శ్రీమాన్ కొండ్రాజు బలాదూర్ చరిత్ర: అశ్వపర్వం

శ్రీమాన్ కొండ్రాజు బలాదూర్‌గారి కొడుకులు చూడ్డానికి బొంతకాకుల్లా ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే నక్కలు ఊళ పెడుతున్నట్టు, నవ్వుతుంటే కుక్కలు మొరుగుతున్నట్టుగా కనిపిస్తారు. వాళ్ళ వంటిరంగు నేరేడుపండులా ఉన్నా… వాళ్ళపెదాలు దొండపళ్ళలానూ, వాళ్ళ దంతాలు దానిమ్మ గింజల్లానూ మెరుస్తుంటాయి.

చెందుర్తి సంస్థానాధీశులు స్వయంభూ చక్రవర్తి కొండ్రాజు బలాదూర్ ఎందుకో కానీ ఈ మధ్య తరచూ చింతాక్రాంతులవుతున్నారు. ఏదో తెలీని బాధతో సతమతమవుతున్నారు.

ఆయన ప్రస్తుతం, ఏకశయ్యాగృహంలో పందిరిమంచం మీద శిరోభారంతో పవళించి ఉన్నారు. వంటిమీద గోచీ తప్ప ఇంకేమీ లేదు. జంధ్యాన్ని తాడులా మొలకి చుట్టేసుకున్నారు. శిరోభారం తగ్గించటానికి ఆయన సిగని పాయలు పాయలుగా విడదీసి, కర్పూరం కలిపిన కొబ్బరి నూనెని మర్దనా చేస్తోంది రాణి దేవుడమ్మాదేవి, కాలక్షేపం కోసం తేగముక్క నవులుకుంటూ. అలా చాలాసేపు చేయగా చేయగా ఆయన కాస్త స్థిమితపడ్డారు.

“చేసింది చాల్లే కానీ… నీ కొడుకుల్నిలా రమ్మనవే” లేచి కూర్చొని సిగ యథాతథంగా ముడేసుకుంటూ… దేవుడమ్మతో చెప్పిన కొండ్రాజు, నాగుపాము మీద కృష్ణపాదాల్లా ఉన్న మీసాలని రెండుచేతులతోనూ మెలేసుకొని, తలకి పగిడీ తగిలించుకొని, వీధి అరుగు మీద కొచ్చి కర్ర కుర్చీ మీద ఆసీనులయ్యారు. తైల మర్దనం వల్ల ఆయన మొహం జిడ్డోడుతూ లంకణం చేసిన రోగిలా ఉన్నారు.

అదే పనిగా తేగముక్కని నములుతున్న దేవుడమ్మ నోట్లోంచి దాన్ని బైటకి లాగి, తోటలో కర్రసాము నేర్చుకుంటున్న కుమారులని గాంచి… “ఓరే ఓరోరి కొడకల్లారా… ఓ సారిలా రండ్రా… మీ బోజ్జీ రమ్మంట్నాడూ” అని కేకేసి సగం నమిలిన తేగముక్కని నోట్లో పెట్టేసుకొని మళ్ళీ నమలడం మొదలెట్టింది.

సావకాశంగా చుట్ట వెలిగించుకుని గుప్పుగుప్పుమని పొగ వదులుతూ కొండ్రాజుగారు కొడుకుల కోసం వేచి చూశారు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వచ్చి వేటపోతుల్లా వరసగా నిలబడ్డారు వాళ్ళు ముగ్గురూ.

“ఏమయ్యిందమ్మయ్యా?” అన్నాడు జ్యేష్టుడు దేవుడమ్మపుత్ర నేలదేవుడు.

“మీ నాన్నకీ మధ్య తలపోటు దంచేత్తనాదిరా కొడకా… ” అంది నమిలేసిన తేగముక్కని మింగేసి.

“అదేవిటమ్మయ్యా ఇప్పటిదాకా చెప్పనేలేదు!” విచారించాడు మధ్యముడు దేవుడమ్మపుత్ర గాలిదేవుడు.

“ఆ… చెబితే తలదీసి మొలేత్తావని చెప్పలేదులే.” అంది ఇంకో తేగ ముక్క నోట్లో పెట్టుకుంటూ. అతను ఇంక కిక్కురు మనలేదు.

“దేవుడా… ఏమిటి దీనికి విరుగుడు! అలా అరణ్యానికి వెళ్ళి పులిపాలు ఏవన్నా తెమ్మన్నారా బాజ్జీగారూ?” అనడిగాడు కనిష్టుడు దేవుడమ్మపుత్ర నిప్పుదేవుడు.

“ఓరాపండెహే… మీ ఎదవ గోల, తలనెప్పి ఇంకా పెంచేత్తనారు.” కోప్పడ్డారు కొండ్రాజు.

అందరూ మౌనం పాటించి ఆయన వైపు చూస్తున్నారు. చపచపమని, దేవుడమ్మ తేగ నవుల్తున్న చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉందక్కడ.

చేతిలో చుట్ట వాకిట్లోకి విసిరేసిన కొండ్రాజు బలాదూర్, పక్కనే మరచెంబులో ఉన్న మంచినీళ్ళు నోట్లో పోసుకుని పుక్కిలించి ఊసి ‘హుఁహుఁహుం’ అంటూ ఓ సారి గొంతు సవరించుకుని “మన సంస్థానంలోని భూములూ, కౌలు లెక్కలూ మీకెవరికన్నా తెలుసా?” అని ప్రశ్నించారు ముగ్గురు కొడుకుల మొహాల్లోకీ గుచ్చి గుచ్చి చూస్తూ. తెలియదు అన్నట్టు తలలు అడ్డదిడ్డంగా ఊపి తెల్లమొహాలేశారు ముగ్గురూ.

