పరిచయము
భవభూతి వ్రాసిన ఉత్తరరామచరిత నాటకములో రెండవ అంకపు ప్రారంభ విష్కంభములో ఆత్రేయి అను ఒక తాపసి దండకారణ్యమును ప్రవేశించగా, వనదేవత ఆమెకు అతిథి సత్కారములను చేసి ఆమె రాకకు కారణ మడుగగా, ఆమె తాను వాల్మీకి ఆశ్రమమునుండి వస్తున్నానని, అగస్త్యాది మునుల దర్శనము చేసికొని వారివద్దనుండి వేదవిద్య నేర్చుకోవాలని తలబోస్తున్నాని చెప్పుతుంది. అప్పుడు ఆ వనదేవత ‘అన్నియు తెలిసిన వాల్మీకి ఉండగా, ఆ మహర్షి వద్ద నేర్చుకోక ఇక్కడికి ఎందుకు వచ్చావు?’ అని అడుగుతుంది. అక్కడ వాల్మీకికి కాలమంతా కుశలవులు అనే ఇద్దరు పిల్లలను పెంచి, పోషించి, వాళ్ళకు విద్య నేర్పడములోనే గడచిపోతున్నదని, అంతేకాక ఆ ఇరువురితో సమానముగా తాను నేర్చుకోలేననియు, అది మాత్రమే కాక వాల్మీకి కాలము రామాయణ రచనలో సాగిపోయినదని కూడ చెబుతుంది.
సంభోగలోనున్న క్రౌంచ మిథునమును ఒక బోయవాడు తన బాణముతో పడగొట్టడము చూచి వాల్మీకి మహర్షి ఆశువుగా ఒక శ్లోకమును చెప్పినాడని, ఆ శ్లోకమును విన్న బ్రహ్మదేవుడు ‘వాగ్బ్రహ్మమునందు ఎఱుకగలవాఁడ వైతివి. కావున రామచరితమును వర్ణింపుము. నీ ప్రతిభాచక్షుస్సు ఆర్షమును, అవ్యాపహతజ్యోతియును. మొదలి కవివైతివి,’ అని వచించెనని, అనంతరము భగవంతుఁడు ప్రాచేతస మహర్షి మనుష్యులయందు మొదటిదైన యట్టి యా శబ్దబ్రహ్మపరిణామమున రామాయణమును రచించెనని మన కావ్యములు చెబుతున్నవి.
ఆ శ్లోకమే సంస్కృతములో-
మా నిషాద ప్రతిష్ఠాం త్వం
అగమః శాశ్వతీః సమః
యత్క్రౌంచమిథునాదేకం
అవధీః కామమోహితమ్ – (భవభూతి ఉత్తరరామచరితము, 2.05)
దీనిని శ్లోకరూపములోనే వేదము వేంకటరాయ శాస్త్రిగారు తెలుగులో క్రింది విధముగా అనువదించినారు:
ఓ నిషాద, ప్రతిష్ఠన్నీ
వొందుదో శాశ్వతాబ్దముల్
కామమోహిత మేకంబున్
గ్రౌంచయుగ్మానఁ జంపుటన్
వనదేవత దీనిని ‘నూతనఛందసామవతారః’ అని చెప్పినది. ఇదియే మనము సామాన్యముగా వ్యవహరించే అనుష్టుప్పు శ్లోకము. ఇది ఒక కొత్త ఛందస్సు అవతారముగా పేర్కొనబడినది.
శ్లోక లక్షణములు
మహాకవి కాలిదాసు వ్రాసినదని చెప్పబడే శ్రుతబోధలో శ్లోక లక్షణములు ఈ విధముగా నివ్వబడినవి –
పంచమం లఘు సర్వత్ర
సప్తమం ద్విచతుర్థయోః
షష్ఠం గురు విజానీయాత్
ఏతత్పద్యస్య లక్షణమ్ – (శ్రుతబోధ, 9)
శ్లోకే షష్ఠం గురు జ్ఞేయం
సర్వత్ర లఘు పంచమమ్
ద్విచతుష్పదయోర్హ్రస్వం
సప్తమం దీర్ఘమన్యయోః – (శ్రుతబోధ, 10)
శ్లోకములోని అన్ని పాదములను రెండు భాగములుగా విభజించవచ్చును. రెండవ భాగములోని గురు లఘువుల అమరికను గుఱించిన లక్షణములు పైన ఇవ్వబడినవి. అన్ని పాదాలలో ఐదవ అక్షరము లఘువు, ఆఱవ అక్షరము గురువు. కాని బేసి పాదములలో ఏడవ అక్షరము గురువు, అదే ఏడవ అక్షరము సరి పాదములలో లఘువు. నేను వీటినే మఱొక విధముగా విశదీకరిస్తాను. సరి పాదములలో (2, 4 పాదములు) 5, 6, 7 అక్షరములు జ-గణము, బేసి పాదములలో (1, 3 పాదములు) 5, 6, 7 అక్షరములు య-గణము. వీటిని రెంటిని చేర్చి శ్లోకమును నేను ‘జయ’ అని పిలుస్తాను. ఈ జయనామము జ్ఞాపకము పెట్టుకొనుటకు కూడ ఉపయోగ పడుతుంది. ఈ లక్షణములలో శ్లోక పాదములయందలి మొదటి నాలుగు అక్షరముల ప్రసక్తి లేదు. దానిని గుఱించి తఱువాత చెప్పుతాను.
సరి పాదములు:
శ్లోకములోని సరి పాదములలోని చివరి నాలుగు అక్షరముల అమరిక వేదకాలమునుండి మారకుండా ఉన్నది. చివరి నాలుగు అక్షరాలు IUIU, అనగా రెండు లగములు. ఇది వేదములలో వాడిన గాయత్రీ ఛందస్సులోనిది. గాయత్రిలో మూడు పాదములు, ప్రతి పాదములో 8 అక్షరములు. గాయత్రి అనగా పాడదగిన (గాయః) మూడు (త్రి) పాదములు అని అర్థము. క్రింద ఋగ్వేదమునుండి ఉదాహరణములు. నా అనువాదములు కచ్చితములు కావు.
