పచ్చబొట్టు

“ఎవరో అంబానీరాజుగారట వాళ్ళబ్బాయి మ్యారేజ్ పార్టీ ఇస్తున్నారట. ఇన్విటేషన్ ఉన్నవాళ్ళకే సర్వీస్ అంటున్నారు.” చెప్పాడు శివ.

“అంబానీరాజా! అదేం పేర్రాబాబూ… అంబాలా రాజయ్యుంటాడు.” సరిదిద్దాడు శేఖర్.

“అంబానిరాజూ కాదు, అంబాలారాజూ కాదు, ఆయన అంబారీ రాజు. ఇవాళ సెప్టెంబర్ ఒకటికదా! మరిచేపోయాను. నడండి,” అంటూ బార్‌లో కార్నర్ టేబుల్ దగ్గరకి నడిచాడు చిరంజీవి. ఫోన్ ట్రై చేస్తున్న అతన్నే ఆశ్చర్యంగా చూస్తూ కుర్చీల్లో సెటిల్ అయ్యారు మిత్రులు.

“అంబారీరాజుగారు మీ రిలేషనా? ఫ్రెండా? అయినా అదేం పేరండీ?” గొణిగాడు ప్రసాద్, తమవైపు వస్తున్న స్టివార్డ్ వైపు అనుమానంగా చూస్తూ.

“ఆయన అసలు పేరు మంతెన వెంకట్రామరాజు. చిన్నప్పుడు అంతా మంతెనోరి రామం అనేవారు. తర్వాత్తర్వాత ఆయన చేసే వ్యాపారాలని బట్టి అంబానీ రాజు, ట్వంటీ కౌంట్ రాజు, జామాయిల్ రాజు అంటూ ఇలా ఊరికో రాజైపోయారు.”

“అంబారీ రాజన్నావు ఇందాకా. ఇంతకీ అంబారీయా? అంబానీయా?” సందేహం వెలిబుచ్చాడు శేఖర్.


“ఏట్రా సత్తిగా ఏటడావిడి? ఎప్పుడూ నత్తకి మేనత్తలా నడిచీవోడివి. ఏంటియ్యాలా పంచెగ్గొట్టుకో… తెగ లగెత్తేత్తన్నావు.” స్పీడ్ బ్రేకర్‌లా అడ్దుపడ్డాడు వెంకటేశ్వర్లు.

“మంతెనోర్రాంబారు… కొత్త పేంటట్టుకొచ్చేరంట చూద్దారని. రాంబారది తొడిగేసుకున్నారనుకో… ఇప్పి చూబెట్టమంటే బాగోదు కదా! ఊరు మొత్తం ఆరింటికాడే వుంది.” రొప్పుతూ చెప్పాడు సత్తిగాడు.

“నాకేలంజికొడుకూ చెప్పలేదేటి? ఇలాటి సిత్తరబిత్తరాలన్నీ ఆయనే తెత్తాడేట్రా ఊల్లోకి… నడెలదారి.” కూడా తయారయ్యాడు వెంకటేశ్వర్లు.

“నెత్తిగోతలనాకొడకా… దాన్ని చిత్తరబిత్తరవనకూడదు… పేసననాల.”

తోటలో చిలక్కొట్టులేరుకుంటున్న చిరంజీవి చెవిలో ఇదంతా పడి, వాడూ వాళ్ళెనకాల పరుగందుకున్నాడు.

“ఏటి? జులపాలలా పెంచేత్తనావు మొక్కా?”

“మొక్కా! నాబొక్కా? విప్పీ.”

“ఏటి హిప్పీయ్యా?”

“హిప్పీ కాదహే నియ్యెంకమ్మా, విప్పీ. విప్పీ. ఇదీ… ఆయనట్టుకొచ్చిన సిత్తరవే కదా! గొరిగించేద్దారంటే మా యావిడొప్పుకుంటలేదు. ఇంకో బెత్తుడెదిగితే సవరం కట్టించుకోటానికి బావుంటది వుంచమంటోంది. దీని తల్లీ మోడు, పేలు దొబ్బేత్తుంటే బరుక్కోలేక చత్తనాను.” గోడు వెళ్ళబోసుకున్నాడు వెంకటేశ్వర్లు.

“రాంబారెంతైనా వుండాల్సిన కుర్రోడహే. రాజుల గోరోజనం అసల్లేదు, ఎవరేం చెప్పినా ఇంటాడు.”

“మరే… ఆయనా, ఆ ఆంబోతుగాడూ అలా నడిచెళుతుంటే అచ్చం ఏనుగంబారీని చూసినట్టుంటది, కదొరే…”


మంతెనోరి రామం పెరట్లో పళ్ళుతోముకుంటుంటే, ఆంబోతుగాడు చెంబుతో నీళ్ళు పట్టుకుని నిలబడున్నాడు. వీధిలో బల్లమీద ప్రదర్శనకి పెట్టిన పొడుగుపంట్లాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి చూస్తున్నారు జనమంతా.

“ఏంటిందులో పెసలు?” చూస్తున్న కన్నారావుగాడికి డౌటొచ్చింది.

“మినువులురా! సున్నుండలు చేసుకొందూగాని, కళ్ళు కానీ పోయినియ్యా? ఆనట లేదేట్రా ఇదిగో జానెడు జుప్పు.” కయ్యిమన్నాడు తొగరోడు.

జనం అంతా ఎగబడి ఎగబడి అలా రాంబారి ‘జిప్’ పంట్లాన్నిచూసి తెగ విడ్డూరపడుతుంటే, మంతెనోరి తాతయ్య, కొడుకుకి వస్తున్న గుర్తింపుకి మురిసిపోతూ, బుగ్గమీసాలని మెలేసుకుంటూ అప్పుడే చేతికందిన నిన్నటి పేపర్‌ని చదువుతున్నట్టు నటిస్తూ… వింటున్నారు.

