బయట వర్షం పడుతోంది. దీన్ని వర్షం అనలేమేమో… చిన్నగా జల్లు కురుస్తోంది. మామూలుగా అయితే ఇలాంటి వెదర్‌లో బైక్ తీసి, లాంగ్ రైడ్ ఒకటి వేయాలని మనసు ఉబలాటపడుతుంది కానీ ఈ రోజు మూడ్ ఆలా లేదు. సాయంత్రం తను ఫోన్ చేసింది. ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఎటూ వెళ్ళకు అని చెప్పింది. ఎందుకో ఆ గొంతులో ఏదో తేడా… ఎప్పట్లాంటి ఫీలింగ్ లేదు. నా ఆలోచనల్లో నేనున్నాను, ఇంతలోనే వర్షాన్ని తిట్టుకుంటూ వచ్చింది.
“నేనిక ఇది కంటిన్యూ చెయ్యలేను. ఈ రిలేషన్ ఇక్కడితో ఆపేద్దాం.”
రావటం రావడమే సూటిగా చెప్పేసింది. ముఖం చూస్తేనే అర్థమైతోంది, బాగా ప్రిపేర్ అయి వచ్చినట్టు.
“ఇది చెప్పడానికే ఒచ్చావా?”
నాకు ఇంతకంటే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. రెండు రోజుల క్రితం కలిసినప్పుడు కూడా ఇప్పుడిలా వస్తుందని అనిపించలేదు. కానీ ఇది మాకు అలవాటే. రెండు మూడేళ్ళకు ఒక సారి తను బ్రేకప్ అనటం; ఓ ఏడాదో ఏడాదిన్నర తర్వాతో మళ్ళీ ప్యాచప్ అనటం. హైస్కూల్ రోజుల నుంచి చూస్తూనే ఉన్నా. సో… మరో సారి బ్రేకప్ అన్నమాట!
“అదీ… నేను ఏమనుకుంటున్నానంటే…” నట్టులు కొడుతోంది.
“నువ్వేం చెప్పద్దు.”
“నువ్వు అమ్మాయివి. ఈ రిలేషన్ ఎవరూ అప్రూవ్ చెయ్యరు. అండ్, ఇది సరైంది కాదు.”
“ఇవేవీ సరైన కారణాలు కావు. నీకూ తెలుసు.”
“నన్ను వదిలి వెళ్ళిపో…”
“తప్పకుండా పోతాను. కానీ నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్సూ లేవని చెప్పు. ఇప్పుడే మనం రిలేషన్ బ్రేక్ చేద్దాం.”
“దీనివల్ల నీకూ నాకూ ఇబ్బంది. దీన్ని ఎవరూ అంగీకరించరు.”
“ఎవరి గురించో నాకు పట్టింపు లేదు. నువ్వేమనుకుంటున్నావో అదే నాకు ముఖ్యం.”
“నేనిది కంటిన్యూ చెయ్యలేను. మా అమ్మావాళ్ళకు ఏం చెప్పను? మా అక్క కులం కాని వాడిని చేసుకుంటేనే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నంత పని చేశారు.”
“ఇక్కడ ఆ సమస్య లేదు కదా!”
“ఇది జోక్ కాదు, సీరియస్.”
“నేనూ సీరియస్‌గానే చెబుతున్నా.”
“ఇది సహజం కాదు. ఇలా ఎవ్వరూ ఉండరు…”
“ప్లీజ్! నీకు ఎన్ని ఉదాహరణలు చూపించాలి?”
“అదంతా ఫారిన్ కల్చర్. ఇండియాలో ఎవరూ ఇలా లేరు.”
“ఎవరిలాగానో నువ్వు ఎందుకు ఉండాలి? అయినా, దీనికీ కల్చర్‌కూ రిలేషన్ ఏంటి?”
“చూడూ! నీతో వాదించే ఓపిక నాకు లేదు. ప్లీజ్, నన్ను వదిలేయ్.”
“అది రెండేళ్ళ క్రితమే చేశా నేను. నువ్వే మళ్ళీ నా జీవితంలోకి వచ్చావ్.”
“ఇప్పుడు నేనే వెళ్ళి పోమంటున్నా కదా…”
“నువ్వొచ్చి నన్ను వెళ్ళిపోమనడం ఏంటీ?”
గతంలో జరిగిన బ్రేకప్ డైలాగులన్నీ నా మనసులో మెదులుతున్నాయ్. నా ఆలోచనల్లోంచి బయటికి రాకముందే… అనేసింది!