అగ్నిర్హోతాం కవిక్రతుః
సత్యాశ్చిత్రాశ్రవస్తమః
దేవో దేవేభిరాగమత్ – (ఋగ్వేదము, 1-1-5)
(జ్ఞానబుద్ధిప్రదాతా స-
త్యానుశీలన భాస్వరా
దేవులతోడ దేవ రా)
ఉపత్వాగ్నే దివేదివే
దోషావస్తర్ధియా వయమ్
నమో భరంత ఏమసి – (ఋగ్వేదము, 1-1-7)
(తిమిరాంతక నిత్యమున్
నమనమ్ముల నిత్తు మో
హిమరాతీ స్తుతించుచున్)
పాదమునకు ఎనిమిది అక్షరములతో, చివర IUIUలతో ఉండే అమరిక గ్రీకు ఛందస్సులో కూడ ఉన్నది. దీనిని వారు గ్లైకానిక్ (glyconic) అంటారు.
ఋగ్వేదములో అనుష్టుప్పు చతుష్పదులు: పాదమునకు ఎనిమిది అక్షరములు ఉండే అనుష్టుప్పు ఛందస్సుకు చెందిన చతుష్పదులు కూడ ఋగ్వేదములో నున్నవి. 5, 6, 7 అక్షరముల గణస్వరూపము య-గణము కాక వేఱైనప్పుడు దానిని కుండలీకరణములలో తెలిపినాను. ఉదాహరణమునకు పురుషసూక్తమునుండి మొదటి చతుష్పది-
సహస్రశీర్షా పురుషః
సహస్రాక్షః సహస్రపాత్
సభూమిం విశ్వతో వృత్వా
(అ)త్యతిష్ఠద్దశాంగులమ్ – (ఋగ్వేదము, 10-90-1) (మొదటి పాదములో 5,6,7 అక్షరములు – భ-గణము)
(వేయి తలలుండుఁ గదా
వేయి కన్నుల్ పదమ్ములున్
ఆయతమ్మగు విశ్వమ్మున్
జేయి కప్పి మిగుల్చుఁగా)
సముద్రాదర్ణవాదధి
సంవత్సరో అజాయత
అహోరాత్రాణివిదధత్
విశ్వస్య మిషతో వశీ – (ఋగ్వేదము, 10-190-2) (మొదటి పాదము – జ-గణము, మూడవ పాదము – న-గణము)
(ఆయుదాకరమందున
హాయనమ్ము జనించఁగా
నాయహోరాత్రముల ని-
ర్ణాయకుండు సృజించెఁగా)
ఇందులో సరి పాదముల చివర త్రిపద గాయత్రిలోవలె రెండు లగములు ఉన్నాయి. కాని బేసి పాదములలో ఆ అమరిక మొదటి దానిలో, మొదటి పాదములో UIIU. శ్లోకమునందలి IUUI లేక IUUU మొదటి పాదములో లేదు. రెండవదానిలో మొదటి పాదములోలో IUII, మూడవ పాదములో IIIU. శ్లోకమునందలి IUUI లేక IUUU ఈ అమరికలలో అన్ని చోటులలో లేవు.
క్రింది అనుష్టుప్పును గమనిస్తే, దీనికి శ్లోకమునకు అమరికలో భేదము లేదు (బేసి పాదముల చివర IUUU, IUUI, సరి పాదముల చివర IUIU).
వాయురస్మా ఉపామంథత్
పినష్టిస్మా కృనన్నమా
కేశీవిషస్య పాత్రేణ
యద్రుద్రేణ పిబత్సహ – (ఋగ్వేదము, 10-136-7)
(వాయువు వంగని వాటిని కూడ విఱిచి మథించగా, కేశవుడు, రుద్రునితో పాత్రనుండి తాగినారు.)
దీనిని బట్టి శ్లోకపు మూస వేదములలో క్రమక్రమముగా మార్చబడినది, కూర్చబడినది.
ఇతిహాసము, కావ్యములలో అనుష్టుప్పు ప్రత్యేకతలు: మహాభారత రామాయణములలో కూడ శ్లోకపు మూసకు బదులు అక్కడక్కడ బేసి పాదములలోని 5, 6, 7 అక్షరములకు య-గణమునకు బదులుగా మిగిలిన గణములతో నున్నవి. క్రింద కొన్ని ఉదాహరణములు:
అహింసా సత్యవచనం
క్షమాచేతి వినిశ్చితమ్
బ్రాహ్మణస్య పరో ధర్మో
వేదానాం ధరణాదపి – (వ్యాసభారతము, 1-11-14) (మొదటి పాదము – న-గణము)
(బ్రాహ్మణుడు సాధు ప్రవర్తనతో, సత్యవంతుడై, క్షమార్హత కలిగినవాడై, వేదములను విధి తప్పక అభ్యసించు వాడై ఉండాలి.)
గరుడోఽపి యథాకాలం
జజ్ఞే పన్నగసూదనః
స జాతమాత్రో వినతాం
పరిత్యజ్య స్వమావిశాత్ – (వ్యాసభారతము, 1-14-22) (మూడవ పాదము – భ-గణము)
(గరుత్మంతుడు గుడ్డునుండి సరియైన సమయాన బయటికి వచ్చి పాములను చంపుటకై పుట్టినాడు. పుట్టగానే తల్లిని విడిచి, వెలుగును వెతుకుచు, వెళ్ళినాడు.)
ధృష్టకేతుశ్చేకితానః
కాశిరాజశ్చ వీర్యవాన్
పురుజిత్కున్తిభోజశ్చ
శైవ్యశ్చ నరపుంగవః – (భగవద్గీత, 1.05) (మొదటి పాదము – ర-గణము)
(వాళ్ళు గొప్ప వీరులు–ధృష్టకేతువు, చేకితానుడు, కాశిరాజు. అదే విధముగా పురుజిత్తు, కుంతిభోజుడు, శైవ్యుడు నరోత్తములు.)
