శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు

గ్రంథగ్రంథిరిహ క్వచిత్ క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయా
ప్రాజ్ఞమ్మన్యమనా హఠేన పఠతీమాఽస్మిన్ ఖలః ఖేలతు
శ్రద్ధారాద్ధగురుశ్లథీకృత దృఢగ్రంథిః సమాసాదయ
త్వేతత్కావ్యరసోర్మిమజ్జనసుఖవ్యాసజ్జనం సజ్జనః

ఒక దుర్బుద్ధి గలవాడు తానే మేధావినని అనుకుని, మొండితనంతో ఈ కావ్యాన్ని తనంతట తానే చదివి, ఇందులో ఏముంది? అని నిర్లక్ష్యవైఖరితో వ్యాఖ్యానం చేస్తూ గర్వపడకుండా ఉండడానికని, నేను ఈ గ్రంథంలో అక్కడక్కడ అందరికీ అర్థంకాని కొన్ని గట్టి చిక్కుముళ్ళని (గ్రంథగ్రంథుల్ని) కావాలనే వేశాను. కాబట్టి, సజ్జనుడైన పాఠకుడు గురువుని శ్రద్ధతో పూజించి, ఈ చిక్కుముళ్ళని విప్పించుకుని, అర్థాన్ని చెప్పించుకుని, ఈ కావ్యపు రసతరంగాల్లో ములిగి సుఖాన్ని పొందునుగాక!

శ్రీహర్షమహాకవి తన నైషధీయచరితం అనే కావ్యం చివరిలో వ్రాసిన శ్లోకాల్లో ఇది ఒకటి. ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకునే ముందు కొద్దిగా ఈ కవి గురించి, కావ్యకథ గురించి తెలుకుందాం.

దాదాపు 2830 శ్లోకాల నైషధీయచరితాన్ని1, 2, 3 రచించిన శ్రీహర్షుడు 12వ శతాబ్దం వాడు. తండ్రి పేరు శ్రీహీరుడు, తల్లి మామల్లదేవి. మధ్యభారతదేశంలో జయచంద్రుడి ఆస్థానంలో ఉండేవాడని ఒక బలమైన వాదన. ఇతడు రచించిన ఈ కావ్యాన్ని పండితులు విమర్శిస్తూంటే, కాశ్మీరదేశంలోని సరస్వతీదేవిని చింతామణిమంత్రంతో ఉపాసించి, అందరి ప్రశంసలూ పొంది ఖ్యాతిని ఆర్జించాడని ప్రతీతి. ఈ వివరాల్ని తన మొదటి సర్గ చివరి శ్లోకంలోనే చెప్పాడు.

తక్కిన మహాకవులైన కాళిదాసమాఘభారవుల మృదుమధురశైలికి భిన్నమైన సంక్లిష్టమాధుర్యం శ్రీహర్షుడిది. ఈ విషయాన్నే కొందరు తమకి శ్రీహర్షుడిపైన ఉన్న అనురాగాన్ని కవితారూపంలో ధైర్యంగా చాటుకున్నారు.

తావద్వా భారవేర్భాతి యావన్మాఘస్యనోదయః
ఉదితే నైషధే కావ్యే క్వ మాఘః క్వచ భారవిః

బహుశః భారవి యొక్క కాంతి మాఘుడి ఉదయానికి ముందు శోభాయమానంగా ఉందేమో, కాని, నైషధమనే సూర్యుడు ఉదయించిన తర్వాత మాఘుడెక్కడ? భారవి ఎక్కడ?

నైషధకావ్యంలో నిషిధదేశాన్ని ఏలిన నలమహారాజు నాయకుడు. కుండినపురం రాజధానిగా విదర్భరాజ్యాన్ని పాలించే భీమసేనుడి కూతురు దమయంతి నాయిక. ఒక హంస నలుడికి, దమయంతికి మధ్య ప్రేమరాయబారం నడుపుతుంది. కాని దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు కూడా దమయంతి అందానికి ముగ్ధులౌతారు. తమలో ఎవరో ఒకర్ని పెళ్ళాడమని దమయంతికి రాయబారం పంపాలని నిశ్చయించుకుని, నలుణ్ణి రాయబారిగా ఎంచుకుని అతణ్ణి పంపిస్తారు. దమయంతి నలుడి రాయబారాన్ని తిరస్కరిస్తుంది. ఎందుకంటే తను నలుణ్ణే ప్రేమిస్తోంది కాబట్టి. భీమసేనుడు స్వయంవరం చాటిస్తాడు. ‘దమయంతిని మాయచేసైనా సరే, మనలో ఒకడు ఆమెని పెళ్ళాడాలి’ అని అనుకుని నలుగురు దిక్పాలకులూ నలుడి వేషాలే వేసుకుని స్వయంవరానికి వస్తారు. అప్పుడు ఆ స్వయంవరసభలోకి సరస్వతీదేవి దిగి, ఆ స్వయంవరానికి వచ్చిన దేవతల్నీ, రాజుల్నీ దమయంతికి పరిచయం చేస్తుంది. చివరకి దమయంతి, ఎదురుగా కనుపిస్తున్న ఐదుగురు నలుల్లో, ఎవడు అసలైన నలుడో కనిపెట్టి వాణ్ణి వరిస్తుంది. ఆ తరవాత చాలా సన్నివేశాలున్నాయి. కాని, ఇదీ టూకీగా నైషధీయచరితంలో ముఖ్యకథ.