“కత్తిపూడి పక్కన పులికొండ మొత్తం మనదే. వెయ్యీ అయిదొందల ఎకరం అది. వజ్రకూటం కొండెక్కి దిగితే అక్కడ ఐదు వందల ఎకరాల మామిడి తోట. అదీ మనదే. కొడవలి కొండంతా మనదే, అదో రెండొందల ఎకరాల దాకా ఉంటది. ఇక వడ్డీలకిచ్చిన డబ్బులు ఎంతుంటాయో లెక్కలు తేల్చాలి. వడ్డీ కింద లాక్కున్న జనాల భూములు ఎన్నెకరాలున్నాయో పద్దులు చూసుకోవాలి.”

కొడుకులతో పాటూ దేవుడమ్మగారు కూడా ఆస్తుల వివరాలు ఆసక్తిగా వింటున్నారు, తేగముక్క నవలడం మర్చిపోయి. ఓసారి అందరి వంకా చూసిన కొండ్రాజుగారు మళ్ళీ మొదలెట్టారు.

“నేను ఇంక నా రాజు పదవికి రాజీనామా చేసెయ్యాలనుకుంటున్నా…”

ఎక్కడో ‘దడేల్ దడేల్’ మంటూ ఓ ఉరుము ఉరిమింది. ఇంకెక్కడో ‘దడ్ దడ్’ మంటూ రెండో మూడో పిడుగులు పడ్డాయి. ఆ వెంటనే మెరుపు మెరిసి మాయమయ్యింది. తర్వాత నిశ్శబ్దం నిస్సిగ్గుగా నాట్యమాడ్డం మొదలెట్టింది. ఆ నిశ్శబ్దాన్ని తరిమేస్తూ…

“మీలో ఒకరికి పట్టాభిషేకం చేసి, సంస్థానం… ఆస్తిపాస్తులని అభివృధ్ధి చేసే బాజ్జతలు అప్పగించాలనుకుంటున్నా. నాకు మీ ముగ్గురూ సమానవే. ఆస్తులంటే సరి సమానంగా పంచీయొచ్చు. రాజు పదవి అలాక్కాదు కదా! ఎవరికో ఒకరికే ఇవ్వాలి. శాత్రం ప్రకారం పెద్దకొడుక్కే ఇయ్యాలనుకోండి. కానీ నేను శాత్రాలు గీత్రాలు పట్టించుకునే రకం కాదు. మీలో యోగ్యుడికి నా పదవిని ఇవ్వాలనుకుంటున్నా.”

“ఏంటీ ఆస్తులన్నీ కొడుకులకిచ్చేస్తావా? నా నోట్లో మన్ను కొట్టేద్దామనుకుంటున్నావా? అదెలా కుదురుద్దీ? నువ్వొకేల గుటుక్కుమంటే… నా గతేం కావాల, నేనే గోదాట్లో దూకాల? ముందు నా వాటా నాకు తెగ్గొట్టీసి అప్పుడు నువ్వూ నీ కొడుకులూ ఏ చావు చత్తారో చావండి.” గయ్‌మంది దేవుడమ్మగారు, నమలడం మర్చిపోయిన తేగ ముక్కని తుపుక్కున ఊసేసి.

“నువ్వూరుకోవాసె… తింగరి గంప! నీ మూలానే నా బతుకిలా తగలడిపోయింది. నోర్మూసుకొనొచ్చి ఈపు గోకు.” కయ్యిమన్నారు కొండ్రాజు బలాదూర్. దేవుడమ్మ ఇంకో తేగ ముక్క నోట్లోకి తోసి, వీపుగోకుడుకి ఉపక్రమించింది. ఆవిడలా వీపు గోకుతుంటే చాలా హాయిగా ఉందాయనకి. మాటలు వరదలా పొంగుకొస్తున్నాయి.

“ఎద్దుల్లా ఎదిగినా మీకు ఇప్పటిదాకా పిల్లనివ్వడానికి ఎవడూ ముందుకు రాట్లేదు ఎందుకూ? మనకి కోట ఉంది! సంస్థానం ఉంది! ఆస్తుంది! అంతస్తుంది! అయినా ఎవరూ ఎందుకు రాట్లేదు. ఎందుకనీ? …ఎందుకనీ?” ఆయన ప్రశ్న అక్కడ ముమ్మారు ప్రతిధ్వనించింది.

“నువ్వు ఊ అను బాయ్యా… తెల్లారేప్పటికి నాకొడుకులకి మనువులు చేసేసి నేనత్తరికం జేపడతాను.” అంది దేవుడమ్మగారు గోకడం ఆపేసి, రెండు చేతులతోనూ కొండ్రాజు వీపు మీద సరసంగా చెళ్ళున చరుస్తూ.

“నీ యమ్మాకడుపుకాల చంపేసావే కదే…” అని బాధగా అరచి “నువ్విక్కడనుంచి పోతావా, లేపోతే బోరకొరికి చంపీయనా!” అంటూ గాండ్రించారు.

సరసం విరసం అయింది. ఆయన ఆవేశం చూస్తే… అన్నంత పనీ చేస్తాడేమోనన్న భయంతో, దేవుడమ్మాదేవి అక్కడ నుంచి దూరంగా జరిగి, బొడ్లో దోపుకున్న కొత్త తేగని లాక్కుంది.

కొండ్రాజు బలాదూర్ తమవైపే తీక్షణంగా చూడ్దం గమనించి… “అది కూడా మీరే చెప్పండి బాజ్జీగారూ,” అన్నారు కొడుకులు ముగ్గురూ ముక్తకంఠంతో.

“మనకి చెప్పుకోడానికి చరిత్ర లేదు. అది లేకపోవడమే నా శిరోభారానికి మూలం. అవును ఏం ఉన్నా లేకపోయినా పాలకులకి చరిత్ర ముఖ్యం. అదెంత బాగుంటే… అంత బాగా మనం గుర్తింపు పొందుతాం. అర్ధవయ్యిందా? అందుకని మనం మన చరిత్రని రాయించుకోవాల! అవసరమైతే అసలు చరిత్రలని తిరగ రాయించెయ్యాల. అడ్డొస్తున్నాయనుకుంటే ఆ పాత చరిత్రలని చింపి పారెయ్యాల! అందుకనే బాగా ఆలోచించి మీలో ఎవరు మన చరిత్రని ఘనంగా రాయిస్తారో… వాళ్ళకే నా ఈ సింహాసనం, నా ఈ కిరీటం అని నిశ్చయించుకున్నాను.” అంటూ కుర్చీ చెక్కలమీద రెండు చేతులతో కొట్టి, సిగమీద ఉన్న పగిడీని ఓచేత్తో తీసి ఇంకో చేత్తో తల బరుక్కున్నారు.