యావానర్థ ఉదపానే
సర్వతః సంప్లుతోదకే
తావాన్సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః – (భగవద్గీత, 2.46) (మొదటి పాదము – స-గణము)
(చిఱుకోనేటి విధమ్మై
సరోవరపు వారియున్
వరవేదమ్ములట్లే యా
పరబ్రహ్మము తెల్పుఁగా)
అయమ్ స కాలః సంప్రాప్తః
సమయోఽద్య జలాగమః
సంపశ్య త్వం నభో మేఘైః
సంవృతం గిరి సంనిభైః – (వాల్మీకి రామాయణము, 4.28.2) (మొదటి పాదము – మ-గణము)
(లక్ష్మణా, దీనిని గుఱించి ఇంతకుముందే మనము ఆలోచించినాము. ఆ వర్షర్తువు ఆసన్నమైనది. ఆకాశమును చూస్తే, అక్కడ కొండలవలె మేఘాలు గుమిగూడి ఉన్నాయి.)
మేఘ కృష్ణాజిన ధరా
ధారా యజ్ఞోపవీతినః
మారుతాఽపూరిత గుహాః
ప్రాధీతా ఇవ పర్వతాః – (వాల్మీకి రామాయణము, 4.28.10) (బేసి పాదములు – న-గణము)
(మేఘములు కృష్ణాజినములువలె, వర్షధారలు యజ్ఞోపవీతములవలె, వీచే గాలితో నిండిన కొండగుహలు కంఠస్వరాలవలె, ఆ కొండలు వేదములను నేర్చుకొనే విద్యార్థులవలె కనబడుతున్నాయి.)
కావ్యాలలో కూడ ఇట్టి మార్పులతో శ్లోకములు ఉన్నాయి. మచ్చుకు రెండు ఉదాహరణములు:
తతో ముహూర్తాభ్యుచితే
జగచ్చక్షుషి భాస్కరే
భార్గవస్యాశ్రమపదం
స దదర్శ నృణాం వరః – (అశ్వఘోషుని బుద్ధచరితము, 6.1) (మొదటి పాదము – భ-గణము, మూడవ పాదము – న-గణము)
(జగన్నేత్రుఁడాశుగుఁడు
గగనానఁ గనంబడన్
భృగుశ్రేష్ఠు వసనమున్
సుగతుండప్డు గాంచెఁ దాన్)
సంపత్స్యతే వః కామో౽యం
కాలః కశ్చిత్ప్రతీక్ష్యతామ్
న త్వస్య సిద్ధౌ యాస్యామి
సర్గవ్యాపారమాత్మనా – (కాలిదాస కృత కుమారసంభవము, 2.54) (బేసి పాదములు – మ-గణము)
(నీ కోరిక నెరవేరుతుంది, అయితే నీవు దానికి వేచి ఉండాలి. నేనే ప్రత్యేకముగా అట్టి సృజనలో పాల్గొనను.)
మనము నిత్యము పఠించు దైవప్రార్థనాశ్లోకములలో కూడ కొన్ని ఇట్టివి కలవు. రెండు ఉదాహరణములు:
అగజానన పద్మార్కం
గజాననమహర్నిశమ్
అనేకదం తం భక్తానా
మేకదంతముపాస్మహే (మూడవ పాదములో – మ-గణము)
జయ మాతంగతనయే
జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే
జయ లీలాశుకప్రియే (బేసి పాదములలో – న-గణము)
అనుష్టుప్పు లోని భేదములు
వక్త్రా
అనుష్టుప్పు భేదములు – కుండలీకరణములలో నుండు 5,6,7 అక్షరములకు గణములు వరుసగా బేసి, సరి పాదములకు వర్తిస్తాయి
అనుష్టుప్పు ఛందములలోని భేదములను వివరించుటకు నేను కల్పించిన చిత్రము ఉపయోగపడుతుంది. ఇందులో మొట్టమొదటిది వక్త్రా. వక్త్రా సూత్రములు: పాదస్యానుష్టుప్వక్త్రమ్; న ప్రథమాత్స్నౌ; ద్వితీయచతుష్టయో రశ్చ; వాన్యత్; య చతుర్థాత్. వీటి అర్థము: అనుష్టుప్పు వక్త్రా ఛందములో పాదమునకు ఎనిమిది అక్షరములు, అన్ని పాదములలో ఆది గణముగా న-గణము, స-గణము ఉండరాదు. సరి పాదములలో ర-గణము కూడ వర్జనీయమే. ఇది ఉపదేశము మాత్రమే. 5, 6, 7 అక్షరములు య-గణముగా నుండాలి. ప్రతి వక్త్రా పాదమును 24 విధములుగా వ్రాయ వీలగును (6 గణములు X 2 నాలుగవ అక్షరము X2 ఎనిమిదవ అక్షరము). అనగా ఈ అనుష్టుప్పు వక్త్రను 331776 (24 X 24 X 24 X 24) విధములుగా వ్రాయ వీలగును. క్రింద ఒక ఉదాహరణము-
నీదు వక్త్రమ్ములో కెంపుల్
నీదు నేత్రమ్ములో వంపుల్
నీదు గాత్రమ్ములో నింపుల్
నీదు డెందమ్ములో సొంపుల్
పథ్యా
పథ్యా యుజో జ్ అనేది పింగళసూత్రము. అంటే సరి పాదములలో 5, 6, 7 అక్షరములు జ-గణముగ నుండాలి. మిగిలిన లక్షణములు వక్త్రా వలెనే. ఒక ఉదాహరణము-
గోవిందా చూపు పథ్యమ్మౌ
త్రోవను నీవు వేగమే
భావమ్ములకు సత్యార్థ
జీవమ్మొసఁగు చిన్మయా
అనుష్టుప్పు పథ్యా లక్షణములను పరిశీలిస్తే దీనికి శ్లోక లక్షణములకు పాదముల ద్వితీయార్ధములో ఎట్టి భేదము లేదు. కావున అనుష్టుప్పు పథ్యా శ్లోకమునకు ప్రతీక. కాని, శ్లోకములో పాదాదిలో న-గణము తప్ప మిగిలిన ఏడు గణములు (వక్త్రా, పథ్యా వీటిలో అనుమతించని స-గణముతో సహా) కవులచేత ఉపయోగించబడినవి. సరి పాదములలో చివరి అక్షరము ఎల్లప్పుడు గురువే లేక గురుతుల్యమే. బేసి పాదములలో లఘువును వాడినారు. దీనిని అనుసరించి బేసి పాదములను 7X2X2 = 28 విధములుగా, సరి పాదములను 14 విధములుగా వ్రాయ వీలగును. అనగా మొత్తము శ్లోకమును 153664 విభిన్న రీతులలో వ్రాయవచ్చును.