ఊళ్ళో పంట్లాలు తొడుక్కునేవాళ్ళు పది పన్నెండు మందిదాకా వున్నారు. ప్యాంట్లకి బొత్తాలే కానీ ఇలా జిప్పులుంటాయని వాళ్ళకి తెలీదు.

“ఎంతయ్యిందంట్రా? ఆంబోతూ,” అడిగాడు వెంకటేశ్వర్లు. రాంబారి ‘జిప్పేంట్’ యోగక్షేమాలు పరిశీలించటానికి వీధిలోకి వచ్చిన ఆంబోతుని.

“జుప్పుకే పాతికయ్యిందంట. మాపెయ్యకొండెరేయ్. ఇంకా పసుబ్బొట్లు కూడా ఎట్టలేదు.” జాగ్రత్తలు చెప్పి మళ్ళీ పెరట్లోకి పోయాడు ఆంబోతు.

“అయ్యబాబు పాతికి రూపాయిలే! ఐదు పేంట్ల కుట్టుకూలి వొకజుప్పుకే!” గుండెలు బాదుకున్నాడు సత్తిగాడు.

“దొబ్బటానికి, దమ్మిడీ… బేడకి కుట్టేత్తారేంటిలాటి పంట్లాలు.” అన్నాడు జిప్పుని పరిశీలిస్తున్న కాజాగాడు.

పులగుర్త టైలర్ దగ్గర కాజాలు, బొత్తాలు కుట్టడం నేర్చుకుంటున్న వాడిప్పుడిప్పుడే పిర్రమీద చిరిగిపోయిన లాగూలకి మాసికలెయ్యడం మొదలెట్టాడు.

“ఇదే నువ్వైతే ఎంతక్కుడతావురా?” అడిగాడు నందేవోడు.

“యాబైకి తగ్గను. ఇది చూడండి ఈ జుప్పు. కిత్తా కింద దాకానే జారతంది. ఇదిలా కుట్టకూడదహేయ్. లాగితే కిందనుంచి ఎనకాల నడుందాకా జర్రున జారిపోవాలి. అప్పుడు ఒకటికెళ్ళినా, రెండుకెళ్ళినా గొడవుండదు. పేంటిప్పకుండానే లటుక్కున కూచ్చోవచ్చు.” ఇంజనీర్‌లా చెప్పాడు కాజాగాడు.

అక్కడున్న అంతా వాడి వైపు ఆరాధనగా చూసేరు.

“ఇరవైకి కుడతానంటే… చెప్పొరేయ్, సంకురేత్రికి కుట్టించుకుంటాను.” బేరమాడేడు వెంకటేశ్వర్లు.

“ఈడూ… ఈడి ఎదవబేరం. యాభైకి మూడు కుట్టీలా వుంటే చొప్పొరే కాజా, సంకురేత్తిరి దాకా ఎందుకు దీపాలమాసకే కుట్టించేసుకుంటాను.” బేరం తెగ్గొట్టేసేడు తొగరోడు.

“ఈడూ… ఈడి తొక్కలో మిసను. పాత గుడ్డలకి పేచ్చీలెయ్యడం తప్ప, కొత్త గుడ్డలు కుట్టడం ఏం వచ్చీడికి!” సాంకేతికత మీద సందేహం వెలిబుచ్చాడు నందేవోడు.

“మాటలు తిన్నంగా రానియ్యొరేయ్. లేపోతే మూతి పల్లు రాలిపోగలవు. ఎవడార్టాడిది.” కస్సుమన్నాడు కాజా.

“ఏంట్రా ఎగిరెగిరి పడ్తనావు. నువ్వు కుట్టిన కాజాలోకి బొత్తవెప్పుడైనా దూరిందా? చూపించొరేయ్… పద్రూపాయలోడిపోతాను.” వంటి కాలి మీద లేచాడు నందేవోడు.

కలబడుతున్న వాళ్ళిద్దర్నీ వెంకటేశ్వర్లూ సత్తిగాడూ విడదీసేరు.

“గొడవెందుక్కానొరేయ్ కాజా… నువ్వన్న యాబై ఇచ్చేత్తాను. ఇలా ఎదర జుప్పు కాకుండా, ఇందాకా నువ్వు చొప్పేవు చూడు, అలా ఎనక దాకా జుప్పెట్టి కుట్టరా నాకో పేంటు.” అన్నాడు సత్తిగాడు.

“మీ బాబు కానీ ఇనాల. పంట్లానికి యాబై రూపాయల జుప్పు కుట్టించావని తెలిత్తే ఏరే కాపరం ఎట్టించేత్తాడు. అపుడు లాక్కోలేక పీక్కోలేక చత్తావు.” హెచ్చరించాడు వెంకటేశ్వర్లు.

“అవునొరేయ్. బొత్తాల్లో ఉన్న సుకవే సుకం రా. జుప్పు అటిటు ఆడకుండా ఆగిపోయిందనుకో. బాచేయటానికి కాజా గాడింకో ఇరవయ్యో పాతికో దొబ్బుతాడు. రాంబారికో యాభై ఎకరం గొబ్బిరితోటుంది కాబట్టి, ఆళ్ళ మాంగారు ఇంకో యాభై పల్లంకొట్టి పిల్లనిచ్చేరు. నీకూ నాకూ ఏం వుంది? తాడుంటే బొంగరవుండదు. బొంగరవుంటే తాడుండదు.” జిప్ ప్యాంట్ కుట్టించడం విరమించుకున్నాడు సత్తిగాడు.