“అలాగే బాజ్జీగారూ, ఇప్పుడే తాటాకులు నరుక్కొస్తాను.” అన్నాడు దేవుడమ్మ పుత్ర నేలదేవుడు.

“తిరంమాలినెదవా తాటాకులెందుకురా ఇప్పుడు?” గద్దించారు కొండ్రాజు.

“చరిత్ర రాయాలంటే తాళ పత్రాలుండాలి కదా!” ఆ మాత్రం తెలదా అన్నట్టు చూశాడు నేలదేవుడు.

“అఘోరించేవులే… మా తాతలనాడే కాయింతాలొచ్చేశాయి. మీరు మంచి కవినట్టుకొత్తే చాలు, తాటిచెట్లూ ఈతచెట్లూ ఎక్కక్కల్లేదు.” హుంకరించారు బలాదూర్.

“రాజాజ్ఞ!” అంటూ ముగ్గురూ తలవంచి నమస్కారం చేసేరు.

“ఓరె అలాగలాగేనని… మీరెళ్ళిపోతే కుదరదు. ముందు ముగ్గురూ అలా మూడు గేలాలట్టుకెళ్ళి ఏడు చేపలనేటాడి ఇక్కడడేసి ఎక్కడకి పోతారో పొండి. నేను మీ బాబుకి ముద్దొండి పడెయ్యాల.” హెచ్చరించింది దేవుడమ్మ.

“నువ్వెదవ రాచరికం చేస్తే… వీళ్ళచేతే నిన్ను నరికించి… కాకులకీ గెద్దలకీ ఏయించేత్తాను ఏమనుకుంటున్నావో…” అంటూ కర్ర సింహాసనంలోంచి లేచి దుడ్డుకర్ర కోసం అటూ ఇటూ వెతికారు బలాదూర్. దాంతో దేవుడమ్మ అక్కడ నిలబడకుండా లోపలకి ఒక్కంగలో పారిపోయింది.

“కొడకల్లార… ఇంకొక్క విషయం. మీరెన్ని దిక్కులకైనా పొండి కానీ… కొట్టాం సంస్థానం వైపు మాత్రం వెళ్ళకండ్రా నాయనా…” కొండ్రాజుగారు ఆజ్ఞాపించారు.

“చిత్తం.” అని ముగ్గురూ అక్కడనుంచి నిష్క్రమించారు.

వాళ్ళు వెళ్ళిన తర్వాత కొండ్రాజు ‘ఎవరక్కడ!’ అంటూ చప్పట్లు చరిచారు. ఎడం వేపు నుంచి ఓ నల్లకుక్క తోకూపుకుంటూ వచ్చింది. మళ్ళీ ‘ఎవరక్కడ!’ అంటూ రెండుసార్లు చప్పట్లు కొట్టారు. ఈసారి కుడేపు నుంచి ఓ ఎర్రకుక్క కుయ్ కుయ్ మంటూ వచ్చింది. బలాదూర్‌వారు దండెం మీదున్న అంగవస్త్రం, మల్లు పంచీ లాగి, అంగవస్త్రం మొలకి చుట్టుకున్నారు. మొలనున్న జంధ్యం భుజానికి అలంకరించుకున్నారు. మల్లుపంచిని భుజాల చుట్టూ మెడమీదుగా కప్పుకున్నారు.

రెండు కుక్కలూ దారి చూపిస్తుంటే… వారు వారి ఉద్యానవనంలో విహరించసాగారు.


స్వయంభూ చక్రవర్తి కొండ్రాజు బలాదూర్‌వారి ఆదేశాల ప్రకారం వారి కొమరులు మువ్వురూ మూడు దిక్కులకీ అశ్వాల మీద పయనమయ్యారు. పితృవాక్యపరిపాలన చేస్తూ కొట్టాం సంస్థానం ఉన్న నాలుగోదిక్కుని వారు తమ ఆలోచనల్లోకి రానివ్వలేదు.

యువరాజులవారికి ఇదే తొలి దేశాటన. ఇప్పటి వరకూ ఎప్పుడూ సంస్థానందాటి కాలు బయట పెట్టిన పాపాన వారు పోలేదు. తమ జనకులు కొట్టాం వైపు ఎందుకు వెళ్ళొద్దన్నారో… వాళ్ళకి ఎంత ఆలోచించినా అర్ధంకాలేదు. మనకెందుకులే… ఏదో ‘రాజపుత్రరహస్యం’ దాగి ఉంటుందని సరిపెట్టుకున్నారు. అవసరం అయినప్పుడు ఆయనే సెలవిస్తారులే అని తలపోశారు. ఎవరు ఎటు వెళ్ళాలి అన్న దాని మీద మల్లగుల్లాలు పడి, ముగ్గురూ మూడుసార్లు ఆలోచించుకొని… ఎవరి దార్లు వారు ఎంచుకున్నారు. పెద్దవాడైన నేలదేవుడు గిరిసీమని ఎంచుకొని రంపఎర్రంపాలెం వైపు తమ గుర్రాన్ని పరుగులుదీయించాడు. రెండోవాడు గాలిదేవుడు మహా సూక్ష్మగ్రాహి. నన్నయ్యభట్టు గారి బంధువులెవరైనా రాన్మహేంద్రవరంలో దొరికితే తమ చరిత్రకి మరింత సార్థకత వస్తుందని అతనికో స్థిరమైన అభిప్రాయం ఏర్పడింది. దాంతో అతను రాన్మహేంద్రవరం వైపు అశ్వాన్ని అదిలించగా… మూడవవాడైన నిప్పుదేవుడు తమ గోడాని కోటరామచంద్రపురం వైపు దౌడు తీయించారు.

