ఆగస్ట్ 2020

స్త్రీ సాహిత్యం అని ప్రత్యేకంగా విభజించి చూపించడం సాహిత్యానికి లింగభేదం ఆపాదించడంలా పైకి కనపడుతున్నా దాని ఉద్దేశ్యం అది కాదు. చుట్టూ ఉన్న పరిస్థితులు, నాటుకుపోయిన మూస అభిప్రాయాలు స్త్రీని తన ఆశలు, అభిప్రాయాలు, ఆలోచనలూ సవివరంగా, నిస్సంకోచంగా చెప్పనివ్వని స్థితి నేటికీ ఉంది. ఇలాంటి వాతావరణంలో, స్త్రీ ఆంతరంగిక ఆలోచనా స్థితిని మనకేమాత్రమైనా పరిచయం చెయ్యగలిగినది సృజనాత్మకలోకంలో ఆమెకు దొరికే స్వేచ్ఛ. వాళ్ళ ఆశలనూ ఆశయాలనూ స్త్రీసహజమైన సౌకుమార్యంతో చెప్పుకున్న రచయితలను పాఠకులు, మామూలు రచయితల మాటేమోగానీ అభ్యుదయ రచయితలుగా సాహిత్యాన్ని భుజాన పెట్టుకొని మోస్తున్నవారిగా పేరొందినవాళ్ళు కూడా తీసికట్టుగానే చూశారు. తరాలుగా తమ లోపలే ఉడికిపోయిన అసహనాన్ని ముసుగుల్లేకుండా చూపెట్టినప్పుడు అర్థంచేసుకునే ప్రయత్నం చెయ్యకుండా అఘాయిత్యం అని అవమానించారు. మహిళాలోకం మొత్తం ఆదరిస్తున్న వారి రచనలను, ఎందుకు అవి అంత ప్రాచుర్యం పొందుతున్నాయో అర్థం కాక, ఆ సాహిత్య స్వభావాలను అర్థం చేసుకోలేక, ‘వంటింటి సాహిత్యం’ అనో ‘కలలూ కల్పనల మత్తుమందు’ అనో, ‘నిష్ప్రయోజనమైన సాహిత్యం’ అనో నిరసించారు. ఈ పరిణామాలన్నీ పునరుద్ఘాటించినది ఒక్కటే నిజాన్ని: తన భావాలను తాను స్వతంత్రంగా చెప్పుకునే స్త్రీకి కనీసం సాహిత్యసమాజంలోనైనా సరైన గౌరవం లేదు. అందుకే స్త్రీలు, సాహిత్యంలో తమ స్థానాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పురుషాహంకారానికి చెంపపెట్టుగా వాళ్ళు చొరబడలేని సాహిత్యవిభాగాన్ని తమకు తాముగా ఏర్పాటు చేసుకున్నారు. తమదైన పంథాలో వెళుతూ ఆధునిక తెలుగు సాహిత్యచరిత్రలో నవలా సామ్రాజ్యాన్ని ఏలుకున్నారు. లింగవయోవిచక్షణ లేకుండా పుస్తకపఠనాన్ని ఆబాలగోపాలానికి అలవాటు నుండి అభిరుచిగా మార్చగలిగారు. ఇంత చేసినా, సమాజం, సాహిత్యరీతులు, పఠనరీతులూ అన్నీ మారాయని చెప్పుకుంటున్న ఈ దశాబ్దంలో కూడా స్త్రీ సాహిత్యం పట్ల అదే తేలికపాటి దృష్టి కొనసాగడమే కొరుకుడు పడని విషయం. ఇప్పటికీ స్త్రీ కథ రాస్తే దాని ఆధారంగా ఆమె జీవితాన్ని ఊహించి, ఆమె వ్యక్తిత్వాన్ని కొలవాలనుకునే మేధావులకు కొరతేమీ లేదు. రచయిత రాస్తే ఆదర్శమని పొగడబడే కథావస్తువు రచయిత్రి రాస్తే ఆమె శీలానికి, బరితెగింపుకు కొలమానమవ్వడంలో ఎవ్వరికీ ఏ ఆక్షేపణా లేదు. స్త్రీపురుష సంబంధాల గురించిగాని, స్త్రీ ఆంతరంగిక విషయాల గురించిగాని స్త్రీ తనకు సబబనిపించినదేదో రాస్తే స్వీకరించే సహనపూరిత వాతావరణం నేటికీ లేదు. సమాజానికి వ్యతిరేకులయ్యో, లేదా సమాజం నుండి విడివడి ఒక ప్రతిఘటనగానో ఇంకా ఎన్నాళ్ళుండాలి స్త్రీ సాహిత్యం? ఎందుకుండాలి? సాహిత్యానికీ సమాజానికీ ఎంత దూరం?