పైన చెప్పిన శ్లోకంలో, సరైన గురువు దగ్గర ఈ కావ్యాన్ని అభ్యసించకుండా తన కావ్యం గురించి విమర్శించరాదని శ్రీహర్షుడి తీర్మానం. అతని తీర్మానాన్ని ప్రక్కన పెట్టి, కొంతమంది ఈ కావ్యంలో కొన్ని వర్ణనలు జుగుప్సాకరమైన దిగువ తరగతి శృంగారపు కోవలో నడిచాయని వాదిస్తూ, ఇది ఉత్తమకావ్యం కాదు అన్నారు4. మరికొందరు యిది మంత్రయుక్తమనీ1, 2, శ్రీవిద్యామయమనీ5 అన్నారు. ఇప్పటివరకూ ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా అన్ని గ్రంథులూ విప్పామని చెప్పగలిగే సాహసం ఎవరికీ లేదు. ‘అవే అవే ఉపమానాలు వాడాడు, ఎంతచెప్పినా తనివితీరక చెప్పిందే చెపుతాడు’ అని గబగబా విషయం తేల్చివేసే పాఠకులు ఒక్కసారి ఈ వ్యాసం మొదట్లో చెప్పిన శ్లోకాన్ని మననం చేసుకోవడం అవసరం. ఎందుకు అవసరం అన్నదాన్ని ఒకే ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలియజేయాలన్నదే ఈ వ్యాసం యొక్క ముఖ్యాశయం.

ఉదాహరణ శ్లోకం: పరిచయం, గ్రంథగ్రంథుల వివరణ

మనం చెప్పబోయే ఉదాహరణ శ్లోకం ధ్వనిమయమైన పధ్నాలుగవ సర్గలోనిది. ‘ప్రాకాశి తస్య న చ నైషధకాయమాయా’ అని సర్గ ప్రారంభంలోనే ఒక ధ్వనిని వినిపించాడు శ్రీహర్షుడు. ఈ సన్నివేశంలో పాత్ర అయిన ఇంద్రుడి పరంగా అర్థం చెపితే, తస్య= ఆతని యొక్క (ఇంద్రుని యొక్క), నైషధకాయమాయా = నిషిధరాజైన నలుడి శరీరం ధరించడం వల్ల ఏర్పడిన మాయ, న ప్రకాశి = (సులభంగా) బయటపడదు. మరో విధంగా కూడా దీని అర్థం చెప్పవచ్చు. తస్య = ఆతని యొక్క (శ్రీహర్షుని యొక్క), నైషధకాయమాయా =నైషధగ్రంథపు శరీరంలో (అంటే, శ్లోకాల గుంపు) దాగి ఉండే కళ/జ్ఞానం, న ప్రకాశి = (సులభంగా) బయటపడదు. దీన్ని ఈ సర్గలో ఉన్న ధ్వనిమయమైన శ్లోకాల గురించి శ్రీహర్షుడు మనకిచ్చే హెచ్చరికగా భావించాలి. ఆ మాయని ఛేదించాలి.

అవామావామార్ధే సకలముభయాకారఘటనాత్
ద్విధాభూతం రూపం భగవదభిధేయం భవతి యత్
తదంతర్మంత్రం మే స్మరహరమయం సేందుమమలం
నిరాకారం శశ్వజ్జప నరపతే! సిద్ధ్యతు స తే (నైషధ-14.85)

ఇది సరస్వతీదేవి నలుడికి వరాన్నిస్తూ చెప్పిన శ్లోకం. ఇందులో అతడికి చింతామణిమంత్రాన్ని ఉపదేశించింది. దీంట్లో శ్రీహర్షుడు చాలా గ్రంథగ్రంథులు వేశాడు. తమ వ్యాఖ్యల్లో నారాయణుడు, మల్లినాథుడు ఆ గ్రంథుల్ని విప్పి ఈ శ్లోకానికి దేవతాపరంగా, మంత్రపరంగా, యంత్రపరంగా మూడు అర్థాలు చెప్పారు. వాటిని విప్పినప్పుడు, వారిద్దరి విధానాల్లోనూ చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఇద్దరి పద్ధతుల్నీ కలబోస్తే చాలా రకాలుగా శ్లోకార్థాన్ని వ్రాయవచ్చు. (నేను 8 వరకూ లెక్కపెట్టి వదిలేశాను. ఇంకా ఎక్కువే ఉంటాయి). ఈ వ్యాసంలో నేను మల్లినాథసూరి వ్యాఖ్యని అనుసరించి దేవతాపరంగా, మంత్రపరంగా, యంత్రపరంగా మూడు అర్థాలు మాత్రమే వ్రాస్తున్నాను. శ్రీహర్షుడి గ్రంథగ్రంథుల తత్త్వాన్ని గ్రహించడానికి ఇవి చాలు.

ఈ శ్లోకంలో వాడిన పదాలు అంత క్లిష్టమైనవి కావు. ఈ శ్లోకాన్ని దేవతాపరంగా సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

దేవతాపరమైన అర్థం: నరపతే = ఓ మహారాజా!, అర్ధే = ఒక సగభాగంలో, అవామా = అస్త్రీ రూపాన్ని, అంటే పురుషరూపాన్ని, అర్ధే = మిగిలిన సగభాగంలో, వామా = స్త్రీ రూపాన్ని, ద్విధాభూతం = రెండు రూపాలనీ కలిగి, ఉభయ+ఆకారఘటనాత్ = ఆ రెండు రూపాలూ కలవడంవల్ల, సకలం = సంపూర్ణత పొందిన, భగవత్+అభిధేయం = భగవత్ అనే మాటచేత చెప్పబడేది, (అయిన) యత్ = ఏ, రూపం = రూపం, భవతి = ఉందో, స+ఇందుం = చంద్రకళతో కూడినదీ, అమలం = నిర్మలమైనదీ, నిరాకారం = వస్తువుగా చూద్దామంటే ఆకారంలేనిదీ, మంత్రం = మంత్రరూపమైనదీ, హరమయం = శివతత్త్వంతో నిండినదీ, (అయిన), మే = నా యొక్క, తత్ = ఆ రూపాన్ని, అంతః = (నీ) మనస్సులో, స్మర = ధ్యానించు. శశ్వత్ = ఎల్లప్పుడూ, జప = జపించు లేదా ఉపాసించు. సః = అతడు (ఆ మంత్రమూర్తి అర్ధనారీశ్వరుడు), తే = నీకు, సిద్ధ్యతు = ప్రసన్నుడగు గాక!