బాహ్య ప్రపంచం ఎరుగనివారు కావడంతో రాకుమారులకి ఆ ప్రయాణం ఎంతో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగిస్తోంది. గుర్రం మీద కూర్చున్న వాడికేంటి నొప్పి? వాడి బరువు మోసే గుర్రానికి నెప్పిగాని. సరిగ్గా అదే జరిగింది. నిప్పుదేవుడు పిఠాపురం సంస్థానం మీదుగా కాకినాడ దాటి కోరంగి చేరాడు. కోరంగి వారి మాతామహుల స్వగ్రామం అని అతను లోగడ విని ఉన్నాడు. ఓసారి గుర్రం దిగి ఆ పవిత్ర భూమిని కళ్ళకద్దుకున్నాడు. తర్వాత గుర్రాన్ని పరాసువారి ఏలుబడిలోవున్న యానాం ఏటిగట్టెక్కించి గమ్యస్థానం వైపు దూసుకుపోయాడు. అలా కొన్ని యోజనాల దూరం పరిగెత్తాకా నిప్పుదేవుడి గుర్రం కోలంక శివారు పెదలంక చేరింది. ఆకలి, దప్పికలతో ఇక అడుగు ముందుకు వేసేది లేదంటూ మొరాయించింది. ఆ విషయం చెబుతున్నట్టుగా గాల్లోకి రెండు కాళ్ళూ ఎత్తి ‘హిహిహీ’ అంటూ సకిలించింది. ఇక చేసేదేమీ లేక ఏటిగట్టున ఉన్న రావిచెట్టు కింద గుర్రాన్ని నిలిపి… నిప్పుదేవుడు కిందకి దిగి, దాని ఆకలి తీర్చటం కోసం పక్కనే ఉన్న పచ్చగడ్ది పీకడం మొదలెట్టాడు. అప్పుడెప్పుడో కాటన్ దొరకూడా తన గుర్రాన్ని అక్కడే నిలిపి కాస్సేపు విశ్రాంతి తీసుకున్నట్టు పెద్దలు చెబుతుంటారు కానీ ఆ విషయం నిప్పుదేవుడికి తెలీదు.

గోదావరిలంకలోంచి అప్పుడే నావ దిగి నెమ్మదిగా ఏటిగట్టు ఎక్కుతున్నారు శ్రీరాజా వత్సవాయి శ్రీశ్రీనివాసరాజుగారు. వారి ఆలోచనలన్నీ జోజో బాబుగారి వంటగది చుట్టూ తిరుగుతున్నాయి. మాంసాహారం ఏమి చేసి ఉంటారా అని ఆయన మేధ మథనానికి గురవుతోంది. ఏటిగట్టు ఎక్కుతూ ఎక్కుతూ… దూరం నుంచే చెట్టునీడన విశ్రమిస్తున్న నిప్పుదేవుడి గుర్రాన్ని చూసి తమ ఆలోచనలనీ, ఆలోచనలవల్ల వచ్చిన అలసటనీ మర్చిపోయారు. రోజూ బస్కీలు, దండీలు తీసి కావడిబద్దలా కాయాన్ని మలుచుకున్న శ్రీశ్రీనివాసరాజుగారికి జోజో బాబుగారి వంటగదే దండపుష్టిని పెంచింది. పాతికకి అటూ ఇటూగా ఉంటుంది ఆయన వయస్సు. పొడుగ్గా ఉండి పంచకట్టు మీద లాల్చీవేస్తూ… ఎప్పుడూ నెత్తిమీద పాగాతో అలలారుతుంటారు. నల్లటి గుర్రాన్ని చూడగానే ఆయనకి ఎక్కడా లేనంత సరదా వేసింది. గుడిచుట్టూ తిరిగినట్టు పంచె కొసని చేత్తో పట్టుకొని ముమ్మారు గుర్రంచుట్టూ తిరిగారు.

‘అబ్బ ఎంత మంచి శకునమో! ఇలా నీటిలోంచి దిగి నేల మీద కాలెట్టేసరికి అశ్వదర్శనం అయింది. ఇక తన దశ తిరిగిపోయినట్టే.’ గుర్రం మీంచి దిగినవాడు కాస్త పగటివేషగాడిలా ఉంటే ఉన్నాడు కానీ, గుర్రం మాత్రం మహ బేషుగ్గా ఉందనుకున్నారు. బహుశా ఈ కుర్రకుంక నవరాత్రి నాటకాలాడ్డానికి వెళ్తున్న ఔత్సాహిక నటుడయ్యుంటాడని తీర్మానించుకున్నారు. గుర్రం చుట్టూ తిరుగుతూ దాని సుడులూ సొట్టలూ పదేపదే పరికించి చూశారు. ఖచ్చితంగా ‘పంచకల్యాణే’ అని నిశ్చయించారు. పచ్చగడ్డి పీకుతున్న నిప్పుదేవుడు క్రీగంట శ్రీశ్రీనివాసరాజుగారిని చూస్తున్నాడు. ‘ఈడెవడు కొంపదీసి గుర్రాల దొంగగానీనా?’ అన్న అనుమానంతో పచ్చగడ్డి పీకే పనాపి అక్కడకి వచ్చేడు.

“ఎక్కడ పట్టేవో గానీ మంచిగుర్రమే పట్టేవోయ్ కుమారం. శ్రీమాన్ అగ్నివర్మ ఈ గుర్రాన్నే ప్రామాణికంగా తీసుకొని అశ్వశాస్త్రం రాసి ఉంటారు సుమీ! కొంపదీసి కోటిపల్లి తీర్థంలో అమ్మెయ్యడానికి గానీ తోలుకెళ్తున్నావా? అయితే గియితే ఏం ధర చెబుతున్నావోయ్ కుమారం? మా దేవుడు చిట్టిబాబ్బావ మంచి గుర్రాన్నెంచాలోయ్ శ్రీని అన్నారీ మజ్జే…” అడిగారు శ్రీశ్రీనివాసరాజుగారు.

