిసినట్టూ కాదు. మానవాళికి కష్టం వచ్చినప్పుడే మనం సైన్స్‌ను ఆశ్రయిస్తే కుదరదు. అయితే ఏ దేశంలోనయినా, ఏ రంగంతో పోల్చినా, పరిశోధనా రంగంలోని వారికి విద్యార్హతలు ఎక్కువ, జీతభత్యాలు తక్కువ ఉంటాయన్నది గమనించాల్సిన విషయం. దశాబ్దాలుగా సాగుతున్న, సాగాల్సిన అవసరమున్న ఈ చర్చలో సైన్స్ తరఫున ఎందరో గొప్ప వాదనలను అందించారు. 1970లో ఎర్న్‌స్ట్ స్టుహ్లింగర్ (Ernst Stuhlinger) రాసిన ఈ కింది లేఖ అలాంటి వాదనల్లో ఒకటి. ఆ సమయంలో తను మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అసోసియేట్ డైరెక్టర్‌గా అంగారక గ్రహయాత్రకు సంబంధించిన మిషన్‌పై పనిచేస్తున్నాడు. ఆ పరిశోధనలను ఉద్దేశిస్తూ జాంబియా దేశంలో పనిచేస్తున్న సిస్టర్ మేరీ యుకుందా (Mary Jucunda) భూమిపైన ఎంతోమంది పిల్లలు ఆకలితో చనిపోతుంటే బిలియన్ల డాలర్లను ఇలాంటి ప్రాజెక్టులకు ఎలా ఖర్చు చేయగలుగుతున్నారని ప్రశ్నిస్తూ లేఖ రాసింది. దానికి ప్రత్యుత్తరం ఈ లేఖ.


మే 6, 1970.

ప్రియమైన సిస్టర్ మేరీ యుకుందా:

నన్ను ప్రతి రోజు చేరుతున్న ఇలాంటి అనేక ఉత్తరాలలో మీది ఒకటి. కానీ శోధనలో ఉన్న ఓ మెదడు, కరుణతో నిండిన ఓ గుండె లోతుల్లోంచి వచ్చినందున మీ లేఖ నన్ను కదిలించింది. నావల్ల వీలైనంత వరకు మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

అయితే ముందుగా అవసరంలో ఉన్న తోటివారికి సహాయం చేయాలనే ఉత్తమమైన లక్ష్యానికి జీవితాలను అంకితమిస్తున్న మీకు, మీతో పనిచేస్తున్న ధీర సోదరీమణులకు నా ప్రశంసలను తెలియజేస్తున్నాను.

ఈ భూమిపై ఎందరో పిల్లలు ఆకలితో చనిపోతుంటే అంగారక గ్రహ యాత్ర కోసం బిలియన్ల డాలర్ల ఖర్చును నేను ఎలా సూచించగలుగుతున్నానని మీ లేఖలో అడిగారు. అయ్యో! ఆకలితో చనిపోతున్న పిల్లలున్నారని నాకు తెలీదు, ఇప్పటినుంచి మానవాళి ఈ సమస్యను పరిష్కరించే వరకు నేను అన్ని అంతరిక్ష పరిశోధనల నుంచి విరమించుకుంటాను వంటి సమాధానాలు మీరు ఆశించరని నాకు తెలుసు. వాస్తవానికి అంగారక గ్రహానికి ప్రయాణం సాంకేతికంగా సాధ్యమవుతుందన్న విషయం తెలియకముందే కరువుతో కటకటలాడుతున్న పిల్లల గురించి నాకు తెలుసు. అయినా చంద్రుడికి, క్రమంగా అంగారకుడికి, ఆపై ఇతర గ్రహాలకు ప్రయాణం, మనం వెంటనే చేపట్టాల్సిన సాహసం అని నేను, నా స్నేహితులు బలంగా విశ్వసిస్తున్నాము. అలాగే మనం భూమిపై ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన సమస్యల పరిష్కారానికి సంవత్సరాలుగా వాదించి, చర్చించుకుంటున్నా, ఫలితాలు ఇవ్వడంలో మందకొడి ప్రదర్శించే అనేక ప్రాజెక్టుల కంటే, దీర్ఘకాలంలో, ఈ (అంతరిక్ష) ప్రాజెక్టు ఎక్కువ దోహదపడుతుందని కూడా మా విశ్వాసం.