ఓ నలమహారాజా! ఒక సగభాగంలో పురుషరూపాన్నీ, మిగిలిన సగభాగంలో స్త్రీరూపాన్నీ కలిగి రెండు రూపాలుగా ఏర్పడి, ఆ రెండు రూపాలూ కలవడంవల్ల సంపూర్ణత పొందినదీ, ‘భగవత్’ అని పిలవబడేదీ, చంద్రకళలతో కూడినదీ, నిర్మలమైనదీ, వస్తువుగా చూద్దామంటే ఆకారంలేనిదీ, మంత్రరూపమైనదీ, శివతత్త్వంతో నిండినదీ అయిన నా యొక్క రూపాన్ని నీ మనస్సులో ధ్యానించు. ఎల్లప్పుడూ, జపించు లేదా ఉపాసించు. ఆ మంత్రమూర్తి అయిన అర్ధనారీశ్వరుడు నీకు ప్రసన్నుడు అవగలడు.

పై శ్లోకంలో, సరస్వతీదేవి అర్ధనారీశ్వరరూపాన్ని గురించి వర్ణించి, నలుణ్ణి ‘ఆ రూపాన్ని స్మరించు’ అని చెప్పింది. ఆ రూపం తన మంత్రరూపమే అని చెప్పి, ఆ మంత్రానికి సంబంధించిన వివరాలు చెప్పకుండా, ‘దాన్ని ఎల్లప్పుడూ జపించు’ అంది. ఈ శ్లోకానికి ముందున్న శ్లోకాల్లో ఆ మంత్రమేమిటో చెప్పలేదు. తరవాతదైన 86వ శ్లోకంలో, ఆ సరస్వతీదేవే ‘యేనాఽయం హృదయే కృతః సుకృతినా మన్మంత్రచింతామణిః’ (ఏ పుణ్యవంతుడిచేత ఈ నా యొక్క మంత్రమైన చింతామణిమంత్రం హృదయంలో స్మరింపబడిందో) అంటుంది. ఇక్కడ ‘హృదయే కృతః’ అన్నది బహుకీలకమైన మాట. ఈ మాటకి ఉన్న ‘హృదయమునందు చేయబడినదైన’ అన్న అర్థం వల్ల, పైన చెప్పిన 85వ శ్లోకం తన గుండెల్లో చింతామణిమంత్రాన్ని దాచుకుని ఉందని ధ్వని. అందువల్ల 85వ శ్లోకాన్నే మంత్రపరంగా శోధించి చింతామణిమంత్రాన్ని తెలుసుకోవాలి. దీనికి కొద్దిగా మంత్రశాస్త్రం, కొద్దిగా వ్యాకరణశాస్త్రం తెలియాలి.

మంత్రపరమైన అర్థం: నరపతే = ఓ మహారాజా! అర్ధే = మొదటిభాగంలో, (మరియు) వామార్ధే = (దానికి) కుడి భాగంలోను, అవా = ఓ కారముతోను, మా = మ కారముతోను, (అంటే ‘ఓం’ ఉండి), హరమయం = హకారరేఫలతో నున్నది (హ్,ర్ తో ఉన్నది), ఉభయ+అకారఘటనాత్ = రెండు అకారాలు కలవడం వల్ల (హ్ + అ, ర్ +అ), ద్విధాభూతం = రెండు అక్షరాలుగా విడిపోయినది, (అనగా, ‘హర’ గా మారినది), సకలం = సంపూర్ణమైనది. (ఇంతవరకూ ఇచ్చిన వివరణవల్ల, పూర్వభాగంలో ఒక ఓంకారం, ఉత్తరభాగంలో ఒక ఓంకారం కలిగి, మధ్యలో ‘హ’ ‘ర’ అనే రెండు అక్షరాలతో కూడి ‘ఓం హర ఓం’ అనే రూపం తయారవుతుంది.), భగవత్+ అభిధేయం = శివునియొక్క నామంగా చెప్పబడే, యత్ రూపం = ఏ రూపం, భవతి = ఉందో, తత్ = ఆ రూపం యొక్క, నిర్+అ+అకారం = అ కారములు లేనిదాన్ని (అంటే, ‘ఓం హర ఓం’ = ఓం + హ్ + అ + ర్ + అ + ఓం, దీనిలోంచి అకారాలు తిసేస్తే ఓం + హ్ + ర్ + ఓం ఏర్పడగా), సేందుం = స+ ఈందుం = స +ఈ + ఇందుం = ఈ కారము, బిందువులతో (పూర్ణానుస్వారం) కూడినదాన్ని (అంటే, ఓం + హ్ + ర్ + ఈ + o + ఓం = ఓం హ్రీం ఓం అనే అక్షరరూపమైనదానిని), అమలం= నిర్మలమైనదాన్ని, మే = నా యొక్క, మంత్రం = (ఓం హ్రీం ఓం అనే )మంత్రమైన దాన్ని, అంతః = అంతఃకరణలో; స్మర = ధ్యానించు. శశ్వత్ = ఎల్లప్పుడూ, జప = జపించు లేదా ఉపాసించు. సః = ఆ మంత్రమూర్తి, తే = నీకు, సిద్ధ్యతు = ప్రసన్నుడగు గాక!