“ఆం… ఏం అనుకుంటున్నారు మా గురించి? గుర్రాలమ్మే వాళ్ళలా కనిపిస్తున్నామా? మేము చెందుర్తి దివాణాలం. దేవుడమ్మపుత్ర నిప్పుదేవ నామధేయులం,” అన్నాడు నిప్పుదేవుడు గంభీరంగా.

“అబ్బో… ఆహాఁ. ఇలా దగ్గరకిరా. నా మూతోసారి వాసన చూడు,” అంటూ తన మొహాన్ని నిప్పుదేవుడి మొహం మీదకి జరిపారు.

“చీ చ్చీ… ఏంటిది తమాషాలా?”

“తమాషాలూ కాదు. కులాసాలూ కాదు. మా తాతలు నేతులు తాగేరులే, ఆ వాసన ఏమన్నా వస్తుందా? లేదా? అని పరీక్షించమంటున్నా…”

“చేష్టలు శ్రుతి మించుతున్నాయి. బిగించి కొట్టానంటే రేపట్నుంచి దంతధావనానికి దూరం అయిపోతావ్!” అన్నాడు నిప్పుదేవుడు పిడికిలి బిగించి.

“నాటకం రాత్రాడేశారా? ఈ రాత్రిక్కానీ ఆడతారా? పాత్రలో తెగ జీవించేస్తున్నావులే. ఏ ఊళ్ళోనేటి నాటకం?” అన్నారు శ్రీశ్రీనివాసరాజుగారు తన ధోరణి మార్చకుండా.

“మీరేమనుచుంటిరో… మాకు అవగతం కావడం లేదు.”

“అవుద్ది అవుద్ది… టెంకి మీద రెండిచ్చుకుంటే అప్పుడు బాగా అవుద్ది కుమారానికి.”

“ఓరీ మూర్ఖుడా! ఎవరనుకుంటున్నావ్రా? చెబితే అర్ధంకాదా? మా తల్లిగారు కూడా ఎప్పుడూ మాకింత చిరాకు రప్పించలేదు.” అంటూ బొడ్లోంచి సర్రున కత్తిని లాగాడు నిప్పుదేవుడు. కోపంతో అతని కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. ‘చూడ్డానికి ఉడుములు పొడిచేవాడిలా ఉన్నా వీడి వాలకమూ, ఆ కత్తీ, ఆ వ్యవహారం చూస్తుంటే వీడు చెప్పేది నిజమా ఏమిటీ’ అన్న అనుమానంలోంచి వచ్చిన ఆలోచనలో పడ్డ శ్రీశ్రీనివాసరాజుగారు కొంచెం వెనక్కి తగ్గారు.

“కరవాలం పట్టుకున్న ఒడుపూ… లాగిన వేగం చూస్తుంటే ఏ ద్రోణాచార్యులదగ్గరో యుద్ద విద్యలభ్యసించినట్టుంది కుమారాలు…”

“హ హ్హ” అని నవ్వి, అప్పుడప్పుడే వస్తున్న మీసాన్ని గర్వంగా దువ్వాడు నిప్పుదేవుడు.

“కత్తికి కొంచెం సానపట్టిస్తే తళతళ్ళాడుతుండునేమో…”

“అవునవును. ఒరలోంచి దాన్ని విసురుగా లాగి చాలా రోజులయ్యింది.”

“తమ గురుదేవుల పేరేమిటండీ కుమారం?”

“ఈటెపోటు వీరన్న గురుదేవులు.”

“ఈటెపోటు వీరన్న గురుదేవులా?”

“అవును అడవిపందుల వేటలో ఆయన ఈటెకి ఎదురే లేదు. వేట మాంసం నరకడంలో ఆయన కత్తికి సాటే లేదు.” మళ్ళీ మీసం తిప్పాడు నిప్పుదేవుడు.

“హతవిధీ… తమరిదే సంస్థానం అన్నారు.”

“చెందుర్తి.”

“ఏ ఫిర్కాయో?”

“వెటకారమా? కండకావరమా? ఏ ఫిర్కా ఏంటి? ఈ జిల్లాయే.”

“చిత్తం. గృహనామం ఏదో చెప్పినట్టున్నారు.”

“ఇంకా చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నా… చెందుర్తివారం. ధనంజయగోత్రం సూర్యవంశం.”

“చెందుర్తివారా?”

“ఏం, ఎప్పుడూ వినలేదనే కదా మీ అనుమానం?”

“చిత్తం చిత్తం.”

“వత్సవాయిలో ఉండేవారు వత్సవాయోరు, దంతులూరులో ఉండేవారు దంతులూరోరు అయినప్పుడు చెందుర్తిలో ఉండేవారు చెందుర్తి వారవటానికి మీకేమిటి అభ్యంతరం?” హుంకరించాడు నిప్పుదేవుడు.

“మరే మరే. మీకు లేని అభ్యంతరం మాకేవిటో…”

“అద్గదీ అలా అన్నారు బాగుంది.”

“చెందుర్తి సంస్థానం తమకి ఎక్కడనుంచి దఖలు పడిందో? చరిత్రలో ఇజియనగరం, పెద్దాపురం, బొబ్బిలి, పిటాపురం ఇత్యాదులే కనబడుతుంటాయి…” గడ్డంమీద వేలితో కొట్టుకుంటూ ఆలోచనలోకి వెళ్ళారు శ్రీశ్రీనివాసరాజుగారు.

“అదేకదా మా ఆవేదన. మా చరిత్ర రాయటానికో కవిపుంగవున్ని వెదకి పట్టుకోవటానికే… మా ముగ్గురు అన్నదమ్ములం బయలుదేరాం…”

“మంచిపని చేశారు కుమారాలు.”

“మా అన్నలిద్దరూ కూడా కవి వేట లోనే ఉన్నారు. వారికి ఇంకా కనిపించాడో లేదో కానీ నాకు ఇప్పుడే కనిపించాడు కవి.”

“అవునా…ఎక్కడా? ఎవరూ?” తనచుట్టూ తాను బొంగరంలా తిరిగి చూసి, కుతూహలంగా అడిగేరు శ్రీశ్రీనివాసరాజు.