“నేను ఇక్కడికి వచ్చింది నీతో చర్చలు చేయడానికి కాదు. మా టీమ్‌లో వెంకట్ ఉన్నాడు నీకు తెలుసు కదా, మన కులమే… చూడ్డానికి బాగుంటాడు. (అదోలాంటి నవ్వు. ఆ నవ్వు గురించి నాకు తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు.) ఇప్పుడు కెనడాలో జాబ్ వచ్చింది. వెళ్ళేముందు నా అభిప్రాయం అడిగాడు. కాదని చెప్పేందుకు కారణం ఏదీ కనిపించలేదు. వచ్చే ఆదివారం వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్‌తో మాట్లాడేందుకు వస్తున్నారు. నీ అభిప్రాయం ఏంటి?”
ఇది నేను అస్సలు ఊహించలేదు. ఇది ‘మరోసారి బ్రేకప్’ లాంటిది కాదని అర్థమవుతోంది.
“నా పర్మిషన్ కావాలా?” మనసులో అనుకున్న మాటలు బయటికి వచ్చేశాయ్.
“పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.” తన ముఖం ఎర్రబడింది.
“సరే, ఒకటి చెప్పు. నువ్వు అతడిని ప్రేమిస్తున్నావా?”
“లేదు.” చాలాసేపు సైలంట్‌గా ఉన్నతర్వాత వచ్చింది సమాధానం.
“మరి పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావ్?”
“దానికీ దీనికీ సంబంధం ఏంటి?”
“నువ్వే ఆలోచించు.”
“నేను ఆలోచించాను. నీకే అర్థం కావడం లేదు. పెళ్ళి చేసుకునే వాళ్ళంతా ప్రేమించుకోరు.”
“అవును ప్రేమించిన వాళ్ళంతా పెళ్ళి చేసుకోరు కూడా… కదా?”
“నీకు ఎందుకు ఇంత కోపం వస్తోందో నాకు అర్థం కావటం లేదు. చూడూ, జీవితం నువ్వు అనుకున్నంత అడ్వెంచరెస్‌గా ఉండదు. ప్రేమ అనే ఫీలింగ్ ఎవరి మీదైనా కలుగుతుంది. పెళ్ళి అలా కాదు. సమాజపు ఆమోదం లేకుండా, కుటుంబం, పెద్దలు ఒప్పుకోకుండా సాధ్యం కాదు. చాలా పెద్ద బాధ్యత. జీవితం వీకెండ్ రైడ్ లాంటిది కాదు…” ఇంక మాట్లాడలేనట్టు ఆపేసింది.
“ఇంతేనా, ఇంకా ఏమైనా డైలాగులు మిగిలాయా?”
“ఇవి డైలాగులు కాదు, నిజం.”
“మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని పెళ్ళి చేసుకోవడం మోసం కాదా?”
“ప్లీజ్… ఇలాంటి మాటలు ప్రపంచంలో నీకు మాత్రమే సరిపోతాయ్. వెంకట్ కూడా లాస్ట్ ఇయర్ వరకూ ఆ బెంగాలీ అమ్మాయితో తిరిగాడు. కానీ పెళ్ళి చేసుకునేందుకు మాత్రం తన ప్రాంతం, తన కులం అమ్మాయే కావాలి. నువ్వు కూడా నా మాట విని మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేసుకో…” (మళ్ళీ అదే నవ్వు.)
“ముందు నిన్ను మర్చిపోయాక, ఆలోచిస్తాలే.”
“నీ ఇష్టం. చాలా లేట్ అయ్యింది. అమ్మ వాళ్ళు చూస్తుంటారు. నేను వెళుతున్నా. వెంకట్ నెక్ట్స్ మంత్ కెనడా వెళ్ళాలంట. సో, ఎంగేజ్‌మెంట్ ఏమీ అనుకోవడం లేదు. డైరెక్ట్‌గా పెళ్ళే. చాలా తక్కువ టైమ్ ఉంది. మళ్ళీ ఇంత తీరికగా మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. అందుకనే వచ్చాను. బై…” తను ఎటో చూస్తూ చెప్పింది.
తనెప్పుడూ అంతే. తను చేయ్యాలనుకున్న పని పూర్తయిందంటే ఇక వేరేవారికి రెండో అవకాశం ఉండదు. ఈ సారి కాస్త సీరియస్ బ్రేకప్ అయ్యిందన్న మాట. ఇది బహుశా పర్మినెంట్ కావచ్చు.
“గుడ్ బై. నేను నెక్ట్స్ వీక్ హిమాలయన్ రైడ్ కోసం వెళుతున్నా. సో… నీ పెళ్ళికి రాలేకపోవచ్చు. అమ్మకు చెప్పు, లేదంటే బాధపడుతుంది.” తల తిప్పుకుని బయట వర్షాన్ని చూస్తూ చెప్పాను.
“నీకెలా సంతోషంగా ఉంటే అలాగే చెయ్. నీతో వాదించే ఓపిక నాకు లేదు. బై.”
వచ్చినంత స్పీడ్‌గానే వెళ్ళిపోయింది. బయట వర్షం పడుతూనే ఉంది. లోపల కూడా…