అంతట్లోకీ పెరట్లోంచి వచ్చిన ఆంబోతు “చూసింది చాలు లెగండేసి. ఇంకా పొయ్యిలో అగ్గేసుకోలేదంట… ఆడంగులు అగులోబొగులోమంట్నారు” అని ఆ ప్యాంట్‌ని లోపలకి పట్టుకుపోయేసరికి, పెరట్లో ఆడవాళ్ళు దానిమీద పడ్డారు.


ఏటిగట్టు క్రింద, ఊరికి దూరంగా వున్న కొబ్బరితోటలో కొడుకు చెప్పిన ప్రకారం చెరువులు త్రవ్వడానికి కొలతలు వేయిస్తున్నారు మంతెనోరి తాతయ్య. అడ్డొచ్చే కొబ్బరిచెట్లని నరికేస్తున్నారు మడేళ్ళు. తోటలో ఏం చేస్తున్నారో ఎవరికీ కనబడకుండా పెద్ద పెద్ద కర్రలుపాతి బరకాలు కుట్టేసేరు.

“అలకబాబుకీ విమానం వుండీది. టాటా బాబుకీ విమానం వుండీది. టాటా విమానం అద్దెకిచ్చి లక్షలు సంపాదిస్తే… అలక షికార్లు చేసి విమానమే పోగొట్టాడు. కూర్చుని తింటే… కొండలే పిండయిపోతాయి.”

“…”

“కొబ్బరిచెట్టు కొడుకుతో సమానం. బంగారంలాంటి తోటలో ఈ గోతులూ గుంతలూ ఏంటి బావా! అల్లుడు చెప్పడమూ సరిపోయింది. మీరు గంగిరెద్దులా తలూపడమూ సరిపోయింది.”

“…”

“లేనిపోని విడ్డూరాలన్నీ తెచ్చి, ఊల్లో కుర్రోల్ని తగలేస్తున్నాడని జనం నానా మాటలూ అంటున్నారు. మీచెవిన పడ్డంలేదా? కొడుకని ప్రేముండొచ్చు, మరీ ఇంత పిచ్చి పనికిరాదు.”

“…”

“అల్లున్ని కాంత అదుపాజ్ఞల్లో పెట్టండి. షోకులూ షికార్లూ మానిపించి వ్యాపారమో, వ్యవసాయమో మప్పండి.” వియ్యంకుడు లక్ష్మీపతి చెబుతుంటే… మంతెనోరి తాతయ్య మెత్తగా నవ్వుతూ బుగ్గమీసం దువ్వుకుంటున్నారు.

బాటం జిప్పున్న బెల్ ప్యాంట్ తొడుక్కొని టిప్‌టాప్‌గా, బరకం వెనక నుంచి అక్కడకి వస్తున్న రామానికి, మామగారి మాటలు వినపడి తల తీసేసినట్టనిపించింది. ఏజీ బియ్యెస్సీ చదివిన తననో పైలాపచ్చీసు రకంగా జమకట్టిన ఆయనకి బుర్ర తిరిగిపోయేలా బుద్ది చెప్పాలన్న నిర్ణయానికొచ్చారు. అర్జంటుగా బిజినెస్ చెయ్యాలా? వ్యవసాయం చెయ్యాలా? రెండూ కలగాపులగంగా చేసెయ్యాలా? అని ఆలోచిస్తూ… చెట్టు చాటుకెళ్ళి, బొమ్మా బొరుసూ వేస్తే… పావలా బిళ్ళ అటూ ఇటూ పడకుండా గోడుగా నిలబడింది. దాంతో ఏదైతే అదే అయ్యింది! ముందీ మామగారి కళ్ళముందు నుంచి బయటపడాలని బలంగా నిశ్చయించారు. విసవిసా ఇంటికి వెళ్ళి, బట్టలు సర్దేసుకుని, పిల్లంక పెట్టెలోంచి అందినన్ని నోట్లకట్టలు ఆరు అరలబ్యాగులో కుక్కేసుకొని, డబడబా బుల్లెట్ సౌండ్ చేసుకుంటూ పోయారు.

‘రాముడు అడవులపాలయ్యాడు. తండ్రిని విడిచీ వెళుతున్నాడూ’ అన్న ఎంటీయార్ పాటని రేడియోలో వింటూ విచారిస్తున్న ఆంబోతుగాడు రామం వెళ్ళడం చూడలేదు. లేకపోతే బండికి అడ్డంపడి ఆపేసేవాడే.


వారంరోజుల దేశాటన తర్వాత రామం గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద తేలారు. మధ్యవర్తిద్వారా కత్తిపూడి కొండవార ఇరవై ఎకరాల గరువు కౌలుకి తీసుకొని, భజానా ఇచ్చేసేరు. అందులో అరెకరం మెరక చేయించి దిట్టంగా తాటాకు పాక నేయించి, చాపలు పరుపులు దింపించారు. వండి పెట్టడానికి అప్పడికి, అంట్లతెపాలాలు తోమడంలాంటి పనులు చెయ్యడానికి వాడిబామ్మర్ది తిప్పడికి… ఆస్థానంలో కొలవులిచ్చారు.

రాయీ రప్పాతో నిండిపోయిన గరువులో ఏం పండించాలా? అని ఆలోచిసిస్తూన్న రామం “మామిడి, జీడిమామిడితోటల్లాంటివైతే లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఈలతోట అయితే ఎలా వుంటుందంటావ్?” అనడిగారు కొలంబస్ ఇండియాని వెదకబోయి అమెరికాని కనిపెట్టినట్టు తనని వెదుక్కుంటూ వచ్చిన దాట్లోరి బుల్లిబుజ్జిని.