“మీరే… మీ విషయ పరిజ్ఞానం నన్ను అబ్బురపరుస్తోంది. మీ చమత్కార సంభాషణా శైళి మమ్మాకుట్టుకున్నది. మా చరిత్ర రాసే భాగ్యం మీకే గుత్తకివ్వాలని నిర్ణయించాను.”

“నాకా… బ్రహ్మాండం. బ్రహ్మాండం. మరి అన్న కుమారాలిద్దరూ మరో ఇద్దరిని తీసుకొచ్చేస్తేనో?” ఆందోళనగా అన్నారు చేతులు జోడిస్తూ.

“తీసుకొస్తే తీసుకు రానిండు! మహాభారతాన్ని ముగ్గురు రాయలేదా? అంతకన్నా ఎక్కువే ఉంటది మా చరిత్ర.”

“చిత్తం చిత్తం.”

“మీరు వస్తే… మిమ్మలని మా జనకుల వద్దకి తోడ్కొని పోయెదను.”

“మహద్భాగ్యం, మహద్భాగ్యం. లేడికి లేచిందే పరుగంటే ఎలా కుమారం? తమబోటివారు ఇలా చెట్లకింద పుట్లకింద విశ్రమించడం ఏమిటి ఖర్మ కాకపోతేను. ఇక్కడే ఈ పక్కనే జోజో బాబుగారని మా బావగారున్నారు. అసలు పేరు దాట్ల జో అచ్యుతానంద జోజో ముకుంద రాజుగారనుకోండి. ఆయన చరిత్రంటే చెవి కోసేసుకుంటారు. మనవోసారి ఆయన్ని కలిసి, అతిథి మర్యాదలు అవీ స్వీకరించి, మదర్పిత చందనతాంబూలాదులు గైకొన్నాకా తమరు తమరి పవిత్ర చరిత్ర రాసే బాజ్యతని నాకు దఖలు పర్చారని, నా ప్రయోజకత్వం గురించి వారికో రెండు మంచి ముక్కలు చెప్పేస్తే… మనం బయలుదేరి పోవచ్చు. కుమారాలు కాదనకూడదు మరి.” బుజ్జగించారు శ్రీశ్రీనివాసరాజుగారు.

“అటులనే పోవుదం రండు.” అంగీకరించాడు నిప్పుదేవుడు.

ఎండిపోయిన ఇంజరంకాల్వ లోకి నిప్పుదేవుడు గుర్రాన్ని దింపి నడిపిస్తుంటే… శ్రీశ్రీనివాసరాజుగారు ముందుండి దారి చూపిస్తూ… దాట్లవారి మండువా వైపు కదిలారు. ఊరకుక్కొకటి రాజుల జంటని చూసి అదేపనిగా మొరుగుతుంటే… నిప్పుదేవుడు కత్తి చూపించి తరిమేశాడు.

“ఏనుగు వెళ్తుంటే కుక్కలలా మొరుగుతుంటాయి, తమరు ఇలాంటివి పట్టించుకోకూడదు.”

“ఆహా… అద్భుతం. అమోఘం. మీరు మా అనుగ్రహానికి మరింత పాత్రులయ్యారు” అన్నాడు నిప్పుదేవుడు.

“అంతా తమ దయ.”

“మిమ్మలని మా సంస్థాన విద్వాంసుడిగా నియమించమని మహారాజుకి సిఫారసు చేస్తాను.”

“చిత్తం చిత్తం. ఇదే జోజోగారి మండువా. లోపలకి దయచేయండి,” అంటూ ప్రహరీ గేటు లోపలకి తోశారు శ్రీశ్రీనివాసరాజుగారు. ఇద్దరూ ప్రహరీ దాటి లోపలకి వెళ్ళారు. నిప్పుదేవుడి చేతిలో కళ్ళాన్ని అందుకొని, గుర్రాన్ని పశువుల చావిట్లో కట్టేశారు శ్రీశ్రీనివాసరాజుగారు. అక్కడే ఉన్న పచ్చగడ్డి మోపుని స్వయంగా విప్పి దానికి వడ్దించారు. నిప్పుదేవుడు తనని తాను మర్చిపోయి దాట్లోరి మండువా లోగిలిని నోరు ఆవలించి చూడ్డం మొదలెట్టేడు.

“ఆ ఇదెంత మండువా అండీ! గుడ్డులో మండువా? తమకోటతో పోలిస్తే… ఓ గిద్దంత ఉంటుందేమో కదా! రండి రండి, కందా మూసేస్తే మనకి దుప్పి భోజనమే గతి…” అంటూ తొందర పెట్టేరు.

వీధి అరుగు మీద, పులిచర్మం కుర్చీలో కాళ్ళు చాపుకొని కూర్చొన్న జోజో ముకుందరాజుగారు వాళ్ళిద్దరినీ దూరం నుంచే చూశారు. ఆయన కుర్చీ ముందు పావులు పేర్చిన చదరంగం బల్ల ఉంది. చేతులు కట్టుకుంటూ వెళ్ళి ఆయన ముందు నిలబడ్డారు శ్రీశ్రీనివాసరాజుగారు.

“ఏమోయ్ శ్రీని ఇలా పిట్టలదొరల్నీ, పుగాకుచుట్టలనీ… వెంటేసుకు రావొద్దంటే ఎప్పుడూ కుక్కతోక వ్యవహారమేనా?”

“హమ్మమ్మ పొరపడ్డారు తమరు. ఈయన నిప్పుదేవుడని చెందుర్తి యువరాజావారు బావగారూ. నా చేత తమ వంశచరిత్ర రాయించుకోవాలని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చాలా దూరం నుంచొచ్చారు. మీ దర్శనం చెయ్యిద్దామని తీసుకొచ్చా.”

నిప్పుదేవుడు అదేమీ పట్టించుకోకుండా మండువా లోగిలికి వున్న టేకుదూలాలని, వాటి నగిషీలని అదే పనిగా చూస్తున్నాడు.