ఓ నలమహారాజా! ఓ కారం, మ కారం కలపగా ఓం ఏర్పడుతుంది. అలాంటి ఓం అనే ప్రణవాన్ని పూర్వభాగంలో ఒకటి, దానికి ఎడమ భాగంలో ఒకటి ఉంచి, మధ్యలో హర అనే అక్షరాలు ఉంచగా ‘ఓం హర ఓం’ అనే శివనామప్రసిద్ధమైన మంత్రం ఏర్పడుతుంది. హర-లో ఉన్న ఆ రెండు అకారాలు తీసేసి, ఆ స్థానంలో ఈ కారాన్ని, పూర్ణానుస్వారాన్ని చేర్చినప్పుడు లభించే ఓం హ్రీం ఓం అనే నా మంత్రాన్ని ఎల్లప్పుడూ ధ్యానించి, జపించు. ఆ మంత్రమూర్తి నీకు ప్రసన్నుడు అవగలడు.

దీన్నిబట్టి ‘ఓం హ్రీం ఓం’ అన్నది చింతామణిమంత్రమనీ, అది సరస్వతీదేవి యొక్క మంత్రమనీ అర్థం అవుతోంది.

చింతామణిమంత్రానికి అనుబంధమైన ఒక యంత్రం ఉంది. దాన్ని గురించి కూడా శ్రీహర్షుడు ఇదే శ్లోకంలో సరస్వతీదేవి ద్వారా చెప్పించాడు. ఇదే శ్లోకంలో చెప్పడం ఒక గొప్ప ధ్వనివిశేషం. ఆ ధ్వని గురించి ఇక్కడ చర్చించటల్లేదు.

యంత్రపరమైన అర్థం: నరపతే = ఓ మహారాజా! భగవత్ = యోనిలాగ, అభిధేయం = కనబడే, యత్ = ఏ, రూపం = త్రికోణాకారం గలిగిన రూపం ఉందో, ఉభయ+ఆకార = అలాంటి రెండు త్రికోణాల్ని, ఘటనాత్ = కలపడం వల్ల, సకలం = ఏర్పడే సమగ్రమైన షట్కోణమనేది, భవతి = ఉంది. తత్ = ఆ షట్కోణరూపానికి, అంతః = మధ్యన ఉన్న, అవా మా వామా అర్ధే సకలం ద్విధాభూతం హరమయం నిరాకారం సేందుం = ‘ఓం హ్రీం ఓం’ అనే, అమలం= నిర్మలమైన, రూపం = రూపమైన, మే మంత్రం = నా మంత్రాన్ని, స్మర = ధ్యానించు. శశ్వత్ = ఎల్లప్పుడూ, జప = జపించు లేదా ఉపాసించు. సః = ఆ మంత్రమూర్తి, తే = నీకు, సిద్ధ్యతు = ప్రసన్నుడగు గాక!

ఓ నలమహారాజా! యోనిలాగ కనబడే త్రికోణాల్ని రెండింటిని కలపడంవల్ల సమగ్రమైన షట్కోణము ఏర్పడుతుంది. ఆ షట్కోణానికి, మధ్యలో నిలచి ఉన్న నా యొక్క నిర్మలమైన మంత్రమైన ‘ఓం హ్రీం ఓం’ అనే మంత్రాన్ని ధ్యానించు. ఎల్లప్పుడూ జపించు లేదా ఉపాసించు. ఆ మంత్రమూర్తి నీకు ప్రసన్నుడు అవగలడు.

ఇంత చిన్న విషయాన్ని చెప్పడానికి ఇంత రాద్ధాంతం చెయ్యాలా? మూడు భావాల్నీ మూడు శ్లోకాల్లో చెప్పచ్చుగదా అని అనేవాళ్ళు ఉండచ్చు. శ్రీహర్షుడు ఒక కావ్యం వ్రాయదలిచాడు. సూటిగా అర్థమయ్యేలాగే వ్రాశాడు. ఇలా ఎందుకు గ్రంథగ్రంథులు పెట్టాడు? అంతటితో ఆగక ‘చిక్కుముళ్ళూ, పీటముళ్ళూ వేశా’ అంటూ సవాళ్ళలా ఎందుకు చెప్పాడు?

వీటిలో కొన్నింటికి ఔచిత్యం అన్నది ఒక సమాధానం కావచ్చు. కావ్యంలో నిబిడీకృతమైన విద్యలు కొన్ని గుప్తమైనవీ, జటిలమైనవీ కావడంవల్ల గ్రంథగ్రంథులు వేసి ఉండవచ్చు. గోప్యమైన మంత్రయంత్రపరమైన విషయాల్ని కావ్యంలో అంతర్లీనంగా చెప్పాలనుకున్నప్పుడు ముళ్ళు వెయ్యక తప్పలేదేమో.

శ్రీహర్షుడు చెప్పినవి అతని కాలంలో పండితులకి కూడా అర్థమయేవి కావని అనుశ్రుతంగా వచ్చిన కథలు చెపుతున్నాయి. వీటిలో కొంత నిజం ఉండవచ్చు. అందుకే ఈ గ్రంథుల విషయాన్ని గుర్తు చేశాడేమో.