“నువ్వు కానీ ప్యారిస్ లో పుడితే… ఫ్రాన్స్‌కే ప్రెసిడెంటు వైపోదువు బావా. నువ్వేంటి? తొక్కలో ఈల తోటేంటి? ఏంచేసినా ఇరగ్గొట్టేయ్యాల. కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించు.”

“…”

“రేవడినేలలో జామాయిల్ బెటర్ బావా! ఒకసారి వేసొదిలేస్తే మూడు కటింగ్‌లు తియ్యొచ్చు. ఆ మజ్జన్న కోయంబత్తూరెళ్ళినప్పుడు రైలు కిటికీలోంచి చూసేను. భలేగున్నాయి యూకలిప్టస్ తోటలు. కరెన్సీ కాగితం దాన్నుంచే తీస్తారట. అవి మనతోటలో వుంటే డబ్బు చెట్లున్నట్టే.”

“అయితే లేటెందుకు? పోయి నారుపట్టుకొచ్చెయ్. ఈ లోపు నేను గోతులు తవ్వించేస్తాను.” నోట్ల కట్ట తీసి బుల్లిబుజ్జి మీదకి విసిరారు రామం.

నెల తరవాత నారొచ్చేసరికి, గరువంతా గోతులు తవ్వించేసి, మోకాలెత్తున్న ఆ మొక్కలని చకచకా పాతించేసేరు. వారం తిరిగేసరికి మొక్క నవనవలాడ్డం మొదలెట్టింది. ఆనోటా ఈనోటా రామం చేస్తున్న జామాయిల్ సాగు చుట్టుప్రక్కల ఊళ్ళతోపాటూ ఎక్కడెక్కడి చుట్టాల చెవుల్లోనో పడి, అంతా ఏపుగా ఎదుగుతున్న తోటని చూడ్డానికి ఎగబడుతూ ఎగబడుతూ వచ్చి తెగపొగిడేస్తున్నారు.

ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటీనీ పూసగ్రుచ్చినట్టు గుచ్చి, ఓపిగ్గా మంతెనోరి తాతయ్యకి ఉత్తరం వ్రాసి పడేస్తూ… ‘మాకో మొక్క ఇవ్వండి, రెండు మొక్కలివ్వండం’టూ వచ్చినవాళ్ళు అడుగుతుంటే, అణాకి కొని తెచ్చిన మొక్కని, అర్ధరూపాయకి అమ్మడం మొదలెట్టేరు బుల్లిబుజ్జి.

ఒకేడాది పండితే… ఏడేళ్ళు పండని బీడు భూములతోపాటు ఎక్కడ ఖాళీ కనబడితే అక్కడ, జనం జామాయిల్ మొక్కలు తెగనాటడం మొదలెట్టేరు. చుట్టుప్రక్కల పది పన్నెండూళ్ళ జనం మాకు నారు కావాలంటే మాకు నారు కావాలని ఎగబడుతుంటే బుల్లిబుజ్జి నెలకో లోడు దింపిస్తున్నారు.

‘మొక్కలు పూలు పూస్తాయా? కాయలు కాస్తాయా? కాయలైతే… కుంచం ఎంతపలుకుద్ది? పూలైతే మూర ఎంతకమ్ముతారూ’ లాంటి జనం ప్రశ్నలకి రామం జవాబివ్వకుండా “ముందు తోట తయారవ్వనియ్యండి. తర్వాత మీరే చూస్తారుగా,” అంటూ నవ్వి ఊరుకుంటున్నారు.

కొండ ప్రాంతంలో కొత్త సేద్యాన్ని పరిచయం చేసిన రామం ఆ చుట్టుప్రక్కల హీరో అయిపోయారు. పెద్దసైజు మిత్రబృందం తయారయ్యింది. మందులూ విందులతో మకాం కళకళ్ళాడుతోంది. నడుమెత్తు ఎదిగిన తోట తొలకరి వర్షాలకి కొత్త చిగురు వేస్తోంది. తోటలో వత్తుగా మొలిచిన గడ్డి తివాచీని తలపిస్తోంది. ఇక్కడ నీలగిరితోట పరిస్థితి ఇలా ఉంటే… అక్కడ మంతెనోరి తాతయ్య తోటలో ఒక్కో కొబ్బరి చెట్టూ కూలిపోతోంది.

‘ఏంటిరా పెదరాజుగారికి పిచ్చెక్కిందా? నిక్షేపంలాంటి తోటని నిలువునా నరికేస్తున్నారు. పచ్చని చెట్టుని నరికిన పాపం ఊరికే పోద్దా? అందుకే ఎదిగొచ్చిన కొడుకు ఊళ్ళట్టిపోయాడు.’ అంటూ అంతా చెవులు కొరుక్కోవడం మొదలెట్టేరు.


తోటమీదనుంచి వస్తున్న గాలి హాయిగొలుపుతుంటే… పీతల పులుసూ కోడి వేపుడుతో సుష్టుగా భోజనం చేసిన రామం కునుకు తీయటానికి ఉపక్రమించారు.

“రాంబారు. గడ్డి బాగా మొలిచిపోయి తోట బలమంతా అదే లాగేసుకొంటంది. మీరు సరింగా చూత్తనారో లేదో…ఈ మద్దిల తోటలో మొక్కలు చాలా నీరసం అయిపోత్నాయి. పనోళ్ళని పెట్టి పీకిద్దారంటే… తలకి పదెగిరిపోతాయి. అరడజను గొర్రెపిల్లలని కొనడెయ్యండి, నేను మేపుతాను. మొత్తం గడ్డంతా గొరిగిపారేత్తాయి. మేపినందుకు నాకో రెండు గొర్రెలనిద్దురుగాని. ఆఖరువున.” అన్నాడు కాళ్ళు నొక్కుతున్న అప్పడు.