విపరీతా
సూత్రము విపరీతైకీయమ్. బేసి పాదములలో 5, 6, 7 అక్షరములు జ-గణముగా, సరి పాదములలో ఆ అక్షరములు య-గణముగా (పథ్యాకు తారుమారుగా) ఉంటే దానిని అనుష్టుప్పు విపరీతా అంటారు. మిగిలిన నియమములు పథ్యావలెనే. క్రింద ఒక ఉదాహరణము-
అపారకరుణామయీ
జపింతు నీదు నామమ్మున్
విపరీతమె కోరికల్
ప్రపన్ను వడి గావన్ రా
చపలా
చపలాయుజో న్ అనునది సూత్రము. బేసి పాదములలో 5, 6, 7 అక్షరములు న-గణముగా ఉంటుంది ఇందులో. మిగిలిన లక్షణములు పథ్యా వలెనే. క్రింద ఒక ఉదాహరణము-
అపారమ్ము చెలువము
లుపమానమ్ము లేదుగా
చపలా చంద్రవదనా
విపులనేత్ర వేగ రా
సైతవ
సూత్రము సర్వే సైతవస్య. అనగా అన్ని పాదములలో 5, 6, 7 అక్షరములు జ-గణముగా ఉంటుంది. క్రింద ఒక ఉదాహరణము-
ఈ మనముల మధ్యలోఁ
బ్రేమయు సైతవమ్ముగా
శ్యామసుందర మెప్పుడున్
బ్రేమమందిరమే గదా
విపులా
సూత్రము విపులా యుగ్ల సప్తమః, అనగా ఇందులో సరి పాదములలో ఏడవ అక్షరము లఘువు. బేసి పాదములలో య-గణములో మార్పు లేదు. ఈ లక్షణములను పరిశీలిస్తే పథ్యా, విపులా వీటికి భేదము లేదు. రెండు ఒక్కటే. మఱి ఈ అనుష్టుప్పు విపులా ఎందుకు చెప్పబడినది? బేసి పాదములలోని య-గణమును వేఱు గణములతో మార్చినప్పుడు మనకు విపులా భేదములు లభిస్తాయి. ఈ భేదములే నేను ప్రారంభములో శ్లోకములోని ప్రత్యేకతలుగా ఉదాహరించినాను. పింగళసూత్రము – భ్రౌ న్తౌ చ. అనగా పింగళుని ప్రకారము బేసి పాదములలో య-గణమునకు బదులు భ, ర, న, త గణములను ఉంచి వ్రాసినప్పుడు మనకు భ-విపులా, ర-విపులా, న-విపులా, త-విపులా లభిస్తాయి. ఇందులో కూడ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు బేసి పాదములలో ఇట్టి గణములను ఉంచినప్పుడు మనకు జాతిపక్షవిపులా లభిస్తుంది, మొదటి లేక మూడవ పాదములో ఒకదానిలో మాత్రమే ఉంచినప్పుడు మనకు వ్యక్తిపక్ష విపులా లభిస్తుంది. మ-గణముతో కూడ విపుల ఉదాహరణములలో ఇవ్వబడినవి. హేమచంద్రుని ఛందోనుశాసనములో స-గణముతో విపుల కూడ చెప్పబడినది. దుఃఖభంజనకవి వాగ్వల్లభలో జ-గణ విపులా, య-గణ విపులా అని కూడ ఉన్నది. య-గణ విపులా పథ్యా, జ-గణ విపులా (జాతి పక్షములో) విపారీతా అవుతుంది. అదే విధముగా న-గణ విపులా (జాతి పక్షములో) చపలా అవుతుంది. ఇట్టి విపులా భేదములను హేమచంద్రుడు తద్విపులా అని పిలిచినాడు. క్రింద ఆఱు విధములైన విపులా భేదములకు నా ఉదాహరణములు-
న-విపులా
నన్ను జూడుమ సకియా
విన్నవింతును నామొఱల్
కన్నుదోయి కలియఁగా
మిన్ను దిగున్ ధరాస్థలిన్ (జాతి)
తిక్కనార్యుఁడు గవితల్
చక్కగా నాటకమ్మనన్
మక్కువన్ దాఁ దెలుంగందు
నక్కజమ్ముగ వ్రాసెఁగా (వ్యక్తి)
త-విపులా
ఆకాశములోఁ దారక
లేకాంతముగ నుండెనా
రాకాశశియో రమ్యము
చీఁకాకులు ధరాస్థలిన్ (జాతి)
కాలిదాసు కావ్యమ్ము లా
కళారూపపు జ్యోతులే
మాలదాల్చిన స్త్రీమూర్తుల్
శిలారూపపు చింతనల్ (వ్యక్తి)
భ-విపులా
మల్లికా సుమమ్ములతో
వెల్లివిరిసె రమ్యమై
చల్లఁగాను రాత్రియు రం-
జిల్లగా నిల నుల్లముల్ (జాతి)
శ్రీనాథకవీ కవితా
శ్రీనాథసూన శారదా
శ్రీనికేతన శృంగార
శ్రీనికేతన చిన్మయా (వ్యక్తి)
ర-విపులా
ఆనందపు సంద్రమందు
నేనుంటిని బ్రియున్ గనన్
వానిన్ గన మేన నాకుఁ
దేనెలు ప్రవహించెనే (జాతి)
శ్రీకృష్ణరాయా నరేశా
ప్రాకట కవినాయకా
లోకోపకార సంకల్పా
రాకాచంద్రనిభాననా (వ్యక్తి)
మ-విపులా