భూమిపై మన సమస్యల పరిష్కారానికి అంతరిక్ష కార్యక్రమం ఎలా దోహదపడుతుందో వివరించడానికి పూనుకునే ముందు, జరిగిందని చెప్పుకునే ఓ కథ చెప్తాను. ఈ కథ నా వాదనకు ఉపయోగపడవచ్చు. సుమారు 400 సంవత్సరాల క్రితం జర్మనీలోని ఒక చిన్న పట్టణంలో ఒక అధికారి ఉండేవాడు. అతను చాలా దయగలవాడు. ఆ కాలంలో పేదరికం విస్తారంగా ఉండేది, తరుచుగా ప్లేగు వంటి అంటువ్యాధులు దేశాన్ని కబళిస్తుండేవి. ఆ అధికారి తన ఆదాయంలో చాలా మొత్తాన్ని ఆ పట్టణంలోని పేదలకు ఇచ్చేవాడు. దీంతో ప్రజలు అతన్ని ఎంతగానో అభిమానించేవారు. ఒక రోజు ఆ అధికారి ఒక వింత వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తి పగటి పూట పనికి వెళ్ళేవాడు, సాయంత్రం పూట కొన్ని గంటలపాటు తన ఇంట్లో ఏర్పరుచుకున్న ప్రయోగశాలలో ఒక పనిబల్ల మీద గడిపేవాడు. గాజు ముక్కలను రుబ్బి వాటినుండి కటకాలను తయారు చేసేవాడు. కటకాలను గొట్టాల్లో అమర్చి, ఆ పరికరాలతో చాలా చిన్న వస్తువులను చూస్తూ ఉండేవాడు. ఆ పరికరాల బలమైన మాగ్నిఫికేషన్‌తో మునుపెన్నడూ చూడని సూక్ష్మమైన జీవులను అధికారి చూడగలిగాడు. వాటి పట్ల ఆకర్షితుడయ్యాడు. ప్రయోగశాలను కోటలోకి మార్చమని, తన ఇంట్లో సభ్యుడిగా ఉండమని కోరాడు. తన ప్రత్యేక ఉద్యోగిగా ఆ పరికరాల అభివృద్ధికి, పరిపూర్ణతకు పూర్తి సమయాన్ని వెచ్చించమని ఆ వ్యక్తిని అధికారి ఆహ్వానించాడు.

అయితే అధికారి తన డబ్బును వృథా చేస్తున్నాడని పట్టణవాసులు ఆగ్రహించారు, వాళ్ళు దాన్ని ప్రయోజనం లేని తమాషాగా చూశారు. “మేము ఈ ప్లేగుతో బాధపడుతుంటే, ఆ వ్యక్తి పనికిమాలిన అభిరుచి కోసం డబ్బులు చెల్లిస్తున్నావు” అని అన్నారు. కానీ అధికారి తన పట్టు విడువలేదు. వారికి ఇలా జవాబిచ్చాడు “నేను ఇవ్వగలిగినంత మీకు ఇస్తాను, అలాగే ఈ వ్యక్తికి సహకరిస్తాను. ఎందుకంటే అతని పని నుంచి ఏదోరోజు ఏదో ఒకటి వస్తుందని నాకు తెలుసు!”

నిజంగా ఆ పని నుండి, అలాగే ఇతర ప్రదేశాలలో ఇతరులు చేసిన అలాంటి పరిశోధనల నుంచి చాలా మంచి వస్తువు బయటకు వచ్చింది: అదే సూక్ష్మదర్శిని. వైద్యరంగ పురోగతికి మరే యితర ఆవిష్కరణ తోడ్పడనంతగా సూక్ష్మదర్శిని తోడ్పడిందని అందరికీ తెలిసిందే. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ప్లేగు, ఇంకా అనేక ఇతర అంటువ్యాధుల నిర్మూలన సూక్ష్మదర్శిని వల్లనే సాధ్యమయింది.

ప్లేగు బాధిత ప్రజలకు తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి దోహదపడిన దానికంటే, తన డబ్బులో కొంత భాగాన్ని పరిశోధనలు, ఆవిష్కరణల కోసం ఆపి పెట్టడం ద్వారా ఆ అధికారి మానవ జాతి ఉపశమనానికి ఎక్కువ దోహదపడ్డాడు.

నేడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా రకాలుగా అలాంటిదే. అమెరికా అధ్యక్షుడి(రాలి) వార్షిక బడ్జెట్ దాదాపు 200 బిలియన్ డాలర్లు. ఈ డబ్బు ఆరోగ్యం, విద్య, సంక్షేమం, పట్టణ పునరుద్ధరణ, రహదారులు, రవాణా, విదేశీ సహాయం, రక్షణ, పరిరక్షణ, సైన్స్, వ్యవసాయం, ఇంకా దేశం లోపలా బయటా అనేక సంస్థాపనలకు వెళ్తుంది. జాతీయ బడ్జెట్లో ఈ ఏడాది దాదాపు 1.6% అంతరిక్ష పరిశోధనకు కేటాయించారు. అంతరిక్ష కార్యక్రమంలో ప్రాజెక్ట్ అపోలోతో పాటు అంతరిక్ష భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, అంతరిక్ష జీవశాస్త్రం, గ్రహాల పరిశోధన, భూవనరుల ప్రాజెక్టు, అంతరిక్ష ఇంజనీరింగ్ వంటి చాలా చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. అంతరిక్ష కార్యక్రమం కోసం ఈ వ్యయం సమకూరడానికి పదివేల డాలర్ల ఆదాయం గల సగటు అమెరికన్ పన్ను చెల్లింపుదారుడు దాదాపు 30 డాలర్లు చెల్లిస్తున్నాడు. తక్కిన ఆదాయం 9970 డాలర్లు అతని జీవనాధారానికి, వినోదానికి, పొదుపుకి, అతని ఇతర ఖర్చులకు మిగులుతుంది.

మీరు ఇలా అడగొచ్చు: “సగటు అమెరికన్ చెల్లిస్తున్న 30 డాలర్ల నుంచి 5, 3 లేదా 1 డాలర్‌ను మీరు తీసి, ఆ డబ్బును ఆకలితో ఉన్న పిల్లలకు ఎందుకు పంపకూడదు?” ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నేను క్లుప్తంగా వివరించాలి. ఇతర దేశాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంటుంది. ప్రభుత్వంలో అనేక విభాగాలు (అంతర్గత, న్యాయ, ఆరోగ్య, విద్య మరియు సంక్షేమ, రవాణా, రక్షణ, ఇతరాలు), బ్యూరోలు (నేషనల్ సైన్స్ ఫౌండేషన్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ – నాసా, మరియు ఇతరాలు) ఉంటాయి. వారందరూ వారికి అప్పగించిన లక్ష్యాల ప్రకారం వారి వార్షిక బడ్జెట్లను సిద్ధం చేయాలి. తర్వాత కాంగ్రెస్ కమిటీల అత్యంత తీవ్రమైన పరిశీలనను, బడ్జెట్ బ్యూరో మరియు అధ్యక్షులు చేసే తీవ్రమైన ఒత్తిడిని ఎదురించి ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్‌ను సమర్థించుకోవాలి. చివరకు కాంగ్రెస్ నిధులను కేటాయించినప్పుడు వాటిని బడ్జెట్‌లో పేర్కొన్న, ఆమోదించబడిన అంశాలకు మాత్రమే వాళ్ళు ఖర్చు చేయొచ్చు.

నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) యొక్క బడ్జెట్, సహజంగానే కేవలం అంతరిక్షానికి, అంతరిక్షయాత్రకు సంబంధించిన అంశాలను కలిగి ఉంటుంది. ఈ బడ్జెట్‌ను కాంగ్రెస్ ఆమోదించకపోతే, దాని కోసం ప్రతిపాదించిన నిధులు వేరే వాటికి అందుబాటులో ఉండవు. ఇతర విభాగాలలో ఎవరోకరు నిర్దిష్ట పెంపుకు ఆమోదం పొందితే తప్ప ఆ డబ్బును పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేయరు. అలా ఆమోదం పొందితే అంతరిక్షం కోసం ఖర్చు చేయని నిధులను ఆ విభాగానికి తరలిస్తారు. ఈ వివరణ నుండి మీరు ఇప్పటికే ఓ విషయాన్ని గ్రహించి ఉంటారు. ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు సహాయం అందించాలన్నా, లేదా అమెరికా ఇప్పటికే విదేశీ సహాయం రూపంలో అందిస్తున్న నిధులను అదనంగా పెంచాలన్నా, ఆ ప్రయోజనం కోసం తగిన విభాగం బడ్జెట్ సమర్పించాలి. ఆ బడ్జెట్‌ను కాంగ్రెస్ ఆమోదించాలి.