వాడి సలహా బాగా నచ్చిన రామం, అత్తారింటికెళతా సెంట్ స్ప్రే చేసుకోవడానికొచ్చిన కమ్మోరి పెద్దబుజ్జికి గొర్రెల విషయం చెప్పి సలహా అడిగారు.

“అలాంటప్పుడు ఆరు గొర్రెలేం ఖర్మ! ఇంకో ఇరవై కొనండి. పొటాష్, అమ్మోనియా లాటివెయ్యకుండా వాటి పెంట తోటకి సరిపోతుంది. పిండి ఖర్చు తగ్గిపోద్ది.” చెప్పాడు పెదబుజ్జి.

అతని సలహా నచ్చడంతో మొత్తం సెంటుబాటిల్ పట్టుకుపొమ్మని ఇచ్చేసేరు రామం.

మర్నాడు బాపిరెడ్డిగారి చిన్నబుజ్జి సందకల్లు త్రాగడానికొచ్చినప్పుడు, గొర్రెల పెంపకం గురించి అతనికి కూడా చెప్పి, సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారు. చిన్నబుజ్జికి దూరాలోచన చాలా ఎక్కువ. అతనికి బాగా తెలుసు రామం ఒన్స్ ఫిక్స్ అయితే సలహాలు అడగడమే కానీ అనుకున్నదే చేస్తారని.

“ఈ అప్పడుగాడు, ఆడి బామ్మర్ది ఎప్పుడు తొంగుంటారో… ఎప్పుడు లెగుత్తారో ఆళ్ళకే తెలదు తాగుబోతెధవలు. పుసుక్కున వాళ్ళ మాట విని మీరు దిగిపోతే… గుడ్డెద్దు చేలోపడ్డట్టుంటది యవ్వారం. ఓ పని చెయ్యండి… గొర్రెకి ఎంతసేపూ నడక కావాలి, పక్కనే వజ్రకూటంలో మనదో ఎకరం మెట్టుంది. అక్కడ పాకలేయించుకోండి. ఎలాగా కొంటున్నారు కాబట్టి ఇరవయ్యో పాతికో ఎందుకు? ఏకంగా ఓ వంద కొనెయ్యండి. పొద్దున్నే అక్కడ దిగ్గొడితే తిన్నగా తోటలో మేసేసి సాయంత్రానికి అక్కడకొచ్చేస్తాయి. ఎండకి ఎండకుండా వానకి తడవకుండా.”

చిన్నబుజ్జి సలహా బాగా నచ్చిన రామం ఆ రాత్రి భోజనం, అక్కడే చేసి వెళ్ళమన్నారు.


చిన్నబుజ్జి సైటులో గొర్రెలకోసం రెండు పెద్ద పెద్దపాకలు రెడీ అయిపోయాయి. ఇక గొర్రెపిల్లలు రావడమే ఆలస్యం. కొందామంటే ఆరు అరల బ్యాగ్‌లో ఒకటిన్నర నోట్ల కట్ట మాత్రమే మిగిలింది. జామాయిలు నారుకోసం కోయంబత్తూరెళ్ళిన బుల్లిబుజ్జి వచ్చేస్తే ఆపని అయిపోద్ది. వాడెళ్ళి నెలన్నరయినా ఇంకా అయిపూ ఆజా లేడు. ఏమయ్యుంటాడూ? అని ఆలోచిస్తూ… ఆపాకలోంచి ఈపాకలోకి, ఈపాకలోంచి ఆ పాకలోకీ వాకింగ్ చేస్తున్న రామం, చిన్నబుజ్జి రావడంతో ఆలోచనల్లోంచి బయటపడ్డారు.

“రాంబారు… పాకలు ఫస్ట్‌క్లాస్‌గా కట్టారు కానండి. మన గొర్రెలకి దాహం వేస్తే వాటర్ కావాలి కదండీ. నా మాట విని ఓ మోటర్ వేయించెయ్యండి బ్రహ్మాండంగా వుంటది.” అడక్కుండానే సలహా పడేసేడు చిన్నబుజ్జి. ఆ ప్రక్క పొలంలో అరటిపిలక పాతాలని అతను ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. కానీ మోటార్ వేయంచటానికి డబ్బులు ఖర్చుపెట్టాలంటే మనస్సొప్పడం లేదు.

“అవును అదీ నిజమే… లైన్‌మేన్‌కి చెప్పి, ఆ పనేదో చూడు.” అంటూ ఆరు అరల బ్యాగ్‌లో మిగిలిన ఆఖరి నోట్ల కట్టని చిన్నబుజ్జి చేతిలో పెట్టారు రామం.

“రాంబారు గొర్రెల పాకల దగ్గరున్నారా? మీకోసం తోటకెళ్ళేను. ఈబుల్లిబుజ్జిగారేమయ్యారండీ… మా నారు మాటేమయ్యిందంటారు?” అంటూ వచ్చాడు పెద్దబుజ్జి.

పెద్దబుజ్జిని చూడగానే ఏదో ఐడియా వచ్చిన రామం “రా తోటలోకెళ్ళి మాట్లాడుకుందాం” అంటూ బుల్లెట్ ఎక్కించుకున్నారు.


“మన తోట చూసేవు కదా! ఇందులోనే ఓ పావలా వాటా తీసుకో. మళ్ళీ నారూ నీరూ అని కొత్తపెట్టుబడెందుకు?” పెదబుజ్జితో చెప్పారు రామం.