పద్మినీ పద్మాక్షీ దేవీ
పద్మముఖీ నిరంజనా
పద్మాసనీ పాలించన్ రా
పద్మనాభప్రియా రమా (జాతి)
కవివిష్ణూ కవిబ్రహ్మా
కవిశంకర వాఙ్నిధీ
కవిసార్వభౌమశ్రేష్ఠా
కవి పెద్దన దీనిధీ (వ్యక్తి)
స-విపులా
మనసున మనసైన
వనితా నిన్ను గోరితిన్
తనువునఁ దనువై రా
కనులముందు ప్రేమతో (జాతి)
సత్యనారాయణా నీవు
సత్యముగా కవీంద్రుఁడే
నిత్యము నిన్ను దలంతుఁ
జిత్తమ్ములోన నొజ్జగా (వ్యక్తి)
దేశి వాఙ్మయములో శ్లోకము
నాగవర్మ ఛందోంబుధిలో శ్లోక లక్షణములు ఈ విధముగా చెప్పబడినవి-
అయ్దాఱెంబెడెయొళ
మెయ్దుగె లఘుగురు, కరాబ్ధిపద సప్తకదొళ్
మెయ్దోఱుగె లఘు లక్షణ
మెయ్దుగె పెఱతష్టవర్ణపూర్ణం శ్లోకం – (నాగవర్మ ఛందోంబుధి, 3.12)
ఆరేళనెయ తాణది లఘు
తోఱెదొడం శ్లోకలక్షణం కెడదౌవం
బేఱె పురాతన మునివర్
తోఱిదరంతెరడఱొళగెయం గురువుచితం – (నాగవర్మ ఛందోంబుధి, 3.13)
మొదటి పద్యములో అన్ని పాదములలో ఐదవ, ఆఱవ అక్షరములు లఘువు-గురువుగా ఉండాలి. ఏడవ అక్షరము రెండవ (కర), నాలుగవ (అబ్ధి) పాదములలో లఘువుగ ఉండాలి, బేసి పాదములలో గురువు, మొత్తము ఎనిమిది అక్షరములు ఉంటాయి పాదములో. రెండవ పద్యములో బేసి పాదములో ఏడవ స్థానములో గురువుకు బదులుగా లఘువును ఉంచవచ్చును. అట్టి సమయములో ఆఱవ అక్షరము కూడ లఘువుగా ఉండాలి. 6,7 అక్షరములు రెండు లఘువులుగానో లేక రెండు గురువులుగానో బేసి పాదములలో ఉండవచ్చును అని నాగవర్మ చెప్పుతాడు. వీటికి పురాతనమునుల ఉదాహరణములు ఉన్నాయి అంటాడు. అనగా 5, 6, 7 అక్షరములు న-గణమైనప్పుడు అది అనుష్టుప్పు చపలా అవుతుంది.
అంతేకాక ఒక ఉదాహరణమును కూడ శ్లోకరూపములో ఇచ్చినాడు:
యోగి యోగ జితస్తోమం
స్వాగమ జ్ఞానమాదికం
రాగదింబినితంగీగె
నాగవర్మ బరంగళం
(ఈ శ్లోకము తన్ను పోషించిన రాజునుగుఱించి రచించినట్లున్నది.)
తెలుగులో పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో శ్లోకపు లక్షణములను క్రింది సీస పద్యములో చెప్పినాడు.
సీ.
వృత్తంబు లిన్నూట – యేఁబదాఱు
వెలయునీ స్వస్థాన – విషమ వృత్తంబులే
శ్లోక పాదంబు సు-శ్లోకమయ్యె
తల్లక్షణంబు పా-దాంతమ్ములను గురు
వైదవ వర్ణంబులవి లఘువులు
ప్రథమ తృతీయ చ-రణము నేళింట వి-
దితమౌ గురు(వు మఱి) – ద్విక చతుర్థ
తే.
దనరు నిట్లు (సు)బోధాభి-దాన కాళి
దాసకృత లక్ష్యలక్షణో-దాహరణముల
నమరసింహాది సకల కా-వ్యములఁ గృష్ణ
పాదాంతములో గురువు, ఐదవ అక్షరము లఘువు, బేసి పాదములలో ఏడవ అక్షరము గురువు, సరి పాదములలో ఏడవ అక్షరము లఘువు, ఈ విధముగా కాలిదాసు శ్రుతబోధలో చెప్పబడినది అంటాడు. అంతే కాక శ్లోకము అనుష్టుప్పు ఛందములో జన్మించిన 256 వృత్తములలోని కొన్ని వృత్తములతో వ్రాసిన విషమ వృత్తములు అని కూడ అంటాడు.
కన్నడము, తెలుగులో శ్లోకముల వాడుక అరుదు. కన్నడములోని మొదటి లక్షణగ్రంథమైన కవిరాజమార్గములో కొన్ని శ్లోకములు వాడబడినవి. రెండవ పరిచ్ఛేదములో చిత్రకవిత్వపు రీతులను వివరించేటప్పుడు కవి శ్లోకపు ఛందస్సును వాడినాడు. గోమూత్రికా బంధమునకు ఉదాహరణముగా ఒక శ్లోకము:
జలదాగమదిం చిత్త
స్ఖలితం కేకినర్తనం
జలదాగమదిం చిత్త
స్ఖలితం కేళనల్లనం – (శ్రీవిజయుని (నృపతుంగని) కవిరాజమార్గం, 2.128)
(మేఘముల రాకవలన చిత్తచాంచల్యమును పొందిన నెమలి నాట్యమాడుచున్నది. మేఘముల రాకవలన చిత్తచాంచల్యమును పొందిన నేను నల్లని అడగాలి.)