ఏది ఏమైనా ఈ కావ్యాన్ని చదవడం అన్నది ఒక గొప్ప అనుభవం. సంస్కృతభాషను అనుభవించి, ఆనందించాలి అనుకున్నవాళ్ళు తప్పకుండా చదవవలసిన కావ్యం. కష్టమైన కావ్యం. మన్మథుడు, చంద్రుడు, పాలకడలి, అమృతం, కల్పవృక్షంలాంటి వాటిని కావ్యవస్తువులుగా, ధ్వనిచిహ్నాలుగా చేసి, ఈ కవి చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేసి ఉండరేమోననిపిస్తుంది. కొన్ని పదప్రయోగాలు, పదగుంఫనలు చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకి, నలుడు ఒక్కసారిగా ప్రత్యక్షం కాగానే దమయంతి, చెలికత్తెలు కొయ్యబారిపోతారు. అప్పుడు దమయంతి తనని తాను కూడదీసుకుని, నలుడితో ‘మర్యాద తెలిసినవాళ్ళు తమ దగ్గర మర్యాద చెయ్యడానికి కావలసిన అర్ఘ్యపాద్యపానీయాలు లేకపోతే ప్రియమైన అక్షరాల సమూహం చేత రసధారను సృష్టించి, శాస్త్రంలో చెప్పినట్టు, అతిథులకి తేనె, పాలు కలిపిన పానీయాన్ని తాగితే కలిగే తృప్తిని కలిగించాలి (ప్రియాక్షరాలీరసధారయాఽపి వైధీ విధేయా మధుపర్కతృప్తిః )’ అంటుంది. తర్వాత దమయంతి పలికిన మాటల్లోని మధుపర్కమాధుర్యం శ్రీహర్షుడి శ్లోకాలు మనకి తెలిజేస్తాయి. తియ్యని మాటలు అనే రసధారల్ని అక్షరాలనే బిందువుల్తో కూర్చడమనేది ఒక చక్కని భావన. అది నలుడికి మధుపర్కతృప్తిని ఇవ్వాలనడంలో తన అనురాగాన్నీ, కాబోయే తమ వివాహాన్నీ పరోక్షంగా సూచించాలనే కామన. ప్రియాక్షరాలీ అన్నది చక్కని ప్రయోగం. అలాగే, దమయంతి సిగలో పెట్టుకున్న మల్లెపూలు ఆమె వీపు అనే బంగారపు పలక మీద నిలిచినప్పుడు అవి ‘స్మరప్రశస్తీరజతాక్షరేయం’ (మన్మథుణ్ణి పొగుడుతూ వ్రాసిన వెండి అక్షరాలు) అనడం, నలుడికి బంగారు హంస పట్టుబడ్డప్పుడు, అది తన ప్రియురాల్ని తలుచుకుని ఏడుస్తూ ‘లిపిర్లలాటం తవ నిష్ఠురాక్షరాః’ (నీ యొక్క వియోగమనే కఠినమైన అక్షరాల్ని నా నుదుట వ్రాశాడు) అనడం గమనిస్తే, ఈ కవి తన మాటల్నే కాదు, వాటిలోని అక్షరాల్ని కూడా తూచి తూచి, ఒక్క పొల్లుమాట లేకుండా వ్రాశాడని అర్థం అవుతుంది.

భవద్వృత్తస్తోతుర్మదురుపహిత కంఠస్యకవితుః… అని సాగే 89వ శ్లోకంలో సరస్వతీదేవి నలుడితో ‘ఈ చింతామణి అనే మంత్రాన్ని ఉపాసించిన ఒకానొక కవి, నన్ను తన కంఠం మీద నిలబెట్టుకుని, లోకాన్ని సంతోషపెట్టడానికి, నీ చరిత్రని పొగుడుతూ రమ్యమైన గొప్ప శ్లోకాల్ని తన ముఖంనుంచి చెప్పగలడు. దానివల్ల నువ్వు విష్ణువులా పుణ్యశ్లోకుడివీ, కీర్తిమంతుడివీ అవుతావు’ అంటుంది. ఇలా శ్రీహర్షుడు తనని గురించి కూడా సరస్వతీదేవి చేత చెప్పించుకున్నాడు. తన ప్రతిభ మీద అంత నమ్మకమున్న ఈ కవి ప్రతిభావిశేషాలని కొద్దిగా వివరిస్తాను.

శ్రీహర్షుడి ప్రతిభ

శ్రీహర్షుడు కేవలం కవి మాత్రమే కాదు. గొప్ప శాస్త్రపండితుడు కూడా. అది నైషధంలో అడుగడుగునా కనబడుతుంది. అతని కావ్యంలో ధ్వని, శ్లేషాదుల్ని గ్రహించాలంటే పాఠకుడు కేవలం సాహిత్యంలోను, భాషలోను నిష్ణాతుడైతే చాలదు. అతని గ్రంథగ్రంథుల్ని విప్పాలంటే చాలా శాస్త్రవిషయాల్ని కూడా తెలిసినవాడై ఉండాలి. వాటిని మథించి సాధించే ప్రతిభగలవాడై ఉండాలి. ఒక్కొక్కసారి, విశేషార్థం మాట దేముడెరుగు, శ్లోకాల సాధారణమైన అర్థం తెలుసుకోడానికే ఇతరశాస్త్రాల ప్రవేశం కావాలి. ఉదాహరణకి, శ్రీహర్షుడు పదవసర్గలో సరస్వతీదేవి సభలోకి రాగానే ఆమెని పధ్నాలుగు శ్లోకాల్లో వర్ణిస్తాడు. ఈ వర్ణన మామూలుగా సాగే ‘కుచోన్నతే కుంకుమరాగశోణే’ లాంటిది కాదు. సకలవిద్యాధిదేవత అయిన సరస్వతీదేవి దేహంలో ఏ భాగంలో ఏ ఏ విద్యలు ఎలా నిక్షిప్తమై ఉన్నాయో, ఉపాసకులకి అవి ఎలాంటి ఫలాన్నిస్తాయో కవితాత్మతో చెప్పినది. ఎన్నో మర్మాలతో కూడిన ఈ శ్లోకాలు మామూలుగా అర్థం కావాలన్నా తర్కవేదాంతవ్యాకారణాదుల్లో ప్రవేశం కావాలి. ఇటువంటి శ్లోకాలు కావ్యంలో కోకొల్లలు.