“కలిసొచ్చేవాడికి నడిచోచ్చేవాడు పుట్టడమంటే ఇదేనండి!” ఎగిరి గంతేసినంత పనిచేసేడు పెద్దబుజ్జి.

పెద్దబుజ్జి తోటలో వాటాగా ఇచ్చిన డబ్బుతో తుని,కత్తిపూడి, పిఠాపురం సంతలనుంచి రెండునెలలు, మూడు నెలల వయస్సున్న బుల్లిబుల్లి గొర్రెపిల్లలు పాకల్లోకి గృహప్రవేశం చేసాయి.

పాకలనిండా గొర్రెపోతు పిల్లలు గునగునా తిరుగుతున్నాయి. వాటిని తోటకి తోలుకెళ్ళడానికి బక్కడ్ని, పాకలు తుడవడానికి పుల్లమ్మని పెట్టారు. గొర్రెల పెంపకం మొదలైన సందర్భంగా ఆ వేళ తోటలో మేకపోతునేసి పార్టీ ఇచ్చారు.

“రాంబారు ఎవడిచ్చాడో కానీ, మీకు తప్పుడు సలహా ఇచ్చేడండి. అన్నీ గొర్రెపోతులే ఏంటండి బాబూ, ఇంత రేంజ్‌లో గొర్రెలు పెంచేటప్పుడు, ఆడ గొర్రెలు కూడా వుంటే… సంవత్సరం తిరిగేసరికి మంద రెట్టింపు అయిపోద్ది కదా! నామాటిని, ఓ వంద వాటిని కూడా తెచ్చిపడెయ్యండి.” అప్పటికే హాఫ్ కొట్టేసిన పొట్టినాయుడు సలహా ఇచ్చాడు.

“ఇదీ నిజమేనండోయ్. పొట్టోడు ఎంతైనా గట్టోడు. మనకి తట్టలేదు చూసేరా?్” వంతపాడాడు పెద్దబుజ్జి.

తిన్నోళ్ళు తిన్నంత, త్రాగినోళ్ళు త్రాగినంత త్రాగేసి, ఎవరికొంపలకి వాళ్ళుపోగా… మిగిలిన ఫలావూ కూరలూ తీరిగ్గా క్యారేజీ సర్దించుకుంటున్న చిన్నబుజ్జిని పిలిచారు రామం.

“తోటలో పావలా వాటా ఖాయం చేస్తున్నా నీకు.” అంటూ ఓ ప్రత్యేక వరం ప్రసాదించేసేరు.

“మీరు సూపరండే. నా వాటాకి ఓ వంద ఆడ గొర్రెలు కొనాలంతేగా!” అన్నాడు చిన్నబుజ్జి.

నవ్వుతూ తలూపారు రామం.


మంతెనోరి తాతయ్య ప్రతినెల కొడుక్కి రాసే ఉత్తరంతో పాటూ గొర్రెపిల్లల్లకి పాలు పట్టడానికి రెండు గౌడు గేదెలని కూడా తోలుకొచ్చాడు ఆంబోతుగాడు. గొర్రెలమందని చూసి ముందు తెగ సంబరపడిపోయిన ఆంబోతుగాడు తర్వాత గతుక్కుమని “రాంబారూ!” అంటూ గావుకేకపెట్టాడు.

“ఏరా ఏమయ్యింది?”

“ఇంత గొర్రి మందకి దారి చూపించే దిక్కేదండి? ఊల్లో మీఎదర నేన్నడుత్తుంటే అంబారీ ఎల్తన్నట్టుందని అంతా ఏడ్చీవోరు. దారి చూపించే దిక్కులేక ఈ మందంతా ఏ కొండల్లోకో పోతే… పులో, సింవమో చప్పరించేయగలవు. ఈటికి దారి చూపించడానికి నాలుగుమేకలు కొనట్టుకొచ్చెయ్యండి.”

“తప్పదంటావా?”

“అస్సలు తప్పదండి బాబూ. కొంపలంటూపోతాయి.”

“ఆంబోతుగాడి ఆల్టిమేటంతో సాయంత్రానికల్లా ఓ పోతుపిల్లని, నాలుగు ఆడ మేకలనీ కొని తెప్పించారు రామం. అందంగా కనబడుతున్న మందని చూసి, అరడజన్ గొర్రెలతో మొదలెట్టాలనుకుంటే… ఏకంగా రెండొందల గొర్రెల సామ్రాజ్యాన్నే సృష్టించాను కదా అని మురిసి పోతున్న మంతెనోరి రామం, ఆ కొత్తచోట గొర్రెల రామం అయిపోయారు. ‘రాజుగారేంటి? గొర్రెల మందేమిటి?’ అనుకున్న అంతా మకాం దగ్గరకి వచ్చి చూసెళుతూ తలా ఒక సలహా పడేస్తున్నారు.

“చీకటేళ… ఏ పామో వచ్చి గొర్రెని కాటేస్తే బొక్క కదా? ఓ డజను గిన్నీ కోళ్ళని, డజను కజోరా బాతులని తెప్పించండి.” సలహా ఇచ్చాడు మామిడికాయల షావుకారు తాతారావు.

వెంటనే అవి దిగడిపోయాయి.

ఓ ప్రక్క తోట పెరుగుతుంటే మరోప్రక్క తోటలో గడ్దిమేసి గొర్రెలు పుష్టిగా తయారవుతున్నాయి.

“మీ గొర్రెలతో పాటే మాయీని. వచ్చే ఏడాది మా పిల్ల పెళ్ళివుంది. విందుకు పనికొస్తాయని కొన్నాను.” సర్పంచ్ చెన్నకేశవరావొచ్చి పది పిల్లల్ని మందలోకలిపేడు.