మదనతిలకం, కావ్యావలోకనం మొదలగు గ్రంథములలో కూడ శ్లోక ప్రయోగములు ఉన్నాయి. తెలుగులో ఇంతకు ముందే చెప్పినట్లు కొక్కొండ వేంకటరత్నం పంతులుగారు అమృతవాహిని అని శ్లోక ఛందస్సును ప్రవేశ పెట్టినారు. బిల్వేశ్వరీయమునుండి ఒక ఉదాహరణము:
నుతింతున్ తనుమధ్యాంబన్
నుతింతున్ బిల్వనాథునిన్
మతిన్ గౌరీపురీ చిత్ర
హిత చారిత్ర మెంచెదన్ – (కొక్కొండ వేంకటరత్నము పంతులు బిల్వేశ్వరీయము, 2.318)
శ్లోకముల లయతో వృత్తములు, అర్ధసమవృత్తములు
అనుష్టుప్పు ఛందములో పేర్కొనబడిన కొన్ని వృత్తములతో శ్లోక లక్షణములతో అర్ధసమ వృత్తములను కల్పించ వీలగును. జయదామన్ సంకలనములో క్రింది వృత్తములకు అట్టి లక్షణములు గలవు.
సరి పాదములకు సరిపోయే వృత్తములు-
క్షమా – మ/ర/లగ UUUU IUIU
నాగరక – భ/ర/లగ UIIU IUIU
నారాచ – త/ర/లగ UUIU IUIU
ప్రమాణికా – జ/ర/లగ IUIU IUIU
హేమరూప – ర/ర/లగ UIUU IUIU (వాగ్వల్లభ)
బేసి పాదములకు సరిపోయే వృత్తములు-
సుచంద్రప్రభా – జ/ర/గల IUIU IUUI
విభా – త/ర/గగ UUIU IUUU
శ్యామా – త/స/గగ UUII IUUU
పద్మమాలా – ర/ర/గగ UIUU IUUU
గాథ – ర/స/గగ UIUI IUUU
మొదటి పట్టికలోని ఏ వృత్తమునైనా శ్లోకపు సరి పాదముగా, రెండవ పట్టికలో ఏ వృత్తమునైనా శ్లోకపు బేసి పాదముగా వాడుకొని అర్ధసమ వృత్తము కాని, విషమ వృత్తమును గాని శ్లోక రూపములో వ్రాయ వీలగును. తెలుగులో ప్రాస నియతము అన్న సంగతి మఱువరాదు. శ్రీకృష్ణపరముగా ఇట్లు కల్పించిన శ్లోకములతో ఒక దశకమును క్రింద చదువవచ్చును.
గాథ/ నాగరక – UIUI IUUU // UIIU IUIU
ముద్దు మోము గనన్ లేవే
హద్దులు మోదమొందఁగా
సద్దు సేయక రావా నా
వద్దకుఁ గృష్ణమోహనా – 1
నీవె నాకు నిధుల్ దేవా
జీవము నీవు మన్కిలో
నావ నాదు భవాంభోధిన్
నీవని నమ్మియుంటిరా – 2
శ్యామా/ నారాచ – UUII IUUU // UUIU IUIU
కన్నయ్యను గనంగా నా
కిన్నాళ్ళకు మనమ్ములో
పన్నీరు జలపాతమ్మే
సన్నాయి మ్రోఁతలే సదా – 3
నవ్వించు నను నీనవ్వో
పువ్వై విరియుఁ దావితో
మువ్వల్ సడుల మ్రోఁగంగా
దివ్వెల్ వెలుఁగు దివ్యమై – 4
సుచంద్రప్రభా/ ప్రమాణికా – IUIU IUUI // IUIU IUIU
అలోల మా విలాసమ్ము
కళామయమ్ము లాసముల్
కలాపపిచ్ఛ శీర్షమ్ము
చలించఁగా ముదమ్ములే – 5
స్మరించెదన్ సదా నిన్ను
స్మరున్ గన్న పితా హరీ
భరించలేను బాధాగ్నిన్
హరించరా జనార్దనా – 6
పద్మమాలా/ క్షమా – UIUU IUUU // UUUU IUIU
జాలి లేదా జగజ్జాలా
బాలా రావేల యింటికిన్
నీలవర్ణా నిశిన్ రావా
జాలమ్మేలా జయోన్ముఖా – 7
కల్లలింకేల కంజాక్షా
నల్లయ్యా నన్ను జూడరా
ఉల్లమందుండు మో దేవా
మల్లారీ యిందిరాపతీ – 8
విభా/ నారాచ – UUIU IUUU // UUIU IUIU
గోపాల గోపికానందా
మాపాలి దైవమా ప్రభూ
కాపాడ రమ్ము గోవిందా
శ్రీపాదధూళి సద్గతుల్ – 9
నీవేగదా సదా నాయీ
భావాల రూపవైఖరుల్
దేవాధిదేవ శ్రీకృష్ణా
జీవమ్ము నీవె నామదిన్ – 10
హేమమాలినీ–పద్మమాల/ హేమరూప – UIUU IUUU // UIUU IUIU
సార విజ్ఞాన దీపాళీ
శారదా హేమమాలినీ
కోరెదన్ విద్య లీయంగాఁ
గోరెదన్ బుద్ధి నీయఁగా
అనుష్టుప్పు చపలా లక్షణములతో కల్పించిన లీలాశుక అర్ధసమ వృత్తము:
లీలాశుకము – IIU UII IU / IIU UIU IU
విను లీలాశుకము దా
నిను బిల్చెన్ బ్రియంవదా
మనమందా ప్రియుఁడు నిన్
దను దల్చున్ గదా సదా
అష్టి ఛందములో శ్లోకముల మూసలు
శ్లోకమునందలి రెండు పాదములను చేర్చినప్పుడు మనకు లభించే అక్షరసంఖ్య 16. పాదమునకు16 అక్షరాలు ఉండే ఛందము అష్టి ఛందము. ప్రతి పాదములో రెండు శ్లోక పాదములు వచ్చునట్లు వృత్తములను కల్పించి వ్రాయ వచ్చును. అట్లు నేను కల్పించిన కొన్ని వృత్తములను క్రింద ఇస్తున్నాను.
