సోహం

(మనసులోని భావం, కనపడే లేదా ఊహించే చిత్రం ఒకటైతే ఆ భావం మనసులో నిరంతర దర్శనం యిస్తుంది. ఈ ఐక్యతని గుర్తించే ప్రయత్నమిది)

భావం

ప్రతి మనిషికి కన్నె వయసులా
ప్రతి మనసుకు నూత్న మధువులా
అనువిస్తూ, అనిపిస్తూ
తరవని ఒక సంద్రంలా
తరగని రస సాంద్రంలా
తిరుగాడే ప్రేమ
తపనోజ్వ్జల సీమ

అజిత సరళతర కమనీయంలా
అవని తలంచని ఆలోచనలా
అమలంగా, అమితంగా
అవనత ఘన మేరువులా
అగణిత సుఖ భావనలా
అలరించే ప్రేమ
ఆనందలలామ

చిరబంధపు నిర్మాణంలో
ద్వైతానికి నిర్యాణంలా
రససంగమ యోగంలో
సిద్ధాత్మకు పర్యాయంలా
మోహంలా, దాహంలా
మాయావృత నవ్యశిశువులా
ఆసాదిత దివ్య కాంతిలా
మోహరించే ప్రేమ
సహచరీ సుషమ

అణువణువున పునరపి జననం
క్షణక్షణమున విరచిత చరితం
అజరం, అమృతం
అవనీతల అనుశాసనికం
సరసాంకిత స్వర్గారోహం
జటిలమైన ప్రేమ
జవనాశ్వపు గరిమ

మనసును మరిగించే
ప్రేమంటే నాకిష్టం
ప్రేమను పోషించే
వయసంటే నాకిష్టం
వయసును మురిపించే
సొగసంటే నాకిష్టం
వీటన్నిటి సారూప్యం
నను పిలిచే మధురోష్ఠం

చిత్రం

మధుయామిని మృదుల మృదంగం
నీ అడుగుల తోడైనప్పుడు,
పున్నాగల సందోహంలో
వెన్నెలకే పెళ్ళైనట్లు.
తారకలే పల్లకి పడుతూ
నీ అందం కలగా కంటూ
పాలపుంతలో పరుగిడినట్లు.

నిద్రించే వ్యోమభూమిలో
అదృష్టం తలుపులు తడితే,
తార కలే ధారలు కడితే
నీ వలపుల జలపాతమ్మే
వెన్నెల్లా నాపై పడితే
కౌగిటిలో నీ తేజం
మన మమతల తరువోజం

బాధించే తీపి సుఖాలు
సుఖపెట్టే చేదు బాధలు
నువు కట్టే కదంబ మాలలు
అవి …
కలజ్యోత్స్నా కల్హారాలు
సరసాంకుని తూణీరాలు.


రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...