ఇలా అందరూ తలా నాలుగు, ఐదూ పిల్లల్ని తెచ్చి మందలో కలిపేస్తూ ‘మీగొర్రెలతొ పాటే… మాయీ’ అంటుండడంతో మూన్నెళ్ళు తిరిగేసరికి మంద మూడొందలై పోయింది. ఆరు నెలలు గడిచేసరికి పుషుక్కుమని తుమ్మడం ఒక్కో గొర్రీ బాల్చీ తన్నేయడం మొదలెట్టాయి.

దాంతో… రామం ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. దాంతో గొర్రెల పాక ఖాళీ అయిపోయింది.


నడింపల్లి పెదబాబుతో కలిసి, పొలంగట్టు మీద బాతాఖానీ కొడుతున్న వియ్యంకుడు లక్ష్మీపతి, మట్టి ట్రాక్టర్ తోలుకుంటూ వచ్చిన ఆంబోతుని చూసి “ఇదెక్కడికిరా?” అన్నారు.

“ఇంకెక్కడికండి! మా రాంబారికి మీరిచ్చిన పొలంలో పోసేసిరమ్మని పెదరాజుగారు చెప్పేరండి.”

పెదబాబు, లక్ష్మీపతి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు,

“ఇదేంటిదేం పధ్ధతి? మీ తోట తవ్వేసి మా పొలం కప్పెట్టేడమేమిటోయ్! నేనెందుకొప్పుకుంటాను?” కయ్యిమన్నారు లక్ష్మీపతి.

“ఇదే ఆఖరువ మాటా? ఆలోచించ్చెప్పండి మరి” ట్రాక్టర్ స్టార్ట్ చేస్తూ అన్నాడు ఆంబోతు.

“ఒకటే కదా. ఈ గట్టంపటా వేసిపో…” అన్నారు లక్ష్మీపతి సర్దుకొని.

“భలేవారండి బాబూ మీరు. పాతికి ఎకరాల్లో మట్టి, ఎన్నాళ్ళు తోలాలో మీరే లెక్కేసుకోండి.”

లక్ష్మీపతి వాడు చెప్పిన దానితో కొయ్యబారిపోయారు.

“నీ పొలం ఏంటి? వాళ్ళ పొలం ఏమిటి? పిల్లకి కట్నం కిందిచ్చేసేకా ఇంకాళ్ళదే. ఏదోటి చేసుకోనియ్యి.” చెప్పారు పెదబాబు.

“అంతేనంటారా? అయితే తగలడండిరా తగలడండి.” కోపంగా చెయ్యూపారు లక్ష్మీపతి.

“ఒక్కత్తే కూతురు, కళ్ళెదురుగా వుంటదని ఊల్లో సంబంధం చేసేను. కడకి పొలం కప్పెట్టేదాకా వచ్చిందీ వ్యవహారం. ఇంక ముందు ముందేం… చూడాల్సొస్తదో?”

“గొర్రెల ఫారం, ఏదో పెట్టాడన్నారు అదేమయ్యింది?” అడిగారు పెదబాబు.

“కుక్క చేసే పని కుక్క చెయ్యాలి, గాడిది చేసీ పని గాడిది చెయ్యాల. అయ్యన్నీ గుటుక్కుమనేసరికి… గౌడు గేదెల్నమ్మి మరీ వచ్చాడు.”

“మరాజామాయిల్ తోట?”

“నా ఎదం తోట, అదెవళ్ళకో అప్పనంగా దొబ్బెట్టేరు. ఇంక ఆ బాబూ కొడుకులగురించి మాట్లాడుకుంటే మన మతిపోద్ది. ఇంక ఆపేద్దాం.” చిరాకుపడ్డారు లక్ష్మీపతి.


చాన్నాళ్ళ తర్వాత ఊల్లోకి అడుగుపెట్టిన రామం ఇంటికి రాకుండా ఎకాఎకిన కొబ్బరి తోట వైపు బుల్లెట్ పోనిచ్చారు. తోటమధ్యలో చెరువులు నీటితో జలజల్లాడుతున్నాయి. మంతెనోరి తాతయ్య చెరువుగట్టు మీద కర్రపట్టుకొని నిలబడితే ప్రక్కనే రామం ఈడున్న కుర్రాడు చేతిలో వున్న చిన్న వలతో నీటిలోంచి రొయ్యలని తీసి లెక్కబెడుతున్నాడు.

అక్కడకొచ్చిన రామాన్ని చూస్తూ “ఎప్పుడొచ్చేవు గురూ, రెండ్రోజుల్లో ట్వంటీ కౌంట్ కొచ్చెయ్యొచ్చు. జాక్‌పాట్ కొట్టినట్టే మద్రాస్ నుంచి కంటెయినర్లొచ్చేస్తున్నాయి,” అన్నాడు.

“నడు… ఇంక ఇంటికెళదాం,” అన్నారు కొడుకుతో మంతెనోరి తాతయ్య.

“లేదు మొత్తం రొయ్య పట్టేసేకా వస్తాను.” ఆ కుర్రాడ్ని ఎక్కించుకొని కాకినాడ లాడ్జికి పోయారు రామం.


ఆంబోతు ట్రాక్టర్ లోంచి బస్తాలు దింపి హాల్లో పడేస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్న లక్ష్మీపతి, వాడు పోయాకా “ఏంటిబావా అయి? మళ్ళీ ఏం పీకల మీదకి తెచ్చేరు మీ అబ్బాయిగారు?” అనడిగారు.

మంతెనోరి తాతయ్య, ఏం మాట్లాడకుండా మామూలుగానే మీసం దువ్వుకుంటూ వుండిపోయారు నవ్వుతూ.