1) కాల – ర/ర/మ/య/జ/గ UIUU IUUU – UIUU IUIU 16 అష్టి 21011
ఆలయమ్మందు నున్నావా
యాలకించంగ లేవుగా
మూలలో దాఁగియున్నావా
పూలతోఁ జూడ రావుగా
జాలమే లేద నన్నావా
జాలితో మాట లాడవే
కాలమే కాచు నన్నావా
కాలమైపోయెఁ గూడవే
2) నవనీతము – స/స/భ/జ/జ/గ IIUII UUI – IIUII UIU 16 అష్టి 23452
నవనీతము డెందమ్ము
నవనీతపు ప్రేమలో
ద్రవమైతిని నేనిందు
ధవళాంశ తుషారమై
భువనమ్మొక చిత్రమ్ము
పువులెల్లెడఁ బూయఁగా
నవజీవన మీనాకు
నవమై యెపుడో హరీ
3) రత్నదీప – త/ర/ర/య/జ/గ UUI UIU UI – UIU UI UIU 16 అష్టి 21141
రావేలకో ప్రియా రమ్య
రావమై రత్నదీపమై
జీవమ్ముతో సదా నాకుఁ
జేవయై నవ్య తేజమై
దేవీ మనస్సులోఁ బూల
తీవెగాఁ బాలపుంతగా
నావైపు చూడవా తేలు
నావగాఁ బిల్చు త్రోవగా
4) వసుప్రద – జ/ర/త/ర/జ/గ IU IU IU UU – IU IU IU IU 16 అష్టి 21782
(పంచచామర వృత్తములో ఒక చిన్న మార్పు)
వసంతవేళలో రావా
వసంతలక్ష్మి రీతిగా
హసించుచున్ బ్రశాంతమ్మై
హసన్ముఖీ రసార్ద్రమై
వసించఁగా మనమ్మందున్
వసుప్రదా వరాంగిణీ
వసంతమేగదా యింకన్
ప్రసూనశోభ రాజిలన్
5) పద్మచరణ – స/స/భ/జ/జ/గ IIU IIU UI – IIU IIU IU 16 అష్టి 23452
చరణమ్ముల నీపద్మ
చరణమ్ములఁ గొల్తురా
హరియంచిల నేనెప్డు
హరుసమ్మున దల్తురా
సరసమ్ముగ నీవాడు
సరసీరుహ నేత్రుఁడా
వరమీయఁగ రారమ్ము
వరదా పరమాత్ముఁడా
6) మధువృష్టి – ర/స/ర/జ/జ/గ UIUI IUUI – UIUI IU IU 16 అష్టి 23195
వేణు నాదములీ నాదు
వీనులన్ మధువృష్టియే
గానకోకిలలన్ నేను
కానఁగా మధుమాసమే
వానలో శిఖి నాట్యమ్ము
వైనమౌ రస ధారలే
ప్రాణ మియ్యది నీదైన
ప్రాణమే హరి యెప్పుడున్
7) భావన – భ/ర/ర/స/జ/గ UIIU IUUI – UIIU IUIU 16 అష్టి 22167
పావన మైన దీ ప్రేమ
భావన లన్నియున్ గదా
జీవనరాగమే నీవు
జీవన గీతమే కదా
నా వల పొక్క సంద్రమ్ము
నావయు నీవె దాటగా
ప్రోవుల బూచె నందాల
బూవులు తోట నిండుగా
8) సానంద – మ/ర/మ/య/జ/గ UUUU IUUU – UIUU IUIU 16 అష్టి 21009
మందాక్రాంతపు గతిలో (అదనముగా ఒక లఘువుతో)
సానందమ్మై సదా నిన్నే
సారసాక్షీ తలంతు నేన్
వీణానాద ప్రియా నిన్నే
వేయి పేర్ల జపింతు నేన్
ప్రాణాధారా రసాంబోధీ
రాగతాళ ప్రమోదినీ
జ్ఞానానందా జగన్మాతా
జ్ఞాన మిమ్ము జయప్రదా
9) సునాదినీ – భ/ర/మ/స/జ/గ UIIU IUUU – UIIU IUIU 16 అష్టి 22039
న-గణము తప్పించితే ఉత్పలమాల నడకతోడి పద్యము
చందనగంధినీ రావా
చల్లని స్పర్శ నీయఁగా
సుందరరూపిణీ రావా
చూడ్కుల యమ్ము లేయఁగా
మంద సునాదినీ రావా
మారుని పాట బాడఁగా
నందనవాసినీ రావా
నాట్యము లాడ వేడ్కగా
మాత్రాబద్ధమైన శ్లోకములు
1) ఆఱు మాత్రల నడకతో-
నా నయనములో తారా
నా నవతా కిరణ్మయీ
వేణురవపు గీతోర్మీ
వీనుల కో హిరణ్మయీ
ప్రాణనదిగ వేవేగన్
రా నగుచున్ స్వరాకృతీ
మానసమున నీవేగా
మానవతీ నవద్యుతీ
2) రెండు త్రిమాత్రలు, ఒక పంచమాత్ర (III UI UUI) (III UI UIU)
గళము విప్పి పాడంగ
కలరవమ్ము నిండగా
లలితమైన రాగాల
లలన పాడె చక్కఁగా
వలపు తేనె పారంగ
పలుకు లాయె సోనలై
చలితమాయె చిత్తమ్ము
జ్వలితమైన జ్వాలయై
3) రెండు పంచమాత్రలు, ఒక త్రిమాత్ర (UIU UIU UI) (UIU UIU IU)
మీటవే వీణ వేవేగ
మీటి పల్కించు రాగిణీ
పాట పాడించు మందాల
బాట వెల్గించు కోమలీ
నోట చిందించు గీతాల
నూటి ముత్యాల నో చెలీ
మూట రత్నాల చల్లు మీ
పూట యానందమై సఖీ
4) రెండు పంచ మాత్రలు, ఒక త్రిమాత్ర (UUI UIU UI) (UUI UIU IU)
రావేల గోకులానంద
రావేల గోపికాపతీ
రావేల శ్యామలాకార
రావేల సోమసుందరా
రావేల వేణుగీతార్థ
రావేల విశ్వమోహనా
రావేల నన్ను గావంగ
రావేల చెన్నుగా హరీ
ఉత్పలమాల, విక్రీడితములలో శ్లోకపు ఛాయలు
మన తెలుగు కవులు శ్లోకమును ఇష్టపడకపోయినా, వారు తఱచుగా వాడే వృత్తములలో శ్లోకపు మూసలు ఉన్నాయి. క్రింద ఉత్పలమాల, మత్తేభవిక్రీడితములలో శ్లోకమును పొందుపఱచి వ్రాసినాను.