ప్రభుత్వం అలాంటి చర్య తీసుకుంటే నేను వ్యక్తిగతంగా సమర్థిస్తానా అని మీరు అడగొచ్చు. కచ్చితంగా సమర్థిస్తాను. నిజానికి ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు, వాళ్ళు ఎక్కడి వారైనా సరే, తిండి పెట్టడానికి నా వార్షిక పన్నులను ఎన్ని డాలర్లు పెంచినా నేను అస్సలు పట్టించుకోను.

నేనే కాదు నా స్నేహితులందరూ నాతో ఏకీభవిస్తారు. అయితే మేము కేవలం అంగారక గ్రహ యాత్రల రూపకల్పనను మానేయడం ద్వారా అలాంటి ఒక కార్యక్రమానికి జీవం పోయలేము. దానికి భిన్నంగా, అంతరిక్ష కార్యక్రమంలో పని చేయడం ద్వారానే భూమిపై పేదరికం, ఆకలి వంటి తీవ్రమైన సమస్యల ఉపశమనానికి, తుది పరిష్కారానికి మేము కొంత తోడ్పడగలనని నా నమ్మకం. ఆకలి సమస్యకు మూలమైనవి రెండు విషయాలున్నాయి: ఒకటి ఆహార ఉత్పత్తి, మరోటి ఆహార పంపిణీ. వ్యవసాయం, పశువుల పెంపకం, సముద్రంలో చేపలు పట్టడం , ఇతర భారీ స్థాయి కార్యకలాపాల ద్వారా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఆహార ఉత్పత్తి సమర్థవంతంగా జరుగుతుంది. అయితే అనేక ఇతర ప్రాంతాలలో తీవ్రమైన కొరత ఉంది. నీటిపారుదల నియంత్రణ, ఎరువుల వినియోగం, వాతావరణ అంచనా, భూసారం అంచనా, తోటల నిర్వాహణ, పొలం ఎంపిక, నాటు విధానాలు, సాగు సమయం ఆంచనా, పంటల సర్వే, ప్రణాళిక ఇలా అన్ని అంశాల్లో సమర్థవంతమైన పద్ధతులను వినియోగిస్తే పెద్ద భూములను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు.

ఈ పనులన్నింటిని మెరుగుపరచడానికి ఉత్తమ సాధనం, కృత్రిమ భూ-ఉపగ్రహం. ఇది ఎంతో ఎత్తున భూమి చుట్టూ తిరుగుతూ అతి తక్కువ సమయంలోనే విశాలమైన భూభాగాలను పరీక్షించగలదు. పంటలు, నేల, కరవు, వర్షపాతం, మంచు ఆవరణ మొదలైన వాటి స్థితిగతులను సూచించే అనేక రకాల అంశాలను గమనించి కొలవగలదు. అలాగే సముచిత వినియోగం కోసం ఈ సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్లకు పంపగలదు. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలకు అనుబంధంగా కేవలం భూవనరుల సమాచారం, సెన్సార్లు కలిగిన మామూలు ఉపగ్రహాలు పని చేస్తే, పంటల వార్షిక విలువ అనేక బిలియన్ల డాలర్లు పెరుగుతుంది.

లేనివారికి ఆహార పంపిణీ అనేది పూర్తిగా వేరే సమస్య. ఇక్కడ ప్రశ్న షిప్పింగ్ పరిమాణాలకు సంబంధించింది కాదు, అంతర్జాతీయ సహకారానికి సంబంధించింది. ఒక చిన్న దేశపు పాలకుడు ఒక పెద్ద దేశం నుంచి ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని దిగుమతి చేసుకునే అవకాశం గురించి సందిగ్ధపడవచ్చు. ఎందుకంటే ఆహారంతోపాటు విదేశీ శక్తులు, ప్రభావాలు కూడా దిగుమతి అవ్వచ్చునని అతను భయపడతాడు. దేశాల మధ్య సరిహద్దులు ఈనాడు కలుగజేస్తున్న వేర్పాటు తగ్గితే తప్ప ఆకలి నుండి సమర్థవంతమైన ఉపశమనం లభించదు. అంతరిక్షయానం రాత్రికి రాత్రే ఈ అద్భుతాన్ని సృష్టిస్తుందని నేననుకోను. అయితే కచ్చితంగా ఈ దిశలో పనిచేస్తున్న అత్యంత ఆశాజనకమైన, శక్తివంతమైన కారకాలలో అంతరిక్ష కార్యక్రమం ఒకటి.