“ఏంటా మీసాలు? రొయ్య మీసాల్లా! మీకూ ఫ్యాషన్ పిచ్చి పట్టిందా?”

“వెళ్ళి ఆ బస్తాల్లో ఏముందో చూడు. నాకు కాదు నీకు పడతది పిచ్చి.”

అనుమానంగా హాల్లోకి వెళ్ళిన లక్ష్మీపతికి బస్తాల్లో వున్న నోట్లకట్టలు చూసి గుండె ఆగినంతపనయ్యింది.


“ఏంట్రా సత్తీ ఏంటి చూస్తనావు?” వెనకనుంచి వెంకటేశ్వర్లు మాట వినబడ్దంతో ఉలిక్కిపడి చూసేడు సత్తిగాడు.

“ఏం లేదహే. మంతెనోర్రాంబారు మళ్ళీ ఇంటికొచ్చేసీరు కదా! పలకరిద్దారనెళ్ళితే పెదరాజుగారీ డబ్బులిచ్చేరహే.”

“వచ్చినోళ్ళందరికీ ఇత్తనారా? నాకు ఏ లంజికొడుకూ చెప్పలేదేటి?”

“ఏమోకాని ఈ డబ్బులు మీద గాంధీగారు కనబట్లేదేటిరా?”

“ఏదీ చూడనీ. ఇయి డబ్బులు కాద్రా డాలరాస్. ఇందుమీద గాందీ తాతుండడు. వుండు నేను కూడా తెచ్చుకుంటాను.” అక్కడ నుంచి పరిగెత్తాడు వెంకటేశ్వర్లు.


“నువ్విక్కడున్నావా? సిగ్నల్ సరిగ్గాలేదు. రా పైకెళదాం. వీళ్ళూ మనోల్లేనా?” అంటూ వచ్చిన ఓ పెద్ద మనిషి చిరంజీవిని రెక్క పట్టుకున్నాడు.

“వస్తా. మీరు నడవండి.” అన్నాడు చిరంజీవి ఆ చేతి పట్టుని విడిపించుకుంటూ. దాంతో ఆయన మరో వైపు వెళ్ళిపోయాడు.

“ఎవరండీ, ఈయనేనా అంబారీ రాజుగారు?” అడిగాడు ప్రసాద్.

“కాదు బుల్లిబుజ్జిగారు.” చెప్పాడు చిరంజీవి.

“అవునా! కోయంబత్తూరెళ్ళి అన్నాళ్ళు ఏమైపోయాడాయన?” అడిగాడు శేఖర్.

“జామాయిల్ నారు కొనడానికెళ్ళి, ఆ డబ్బుతో… దొంగనోట్లు కొనడంతో పోలీసులు పట్టుకెళ్ళి ఆర్నెళ్ళు కోయంబత్తూరు జైల్లో వేసేరు. వచ్చే ఎలక్షన్‌లలో యం.యల్.ఏ. టిక్కెట్‌కి ట్రై చేస్తున్నారు.”

పైకి లేస్తున్న చిరంజీవిని ఆపి “ఇంకోడౌటు. మంతెనోర్రామం గొర్రెలేపారంలో లాసయిపోయారు. జామాయిల్ తోటేసి నష్టపోయారు కదా! వాళ్ళ మాంగారి ముందు ఓడిపోయినట్టే కదా!” అడిగాడు శివ.

“నీ మొహం, ఆయన తోటలు వేయించాడు కానీ వాటిని ఎలా మార్కెట్ చేయాలో వాళ్ళకి చెప్పలేదు కదా! ఆ తర్వాత దాన్ని ఆయనే కొని, పేపరు మిల్లుకి తోలి లక్షల్లక్షలు సంపాదించాడు.”

“మరి గొర్రెల వ్యవహారం?” అన్నాడు ప్రసాద్.

“ఆయన దగ్గర ఆరణాల మొక్కని అద్రూపాయకి కొన్న రైతులందరికీ ఒకో గొర్రెనిచ్చేసేరు. ఇచ్చిన గొర్రెకన్నా వాళ్ళు కొన్న మొక్కలద్వారానే ఆయనకి ఎంతో లాభం వచ్చింది. గొర్రెని గిఫ్ట్‌గా ఇవ్వడం వల్ల ఆయన వాళ్ళ అభిమానాన్ని ఎంతో చూరగొన్నారు. అదాయన బిజినెస్ టెక్నిక్. ఇంక నో మోర్ క్వచ్చన్స్.” అక్కడనుంచి కదిలాడు చిరంజీవి.

మిత్రులు నలుగురు పైకి వెళుతుంటే రిసెప్షన్ దగ్గర ఓ పెద్దాయన పన్నీరు జల్లి అందరికీ గులాబీ పువ్విస్తున్నాడు.

ఆయన చేతిమీద పొడిపించుకున్న ‘రొయ్య’ పచ్చబొట్టు అందరికీ కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

“లాస్ట్ క్వచ్చన్. ఈయనేనా? మీ మంతెనోరి తాతయ్య?” గుసగుసగా అడిగాడు శేఖర్.

“కాదు, ఈయన వియ్యంకుడు లక్ష్మీపతి. అల్లుడ్ని తక్కువ అంచనా వేసిన ఆయన, తర్వాత అతని రూట్లోనే రొయ్యలు చెరువులు త్రవ్వి లక్షల్లక్షలు సంపాదించారు. దాంతో ఊర్లో కనబడకుండా పోయిన పచ్చదనానికి గుర్తుగా ఇలా పచ్చబొట్టు పొడిపించుకున్నారు.” చెబుతున్న చిరంజీవి మంతెనోరి రామం ఎదురొస్తుండడంతో మాటలు ఆపేసేడు.