“యువరాజా? నీ ఎదం రాజా? పిసరంత రాచపోలిక కనపడ్డం లేదు వాడి మొహంలో. పోయి బుక్కేసి రండి, ఓ ఎత్తేద్దాం. పోయేటప్పుడు వాడినోసారి తడిమి చూడు. నాకు ఎందుకో నీ నేస్తు మీద అనుమానంగా ఉంది.”

“చిత్తం.” అంటూ శ్రీశ్రీనివాసరాజుగారు మొహం చిన్నబుచ్చుకొని, నిప్పుదేవుడిని వెంటబెట్టుకొని వంటింటి వైపుకి వెళ్ళారు. వీళ్ళిద్దరినీ చూడగానే రాచకొడుకు ముదునూరి విశ్వనాథం మొహం ధుమధుమలాడించాడు. ‘వంటిల్లు సద్దేద్దాం అనేప్పటికి, తగుదునమ్మా అని తగలడిపోతారు. ఓ గంట ఇశ్రాంతికి కూడా నోచుకోలేదు ఎదవ జన్మని’ అని మనస్సులోనే తిట్టుకుంటూ నేలబంతిన వడ్డన మొదలెట్టాడు. ముమ్మారు మాంసాలు, ఇనమారు పప్పులుసులూ వడ్డించుకొని… నాటుకోడి పలావూ, రొయ్యల వేపుడూ, చేపల పులుసుతో సుష్టుగా భోజనం ఆరగించేశారు ఇద్దరూ.

“యువరాజులకి సంతుష్టి అయినట్టు లేదు? తమ దేవిడీలో అయితే అయిదార్రకాల పిట్టమాంసాలు, నాలుగైదు రకాల వేట మాంసాలూ ఉంటాయేమో?” అడిగారు శ్రీశ్రీనివాసరాజుగారు. నిప్పుదేవుడేమీ మాట్లాడలేదు. అతనికి ముక్కులోంచి, కళ్ళంటా నీళ్ళు వస్తున్నాయి. చెవుల్లోంచి మషాలా ఘాటు తన్నుకొచ్చేస్తోంది. నోరు విప్పితే నాలుక మంటలేస్తోంది.

“తవరలా వీధిలోకి దయచేస్తే… నేనోమారు మా అప్పయ్యగారిని దర్శించుకు వస్తాను.” అంటూ నిప్పుదేవుడికి దారి చూపించి కందా గుమ్మం దగ్గరికి వెళ్ళేరు శ్రీశ్రీనివాసరాజుగారు. తలుపు చాటున జోజో ముకుందరాజుగారి భార్య నరసమాంబగారు నిలబడి ఉన్నారు. ఆవిడ గాజుల చప్పుడు వినిపిస్తోంది తప్ప మనిషి కనపడ్డం లేదు.

“అప్పా తేలిగ్గా ఉందా తమరికి?”

“అయ్యా…”

“అంతా కులాసాయేగా?”

“అయ్యా… కన్నమ్మని ఓ సారి తీసుకు రాపోయేరూ. నావ దగ్గరకి మీనా పంపుదురు కదా.”

“అలాగలాగే… ఆవకాయరోజులొస్తున్నాయి కదా! కత్తెర్లు వెళ్ళిపోయాకా తీసుకు తెచ్చుకుందురుగాని లెండి.”

“అలాగే మరి, ఏదో రాచకార్యం మీద ఉన్నట్టున్నారు. విజయం చెయ్యండైతే.” అన్నారు నర్సమ్మగారు ఇక వెళ్ళి రమ్మన్నట్టు.

“సెలవప్పా మరి.” అని గబగబా వీధిలోకి వచ్చేశారు శ్రీశ్రీనివాసరాజుగారు.

నిప్పుదేవుడు జోజో బాబుగారి కుర్చీ వెనక నుంచొని, కుర్చీకున్న పులిచర్మాన్ని నిశితంగా పరీక్షిస్తుంటే జోజోబాబు మెల్లగా కునుకు లాగుతున్నారు.

“యువరాజులు ఏమిటో పరిశీలిస్తున్నట్టున్నారు. జోజోగారితో ఓ ఎత్తు ఏద్దామా?” అన్నారు శ్రీశ్రీనివాసరాజుగారు.

“వద్దొద్దు,” అన్నాడు కంగారుగా నిప్పుదేవుడు.

నిద్రిస్తున్న జోజో బాబు అకస్మాత్తుగా ‘అమ్మా’ అంటూ గట్టిగా కేకపెట్టి గుండె పట్టుకుని విలవిల్లాడారు. “ఏమయ్యింది బావా…” అంటూ దగ్గరకెళ్ళారు శ్రీశ్రీనివాసరాజుగారు. “గుండెల్లో నొప్పిరా శ్రీని… అబ్బా!” అంటూ ఎగిరెగిరి పడ్డం మొదలెట్టేరు.

“ఒరే ఒరే ఎవర్రా పెరట్లో… రాజుగారికి నీరసం చేసింది రండి రండి,” కేకలుపెట్టారు శ్రీశ్రీనివాసరాజుగారు. నిప్పుదేవుడు ఏం చెయ్యాలో తెలీక జోజోగారి మొహంలోకి చూస్తున్నాడు. లోపలున్న నౌకర్లంతా వీధిలోకి వచ్చేసేరు. ‘ఆచార్యులగారిని తీసుకు రమ్మని’ ఒకర్ని పంపితే. సలహా కోసం ఊళ్ళో పెద్దరాజులని పిలడానికి ఇంకో ఇద్దరు పరిగెత్తారు. జోజో బాబుకి వళ్ళంతా చెమట్లు పట్టాయి.

“రండి, నా గుర్రం ఎక్కించండి. దగ్గర్లో ఉన్న వైద్యశాలకి తీసుకుపోదాం.” అన్నాడు నిప్పు.

“ఏం బావా కూర్చోగలరా….” శ్రీశ్రీనివాసరాజుగారు మాట పూర్తి కాకుండానే జోజో బాబు తల వాల్చేశారు. ఊళ్ళో రాజులంతా ఒకరి తర్వాత ఒకరు అక్కడికి చేరుకొంటుంటే… విషయం తెలిసిన రాచకుటుంబాల్లోని ఆడవాళ్ళు పెరటి గుమ్మం నుంచి మధ్యగదిలోకి జమ అవుతున్నారు.