విద్వదౌషధమ్ అని పేరు తెచ్చుకున్న నైషధంలో శ్రీహర్షుడు చేసిన కొన్ని ప్రయోగాలు ఏ కవీ చెయ్యలేదనే చెప్పాలి. మచ్చుకి రెండు.

  1. స్వయంవరసభలో సరస్వతీదేవి నలరూపంలో ఉన్న నలుగురు దేవతల్నీ (ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు), నిజమైన నలుణ్ణీ దమయంతికి పరిచయం చేస్తుంది. ఇంద్ర, అగ్ని, యమ, వరుణుల్ని దేవతలుగానే పరిచయం చేస్తూ ఒక్కొక్కడి గురించి నాలుగేసి శ్లోకాలు చొప్పున 16 శ్లోకాలు చెపుతుంది. విశేషమేమిటంటే, ఆ 16 శ్లోకాలూ నలుడికి కూడా వర్తించేలా చెపుతుంది. ఆ తర్వాత అసలైన నలుడి దగ్గరకి వచ్చి ఐదు శ్లోకాల్లో అతణ్ణి దమయంతికి పరిచయం చేస్తుంది. దానిలో మొదటిది ఇంద్రుడికి, రెండవది అగ్నికి, మూడవది యముడికి, నాలుగవది వరుణుడికి, ఐదవది అందరికీ వర్తించేలా (దేవః పతిర్విదుషి నైషధరాజ గత్యా… అనే శ్లోకం) చెపుతుంది. సరస్వతీదేవి యిలా నిష్పాక్షికంగా సత్యవ్రతాన్ని పాటించినట్లుగా వ్రాయడం శ్రీహర్షుడి గొప్ప ఔచిత్యం. కవిత్వంగా ఇది ఒక గొప్ప ప్రయోగం.
  2. పదకొండవసర్గ 7వ శ్లోకం నుంచి పధ్నాలుగవ సర్గ చివరిలో 90వ శ్లోకం వరకూ ఉన్న (సుమారు 380) శ్లోకాలలో, సరస్వతీదేవి యొక్క సంభాషణ దాదాపు 350 శ్లోకాల్లో రచించబడింది. దాదాపుగా ఇది ఒక ఏకపాత్రాభినయంలా ఉంటుంది. ఇటువంటి సన్నివేశం కవికి కత్తిమీద సాములాంటి వ్యవహారం. సాక్షాత్తూ సకలవిద్యాధిదేవత, వాగ్రూపిణి అయిన సరస్వతీదేవి సంస్కృతభాషలో శ్లోకరూపంలో దేవమానవసంఘాలున్న స్వయంవరసభలో మాట్లాడే సన్నివేశాల్ని వ్రాస్తున్నప్పుడు కవి తన యొక్క భాషలో, భావం వ్యక్తపరచడంలో, వర్ణనల్లో దొర్లే అలంకార-వ్యాకరణ-తర్క-వేదాంతాది శాస్త్రవ్యవహారాల్లో, ఔచిత్యంలో, ధ్వనిప్రధానమైన కవిత్వం చెప్పడంలో ఎంతో ఉన్నతమైన స్థాయిని చూపించాలి. శ్రీహర్షుడు తన ప్రత్యేకశైలిలో, అద్భుతమైన అలంకారాలతో, ప్రవాహగుణం ఉన్న అనుప్రాసలతో కూడిన మధురమైన భాషతో, సన్నివేశాల్ని సముచితంగా పేర్చుకుంటూ, ఒక్కొక్క సన్నివేశానికి ఇన్నేసి శ్లోకాలని నిర్ధారణ చేసుకుని కావ్యసౌష్ఠవాన్ని సృష్టిస్తూ, రకరకాల (చిన్న, పెద్ద) వృత్తాలలో, ఉచితరీతిలో, కావ్యరచనని అవలీలగా సాగించాడు. ఇలాంటి పనితనం మరో కవి ఎవడూ చూపించలేదనే చెప్పాలి. గీర్వాణిని ఆ సభలో మనకి సాక్షాత్కరింపజేశాడు. అవామావామార్ధే… ఆ సరస్వతీ సంభాషణాప్రవాహంలోదే.

అవామావామార్ధే… అన్న శ్లోకంలోనే ఇంకా చాలా గ్రంథగ్రంథులు ఉన్నాయి. ఇక్కడ సూచనప్రాయంగా కొన్ని వివరిస్తాను.