ఈ మధ్య జరిగిన అపోలో 13 దుర్ఘటననే మీకు గుర్తు చేయనివ్వండి. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మిషన్‌లో వ్యోమగాములకు కీలకమైన రీఎంట్రీ [తిరిగి ప్రవేశించే] సమయం సమీపించినప్పుడు, జోక్యం కలగకుండా అపోలో ప్రాజెక్టు ఉపయోగించే ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో అన్ని రష్యన్ రేడియో ప్రసారాలను సోవియట్ యూనియన్ నిలిపివేసింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే రక్షించడానికి పసిఫిక్. అట్లాంటిక్ మహా సముద్రాలలో రష్యన్ నౌకలు నిలిచాయి. మన వ్యోమగాముల క్యాప్సూల్ రష్యా భూభాగం దగ్గర పడినట్లయితే వాళ్ళు నిస్సందేహంగా రష్యన్ వ్యోమగాములే తిరిగి వచ్చినట్టుగా శ్రద్ధ పెట్టి, కృషి చేసి రక్షించేవారు. రష్యన్ వ్యోమగాములకు ఎప్పుడైనా ఇలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైతే అమెరికన్లు కూడా అదే చేస్తారు.

కక్ష్యలోంచి సర్వేలు చేసి అంచనాల ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచడం, మేలైన అంతర్జాతీయ సంబంధాల ద్వారా ఆహార పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడం: ఇవి అంతరిక్ష కార్యక్రమం భూమిపై జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి కేవలం రెండు ఉదాహరణలు. నేను ఇంకో రెండు ఉదాహరణలు ఇవ్వాలనుకుంటున్నాను: సాంకేతిక అభివృద్ధి యొక్క ఉద్దీపన, శాస్త్రీయ పరిజ్ఞానం యొక్క ఉత్పత్తి.

చంద్రగ్రహానికి ప్రయాణించే వ్యోమనౌక యొక్క భాగాల కచ్చితత్వం, విశ్వసనీయత, ఇంజనీరింగ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని స్థాయిలో ఉండాలి. ఈ కఠినమైన అవసరాలకు తగిన వ్యవస్థల అభివృద్ధి కొత్త పదార్థాలు మరియు పద్ధతులను కనుగొనడానికి, మేలైన సాంకేతిక వ్యవస్థలను ఆవిష్కరించడానికి, విధానాలను రూపొందించడానికి, పరికరాల జీవితకాలాన్ని పొడిగించడానికి, కొత్త ప్రకృతి నియమాలను కనుగొనడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందించింది.

అంతరిక్ష పరిశోధన వల్ల ఇలా కొత్తగా పొందిన పరిజ్ఞానమంతా భూమి మీద వినియోగించుకోవడానికి కూడా కుదురుతుంది. ప్రతి సంవత్సరం అంతరిక్ష కార్యక్రమం నుంచి సుమారు వెయ్యి సాంకేతిక ఆవిష్కరణలు భూమి మీది [రోజువారీ] సాంకేతికతలోకి ప్రవేశిస్తున్నాయి. మెరుగైన వంటగది ఉపకరణాలు, వ్యవసాయ పరికరాలు, మెరుగైన కుట్టు యంత్రాలు, రేడియోలు, నౌకలు, విమానాలు, మెరుగైన వాతావరణ అంచనా, తుఫాను హెచ్చరిక వ్యవస్థ, మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థ, వైద్య పరికరాలు, మెరుగైన రోజువారీ సాధనాలు ఇలా అనేక రంగాలను ఈ ఆవిష్కరణలు ప్రభావితం చేస్తున్నాయి. అయితే గుండె జబ్బులున్న వారి కోసం రిమోట్ రీడింగ్ సెన్సార్ వ్యవస్థను రూపొందించకుండా ముందు చంద్రగ్రహానికి ప్రయాణించే వ్యోమగాములకు లైఫ్ సపోర్ట్ వ్యవస్థను ఎందుకు అభివృద్ధి చేయాలి అని మీరు అడగొచ్చు. దీనికి సమాధానం ఇవ్వటం చాలా సులభం: తరచుగా సాంకేతిక సమస్యల పరిష్కారాలలో గణనీయమైన పురోగతి ప్రత్యక్ష విధానం ద్వారా రాదు. ముందుగా ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, అది కొత్త పనులకు బలమైన ప్రేరణను అందిస్తుంది. అది ఊహాశక్తిని రేకెత్తించి మనుషులను కష్టపడడానికి పురిగొల్పుతుంది. అలాగే ఇతర ప్రతిచర్యల సమాహారాలను కలుపుకొని ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