దేవుడు చిట్టిబాబుగారి గుర్రం ప్రహరీ గేటు దాటొచ్చి, పెద్దగా సకిలిస్తూ రెండుకాళ్ళూ పైకి ఎత్తి నిలబడిపోయింది ఎటూ కదలకుండా. ‘ఇదేంటిదీ…’ అనుకుంటూ ఆయన కొంత ఆశ్చర్యానికి లోనయి, అటూ ఇటూ అనుమానంగా చూసి, జీనులోంచి పొన్నుకర్ర తీసుకొని గుర్రం దిగ్గానే… అది ఓ మూలకి పరిగెత్తుకుంటూ పోయింది. దేవుడుగారు దుబ్బు మీసాలు దువ్వుకుంటూ మిగతా రాజులతో మాట్లాడుతున్నా ఆయన దృష్టంతా ఆయన గుర్రం మీదే ఉంది.

“అరరే ఎంత పని జరిగింది. బాధపడకండి. మీరు మీ కార్యక్రమాలు అన్నీ అయ్యాకే… వీలు చూసుకొని మా సంస్థానానికి దయచేయండి…” దూళ్ళ చావిడి దగ్గర నిప్పుదేవుడు శ్రీశ్రీనివాస రాజుగారిని ఓదారుస్తున్నాడు. ఈ కొత్త చుట్టం ఎవడా? అని రాజులంతా నిప్పుదేవుడి మీద ఒకో కన్నేశారు.

“ఈలోగా మీరు మరో కవిని పురమాయించేసుకోరు కదా?”

“అబ్బబ్బే… మీకంటే యోగ్యుడు మాకెవరు దొరుకుతారు.”

“చిత్తం. ఏలినవారికి గుర్రాలూ ఏనుగులూ ఉంటాయి కాబట్టి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. తమరు… నూరో, రెండునూర్లో భజానా ఇచ్చి వెళితే, ఖర్చులకి ఉండాలి కదా!” అంటూ నసిగారు శ్రీశ్రీనివాసరాజుగారు.

“అయ్యయ్యో… తప్పకుండా.” అంటూ నిప్పుదేవుడు ఐదు నూర్లు తీసి చేతిలో పెట్టగానే ఆయన తన కళ్ళని తనే నమ్మలేకపోయారు. ‘తాను లేచిన వేళావిశేషం. పంచకళ్యాణి శకునం ఇలాగే ఉంటది మరి…’ మనస్సులోనే అనుకున్న శ్రీశ్రీనివాసరాజుగారు దూళ్ళ చావిట్లో నుంచి గుర్రాన్ని బయటకి తీసుకు వస్తుంటే… కొబ్బరి చెట్టుకింద నిలబడిన దేవుడుగారు కళ్ళు పెద్దవి చేసి దాని వైపు చూశారు. ఆయన విశాలమైన భృకుటి ముడివడింది. గుర్రం ఎందుకు పారిపోయిందో ఆయనకి బోధపడింది.

శ్రీశ్రీనివాసరాజుగారి దగ్గర సెలవు తీసుకొని నిప్పుదేవుడు గుర్రమెక్కి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతను అలా వెళ్ళగానే “ఏమోయ్ శ్రీని ఇటు రావోయ్,” అని పిలిచారు దేవుడుగారు. ఎంతో మృదువుగా ఉండే ఆయన స్వరం గంభీరంగా మారింది.

“అయ్యా…”

“ఆ దిక్కుమాలిన గుర్రాన్ని లోపలకి తీసుకొచ్చింది నువ్వేనా?” అన్నారు.

“ఆ… బావగారూ అదీ …మరేమో కవిపుంగవుడికోసం…”

“ఆ కళ్ళకింద మచ్చున్న గుర్రం ఎక్కడ అడుగెడితే అక్కడ అరిష్టాలే జరుగుతాయ్. గుండుపిక్కలాంటి జోజోబాబుని అర్ధాంతరంగా పొట్టనపెట్టుకున్నావు.”

“అగ్నివర్మ శాస్త్రప్రకారం సుడులూ సొట్టలూ బానే ఉన్నాయ్ బా…”

“చత్ నోర్ముయ్. నువ్వూ నీ మిడిమిడి శాస్త్రం. అన్ని గుర్రాలూ అందరికీ పనికిరావురా తత్తుకొడకా!” పొన్నుకర్ర పైకెత్తారు కొడతానన్నట్టు.

“బాబ్బావగారూ పోయిన జోజోబావెలానూపోయారు. జన్మలో నా మొహం మీకు చూపించకుండా దూరంగా పోతాను. ఈ ముక్కెవరితో చెప్పకండే. లేపోతే నన్ను బతికుండగానే తగలేసేస్తారు.” అంటూ శ్రీశ్రీనివాసరాజుగారు దేవుడుగారి చేతులు పట్టుకొన్నారు.

“పో… పో…” అంటూ చేతులు విడిపించుకున్నారు దేవుడుగారు.

దాంతో… రొంటిన పెట్టిన ఐదు నూర్లని తడుముకుంటూ, బ్రతుకుజీవుడా అని అక్కడనుంచి పెరట్లోకి జారుకున్నారు శ్రీరాజా వత్సవాయి శ్రీశ్రీనివాసరాజుగారు. నిప్పుదేవుడి గుర్రం జోజోబాబుకి కీడు తలపెట్టినా, శ్రీరాజా వత్సవాయి శ్రీశ్రీనివాసరాజుగారికి మాత్రం మంచి చేసి పోయింది. అదేంటో… ఒకళ్ళకి మంచయ్యింది, ఇంకొకళ్ళకి కాకపోవడం.

(శ్రీమాన్ కొండ్రాజు బలాదూర్ వారి అయోమయ చరిత్రలో ‘అశ్వపర్వం’ సమాప్తం.)