ప్రేమ

పారిజాతం చెట్టు క్రింద
నులక మంచం, దానిపైనున్న
నా నీలపు బొంత మీద
నక్షత్రాల్లా రాలిన ఆ పువ్వులూ

నిర్వికారమయిన తెల్లని తెరపై
సర్వవర్ణాల్తో సరసాంగి వగలూ
సన్నజాజి గుంపుల వైభోగాలూ
షెహనాయ్‌లపై షహానా
రాగాలూ

సిలికన్‌ చిప్స్‌ లో
చిలిపికన్నుల నృత్యాలూ
నల్లని మోనిటర్‌ పై
తెల్లని అక్షరాల మల్లెలూ

వితంతువులు వీనులపై వినిపించే
తీపిరాగాల వింత సాకీలూ
కాలంతో పరుగిడుతూ
గులాబీల గుండెల్తో కౌగిలింతలూ

కాలంతో మారిన మరులూ
దాహంతో పెంచిన దారులూ

ఎన్ని రూపాలెత్తినా
అన్ని పూలూ ఒకే గుబాళింత
ఒక మనసులో
ఎన్నెన్నో వసంతాలు సృష్టించే వింత
ఒక హృదయం
క్రొత్త తోడును కనుగొన్నపుడల్లా
కలిగే గిలిగింత.