మాతృక: ఉత్పలమాల, తనయ: శ్లోకపు ప్రత్యేకత సైతవము
ఉత్పలమాల – UIIUIUII – IUII – UIIUIUIU
మానసమందు జూచితిని – మాధవ యాననమున్ బ్రమోదమై
వేణువు నాదమున్ వినఁగ – వేచితి నేనిట సొక్కి సోలితిన్
నీనగవుల్ ముదమ్మిడును – నిండుగఁ బ్రాణము పొంగు గంగయై
మీనము మేషమేలకొ ర-మించఁగఁ దేనెల ముద్దునీయ రా
ఇందులోని సైతవము – అన్ని పాదములలో 5,6,7 అక్షరములు జ-గణము
మానసమందు జూచితి
నాననమున్ బ్రమోదమై
వేణువు నాదమున్ విన
నేనిట సొక్కి సోలితిన్
నీనగవుల్ ముదమ్మిడు
బ్రాణము పొంగు గంగయై
మీనము మేషమేలకొ
తేనెల ముద్దునీయ రా
మాతృక: మత్తేభవిక్రీడితము, తనయ: శ్లోకము
మత్తేభవిక్రీడితము – I [IUUI IUIU] I I [IUUU IUUI] U
కుసుమమ్ముల్ విరిసెన్ గదా పలు ద్రుమాం-గోద్దీపమై జూడ నం-
దు సమీరమ్ము ప్రియమ్ముగా నతి ప్రమోదో-ల్లాస మెందెందు నిం-
డె సుమాళమ్ము చెలంగెఁగా నెఱ తమిన్ – డెందమ్ము పొంగారె నీ-
వు సమీపమ్మున రాచెలీ యిట భ్రమల్ – వొందన్ గనుల్ నావియున్
ఇందులోని శ్లోకము-
భ్రమల్ వొందన్ గనుల్ నావి
సుమమ్ముల్ విరిసెన్ గదా
ద్రుమాంగోద్దీపమై జూడ
సమీరమ్ము ప్రియమ్ముగా
ప్రమోదోల్లాస మెందెందు
సుమాళమ్ము చెలంగెఁగా
తమిన్ డెందమ్ము పొంగారె
సమీపమ్మున రాచెలీ
మత్తకోకిల – సైతవము
మత్తకోకిల వృత్తములో శ్లోకములోని ఒక ప్రత్యేకతయైన సైతవము దాగి యున్నది. సైతవములో అన్ని పాదములలో 5,6,7 అక్షరములు జ-గణము.
మత్తకోకిల –
ప్రేమ వేణువు నూఁదు వేగము – వీణ మీటెదఁ జక్కఁగా
స్వామి గానమునందు రావము – ప్రాణమందున మ్రోఁగెఁగా
శ్యామ సుందర మూర్తిఁ జూడఁగ – నంద మెల్లెడ నిండుఁగా
ప్రేమ మందిరమందు నీకొక – విందు నిచ్చెదఁ వేడిగా
ఇందులోని సైతవము –
వేణువు నూఁదు వేగము
వీణ మీటెదఁ జక్కఁగా
గానమునందు రావము
ప్రాణమందున మ్రోఁగుఁగా
సుందర మూర్తిఁ జూడఁగ
నంద మెల్లెడ నిండుఁగా
మందిరమందు నీకొక
విందు నిచ్చెదఁ వేడిగా
ముగింపు
సంస్కృతములో శ్లోక ఛందస్సు మూలము, కాలక్రమేణ జరిగిన మార్పులు, అందులోని విభిన్న రీతులు మున్నగువానిని సోదాహరణముగా వివరించినాను. శ్లోకపు నడకతో క్రొత్త విధములైన అర్ధసమ వృత్తముల సృజననుగుఱించి కూడ తెలియబఱచినాను. అంతే కాక 16 అక్షరముల అష్టి ఛందములోని ప్రతి పాదములో రెండు శ్లోక పాదములను ఏ విధముగా ఉంచి వ్రాయవచ్చునో అనే సంగతిని కూడ మీముందు పెట్టినాను. శ్లోకముతో ఎన్నో కవితలను తెలుగులో వ్రాయ వీలగును, ముఖ్యముగా భావకవిత్వమును. ఈ వ్యాసము అందఱికి ఉపయోగకారిగా ఉంటుంది అనుకొంటాను. నేను ఇక్కద చెప్పినది ఒక సంగ్రహమే. మూడు వేల సంవత్సరాలుగా సంస్కృత సాహిత్యములో అనుష్టుప్పు ఒక ముఖ్య పరికరముగా వాడబడినది. అదే లేకపోతే మనకు వేదములలో కొన్ని భాగములు, భారత రామాయణాలు, కావ్యాలు ఉండేవి కావు. అందువలన ఇది ఛందశ్శాస్త్రములో ధ్రువతారవంటిది. క్రింద శ్లోకమును గుర్తు పెట్టుకొనుటకై రెండు శ్లోకపు అనుకరణలతో (మొదటిది ఎవరో తెలియదు, బహుశా గిడుగు సీతాపతి, రెండవది ఝరుక్ శాస్త్రి) ఈ వ్యాసమును ముగిస్తాను.
ఒక్క కాని ఒకే కాని
రెండు కానులు అర్ధణా
మూడు కానులు ముక్కాని
నాల్గు కానులు ఒక్కణా!
అనుష్టుప్పు అనుష్టుప్పే
ఎవ్వరేమని అన్ననూ
కనిష్టీపు కనిష్టీపే
హెడ్డు కానంత దాకనూ