  1. దేవతాపరమైన అర్థంలో వివరించబడ్డ అర్ధనారీశ్వరరూపానికి సేందుమమలం, స్మరహరమయం అన్న పదాల్ని విశేషణాలుగా వాడితే, సేందుమమలం = స+ఇందుం + అమలం = (ఒకభాగంలో) చంద్రునిగల రూపం + (మరొక భాగంలో) స్వచ్చమైన, మచ్చలేని రూపం అన్నఅర్థమూ, స్మరహరమయం = స్మరమయం + హరమయం = (ఒకభాగంలో) కామేశ్వరీ రూపము + (మరొక భాగంలో) శివరూపము అన్న అర్థమూ చెప్పుకోవచ్చు.
  2. మంత్రపరమైన అర్థంలో అర్ధే అవా = పూర్వభాగంలో ఓం అనే రూపం చేత, అర్ధే అవామా = దాని ఎడమభాగంలో స్త్రీరూపం చేత. ఇలా విశ్లేషిస్తే, పురుషరూపమైన ‘ఓం’ అనే ప్రణవరూపానికి ‘శ్రీం’ అనే పదం స్త్రీరూపం. ఈ విశ్లేషణని పైన ఉన్న అర్థంలో జోడిస్తే, ‘ఓం హ్రీం శ్రీం’ అనే మంత్రం ఏర్పడుతుంది.
  3. మంత్రపరమైన అర్థానికి మరో మలుపు తిప్పి ఇంకొన్ని మంత్రాల్ని కూడ తయారు చెయ్యవచ్చు. సకలం అన్న పదాన్ని మంత్రం అన్నపదానికి విశేషణంగా తీసుకుని, స+కల = నిరాకారమైన, సేందు లక్షణాలతో కూడిన ‘కల’ అని విశ్లేషిస్తే, క్లీం అనే బీజాక్షరం కూడా తయారయి, అది ‘ఓం హ్రీం ఓం‘ (లేదా ఓం హ్రీం శ్రీం) చివర చేరి ‘ఓం హ్రీం ఓం క్లీం’ (లేదా ఓం హ్రీం శ్రీం క్లీం) అనే మంత్రం ఏర్పడుతుంది.

ఇంతవరకూ దేవతామంత్రయంత్రశాస్త్రపద్ధతుల్లో ఉండే అర్థాల్ని కొన్నిటిని తెలుసుకున్నాం. తంత్రశాస్త్రపద్ధతుల్లో శివశక్తిస్వరూపాల్ని ప్రసన్నం చేసుకోడానికి వామాచారం అనే ఒక రకమైన ఉపాసనాపద్ధతి ఉంది. శ్రీహర్షుడు వామాచారాన్ని పాటించి చింతామణిని సాధించాడనే కథనాలున్నాయి. ‘వామాచారం రజోగుణం కలది, కల్మషమైనది, నాస్తికమైనది. వామాచారులు మకారపంచకాన్ని ఉపాసనామార్గంగా వాడతారు’ అని అంటారు. ఈ కావ్యంలో 16వ సర్గలో కావ్యలాక్షణికతకి విరుద్ధంగా సాగిన శృంగారవర్ణనలూ, మద్యమాంసవర్ణనలూ, 17వ సర్గలో నాస్తికవాదాలు పుష్కలంగా కనిపిస్తాయి. ఈ సర్గలద్వారా శ్రీహర్షుడు వామాచారపద్ధతుల్ని వివరించాడా? దీనిలో నిజం ఎంత? అవామావామార్ధే… అనే శ్లోకానికి తంత్రపరమైన అర్థం చెప్పడం కూడా సాధ్యమేనా? అన్నవాటిపై విశ్లేషణ అవసరం అనిపిస్తుంది.

శ్రీనాథుని తెనిగింపు

1. ‘అవామావామేర్ధే…’ శ్లోకం, 2. శ్రీహర్షుని సరస్వతీ వర్ణన, 3. స్వయంవరంలో ఐదుగురు నలుల్నీ సరస్వతి పరిచయం చెయ్యడం–అన్న అంశాల్ని, మన శ్రీనాథమహాకవి తెలుగులో (శృంగారనైషధమ్) ఎలా చేసి ఉంటాడు? అనే కుతూహలం తెలుగువాళ్ళకి ఉంటుంది. దాని గురించి రెండు ముక్కలు. శ్రీనాథుడు చాలావరకూ శ్రీహర్షుడి సంస్కృతపదజాలాన్నే ఉపయోగిస్తూ సమాంతరంగా శృంగారనైషధమ్6 వ్రాశాడు.

1. నారాయణీయ మల్లినాథవ్యాఖ్యలు దాదాపు క్రీ.శ. 1400 ప్రాంతాల్లో వ్రాయబడ్డాయి. అవి శ్రీనాథుడికి అందుబాటులో లేవనుకోవచ్చు. శ్రీనాథుడికి ఈ గ్రంథగ్రంథులు అవగతమయి ఉండకపోవచ్చు. శ్రీనాథుడి అనువాదం దేవతాపరంగానే ఉంది.

సకలంబై హిమరుక్కళాభరణమై సవ్యాపసవ్యార్ధ యు
గ్మక రూపంబయి శైవమై గతకళంకంబై శివంబై యుపా
సక చింతామణియై ప్రసిద్ధ భగవచ్ఛబ్దాభిధేయార్థమై
యొకమంత్రంబు మదీయమొప్పు; నది నీకుర్వీశ యే నిచ్చితిన్ (శృంగారనైషధమ్ 6-18)

వేదము వేంకటరాయశాస్త్రి గారు తమ వ్యాఖ్యానంలో6 దేవతామంత్రయంత్రస్వరూపం చెప్పబడింది అని అన్నారు గాని సరైన వివరణ ఇవ్వలేకపోయారు.