అంతరిక్షయానం నిస్సందేహంగా ఈ పాత్ర పోషిస్తుంది. అంగారక గ్రహయాత్ర కచ్చితంగా ఆకలితో ఉన్నవారికి తిండి పెట్టదు. అయితే ఇది ఎన్నో నూతన సాంకేతికతల, సామర్ధ్యాల ఆవిష్కరణకు దారితీస్తుంది. ఈ ప్రాజెక్టు నుంచి పుట్టే ఉపఫలితాల విలువే దాని అమలు ఖర్చు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ!

కొత్త సాంకేతికతల ఆవశ్యకతతో పాటు, భూమిపై మానవ జీవన పరిస్థితులను మెరుగుపర్చాలనుకుంటే కొత్త పరిజ్ఞానం యొక్క అవసరం ఎంతో ఉంది. ఆకలి, వ్యాధులు, కలుషితమైన నీరు మరియు ఆహారం, పర్యావరణ కాలుష్యం ఇలా మనిషి మనుగడకు ముప్పు తెచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం మరియు శరీరధర్మశాస్త్రం, ముఖ్యంగా వైద్యశాస్త్రంలో మనం మరింత జ్ఞానాన్ని సంపాదించాలి.

నేడు మనకు విజ్ఞానశాస్త్రాన్ని వృత్తిగా ఎంచుకునే యువతీయువకుల అవసరం ఉంది. అలాగే ఉత్పాదకమైన పరిశోధనలు చేయాలన్న సంకల్పం, ప్రతిభ ఉన్న శాస్త్రవేత్తలకు మరింత మద్దతు కావాలి. కష్టతరమైన పరిశోధనా లక్ష్యాలు అందుబాటులో ఉండాలి, అలాగే పరిశోధనలకు తగిన మద్దతు అందించాలి. గ్రహాలు, ఉపగ్రహాలు, భౌతిక, ఖగోళ శాస్త్రాలు, జీవ, వైద్య శాస్త్రాలలో అద్భుతమైన అధ్యయనాలను, వాటిలో నిమగ్నం అవ్వడానికి గొప్ప అవకాశాలను అందిస్తున్న అంతరిక్ష కార్యక్రమం ఒక ఆదర్శవంతమైన ఉత్ప్రేరకం. శాస్త్రీయ కార్యాలకు ప్రేరణ, ఉత్తేజకరమైన ప్రకృతి దృగ్విషయాలను గమనించే అవకాశం, పరిశోధనలు నిర్వహించడానికి వనరుల మద్దతు, ఈ మూడింటి మధ్య అంతరిక్ష కార్యక్రమం ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది.

అమెరికా ప్రభుత్వంచే నిర్దేశించబడి, నియంత్రించబడి, నిధులు సమకూర్చబడే కార్యకలాపాలలో అంతరిక్ష కార్యక్రమానికి మొత్తం జాతీయ బడ్జెట్లో 1.6 శాతం, స్థూల జాతీయ ఉత్పత్తిలో ఒక శాతంలో మూడోవంతు (అంతకంటే తక్కువ) మాత్రమే ఖర్చు అవుతుంది. అయినా పైకి ఎక్కువగా కనిపించి, ఎక్కువగా చర్చించబడుతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి, ప్రాథమిక శాస్త్రాలలో పరిశోధనకు, వీటి ఉద్దీపనకు, అంతరిక్ష కార్యక్రమానికి సమానమైనది ఇంకోటి లేదు. ఈ విషయంలో మూడు, నాలుగు వేల సంవత్సరాలుగా, దురదృష్టవశాత్తు, యుద్ధాలు విశేషాధికారాన్ని ప్రదర్శించాయి. ఇప్పుడు ఈ పనిని అంతరిక్ష కార్యక్రమం తీసుకుంటుందని అనుకోవచ్చు.

బాంబులు విసిరే యుద్ధ విమానాలు, రాకెట్లతో పోటీ పడే బదులు, దేశాలు చంద్రగ్రహానికి ప్రయాణించే అంతరిక్షనౌకలతో పోటీ పడితే ఎంత మానవ వేదన తప్పుతుంది కదా! ఈ పోటీ ఘనమైన విజయాలను మాత్రమే వాగ్దానం చేస్తుంది. ఇందులో పగను, యుద్ధాలను ఉసిగొల్పే చేదు అపజయాలకు తావు లేదు.