శ్రీనాథుడు తన సరస్వతీ వర్ణనని, శ్రీహర్షుడి సంస్కృతపదజాలాన్నే వాడుకుంటూ, ‘జయ జయ జనయిత్రి కల్యాణ సంధాత్రి…’ అంటూ ఒక దండకంగా రూపొందించాడు. ఇది అతని చాతుర్యానికి మచ్చుతునక.

2. నల-దిక్పాలక వర్ణనల్ని శ్రీనాథుడు క్లుప్తంగా వ్రాశాడు. ఒక సమయం వచ్చేసరికి, ‘అనియాఖండలు గురించియున్, అగ్నినుద్దేశించియున్, అంతకు లక్షించియున్, అంబుపతిన్ గూర్చియున్, త్రిభువనార్చితచరణారవిందయగు అరవిందవిభుదేవి తదీయమాయారూపంబులకున్ అనురూపంబుగా ప్రత్యేకంబ ఉభయార్థవచనసామర్థ్యంబులగు వర్ణనావాక్యంబులన్ ప్రబోధించిన…’ అని వచనంలో చెప్పేశాడు. దేవః పతిర్విదుషి నైషధరాజ గత్యా’ అనే ఐదు అర్థాలు వచ్చే శ్లోకం ప్రసక్తే లేదు.

మరో ప్రశ్న. అతని అనువాదం పైన గ్రంథగ్రంథుల ప్రభావం ఏమిటి? శ్రీనాథుణ్ణి ఈ కావ్యం తరవాత ‘డుమువుల’ కవిగా జమకట్టారు. శ్రీనాథుడిలాంటి మహాకవి సులభశైలిలో వ్రాయలేడన్నది ముమ్మాటికీ నిజం కాదు. అతని నైషధరచన మొట్టమొదటి అనువాదకావ్యం కావడం వల్ల కూడా కొన్ని సవాళ్ళని ఎదుర్కొని ఉండవచ్చు. ఆ సవాళ్ళని ఎదుర్కోగలిగే అద్భుతకవితాశక్తీ, పాండిత్యం ఉన్నవాడే అయినా, శ్రీహర్షుడు చేసిన గ్రంథగ్రంథుల హెచ్చరికే అతణ్ణి మూలాన్నుంచి దూరంగా పోకుండా నియంత్రించిందా అని అనిపిస్తుంది. మూలంలో ఉన్న సొగసుల్నీ, ధ్వనుల్నీ తన కావ్యంలో పండించాలన్న సంకల్పమే అతనిచేత ఈ పని చేయించి ఉండవచ్చని నా వ్యక్తిగతమైన అభిప్రాయం.

శ్రీనాథుడు ‘ఔచిత్యం ఆదరిస్తూ, అనౌచిత్యం పరిహరిస్తూ తెలిగించా’ అని చెప్పాడు. కొంతవరకూ ఆ మాటని నిలబెట్టుకున్నాడు. ఉదాహరణకి, మూలంలో ఉన్న ‘త్రిమూర్తుల భార్యలూ, శచీదేవీ కూడా నలుణ్ణి చూసి మోహం పొందుతారు’ అన్నదాన్ని అనౌచిత్యంగా భావించి శ్రీనాథుడు వ్రాయకుండా వదిలిపెట్టేశాడు. కాని, నలకథలో పాండవుల ప్రసక్తి తెచ్చి, ఇద్దరూ పప్పులో కాలేశారు. సంస్కృతశబ్దాల విరుపులు మొదలైనటువంటివి తెలుగులో కుదరక, మూలంలో ఉన్న సొగసులన్నీ శ్రీనాథుడు తేలేకపోయాడు. అప్పుడప్పుడు కొన్ని మూలశ్లోకాల్ని ఒక సీసపద్యంలోకి కుదించి వ్రాశాడు. ఒక్కొక్కసారి వచనాలు వ్రాసి ముందుకెళ్ళిపోయాడు. ఒకటి రెండు చోట్ల మూలం కన్న ఎక్కువ వ్రాసి వన్నె తేవడానికి ప్రయత్నించాడు. ఏది ఏమైనా, శ్రీనాథమహాకవి శృంగారనైషధమ్ శృంగారపరంగా మనోహరంగా సాగి పంచమహాంధ్రకావ్యాల్లో చేరింది.


ఉపయుక్త గ్రంథసూచి

  1. నైషధీయచరితమ్ (మల్లినాథకృత జీవాతువ్యాఖ్యాసహితమ్) రెండు సంపుటాలు – దేవర్షి సనాఢ్యశాస్త్రి, కృష్ణదాస అకాదమీ, వారాణసీ (1987).
  2. నైషధీయచరితమ్ (నారాయణకృత నైషధీయప్రకాశవ్యాఖ్యాసహితమ్) రెండు సంపుటాలు – పండిత శివదత్త శర్మ, పాండురంగ జావజీ ప్రచురణలు, ముంబయీ (1912).
  3. శ్రీహర్షనైషధము ఏడు సంపుటాలు – ఉడాలి సుబ్బరామశాస్త్రి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, హైదరాబాద్ (1971-84).
  4. నైషధతత్త్వజిజ్ఞాస – అక్కిరాజు ఉమాకాన్తమ్, పునర్ముద్రణం, సాహితీవైజయంతి, అజోవిభో ప్రచురణలు, హైదరాబాద్ (2003), పుటలు 49-76.
  5. స్వర్ణహంస – గుంటూరు శేషేంద్రశర్మ, గుంటూరు శేషేంద్రశర్మ మెమోరియల్ ట్రస్ట్, హైదరాబాద్ (1968).
  6. నైషధం సర్వంకష – వేదము వేంకటరాయశాస్త్రి, వేదం వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు (1961).

రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...