అంతరిక్ష కార్యక్రమం మనను భూమి నుంచి దూరంగా చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల వైపు నడిపిస్తున్నట్లు అనిపించినా, ఈ ఖగోళ వస్తువులు ఏవీ అంతరిక్ష శాస్త్రవేత్తల దృష్టిని, అధ్యయనాన్ని మనభూమి చూరగొన్నంతగా చూరగొనలేవని నా విశ్వాసం. సాంకేతికతను, శాస్త్రీయ జ్ఞానాన్ని మన జీవన విధానాన్ని మెరుగుపర్చుకోటానికి ఉపయోగించుకోవాలి. అలాగే మనం భూమిని, జీవితాన్ని, మనిషిని మనస్పూర్థిగా ప్రశంసించడం అలవాటు చేసుకుంటున్నాము. వీటివల్ల మన భూమి మరింత మేలైన ప్రదేశంగా మారుతుంది.

నేను ఈ లేఖకు జతచేసిన ఛాయాచిత్రం 1968 క్రిస్మస్ సందర్భంగా చంద్రుని చుట్టూ తిరుగుతున్నప్పుడు అపోలో-8 నుండి తీసింది. ఇప్పటివరకు అంతరిక్ష కార్యక్రమం నుంచి వచ్చిన ఎన్నో అద్భుతమైన ఫలితాలలో ఈ చిత్రం చాలా ముఖ్యమైనది అనుకోవచ్చు. మన భూమి, అపరిమితంగా ఆవరించి ఉన్న శూన్యంలో ఒక అందమైన ఎంతో విలువైన ద్వీపమని, స్పష్టమైన శూన్యపుటంచులు గల మన గ్రహం యొక్క సన్నని ఉపరితలపు పొర మీద తప్ప మనకు నివసించడానికి మరో చోటు లేదని, ఈ ఛాయాచిత్రం మన కళ్ళు తెరిపించింది. మన భూమి నిజంగా ఎంత పరిమితమైందో, దాని పర్యావరణ సమతుల్యత దెబ్బ తీయడం ఎంత ప్రమాదకరమో, మునుపెన్నడూ జరగని విధంగా ఒకేసారి చాలామంది ప్రజలు గుర్తించారు. నేడు మనిషి ఎదుర్కొంటున్న కాలుష్యం, ఆకలి, పేదరికం, పట్టణ జీవనం, ఆహార ఉత్పత్తి, నీటి నియంత్రణ, అధిక జనాభా వంటి తీవ్రమైన సమస్యల గురించి హెచ్చరించే గొంతులు ఈ చిత్రం ప్రచురించినప్పటి నుంచి బిగ్గరయ్యాయి. నేటి యువ అంతరిక్ష యుగం మన గ్రహం యొక్క స్వరూపాన్ని మనకు కళ్ళకుగట్టిన ఈ సమయంలోనే మన కోసం ఎదురుచూస్తున్న మహత్తర కార్యాలను మనం గమనించడం ప్రమాదవశాత్తు జరిగింది కాదు.

అంతరిక్ష యుగం మనల్ని మనం చూసుకోవడానికి అద్దం పట్టడమే కాకుండా అదృష్టవశాత్తు సాంకేతికతను, సవాళ్ళను, ప్రేరణను, అలాగే విశ్వాసంతో ఈ పనులపై విజృంభించడానికి ఆశావాదాన్ని కూడా అందిస్తుంది. ఆల్బర్ట్ ష్వైట్జర్ (Albert Schweitzer) ‘నేను భవిష్యత్తు వైపు ఆందోళనతో, అయినా ఆశగా చూస్తున్నాను’ అని పలికినప్పుడు ఆయన మనసులో ఏం ఉండిందో దాన్ని మనం అంతరిక్ష కార్యక్రమం నుంచి నేర్చుకుంటున్న విషయాలు పూర్తిగా సమర్థిస్తున్నాయని నా నమ్మకం.

నా శుభాకాంక్షలు మీతో, మీ పిల్లలతో ఎల్లప్పుడూ ఉంటాయి.

మీ భవదీయుడు,

ఎర్న్‌స్ట్ స్టుహ్లింగర్,
అసోసియేట్ డైరెక్టర్ ఫర్ సైన్స్